పాట 21
చిత్రం : సిరిసంపదలు (1962) సంగీతం : మాస్టర్ వేణు
రచన : శ్రీ శ్రీ గానం : ఘంటసాల, పి.సుశీల
ఎందుకో సిగ్గెందుకో
ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో (2)
ఎందుకో సిగ్గెందుకో
పంతాలే తీరెనని తెలిసినందుకే
మనసులు కలిసినందుకే అందుకే సిగ్గందుకే
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు (2)
చిరునవ్వుల చిన్నారీ… (2)
ఇంకా సిగ్గెందుకే… ఎందుకో సిగ్గెందుకో
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై(2)
తనివారగ ఈవేళ… (2)
మనసే తూగాడెనే అందుకే సిగ్గందుకే
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే (2)
అనురాగం ఆనందం…
అనురాగం ఆనందం అన్నీ నీకోసమే
అందుకా… ఆ సిగ్గందుకా
పంతాలు తీరెనని తెలిసినందుకా
మనసులు కలిసినందుకే అందుకా సిగ్గందుకా
అందమైన అనుభూతిని అందించే ఈ పాటలోకి వెళ్ళేముందు ఒక ముఖ్యమైన సంగతి చెప్పుకోవాలి. మనం తెలుగువారిగా డాంబికాలు గొప్పగా పలుకుతాం కాని మన తెలుగు భాషకు వన్నె తెచ్చిన సాహితీవేత్తలు సృష్టించిన సాహిత్యాన్ని కాపాడుకునే పని చేయం. హిందీ, ఇంగ్లీషు పాటలపై కూడా వ్యాఖ్యలు రాస్తూ నేను గమనించిన నిజం ఒకటి పంచుకోవాలనిపిస్తుంది. ఆ భాషలలోని ఎంత పాత పాటనయినా వెలికి తీసి దాని రచయిత, సంగీత దర్శకుల గురించి తెలుసుకోవడానికి కష్టం అనిపించదు కాని తెలుగు విషయానికి వస్తే రచయితల విషయంలో అన్నీ తప్పుల తడకలే. శ్రీ శ్రీ విషయంలో అది జరగదని, మనం ఆయన పేరు చెప్పుకునే ఇప్పటికీ తెలుగు సాహిత్య గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటున్నాం కదా, ఆయన రాసిన పాటల విషయంలో అయోమయం ఉండకపోవచ్చు అని అనుకున్నాను. ఈ శీర్షిక కోసం పాటలను సేకరిస్తున్న సమయంలో ఆయన పాటలకు సంబంధించిన ఎన్నో తప్పులు చూసి ఆశ్చర్యం అనిపించింది. ఎంత తేలికభావంతో మనం మన తెలుగు సాహిత్యాన్ని చూస్తామో అర్ధం అయింది.
ఆశ్చర్యంగా సరోజా శ్రీ శ్రీ ఎడిట్ చేసిన ఆయన సినిమా పాటల పుస్తకాలలోనూ తప్పులే కనిపించి బాధనిపించింది. నిబద్దతతో మనం పని ఎందుకు చేయమో అర్ధం కాదు. సినీ సాహిత్యం కావచ్చు, భాషా సాహిత్యం కావచ్చు దేనిపై పని చేసినా రీసెర్చ్ సరిగ్గా చేయని కారణంగా చాలా తప్పులు, ఒప్పులుగా చెలామణి అయిపోతున్నాయి. ఇది ఆ సాహితీకారుల పట్ల మనం చేస్తున్న అతి పెద్ద తప్పిదం. పుస్తకాలు రాసేయాలనే తొందర తప్ప సమాచారాన్ని సరిగ్గా అందించాలన్న తపన రచయితలలోనూ పబ్లిషర్లలోనూ ఉండకపోవడమే కారణం అని చెప్పడానికి నేను సంకోచించట్లేదు. దానివల్ల ఆ తర్వాత మా లాంటి వాళ్ళకు పని చాలా కష్టం అవుతోంది. ఎంత రీసెర్చ్ చేసినా ఆ తప్పులను ఒప్పులుగా నమ్మవలసిన పరిస్థితిలో మేం నెట్టబడుతున్నాం. అందుకే నా ప్రతి పనీ సంవత్సరాలు పడుతోంది. కొన్నిసార్లు విసుగూ వస్తోంది.
ఉదాహరణకు విశాలాంధ్ర వారు వేసిన పుస్తకాలలోనే ‘దేవత’ సినిమాలోని ‘తొలివలపే పదేపదే’ అనే పాట శ్రీ శ్రీ పాటగా ఉంది. కాని నిజానికి ఇది రాసింది వీటూరి. ఈ సంకలనాలలో కొన్ని పాటలు నిజానికి వేరేవారు రాసినవి శ్రీ శ్రీ పేరు మీద ఉన్నాయి. ఇక వీకీపీడియా కొస్తే కొన్నిచోట్ల ఆయన పాటలు వేరే వారి పేరు మీద, మరి కొన్ని సైట్లలో అవే పాటలు ఆయన పేరు మీద ఉండి గందరగోళంగా ఉంది సమాచారం. శ్రీశ్రీ వికీపీడియా పేజీలో ‘ఇలవేల్పు’ సినిమా లోని ‘చల్లనిరాజా ఓ చందమామ’ పాట ఆయన రాసారని ఉంది కాని అది రాసింది వడ్డాదిగా సినీ ప్రపంచానికి పరిచయం అయిన వెంపటి సదాశివబ్రహ్మం. మరో సైట్ లో ఈ పేరు వస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ రిఫర్ చేసి, సినీ పాటలపై పని చేసిన పెద్దలను సంప్రదించి సందేహాలను తీర్చుకోవలసి వస్తుంది. ఈ తప్పుల తడికలు పూర్తిగా మన నిర్లక్ష్యమే. దాన్ని ఒప్పుకుని తీరాలి. ఇతర భాషా రచయితలకూ మనకూ ఉన్న ఆ తేడా కారణంగానే చాలా వరకు మన సాహిత్యం ప్రామాణికత విషయంలో వెనకబడి ఉందని చెప్పకతప్పదు.
‘సిరిసంపదలు’ సినిమాలో శ్రీ శ్రీ రాసిన ఒకే పాట “ఎందుకో సిగ్గెందుకో”. మిగతా పాటలు ఆత్రేయ, కొసరాజు రాసారు. శ్రీ శ్రీ చాలా పాటలను ఇతర కవుల శైలులకు దగ్గరగా, మనం పోల్చుకోని విధంగా రాయడం వల్ల కూడా ఆయన పాటలను ఏరుకోవడంలో ఇప్పటి తరానికి ఇబ్బంది ఏర్పడుతుంది. అలా నన్ను ముప్పు తిప్పలు పెట్టిన పాట ఇది. ఇది ఆత్రేయ పాట అని చాలా సైట్లలో ఉంది మరి. కారణం ఇది అచ్చంగా ఆయన శైలిలోనే ఉండడం. ఇదే సినిమాలో ఆత్రేయ రాసిన ఇతర పాటలన్నీ ఇదే శైలిని పోలి ఉండడం. సినిమా క్రెడిట్శ్ లో శ్రీ శ్రీ పేరు పాటల రచయితగా, ఆత్రేయ, కొసరాజుల నడుమ ఉండడం, ఎంత సోధించినా ఈ ఒక్క పాట తప్ప మరే పాటతో ఆయన పేరు జతగా ఉండకపోవడం, శ్రీ శ్రీ పాటల పుస్తకంలోనూ ఈ పాట చేర్చబడి ఉండడం, ఇవన్నీ చూసి సీనియర్ జర్నలిస్ట్ ఎస్. వి. రామారావు గారితో సంభాషించి అయన చేసిన రీసర్చ్ బేస్ గానూ ఇది శ్రీ శ్రీ రాసిన గీతం అని స్పష్టపరుచుకుని దీన్ని ఈ క్రమంలో చేర్చడానికి సాహసించాను.
శైలి పరంగా శ్రీ శ్రీ చేసిన ప్రయోగాలు, ఇతర కవుల బాటలో ఆసువుగా రాసి మెప్పించి ప్రజలలోకి వదిలిన ఈ పాటల వెనక, ఏ పాటనైనా ఏ శైలిలోనయినా రాయగల ఆయన నైపుణ్యం ఉంది. అది కూడా ఆయన పాటలను ఎంచుకోవడంలో ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. ఈ పాటను గమనిస్తే అచ్చు ఆత్రేయ రాసినట్లే ఉంటుంది. మధ్యలో ఒకట్రెండు పదాలు మాత్రమే ఇది పెద్దాయన రాసిన పాటే అని నమ్మకం కలిగిస్తాయి.
మనస్పర్ధలు తీరి ఓ జంట దగ్గరవడం, కష్టాలను దాటి ఆనందకరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం అయినప్పుడు వారు పంచుకునే ఆనందమే ఈ గీతం. ఇక తామిద్దరూ కలుసుకునే సమయం దగ్గరయిందని అర్ధం అయి ఆమె సిగ్గుపడుతుండగా వచ్చే పాట ఇది.
అతను ఆమెను సిగ్గెందుకు ఇక అని అడుగుతున్నాడు. ఆమెలోని ఆనందం అతనూ అనుభవిస్తూ ఆమెను ఆటపట్టిస్తూ ఇంతలోని అంత సిగ్గేల అని ప్రశ్నిస్తున్నాడు. దానికి ఆమె పంతాలే తీరాయని మనసులు తెరిపిన పడ్డాయని అందుకే సిగ్గని జవాబు చెబుతుంది. తామిద్దరూ కలసి జీవించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని చెప్పడంలో అప్పటిదాకా తాము అనుభవించిన కష్టం, అది తీరిపోయిందన్న ఆనందం కూడా వ్యక్తం అవుతాయి.
జీవితంలోని క్లిష్ట పరిస్థితులకు కారణాలు తొలగిపోయినప్పుడు తెరిపినపడిన భావం కలుగుతుంది. మనసు నుండి భారం దిగిపోవడం, హృదయం తేలికపడడం, నిశ్చింత ఆవరించడంలోని ఆనందం అనుభవించినవారికే అర్ధం అవుతుంది. రాబోయే ఆనందాల ఊహ కన్నాఈ నిశ్చింత, కష్టాలు దూరమయిన ఆ స్వేచ్చ అత్యంత ఆనందానిచ్చే దశ. జీవితంలోని సుఖానుభవాలను మించిన అత్యంత ఆనందానుభూతిని అందించే విముక్త దశ అది. దాన్ని కవి అత్యంతాద్భుతంగా పట్టుకున్న గీతం ఇది.
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు అంటూ తమ చిన్ననాటి స్నేహాన్ని ఇప్పుడు ప్రేమ బంధంగా మార్చుకోవడానికి సమయం అనుకూలంగా మారిందని,ఇంకా సిగ్గెందుకని అతను ఆమెను ప్రేమగా అడుగుతున్నాడు. కొనసాగిన కోరికలు వేడుకలై మురిపించబోతున్నాయని తనివితీరని ఆనందంతో మనసు ఈ నాడు నిండిపోగా తనను సిగ్గు ఆవహించిందని ఆమె చెబుతుంది.
ఈ చరణంలో ‘తనివారగ’ అనే పదప్రయోగాన్ని గమనించండి. నిండైన కవితాత్మకత తొణికిసలాడుతుంది. సాధారణంగా తెలుగు పద్యాలలోనూ, భక్తి గీతాలలోనూ వినిపించే పదం ఇది. సముద్రాల రాఘవాచార్య ‘అనార్కలి’ సినిమాలో ‘కలిసె నెలరాజు కలువ చెలిని’ అనే పాటలో ‘తనివారగా చెలిమనసారగా’ అనే వాక్యాన్ని ఉపయోగించారు. అది గ్రాంధిక పదాలతో నిండి ఉన్న పాట. అలనాటి చారిత్రిక వాతావరణానికి అనుకూలంగా వాడిన తెలుగు సాహిత్యం అది. ఆ పదాన్ని అచ్చ వాడుక భాషా పదాలతో మేళవింపజేసి సహజ సంభాషణలతో సాగుతున్న ఈ పాటలో అతి సహజంగా చొప్పించేయడం శ్రీ శ్రీ శైలి. ‘తనివారగ ఈ వేళ మనసే తూగాడెనే’ అనే ఈ వాక్యం ఈ పాట భావుకత స్థాయిని పెంచుతుంది. సాధారణ ప్రశ్నా జవాబుల గీతంలో ఈ వాక్యంతో వచ్చి చేరిన కవితాత్మకత ఆశ్చర్యపరుస్తుంది. కృష్ణశాస్త్రి ప్రభావాన్ని వదిలించుకోవడానికి చాలా కష్టపడ్డానని శ్రీ శ్రీ తన అనంతంలో చెప్పుకున్న సందర్భం గుర్తుకొస్తుంది.
ఆ నునుసిగ్గుల మాటున దాగిన ఆమె ప్రేమను తాను చూస్తున్నానిని అతను అన్నప్పుడు ఆమె అనురాగం ఆనందం అన్నీ నీ కోసమే అని ఇచ్చే జవాబు ఇంకా అందంగా ఉంటుంది. ఇక్కడ పాట ముగింపు ఆకట్టుకుంటుంది. అందుకా, ఈ సిగ్గు, ఈ ప్రేమ ఆనురాగం నాకు అందించే సమయం వచ్చినందుకా అంటూ అతను ఆమె ఇచ్చిన జవాబునే ‘పంతాలు తీరెనని తెలిసినందుకా, మనసులు కలిసినందుకా అందుకా సిగ్గందుకా’ అంటూ పాటను ముగించడం అత్యంతాద్భుతంగా ఉంటుంది. ప్రేమ గురించి పెద్దగా గొప్ప భావం లేని నా లాంటి వారిని సైతం పులకింపజేస్తుంది ఈ ముగింపు.
పైగా ఇక్కడ ఘంటసాల గారి గాత్రం తేనెలూరుతుంది. అందుకా అంటూ తర్వాత ‘ఆ’ అన్నప్పుడు మనసు పులకరిస్తుంది. ఎంత ప్రేమ నిండి ఉంటుందో ఆ గొంతులో. తరవాత పాట చివర్లో ‘అందుకా సిగ్గందుకా’ అన్నప్పుడు ఆ అందుకా దగ్గర అంతా అర్ధమయినట్లు ఆయన ఇచ్చే ఫీల్ అత్యంతాద్భుతం. ఏమైనా ఘంటసాల గారి గాత్రం చేసే మాయే వేరు.
కష్టాలు తీరి ప్రేమ మార్గం సుగమం అయి ఓ జంట ఆనందపు భవిష్యత్తులోకి ప్రయాణించే ఘడియలను చిత్రీంచే ఈ పాట సన్నివేశపరంగా కవికి ఒక సవాలే. ఈ సందర్భాన్ని ఇతర కవులు రకరకాలుగా వ్యక్తీకరించవచ్చు. కాని ఆ జంట అనుభవించే నిశ్చింతను పట్టుకున్నారు శ్రీ శ్రీ. కల్పిత కథలోనే కావచ్చు కాని వాస్తవ మానవ అనుభూతులని, అనుభవాలను వ్యక్తీకరించడంలో శ్రీ శ్రీ ప్రతిభావంతులు. That relief and the moment of lightness – అది ఈ పాటలోని గొప్పతనం. అదే మానవ జీవితంలోని అతి పెద్ద ఆనందం, అత్యంతాద్భుతమైన పులకరింత. ప్రేమ కన్నా మించినది జీవితంలో దొరికే నిశ్చింత. ప్రేమ గీతంలోనూ శృంగారాన్ని పండిస్తూనే ఆ నిశ్చింతతకు పెద్ద పీట వేయడం ఆయనకే చెల్లింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కదా ఆనందకర శృంగారం పండేది. ఆనందకర శృంగారానికి ఆ జంట మనసుల్లో ఒకరిపై ఒకరికుండే ప్రేమ కన్నా పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండడం ముఖ్యం. ఆ వాస్తవాన్ని గొప్పగా ప్రెజెంట్ చేసిన పాట ఇది.
పాట 21
చిత్రం – తోడుకోడళ్లు (1957) రచన – శ్రీ శ్రీ
సంగీతం – మాస్టర్ వేణు గానం – ఘంటసాల కోరస్
నలుగురు కలిసీ పొరుపులు మరిచీ
చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం (2)
నలుగురు కలిసి పొరుపులు మరిచి
చేస్తే ఉమ్మడి వ్యవసాయం
మనకిస్తుందెక్కువ ఫలసాయం
ఇది రైతులకెంతో సదుపాయం (నలుగురు)
ఒక సంసారం వందెకరాలను పండించటమే అరుదుకదా
అది భరించలేని బరువుకదా
పది కుటుంబములు వెయ్యెకరాలను
సాగుచెయ్యడం సులువు కదా (నలుగురు)
మహారాజులూ జమీందారులూ మచ్చుకు దొరకని కాలంలో
ఈ ప్రజలే ఏలే రాజ్యంలో (మహా)
ఇతరుల కష్టం దోచుకు తినడం
ఇకపై సాగే పని కాదు ! (నలుగురు)
ఇదియే సూత్రం ఒక్కడు మాత్రం భూమిని గుత్తకు కొనరాదు
కడుసోమరిపోతై మనరాదు
నేలా నీరూ గలీ వెలుగూ
కొందరి సొత్తని అనరాదు
అవి అందరి హక్కై అలరారు (నలుగురు)
ఒక్కొక్క వ్యక్తీ, సమస్త శక్తీ ధారపోసి పనిచెయ్యాలి
ధన ధాన్యరాశులే పెంచాలి (ఓక్కొక్క)
కూటికి గుడ్డకు లోటులేక తన
కవసరమైనవి పొందాలి
నలుగురు కలిసి పొరుపులు మరిచి
చేస్తే ఉమ్మడి వ్యవసాయం
మనకిస్తుందెక్కువ ఫలసాయం
ఇది రైతులకెంతో సదుపాయం (నలుగురు)
సామూహిక సహకార వ్యవసాయాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నించాయి. సోషలిస్టు దేశాలు పూర్తిగా సమర్ధించి, ప్రతిపాదించాయి. 1929 లో స్టాలిన్ సోవియట్ యూనియన్ లో సహకార సామూహిక వ్యవసాయాన్ని ప్రవేశ పెట్టారు. అయితే చాలా కారణాల వల్ల అది సఫలం కాక ఆ దేశ ప్రజలు పెను అనర్ధాలను చవి చూసారు. 1955లో మావో సామూహిక వ్యవసాయాన్ని చైనాలో అమలు చేసినప్పుడు ఆ దేశం ఆర్ధిక అభివృద్ది చవిచూసింది. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు ఈ సమయంలో అక్కడ జరుగుతున్న ప్రయోగాలను ఆసక్తిగా పరిశీలించారు. కమ్యునిజాన్ని నమ్మిన కవులు, మేధావులు ఈ ప్రయత్నానికి హర్షం ప్రకటిస్తూ తమ తమ దేశాలలోనూ ఈ ఆలోచన మొలకెత్తాలని ఆశించారు.
1957అంటే మావో నేతృత్వంలో చైనాలో సహకార వ్యవసాయం పూర్తిగా మొదలయిన రెండేళ్ళకు తెలుగు నాట ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో శరత్ చంద్ర చటోపాధ్యాయ నవల ‘నిష్కృతి’ ని సినిమాగా తీసే నిర్ణయం జరిగింది. ఇదే కథతో 1953లో బెంగాలీ సినిమా వచ్చింది. అది అచ్చు శరత్ నవలా కథను అనుసరించి పూర్తిగా ఒక కుటుంబంలో స్త్రీల రాజకీయాలతో ఇబ్బందిపాలయే కుటుంబ సభ్యుల జీవితాలను తెరకెక్కించింది.
కాని తెలుగులోకి వచ్చేసరికి అప్పటి రాజకీయ సిద్దాంతాలు, వ్యవసాయ రంగంలో పొరుగు దేశంలో జరుగుతున్న ప్రయోగాల ప్రభావాలతో ఈ సినీ కథను మార్చకుండా, కథనం పట్ల కొంత స్వతంత్రం తీసుకున్నారు రచయితలు. ఈ సినిమాకు ఆత్రేయ, ఆదుర్తి సుబ్బారావు, డి. మధుసూధనరావులు స్క్రీన్ ప్లే రాసుకున్నారు. శరత్ మూలకథను మార్చకుండా, ఇంటి నుండి గెంటివేయబడ్డ హీరో హీరోయిన్లు సమిష్టి వ్యవసాయంతో తమ కుటుంబాన్ని, పేద రైతులను ఉద్దరించే దిశగా కథనాన్ని మలిచారు రచయితలు.
భారత దేశంలో కమ్యునిజానికి మారు పేరని చెప్పుకునే బెంగాలులో అదే ప్రాంతానికి చెందిన కథను తెరకెక్కిస్తున్న సమయంలో వాళ్లు చేయలేని ఆలోచనను, తెలుగు రచయితలు ఆ బెంగాలీ కథతో తెలుగు సినిమా తీస్తున్నప్పుడు చేయగలిగారు. రాజకీయంగా తెలుగు దర్శకులు, రచయితలు ఆ రోజుల్లో ఎంత చైతన్యవంతంగా ఉండేవారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. చైనా తమ దేశంలో అమలు చేసిన ఉమ్మడి వ్యవసాయ రీతులను భారత దేశంలో ఒక ఆలోచనగా సినిమా అనే మాధ్యమం ద్వారా మొట్టమొదటి సారి ప్రజల మధ్యకు ప్రవేశపెట్టిన సినిమా ‘తోడుకోడళ్లు’. ఆ సన్నివేశానికి సరిపడే పాటను రాసి అందించినది శ్రీ శ్రీ. సామూహిక వ్యవసాయం రైతులకు ఎందుకు మేలు చేస్తుందో, ఎలా పేద రైతులు దీని వల్ల లాభపడతారో చైనా మేధావుల ప్రయోగాలు ఏ దిశగా వెళ్తున్నాయో అనే విషయాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకుని, భారతదేశ పరిస్థితులకు ఈ ప్రయోగాన్ని అన్వయిస్తూ శ్రీ శ్రీ రాసిన పాట “నలుగురు కలిసి పొరుపులు మరచి”
‘నలుగురు కలిసీ పొరుపులు మరిచీ చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం’ అంటూ సాగే ఈ పాటలో ‘పొరుపులు’ అనే పదం ఇప్పుడు వినిపించట్లేదు. కాని తెలుగు జానపద సాహిత్యంలోనూ, పద్య రచనలోనూ ఈ పదాన్ని విరివిగా ఉపయోగించేవారు. నవ్యకవితా పితామహుడు రాయప్రోలు సుబ్బారావు రాసిన ‘మధుకలశము’ అనే పద్య కావ్యంలో “పొరుపుల నొండొరుల్ పడక పోరెడి డెబ్బది రెండు శాఖలన్…” అనే పద్యం చాలా మందికి సుపరిచితమే. ఈ పదానికి గొడవలు, మనస్పర్ధలు అనే అర్ధం వస్తుంది. పరప్సర తగాదాలను మరచి అందరూ ఉమ్మడి వ్యవసాయాన్ని చేయాలనే సందేశంతో మొదలయి అలా చేస్తే, ఎక్కువ ఫలసాయం వస్తుందని అది రైతులకెంతో సదుపాయం అని చెప్తున్నారు కవి. ఒక రాజకీయ సిద్దాంతాన్ని సినిమా పాట ద్వారా నేరుగా చెప్పగలిగే అవకాశం కవులకు చాలా అరుదుగా వస్తుంది. సాధారణంగా సినీ గీతాలలో ఏ రాజకీయ సిద్దాంతమూ నేరుగా ద్వనించదు. దానికి ఎన్నో అలంకారాలు చేయవలసి వస్తుంది. విప్లవ సినీ కథలు, దేశభక్తి కథలు కాకుండా కుటుంబ కథల నడుమ ఇలా నేరుగా సిధ్ధాంతాన్ని చర్చించే సందర్భాలు తెలుగు సినీ రంగంలో చాలా తక్కువ. అలాంటి అరుదైన సందర్భాన్ని ఆవిష్కరించిన పాట ఇది.
ఈ పాట శైలిలోనూ ఓ ప్రయోగం కనిపిస్తుంది. చరణంలోని రెండుభాగాలు ఒకే విధంగా ఉంటూనే, ప్రశ్న జవాబులుగా వినిపిస్తాయి. ఇది సాధారణంగా డ్యూయెట్లలో కవులు పాటించే శైలి. అతనో ఆమో ఒక ప్రశ్న లేదా ఒక మాట అంటే, దానికి కొనసాగింపుగా మరొకరు దానికి జవాబో బదులో అందిస్తారు. ఇక్కడ సోలో గీతానికే ఆ శైలి ఆపాదించారు శ్రీ శ్రీ. చరణంలో మొదటి భాగం ‘నలుగురు కలిసి పొరుపులు మరచి చేయాలి ఉమ్మడి వ్యవసాయం’ అంటూ వస్తుంది. దీన్నికొనసాగిస్తూ ‘నలుగురు కలిసి పొరుపులు మరిచి చేస్తే ఉమ్మడి వ్యవసాయం మనకిస్తుందెక్కువ ఫలసాయం, ఇది రైతులకెంతో సదుపాయం అంటూ వివరిస్తాడు’ కవి తరువాతి వాక్యాలలో. మొదటి భాగం ఒక స్టేట్మెంట్ అయితే, రెండవ భాగం దానికి వివరణ. సోలో గీతాలలో ఇది ఒక ప్రయోగమే.
రష్యాలో సామూహిక వ్యవసాయానికి ప్రజలు సహకరించక దాన్ని నియంతృత్వంతో అమలు చేయవలసిన పరిస్థితులను, అదే ప్రయోగం చైనాలో మావో అమలుచేసే ప్రయత్నంలో ప్రజల సహాకారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను గమనిస్తూ ఈ ప్రయోగానికి ప్రజల తోడ్పాటు చాలా అవసరం అనే సూచనను శ్రీ శ్రీ “పొరుపులు మరచి” అనే మాటతో అందించారనిపిస్తుంది.
సామూహిక వ్యవసాయం, సముదాయ వ్యవసాయంలో రైతులు తమ భూములను ఒక ఉమ్మడి సంస్థగా నడుపుతారు. సముదాయ వ్యవసాయ క్షేత్రాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది వ్యవసాయ సహకార సంఘాలు. వీటిలో సభ్య-యజమానులు సమిష్టిగా వ్యవసాయ కార్యకలాపాలలో పాల్గొంటారు. రెండవది ప్రభుత్వ క్షేత్రాలు, ఇవి కేంద్రీకృత ప్రభుత్వం యాజమాన్యంలో ఉండి నేరుగా నడపబడతాయి. ఈ పాటలో మొదటి పద్దతిని వర్ణిస్తున్నారు కవి. ‘ఒక సంసారం వందెకరాలను పండించటమే అరుదు కదా, అది భరించలేని బరువుకదా’ అంటూ ‘పది కుటుంబములు వెయ్యెకరాలను సాగుచెయ్యడం సులువు కదా’ అని చెప్పడం వెనక ఈ ప్రయోగం ఎందుకు లాభమో తెలిపే ప్రయత్నం ఉంది.
సమిష్టి వ్యవసాయంలో భాగంగా 1950–1952 దాకా చైనాలో భూ సంస్కరణలు జరిగాయి. భూస్వాముల చట్టపరమైన రక్షణలను తొలగించి, వారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. భూమిని సేకరించి గ్రామీణ జనాభాలో సుమారు 60% మందికి తిరిగి దానిని పంపిణీ చేసింది. భూస్వామ్య వర్గం నిర్మూలించబడింది. దాన్ని సోషలిస్టులు సమర్దించారు. అందుకే ఈ పాటలో తర్వాతి చరణంలో శ్రీ శ్రీ ‘మహారాజులూ జమీందారులూ మచ్చుకు దొరకని కాలంలో, ఈ ప్రజలే ఏలే రాజ్యంలో ఇతరుల కష్టం దోచుకు తినడం ఇకపై సాగే పని కాదు’ అంటూ భూసంస్కరణల పట్ల ఆమోదాన్ని తెలుపుతూ ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన భారతదేశంలో ఉమ్మడి వ్యవసాయ అవసరాన్ని నొక్కి చెబుతున్నాడు. ‘ఇదియే సూత్రం ఒక్కడు మాత్రం భూమిని గుత్తకు కొనరాదు, కడుసోమరిపోతై మనరాదు, నేలా నీరూ గాలీ వెలుగూ, కొందరి సొత్తని అనరాదు అవి అందరి హక్కై అలరారు’ అని కవి అంటున్నప్పుడు ఇవి చైనాలోని మొదటి దిశ భూసంస్కరణలను సమర్ధిస్తూ రాసిన వాక్యాలుగా అనిపిస్తాయి.
సహకార వ్యవసాయంలో రెండవ దిశగా చైనాలో పరస్పర సహాయ సహకార సంఘాలు (1953–1957) ఏర్పడ్డాయి. చిన్న కుటుంబ సమూహాలు తమ వ్యక్తిగత భూమి హక్కు పత్రాలను కలిగి ఉంటూనే, పనిముట్లు, పశువులు శ్రమను ఒకచోట చేర్చాయి. రైతులు తమ భూమిని పెద్ద సహకార క్షేత్రాలుగా సమీకరించి, తాము అందించిన భూమి, చేసిన శ్రమ రెండింటి ఆధారంగా వాటాలను పొందారు. దీన్ని ఈ పాటలో తర్వాతి చరణంలో కవి ‘ఒక్కొక్క వ్యక్తీ, సమస్త శక్తీ ధారపోసి పనిచెయ్యాలి,ధన ధాన్యరాశులే పెంచాలి’ అని చెప్పుకొస్తూ, ‘కూటికి గుడ్డకు లోటులేక తన కవసరమైనవి పొందాలి’ అంటూ సహకార వ్యవసాయంలో అప్పుడు చైనా ఉన్న రెండవ దిశను వర్ణిస్తున్నాడు.
నిజానికి సహకార వ్యవసాయాన్ని జాతీయ స్థాయిలో అత్యంత విజయవంతంగా అమలు చేసిన మొట్టమొదటి దేశం డెన్మార్క్. ఇక్కడ ప్రభుత్వం బలవంతంగా “సమిష్టి వ్యవసాయ” పద్ధతిని అమలు చేయలేదు. 1882లో రాజు క్రిస్టియన్ IX పాలనలో, ప్రధాన మంత్రి జాకబ్ బ్రోనుమ్ స్కావెనియస్ ఎస్ట్రప్ నేతృత్వంలోని సంప్రదాయవాద ప్రభుత్వ హయాంలోనే స్వచ్ఛంద వ్యవసాయ సహకార ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పాలకుల ఒత్తిడితో కాకుండా, స్వతంత్రులైన తమ సొంత భూములను సాగు చేసుకునే రైతుల చొరవతో పూర్తిగా సాగిన ఉద్యమం ఇది. ఇక్కడ వ్యక్తిగత రైతులు తమ భూమి, ప్రైవేట్ పొలాలపై పూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉండి, వనరులు, యంత్రాలు, కొనుగోలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను స్వచ్ఛందంగా పంచుకున్నారు. అలా డెన్మార్క్‌లోని పాడి, మాంసం, కోళ్ల ఉత్పత్తిలోనూ ప్రపంచంలో దూసుకెళ్లింది. దీని తర్వాత నెదర్లాండ్స్, స్వీడన్, ఇటలీ వంటి ఇతర పశ్చిమ యూరోపియన్ దేశాలు కూడా సహకార వ్యవసాయాన్ని స్వీకరించాయి. కమ్యునిజాన్ని ప్రతిపాదించే దేశాలు దీన్ని తమ విధానంగా మార్చుకునే ప్రయత్నం చేశాయి.
రష్యా ఈ దిశలో పూర్తిగావిఫలం అయినా చైనా ఇప్పటికీ ఇదే పద్దతిలో దేశాన్ని అభివృద్ది పధం వైపుకు నడిపిస్తుంది. అక్కడా కొన్ని సందర్భాలలో ప్రజలు దీనికి సహకరించక ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పుడు, ప్రభుత్వం తన పంధా మార్చి, సమిష్టి పద్దతిలోనే వ్యక్తిగత లాభమూ ప్రజలకు చేకూరేలా కుటుంబ వ్యవసాయానికి ఆమోదం తెలిపింది. సహకార వ్యవసాయ పద్దతులనే పాటిస్తూ పంటలభివృద్ది, ప్రజల అభిష్టాన్ని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ చైనా సమయానుకూలంగా ఈ పద్దతిని తమ దేశ ప్రజలు, పంటలను అధ్యయనం చేసుకుంటూ ముందుకు దూసుకెళుతుంది.
ఇన్ని పరిణామాల మధ్య ఈ పాటను అందుకే ఒక సినీ గీతంగా మాత్రమే చూడలేం. ఎన్నో దేశాలని ప్రభావితం చేసిన సమిష్టి వ్యవసాయ పద్దతి గురించిన సమాచారాన్ని సామాన్య ప్రజలకు అందించిన అభ్యుదయ గీతం ఇది. దీన్ని ఒక కుటుంబ చిత్ర నేపధ్యంలో చేర్చుతూ ప్రజలకు రాజకీయ జ్ఞానాన్ని, సామాజిక పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు శ్రీ శ్రీ. కొన్ని ప్రపంచ దేశాలు ఉపయోగించిన ఒక వ్యవసాయ విధానంలోని లాభ నష్టాలను నేటి ప్రజలు సైతం విశ్లేషించుకునే అవకాశాన్ని కల్పించే గీతం ఇది. వ్యవసాయ ఆధారిత ప్రజలు, పనులు ఎక్కువగా ఉన్న మనదేశం సమిష్టి వ్యవసాయ పద్దతిని అవలంబించ వలసిన అవసరం ఉందని సంపూర్ణంగా నమ్మారు శ్రీ శ్రీ. ఈ పాట ద్వారా ఆ ఆలోచనను ప్రజల మధ్యకు తీసుకువెళ్ళడంలో ఆయన పూర్తిగా సఫలం అయ్యారు కూడా.














