తానొక సప్తపర్ణి పువ్వు

Spread the love

“ఒక్కసారైనా కనిపించకపోదూ?” అంటూ వీధివీధినా తిరుగుతుంటే, పరిమళ సువాసనవై కనిపించావు.

“ఎటు చూసినా నువ్వే, ఎక్కడున్నా నువ్వే” అన్నట్లు వ్యాపించావు. నిన్ను మొదటిసారి చూసినప్పటి కంటే, నీకోసం వెతికిన రోజే బాగుంది. అప్పుడే పరిచయమయ్యాయి ఈ సప్తపర్ణి పూలు.

ఎంత అందంగా ఉంటాయో! ఎంత చూడముచ్చటగా ఉంటాయో! వాటిని ఆస్వాదించని వాళ్లు ముక్కు డాక్టరునూ, కంటి డాక్టరునూ కలిస్తే మేలనిపిస్తుంది. నిన్ను చూసి ప్రేమించకుండా ఉండలేకపోయిన నన్ను నేనే అలా నిందించుకున్నాను.

తెల్ల పూలు, నల్ల పూలు, ఎర్ర పూలు ఉన్నప్పటికీ, ఆకులతో కలిసిపోయిన సప్తపర్ణి పూలంటేనే నాకిష్టం. వీకెండ్ వస్తే జనాలతో నిండిపోయే సైనిక్పురిలో, ఇంత జనసంచారంలోనూ నువ్వే నాకు ప్రత్యేకమైన ఆకర్షణ.

నీకు గుర్తుందా? సైనిక్పురిలో నిన్ను రెండోసారి కలిసినప్పుడు సప్తపర్ణి పూల గుత్తిని బొకేగా చేసి ఇచ్చాను. ఇక్కడి కేఫేల నుంచి బయటకొస్తూ, బాయ్ఫ్రెండ్స్ ఇచ్చిన బొకేలతో అమ్మాయిలు ఫొటోలు దిగుతున్నారు. అయినా వాళ్ల ముఖాల్లో ఆ తేజస్సు కనిపించడం లేదు. నువ్వేమో పట్టలేని సంతోషంతో ఎన్నెన్ని ఫొటోలు తీసుకున్నావో, ఫ్రెండ్స్కి ఎన్నెన్ని స్నాప్స్ పెట్టావో! నీలోని పసితనమే నీ అందమనిపించింది.

సప్తపర్ణి పూల రేకులు లెక్కించగలనా? అన్నిసార్లూ నిన్ను పొగడగలనా?

అందుకే నువ్వొక సహజ, సుందర సప్తపర్ణి పూల పరిమళానివి.

సప్తపర్ణి పూల గుత్తి ఇస్తూ, “నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పావు. ఇంటి ముందు ఏడాకుల చెట్టు మొలిచినంత సంతోషంతో ఊగిపోయాను. ఇక ఇంటినిండా ఆ పూల పరిమళమే! నీ ప్రేమ కోసం పరుగులు తీసి అలసిపోయిన నాకు, నా చెమట వాసనను తొలగించే పూల అత్తరువయ్యావు.

ఈ పూల చెట్లను నాటింది ఎవరో ప్రేమికులే అయ్యుంటారు! ప్రేమతో నాటడం వల్లే అవి ఇంత విశాలంగా పెరిగి, తమ పూల సువాసనతో మనకూ ప్రేమను పరిచయం చేస్తున్నాయేమో!

ఒకరోజు నన్ను అర్జెంటుగా కలవాలని కాల్స్ మీద కాల్స్ చేసి, “ఎప్పుడూ కలిసే చాయ్ కహానీ కెఫేకి రా” అన్నావు. టెన్షన్ పడుతూ నీ ముందు వాలిపోయాను. ఫ్లవర్ పెయింటింగ్ ఉన్న గ్రీటింగ్ కార్డు పట్టుకుని, “హౌ ఈజ్ ఇట్? నేనే చేశాను” అని వెలుగుతున్న కళ్లతో అడిగావు.

“చాలా బాగుంది” అని నేనంటే బుంగమూతి పెట్టుకుని పక్కకెళ్లి కూర్చున్నావు.

“మీ మెన్ అందరూ ఇంతే. ఎఫర్ట్స్ని ఎలా అప్రిషియేట్ చేయాలో తెలియదు” అంటూ అలిగి వెళ్లిపోయావు. నువ్వు అలా వెళ్తుంటే చెట్టుపైన పక్షులు కీచుకీచుమని గోల చేశాయి. వాటిలో ఒకటి అమాంతం పైకెగిరిపోయింది.

“సారీ చెప్పి, సర్దిపెట్టుకోవడం తప్ప ఇంకేం చేస్తారు మీ మగాళ్లు! కలిసేవరకు ఏమైనా చేస్తారు…” అంటూ గొడవ పడినప్పుడు, నాపై ఎంత చిరాగ్గా ఉన్నావో అర్థమైంది; నేను చెప్పేది వినే మూడ్లో లేవనిపించింది.

రంగులేసిన కార్డులో పూలు అంటించి, ‘సారీ’ అని స్టిక్కర్ పెట్టి, రోజుకు మూడుసార్లు మీ ఇంటి గేటు దగ్గర ఉంచి ఫొటో తీసి పంపేవాడిని. కొన్నిసార్లు బాల్కనీలో ఆరేసిన నీ బట్టలు కనిపించేవి. వాటిపై ఫ్లోరల్, ఎంబ్రాయిడరీ డిజైన్లు చాలా అందంగా ఉండేవి.

చార్మినార్కి వచ్చినప్పుడు నువ్వేసుకున్న ఆ టాపూ, బ్లూ జీన్సూ గుర్తున్నాయి. ఎంత అందంగా ముస్తాబయ్యావో! అక్కడున్న బుట్టకమ్మలన్నీ నీకే కొనిపెట్టాలనిపించింది. నీ చెవులే వాటికి అందాన్ని తెచ్చిపెడతాయి. ఆరేసిన బట్టలను చూస్తూ, మన స్పర్శల జ్ఞాపకాలను నెమరేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాను.

అలా ఏడో రోజు… నాపై దయతలచిన రోజు… సప్తపర్ణి పూల వాసన మరింత గాఢంగా గుబాళించింది. దాదాపు రాత్రంతా వీధి దీపాల వెలుగులోనే గడిపాం. అంతులేని కబుర్లు చెప్పుకుంటున్నా, చుట్టూ పరుచుకున్న పూల పరిమళం మాత్రం అలాగే ఉండిపోయింది.

సైనిక్పురిలో మనం నడిచిన ప్రతి వీధిలోనూ సప్తపర్ణి చెట్లున్నాయి. వాటి నీడలో మనం చెప్పుకున్న కబుర్లు చెట్లపైనున్న పక్షులకూ తియ్యగా అనిపించాయేమో! అందుకేనేమో మనం నడిచినంతసేపూ అవి మౌనంగా వింటుండేవి.

నువ్వు మాట్లాడని రోజులన్నీ నాకు మూతి ముడుచుకుని వాడిపోయిన పూలే కనిపించేవి. నీ ప్రేమ నన్ను అల్లుకున్నట్లూ, పూల వాసన నా ఊపిరితిత్తులను కమ్మేసినట్లూ అనిపించేది.

నేను ఏనాడైనా అనుకున్నానా? ఆ పూలతో ప్రేమలో పడి, వాటి పరిమళంలో నిన్ను కనుగొంటానని! ఈ గాఢమైన పరిమళం మనల్ని చేరువ చేయడానికే ఎక్కడెక్కడ వ్యాపించిందో! అందుకేనేమో నీ ప్రేమ ఒక గాఢమైన సుగంధ ద్రవ్యం.

చలికాలం ఎంత హాయిగా ఉంటుందో కదా, చెలీ! తెలియని పరవశంతో గంతులేస్తాన్నేను. నిన్ను మొదటిసారి చూసింది కూడా చలికాలంలోనే.

ఒక కేఫ్లో అందరూ డెడ్లైన్లను అందుకోవాలని సీరియస్గా పని చేసుకుంటున్నారు. అది ఫ్రైడే. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసమే కట్టినట్లుందా కేఫ్. నువ్వేమో చిరునవ్వును అణుచుకుంటూ, చిన్న చిన్న స్టికీ నోట్స్పైన ఏవో రాస్తున్నావు. నీ చేతిరాతను చూస్తుంటే, స్కూల్లో కాగితాలపై పిచ్చిగీతలు గీసి, మళ్లీ వాటినే ఒత్తుగా గీకిన రోజులు గుర్తొచ్చాయి.

ఒక స్టికీ నోట్ వచ్చి నా కాలు దగ్గర పడింది.

“ప్రేమ ఒక ఆనందం” అని రాశావు.

అందరూ అనే మాటే అయినా, నాకెందుకో కొత్తగా అనిపించింది. బహుశా నువ్వు రాశావనే కావచ్చు. నిన్ను చూస్తే కలిగిన తెలియని ఆనందం ప్రేమే అయి ఉంటుందనిపించింది. అందుకే ఆ మూడు పదాలు నచ్చాయి.

ఇంకో స్టికీ నోట్ పడింది.

“ప్రేమ ఒక అంగీకారం.”

ఇది నచ్చలేదు. నా మనసులో కలిగిన ఆనందం నేను అంగీకరించకుండానే వచ్చి వాలిపోయింది. నన్ను అడిగి రాలేదు, వచ్చాకా అడగలేదు. వచ్చిందంతే… ప్రేమించడం మొదలుపెట్టిందంతే!

మరో స్టికీ నోట్ పడింది.

“ప్రేమ ఒక ఎదురుచూపు.”

ఈ వాక్యం నచ్చీ నచ్చనట్లుంది. నేను ఎదురుచూడకుండానే వచ్చావు. నేనలా అంటే, “అది నిజమే కానీ, వెంటపడి… పడేశావు” అని సమాధానమిస్తావు. కానీ ఈరోజు మాత్రం ఎన్ని నెలలుగా ఎదురుచూస్తున్నానో! ఎన్నో యుగాలు గడిచినట్లనిపిస్తోంది. నువ్వు చాలా లేట్గా ఉన్నావు. ఇప్పటికే సప్తపర్ణి పూలు విరబూసి, అంతటా పరిమళిస్తున్నాయి. ఆ పూలలో నీ చిరునవ్వే కనిపిస్తోంది.

ఆ మూడు స్టికీ నోట్స్ నీకు చెప్పకుండా దొంగలించి, ఏమీ ఎరగనట్లు పనిలో మునిగిపోయాను. కాఫీ తెచ్చుకుని, వాటికోసం ఎంత మనసు పెట్టి వెతుకుతున్నావో! నువ్వు ఏం చేసినా నాకెందుకు అందంగా కనిపిస్తుందో!

ఒక టిష్యూ పేపర్ మీద, ‘నీ చేతిరాత కూడా నీలా అందంగా ఉంది’ అని రాయాలనుకున్నాను.

మరుసటి రోజు నువ్వు వస్తావో రావో తెలియకపోయినా, రోజూ కేఫ్కి వెళ్లేవాడిని. కానీ నువ్వు కనిపించలేదు. “మొన్న స్టికీ నోట్స్ రాసుకుంటూ కూర్చున్న అమ్మాయి మళ్లీ వచ్చిందా?” అని కేఫ్ అతన్ని అడగాలనిపించింది. ఆ తర్వాత అటు వెళ్లడమే మానేశాను.

ఒక ఫ్రైడే ఇంట్లో ఉండలేక కేఫ్కి వెళ్తే, కనిపించావు. నేను దొంగలించిన ఆ మూడు స్టికీ నోట్స్ను నా ల్యాప్టాప్కి ఎదురుగా అందరికీ కనిపించేలా అతికించి, నీ ముందుకొచ్చి కూర్చున్నాను. నీ దృష్టి వాటిపై పడుతుందేమోనని ఎదురుచూశాను. కానీ నువ్వు లేచి వెళ్లిపోయావు.

నీ వెనకే వెళ్లి, “ఇంత బాగా రాసిన వాటిని ఎందుకలా పడేసుకున్నారు?” అని వాటిని నీ చేతికి ఇవ్వబోతే, “నేను రాసేది పడెయ్యడానికే” అని చెప్పి వెళ్లిపోయావు.

నేనేదో తప్పు చేశానని ఓవర్థింక్ చేస్తూ, ‘మళ్లీ ఎప్పుడొస్తావా?’ అని ఎదురుచూశాను.

ఆ ఎదురుచూపు ఫలించి, నువ్వు ఎదురుగా వచ్చి కూర్చున్నావు. ఎంత మంచి శకునమో అనుకున్నాను.

“ఇది తీసుకో… నీకే… ఎంజాయ్!” అంటూ ఒక స్టికీ నోట్ ఇచ్చావు.

“ప్రేమ ఒక వెతుకులాట” అని ఉంది దానిపై.

అలా ప్రేమ గురించి ఎన్నెన్నో రాస్తూ, మాట్లాడుకుంటూ పరిచయమయ్యావు. ఇప్పుడు మనం తరచూ ప్రేమించుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది.

అసలు మనుషులెందుకు సమయాన్ని ప్రేమకోసం వాడుకోకూడదు? మనం చూడు, సమయం దొరికితే కలుస్తాం. నువ్వెక్కడో ఉంటూ కూడా నీ సమయాన్ని నన్ను ప్రేమించడానికి వాడుతున్నావు. ఎంత ప్రేమ ఉంటే అలా సమయాన్ని ప్రేమతో నింపుతారు?

ఈ లోకం చూడు… సమయం దొరికితే ఎన్ని ఘోరాలు చేస్తోంది! జనాలు ప్రేమకోసం పాకులాడుతూ, అది దొరకలేదంటారు.

ఈ సువాసన నిన్ను ఎంతగా గుర్తుచేస్తుందో చెప్పలేను. ఆ పరిమళంలో తేలుతూ, కన్నీరుమున్నీరవుతూ, నిన్ను ఆస్వాదిస్తూ నీ కోసం ఎదురుచూస్తున్నాను.

నేనీ పూలను చూసినా, వాటి సువాసనను పీల్చినా నువ్వు నా పక్కనే ఉన్నావనిపిస్తోంది. నీకక్కడ ఏ పూలను చూస్తే నేను గుర్తొస్తాను? అక్కడ ఈ పూలుంటాయా?

“ఎగ్జామ్స్ అవుతున్నాయిరా బంగారం! అయ్యాక వస్తాను… క్రిస్మస్ హాలిడేస్కి” అని మాటిచ్చావు.

‘ముందే ఎందుకు రాకూడదు?’ అనుకుంటాను ఈ పూల తియ్యని సువాసనలాంటి ఎదురుచూపుతో. ఈ పూల వాసన నా నాసిక నుంచి మెదడులోకి చేరి, నిన్ను గుర్తుచేస్తూ లక్షల ఆలోచనల గుత్తిని తయారు చేస్తోంది.

దసరా వరకైనా నువ్వొస్తే, నిన్ను మా ఊరికి బతుకమ్మ పండుగకు తీసుకెళ్లాలనుండేది. ఊర్లో సప్తపర్ణి చెట్లు తక్కువ. సైనిక్పురిలో వాటి సువాసనకు అలవాటు పడి, ఇక్కడ తంగేడు పూలను చూసినా అదే వాసన గుర్తొస్తోంది. నువ్వు నా పక్కనే ఉన్నట్లనిపిస్తోంది.

ఎదురింటామె బతుకమ్మను పేరుస్తుంటే, నువ్వుంటే ఇంకెంత అందంగా పేర్చేదానివో అనిపిస్తోంది. నీ చిన్ని చేతులతో పూలకు రంగులద్దుతుంటే చూడాలనుంది. ఇక్కడొక పాప చేతికి గోరింటాకు పెట్టుకుని వాళ్ల అమ్మకీ, నాన్నకీ, అన్నకీ చూపిస్తూ సంబరపడిపోతోంది. నువ్వే గుర్తొస్తున్నావు. కాదు కాదు… నేను అన్నింటిలో, అందరిలో నిన్నే వెతుక్కుంటున్నానేమో! నువ్వు అన్నట్లు “ప్రేమ ఒక వెతుకులాట” అని.

చలికాలమొచ్చింది. సప్తపర్ణి పూలొచ్చాయి, బతుకమ్మ పూలూ వచ్చాయి. ఇక నీ వంతు! నువ్వొచ్చినా వాటిలాగే నాలుగు నెలలుంటావు. కడుపుబ్బా నవ్విస్తావు, కబుర్లు చెప్తావు, ప్రేమలు కురిపిస్తావు… మళ్లీ వెళ్తావు. నీ కౌగిలి వెచ్చదనానికే చలికాలం వచ్చిందనుకుంటాను. ప్రస్తుతం ఈ కొద్దికాలంతోనే తృప్తిపడుతున్నాను.

నువ్వక్కడ సెటిలయ్యాక నన్ను కూడా తీసుకెళ్తానన్నావు.

“అది జరగని పని. ఒక అమ్మాయి అబ్రాడ్ నుంచొచ్చి, పెళ్లి చేసుకుని తీసుకెళ్లడం ఎక్కడైనా చూశావా?”

“డోంట్ బి స్టుపిడ్. నీకు జనరలైజ్ చేయడం ఎక్కువైంది. ఎందుకు తీసుకెళ్లరు? నేను మాత్రం నిన్ను తీసుకెళ్తా” అని కోప్పడతావు.

నీ గోలని గెలిపించడానికి, “సరే, తీసుకెళ్లు” అని జవాబిస్తాను.

ఆ మాటకి నన్ను గట్టిగా హగ్ చేసుకుంటావు. శీతాకాలపు ఉదయాన కురిసే మంచులా, నీ నుదిటిపై ప్రేమగా ముద్దులు కురిపిస్తాను.

ఎంతైనా దూరం కూడా ఆకర్షణీయమే… ఈ చల్లటి చలిలో నువ్వే వెన్నెలవై ఎప్పుడు కిందకు దూకుతావా అని ఎదురుచూస్తున్నాను.

తేజ గుడికందుల

Spread the love

One thought on “తానొక సప్తపర్ణి పువ్వు”

  1. కథ చాలా ‘ అందంగా ‘ ఉంది.
    ఏదో ఒక ప్రేమ కథ చూస్తున్నట్లు, అలా అలా స్మూత్ గా మూవ్ అయింది కథ. మనసుకి మంచి ఫీలింగ్ ఇచ్చింది.

    Good attempt Teja గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *