హిందీ అనువాద కవితలు

Spread the love

విచిత్ర అపరాధం
------------------------

నువ్వలా అకాలంగా చనిపోయినప్పుడు
అందరూ అన్నారు--
ఇంకా ఎన్నో తీర్చుకోవాల్సిన బాధ్యతలుండగా
ఇలా హఠాత్తుగా చనిపోయి ఉండకూడదని
పిల్లలు ఇంకా ఉద్యోగస్తులు అవ్వనప్పుడు
భార్య భావి జీవితం ఎంతో ఉన్నప్పుడు
పూలకుండీలలో నువ్వు నాటిన మొక్కలు ఇంకా ఎదగాల్సి ఉన్నప్పుడు
ఇవన్నీ ఏమౌతాయి నీవు లేనప్పుడు

నువ్వు బతికి ఉండగానే ఎన్నెన్నో చేసావు
కొవ్వత్తిలా కరిగావు
అయినా నవ్వుతూ తిరిగావు
కష్టాల గట్టెక్కావు
కొందరిని గట్టెక్కించావు
అయినా సరే నీ మరణంపై అంటున్నారు
ఇలా హఠాత్తుగా మరణించడం
నీవు ఇష్టపడి చేసిన అపరాధమని

-హిందీ మూలం: కుమార్ అంబుజ్
అనువాదం : ఆర్. ఎస్. వెంకటేశ్వరన్.

నా భాషలో శపథం చేస్తున్నాను
------------------------------------------

నా భాషలో శపథం చేస్తున్నాను
నేను ఏ భాషనీ అవమానించనని
కానీ ప్రతీ జన్మలో
నా మాతృభాష మారిపోవాలి
దాని కోసం
నా పునర్జన్మ అవుతూ ఉండాలి
ఈ మాట జీవ జగత్తుతో చెబుతున్నాను
పక్షులు, పశువులు, కీటకాలతో కూడా చెబుతున్నాను.

-హిందీ మూలం: వినోద్ కుమార్ శుక్లా.
అనువాదం : ఆర్. ఎస్. వెంకటేశ్వరన్.

ఒక శవయాత్రలో
ఆ ఊరంతా తరలి వచ్చింది

ఎవరు కారణమో ఈ
శవయాత్రకు వారొక్కరే రాకున్నది

-గాలిబు
అనువాదం: వెంకటేశ్వరన్

ఓ ప్రియురాలా! నేనెలా
నీ శవయాత్రలో భాగస్తుడనయ్యేది

నీ వెనుకనే తోడుగా నా
శవయాత్ర కూడా తరలివస్తున్నది

-పర్వీన్ షాకీర్
అనువాదం: వెంకటేశ్వరన్

ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.

వెంకటేశ్వరన్ గారి విద్యాభ్యాసం బెర్హంపూర్ లో జరిగింది. సుప్రీమ్ కోర్టులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉంటున్నారు. మంచి చదువరి, కవి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *