“తాతబాబు! పనులు ఎంతవరకు వచ్చాయి? యోగి మహారాజు అడుగుతున్నారు” అన్న మాటలు రిషికేశ్ నుంచి బయలుదేరి శబ్ద తరంగాలుగా మారి తాతబాబు చెవిలో పడగానే, సముద్రపు ఒడ్డున ఉన్న కొండపాలెం అన్న ఊర్లో చిన్న సైజు భూకంపం పుట్టింది.
***
నాలుగు జేసీబీలు నిరంతరంగా పనిచేస్తూ భూమిని చదును చేస్తున్నాయి. ఎనిమిది ఎకరాల స్థలంలో ఉన్న ఆక్రమణలన్నీ దగ్గర ఉండి తీయించేసాడు తాతబాబు. తాతబాబుది చామనఛాయ కళగల మొహం. ఎప్పుడూ నవ్వుతూ అందరితోనూ వరుసలు కలిపి మాట్లాడుతూ ఉంటాడు. అతను అటూ ఇటూ తిరుగుతూ లేబర్‌ను తొందర పెడుతున్నాడు. “కానీవ్వండి గబగబా!” అంటూ ట్రాక్టర్ల దగ్గరికి వెళ్లి మట్టి ఎత్తిస్తున్నాడు. ఆ జాగాల్లో ఆడమగ 40, 50 మంది లేబర్ పనిచేస్తున్నారు. ఇంతలో చిన్న హోండా యాక్టివా బండి నెమ్మదిగా వచ్చి చెట్టు నీడన ఆగింది. చూసిన తాతబాబు ఎదురుగా వెళ్లి “నమస్కారం కరణం గారు రండి భోజనం అయిందా లేదా?” అన్నాడు. “ఇప్పుడా? ఎప్పుడో! అరిగిపోయింది కూడా” అంటూ బండి దిగి తాతబాబు భుజం మీద చెయ్యి వేశాడు. శుభ్రమైన బట్టలతో ఒక చేతికి బంగారు కంకణం, మెళ్లో రుద్రాక్షమాల, నుదుటిన తిరునామం, తీక్షణమైన చూపు, పండిన తల, పెరిగిన పండుగడ్డం, 70 ఏళ్ల ఆరోగ్యవంతమైన ఆకారం. ఆ ఊర్లో అందరూ కరణం గారు అని గౌరవంగా పిలిచే అతని అసలు పేరు వాసుమూర్తి. అతని తండ్రి కరణంగా పనిచేసేవాడు. తర్వాత కరణికాలు పోయాక ఇతని అన్నకి ఆ ఉద్యోగం వేరే పేరుతో వచ్చింది. ఇతను తన పొలం చూసుకుంటూ తన బతుకు బండి లాక్కొచ్చేసాడు. అతను ముందో వెనుకో లేకుండా ఆ చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో ఏ పనీ జరగదు. ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలకి మధ్య వారధిలా పనిచేస్తుంటాడు. కరణం తలెత్తి మొత్తం చూస్తూ నడుస్తున్నాడు. “శాల ఎంతవరకు వచ్చింది?” అన్నాడు. “అయిపోయింది రండి చూదురుగాని” అని తీసుకెళ్లాడు తాతబాబు. “టాయిలెట్స్, ఇంటీరియర్స్ అయిపోయాయి, ఏసీలు బిగించేశారు. ఇంక పైకప్పు మీద పైన రెల్లు గడ్డి వేయించడం ఒక్కటే మిగిలింది” అన్నాడు తాతబాబు. కరణం తల ఊపాడు. మొత్తం ఎనిమిది ఎకరాల స్థలాన్ని శుభ్రం చేయించాడు. చివరి పనులు అవుతున్నాయి. ఓ పక్కన కుండీల్లో పెద్ద పెద్ద మొక్కలు మామిడి, పనస, మారేడు, నేరేడు అనేక మొక్కలు తెప్పించి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం స్థలానికి రెడీమేడ్ వాల్స్ తెప్పించి హద్దులు పెట్టించేసాడు. వెనుక పక్క గేటు పెట్టించాడు. ఆశ్రమం ముందు పెద్ద గేటు పెట్టించాడు. ఆశ్రమంలో నాలుగు బోర్లు కొట్టించేసాడు. కరెంటు పోల్స్, జాగా మధ్యలో ఎప్పటినుంచో ఉన్న రావి చెట్టుకి చుట్టూ గట్టు కట్టించాడు. అక్కడక్కడ ఉన్న చెట్లు మొక్కలు అలాగే ఉంచి చుట్టూ గట్లు పెట్టించి అందంగా తయారు చేశాడు.
అన్నీ చూశాడు కరణం, తృప్తిగా చిరునవ్వు నవ్వాడు. ఒరేయ్ తాతబాబు అద్భుతంరా నువ్వు సామాన్యుడివి కాదురా బ్రహ్మాండం అన్నాడు పొంగిపోతూ. అంతా మీ ఆశీర్వాదం గురువుగారు అని కాళ్ల మీద పడ్డాడు. “ఆయుష్మాన్ భవ! అభీష్ట సిద్ధిరస్తు!” అని దీవించి, “ఇంతకీ మన తల్లులు ఎక్కడ?” అన్నాడు. “తల్లులకి ఏ లోటు లేదు! నాతో రండి “ అని స్థలానికి వెనకవైపు ఉన్న కొండపెడ వైపు తీసుకెళ్ళాడు. అదంతా తుప్ప, డొంకతో ఉండేది. అక్కడ కూడా చదును చేయించి గ్రావెల్ పోయించి, వాహనాలు రాకపోకలకి వేరే దారి ఏర్పాటు చేశాడు తాతబాబు. కొంత దూరం నడిచాక ఎత్తుమీద నాలుగు షెడ్స్ కట్టించి ఉన్నాయి. అందులో ఒక షెడ్డులో ఎనిమిది ఆవులు వాటి దూడలు కళకళలాడుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. ఇద్దరు పనివాళ్ళు ఓ మూల కట్టిన రూమ్‌లోనుంచి పరుగు పరుగున వచ్చారు, దండాలు పెట్టారు. కరణం గారిని చూసిన నల్లావు మోర ఎత్తి దగ్గరకు వచ్చింది. కరణం గారు దాన్ని ప్రేమగా నిమిరాడు. తాతబాబు వైపు ప్రశంసగా చూశాడు. చెట్టు కింద పనివాళ్ళు వేసిన కుర్చీల్లో ఇద్దరు కూర్చున్నారు. కొంచెం దూరంలో సముద్రపు హోరు వినిపిస్తోంది. పనివాళ్ళు తెచ్చిన కొబ్బరి బొండాలు ఇద్దరూ తాగారు. “చాలా బాగుందిరా తాతబాబు! మరి దారి మాట ఏమిటి? పైడి గాడు కొండబాబు గాడు ఏమి పేచి పెట్టలేదు కదా మేటర్ క్లియర్ అయిపోయిందా?” అని అడిగాడు. అదేంటి గురువుగారు మీరు ఆ దారిలో నుంచి రాలేదా అన్నాడు. “లేదు ఊర్లోనుంచి రాలేదు ఈ పక్కన కొండ దారిలో నుంచి వచ్చేసాను.”
“అవునా అయితే వెళ్లేటప్పుడు ఇటు నుంచి వెళ్ళండి. మొత్తం ఆక్రమణలన్నీ తీయించేసాను మీరు కాశీ వెళ్ళిన నాలుగు రోజుల్లోనే దారి మొత్తం క్లియర్ చేశాను. ఫర్లాంగ్ దూరం నుంచి మన ఆశ్రమం కనబడవలసిందే. బస్సులు కూడా వచ్చేస్తాయి. మీరు చెప్పిన బ్యాచ్‌లోనే కొన్ని గోనుగుడు, సనుగుడు వచ్చాయి. కానీ అన్ని అణి చేశాను . ఎవడికి పడాల్సింది అడికి పడేసాను, కిక్కురుమనలేదు. మొత్తoమీద అంతా మేనేజ్ అయిపోయింది. ఏం ప్రాబ్లం లేదు” అన్నాడు. “ ఇప్పుడు మనం ఉన్న ఈ కొండపెడ కూడా సెట్ చేసేసాను. ఫైల్ రెడీ చేయించాను. ఆర్డీవో దగ్గర ఉంది నాలుగు సంతకాల బ్యాలెన్స్” అని గొంతు తగ్గించి చెప్పాడు. “ఇవాళో రేపో అయిపోద్ది. అంతా అన్ని ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసాము మాట్లాడేసాను అంతాను” అని చెప్పాడు. “మీరు అలా చూస్తూ ఉండండి. యోగి మహారాజు అడుగు పెట్టేసరికి మొత్తం ధగధగలాడిపోద్ది అంతే.” శబాష్ సగం పని అయినట్టే. “ఇప్పుడే ఏం చూశారు బొమ్మ దద్దరిల్లి పోవాలి” అన్నాడు. “బాగుందిరా! డబ్బు మంచి నీళ్లలా ఖర్చు పెట్టేస్తున్నావు పర్వాలేదా?” అని వాత్సల్యంగా అడిగాడు. “పర్వాలేదు గురువుగారు! తప్పదు గురువుగారు! తమరికి తెలిందేముంది? జనంతో పని బొమ్మ బాహుబలి అవ్వాలంటే ఆ మాత్రం దడదలాడితే తప్ప పనులు జరగవు. చిల్లర రోజులు కావు ఆవకాయకి పూతరేకులకి పనులు జరగడం లేదు. పూర్వపు జనాలు కాదు తెలివి మీరిపోయారు. అయినా నా వెనక మీరు ఉండగా నాకేంటి గురువుగారు?” అన్నాడు అభిమానంగా. “అంతా సర్వేశ్వరుడి దయ. చాలా కాలం నుంచి ఇలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. ఈనాటికి నా కల నిజమయ్యేటట్టు ఉంది!” అన్నాడు కరణం. “నా కల కూడా నిజం అవ్వాలి గురువుగారు!”. “అవుతుందిరా ఇది గొప్ప అవకాశం. నీ పేరు 10 ఊర్లలో నానాలి. నా ఏర్పాటు నేను చేస్తాను నీ ఏర్పాటు నువ్వు చెయ్ అన్నట్టు మర్చిపోయాను. రామసుందరం అని నాకు తెలిసిన మనిషి ఒకడు వస్తాడు నిన్ను కలుస్తాడు. వాడు కష్టాల్లో ఉన్నాడు. వాడితో సమస్య ఏమిటంటే వాడు కొంచెం అమాయకుడు, నిజాయితీపరుడు. వాడికి అకౌంట్స్ వచ్చు, ఎక్స్పీరియన్స్ ఉంది, భక్తుడు, యోగా టీచర్‌గా పనిచేశాడు, లాయర్‌గా పనిచేశాడు, అన్నీ తెలుసు. కానీ ఎక్కడ ఇమడలేడు మనకి పనికొస్తాడు. ఇంట్లో భార్యతో గొడవపడి బయట తిరుగుతున్నాడు. మారుతున్న కాలంతో మారలేకపోయాడు. ఎవో కుటుంబ సమస్యలో ఉన్నాడు. వాడు మనతోనే ఉంటాడు. మంచివాడు. ధైర్యంగా కోటి రూపాయలు దాయమని వాడికి ఇవ్వవచ్చు. రూపాయి ముట్టుకోడు. నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, నమ్మకస్తుడు. వాడికి ఉండటానికి భోజనానికి ఏర్పాటు చేస్తే ఈ పనులు, గో సేవా ట్రస్ట్ పనులు,అకౌంట్లు అన్నీ చూసుకుంటాడు. నీకు అభ్యంతరం లేకపోతేనే” అన్నాడు. “అయ్యో గురువుగారు మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను!. ఇంకా నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. చాలా బాగుంది వచ్చీ మనండి. ఇవాళ సాయంత్రానికి కోడూరులో మీ ఇంటి దగ్గర ఉంటాడు. మిగిలిన వ్యవహారం మనం మాట్లాడదాం” అని లేచాడు.
తాతబాబు పనులన్నీ చూసుకుని, అక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరు కోడూరులో ఉన్న తన ఇంటికి వెళ్ళేసరికి రాత్రి తొమ్మిది అయింది. ఇంటి వరండాలో రామసుందరం కుర్చీలో కూర్చుని ఉన్నాడు. తాతబాబును చూసి నా పేరు అని చెప్పబోతుండగా తాతబాబు అతన్ని ఆపి, “సుందరం నాకు తెలుసు! కరణం గారు చెప్పారు. మీరు ఈ రాత్రికి మన గెస్ట్ హౌస్ లో పడుకోండి, రేపు పొద్దున మాట్లాడుకుందాం”. “రేయ్ కృష్ణ, సార్ ని తీసుకెళ్లు ఏర్పాట్లు చూడు” అని పురమాయించాడు.
కొండపాలెం ఊర్లో ప్రతిరోజు సాయంత్రం పార్టీలు జరుగుతున్నాయి. అమ్మవారి గుడి ముందు వేటలు తెగుతున్నాయి. మామూలు ఖర్చుతో జరగవలసిన వేడుకలు బారీ ఖర్చుతో విధ్వంసంగా పాటలు, డాన్సులు వీరంగాలతో జరుగుతున్నాయి. భూములు పోయినోళ్ళు చెక్కులు పడ్డాయా, మారాయా, ఎంత వేసారు? మొత్తం పడిందా ఇలాంటి బోగట్టాలు నలుగుతున్నాయి. ఎప్పుడో భూములు పోయిన వాళ్ళు నష్టపోయినట్లుగా బాధపడుతున్నారు. ఇప్పుడు పోయిన వాళ్ళు కొందరు అసంతృప్తితో, కొందరు సగంతృప్తితో, కొందరు ఏడుపులతో గందరగోళంగా ఉంది. రెవెన్యూ ఆఫీస్ ఫెళఫెళలాడుతోంది. కార్లు, మోటార్ సైకిళ్లు చెడ తిరుగుతున్నాయి. జేసీబీలు పగలు రాత్రి పనిచేస్తున్నాయి. కొబ్బరి తోటలు కట్టర్స్ తో కట్ చేసి క్లీన్ చేస్తున్నారు. కొత్త బోర్లు వేసేస్తున్నారు. కొత్త ఎలక్ట్రికల్ లైన్ వేసేస్తున్నారు. ఊర్లను కలుపుతూ వంద అడుగుల రోడ్లు వేసేస్తున్నారు. లేబర్ అంత పనులతో తీరుబడి లేకుండా ఉన్నారు. డబ్బులు అందిన వాళ్ళు కొందరు యాత్రలకు బయలుదేరారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు సర్వేయర్లు నిరంతరం తిరుగుతున్నారు.
రామసుందరం వచ్చి వారం రోజులైంది. అతను ఈ వారం రోజుల్లోనూ ఊరికి దగ్గరయ్యాడు. అతనికి ఈ ఊరు నచింది. తాతబాబు కంపెనీ నచ్చింది. ఉండటానికి వేళకి భోజనాలు కాఫీలు టిఫిన్లు అందుతూ ఉండటంతో అతని జీవితానికి స్థిమితం చిక్కింది. తాతబాబుకి సుందరం వచ్చాక చాలా పని తగ్గింది. సుందరానికి డబ్బు లెక్కలు పేమెంట్లు అప్పజెప్పేసాడు. అప్పుడప్పుడు ఇష్టంగా ఇంత అమాయకులు ఏంటండీ బాబు మీరు అని తాతబాబు విసుక్కునేంత చనువు పెరిగింది. ఆ రోజు రాత్రి లేబర్ అంతా వెళ్ళిపోయారు. వెన్నెల రాత్రి తాతబాబు అక్కడే సుందరంతో భోజనం చేశాడు. శాలకు దగ్గరే ఉన్న ఒక ఇంట్లో సుందరానికి మకాo ఇచ్చారు. వంట మనిషిని కూడా ఏర్పాటు చేశాడు. ఇద్దరు కులాసాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పర్ణశాల పూర్తి అయింది. కరెంటు దీపాలు టెస్టింగ్ చేస్తున్నారు. పెయింటింగ్ పని కూడా అయిపోయింది. ఆశ్రమం ముందు ఆర్చి మీద “జీవానంద ఆశ్రమము” అనే బోర్డు రాయించారు. దానికి లైట్లు బిగిస్తున్నారు. మొక్కలన్నీ పాతేసారు. ఆశ్రమం అందంగా చల్లగా ఉంది. ఇదంతా సుందరానికి బాగా నచింది. “నా జీవితంలో ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేను తాతబాబు గారూ” అన్నాడు తన్మయత్వంతో. “ఊరుకొండి నాకంటే బాగా పెద్దోళ్ళు తమ్ముడులాంటి వాడిని తాతబాబు అంటే చాలు” అన్నాడు. “అమ్మ అలా అనకండి, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి, మీకు మంచి దక్షత ఉంది, మీ నాయకులు అయిపోతారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది నాకు కనబడుతుంది” అనేసరికి “థాంక్యూ! పెద్దలు మీ ఆశీర్వాదం, మీరు ఇంకెక్కడికి వెళ్లొద్దు ఈ ఆశ్రమం గోశాల ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోండి”. “నన్ను చూసుకోండి నేను మిమ్మల్ని చూసుకుంటాను, “నేను అంతటి వాడిని కాదు మీరు పొమ్మనేంత వరకు ఇక్కడే ఉంటాను” అన్నాడు రామసుందరం.
ఇంతలో నాలుగైదు టూ వీలర్స్ ఆగాయి. దాని మీద నుంచి రకరకాల వయసు వాళ్ళు దిగారు. వాళ్లతో పాటు కరణం కూడా వచ్చాడు. తాతబాబు లేచి నించోని “నమస్కారం! రండి బాబు, అందరూ ఒకేసారి ఇలా దండెత్తారు. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా!” అన్నాడు. “అయ్యా కరణం గారు మీరు వచ్చేసారా? ఈపాటికి సగం నిద్రైపోవాలి కదా మీకు?” అని నవ్వుతూ , అందరినీ ఇంట్లోకి తీసుకెళ్ళాడు. రామసుందరం అందరికీ మంచి నీళ్ళు ఇచ్చి మర్యాద చేశాడు. తర్వాత తను లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. అందరూ తాతబాబు కేసి కోపంగా చిరాగ్గా చూస్తున్నారు. అందులో మెకానిక్ బుల్లెబ్బాయి అనేవాడు “కరణం గారు మీరు అడుగుతారా మమ్మల్ని అడగమంటారా?” అన్నాడు. “నువ్వు అడిగేట్టయితే ఆయన్ని ఎందుకు తీసుకురావడం, కరణం గారు మీరు మాట్లాడండి” అన్నాడు ఒకాయన. మరొకాయన మాట్లాడటం కాదు, ఈవేళ అటో ఇటో తేలిపోవాలి అన్నాడు గట్టిగా. “విన్నావు కదా తాతబాబు, చెక్కులు వచ్చేసాయి, డబ్బులు అకౌంట్ లో పడిపోయాయి, చాలామంది ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుని సంతోషంగా గంతులు వేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉంది. ఇంకెన్ని రోజులు? అప్పుడే నాలుగు రోజులు అయిపోయాయి. అందుకే ఈ సంగతి ఏంటో అని లజగుజులు పడుతుంటే నేనే నీ దగ్గరికి తీసుకొచ్చాను. పొద్దుటి నుంచి నీ కోసం చూస్తే నువ్వు ఈ సమయంలో దొరికావు. చెప్పు ఏం చేద్దాం?” అన్నాడు. తాతబాబు విన్నాడు ఏం మాట్లాడలేదు. అప్పుడు మెకానిక్ బుల్లెబ్బాయి కొంచెం ఆవేశపడ్డాడు. “ఏంటి తాతబాబు మాట్లాడవేంటి, డబ్బులు డ్రా చేసేసుకుని ఆయన నువ్వు వాటాలు వేసుకుందాం అని చూస్తున్నారా ఏదో ఒకటి చెప్పు మా పని మేము చేసుకుంటాం” అన్నాడు.
తాతబాబు అతన్ని చూశాడు, ప్రశాంతంగా నవ్వాడు, మంచిది, అలాగే కానివ్వండి. మీకు బోధపడింది చేసుకోండి, డబ్బులు రావాలంటే ఆయన దిగిరావాలి. వచ్చి డ్రా చేయాలి, నేనే మీ మంచి కోసం అని ఆయన ఎక్కడో ఉంటే కష్టమని, ఏదో అకౌంట్ లో పడితే మీకు ఇబ్బంది అని మూడుసార్లు రిషికేశ్ వెళ్లి, సాములోరిని కలిసి, కొత్త అకౌంట్లు తీయించి, నోటరీలు చేయించి, డెత్ సర్టిఫికెట్లు పెట్టించి, ఎంఆర్ఓలతో మాట్లాడి, నో అబ్జెక్షన్ సంతకాలు పెట్టించి, అన్ని ఖర్చులు నా జేబులో నుంచి పెట్టుకొని ఇక్కడిదాకా తీసుకొచ్చాను. ఆయన రావాల, డబ్బులు డ్రా చేయాల, మీకు ఇవ్వాల. ఒక పని చేయండి, నాకు రూపాయి వద్దు, రిషికేశ్ లో ఆయన అడ్రస్ చెప్తాను వెళ్ళండి, మీరూ మీరూ తేల్చుకోండి, కావాలంటే కరణం గారిని తీసుకెళ్ళండి, ఆయన్ని దగ్గరుండి తీసుకురండి, పని అయిపోద్ది అని దణ్ణం పెట్టాడు చిరాగ్గా. తాతబాబు ఇలా మాట్లాడతాడు అనుకోకపోవడం వల్ల వచ్చిన వాళ్ళు వెంటనే తెల్లబోయి మొహాలు చూసుకున్నారు. వాళ్ళకి అప్పటికప్పుడు వాస్తవం బోధపడింది. అందులో ఒక తలనెరిసిన పెద్ద మనిషి “కోపం తెచ్చుకోకోయ్ తాతబాబు అందరూ డబ్బులు తీసేసుకుంటున్నారని ఆదుర్దా కొద్దీ మా బాధ నీతో చెప్పుకుంటున్నాo గాని, ఇన్ని చేసిన వాడివి ఆ కాస్త చేయలేవా?, నీ చేతుల మీద నాలుగు రూపాయలు ఇప్పించి పుణ్యం కట్టుకోవోయ్! ఈ వయసులో ఈ నక్కచిక్కులు మేము పడలేము” అని బతిమలాడాడు. తాతబాబు ఆయన భుజం మీద చెయ్యి వేసి, “తల్లి తోడు బాబుగారూ మీకంటే ఆతృతగా ఉంది నాకు, మీకంటే టెన్షన్ గా ఉంది, చెప్పకపోవడమేo, పడుకుంటే నిద్ర పట్టడం లేదు, మీరు ఇక్కడికి వచ్చారు, నన్ను నిలదీస్తున్నారు, పర్వాలేదు, మాట ఇచ్చాను కాబట్టి చేస్తాను, నేను ఎవరికి చెప్పుకోను, మీ పనులన్నీ అవ్వడం కోసం ఆయన పనులన్నీ నేను నెత్తినేసుకున్నాను”. “అదిగో అటు చూసి చూడండి, రాత్రి లేదు పగలు లేదు, దగ్గర లేకపోతే పనులు అవ్వవు, మీకు తెలియదు కానీ చాలా పెద్దోళ్లతో పని, ఆయన సాక్షాత్తు దేవుడు, ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం అంటే దేవుడు ప్రత్యక్షమైనట్టే, నన్ను నమ్మండి”. “ఇన్ని రోజులు ఆగారు, మరొక రెండు రోజులు ఆగండి, నేను చేయిస్తాను, నా కంఠంలో ప్రాణం ఉండగా అన్యాయం జరగదు, జరగనివ్వను, తాతబాబు అంటే నిజాయితీ, తాతబాబు అంటే నిక్కచ్చి” అన్నాడు.
వాళ్ళు పూర్తిగా తగ్గిపోయారు, “నువ్వు ఆ మాట అన్నావు చాలు! పడండయ్యా పోదాం పాపం అతనికి మళ్ళీ తెల్లవారు లేస్తే పనులు” అని లేచారు. “అమ్మ ఏమి పుచ్చుకోకుండా ఎలా వెళ్తారు” అని లోపలికి వెళ్లి తనే స్వయంగా మజ్జిగ గ్లాసుల్లో పోసి తెచ్చాడు. అందరూ తాగి బయలుదేరారు. కరణం గారు వాళ్ళని రోడ్డు దాకా పంపించి వెనక్కి తిరిగి వచ్చాడు. కరణం తాతబాబును చూసి నవ్వాడు. “నా దగ్గర చాలా గెంతారు రా తాతబాబు, నీ దగ్గరికి వచ్చేసరికి పిల్లులు అయిపోయారు, అదేదో త్వరగా తేల్చీవచ్చు కదా” అన్నాడు. “మీరు ఊరుకోండి బాబు, మీకు ఈళ్ళ సంగతి తెలియదు”. “ఇప్పుడంతా దారికి వచ్చారు, మూడింట రెండు వంతులు డబ్బులు తీసేసుకున్నారు”. “పర్సంటేజ్ ఒక రేటు నడుస్తుంది, ఇప్పుడు మనం చెప్పేది వీళ్ళు వింటారు, ఇప్పుడు తెగొట్టడం ఈజీ, ఆశ్రమం రెడీ అయిపోయింది కాబట్టి మన అసలు పని ఇప్పుడు మొదలుపెట్టివచ్చు, అంతా పెద్దాయన చెప్పిన ముహూర్తాలకే అవుతుంది, మీరేం కంగారు పడకండి” అన్నాడు. “ఏమోయ్ సుందరం ఎలా ఉంది ఇక్కడ?” అన్నాడు కరణం బయటికి వస్తున్న సుందరాన్ని పలకరిస్తూ. “మీ దయవల్ల సుఖంగా ఉన్నాను కరణం గారు, మీ రుణం తీర్చుకోలేను” అన్నాడు. “కరణం నవ్వి ఏమో నారుణమే ఇలా తీరిందేమో వెళ్లి వస్తాను” అని బయలుదేరాడు కరణం.
చివరికి ఆ ముహూర్తం రానే వచ్చింది. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పంచదార్ల శివాలయంలో స్వామి జీవానంద తన శిష్య బృందంతో వేంచేసారు. ఆయనకు తాతబాబు సకుటుంబ సమేతంగా ఆహ్వానం పలికాడు. ఆలయ అధికారులు పురోహితులు పూర్ణకుంభ స్వాగతాలు పలికారు. లోపల జీవానంద ప్రత్యేక పూజలు చేశారు. స్వామి జీవానంద చెయ్యెత్తు మనిషి దబ్బ పండు ఛాయ, నియమబద్ధమైన జీవితం వలన ఒక 10 ఏళ్ళు వయసు తగ్గి కనబడుతున్నాడు. కాషాయం లుంగి మీద కాషాయం లాల్చి మెళ్లో స్పటికమాల, నుదుటిన విభూది, వెలుగుతున్న కళ్ళు, స్వామివారి అంతరాలయంలో స్వయంగా అభిషేకాలు చేశారు. స్వామివారు మౌన వ్రతంలో ఉండటం వలన అనుగ్రహ భాషణం చేయలేదు. ఆయన రాక రహస్యంగా ఉంచడం వలన బయట జనాలకు తెలియలేదు. తర్వాత జీవానంద అక్కడి నుంచి బయలుదేరి కొండపాలెం పొలిమేరలో ఉన్న దుర్గమ్మ గుడిలో ఆగి ప్రత్యేక పూజలు చేయించారు. ఇక్కడ కొంచెం జనం మూగారు. ఇంతలో ఎలా తెలిసిందో జనాలకు తెలిసిపోయింది. స్వామివారి క్యాన్వాయిలో కార్లు పెరిగాయి, రోడ్లకు ఇరువైపులా జనాలు కలకలలాడుతూ ఎవరో వచ్చారు అని కుతూహలంతో చూస్తున్నారు. ఊరి మధ్యలో ఉన్న రామాలయంలోనూ, సముద్రపు ఒడ్డున ఉన్న గంగమ్మ ఆలయంలోనూ పూజలు చేసిన జీవానంద స్వామి మూగిన జనాన్ని చేయి ఎత్తి ఆశీర్వదించారు. సూర్యోదయాన్ని చూస్తూ కాసేపు ఒంటరిగా , సముద్రపు ఒడ్డున నడిచారు. రాతి మీద కూర్చుని ధ్యానం చేశారు. ఇవన్నీ ఆయన శిష్యులు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ గోశాలకు వచ్చి అక్కడ గోవులకు పూజలు చేశారు. తర్వాత చుట్టూ తిరిగి ఉత్తరం వైపు నుంచి జీవానంద ఆశ్రమము అని బోర్డు రాసి ఉన్న ఆర్చి ముందు నుంచి దిగి పూల రెక్కలు పరిచిన తివాసీల మీదగా ఆశ్రమంలో అడుగుపెట్టారు.
స్వామివారి ఆశ్రమ ప్రవేశం జరిగింది. వెంట వెంటనే ఆశ్రమం మంత్రోచారణతో హోరెత్తింది. సిద్ధంగా ఉన్న పురోహితులు గణపతి హోమాలు ప్రారంభించారు. ఆ హోమం వద్ద నడి వయస్సులో మంచి వర్చస్సుతో వెలుగుతున్న ఇద్దరు జంటలు కూర్చున్నారు. తాతబాబు స్వామి వారిని దగ్గర ఉండి వారి ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్లారు. ఆ జంటలు ఆనంద భాష్యాలతో స్వామివారిని చూశారు, నమస్కారం చేసుకున్నారు. స్వామివారు వారిని చెయ్యి ఎత్తి ఆశీర్వదించారు. ఆ జంటలు పూర్వాశ్రమంలో స్వామివారి కూతుర్లు అల్లుళ్ళు ఒకరు అమెరికా నుంచి మరొకరు కెనడా నుంచి వచ్చారు. ఆ రోజు నుంచి జీవానంద ఆశ్రమంలో పూజలు హోరెత్తాయి. ఆశ్రమంలో ప్రత్యేకంగా కట్టిన షెడ్లో ఒకేసారి 500 మంది భోజనం చేయవచ్చు. పగలు రాత్రి ప్రసాద వితరణ ప్రారంభమయింది. రోజుకి 5-6 వేల మంది ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో జనం వస్తున్నారు. పక్క మండలాల నుంచి పక్క జిల్లాల నుంచి వచ్చిన జనానికి ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందిన వారికి తాతబాబు వసతి కూడా ఏర్పాటు చేశాడు. తాతబాబు పేరు మారుమ్రోగిపోయింది. కరణం గారు స్వామివారి పాదాల దగ్గరే కూర్చుంటున్నారు. ఆయన పక్కనే రామసుందరం అరమోడ్పు కళ్లతో ఇదంతా చూస్తూ పరవశించిపోతున్నాడు. తను ఎంత గొప్ప స్థలంలో ఉన్నాడో అర్థమైంది. స్వామివారి కుటుంబ సభ్యులు స్వామివారిని శ్రద్ధగా చూసుకుంటున్నారు. తాతబాబు స్వామివారి ఖాతాలో పడిన భూముల తాలూకు మొత్తం మూడు కోట్ల చిల్లర మూడో కంటికి తెలియకుండా మొత్తం డ్రా చేయించేసి ఎవరిది వాళ్ళకి ఇప్పించి సెటిల్ చేసేసాడు. మాట్లాడుకున్న 25% కాకుండా 30% వాళ్ళకి నొప్పి తెలియకుండా స్వీకరించాడు. ఆ మొత్తాన్ని ఖర్చుపెట్టి ఏర్పాట్లు మహాద్భుతంగా చేస్తున్నారు. అతన్ని వెనకాల తిట్టుకునే నోళ్ళు బాగా తగ్గిపోయాయి. డబ్బులు అంది సమస్యలు తీరిపోయిన వాళ్ళందరూ కుటుంబాలతో వచ్చి చండీ యాగాల్లో పాల్గొంటున్నారు. పేపర్లన్నీ ఈ వార్తలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి.
స్వామివారి మౌన వ్రతం పూర్తయింది. స్థానిక ఎమ్మెల్యే తాతబాబు ఆహ్వానం మీద సకుటుంబ సమేతంగా వచ్చి పూజల్లో పాల్గొన్నాడు. తాతబాబుని పక్కకు పిలిచి ప్రత్యేకంగా మాట్లాడాడు. “తమ్ముడూ నీలాంటోడు మా పార్టీలో ఉండాలి, కంగారుపడి ఏదో పార్టీలో చేరిపోకు, ఈసారి మండల ప్రెసిడెంట్ నువ్వే. డబ్బు గురించి మర్చిపో, నేను చూసుకుంటాను, మనం మళ్ళీ కలుద్దాం అన్నాడు. తమరు ఎలా అంటే అలాగే ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే కాళ్ళ మీద పడ్డాడు తాతబాబు. తర్వాత నెమ్మదిగా గోశాల ఫైల్ ఆర్.టి.ఓ గారి దగ్గర ఉంది, తమరు ఒక మాట చెప్తే బాగుంటుంది, “నాకు తెలుసు, నేను చూసుకుంటాను. జీవానంద ట్రస్ట్ తరపున కుట్టుమిషన్లు, ట్రై సైకిల్స్, స్వామివారు ఉండగానే ఎల్లుండి పంచిపెట్టి ఏర్పాటు చేయి, నేను వస్తాను, అన్నీ జరిగిపోతాయి” అన్నాడు. “అలాగే అన్నగారు, తమరు వదినగారు, పిల్లలు అంతా ఈ రెండు రోజులు ఇక్కడే ఉండి మమ్మల్ని నడిపించాలి. గెస్ట్ హౌస్ లో వసతి ఉంది, దయఉంచండి! ఎంపీ గారు వస్తామన్నారు, మాజీ గవర్నర్ గారు వస్తున్నారు” అన్నాడు. “చంపేసావు! చాలా ప్రోగ్రామ్ లు ఉన్నాయి, సర్లే ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తాను” అన్నాడు, “తమ దయ” అన్నాడు తాతబాబు వినయంగా. ఎమ్మెల్యే గారి కుటుంబం రెండు రోజులుగా అక్కడే ఉంట్టుంది, జనం బాగా వస్తున్నారు. ఉదయం పూజలు, భజనలు, ప్రసాదాలు ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. రామసుందరం స్వామివారి కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆశ్రమంలో అందరికీ తలలోనాలుక అయ్యాడు. ఈ మధ్యలో తాతబాబు కరణం గారిని ప్రత్యేకంగా కార్ ఇచ్చి పంపించి, రామసుందరం భార్యని అత్తగారిని వారి దగ్గర బంధువులని పిలిపించి పూజా కార్యక్రమంలో పాల్గొనేలా చేశాడు. తన మొగుడిలో మార్పుకి ఆ ఇల్లాలు చాలా సంతోషించింది. రామసుందరం అత్తగారు తన అల్లుడికి ఆశ్రమంలో జరుగుతున్న మర్యాదలు అవి చూసి మెత్తబడింది. “ఈ ప్రాణిని కూడా ప్రపంచం గుర్తించింది, ఈ జీవికి కూడా నమస్కారాలు పెడుతున్నారు” అని సంతోషించి తాతబాబుతో అంది. “ఈ మనిషిలో ఈ మార్పు అంతా మీ దయ బాబు అందరితో గొడవలు పడుతూ ఉండేవాడు. పని మనుషులతో తగువు, ఆటో వాడితో తగువు, క్యాబ్ వాడితో తగువు, ఇంటి ఓనర్‌తో, కూరగాయల వాడితో అందరూ చెడ్డవాళ్ళు అంటాడు చూసీ చూడనట్టు పోకపోతే బ్రతకడం ఎలాగ? భార్యతో పడదు, అది విసిగిపోయింది”. “అలా అనకండి అమ్మ మంచివాడే” అన్నాడు తాతబాబు. “మంచివాడే బాబు అందుకనే కదా పిల్లనిచ్చాం, దాన్ని చదివించాడు, ఉద్యోగం ఇప్పించాడు, ఆ జీతం వీడి ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టాలంటాడు, పెత్తనం చేస్తాడు ఒక్క ఆడపిల్ల. దాని ఇష్టం వచ్చిన చదువు చదివిస్తానంది అమ్మాయి. ఇతనేదో వితండంగా చెప్తాడు, వినలేదు, అలిగి అటు ఇటూ తిరుగుతున్నాడు. మీరు ఇక్కడ కుదిర్చారు, మరి పర్వాలేదు, నేను అమ్మాయితో మాట్లాడుతాను, కుదిరినప్పుడు అతను వస్తాడు ఇంటికి లేదంటే వీకెండ్స్ కి అమ్మాయి వస్తుంది, ఈ స్థలం మాకు నచ్చింది. ఏదో ఏర్పాటు చేయించండి బాబు, నేను మా అక్క ఇక్కడికి వచ్చేస్తాం, ఏదో కలిగినంత చందా ఇస్తాం కాదనకండి” అంది. “అయ్యో తప్పకుండా అమ్మగారు. ఈ ఆశ్రమం అందరిది, స్వామివారు చెప్పిందే అది, మానవ సేవే మాధవ సేవ, ఈ హడావుడి అయిపోయాక మనమంతా మీరు అనుకున్నట్టు చేద్దాం అన్నాడు, ఆ రకంగా రామసుందరం జీవితం కుదుటపడింది.
అతను రెండింతలు పని చేస్తున్నాడు, మూడింతలు ఆనందంగా ఉన్నాడు. ఎమ్మెల్యే కాశీ ఆధ్వర్యంలో జీవానంద ఆశ్రమం ట్రస్ట్ కుట్టుమిషన్లు, మూడు చక్రాల సైకిళ్ళు, ఎంపిక చేసిన పిల్లలకు లాప్టాప్ లు పంచిపెట్టారు. చుట్టుపక్కల ఉన్న సేవా సంస్థలు జతకట్టాయి. స్వామివారి జపంతో పాటు తాతబాబు జపం కూడా అన్ని ఊర్లోని నానుతోంది. ఎమ్మెల్యే గారి ప్రసంగంలో స్వామివారు పూర్వాశ్రమంలో ఈ ఊరివారు అవ్వడం, వారు ఇక్కడ ఆశ్రమం నెలకొల్పడం, సేవా కార్యక్రమాలు చేయటం తమ అదృష్టం అని చెప్పారు. గోశాల కోసం ప్రభుత్వం 16 ఎకరాల స్థలం ఆశ్రమం వెనకాల కేటాయించిందని చెప్పారు. అంతేకాకుండా ఆ స్థలంలో ఓ రెండు ఎకరాల్లో వృద్ధాశ్రమం నిర్మించడానికి అనాధ ఆశ్రమం నిర్మించడానికి ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు తక్షణ గ్రాంట్ కింద తెస్తామని ఎంపీ గారితో మాట్లాడానని ప్రకటించారు. తన సొంత డబ్బు విరాళంగా ఇస్తున్నానని 5 లక్షల విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే తాతబాబు తన వంతు విరాళం రెండు లక్షలు ప్రకటించారు. స్వామివారి అల్లుళ్ళు ఇద్దరు చెరో పాతిక లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇంకా ఊరి పెద్దలు , ఆహూతులు, ఎన్జీఓల ప్రతినిధులు చాలా విరాళాలు ప్రకటించారు. అప్పటికప్పుడు రెండు కోట్ల రూపాయలు సమకూరింది. స్వామివారి అనుగ్రహ భాషణలో మండలంలో ఉన్న నాలుగు జీర్ణ దేవాలయాలన్నిటికీ తలో పది లక్షలు ఆశ్రమం తరపున ప్రకటించారు. ఎమ్మెల్యే గారు తాతబాబు కలిసి ఆ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. తర్వాత ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం సాగింది. ఈ నేల తనకు జన్మనిచ్చిన నేల అని 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాలం అనుకూలించి ఇక్కడికి వచ్చానని, మళ్ళీ ఎప్పుడు వస్తానో, ఇంకా ఈ నేల మీద తనకు ఎంత రుణం ఉందో తెలియదని అంటుంటే ఎవరో ఆకతాయి జర్నలిస్ట్ అప్పులు ఎగ్గొట్టి ఐపి పెట్టి పారిపోయాను అని చెప్పండి అని గట్టిగా అరిచాడు.
అది చాలామంది వినలేదు. స్వామీజీ విన్నాడు, చిన్ననవ్వు నవ్వాడు. తాతబాబు విన్నాడు, కరణం విన్నారు. రామసుందరం విని ఉలిక్కి పడ్డాడు. తాతబాబు తన మనుషులకు సైగ చేశారు. వారు వాడిని కనిపెట్టి ఎత్తి గోడవతల పడేసారు, సభ సజావుగా సాగిపోయింది. సమయం రాత్రి 10 అయింది. ఆశ్రమంలో ఆఫీస్ రూమ్ లో తాతబాబు, రామసుందరం, కరణం కూర్చుని ఉన్నారు. పగలంతా సందడిగా ఉన్న ఆశ్రమం విశ్రాంతిలో మునిగి సడి చప్పుడు లేకుండా ఉంది. మొత్తం అకౌంట్స్ అప్పు చెప్పారు. మొత్తం అకౌంట్స్ అప్పు చెప్పాడు సుందరం, కరణం చాలా సంతోషపడ్డాడు. తాతబాబు మొత్తానికి అవును అనిపించారా, ఇంకా నీకు తిరుగులేదు పో అన్నాడు. తాతబాబు పరమ సంతోషంతో పళ్ళు కనిపిస్తూ నవ్వాడు. రామసుందరం ఆలోచనలో మునిగి ఉన్నాడు, ఏంటి సుందరం ఏదో దీర్ఘాలోచనలో ఉన్నావు అని కరణం అడిగాడు. రామసుందరం నిట్టూర్చి ఇవాళ నాకు మొత్తం తెలిసింది కరణం గారూ, మన స్వామివారు ఒకప్పుడు ఈ ఊరిలో దివాళా తీసి, అప్పులు ఎగ్గొట్టేసి, ఐపి పెట్టి ఊరు వదిలి వెళ్ళిపోయారట నిజమేనా? అని బాధగా అడిగాడు. దివాళా నిజం, ఐపి పెట్టడం నిజం అన్నాడు కరణం. తాతబాబు అవునండి కరణం గారు, అందరూ అనుకోవడమే గానీ అసలు ఏమైంది? కథ మొత్తం చెప్పండి అన్నాడు. స్వామివారి పేరు కాశీ విశ్వనాథరాజు, తండ్రి గారికి 100 ఎకరాలు ఉండేది, వారి హయాంలోనే పెళ్లిళ్లకి, తిరుగుళ్ళకి, సరదాలకి, మందుకి వేటకి 50 ఎకరాలు అయిపోయింది. వారు పోయేనాటికి అన్నదమ్ములు మన స్వామివారికి లెక్కలు చెప్పి, అప్పుల కింద 30 ఎకరాలు కట్ చేసుకుని, 20 ఎకరాలు మిగిల్చారు. 20 ఎకరాలకి ఈయనకి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయనకి వేట సరదా ఉండేది, ఆయన దర్జాగా బతికి దర్జాగా చిన్న వయసులోనే చనిపోయాడు. ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఆడపిల్లల్ని వైజాగ్ లో పెట్టి బాగా చదివించాడు. ఈయన కాంట్రాక్టులు చేస్తూ బండి లాగిస్తూ ఉండేవాడు. నేను ఆయన స్నేహితులం, ఆయన మంచి చెడ్డలన్నీ నేనే చూసేవాడిని. ఇంతలో వరదలు వచ్చాయి, వరద కాంట్రాక్టులు వచ్చాయి, ఆ అర్జెంట్ పనులు చేసి బాగా సంపాదించాడు. ఇంతలో అతనికి ఎక్కడో పరిచయమైన పెద్ద కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు, అదిగో అక్కడ దొరికేశాడు, తన దగ్గర ఉన్న డబ్బే కాకుండా ఊరు నిండా అప్పులు చేసి ఆ వర్క్స్ కంప్లీట్ చేశాడు. ఆ రోజుల్లో వడ్డీలతో కలిపి 40-50 లక్షలు దాకా బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. ఆ పెద్ద కాంట్రాక్టర్ ఆ బిల్లులు తినేసి తిరగగా తిరగగా 10 లక్షలు ఇచ్చారు. ఇంతలో స్వామివారి భార్యకి అనారోగ్యం, ఆ రోజుల్లోనే ఆ 10 లక్షలు దానికి ఖర్చు అయిపోయింది, అయినా ఆవిడ దక్కలేదు. బంధువులు తొందరపెట్టి ఎలాగో పూనుకుని ఆడపిల్లల పెళ్లిళ్ళకి కొంచెం అప్పులు చేసి పెళ్లిళ్లు జరిపించారు. వాళ్ళు అమెరికాలో ఒకరు, కెనడాలో ఒకరు సెటిల్ అయ్యారు. తర్వాత వడ్డీలు దంచి కొట్టేసాయి, దమ్మిడి ఆదాయం లేదు, అప్పులోళ్ళు అందరూ మీద పడ్డారు, బంధువులు బలవంతంగా ఐపి పెట్టించేసారు. ఆ తర్వాత స్వామి ఉన్న భూమిని అమ్మి కొంత కొంత సర్దాడు, తర్వాత అతని పేరు మీద తండ్రి గారి పేరు మీద ఉన్న, తమ్ముడి పేరు మీద, మేనత్తల పేరు మీద ఉన్న పట్టా భూమిని కూడా అప్పుల కింద స్వాధీనం చేసేసుకున్నారు. ఈయనకి ఇంక మొహం చెల్లలేదు.
భార్య లేదు, పిల్లలు ఎక్కడో ఉన్నారు, మనసు చెదిరిపోయింది, కాశీ వెళ్ళిపోయారు. తర్వాత రిషికేశ్ వెళ్లి ఒక గురువుగారితో ఉండిపోయారు. ఆ మఠానికి ఉత్తరాధికారి అయ్యారు, తర్వాత నేను ఎలాగోలాగా ఆయన్ని వెతికి పట్టుకొని అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఆయనతో ఒక నెల అయినా గడుపుతున్నాను. ఈయన స్వతహాగా అన్యాయం చేసే మనిషి కాదు, జరిగిపోయింది అంతే. మరి ఇప్పుడు అప్పు కింద కట్టిన భూమి ఎవరికో ఇచ్చేసిన, భూమి తాలూకు డబ్బులు పర్సంటేజ్ తీసుకోవడం తప్పే కదా? అన్నాడు రామసుందరం. అవును తప్పే, మరి ఆ తప్పులని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు కరణం గారు అన్నాడు రామసుందరం. ఈ ఆశ్రమం స్థలం ఎవరిదో తెలుసా? తెలుసు జీవానంద ఆశ్రమం ట్రస్ట్ ది. మరి తాతబాబు తాతబాబు చక్రం తిప్పకముందు ఇందులో ఎవరు ఉండేవారో తెలుసా? సగం స్థలం ఈ ఊరి వాళ్ళు ఆక్రమించేసారు, సగం స్థలం నేను బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకుని గోశాల పెట్టించాను. ఆశ్రమానికి ఎదురుగా ఉన్న 30 అడుగుల రోడ్డును రెండువైపులా పదేసి అడుగులు తినేసి కేవలం 10 అడుగులు ఖాళీ బాటు మిగిల్చారు ఈ ఊరి వాళ్ళు. ఆయనకి ఈ ఆశ్రమానికి స్థలం ఎవరో పెద్దవాళ్ళు దానంగా ఇచ్చారు. కొన్న స్థలం ఇది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్న స్థలం. ఆయనకు సమాధి అయిపోయేలోపు ఏదో మూల ఓసారి తన ఊరు మళ్ళీ రావాలని ఉండేది. కానీ ఈ చెడ్డ పేరుతో ఈ మరకలతో తిరిగి రావడం ఆయనకి ఇష్టం లేదు. ఇంతలో అనుకోకుండా ఊరి భూముల్ని ప్రభుత్వం తీసుకుంది, గూగుల్ కంపెనీకి ఇచ్చింది. రికార్డ్స్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ బ్యాంకు అకౌంట్ లోకి చెక్స్ పడతాయి. అమౌంట్స్ పడతాయి. దాదాపు 3 కోట్ల రూపాయలు. 7-8 మంది వాటాదారులు. ఆల్రెడీ ఊర్లో ఇలాంటి చెక్కులకి పావలా వాటా నుంచి 30 పైసల వాటాగా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి అని జనం ఒక రూల్ పెట్టుకున్నారు. కాబట్టి సరే ఈ డబ్బుతో మ్యాజిక్ చేయొచ్చు అని నేను తాతబాబు కలిసి సంవత్సరం నుంచి స్కెచ్ వేసి మొత్తానికి ఇలా క్లియర్ చేశాం. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించడానికి డబ్బు తీసుకున్నారు అన్నమాట. అన్నాడు రామసుందరం. అవును ప్రపంచమంతా అదే నడుస్తుంది, నీ భూమికి నీ డబ్బుకి నీ పెన్షన్ కి నీ భూమి కాగితాలు నీకివ్వడానికి ఇలా నీది నీకివ్వడానికే డబ్బులు తీసుకుంటున్నారు. ఆయన భూమి ఆయనకి ఎవరిది వాడికి ఇప్పించడానికి మొత్తం పావులన్నీ కదిపాం. ఈ డబ్బులు ఏవీ స్వామి వారు ముట్టుకోలేదు, అటు నుంచి అటే వెళ్ళిపోయాయి. రోడ్డు ఆక్రమించిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఖాళీ చేయించాం. అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి డబ్బు రికమెండేషన్ నడిచింది. వారి సొంత కుటుంబంలో ఆడపిల్లలకి 30 ఏళ్ల నుంచి అతి గతి లేదు, ఎవరూ చూడలేదు, వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. అందుకని వాళ్ళ బంధువులందరినీ పిలిపించి పూజలు మర్యాదలు చేసి పంపించాం. వాళ్ళకి బంగారు కలశాలు, పట్టు బట్టలు పెట్టించాం. ఆయన పర్సంటేజ్ తీసుకున్న భూమి అరడజన్ చేతులు మారింది. అందరికీ త్రుణమో, పణమో ఇప్పించాం. ఇక్కడికి వచ్చి భజన చేసిన వాళ్లలో సగం మంది అప్పుడు తిట్టిన వాళ్లే, ఇప్పుడు కాళ్ళ మీద పడుతున్నారు, ఇది లోకం. ఇలా నడుస్తోంది. అన్నాడు కరణం. ఇదంతా అధర్మం కాదా? అడిగాడు రామసుందరం. తెలియదు అన్నాడు కరణం. ఈ తాతబాబుకి రాజకీయాలు ఇష్టం. ఊర్లో ప్రెసిడెంట్ వీళ్ళ చిన్నన్నే, ఆయన తర్వాత ఆయన కొడుకు ప్రెసిడెంట్ అవుతాడు, అందుకని ఇతను మండలానికి ట్రై చేసుకుందాం అనుకుంటున్నాడు. దానికి ఇతనికి శక్తి సరిపోదు, డబ్బులు ఎలాగోలాగా మేనేజ్ చేయొచ్చు. కానీ జనం వెనకాల రావాలి కదా, ఎందుకు వస్తారు? ఎలా వస్తారు? వాళ్ళు పనులు చేస్తే వస్తారు, మంచోడని నమ్మితే వస్తారు. సపోర్ట్ ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? కుర్చీ అందరికీ కావాలి, ఎలా వస్తుంది? ఇదిగో ఈ ఆట అంతా ఆడించాం. నువ్వు చాలా మంచివాడివి కాబట్టి నీతో ఇదంతా మాట్లాడుతున్నాను. ఈ మండలం బీసీలకి కేటాయించారు. నోటిఫికేషన్ ఇంకా రాలేదు, వస్తది. తాతబాబే క్యాండిడేట్. భవిష్యత్తులో ఎమ్మెల్యే అవుతాడు. నేను ఉంటానో లేదో తెలియదు అన్నాడు. అయ్యో అలా అనకండి గురువుగారు, మీరు ఉండాలి నడిపించాలి అన్నాడు తాతబాబు. చూద్దాం ఇప్పటికి ఈ ఆట ఇలా గెలిచాం. రామసుందరం మీ ఆవిడ అత్తగారు వచ్చారు, సంతోషంగా వెళ్లారు. నువ్వు కొత్తగా ఏం చేయకపోయినా కాలం కలిసి వచ్చి వెలుగుతున్నావ్, సంతోషంగా ఉండు. చూసావా జనం ఎలా ఉన్నారో? నిన్ను కాదన్న వాళ్ళ మీద కోపం పెట్టుకోకు. మౌనం, చిరునవ్వు ఈ రెండు స్వామి వారిని చూసి నేర్చుకో. బ్రతుకు దానికి అదే బాగుపడుతుంది. అన్నాడు కరణం. అయితే మొత్తమంతా మాయ అన్నమాట. అవును అంతా మాయ. జగత్తంతా మిధ్య. ఈ ఊర్లోనే డబ్బు ఖర్చు అవుతుంది. సంతోషించు. క్షమించాలి తప్పు మాట్లాడి ఉంటే అని రామసుందరం నమస్కారం పెట్టాడు. అమ్మో రాత్రి 11:00 అయిపోయింది, పొద్దున ఏర్పాట్లు చూడాలి అన్నాడు తాతబాబు. ఆ రాత్రి రామసుందరానికి చాలా సేపు నిద్రపట్టలేదు. కానీ క్లారిటీ వచ్చింది. స్వామి తన జీవితం నుంచి తను పారిపోయి కాశీ వెళ్ళినా, హరిద్వార్ వెళ్ళినా తన నుంచి తను తప్పించుకోలేక మళ్ళీ వచ్చి తన వల్ల జరిగిన తప్పును ఈ రకంగా పరిష్కారం చేసుకుని ఉంటారని అతను తన బుర్రని సమాధాన పరుచుకున్నాడు. అప్పటినుంచి స్వామి అంటే గౌరవం పెరిగింది.
స్వామి వారు బయలుదేరే సమయం వచ్చింది. స్వామి అందరినీ చూసుకుంటూ పాదయాత్ర చేస్తానని ఊరి చివరి బస్ ఎక్కుతానని నిర్ణయించారు. ఆయనతో పాటు కూతుర్లు, అల్లుళ్ళు, బంధువులు, మిత్రులు వెంటరాగా నెమ్మదిగా నడుచుకుంటూ బాటకి ఇరువైపులా జనం ఆయనపై పూలు చల్లుతూ ఉండగా స్వామి మధురంగా నవ్వుతూ పిల్లలను ఆశీర్వదిస్తూ దేవుని గుడి దగ్గర ఆగుతూ కిలోమీటర్ దూరం నడిచి తన బస్ ఎక్కాడు. వెనకాల మూడు బస్సుల్లో ఎంపిక చేసిన జన్నానీ సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి తీసుకెళ్తున్నారు. తర్వాత అందరూ స్వామికి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో వీడుకోలు చెప్తారు అదీ ప్రోగ్రాం. రామసుందరం అందరినీ చూస్తున్నాడు. ఇదే వీధుల్లో స్వామి అవమానాలు పడి ఉంటాడు, తిట్లు తిని ఉంటాడు. కన్నీళ్లు కార్చి ఉంటాడు. ఆ రోజు వచ్చి గట్టిగా మాట్లాడిన వాళ్ళు కుటుంబాలతో సింహాచలం బస్ ఎక్కి ఉన్నారు. తాము ఇచ్చిన డబ్బులు దేవుడికే ఇచ్చాం అని సంతోషంగా ఉన్నారు. అందులో కొందరు మళ్ళీ ఎప్పుడు వస్తారు స్వామి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. రామసుందరానికి చిన్న నవ్వు వచ్చింది. లీల అంటే ఇదే కదా అనిపించింది. తాతబాబుతో పాటు అతను కూడా స్వామితో బయలుదేరాడు. తిట్టిన ఊరి నుంచి, తిట్టిన నోళ్లతో నీరాజనాలు అందుకోవాలనే స్వామి వారి అహం ఈ ఊరికి ఎంతో కొంత మంచి చేస్తుందని అతనికి నమ్మకం వచ్చింది. బస్సులన్నీ కదిలాయి, ఊరు వెనుకబడింది. అతని పెదవులు అప్రయత్నంగా సర్వేజనా సుఖినో భవంతు అనే మాటలు ఉచ్చరించాయి.
శుభం

