ఆట

Spread the love

                                                   

       మిట్ట మధ్యాహ్నం వేళ.‌ రైతులంతా పొలాల్లో ఉన్నారు.చెట్ల నీడలు కురుచబారుతున్నాయి.  కొంగలు పండిన చెరుకు తోటల మీద వాలుతున్నాయి. సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. గాలి వెచ్చగా ఉంది. వేడి గాలి భయానికి పిల్లలంతా ఇంకా ఇళ్ళల్లోనే ఉన్నారు. హఠాత్తుగా ఒక గుడిసె తలుపు భళ్ళున తెరుచుకుంది. అయిదారేళ్ళ వయసు పిల్లాడు లోపల నుంచి తొంగి చూసేడు. ఆ గుడిసె ముందు వేప చెట్టు నీడలో ఒక ముసలమ్మ కూర్చుని ఉంది. తనకి కళ్ళు సరిగ్గా ఆనకపోయినా, ఆమె ఒక బుట్ట అల్లుతోంది. ఆ పిల్లాడిని చూసి, ఆమె పిలిచింది “ ఎక్కడికి బయలుదేరేవు, నందన్? లోపలికి పోయి, పడుకో. బయట చాలా వేడి గా ఉంది.మిగతా పిల్లలంతా ఇంకా నిద్ర పోతున్నారు.”

   విసుక్కుంటూ, నందన్ జవాబిచ్చేడు, “ అమ్మ ఇప్పటికే పొలం దున్నడానికి వెళిపోయింది. ఇంట్లో ఒక్కడినే ఉండాలంటే నాకు భయం వేస్తోంది.”

      ఆ ముసలమ్మ ఊళ్ళో  పిల్లలందరికీ నాయనమ్మ . ఆమె పని వాళ్ళ స్వేచ్ఛ ని హరించడమే. చెరువు దగ్గర మైదానం అంతా మామిడి కాయలతో నిండిపోయింది, కానీ పిల్లలెవరూ అక్కడకి వెళ్ళలేరు. వాళ్ళు చెరువులో పడిపోతారని.బెర్రీ చెట్లు విరగకాసేయి. గుత్తులు, గుత్తులుగా ఎర్రటి, పచ్చటి బెర్రీలు చెట్లకి వేలాడుతున్నాయి. కానీ పిల్లలెవరూ పళ్ళు  కోసుకోవడానికి  చెట్టెక్క డానికి వీలు లేదు. వాళ్ళు పడిపోతారని. స్వచ్ఛమైన నీళ్ళతో, తుళ్ళిపడే చేపలతో, విరగబూసిన కలువలతో, చెరువు ఎంతో అందంగా ఉంది. కానీ పిల్లలెవరూ చెరువు దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదు. మునిగిపోతారని. ఆమె తమని కనిపెడుతూ ఉండడం పిల్లలకి నచ్చేది కాదు. ఆమె ని తప్పించుకునే మార్గాల కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉండేవారు. కానీ, తన ఎనభై ఏళ్ళ జీవితానుభవం తో ఆమె వారి ఉపాయాలను ముందే పసిగట్టి, వాటిని మొగ్గలోనే తుంచేసేది.‌

     ముసలమ్మ పిల్లాడిని కోప్పడింది, “ నేను ఇక్కడే ఉన్నాను కదా. నీకెందుకు భయం? ఇంట్లోకి పోయి, పడుకో. లేదంటే నేను వస్తాను.”

    ఆ పిల్లాడు గుడిసె లోంచి బయటకు వచ్చి అన్నాడు, “ అయినా, ఇక బయటకి వెళ్ళే వేళ అయింది కదా.”

     “ ఈ వేళప్పుడు ఎక్కడికి వెళతావు?”

    “ ఎక్కడకీ లేదు, మామ్మా.”

    పిల్లాడు నాలుగడుగులు ముందుకేసాడు.‌ మామ్మ తను అల్లుతున్న బుట్టనీ,దబ్బనాన్నీ ప్రక్కన పెట్టి, లేవబోయింది. కానీ, తను పైకి లేచేలోగా, వాడు ఆమెకి దొరక్కుండా తుర్రుమన్నాడు. ముసలమ్మ ఎత్తు మార్చింది.‌ “ నా తండ్రి కదూ, మా నాన్న కదూ, ఈ వేళప్పుడు ఎక్కడకీ వెళ్ళకురా, తండ్రీ!” అని నచ్చజెప్పబోయింది.‌

        నందన్ తను ఉన్న జాగా నుంచే, “ నేను జతిన్ కోసం వెళ్తున్నాను,” అని అరిచి, పరుగు తీసేడు.

  జతిన్ ఒక వీధి వ్యాపారి.‌ అతను ఈ మధ్యే ఈ ఊరికి రావడం ప్రారంభించేడు. అతను తప్పకుండా ప్రతీ సాయంత్రం వస్తాడు. తను అమ్మే వస్తువులకి అతను డబ్బు కి బదులు ధాన్యం తీసుకునేవాడు. ఆ రకంగా అతనికి లాభసాటి గానే ఉండేది. ఊరి జనాలు కూడా ఉదారంగా ధాన్యాన్ని కొలిచేవారు.‌ అంచేత, అతను ప్రక్క ఊరి నుంచి నాలుగైదు మైళ్ళు నడిచి వచ్చి, తన వ్యాపారం సాగించేవాడు.‌ అతని బుట్ట నిండా జంతికలు, కరకజ్జం, నూలుండలు, పప్పుండలు, బాదుషాలు, ఇంకా ఇలా ఎన్నో తినుబండారాలు ఉండేవి. ఆ బుట్ట మీద ఒక పాత, చిరిగిన బట్ట కప్పి ఉండేది. పిల్లలకి అది దేవలోకం నుంచి వచ్చిన ప్రసాదం లా ఉండేది. ఒక్కసారి బుట్ట లోకి తొంగి చూడాలని పిల్లలంతా ఉవ్విళ్ళూరేవారు. వాళ్ళ బాల్యచాపల్యానికీ, ఆత్రానికీ,‌ఆ బుట్ట ని ఒక్కసారి చూస్తే చాలు, వారి మనసులు ఆనందంతో పొంగి పోయేవి. వాళ్ళు అతని రాక కోసం ఆత్రుతగా ఎదురు చూసేవారు. కేవలం కొద్ది మందికే ఈ ప్రసాదాన్ని స్వీకరించే అద్రృష్టం ఉన్నా, పిల్లలందరికీ అతని బుట్ట చుట్టూ చేరి, ఆ బట్ట ని పైకెత్తి, అందులో సిగ్గు పడుతున్న రాకుమార్తె ల మాదిరిగా కూర్చున్న తినుబండారాలను చూడడం అంటే ఎంతో సరదాగా ఉండేది. జతిన్ రాక ఊళ్ళోకి హడావుడి ని తెచ్చేది. ఒక అర్థ గంట పాటు ఊరంతా తుఫాను లో చిక్కుకున్నట్టు అల్లకల్లోలంగా ఉండేది. నిజానికి, అతని రాక సంతోషం కంటే ఎక్కువగా నిస్పృహ నే కలగజేసేది.‌ అయినా కూడా, పిల్లలంతా ఆ ఘటన కోసం రోజూ కొత్తగా ఎదురు చూసేవారు. అతని రాక కోసం వాళ్లు ఎంతో అసహనంగా ఎదురు చూసేవారు.  ఆ తినుబండారాలు తమ నోళ్ళలోకి  వెళ్ళకపోయినా, కేవలం వాటిని చూసి, ఆనందంతో గంతులేసేవారు. నందన్ కూడా అలాంటి ఒక పేద బాలుడు.‌ మిగతా పిల్లలంతా మిఠాయిలు తింటూ ఉంటే, అతను కేవలం వాటి వంక ఆశగా చూసేవాడు.  ఎంతగా, ఏడ్చినా, మొత్తుకున్నా, బతిమాలినా, బులావులేసినా, అతని కోరిక తీరేది కాదు. అతని నుదుటన వైఫల్యమే రాసి పెట్టి ఉంది. కానీ, ఆ వైఫల్యం ఎన్నడూ అతడిని నిరుత్సాహపరచలేక పోయింది.‌

      ఇవాళ  మధ్యాహ్నం నందన్ కునుకు తీయలేదు. ఇవాళ జతిన్ కొత్తగా కోవా, జాంగ్రీ లు తెస్తానన్నాడు.‌ ఆ పిల్లల ప్రపంచంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టం కాబోతోంది. వాళ్ళు పొద్దున్న నుంచి జతిన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు ఎవరికైనా కునుకు ఎలా పడుతుంది?

   తోటకి చేరేక నందన్ అనుకున్నాడు కదా, “ ఇంకా సాయంత్రం అవలేదా?” అని.‌ “ ఈ పాటికి రోజూ జతిన్ ఇక్కడికి చేరుకునే వాడు కదా! కాదేమో, ఇంకా వేళ అవలేదేమో! చున్నూ, సోహన్, కల్లూ ఇంకా నిద్ర పోతున్నారు. ఈ పాటికి జతిన్ మెయిన్ రోడ్ చేరి ఉంటాడు.‌ అతను ఇవాళ కచ్చితంగా జాంగ్రీ లు తీసుకొస్తాడు. ఎర్రగా, మెరుస్తూ ఉండే జాంగ్రీ లు. ఎప్పుడో, చాలా కాలం క్రితం..ఆ.. దసరా జాతర లో నేను జాంగ్రీ తిన్నాను. అబ్బ, ఎంత తియ్యగా ఉందో!” అతని నోట్లో నీళ్ళు ఊరేయి.‌ కోరిక ఇంకా హెచ్చింది. అతను తోటని విడిచి, ముందుకి కదిలేడు. మెయిన్  రోడ్ ని కలుపుతూ ఒక విశాలమైన పొలం ఉంది. కానీ, ఎక్కడా జతిన్ జాడ లేదు.

      నందన్ ఊరి చివర కాసేపు జతిన్ కోసం ఎదురు చూసేడు.‌ అతడు చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు. ఇవాళ తనే మొదట జతిన్ ని పలకరించాలని అనుకున్నాడు. “ నేను అతడిని ఊళ్ళోకి తీసుకు వెళతాను. అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు.” ఇలాంటి ఆలోచనలు అతడి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేయి. అతని హ్రృదయం ఆనందంతో గెంతులేసింది. ఆనందంతో చప్పట్లు చరుస్తూ, అతడు రోడ్డు వైపుకి నడిచేడు.‌

       అనుకోకుండా, అదే సమయానికి అతడికి గెందా తారసపడింది.‌ అది ఊరకుక్క. అది ఊరిని పహారా కాస్తుంది, పిల్లల ఆట వస్తువు కూడా! అది తన సాయంత్రం పహారా లో ఉంది. ఎందుకంటే, ఈ వేళప్పుడే, ఎడ్లు, పోతులు పొలాల్లో చొరబడతాయి. నందన్ ని చేరగానే, అది ఆగి ఈ వేళప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నట్టుగా తోక ఊపింది.‌ నందన్ దాని తల నిమిరేడు. కానీ, ఆగి ముచ్చట్లు పెట్టుకునేంత తీరిక దానికి లేదు. కుక్క ముందుకి ఉరికింది. నందన్ దాని వెనకాలే పరిగెత్తేడు. తన స్నేహితుడిని చూడటంతో అతని ఉత్సాహం ఇనుమడించింది. ఇక ఇప్పుడు అతడు జతిన్ ని మట్టి దారి లోనే కలవాలని నిర్ణయించుకున్నాడు. అయినా, ఎక్కడా జతిన్ జాడ లేదు.‌కొన్ని సార్లు అతడికి జతిన్ కనిపించినట్టు తోచింది. కానీ, అది అతడి భ్రమ మాత్రమే.  దారంతా వేరే ద్రృశ్యాలు కనిపిస్తున్నాయి.‌ ఎడ్ల బళ్ళు వరసలు కట్టి ఉన్నాయి. ఉండీ, ఉడిగీ, జట్కా బళ్ళు, సైకిళ్ళు వెళ్తున్నాయి.‌ అతడికి ఒక ఒంటె కూడా కనిపించింది.  దాని వెనక చప్పట్లు చరుస్తూ,కొంత దూరం పరిగెత్తేడు. కానీ అతని మనసులో ఉన్న ఒక కోరిక వీటన్నింటినీ మించినది.‌

       దారికి ఇరువైపులా చెట్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మామిడి చెట్లు కావటంతో అతడికి రాళ్ళు విసిరి, మామిడి కాయలు తెంపాలనే ఆలోచన వచ్చింది. కానీ, అతని కళ్ళు మాత్రం ఇంకా జతిన్ ని వెతుకుతూనే ఉన్నాయి. అతను ఇంకా ఇక్కడికి రాలేదేం చెప్మా!

     మెల్లగా, నీడలు పొడుగు అవుతున్నాయి. అలిసిపోయిన ప్రయాణీకుని మాదిరిగా, సూర్యుడు ఇక ఈ రోజుకి శలవు తీసుకోవాలనుకున్నాడు. పాపం, నందన్ ఇంకా జతిన్ వస్తాడేమోనని ఆశగా చూస్తున్నాడు. ఆశ వల్ల కాలం తెలియటం లేదు. నిస్పృహ తో అతను రోడ్డు మీద చతికిలబడ్డాడు. పాపం, ఆశ అడియాస కావటంతో, కన్నీళ్ళు ధారలు కట్టేయి. ఏడుపుని ఆపుకోలేక, అతడు వెక్కిళ్ళు పెట్టేడు. “ అబ్బ, ఈ జతిన్ ఎంత చెడ్డవాడు! రోజూ మమ్మల్ని కలవడానికి వస్తాడు. ఇవాళ నేను కలుద్దామని వస్తే, అతడు రాలేదు. రేపు ఇతడిని ఊళ్ళో అడుగు పెట్టనివ్వను”, ఇలా సాగేయి అతడి ఆలోచనలు. పాపం ఇలాంటి పసితనపు ఆలోచనలతో అతడి గుండె మెలి పడింది.

      హఠాత్తుగా అతడి కళ్ళు  నేల మీద పడి ఉన్న ఒక విరిగిన వెదురు బుట్ట మీద పడ్డాయి. ఒక  ప్రక్క తన ఓటమి వల్ల కలిగిన విచారం బాధిస్తున్నా, ఇది చాలు ఆ పిల్లాడిని ఉత్తేజపరచడానికి.‌ ఆ వయసు లో హ్రృదయం అంత నిశ్చింతగా ఉంటుంది. అతడు ఆ బుట్ట లో అడుగున కొన్ని ఆకులు పేర్చేడు. కొన్ని గులకరాళ్ళు, కంకర తీసుకుని బుట్ట లో సర్దేడు.‌ ఆ తరవాత తన చొక్కా విప్పి, ఆ బుట్ట మీద కప్పేడు. అతడు ఆ బుట్ట ని నెత్తి మీద పెట్టుకుని, ఊరి వైపు నడక ప్రారంభించేడు. ఇప్పుడు అతడు జతిన్ కోసం ఎదురు చూస్తున్న పిల్లాడు ఎంతమాత్రం కాదు. అతనే జతిన్. నెత్తి మీద స్వర్గం లోకం నుంచి తెచ్చిన ప్రసాదంతో, అదే పిలుపుతో, అతని నడక, మాట అన్నీ అచ్చం అలానే ఉన్నాయి. తనే జతిన్ గా మారిన ఈ క్షణం లో కలిగినంత ఆనందం జతిన్ ని ఊళ్ళోకి తీసుకు వెళ్ళడం వలన కలిగేదా? ఆ భ్రమ ని నిజంగా భావిస్తూ అతను ఎగురుతూ వెళుతున్నాడు.‌ అహేతుకమైన ఆనందం.‌ అతడు నడిచేడనే కంటే నాట్యం చేసేడనడం సబబు గా ఉంటుంది.‌  గర్వం తో తల పైకెత్తి  నడవసాగేడు.‌

      అమాయకమైన అతని మొహంలో తన విశ్వాసం ఎంతగా ప్రతిఫలించిందంటే, అతడిని చూసి నవ్వే సాహసం ఎవ్వరూ చెయ్యలేకపోయేరు. ఊళ్ళోకి వెళుతున్నప్పడు అతని తీరు అంత గంభీరంగా ఉంది.‌ అతడి పిలుపు విన్న పిల్లలు పరిగెత్తుకుంటూ, అతని వద్దకు వచ్చేరు. జతిన్ మాదిరి గానే, నందన్ చుట్టూ ఆత్రం గా పిల్లలు మూగేరు. ఎవరో అడిగేరు: “ ఇది ఏం ఆట?” అని.‌ కానీ, ఒక హ్రృదయం మరో హ్రృదయాన్ని అర్థం చేసుకుంది.‌ మిఠాయిల అమ్మకం ప్రారంభం అయింది.‌ గులకరాళ్ళు డబ్బు గా మారేయి.‌రాళ్ళు, కంకర మిఠాయిలయ్యేయి. ఈ ఆట మరింత సరదాగా ఉంది.‌ వివేకం లో  అందం,ఆనందం, నిశ్చింత ఉండవు.‌

   మున్ను ఒక గులక రాయి ఇచ్చి, “ జతిన్, నేను ఈ మిఠాయికి నీకు ఒక అణా ఇస్తున్నాను,” అన్నాడు.

  జతిన్ ఒక ఆకు మీద కొన్ని రాళ్ళు ఉంచి, ఆ పిల్లాడి చేతికి అందించేడు.

    మిఠాయిలు అంత తియ్యగా, రుచికరంగా ఎప్పుడూ లేవు.

Aruna Prasad
రోసి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *