తెల్ల గులాబీ

Spread the love

అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు. అతనికి ముగ్గురు అందమైన కూతుళ్ళు. అతడు ఆ ముగ్గురినీ ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవాడు.

ఒకరోజు అతడు సంతకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, ముగ్గురు కుమార్తెలూ గారాలు పోతూ నాన్నకి తమతమ కోరికలు తెలియజేసారు.

“నాన్నా! నాకు ఒక అందమైన హారం కావాలి” అంది పెద్ద కూతురు.

“నాకు బంగారు ఉంగరం కావాలి” అంది రెండో కూతురు.

చిన్న కూతురు మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది.

“ఏమ్మా! నీకు ఏం కావాలి?” అని తండ్రి ఎంతో ఆప్యాయంగా అడిగాడు.

ఆమె చిరునవ్వుతో – “నాన్నా… నాకు ఒక తెల్ల గులాబీ పువ్వు కావాలి” అంది.

“అలాగే చిట్టి తల్లీ” అంటూ తండ్రి సంతకు బయలుదేరాడు.

అక్కడ తన పనులన్నీ పూర్తి చేసుకుని పెద్ద కూతురు కోసం అందమైన హారం, రెండో కూతురు కోసం ఉంగరం కొన్నాడు. కానీ, సంత మొత్తం తిరిగినా ఎక్కడా చిన్న కూతురు అడిగిన తెల్ల గులాబీ మాత్రం కనిపించలేదు.

దాంతో నిరాశ చెందిన ఆ ధనవంతుడు దిగులు ముఖంతో ఇంటి దారి పట్టాడు.

ఇంతలో ఒక ముసలామె ఆ ధనవంతుణ్ణి పలకరిస్తూ –  “ఏమయ్యా పటేలా! ఎందుకు అంత దిగులుగా ఉన్నావు?” అని అడిగింది.

అతడు నిట్టూర్చి “నా చిన్న కూతురు ఒక్క తెల్ల గులాబీ పువ్వు అడిగింది. కానీ సంత మొత్తం వెతికినా అది ఎక్కడా దొరకలేదు” అన్నాడు.

దానికి ముసలామె నవ్వుతూ – “అయ్యో, ఇంత చిన్న దానికే అంత దిగులు పడిపోతావా? నువ్వెక్కడ పెద్దమనిషివి నాయనా! నేను ఇప్పిస్తాను నీకు తెల్ల గులాబీ. నాతో రా.” అంది.

ధనవంతుడు సంతోషంగా ఆ ముసలామె వెనకాలే కొద్ది దూరం నడిచేసరికి అక్కడ ఒక పెద్ద ఇనప గేటు కనిపించింది.  

అక్కడకి చేరుకోగానే ఆ ముసలామె మాయమయిపోయింది.

అతడు ఆశ్చర్యపోయేలోపే, ఆ గేటు, అతని చేతిలోని కొరడాను లాక్కుని, నెమ్మదిగా దానంతట అదే తెరుచుకుంది.

అతడు లోపలికి అడుగుపెట్టాడు.

మరి కొంత దూరం వెళ్లగానే మరో గేటు ఎదురైంది.

అది అతని తలపై ఉన్న టోపీని తీసుకుని, వెంటనే తెరుచుకుంది.

మూడో గేటు దాటగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

కళ్ళ ముందు అతడు జీవితంలో ఎన్నడూ చూడనంత అద్భుతమైన పూలతోట.

ఆ తోట మధ్యలో మంచులా స్వచ్ఛంగా వికసించిన తెల్ల గులాబీలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి.

“అహా! ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి! వీటిలో ఒక్కటి తీసుకెళ్లినా చాలు, నా చిన్నారి సంబరపడిపోతుందో!” అనుకున్నాడు.

అతడు ఒక తెల్ల గులాబీ కోసుకోబోయేంతలో ఎవరో వెనక నుండి వచ్చి అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నారు.

ఎంత ప్రయత్నించినా ఆ పట్టు ఇంకా బిగుసుకుంటోంది.

వెనక్కి తిరిగి చూసిన ఆ ధనవంతుడు భయంతో బిగుసుకుపోయాడు.

ఎదురుగా ఒక భయంకరమైన రాక్షసుడు.

“నా చేతిని వదిలేయ్! లేదంటే నిన్ను చంపేస్తా!” అని ధనవంతుడు బెదిరించబోయాడు.

దానికి ఆ రాక్షసుడు ప్రశాంతంగా నవ్వుతూ – “నువ్వు ఎంత అరిచి గీపెట్టినా, ఏం లాభం లేదు. ఇక్కడ నిన్ను కాపాడేవాడు ఎవడూ లేదు. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు.” అన్నాడు.

“నువ్వెందుకు నన్ను ఇలా తగులుకున్నావు?” అన్నాడు ధనవంతుడు కోపంగా.

“కాస్త ప్రశాంతంగా ఉండు” అన్నాడు ఆ రాక్షసుడు.

“నువ్వు ఈ తెల్ల గులాబీని ఎవరి కోసం కోశావో… ఆ అమ్మాయి రేపు ఇక్కడికి వస్తుందని నాకు ప్రమాణం చెయ్యి. లేదంటే నిన్ను ఇక్కడి నుంచి వెళ్లనివ్వను. అంతేకాదు, మాటతప్పితే ఆ అమ్మాయి మూడు రోజుల్లో చనిపోతుంది.”

ఆ మాటలు వింటూనే బెంబేలెత్తిపోయిన ధనవంతుడు “ఆమె రేపు కచ్చితంగా ఇక్కడికి వస్తుంది” అని ప్రమాణం చేసాడు.

రాక్షసుడు అతని చేతిని విడిచిపెట్టాడు.

ధనవంతుడు బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు.

పెద్ద కూతురుకు హారం, రెండో కూతురుకు ఉంగరం, చిన్న కూతురుకు తెల్ల గులాబీ ఇచ్చాడు.

ఆ గులాబీని చూసి చిన్నారి ఎంత సంతోషపడిందో, ఆమె తండ్రి అంతకు పది రెట్లు దిగులు పడ్డాడు.

తన ప్రాణానికి ప్రాణమైన చిన్న కూతురును రాక్షసుడికి అప్పగించాలన్న ఆలోచనే అతణ్ణి కలవరపెడుతోంది.

“నాన్నా, మీరు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారు?” అని ముగ్గురు కూతుళ్ళూ ఆందోళనగా అడిగారు.

దానికి ఆ ధనవంతుడు గుండె దిటవు చేసుకుని “దిగులు కాకపోతే మరేంటి? …. ఈ పువ్వు ఎవరికోసం కోసామో ఆ అమ్మాయిని రేపు తన దగ్గరకి పంపిస్తాను అని ఒక రాక్షసుడికి ప్రమాణం చేసి వచ్చాను” అన్నాడు జీరబోయిన గొంతుతో.

దానికి చిన్న కూతురు ధైర్యంగా “నాన్నా, మీరు ఏం బెంగపెట్టుకోవద్దు. నేను రేపే అక్కడికి వెళ్తాను” అంది.

మరుసటి రోజు ఉదయం తండ్రి తన చిన్న కూతురుని తీసుకుని ఆ భయంకరమైన రాక్షసుడి దగ్గరకు వెళ్లాడు.

వీళ్ళు అక్కడకి చేరుకోగానే గేటు దానంతట అదే తెరుచుకుంది.

చిన్న కూతురు లోపలికి అడుగుపెట్టింది. తండ్రి లోపలకి వెళ్ళబోయేలోపు గేటు దానంతట అదే మూసుకుపోయింది. అంతే …. ఆ ధనవంతుడు బయటే ఉండిపోయాడు.

ఆమెకు ఎక్కడా గులాబీ పూలతోట ఆనవాళ్ళు కనిపించలేదు.

దానికి బదులుగా, అద్భుతంగా అలంకరించబడిన ఒక విశాలమైన గదికి దారితీసే మెట్లు కనిపించాయి.

ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. దానిపై ఎన్నో రకరకాల వంటకాలు నోరూరిస్తున్నాయి.

చాలా ఆకలిగా ఉన్నా, ఆమె వాటివైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.

నిశ్శబ్దంగా ఒక కుర్చీలో కూర్చొంది.

కొద్దిసేపటికి ఆమె దగ్గరకు ఒక ముసలివాడు వచ్చాడు.

పొడవాటి గడ్డం, వంకర ముక్కుతో అతని రూపం అందవికారంగా ఉంది. అతన్ని ఒక్కసారి చూసి ముఖం పక్కకి తిప్పేసుకుంది.

అతడు ఆమె దగ్గరకు వచ్చి మృదువుగా “అమ్మాయీ… నువ్వు నన్ను ప్రేమిస్తావా?” అని అడిగాడు.

దానికి ఆమె “లేదు… నేను మిమ్మల్ని ప్రేమించలేను,” అంది.

ఆ మాటలకి ముసలివాడు నిరాశతో తలదించుకుని వెళ్లిపోయాడు.

మరుసటి రోజు రాత్రి అతడు మళ్లీ వచ్చాడు.

ఈసారి అతని ముఖంలో మరింత విషాదం.

మళ్లీ – “అమ్మాయీ! నువ్వు నన్ను ప్రేమిస్తావా?” అని అడిగాడు.

ఈసారి కూడా ఆమె “లేదు” అని కటువుగా సమాధానమిచ్చింది.

ఆ మాట వినగానే అతని పొడవాటి గడ్డంపై నుంచి ఒక కన్నీటి బొట్టు జారింది.

అతడు నిశ్శబ్దంగా బయటకు వెళ్లిపోయాడు.

మూడోరోజు రాత్రి కూడా అతడు వచ్చి గుమ్మం దగ్గరే నిలబడి, బాధతో “ఓ అందమైన యువతీ… దయచేసి నన్ను ప్రేమించు” అని వణుకుతున్న స్వరంలో వేడుకున్నాడు.

ఆమె మౌనంగా అతని వైపు చూస్తూ నిలబడింది.

అతడు ఆశతో ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు.

అతని గడ్డం మీదుగా కన్నీళ్లు ధారగా కారుతున్నాయి.

చివరికి ఆ యువతి మెల్లగా “నేను… మిమ్మల్ని ప్రేమిస్తాను” అంది.

మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది.

ఆ ముసలివాడు ఒక్కసారిగా తెల్లని పావురంగా మారిపోయాడు.

ఆ పావురం ఎగురుతూ వచ్చి ఆమె భుజంపై వాలింది.

అది మనుషుల్లాగే మాట్లాడుతూ – “నువ్వు నన్ను ప్రేమించినందుకు చాలా సంతోషంగా ఉంది. నీకు జన్మజన్మలకు ఋణపడి ఉంటాను” అంది.

ఆ పావురం ఎంతో సరదాగా మాట్లాడేది.

దానితో గడిపిన ప్రతి క్షణం ఆమెకు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయేది.

ఒకరోజు ఆమె మెల్లగా”నాకు మా నాన్నను, అక్కలను చూడాలని ఉంది. ఒకసారి వెళ్లి రావచ్చా?”

అని  అడిగింది.

పావురం కొద్దిసేపు ఆలోచించి – “హాయిగా వెళ్ళిరావొచ్చు. కానీ సూర్యాస్తమయానికి ముందు తిరిగి రావాలి. ఆలస్యం చేస్తే నాకు అపాయం” అని చెప్పి ఒక పువ్వును ఆమె చేతిలో పెట్టింది.

“నువ్వు తిరిగి వచ్చేలోపు ఈ పువ్వు వాడిపోతే నేను చనిపోయినట్టు లెక్క” అంది.

ఆమె ధైర్యంగా తల ఊపింది.

“సూర్యాస్తమయానికి ముందే తిరిగి వచ్చేస్తాను” అని మాట ఇచ్చింది.

అప్పుడు పావురం “ఒకవేళ నువ్వు తిరిగి వచ్చేసరికి నేను చనిపోయి కనిపించినా భయపడకు. సూదితో నీ చిటికెన వేలి చివర గుచ్చుకుని చిన్న రక్తపు బొట్టు నా కుడి కంటి రెప్ప మీద వెయ్యి” అని చెప్పింది.

ఆ యువతి పావురాన్ని ప్రేమగా నిమిరి అది ఇచ్చిన పువ్వుతో సహా ఇంటికి చేరుకుంది.

చాలా రోజుల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చిన చెల్లెల్ని చూసి ఆమె అక్కలు, తండ్రి చాలా సంతోషించారు.

తమ బావ ఒక పావురమని తెలిసి వాళ్ళ అక్కలు మరీ ఆశ్చర్యపోయారు.

తండ్రితో, అక్కలతో ఆనందంగా గడిపిన తరువాత ఆమె తిరిగి వెళ్లడానికి లేచి నిలబడింది.

కానీ ఆమె అక్కలు ఆమెను వెళ్ళనివ్వలేదు.

“మరి కాసేపు ఉండొచ్చు కదా!” అని బ్రతిమలాడారు.

ఆరోజు ఆకాశం మేఘావృతమై ఉంది.

మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో సమయం ఎంత అయిందో కూడా తెలియలేదు.

తాను అప్పటికే బయలుదేరాల్సిన సమయం దాటిపోయిందన్న విషయం కూడా ఆమె గమనించలేదు.

సాయంత్రం చీకట్లు కమ్ముకున్నాక ఆమె తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది.

కొంతదూరం వెళ్లిన తర్వాత తన చేతిలోని పువ్వుకేసి చూసింది.

అది పూర్తిగా వాడిపోయింది.

ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది.

దారిలోని చెట్లు గాలికి ఊగుతూ “నువ్వు పావురాన్ని మోసం చేశావు… నీ కోసం ఎదురుచూస్తూ అది ప్రాణాలు విడిచింది…” అని గుసగుసలాడుతున్నట్లు అనిపించింది.

ఆకాశంలో ఎగురుతున్న పిచ్చుకలు ఆమె తలపై చక్కర్లు కొడుతూ “నువ్వు పావురాన్ని మోసం చేశావు… అది నీ కోసం ఎదురుచూస్తూ మరణించింది…” అని కిచకిచలాడాయి.

దారిపక్కన ప్రవహిస్తున్న చిన్న వాగు కూడా “అతడు చనిపోయాడు… చనిపోయాడు…”అని విషాదంగా గొణిగింది.

ఆ మాటలు విని ఆమె గుండె దడదడలాడింది.

ఆమె శక్తినంతా కూడదీసుకుని పరుగెత్తింది.

చివరకు రొప్పుతూ గదిలోకి అడుగుపెట్టింది.

ఇంతకుముందులా పావురం ఎగిరి వచ్చి ఆమె భుజంపై వాలలేదు.

కిటికీ అంచుపై అది కదలక-మెదలక నిశ్చలంగా పడి ఉంది.

ఆమె నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్లి, కన్నీళ్లతో “చివరి క్షణం వరకు నా కోసం కిటికీ దగ్గర ఎదురు చూస్తూ …. చివరికి ఇలా రాలిపోయావా!” అంది.

ఆమెకు వెంటనే పావురం చెప్పిన మాట గుర్తొచ్చింది.

వెంటనే ఒక సూది తీసుకుని తన చిటికెన వేలి మీద గుచ్చుకుంది.

చిన్న రక్తపు బొట్టు జారి పావురం కుడి కంటి రెప్ప మీద పడింది.

అంతే! చూస్తూండగానే ఒక గొప్ప అద్భుతం జరిగింది.

ఆ పావురం మాయమై ఆమె ఎదుట ఒక అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు.

అతడు బలంగా, ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తున్న ఉన్న ఒక యువ కోసాక్ (cossack) వీరుడు.

అతడు ఆమెను ప్రేమగా కౌగిలించుకుని “ఒక దుష్ట మాంత్రికురాలి శాపం నుండి నాకు శాప విమోచనం కలిగించావు. అంతే కాదు, నా ప్రాణాలను కూడా కాపాడావు” అన్నాడు.

ఆ యువకుడు “నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని ఆడగగానే ఆ యువతి సిగ్గుల మొగ్గ అయ్యి సంతోషంగా అతని చేతిలో చెయ్యి వేసి చిరునవ్వుతో “ముందు మా నాన్న దగ్గరకు వెళ్దాం. ఆయన ఆశీర్వాదంతో మన పెళ్లి జరగాలి” అంది.

ఇద్దరూ కలిసి ఆమె ఇంటికి వెళ్లారు.

వారిని చూసి ఆమె తండ్రి, అక్కలు ఆనందంతో కేరింతలు కొట్టారు.

ఆ తర్వాత ఒక శుభ ముహూర్తాన మంగళ వాయిద్యాల మధ్య అట్టహాసంగా వారి వివాహం జరిగిపోయింది.

అంతటి గొప్ప పెళ్లి వేడుక మునుపెన్నడూ చూడలేదని ఆ ఊరి ప్రజలు చాలా ఏళ్ళు చెప్పుకున్నారు.

ఆ దంపతులు ఎన్నో ఏళ్ళు ప్రేమపక్షుల్లా అన్యోన్యంగా కలిసి మెలిసి జీవించారు.

వారి మధ్య ఎప్పుడూ చిన్న-చిన్న మాటపట్టింపులు కూడా రాలేదు.

బహుశా… వారు ఇంకా సంతోషంగా జీవిస్తూనే ఉండవచ్చు.

లేదా…

కాలధర్మం చెంది ఉండవచ్చు.

ఇదండీ మన తెల్ల గులాబీ కథ.

శివ చల్లా

5 జూలై 1997న నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఫిసికో-ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎం.ఎస్‌.సి., డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఇంపైర్‌మెంట్‌లో స్పెషల్ బి.ఎడ్. పట్టాలను పొందారు.
గత పదేళ్లుగా గుజరాత్, హైదరాబాద్‌లలోని పలు పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ అధ్యాపకులుగా సేవలందించారు. ప్రస్తుతం ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు.కొత్త ప్రదేశాలను సందర్శించడం, పుస్తక పఠనం, బేకింగ్, కొత్త విషయాలను నేర్చుకోవడం వీరి అభిరుచులు.
నివాసం: హైదరాబాద్, మొబైల్: 9574696282, ఇ-మెయిల్: challashiva4232@gmail.com


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *