అనగనగా సమారా అనే నగరంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి తనకంటూ సొంత పొలం కూడా లేదు.
మనిషి ఆరోగ్యవంతుడు. కష్టపడే తత్వం. ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు.
కాయకష్టం చేయడం వల్ల అతని అరచేతులు గరుకెక్కిపోయి, కాయలు కాసాయి.
ఎంత కష్టపడ్డా, రెండు పూటలా కడుపు నిండా తిండికి కూడా వెతుకులాటగానే ఉండేది.
ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. ఆ గుడిసె ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టుగా ఉండేది.

అతని భార్య ఇంటిని ఉన్నదాంట్లోనే ఎలాగో గుట్టుగా నెట్టుకొస్తూ ఉండేది.
చిన్న పిల్లలు. ఈ పరిస్థితులన్నీ వాళ్లకేం అర్థమవుతాయి? ఎప్పుడూ ఆకలో అని ఏడుస్తూ ఉండేవారు.
ఆ రైతుకు ఏం దిక్కుతోచేది కాదు.
అప్పుడప్పుడు జీవితం మీద విరక్తితో ఉరేసుకునో లేదా ఏ నదిలో అయినా దూకి చావాలి అని ఆలోచనలు కూడా వస్తూ ఉండేవి ఆ రైతుకి.
భవిష్యత్తు మీద చిన్న ఆశ కూడా కనిపించట్లేదు.
పేద రైతు జీవితం అంటే అంతే కదా!
జీవితాంతం వేరేవాళ్ళ కోసం కష్టపడటమే ….
అరచేతులు కాయలు కాసేలా కష్టపడాలి.
అయినా పట్టెడు అన్నం కోసం ఎప్పుడూ తిప్పలే!
ఒక రోజు ఆ రైతు సత్యం కోసం వెతకాలని నడుంబిగించాడు.
ఈ లోకంలో కష్టపడి పనిచేసే మనుషులు, ఆకలి, కష్టం, పేదరికం లేకుండా ఎలా బతకాలో నిజం తెలుసుకోవాలని బయలుదేరాడు.
ముందుగా రాజు దగ్గరకు వెళ్లాడు.

“ప్రజల జీవితాల్లో న్యాయం నెలకొల్పండి. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి, సుఖంగా బతికేలా పాలించండి,” అని వేడుకున్నాడు.
రాజు ఒకసారి అతని వైపు చూసి ….
ఏమీ జవాబు చెప్పకుండా ఆ పేద రైతుని సైన్యంలోకి పంపించాడు.
అంతే, ఆ రైతు సైనికుడయ్యాడు.
తర్వాత యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు.
చాలా సంవత్సరాలు సైన్యంలోనే పనిచేసాడు.
ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు …. గాయపడ్డాడు.
చివరకు తిరిగి ఇంటికి వచ్చాడు.
కానీ…
కుటుంబ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఇదంతా చూసి అతడి కడుపు తరుక్కుపోయింది.
ఆకలి…
పేదరికం…
బాధ…
ఇంకా పెరిగిపోయాయి.
అతను తల గోక్కుంటూ “రాజు చెప్పే న్యాయం ఇదేనా? అతని పాలన ఇదేనా?”…….. అనుకున్నాడు.
అప్పుడు అతను భూస్వామి దగ్గరకు వెళ్లి న్యాయం వెతకాలనుకున్నాడు.
టోపీ తీసి సగౌరవంగా నిలబడి – “నాకు పని ఇప్పించండి. నాకు, నా కుటుంబానికి కడుపునిండా తిండి దొరికేలా ఉపాధి కల్పించండి” అని అడిగాడు.
భూస్వామి ఎగతాళిగా చూసి, అతన్ని తన పొలాల్లో పని చేయడానికి కుదుర్చుకున్నాడు.
పేద రైతు ఏడాదికి పైగా అతని దగ్గర కూలిపని చేశాడు.
తర్వాత ఒక రోజు కూలి డబ్బులు అడగడానికి వెళ్లాడు.
కానీ…
భూస్వామి డబ్బు ఇవ్వలేదు.
పైగా అతన్ని గుర్రాలశాలకు ఈడ్చుకుపొమ్మని పనివాళ్లకు ఆజ్ఞాపించాడు.

అక్కడ అతనికి వంద కొరడా దెబ్బలు కొట్టించి… బయటకు గెంటేసారు.
పేద రైతు ఇంటికి తిరిగి వచ్చాడు.
ఇంట్లో పరిస్థితి మరింత దిగజారిపోయింది.
కష్టాలు, బాధలు మరీ ఎక్కువయిపోయాయి.
అతను మళ్లీ తల గోక్కుంటూ “భూస్వామి న్యాయం ఇదేనా?” అనుకున్నాడు.
ఆ తర్వాత అతను ఒక ధనిక రైతు – కులాక్ ఇంటికి వెళ్లాడు.
కులాక్ అంటే, పేద రైతులను దోచుకుని సంపన్నుడైన రైతు అన్నమాట!
తనకి ఏదైనా పని ఇప్పించమని అడిగాడు.
“నాకు, నా కుటుంబానికి ఉపాధి కల్పించండి” అని అతన్ని వేడుకున్నాడు.
ఆ ధనిక రైతు, పేద రైతు వైపు నిర్లక్ష్యంగా చూసి, ఒక పని ఇచ్చాడు.
“ప్రతి మూడు నెలలకు ఒకసారి కూలి ఇస్తాను” అన్నాడు.
పేద రైతు మూడు నెలలకు మించి కష్టపడి పనిచేశాడు.
ఆ తర్వాత తన కూలి డబ్బుల కోసం వెళ్లాడు.
కానీ …. ఆ కులాక్ మాట తప్పాడు.
తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోగా, వెటకారంగా నవ్వి, ఆ పేద రైతుని మెడపట్టి బయటకు గెంటేశాడు.
పేద రైతు మళ్లీ ఇంటికి వచ్చాడు.
ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూసి ఆ పేద రైతు గుండె బద్దలయింది.
“అంటే… ఈ దోపిడీ ధనిక రైతు న్యాయం ఇదే అన్నమాట” అని అనుకున్నాడు.
ఆ తర్వాత అతను సత్యం కోసం ఒక పాస్టరు ఇంటికి వెళ్లాడు.
“నా లాంటి పేదవాడిని ఆకలి, పేదరికం నుంచి బయటపడేలా సహాయం చేయండి,” అని అడిగాడు.
పాస్టరు అతని వైపు దయగా చూసి,
“చర్చిలో ప్రజలందరితో కలిసి ప్రార్థన చేయించు. దేవుడు నీకు మంచి జీవితం ప్రసాదించాలని ప్రార్థించు,” అన్నాడు.
అంతేకాదు,
ఆ ప్రార్థనకు బదులుగా తన పొలంలో ఆరు రోజులు పని చేయాలని కూడా ఆదేశించాడు.

ఇష్టం లేకపోయినా…
పేద రైతు ఒప్పుకున్నాడు.
చర్చిలో ప్రార్థనలు చేయించాడు.
దానికి ప్రతిఫలంగా పాస్టరు పొలంలో ఆరు రోజులు కష్టపడి పనిచేశాడు.
అయినా…
అతని జీవితంలో ఎలాంటి మార్పూ రాలేదు.
పైగా…
ఇంటి పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయి.
ఆ ప్రార్థన వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది.
అప్పుడు పేద రైతు “అంటే… పాస్టరు చెప్పే న్యాయం, అతని ప్రార్థనలు కూడా ఇంతేనా” అనుకున్నాడు.
అలా ఆ పేద రైతు సత్యం కోసం ఎన్నో దారులు వెతికాడు … ఎంతో అన్వేషించాడు.
ఎక్కడెక్కడికో వెళ్ళాడు …. ఎవరెవరినో కలిసాడు.
కానీ…
సత్యాన్ని మాత్రం కనుక్కోలేకపోయాడు.
చివరికి, ఒకరోజు దారిలో ఓ వ్యక్తి ఎదురయ్యాడు. అతని కళ్ళల్లో నిజాయితీ తొణికిసలాడుతోంది.
అతను పేద రైతును చూసి,
“ఎక్కడెక్కడికి వెళ్లావు? ఏం వెతుకుతున్నావు?” అని అడిగాడు.
అప్పుడు ఆ పేద రైతు తన కథంతా అతనికి చెప్పుకొచ్చాడు.

రాజు దగ్గరకు వెళ్లిన సంగతి…
భూస్వామి దగ్గరకు వెళ్లిన సంగతి…
ధనిక రైతు దగ్గరకు వెళ్లిన సంగతి…
పాస్టరు దగ్గరకు వెళ్లిన సంగతి…
అన్నీ వివరంగా చెప్పాడు.
కానీ…
వాళ్లందరి దగ్గర తనకు ఎగతాళి, అవమానం తప్ప మరేం దొరకలేదని చెప్పుకుని వాపోయాడు.
అంతా విన్న ఆ వ్యక్తి –
“నువ్వు దృఢంగా ఉన్నావు.
ఒళ్ళొంచి కష్టపడే తత్వం నీది.
కానీ సత్యం లేని చోట, సత్యం కోసం వెతుకుతున్నావు.
అది అక్కడ ఎన్నటికీ దొరకదు.
నిజంగా సత్యం కావాలంటే…
నీకు, నీ కుటుంబానికి మంచి జీవితం కావాలంటే…
కార్మికుల దగ్గరకు వెళ్లు.
వాళ్లతో కలిసి మీ రాజులను…
మీ భూస్వాములను…
మీ ధనిక రైతులను…
మీ పాస్టర్లను ఎదిరించండి.
మీ రైతులు, కార్మికులు కలిసి పోరాడితే…
సత్యం దానంతట అదే దొరుకుతుంది …. దొరికి తీరుతుంది.
అప్పుడే కష్టపడి పనిచేసే ప్రజలందరికీ మంచి జీవితం వస్తుంది” – అని హితభోద చేశాడు.
అది విన్న పేద రైతుకు కొంత ధైర్యం వచ్చింది.
“అయితే…
మన నిజమైన సత్యం అక్కడే ఉందన్నమాట.
కష్టపడి పనిచేసే ప్రజలందరికీ మంచి జీవితం రావాలంటే…
మనం వెళ్లాల్సిన దారి అదే” అని మనసులో అనుకున్నాడు.
ఆ తర్వాత ఆ పేద రైతు ఒక కార్మికుడి దగ్గరకు వెళ్లాడు.
ఇద్దరూ కలిసి
రాజును సింహాసనం నుంచి కిందకి దించారు.
భూస్వాములను…
ధనిక రైతులను…
పెట్టుబడిదారులను…
అధికారులను…
పాస్టర్లను …
అందరినీ అక్కడి నుంచి తరిమేశారు.
ఆ తర్వాత వాళ్లు తమ సొంత సోవియట్ పాలన ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పుడు వాళ్లు తమ దేశంలో కమ్యూనిజాన్ని నిర్మిస్తున్నారు.
అక్కడ జీవితం ఎంతో అందంగా మారింది.
కష్టపడి పనిచేసే ప్రజలందరూ…
ఒక్కటై –
సంతోషంగా జీవిస్తున్నారు.
శ్రామిక శక్తికి ఎదురు లేదు.
శ్రామిక శక్తి వర్ధిల్లాలి!!!


శివ చల్లా
5 జూలై 1997న నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఫిసికో-ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎం.ఎస్.సి., డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఇంపైర్‌మెంట్‌లో స్పెషల్ బి.ఎడ్. పట్టాలను పొందారు.
గత పదేళ్లుగా గుజరాత్, హైదరాబాద్‌లలోని పలు పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ అధ్యాపకులుగా సేవలందించారు. ప్రస్తుతం ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు.కొత్త ప్రదేశాలను సందర్శించడం, పుస్తక పఠనం, బేకింగ్, కొత్త విషయాలను నేర్చుకోవడం వీరి అభిరుచులు.
నివాసం: హైదరాబాద్, మొబైల్: 9574696282, ఇ-మెయిల్: challashiva4232@gmail.com
