పూర్వం ఒక రాజ్యంలో ఒక టర్నర్ – అదేనండీ చెక్క లేదా లోహాన్ని యంత్రంపై తిప్పుతూ కావాల్సిన ఆకారంలో తయారు చేసే పనివాడు, ఒక కంసాలి ఉండేవారు. ఒకరోజు వాళ్లిద్దరూ ఒక కల్లు దుకాణంలో కలుసుకున్నారు. కలిసి తాగుతూ కబుర్లలో పడ్డారు. మెల్లమెల్లగా ఇద్దరికీ మత్తెక్కుతోంది. మొదట నాలుకలు మడతపడ్డాయి.. తర్వాత మాటలు తడబడ్డాయి …. తడబడ్డ మాటలు తూటాలుగా మారి గొడవకి దారితీశాయి.

ముందుగా టర్నర్ “మన ఇద్దరిలో నేనే మేటి పనివాడిని!” అన్నాడు గర్వంగా.
దానికి కంసాలి “అబ్బే! నీకంటే మేటి పనివాడిని నేనే!” అన్నాడు.
ఈ గొడవ ముదిరి పాకాన పడింది. ఆఖరికి కొట్టుకునే దాకా వెళ్ళింది ఈ గొడవ. రాజధాని నగర నడిబొడ్డునే కాసేపు కొట్టుకుని చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు.
“పద, మహారాజు దగ్గరికి వెళ్లి మనలో ఎవరు మేటి పనివాడో తేల్చుకుందాం. ఆయన్నే తీర్పు చెప్పమని అడుగుదాం” అంటూ వాళ్లిద్దరూ మహారాజు దగ్గరకు బయల్దేరారు.
మహారాజు వాళ్లను చూసి “ఎవరు మీరు?”అని అడిగాడు.

వాళ్లలో ఒకడు ముందుకొచ్చి“నేను బంగారు పని చేసేవాడిని – కంసాలిని” అన్నాడు.
మరొకడు “నేను టర్నర్‌ని” అని చెప్పాడు.
“ఏం కావాలి మీకు?” – అడిగాడు మహారాజు.
“మాలో ఏవరు గొప్ప పనిమంతుడో తేలాలి ఇప్పుడే!” అన్నారు ఇద్దరూ ఏకకంఠంతో.
“ఓహో …. అలాగా” అన్నాడు మహారాజు.
“సరే, ఒక పని చేద్దాం. మీ ఇద్దరికీ చెరో రెండు రోజుల సమయం ఇస్తాను. ఆ రెండు రోజుల్లో మీ ఇద్దరు ఏదైనా ఒక అద్భుతమైన వస్తువు తయారుచేసి తీసుకురండి. మీరు చేసిన పనిని జాగ్రత్తగా పరిశీలించి, మీ ఇద్దరిలో ఎవరు మేటి పనివాడో నిర్ణయిస్తాను” అన్నాడు మహారాజు.
ఇద్దరూ, మహారాజు మాటకి ఒప్పుకుని తూలుతూనే వాళ్లిద్దరూ తమతమ ఇళ్లకు వెళ్లిపోయారు.
కంసాలి బాగా ఆలోచించి, చివరికి ఒక బంగారు చేపను తయారు చేశాడు. ఆ చేపను నీళ్లలో వదిలితే, అది అచ్చం ప్రాణమున్న చేపలాగే ఈదుతుంది. దానికి ఒక వైపు తాళం తిప్పితే నీటి పైభాగంలో ఈదుతుంది, మరో వైపు తిప్పితే నీటి అడుగు భాగానికి వెళ్లిపోతుంది.
వాళ్లు ఆ చేపను మహారాజు దగ్గరకు తీసుకెళ్లారు. మహారాజు సేవకులతో ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తెప్పించి ఆ చేపను అందులో వదిలించాడు. వెంటనే అది ప్రాణమున్న చేపలాగే ఈదడం మొదలుపెట్టింది.
ఇంతలో టర్నర్ కూడా తన పనిని పూర్తి చేసి ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఒక పావురాన్ని తయారుచేసి తీసుకొచ్చాడు.
“సరే, ఇప్పుడు బయటికి వెళ్లి నీ పనితనం చూద్దాం” అన్నాడు మహారాజు.
రాజు బట్టలు మార్చుకుంటున్నంతలో ఆయన చిన్న కొడుకు ఆ పావురాన్ని చేతుల్లోకి తీసుకుని పెరట్లోకి పరుగెత్తాడు. ఆ పిల్లవాడు తనకి తెలియకుండానే ఆటగా పావురం కాలికి ఉన్న తాళం తిప్పడం మొదలుపెట్టాడు.
అంతే! పావురం పిల్లవాడితో సహా పైపైకి ఎగరడం మొదలుపెట్టింది.

మొదట ఆ పిల్లవాడు ఆకాశంలో ఒక చిన్న చుక్కలా కనిపించాడు. ఆ తర్వాత క్రమంగా కనుమరుగైపోయాడు.
అది చూసిన వాళ్లంతా గగ్గోలెత్తిపోయి కేకలు వేశారు. రాజు వెంటనే పెరట్లోకి పరుగెత్తుకొచ్చాడు.
కానీ అప్పటికే ఆ అబ్బాయి ఎక్కడా కనిపించలేదు. మాయమైపోయాడు.
ఇదిలా ఉండగా పావురం మాత్రం ఇంకా.. పైపైకి ఎగురుతూనే ఉంది. అది ఎగరడం మొదలుపెట్టి మూడు రోజులయ్యేసరికి, పిల్లవాడికి ఇక పావురానికి తానే తాళం తిప్పాలి అని అర్థమైంది.
అతను పావురానికి తాళం తిప్పడం మొదలుపెట్టగానే, అది అతన్ని ఒక గుర్తు తెలియని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి దింపింది. దిక్కుతోచక ఆ పిల్లవాడు అక్కడే నిలబడిపోయాడు.
అది తెల్లవారుజాము సమయం. ఆకలితో, చలితో వణుకుతూ, ఏడుస్తూ, ముక్కు చీదుకుంటూ అతను అక్కడే అలాగే నిలబడి ఉన్నాడు.
ఇంతలో ఒక వ్యాపారి అటుగా వెళ్తూ ఆ పిల్లవాడిని చూసి, తనకు తెలియని భాషలో అతన్ని ఎన్నో ప్రశ్నలు వేశాడు. చివరికి ఎలాగో ఆ అబ్బాయి తన విషయాన్ని అతనికి అర్థమయ్యేలా చెప్పగలిగాడు.
వ్యాపారి అతన్ని “నువ్వెక్కడి నుంచి వచ్చావు?” అని అడిగాడు.
అబ్బాయి “నాకు తెలియదు” అని జవాబిచ్చాడు.
వ్యాపారి అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించాడు. ఆ అబ్బాయి ఇక ఆ ఇంట్లోనే ఉండిపోయాడు.
కొంతకాలానికే వ్యాపారి, ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడని కనిపెట్టాడు. అందుకే అతనికి కొద్దిగా చదవడం, రాయడం నేర్పించాడు. తర్వాత తన వ్యాపారంలో సహాయకుడిగా పెట్టుకున్నాడు. అక్కడ రకరకాల వస్తువులు అమ్మేవాడు.
ఆ దుకాణంలో ఫిడేల్, ఇంకా ఇతర సంగీత వాయిద్య పరికరాలు కూడా ఉండేవి. ఆ అబ్బాయి ఫిడేల్ వాయించడం నేర్చుకున్నాడు. కొద్దికాలానికే అతను దాన్ని ఎంతో అద్భుతంగా వాయించసాగాడు. చుట్టుపక్కల వాళ్లంతా అతని సంగీతం వినడానికి వచ్చేవారు.
అతని సంగీతం వినడానికి వచ్చిన వాళ్లు అక్కడి వస్తువులను కూడా బాగా కొనేవారు.
ఆ యువకుడు ఎగిరి వెళ్లిన నగరం ఆ దేశ రాజధాని. ఒకసారి ఆ దేశ మహారాజు ఒక నృత్య కార్యక్రమం, విందు ఏర్పాటు చేయాలనుకున్నాడు. మంచి సంగీతకారుడు ఎవరైనా ఉన్నాడా అని తమ మంత్రులను వాకబు చేసాడు.
అప్పుడు ఆ పట్టణంలోని ఒక వ్యాపారి దగ్గర మంచి సంగీతకారుడు ఉన్నాడని రాజుకు తెలిసింది.
రాజు వెంటనే ఆ యువకుడిని తీసుకురమ్మని సేవకుడిని పంపించాడు.
సేవకుడితో కలిసి యువకుడు రాజభవనానికి బయలుదేరాడు. వాళ్లు రాజభవనం దగ్గరకి చేరుకునేసరికి, యువకుడి కంటికి ఆరు అంతస్తుల ఎత్తైన ఒక గోపురం కనిపించింది.
అతను సేవకుడిని“అదేంటి? అందులో ఎవరు ఉంటారు?”అని అడిగాడు.
సేవకుడు“గోపురం పైభాగంలో యువరాణి ఉంటుంది.” అని జవాబిచ్చాడు.
“ఆమె అక్కడ ఎందుకు ఉంటుంది?” అని కుతూహలంగా అడిగాడు.
“చూడు సామీ, ఆమె పుట్టినప్పుడు ప్రసవం చేసిన మంత్రసాని, ‘ఈ అమ్మాయి పెద్దయ్యాక కొంటెగా, చిలిపి పనులు, ఒఠ్ఠి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటుంది” అని చెప్పిందిట. ఆ మాట విన్న రాజు, ఆమె ఏదైనా తప్పు పని చేస్తుందేమోనని భయపడ్డాడు. అందుకే ఈ గోపురాన్ని కట్టించి, గత పన్నెండేళ్ళుగా ఆమెను ఆ గోపురంలోనే బంధించి ఉంచాడు” అన్నాడు ఆ సేవకుడు.
అయితే ఎవరూ ఆమె ఉండే గదిలోకి వెళ్లరా? – అని అడిగాడు ఆ యువకుడు.
“ఆమెకు తిండి తీసుకెళ్లడానికి, ఆమె తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నేర్పడానికి ఒక ముసలావిడ మాత్రమే ఉంటుంది. ఆ ముసలావిడ ఎవరినైనా లోపలికి రానిస్తుందేమోనని గోపురం చుట్టూ కాపలాదారులను కూడా పెట్టాడు రాజు” అన్నాడు ఆ సేవకుడు.
యువకుడు ఇవన్నీ విని మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ సేవకుడు చెప్పిన ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు.
అతను రాజభవనానికి వెళ్లి రాత్రంతా ఫిడేల్ వాయించాడు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగివెళ్లాడు. కానీ, దారి అంతా అతని మనసు మనసులో లేదు. ఆమెను ఎలా కలవాలి? ఆమె దగ్గరకు ఎలా చేరుకోవాలి? ఇవే ఆలోచనలు అతని మనసంతా!
మరుసటి రోజు సాయంత్రం అతను తనను ఇక్కడికి తీసుకొచ్చిన, ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరిగే ఆ పావురాన్ని బయటికి తీసి తాళం తిప్పాడు.
అతను గోపురం చుట్టూ తిరుగుతూ కిటికీలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాడు. చివరికి ఒక కిటికీ తెరిచి ఉండటం గమనించి అందులో నుండి లోపల ఏం జరుగుతుందో తొంగిచూసాడు.
అంతలో పక్క గదిలో నుండి ఉదయపు మంచులో తడిసిన పువ్వులాంటి ఒక అందమైన యువతి వచ్చింది. ఆమె కాసేపు గదిలో అటూ ఇటూ తిరిగి, మళ్లీ వెళ్లిపోయింది.
యువకుడు తన చేతి గ్లౌవ్ ఒకటి కిటికీలోంచి లోపలికి విసిరి, అక్కడి నుంచి ఎగిరిపోయాడు.
మరుసటి రోజు సాయంత్రం అతను మళ్లీ అక్కడికి వచ్చాడు. కిటికీ ఇంకా తెరిచే ఉంది.
అతను లోపలికి వెళ్లి, గదిలోని బల్లపై ఉన్న ఒక సీసాలో నుంచి కొద్దిగా వైన్ తాగాడు. ఒక బిస్కెట్ కూడా తిన్నాడు.
అప్పుడు అతను “నాకు లోపలికి వెళ్లాలని ఉంది. కానీ నన్ను చూసిన వెంటనే ఆమె భయపడి కేకలు వేస్తే ఏం చేయాలి?” అని అనుకున్నాడు.
అంతలో తలుపు తెరుచుకుని ఆ అందమైన యువతి లోపలికి వచ్చింది.
అతన్ని చూడగానే ఆమె భయంతో పెద్దగా కేకలు వెయ్యబోయింది. ఎందుకంటే తన జీవితంలో అప్పటివరకు ఆమె ఒక్క మగవాడిని కూడా చూడలేదు మరి!
అతను వెంటనే ఆమెతో “ఉష్ ఉష్.. అరవకు. నేను నీకు ఏ హానీ చేయను. నేనూ నీలాగ ఒక మనిషినే. భయపడకు” అన్నాడు.
అయినా ఆమె చాలా భయపడి అతని దగ్గరకు రావడానికి కూడా సాహసించలేదు.

అప్పుడు ఆ యువకుడు తన తండ్రి అయిన రాజు గురించి, తన రాజ్యం గురించి అన్నీ ఆమెకు వివరంగా చెప్పాడు. తానూ ఒక యువరాజునని చెప్పాడు. తన రాజ్యం ఎక్కడుందో కూడా చెప్పాడు.
తర్వాత ఆమెతో “నా గురించి ఆ ముసలావిడకు మాత్రం ఏమీ చెప్పకు. ఆమె పెద్దగా కేకలు వేస్తుంది. వాళ్లు నన్ను పట్టుకుని చంపేస్తారు!” అన్నాడు.
చివరికి యువరాణి అతన్ని నమ్మి, వచ్చి అతని పక్కనే కూర్చుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ అటూ ఇటూ నడుస్తూ ఊసులాడుకున్నారు.
ఆమెకు మాత్రం ఒక విషయం అర్థం కావడం లేదు — తాను అమ్మాయి అయితే, అతను మగవాడిగా ఎలా?
అప్పుడు ఆ యువకుడు ఆడ-మగల మధ్య తేడా ఏమిటో ఆమెకు వివరంగా చెప్పాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ సరదాగా గడిపారు.
యువకుడితో అలా ఉల్లాసంగా గడపటం యువరాణికి ఎంతో నచ్చింది. ఎప్పటికీ తనతోనే ఉండిపొమ్మని అతన్ని ప్రాధేయపడింది.
అయితే అతను అది సాధ్యం కాదని చెప్పాడు. రాజుకు తాను ఆమె గోపురంలో ఉన్న విషయం తెలిస్తే, వాళ్లిద్దరినీ చంపేస్తాడని హెచ్చరించాడు.
అయినా ఆమెకు ధైర్యం చెబుతూ“నేను ప్రతి రాత్రీ నీ దగ్గరకు ఎగిరి వస్తాను. కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా మనిద్దరం జాగ్రత్తపడాలి” అన్నాడు.
కొద్దిసేపటి తర్వాత అతను తన పావురం మీద ఎక్కి ఇంటికి ఎగిరిపోయాడు.
మరుసటి రోజు యువరాణి ముసలావిడతో తనకు కొంచెం ఎక్కువ ఆహారం, తాగడానికి కొంచెం ఎక్కువ పళ్ల రసాలు తీసుకురమ్మని చెప్పింది. ఎందుకంటే ఆ రాత్రి యువకుడు తనను చూడటానికి వస్తాడని ఆమెకు తెలుసు.
అలా కొంతకాలం వాళ్లిద్దరూ ప్రతి రాత్రీ కలుసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ, ప్రేమగా కలిసి గడిపారు.
ఒకరోజు యువరాణిని చూసుకోవడానికి వచ్చిన ముసలావిడ, ఆమె గర్భవతిగా ఉందని గమనించి వెంటనే ఆ వార్త మహారాజుకు చేరవేసింది.
అది విన్న రాజుకు కోపం తారస్థాయికి చేరింది. ముసలామె మీద మండిపడ్డాడు.
“ఒసేయ్ ముసలిదానా! నువ్వే ఎవరినో లోపలికి రానిచ్చావు. లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది? నిన్నేం చేస్తానో చూడు. ఇక్కడికిక్కడే నిన్ను ఉరితీయిస్తాను!” అని మహారాజు ఆమెపై కారాలు మిరియాలు నూరాడు.
రాజు తన కూతురిని పరీక్షించడానికి వైద్యుడిని పిలిపించాడు.
వైద్యుడు పరీక్షించి“అవును, మహారాజా! యువరాణి గర్భవతి” అని చెప్పాడు.
వెంటనే రాజు మంత్రులందరినీ సమావేశపరిచి “మంత్రులారా! ఇది ఎలా జరిగి ఉండవచ్చు? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. తలుపులు తెరుచుకుని ఎవ్వరూ లోపలకి వెళ్ళే ఆస్కారం లేదు. ఎవరైనా లోపలకి వెళ్తే పక్షిలా ఎగురుకుంటూ కిటికీ గుండా లోపలికి వెళ్ళాల్సిందే!” అన్నాడు.
“మహారాజా! కిటికీలన్నింటికీ తారు పూయించండి. అప్పుడు దోషిని సునాయాసంగా పట్టుకోవచ్చు” అని మంత్రులందరూ మూకుమ్మడిగా సలహా ఇచ్చారు.
“సరే” అని రాజు తల పంకించాడు.
మంత్రులు చెప్పినట్టే రాజు కిటికీలన్నిటికీ తారు పూయించాడు. కానీ యువకుడు రాత్రిళ్లు వచ్చినప్పుడు కిటికీ మీద ఎప్పుడూ దిగేవాడు కాదు. కిటికీ గుండా పోయి తిన్నగా గదిలోనే దిగేవాడు.
మరుసటి రోజు రాజు పట్టణంలోని మగవాళ్లందరి చేతులు, కాళ్లు పరిశీలించి, ఎవరికైనా తారు మరకలు ఉన్నాయేమో చూడమని ఆదేశించాడు.
యువరాణిని కూడా అక్కడికి తీసుకొచ్చి, గోపురంలో తనతో ఉన్న వ్యక్తిని గుర్తించమని చెప్పారు.
ఆమె అందరినీ చూసి “ఇక్కడున్న వాళ్లలో ఎవ్వరూ కాదు!” అంది.
“నువ్వు అబద్ధం చెబుతున్నావు, పనికిమాలినదానా! అయినా నిన్ను ఉరితీయిస్తాను,” అన్నాడు రాజు.
అప్పుడు యువరాణి “ఎలాగూ మనం చావాల్సిందే కదా! అయితే ఇద్దరం కలిసే చావడం మంచిది” అనుకుని ఆ యువకుడి దగ్గరకు వెళ్లి అతని చెయ్యి పట్టుకుని అందరి ముందుకు తీసుకొచ్చింది.
అప్పుడు రాజు వాళ్లిద్దరినీ ఉరితీయమని తీర్పు చెప్పాడు.
అప్పుడు యువకుడు “ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. కానీ నాకు ఒక్క ఆఖరి కోరిక ఉంది. నేను ఈ ప్రపంచానికి, అలాగే ఆమెకు వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాను. ఆమె కూడా తన తండ్రికి, తల్లికి వీడ్కోలు చెప్పాలనుకుంటుంది.” అన్నాడు.
రాజు వాళ్లిద్దరికీ వీడ్కోలు చెప్పుకోవడానికి అనుమతి ఇచ్చాడు.
యువకుడు యువరాణి దగ్గరకు వెళ్లి ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకోబోతున్నట్టుగా నటించాడు. అదను చూసుకుని తన పావురం తాళం తిప్పాడు.

అంతే! అందరూ చూస్తూండగానే వాళ్లిద్దరూ కలిసి పైకి ఎగిరిపోయారు.
అది చూసిన జనమంతా పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టారు. వాళ్ల అరుపులు-కేకలు రాజ్యం అంతటా ప్రతిధ్వనించాయి.
“వాళ్లను పట్టుకోండి! ఆపండి!” అని అందరూ కేకలు వేశారు.
యువకుడు రాజును ఉద్దేశించి దురుసుగా ఏదో అనకూడని మాట అన్నాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఎవ్వరి కళ్లకు కనిపించకుండా దూరంగా ఎగిరి అటుపై మాయమైపోయారు.
వాళ్ళు చాలాసేపు అలా ఎగురుతూనే ఉన్నారు. అకస్మాత్తుగా యువరాణి “నాకు ఒంట్లో నలతగా ఉంది. దయచేసి ఆపండి” అంది.
యువకుడు కిందికి దిగాడు. చుట్టూ చూసేసరికి వాళ్లిద్దరూ ఒక అడవిలో ఉన్నారు.
యువరాణి “అయ్యో, ప్రాణేశ్వర! నాకు ప్రసవం అయ్యేలా ఉంది. మన బిడ్డ పుట్టే సమయం ఆసన్నమయింది!” అంది.
యువకుడు తనకు చేతనైనంతవరకు ఆమెను నేలమీద సౌకర్యంగా పడుకోబెట్టి, మంట వెలిగించాడు.
ఆ తర్వాత తన పావురం మీద ఎక్కి, యువరాణిని చూసుకునే ఆ ముసలావిడను వెతకడానికి ఎగిరిపోయాడు.
చివరికి ఆమెను కనుగొని పావురం మీదకి ఎక్కించుకుని అక్కడి నుంచి తుర్రుమన్నాడు.
ముసలావిడ భయంతో గగ్గోలు పెట్టింది. తనను దెయ్యం ఎత్తుకుపోతోందనుకుని ముందు చాలా భయపడిపోయింది.
వాళ్లు అడవికి చేరేసరికి యువరాణి అప్పటికే బిడ్డను కంటోంది.
వాళ్లు ఆ అడవిలో మూడు రోజులు ఉన్నారు. ఆ తర్వాత యువకుడు ముసలావిడను తిరిగి ఆమె ఇంటికి చేర్చాడు. తర్వాత యువరాణిని, బిడ్డను తీసుకురావడానికి మళ్లీ అడవికి వచ్చాడు.
వాళ్లు మళ్లీ పావురం ఎక్కి ఎగిరారు. ఈసారి అతని తండ్రి రాజ్యం వైపు బయలుదేరారు.
వాళ్లు కిందికి దిగగానే, చాలామంది అరుపులు, జనాల సందడి, డప్పుల మోత వినిపించాయి.
యువకుడు అక్కడున్న ఒక మనిషిని “ఏమైంది?” అని అడిగాడు.
ఆ మనిషి “అదే ఆ టర్నర్ ఉన్నాడుగా. అతన్ని ఉరితీయబోతున్నారు. పావురం ఆకారంలో అతను తయారు చేసిన బొమ్మే రాజు కొడుకును ఎత్తుకుపోయిందని అంటున్నారు” అని చెప్పాడు
యువకుడు వెంటనే “త్వరగా, త్వరగా! రాజుకు చెప్పండి—ఆయన కొడుకు ఇక్కడే ఉన్నాడని, నేను తిరిగి వచ్చానని చెప్పండి. టర్నర్‌ను మాత్రం ఉరితీయకూడదు. వెంటనే మహారాజుకు ఈ వార్త అందజెయ్యండి” అన్నాడు.
అదృష్టవశాత్తూ, సరైన సమయానికి మహారాజుకు కబురు అందింది. రాజు వెంటనే టర్నర్‌ను విడుదల చేశాడు.
యువకుడు రాజు దగ్గరకు వెళ్లి “నాన్నగారూ! నేను ఒక్కడినే రాలేదు. మీ కోడలు, మనవడు కూడా తోటలో ఉన్నారు” అన్నాడు.
మహారాజు వెంటనే కోడలిని, పసిపిల్లవాడితో సహా రాజభవనానికి తీసుకొచ్చాడు.
యువకుడు జరిగినదంతా మహారాజుకు వివరంగా చెప్పాడు. అంతా విన్న మహారాజు వాళ్లిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్ళి చేసాడు.

ఆ పెళ్లి చాలా ఘనంగా జరిగింది. చక్రవర్తులు, మహారాజులు, సామంతరాజులు మొదలు, ఈ కథ నాకు, వింటున్న మీకు, అందరికీ మంచి విందు ఏర్పాటు చేసారు.
అందరికీ తిన్నంత తిండి, తాగినంత వైన్.
కానీ ఏం ఉపయోగం…! నేను ఒక్క ముద్ద ముట్టలేకపోయాను, ఒక్క వైన్ చుక్క చప్పరించలేకపోయాను.
నేను ఏం తింటున్నా, తాగుతున్నా అంతా నా పొడవాటి గెడ్డంలోకే జారిపోతోందాయె!

శివ చల్లా
5 జూలై 1997న నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఫిసికో-ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎం.ఎస్.సి., డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఇంపైర్మెంట్లో స్పెషల్ బి.ఎడ్. పట్టాలను పొందారు.
గత పదేళ్లుగా గుజరాత్, హైదరాబాద్‌లలోని పలు పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ అధ్యాపకులుగా సేవలందించారు. ప్రస్తుతం ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు.కొత్త ప్రదేశాలను సందర్శించడం, పుస్తక పఠనం, బేకింగ్, కొత్త విషయాలను నేర్చుకోవడం వీరి అభిరుచులు.
నివాసం: హైదరాబాద్, మొబైల్: 9574696282, ఇ-మెయిల్: challashiva4232@gmail.com
