అడియాస

Spread the love

జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే దురదృష్టకరమైన కలయికలను తప్ప… ఈ ‘అడియాస’ కథ మనకు నేర్పే గొప్ప నీతి ఏదీ లేదని బాలజాక్ తానే స్వయంగా ఒప్పుకుంటాడు. ఇక ఆ దురదృష్టం విషయానికొస్తే— 1483లో కేవలం పన్నెండేళ్ల పిన్న వయసులోనే కిరీట ధారణ చేసిన ఎనిమిదవ చార్లెస్ మహారాజు, ఆంబోయిస్ కోటను గోథిక్ శైలీ రాజప్రసాదంగా ఎంతో వైభవోపేతంగా  పునరుద్ధరించాడు. తీరా 1498లో, ఆ కోట ద్వారాల్లో ఒకదానికి అనుకోకుండా తల బలంగా తగిలి దారుణంగా ప్రాణాలు వదిలాడు. ఇంతకీ ఆయన అంత ఆతురతగా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? చెప్పేదేముంది, రాజభవనంలో టెన్నిస్ ఆట ఆడటానికి!

***

ఫ్రాన్స్ రాజైన ఎనిమిదవ చార్లెస్, అంబోయిస్ కోటను ఎంతో వైభవంగా శిల్పకళా శోభతో తీర్చిదిద్దాలని తలపెట్టిన కాలమది. ఆయన తనతో పాటు కొందరు నైపుణ్యమున్న పనివారిని, మేటి శిల్పులు, మంచి చిత్రకారులు, గృహ నిర్మాణ నిపుణులను తోడ్కొని వచ్చారు. వారు ఆ భవంతి గదులను అద్భుతమైన కళాఖండాలతో అలంకరించారు. అయితే కాలక్రమంలో సరైన సంరక్షణ లేక చాలా వరకు పాడైపోయాయి.

ఆ రోజుల్లో రాజకుటుంబం అంతా ఈ సుందరమైన ప్రాంతంలోనే నివసించేది. శిల్పులు తమ ఆలోచనలకు కళారూపం ఇవ్వడాన్ని ఏలినవారు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఆనందించేది. అలా బయటి దేశాల నుండి వచ్చిన కళాకారులలో ‘యాంజెలో కప్పారా’ అనే యోగ్యుడైన ఇటాలియన్ యువకుడు ఉన్నాడు. వయసులో చిన్నవాడైనా, మిగిలిన వారందరికంటే ఎంతో ప్రతిభ కలవాడు. వసంతకాలం లాంటి పడుచు వయసులోనే అతనికి పట్టుబడ్డ శిల్ప నైపుణ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. నిజానికి, పురుషత్వ గంభీరతను చాటే మీసాల కట్టు కూడా ముఖంపై తీరిగ్గా తిరగనేలేదు. 

అంతఃపుర కాంతలకు యాంజెలో అంటే ఎంతో ముచ్చటగా ఉండేది. ఎందుకంటే అతను అందమైన కలలా ఉండేవాడు, అలాగే- జంట వీడి ఒంటరైన పావురం కంట ముసిరిన దిగులులా  ఉండేవాడు. గూడు కట్టిన విషాదానికి కారణం ఉంది. శాపగ్రస్త పేదరికం- జీవితంలో ప్రతి పనినీ పాడుచేసి, ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఆ శిల్పి కూడా బీదరికం బాధితుడే. కడుపు నిండా తిండి లేని, కనీసం జేబులో పైసా లేని స్థితికి సిగ్గుతో చితికిపోతూ బతికేవాడు. ఆ వేదనల, నిరాశల నుంచే తన కళకు రూపాన్ని ఇచ్చేవాడు. ఎలాగైనా సరే- కళాకారులకు ఎంతో ఇష్టమైన ప్రశాంత, నిశ్చింత జీవితాన్ని తానూ పొందాలని ఆరాటపడేవాడు. 

గొప్పల కోసం, ఆ ఫ్లోరెన్స్ యువకుడు రాజాస్థానానికి ఘనమైన దుస్తులు ధరించి వచ్చేవాడు. కానీ వయసు తెచ్చిన అమాయకత్వం, పేదరికం పెంచిన ఆత్మన్యూనత— తన కష్టానికి దక్కాల్సిన సొమ్మును ధరణీపతిని ముఖతా అడిగే ధైర్యాన్ని ఇచ్చేవి కావు. వస్త్రాదిధారణ చూసి, రాజేమో అతనికి ఏ లోటూ లేదని భావించేవాడు. ఆస్థానంలో ఉండే రాజభృత్యులూ, స్త్రీలూ అతడి అద్భుతమైన శిల్పాలను, శిల్పి అందాన్ని చూసి మురిసిపోయే వారు. ముఖ్యంగా స్త్రీలైతే అతడి యవ్వనాన్ని, నల్లటి పొడవైన జుట్టును, మెరిసే కళ్లను చూసి, సహజంగానే ధనవంతుడని అనుకున్నారే తప్ప… అతనికి డబ్బు అవసరమన్న ధ్యాసే వారికి కలగలేదు. ఎందుకంటే, ఆస్థానంలోని ఎందరో దగాకోరులకు ఈ ‘రూప సంపదే’ భూములను, బోలెడంత ధనాన్ని, సమస్త సుఖాలనూ తెచ్చిపెడుతుంటే…వారి ఆలోచనలో పొరపాటేముంది! 

పసివాడని రూపసి అయినా, మాస్టర్ ఏంజిలోకు ఇరవై ఏళ్లు ఉంటాయి. అతడేమీ అల్పజ్ఞుడు కాదు. ఉదారమైన హృదయం, అంతరంగం నిండా కవిత్వం, అపారమైన ఊహాశాలీనత ఉన్నవాడు. కానీ, బీదతనంలో మగ్గే అభాగ్యుల్లాగే తనపై తనకు ఆత్మవిశ్వాసం తక్కువ. ఎందుకూ చేతకాని అజ్ఞానులు పొందే విజయాలను చూసి ఆశ్చర్యపోయేవాడు. తన దేహంలోనో, ధారణలోనో  లోపమేదో ఉందని లోలోపలే కుమిలిపోతూ, వేరెవరికీ చెప్పకుండా వేదనంతా మదిన పూడ్చి పెట్టుకునేవాడు. కాదు, నేను చెప్పింది పొరపాటే… అతని ఆలోచనల్ని వెన్నెల రాత్రులకు, ఆకాశ నక్షత్రాలకు, చీకటి నీడలకు, దేవుడికి, దెయ్యానికి, తన చుట్టూ ఉన్న సమస్తానికీ చెప్పుకునేవాడు. 

అలాంటి సమయాల్లో.. తన హృదయం వెచ్చటి ఆరాటంతో, నిండైన ప్రేమతో ఉన్నందుకు  తలరాతను నిందించుకునే వాడు. ఎర్రగా కాలిన ఇనుమును చూసి భయపడినట్లు, స్త్రీలు తనను చూసి దూరంగా పారిపోతున్నారని అనుకునేవాడు. ఆపై, ‘తనకో అందమైన ప్రేయసి దొరికితే ఆమెను ఎలా ఆరాధించాలి? జీవితాంతం ఎలా గౌరవించాలి? ఎంత నమ్మకంగా ఉండాలి? ఎంత అనురాగంతో సేవ చేయాలి? ఆమె మాటలను ఎలా శిరసా వహించాలి? ఆకాశం మేఘావృతమైన రోజులా, ఆమె ముఖాన ముసురుకునే చిన్న చిన్న దిగులు మబ్బులను తన ఆటపాటలతో ఎలా పారద్రోలాలి?’ అని ఊహించుకునేవాడు.

ఇంకా- తన ఊహా ప్రేయసి పాదాల చెంత వాలిపోయేవాడు. చెరసాల ఊచల్లోంచి పచ్చటి మైదానాలు చూసిన ఖైదీ, గడ్డిపై పరిగెత్తి అలసిపోయినట్లు… నిజంగానే తన ప్రేయసిని ముద్దులతో ముంచెత్తినట్లు, హృదయానికి హత్తుకున్నట్లు అనుభూతి చెందేవాడు. ఆ మైకంలో మోహిని దయ కోసం మోర పెట్టుకునేవాడు. కామోద్రేకంతో ఊపిరి సలపనంతగా బిగి కౌగిట బంధించుకునేవాడు. మర్యాదలను పక్కనపెట్టి తెగించి, తన పడక దుస్తుల్నే కోరికతో కొరికేవాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కొండంత ధైర్యంతో దివ్య సుందరి  కోసం తపిస్తే… నిజ స్త్రీ ఎదురైతే మాత్రం సిగ్గుపడి, తలదించుకునే వాడు.

అయితే, ఆ అమూల్య కామ కల్పనల ఉద్రేకమంతా… అతడు మార్బుల్ రాళ్లకు ఉలి దెబ్బల కానుకగా చవి చూపేవాడు. మోహాన్ని రగిలించే అందమైన వక్షోజాలు.., ఆ తీపి మన్మథ ఫలాలను చూస్తే నోరూరాల్సిందే! వాటితో పాటు, రవిగాంచని సౌందర్యాలను తన ఉలితో స్పృశిస్తూ, ఆప్యాయంగా చెక్కుతూ, ఆకురాయితో అందాల్ని నునుపు చేస్తూ… ఏమీ తెలియని అమాయకుడికి సైతం ఒక్క రోజులోనే కామ జ్ఞానాన్ని నూరిపోసేలా శిల్పాల్ని తీర్చిదిద్దే వాడు. ఆస్థాన కోమలాంగులు  వాటి  సౌందర్యాన్ని చూసి మురిసిపోతూ, యవన శిల్పి ప్రేమలో పడేవారు. శిల్పి ఏమో, అంగనల్ని   ఆపాదమస్తకం కళ్ళతోనే కొలుస్తూ… వారిలో ఏ ఒక్కరైనా ముద్దు పెట్టుకోవడానికి తన వైపు చిటికెన  వేలు చూపించినా, తన కోరిక నెరవేరుతుందని మనసులోనే మురిసిపోయేవాడు! 

ఆస్థాన కులీన కాంత ఒకరు ఒకనాడు ఒంటరిగా కుర్ర శిల్పి చెంతకు వచ్చి, “ఎందుకంత సిగ్గు నీకు? రాజాస్థాన భామల్లో ఒక్కరూ నిన్ను మాటల్లోకి దింపలేకపోయారా?”ని నవ్వుతూ పలకరించింది. ఆపై, “ఆ సాయంత్రం తన నివాసానికి రమ్మ”ని ఆత్మీయంగా ఆహ్వానించింది.

ఏంజిలో అత్తరు పూసుకున్నాడు. సాటిన్ అంచులు మెరిసే మఖమల్ వస్త్రం కొన్నాడు. వదులు చేతుల అంగీ, గాట్లు పెట్టిన చొక్కా, పట్టు మేజోళ్లు మిత్రుడి దగ్గర బదులు తెచ్చుకుని తొడుక్కున్నాడు. ఆశాజ్వలిత నయనాలతో, ఆతురత నిండిన అడుగులతో ఆమె ఇంటి మెట్లు ఎక్కాడు. ఎదలోని గుండె కంచె లోపలి మేకపిల్లలా తుళ్లుతోంది. ఎంతటి ప్రేమ జ్వరం ఆవహించిందంటే… ఒళ్లంతా చెమటలు పూసి, చుక్కలై వెన్ను జారాయి!  

ఎంచేతంటే— ఆ రూపం తలపుల్లోకి రాగానే ఎవరి ఒళ్లయినా కంపించక మానదు! ఆ సౌందర్యం అద్భుతం అనడంలో లేశమాత్రం అనుమానం లేదు. పైగా శిల్పి అయిన యాంజెలోకు ఆ సంగతి ఇంకా బాగా తెలుసు. అతడు వృత్తిరీత్యా స్త్రీ దేహపు ఒంపుసొంపులను, అంగాంగ లావణ్యాన్ని, ఆ రహస్య సౌందర్య శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. ఆమె రూపం శిల్పకళా నియమాలకు సరిగ్గా సరిపోయే అపురూపం. లత వంటి తనువు, కెంపు వర్ణపు ఛాయతో అలరారడమే కాకుండా… గొంతులో మనుషుల మదిన మదనాగ్ని రగిలించి, మరిగించే మాయా మైకం ఉంది. ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా, పురుషుల్లో కామ కల్పనలను కలిగించే లక్షణం ఉన్న అభిశప్త అంగనల్లో ఆమె ఒకరు.

లోపలి వెళ్లేసరికి, ఆమె నిప్పుపొయ్యి పక్కన ఎత్తైన కుర్చీలో కూర్చుని ఉంది. శిల్పిని చూడగానే సంకోచం లేకుండా చలాకీ మాటలు మొదలు పెట్టింది. ఏంజిలో మాత్రం నోరు పెగలక, “అవును” – “కాదు” అని పొడిపొడిగా అనగలిగాడే తప్ప మరో మాట గొంతు దాటలేదు, తలకు వేరే ఆలోచన తట్టలేదు. లేయెండల ఎగిరే సీతాకోకచిలుకలా చురుగ్గా తిరిగే తన ప్రియురాలిని తిలకించడం, తేనెలొలుకు మాటలు ఆలకించడం వంటి ఆనందమే లేకపోతే… అతను నిజంగానే ఆ పొయ్యికేసి తల బాదుకొని ఉండేవాడే!  ఈ రకమైన మూగ ఆరాధనతో అర్ధరాత్రి వరకు గడిపారు. ప్రేమ పూలబాట వెంట ఇద్దరూ మెల్లగా నడిచారు. ఆ మంచి శిల్పి అపరిమిత ఆనందంతో వెలిగిపోతూ అక్కడ్నుంచి  వెళ్లిపోయాడు. 

దారి నడుస్తూ మనసులోనే ఒక ముగింపుకు వచ్చాడు: కులీన కలికి  రాత్రి వేళ నాలుగు గంటల పాటు తన పరికిణీ అంచులు సోకేంత సమీపంలో కూర్చోబెట్టుకుందంటే, ఇక మిగతా రాత్రంతా కూడా తన చెంతనే ఉంచుకోవడానికి ఏమాత్రం సందేహించదు.., అదొక ఎండు గడ్డిపరక సమానం ఆమెకు! అనుకున్నాడు. ఈ ఆలోచనల్నించి కొన్ని నిర్ణయాలకు వస్తూ… ఆమెను ఒక సామాన్య స్త్రీగా ఎంచి, తన కోరిక తీర్చమని కోర నిశ్చయించుకున్నాడు. అది కేవలం ఒక్క ఘడియ కాలమే కావచ్చు కానీ,   ఆ ఆనందాల నూలు వడికే కుదురును కోల్పోవడం కన్నా… భర్త,  భార్య, మరెవ్వరినైనా  చంపడానికి లేదా చావడానికైనా సిద్ధపడ్డాడు. నిజానికి, అతని  ప్రేమ పిచ్చి ఎంతగా ముదిరిందంటే… శృంగారం చిలికే రోజు సుఖం కోసం వేయి జన్మలనైనా త్యాగం చేయవచ్చని, ఈ ప్రేమ అనే జూదంలో తన ప్రాణం ఒక చిన్న పందెం మాత్రమేనని నమ్మాడు.

సంగమ సాయాహ్నం  కోసం నిరీక్షిస్తూ, ఫ్లోరెన్స్ వాసి రాళ్ళను రూపాలుగా మలుస్తున్నాడు. మనసంతా లలనపై లగ్నమై, ఎన్నో బొమ్మల ముక్కులను చెడగొట్టాడు. అది స్పృహించి, పనిని పక్కనపెట్టి, అత్తరు పూసుకుని, తేనెలొలుకు ప్రియురాలి పలుకులను చేతలుగా  మలచుకోను ఆశతో బయలుదేరాడు. తీరా ఆ కులీన కోమలి ముందర నిలబడగానే… ఆమె స్త్రీత్వపు ఆధిపత్యం, రాచరికపు రాజసం అతనికి స్పష్టంగా అనుభవ గోచరమయ్యాయి!” దాంతో, వీధిలో సింహంలా వీరంగాలు వేసే మన పేద కాప్పారా…  వలలో వేసుకోవాలనుకున్న వెలది కళ్ళలోకి చూస్తూ బిక్కమొహమేసి, నోట మాట రాక,  గొర్రె పిల్లలా తానే  లొంగిపోయాడు.

 అడ్డంకులెన్ని ఉన్నప్పటికీ… దేహాల నడుమ సెగలు రగులు సమయం ఆసన్నమయ్యే సరికి, అతడు దాదాపు భామ ఒడిలో వాలిపోయి గాఢంగా కౌగిట బంధించాడు. ఆ మైకంలో ఒక ముద్దును సంపాదించాడు—కాదు కాదు, దాన్ని బలవంతంగా దోచుకున్నాడు! అదెంతో ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే, స్త్రీలు ముద్దు ఇవ్వ నిరాకరించే హక్కు ఉంటుంది; కానీ వారంతట వారే తమ్ము దోచుకోమ్మని అనుమతిస్తే,  అభిమతుడు వెయ్యి ముద్దులైనా దోచుకోవచ్చు!  ముదితలు ముద్దు ఇవ్వడం కన్నా… వల్లభుడు దోచుకుంటుంటే హాయిగా ఒదిగిపోవడానికే ఇష్టపడతారు! అందుకే మధుకర హృదయులకు చోర చొరవ అలవాటైపోయింది. ఆ ఫ్లోరెన్స్ శిల్పి అలా ఎన్నో ముద్దులను ముడుపు కట్టుకున్నాడు. వ్యవహారం  రసవత్తరంగా సాగుతున్న తరుణం… సరససల్లాపాల్లో ఇంతసేపూ తనవంతు పొదుపు సూత్రం పాటించిన తరుణి, ఒక్కసారిగా—”అయ్యో, మా ఆయన!” అని అరిచింది. 

నిజంగానే ఆమె భర్త టెన్నిస్ ఆట ముగించుకుని అప్పుడే ఇంటికి వచ్చాడు. శిల్పి అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. తారాస్థాయికి చేరిన ఆ శృంగార సుఖానికి అర్ధాంతరాయం కలిగితేనేం … ఆ మోహనాంగి,  వగకాడికి ఒక మోహపు వేడి చూపును కానుకగా విసరడం మాత్రం మర్చిపోలేదు! ఒక నెల రోజుల పాటు అతనికి దక్కిన అనుభూతి, ఆహారం, ఆహ్లాదం అదొక్కటే! ఎందుకంటే, అతని సుఖం చివరి అంచులు చేరే సరి సమయానికి, సరిగ్గా పడతి పతి ప్రత్యక్షమయ్యేవాడు. సూటిగా తిరస్కరించడానికి అనువుగా, మోహాన్ని రగిల్చే చిన్ని చిన్ని ముద్దులకు మధ్యలో పుడకలా   దూరేవాడు.

ఒకరోజు శిల్పికి ఓపిక నశించింది! అక్కడికి చేరడమే తడవుగా…విజృంభించాడు. ఈ గందరగోళాల వల్ల ఖచ్చితంగా లాభపడే ఆవిడ భర్త వచ్చేలోపు, ప్రేమ విజేతగా నిలవాలని తపించిపోయాడు.  ఇంకేం ఆలోచించక ఆత్రంగా ఆమె పరికిణీ అంచులు అందిపుచ్చుకుని, సరసాల సమరానికి తెరతీశాడు. కానీ, శిల్పి కళ్ళలో రగులుతున్న మోహావేశాన్ని గ్రహించిన ప్రౌఢ… ముగింపే లేని గొడవలకు, వాదనలకు తెరలేపేది. మొదట, ప్రేమను నిందించడానికి అసూయ నటిస్తున్నట్లు నాటకమాడేది; వెంటనే, తేనెముద్దులొలికించి కుర్రాడి కోపాన్ని చల్లార్చేది. ఆపై, సంభాషణను పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకుని— తన ప్రేమికుడు బుద్ధిమంతుడిగా ఉండాలని, తన చిత్తానికి విధేయుడిగా నడుచుకోవాలని, లేకపోతే తన ప్రాణాన్ని, ఆత్మను అర్పించేది లేదని పదే పదే చెప్పేది. ప్రియురాలికి బహుమతిగా ఇవ్వడానికి ‘ కోరిక’ అనేది అల్ప విషయం; పైగా, అతని కంటే తానే అమితంగా ఆరాధిస్తోంది, ఆ ప్రణయం కోసం మీదుమిక్కిలి త్యాగాలకూ సిద్ధపడింది! కాబట్టి… ఎక్కువ ధైర్యవంతురాలినని తెలివిగా  వాదించేది. అతడు ఏమైనా సరసపు ప్రతిపాదనలు తెస్తే చాలు— “నిశ్శబ్దం, సర్!” అని రాణిలా శాసించేది. కొన్నిసార్లు, కాప్పారా పరివాదాలకు సమాధానంగా—”నేను కోరుకున్నట్లు నువ్వు ఉండకపోతే, నిన్ను ఇక ఏమాత్రం ప్రేమించను!” అంటూ కోపముఖం పెట్టేది.  

ఇది  పవిత్రమైన, నిజమైన ప్రేమ కాదని, లోభి నాణేలు దాచుకున్నట్లు ఈ సుదతి సుఖాన్ని పరికిణీ మాటున ముడేసి పెడుతుందని పేద ఇటాలియన్ శిల్పి చాలా ఆలస్యంగా గ్రహించాడు. ఆమె తనను కంచె బయటే గంతులు వేయనిస్తోందే తప్ప,  ప్రేమ తోటలోకి అడుగుపెట్టనివ్వడం లేదని అర్థమైంది. ఈ నయవంచన ఎంతటి ఆగ్రహజ్వాలలు రగిల్చిందంటే… కప్పారా ఎవరి ప్రాణాలైనా తీసేంత మృగత్వంలోకి జారిపోయాడు! అందుకే,అధిరాజుతో టెన్నిస్ ఆట ముగించుకుని రాత్రి ఇంటికి నడిచి వెళ్లే ఆవిడ పెనిమిటి మీద దాడి చేయడానికి నమ్మకమైన స్నేహితుల్ని సిద్ధం చేసుకున్నాడు.

అటుపిమ్మట, అలవాటైన సమయానికే అతడు తన సకియ ముంగిట వాలాడు. సరస సల్లాపాలు తారాస్థాయికి చేరుకున్నాయి—గాఢమైన దీర్ఘ ముద్దులు, కురులు చిక్కుపడటాలు – ముడులు విప్పారడాలు, మోహంతో చేతుల్ని కొరకడాలు – చెవుల్ని కరిచి గాయపరచడాలు… మంచి రచయితలు వర్ణించ వెనుకాడే ఆ ‘ఒక్క పని’ మినహా, మిగిలినవన్నీ జోరు జోరుగా సాగుతున్నాయి.!

ఆ ఫ్లోరెన్స్ శిల్పి రెండు తీపి ముద్దుల మధ్యలో ఆరాటంగా అడిగాడు— “ఓ నా ప్రియతమా! లోకంలోని అన్నింటి కంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నావా?”

“అవును,” అంది ఆమె. ఎందుకంటే, సోది మాటలకు సొమ్ము లేమీ ఖర్చు కావుగా!

“అయితే సరి, మాటల్లోనే కాక చేతల్లో కూడా నాదానివికా!” అన్నాడు.

“కానీ, క్షణాల్లో ఆయన వచ్చేస్తాడే!” అంది.

“అదొక్కటేనా నీ అభ్యంతరం?”

“అవును.”

“అయితే విను, మీ ఆయనకు అడ్డుపడి ఆపేందుకు నా మిత్రులు ఉన్నారు. నేను ఈ కిటికీ దగ్గర దివ్వె చూపించేంత వరకు ఇటు రానివ్వరు. ఒకవేళ పాలకునికి ఫిర్యాదు చేసినా… ‘మా మిత్ర బృందంలో ఒకరనుకొని సరదాగా పరిహాసమాడుతున్నాం’అంటూ సమర్థించుకుని దేవర బారి  తప్పించుకుంటారు.

“అయ్యో, నా రాజా! ఉండు, ఇంట్లో అందరూ పడుకున్నారో లేదో చూసొస్తాను,” అంటూ లేచి వెళ్లి, వెలుగుతున్న దీపాన్ని కిటికీ దిక్కు తిప్పి పట్టుకుంది.

ఆ దృశ్యం చూడగానే కాప్పారాకి ఆమె నయవంచన, నీచ మనస్తత్వం స్పష్టంగా అర్థమైపోయాయి, దివ్వెను ఆర్పేసి, కత్తి దూసి, వంచకి ముందు నిలబడ్డాడు.

“నేను నిన్ను చంపను, మేడమ్! కానీ, ఏ కుర్ర ప్రేమికుల జీవితాలనైతే పాడుచేస్తూ  శృంగార క్రీడలు ఆడుతున్నావో… వారితో ఇకపై ఎన్నడూ చెల్లాటాలు ఆడకుండా నీ ముఖంపై గాటు పెడతాను. నన్ను దారుణంగా మోసం చేశావు, నువ్వు మర్యాదస్తురాలైన స్త్రీవి కావు! కేవలం ఒక ముద్దుతో నిజమైన ప్రేమికుడి ప్రాణం నిలవదని, ముద్దు పెట్టుకున్న పెదవులకు తక్కిన సుఖం కూడా కావలసి వస్తుందని తెలుసుకో. నా జీవితాన్ని శాశ్వతంగా నిస్సారంగా, దుర్భరంగా మార్చేశావు. నన్ను జీవచ్ఛవంగా మార్చిన నీ ఈ ద్రోహచింతన  జీవితాంతం గుర్తుండేలా గుణపాఠం నేర్పిస్తాను!. ఇకపై అద్దంలో చూసుకున్న ప్రతిసారీ నా రూపాంతరమే నీకు కనిపించి తీరుతుంది!”

అంటూ అతడు తన చెయ్యి పైకెత్తి, తానిచ్చిన ముద్దుల తడులు ఇంకా ఆరని ఆ పచ్చి పసందైన చెంప భాగాన్ని కోసేయడానికి కత్తి సిద్ధం చేశాడు.

భామిని భయంతో— “ఓరి క్రూరుడా!”ని అరిచింది.

“నోరు మూసుకో! అన్నింటికంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నానని చెప్పావు. ఇప్పుడేమో మాట మారుస్తున్నావు. ప్రతి సాయంత్రం నన్ను స్వర్గానికి కాస్త దగ్గరగా తీసుకెళ్లి, ఒక్క దెబ్బతో నరకంలోకి తోసేశావు! నీ పరికిణీ అంచులు నిన్ను ఈ ప్రేమికుడి ఆగ్రహం నుండి కాపాడగలవని అనుకుంటున్నావా?— అస్సలు కాపాడలేవు!” 

ఆవేశంతో రగిలిపోతున్న అభిమతుడ్ని చూసి ఆశ్చర్యపోతూ— “అయ్యో, నా యాంజెలో! నేను నీదాననే!” అంది.

అంతట అతను మూడు అడుగులు వెనక్కి వేసి, “రాచరికపు కపటం, నికృష్ట మనస్సు కలదానా! నీ ప్రేమికుడి కంటే నీకు ముఖమే ఎక్కువైందన్నమాట! అంటూ హుంకరించాడు. 

ఆమె ముఖం వెలవెలబోయింది. తన గత వంచన ప్రస్తుతం తనలో ఉన్న నిజమైన ప్రేమకు అడ్డుపడుతుందని గ్రహించి, దీనంగా తన ముఖాన్ని పైకెత్తి చూపింది. కరుణ చూపని కాప్పారా ఒక్క వేటుతో ఆమె ముఖాన్ని చెక్కి, ఇల్లు వదిలి, దేశం దాటి పారిపోయాడు.

కిటికీలో దివ్వె వెలుగును చుసిన ఫ్లోరెన్స్ శిల్పులు,  భర్త రాకడకు అడ్డుపడలేదు. అతను లోపలికి వచ్చి చూసేసరికి తన భార్య ఎడమ చెంప ఊడిపోయి ఉంది. అంతటి నరకయాతన అనుభవిస్తున్నా నోరు విప్పి ఒక్క మాట చెప్పలేదు; ఎందుకంటే తన ప్రాణం కంటే మిన్నగా ఆమె కాప్పారాను ప్రేమించింది!

అయినప్పటికీ, ఆ గాయం ఎలా అయింది తెలుసుకోవాలని భర్త ఆరా తీశాడు. అక్కడ ఫ్లోరెన్స్ శిల్పి తప్ప వేరెవరూ లేకపోవడంతో ప్రభువుకు ఫిర్యాదు చేశాడు. తన వద్ద పనిచేసే ఆ శిల్పిని వెంటాడి పట్టుకుని, ‘బ్లోయ్’ నగరంలో ఉరి తీయాల్సిందిగా అధిపతి ఆదేశించారు.

ఉరి తీసే రోజు, ఓ రాజకాంతకు ఈ ధైర్యవంతుడైన ప్రేమికుడిని ఎలాగైనా కాపాడుకోవాలనే కోరిక కలిగింది. నిజమైన ప్రేమ విలువ తెలిసినవాడిగా భావించి, అతన్ని తనకు బహుమతిగా ఇవ్వమని  పృథ్వీపతిని వేడుకుంది; అధీశుడు సంతోషంగా అంగీకరించాడు.  

కానీ కాప్పారా తాను పూర్తిగా తన ప్రియురాలికే సొంతమని, ఆమె జ్ఞాపకాలను తానెప్పటికీ తుడిచిపెట్టుకోలేనని చెప్పాడు. అతడు మఠంలో చేరి, కార్డినల్ గా, గొప్ప పండితుడిగా మారాడు. తన ముసలితనంలో— జీవితమంతా ఆవహించిన సుదీర్ఘ వేదనల నడుమ తాను అనుభవించిన  ఆ కొన్ని ఘడియల తీపి జ్ఞాపకాల ఆదరువుతోనే ఇన్నాళ్లూ ఊపిరి పీల్చుకున్నానని; అక్కడ తన ప్రియురాలి చేతిలో తాను అత్యుత్తమంగానూ, అదే సమయంలో అత్యంత దారుణంగానూ ఆరాధించబడ్డా”నని అతను తరచూ స్మరించుకునే వాడు. 

కొందరు రచయితలు, “చెంప నయం అయిన తన పాత చెలియతో మళ్లీ జతకట్టా”డని అంటారు కానీ, నేను దాన్ని నమ్మను! ఎందుకంటే యాంజెలో కప్పారా సంస్కారవంతమైన హృదయం, ప్రేమ యొక్క పవిత్ర ఆనందాల పట్ల ఉన్నతమైన అభిప్రాయం ఉన్నవాడు.

జీవితాన కొన్ని దురదృష్టకరమైన సమాగమాలు తప్పక ఎదురవుతాయనే సత్యం తప్ప, ఈ కథ మనకేమీ గొప్ప నీతి పాఠం నేర్పదు! ఎందుకంటే ఇది అక్షరాలా నిజమైన కథ! ఇతర కథల్లో రచయిత సత్యాన్ని మించి కల్పనలు అల్లి ఉండవచ్చు గాక… కానీ ఈ కథ మాత్రం అతనికి మతాధికారుల నుంచి, ప్రేమారాధకుల నుంచి సంపూర్ణ ఆమోదాన్ని, అభిమానాన్ని సంపాదించి పెడుతుంది!” 

-END-

బాల్జాక్

ప్రపంచ ప్రఖ్యాత రచయితలలో వేళ్ళ మీద లెక్కపెట్టగల అతికొద్ది మందిలో ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ ఒకడు. హోనొర్ డి బాల్జాక్ 20 మే 1799 సంవత్సరంలో జన్మించాడు. చార్లెస్ డికెన్స్, గుస్టావ్  ఫ్లాబర్ట్, హెన్రి జేమ్స్, ఫిదోర్ దోస్తయేవ్ వంటి మహారచయితలను బాల్జాక్ ప్రభావితం చేసాడని అంటారు. బాల్జాక్ రచనలలో ‘హ్యూమన్ కామెడి’ చాల ప్రసిద్ధి పొందినది. నవలలతో పాటు అనేక కథలు, నాటకాలు కూడా రాసాడు. 1850లో బాల్జాక్ మరణించాడు.

పిన్నంశెట్టి కిషన్

మానవీయ దృక్పథం తో సాహిత్య సృజన చేస్తున్న పిన్నంశెట్టి కిషన్ 8 ఫిబ్రవరి, 1962 న వేములవాడ లో జన్మించారు.
తండ్రి: అచల పరిపూర్ణ శ్రీకరానంద పిన్నంశెట్టి చెన్నయ్య. తల్లి: శ్రీమతి మంచె లక్ష్మీబాయి.

ఎం. ఏ., బీఎడ్., చదివి తూనికలు-కొలతలు శాఖ అధికారిగా పదవీ విరమణ చేశారు. దాదాపు అరవై కథలు, వందకు పైగా కవితలు, కొన్ని విమర్శనా వ్యాసాలు రాశారు.

కథా విభాగంలో “ లేంబాళ వాటిక కథలు “,
కవితా విభాగంలో “ నల్ల పద్యం “ సంపుటాలు వెలువడ్డాయి.

వేములవాడ నేపథ్యంలో 1970 నుంచి 1990 వరకు గల ఊరి సామజిక స్థితిగతుల్ని ఆత్మకథనాత్మక శైలిలో “ లేంబాళ వాటిక కథలు “ రాశారు.లేంబాళ వాటిక కథలకు గూడూరి సీతారాం కథా పురస్కారం-2024 నకు మరియు పీచర సునీతా రావు స్మారక సాహిత్య పురస్కారం-2025 నకు లభించాయి.2023 వ సంవత్సరానికి, కథా విభాగంలో లేంబాళ వాటిక కథలు సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం వచ్చింది.  "నల్ల పద్యం" కవితా సంపుటికి హాసిని రామచంద్ర లిటిరరీ పౌండేషన్ ఖమ్మం వారి పురస్కారం 2024 గాను లభించింది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *