శ్రీ పర్వత విజయపురి, క్రీ.శ 258
“ఆచార్యులవారు 56మంది భిక్కులు, 14మంది భిక్కునిల సమూహంతో ధాన్యకటకం నుంచి బయలుదేరి మూడు రోజులైంది మహారాణి. కృష్ణమ్మ వడిలో తగినంత నీరు లేకపోవడం వల్ల, కాలినడకనే వస్తున్నారు. దారిలోని స్తూపాలను సందర్శిస్తూ, అక్కడ ప్రజలకు ధర్మాన్ని బోధిస్తున్నారు. వందలమంది ఉపాసినీ, ఉపాసకులు తమ భిక్షను ఇవ్వడానికి అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఇంకొంత మంది వారిని అనుసరిస్తున్నారు. పంచశీల, ఆరోగ్యం, దుఃఖ విముక్తి గురించి చిన్నచిన్న కథలరూపంలో చెబుతూ బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘంశరణం గఛ్చామి అనే త్రిశరణు ఘోష మధ్య వారి పయనం సాగుతుంది. ఇంకో నాలుగు రోజుల్లో వారు తన శిష్యులతో మన నగరానికి విచ్చేస్తారు మహారాణి” అని వినయంగా నమస్కరించాడు, వేగు విక్రముడు.
“మంచిది విక్రమా, సంతోషకరమైన విషయాలను తెలియచేసావు” అని తన అనుచరులను పిలిపించింది మహారాణి సిరిశ్రీ చాంతమూల. “చూళదమ్మ విహారంలో ఆచార్యులవారి వసతి ఏర్పాట్లు చేయండి. వచ్చే మూడు మాసాలు వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుడదిక్కడ. అలాగే ధర్మప్రచారంలో ఉండి వర్షావాసానికి వచ్చే వారిని కూడా గమనంలో ఉంచుకొండి. ఆషాడ పున్నమి ఇంకా వారంరోజులు మాత్రమే ఉంది” అంటూ తన మందిరానికి వెళ్లింది మహారాణి సిరిశ్రీ.
**
అంతఃపురంలోకి వడివడిగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు మహారాజు వీరపురుషదత్తుడు, “సిరి, లంకాద్వీపం నుంచి విచ్చేస్తున్న సంఘపాలథేరస్వామి స్వాగత సన్నాహాలు వేడుకగా చేస్తున్నారని వింటున్నాను. ఎంత వరకు వచ్చాయి ఏర్పాట్లు” అన్నాడు. “చాలా వరకు పూర్తయ్యాయి బావా, బహుశా రేపు సాయంత్రానికి వారు నగరంలోకి విచ్చేయవచ్చు. లంకాద్వీప వర్తకులు ధర్మంపైన అభిమానంతో పంపిన దానాలతో నిర్మించిన సింహాళ విహారం అన్ని సౌకర్యాలతోటి పూర్తైంది. దాని ప్రారంభోత్సవం వారి చేతుల మీదుగానే బావా.”
“వారి రాకపై బ్రాహ్మణ గురువులు అంత సంతోషంగా లేరు సిరి. బౌద్ధం పట్ల మీరు చూపించే ఆపేక్ష, ప్రజల్లో ఉన్న ఆదరణ వారిలో అసూయను రగిలిస్తున్నాయి. బౌద్ధ గురువులు వైభవోపేతంగా ధర్మప్రచారం కోసం రావడం, ప్రజలు తండోపతండాలుగా ధర్మాన్ని కీర్తిస్తూ ఉత్సవాలు చేయడం మరీ ఎక్కువైతే, అది రాజ్యంలో అనవసరమైన ఘర్షణలకు దారి తీస్తుందేమో” అన్నాడు సిరిశ్రీని దగ్గరకు తీసుకుంటూ.
“ఓ మీరు ఇప్పుడు అక్కడ నుంచేనా బావా రావడం, ఎన్నిసార్లు చెప్పినా మీరు వారి మాటల లౌక్యంలో పడిపోతారు వెంటనే నాకు హితబోధ చేయడానికి వచ్చేస్తారు. మహాగురువైన సంఘపాలథేరను అనేకసార్లు ఆహ్వానించిన మీదట వారు జంబూద్వీపంలోని పలు బౌద్ధక్షేత్రాలు దర్శించి, చివరగా మన రాజ్యానికి వస్తున్నారు. మన ఇక్ష్యాకు రాజ్యంలో ప్రజలు తరతరాలనుంచి ధర్మానికి కట్టుబడి, తథాగతుని పాదలకు మొక్కి జీవిస్తున్నవారు. ఈ వర్షావాసమంతా ఆచార్యులవారు ఇక్కడే గడపబోతున్నారు. ఈ విషయం మీకు ముందుగానే చెప్పాను కదా బావా. వారికి వీడ్కోలు పలికే దాకా మీ గురువులను కొంత సంయమనంతో ఉండమని కోరండి. అయినా వారిని అనేకరకాలుగా ఎప్పటికప్పుడు భూరిదానాలతో, యజ్ఞయాగాదులతో సంతృప్తి పరుస్తూనే ఉన్నారుగా. అదీ కాకుండా బ్రాహ్మణమతంలో ఎక్కడాలేని విధంగా ఆలయ నిర్మాణాలకు పూనుకుంటిరి. గత ఏడాదే దాదాపు రెండు వందల బ్రహ్మణ కుటుంబాలను ఉత్తరదేశాలనుంచి పిలిపించి ఊర్లకుఊర్లే ఇస్తిరి, ఇంకే చేయాలి మీరు వారికి” అంటూ ముభావంగా ఉండి పోయింది.
“సంతృప్తి అనేది కోరికలకు ఉండదు సిరి, అందుకే కదా మీ భగవానుడు కోరికే దుఃఖానికి మూలమని చెప్పాడు. కోరికే వద్దు అనే ధర్మం ఇంతమంది ప్రజల ఆదరణకు నోచుకోవడం, మీ లాంటి వారు కూడా ఇంత శ్రద్ధను కలిగి ఉండటం నాకు చాలాసార్లు ఆశ్చర్యమేస్తుంది. ఒక పక్క మా బ్రాహ్మణ గురువులు రాజే దేవుడు అని మాకే పూజలు చేసి ప్రజల్లో మాకు దేవుడనే స్థాయిని ఇస్తున్నప్పుడు. మీరు మాత్రం రాజుకూడా బౌద్ధబిక్షువులకు ప్రణామాలు ఆచరించమని చెప్పడం ఏమిటి? రాబోయే కాలంలో మీ బుద్ధడే మీ ధర్మానికి అడ్డమై నిలబడతాడేమో! ఇలా మహారాజులైన మమ్మల్నే నియంత్రించాలనుకొని, మా ఆదరణ కోల్పోయాక, ఎంతకాలం ఉండగలదు మీ తథాగత ధర్మం.”
“మీకు బౌద్ధం సరిగా అర్థం కాలేదు బావా! మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడం, మీ అహాన్ని తృప్తిపరచడం కంటే అక్కడ ధర్మం ముఖ్యమనే సంగతి మరిచిపోవద్దు. పంచశీల, అష్టాంగమార్గం వంటివి మన నైతిక జీవితానికి సంబంధించిన నియంత్రణగీతలుగా మీకు అనిపించడంలో వింతమీ లేదు. కాని మన దృష్టి అక్కడే ఆగిపోతే ధర్మాన్ని తక్కువ చేసినట్లే. అది ఒక ఆచరణ, దుఃఖ నివారణ, దుఃఖ నిరోధం. స్వీయనియంత్రణతో మనల్నిమనం తెలుసుకుంటూ, మనపైన మనం విజయం సాధించడమే అసలైన ధర్మం. బావా! ఏ ధర్మం ప్రజల ప్రవర్తనలో మార్పుకోరుకొని సమాజాన్ని సరైన మార్గంలో పెట్టాలనుకుంటుందో, కాలినడకనే లోకపు నలుమూలలకు విస్తరించి ఉందో, మనిషిని దుఃఖం నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తుందో ఆ ధర్మం కేవలం రాజుల దయాదాక్ష్యిణ్యాల మీద ఆధారపడి ఉంటుందనుకోను. ఈ రూపం కాకుంటే మరో రూపంలో అది ప్రజలను అంటిపెట్టుకునే ఉంటుంది. ఈనాడు మన రాజ్యంలో నిర్మితమైన విహారాలు, చైత్యాలు, స్తూపాలు, చతుశ్శాలలు, అపురూపమైన శిల్పాలు ఇవన్నీ రాజులకంటే సాధారణ ప్రజలు అభిమానంతో దానరూపంలో పోగుచేసి కట్టుకున్నవే ఎక్కువ కదా బావ! రైతులు, స్త్రీలు, శిల్పులు, కుమ్మరులు, వర్తకులు, సారంగులు, నౌకా నిర్మాణ కూలీలు, శ్రామికులు, చర్మకారులు, భారవాహకులు ఎంత మంది సామాన్యులు బావా బౌద్ధాన్ని అక్కున చేర్చుకున్నది. అయినా, ఇవన్నీ మీకు తెలియనివి కావు. ధర్మం ఉంటుందా, ఉండదా అనే ప్రశ్నను నేను ఆశ్రయించను. ఎందుకంటే నేను ఉన్నంత కాలం నేను ధర్మాన్ని ఆశ్రయిస్తాను కనుక. సరేలే బావా, ఏది నీ మనసుకు హత్తుకొని, నీ బుద్దికి ఉన్నతంగా తోస్తుందో దాన్నే ఆరాధించు. ఏది సత్యమో, విచక్షణో, ఏది ఎంత కాలమో అనేది ఎవరు నిర్ణయిస్తారు. ధర్మబద్ధంగా జీవించడంలోని ఫ్రశాంతత, దాని వలన కలిగే సంతృప్తి, బహుశా అదే ప్రజలను ఆకర్షిస్తుందేమో. మా కుటుంబం తరతరాలుగా శాక్యబుద్ధుని ఉపాసకులుగా ఉంటూ వస్తుంది. నేను భిక్షుణిగా మారాలనే అభిలాషను వ్యక్తం చేసినప్పుడు మా తండ్రిగారు, “తల్లీ నువ్వు కోడలుగా వెళ్లబోతుంది నువ్వే పూజించే భగవానుని వంశాన్నే వారి వంశంగా చేసుకున్న ఇక్ష్వాకు వంశంలోకి, ఒక ఉపాసకురాలిగా నువ్వు దర్మాన్ని నిలబెట్టు. మీ అత్తవారు నీ విశ్వాసాలకు అడ్డుపడేవారు కాదు, మీ అత్తమ్మ విహారాలు కట్టించింది. ఎన్నో దానాలు చేసి ధర్మప్రచారానికి కృషి చేసింది . అడివిని ప్రేమించడం అంటే అడవిలో నివసించడం కాదు సిరి, నువ్వే ఒక అడవిలాగా బతకడం. ధర్మంకూడా అంతేనమ్మ” అన్నారు అనునూయంగా. తండ్రిమాట కాదనలేక పోయాను. ఇక్ష్యాకువంశ కోడలిగా వచ్చాను. ఇక్కడ నా విశ్వాసాల పట్ల స్వేచ్ఛగానే ఉన్నాను. అనేక విహారాల, స్తూపాల నిర్మాణాలలో, మరమ్మత్తులలో భాగం కాగలిగాను. త్రిపిటకాలను నిష్టగా, శ్రద్ధగా అధ్యయనం చేయాలని. దానికి సంబంధించిన అంశాలను ఆచార్యులవారితో చర్చించాలని నా కోరిక. ఇవి మీకు ఇబ్బంది కలిగించే అంశాలని అనుకోను. మీరు యజ్ఞాలు వంటి వాటి పట్ల ఆసక్తి చూపుతున్నప్పటికీ, మీ మత విశ్వాసాలలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. అని చెప్తూ నిద్రదేవి వడిలోకి జారుకుంది, సిరిశ్రీ.
గాలికి ఊగుతున్న కురులమధ్య ప్రశాంతంగా నిద్రిస్తున్న ముఖంలోని అనిర్వచనీయమైన వెలుగును చూస్తూ ఆలోచనలోపడ్డాడు మహారాజు. ఆచార్యనాగార్జునుని కాలం నుంచి సంభవిస్తున్న అనేక పరిణామాలు మదిలో మెదులుతూ ఆయన కలతకి కారణమవుతున్నాయి.
**
నగరమంతా కోలాహలంగా ఉంది. ప్రజలలో కొత్త ఉత్సాహం తాలూకు ఉద్వేగం, ఎక్కడో లంకాద్వీపం నుంచి ఆ రోజు సంఘపాలథేర మహాస్వామి నగరానికి విచ్చేస్తున్నారు. వారి వర్షావాసం కోసం అన్ని విహారాలు, చైత్యాలు అలంకరణలతో నిండి ఉన్నాయి. కొంతమంది ఉత్సాహవంతులు వారికి ఎదురెళ్లి ఆహ్వానించడానికి రెండు క్రోసుల దూరం వచ్చి ఉన్నారు. కపిలగోవులు సాయంత్రం వేళ నింపాదిగా తమ నివాసాలకు లయతప్పని నడకతో వస్తున్నట్లు సాయంత్రపు నీరెండ పడి మెరుస్తున్న కాషాయవస్త్రాలతో అపరబుద్ధుడిలా వస్తున్న సంఘపాలథేర మహాబౌద్ధసమూహం. ఆ భిక్షకుల దారికి అడ్డు తగలకుండా, నమస్కరిస్తూ పక్కకు జరుగుతు శరణు ఘోషతో అనుసరిస్తున్నారు ప్రజలు.
తన పరివారంతో ఎదురు వెళ్లి, వారి పాదాలకు నమస్కరించి వారిని వినమ్రంగా ఆహ్వానించింది మహారాణి. “భంతే, ప్రయాణం ఎలా జరిగింది?”
“ఆయుష్మాన్ మహారాణి, ఆచార్య నాగార్జనులవారు నడియాడిన నేల ఇది. ఈ పవిత్రప్రాంతంలోకి అడుగుపెట్టడం, ఈ నేలపైన వర్షావాసాన్ని గడపబోతున్నామనే ఆలోచనే మాకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది.”
“భంతే, ఈ రోజుకి విశ్రాంతి తీసుకొండి, భిక్కుణులకు దేవీవిహారంలో వసతి ఏర్పాట్లు చేశాము. ఇప్పటికే సూర్యాస్తమయమవుతుంది, మీరందరు రేపు మా అంతఃపురంలోనే మా భిక్షను స్వీకరించమని అభ్యర్థన” అంటూ ఆహ్వానించి, భిక్కుణులను తన వెంట తీసుకొని అక్కడ నుంచి సెలవు తీసుకుంది మహారాణి.
**
వేకువఝామునే శ్రమణులందరూ నది ఒడ్డున స్నానఘట్టాల దగ్గర స్నానపానాదులు ముగించి, ధ్యానసాధనకు మహాచైత్యం వద్దకు నడవడం ప్రారంభించారు. ప్రశాంతంగా ప్రవహిస్తున్న నదిలో వేకువ వెలుగు పసిబిడ్డ నవ్వులా ఉంది. దాదాపు వంద అడుగుల వ్యాసంతో, ఎనభై అడుగుల ఎత్తుతో పైన చక్రాకారంలో చుట్టూ తెల్లని సున్నపు రాతిఫలకాలపై ధర్మచక్రం, బోధివృక్షం, స్థూపాన్ని పూజిస్తున్న ఉపాసకులు, బుద్ధపాదాలు, జాతక కథలలోని దృశ్యాలు, బుద్ధని జీవిత విశేషాలతో అద్భుతమైన శిల్పాలు పేర్చబడి ఉన్నాయి. దాని నాలుగు మూలల్లో ఎత్తైన ఆయకస్తంభాలతో గంభీరంగా ఉంది మహాచైత్యం. శ్రమణులందరూ చైత్యానికి సాష్టాంగ ప్రమాణాలు ఆచరించారు. రెండు చేతులు జోడించి ప్రదక్షిణలు కావిచ్చి దాని చుట్టూ వర్తులాకారంలో ధ్యానానికి కూర్చున్నారు.
ఆ ప్రాంతమంత అలౌకిక నిశ్శబ్దం.
**
“మేము ఆచరిస్తున్న ధర్మానికంటే చాలా ముందుకు వెళ్లిపోయినట్లుందమ్మా, జంబూద్వీపంలోని బౌద్ధం. ఆచార్య నాగార్జనులు వారు మహాయాన ప్రోత్సాహం బౌద్దానికి ఎంతో సౌందర్యాన్ని అందిస్తున్నప్పటికి మూలధర్మానికి కొంచెంకొంచెం దూరంగా జరగడం బాధగాను ఉంది. లంకాద్వీపంలో కూడా వారి ప్రభావం కొంత ఉన్నప్పటికి, మేము థేరవాదానికే కట్టుబడ్డాము. పాలిరక్కేతి రక్కతి అని చెప్పుకున్న బౌద్ధం ఇక్కడ దైవభాష పాళీని వదిలి కొత్తగా సంస్కృత భాషను పెంచిపోషిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆచార్య నాగార్జునులు పూర్తిగా సంస్కృతాన్నే వారి రచనలకు ఉపయోగించినట్లు విని ఆశ్చర్యపోయాను. ఆచార్య అశ్వఘోషుల ప్రభావం వల్ల సంస్కృత భాష జంబూద్వీపంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు అర్థమవుతుంది. వివిధప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు, మహాయానం వల్లే కాక, బ్రహ్మణమతం వల్ల కూడా థేరవాదం అనేక ఆటుపోట్లును ఎదుర్కోవడాన్ని గమనించాను. బుద్ధభగవానుని వంశంగా చెప్పుకునే మీ ఇక్ష్యాకు రాజ్యాన కూడా యజ్ఞాలు, అశ్వమేథయాగాలు జరిగినట్లు విన్న వార్తలు కలవరాన్ని కలిగించాయి. కాని గత ఆరు నెలలుగా వివిధ రాజ్యాలలో పర్యటిస్తున్నప్పుడు ప్రతిచోట ప్రజలు చూపించిన ప్రేమాభిమానులు, ధర్మం పట్ల వారు కనపరుస్తున్న అనురక్తి చూస్తున్నప్పుడు బుద్ధుడు ఈ నేలను ఎంత బలంగా హత్తుకున్నాడో తెలుస్తుంది మహారాణి. బ్రహ్మణమతం కూడా క్రమంగా మాంసహారాన్ని విసర్జిస్తుందని, కాషాయవస్త్రాలను ధరించి ప్రజలను కొంత చేరువ అవుతుందని, బౌద్ధ ఆచారాలను కూడా వాళ్లలో కలుపుకుంటున్నారని తెలిసి ఆనందపడ్డాను. ద్వేషం కంటే ప్రజల దేన్ని అనుసరిస్తున్నారో, అభిమానంగా ఆచరిస్తున్నారో దాన్ని వాళ్లు మాది అని చెప్పుకుంటూ ఆచరించడం ఒక రకంగా మంచిదే. సుదూర భవిష్యత్తులో ఇది ఎలాంటి మార్పులు తీసుకొని రానుందో” అంటూ నిట్టూర్చారు ఆచార్యుల వారు.
“భంతే, జరుగుతున్న పరిణామాలు ఆందోళనగానే ఉన్నాయి. మన ధర్మాన్ని మనం నిర్వర్తిచడం తప్ప, ధర్మానికి మనం చేయగలగేదేముంది. ఇంకో రెండురోజుల్లో ఆషాడపున్నమి రోజున మొదలయ్యే వర్షావాసానికి దాదాపు ఏడు వేల మంది భిక్షువులు మన నగరానికి రావచ్చునని సమాచారం. ఆరోజు సింహాళవిహారాన్ని మీతో ప్రారంభించాలని, మీ ధర్మోపదేశాన్ని వినాలని నా కోరిక” అని నమస్కరించింది మహారాణి సిరిశ్రీ.
“ఆయుష్మాన్ మహారాణి, మీ కోరిక తప్పక ఫలించగలదు.”
**
ఆషాడపున్నమి, ప్రజలందరూ ఉపవాసాన్ని ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో బుద్ధదేవుని పూజించే రోజు. ఆ వేడుక ప్రతి సంవత్సరం అక్కడ పెద్ద జాతరలా జరుగుతుంది. అంతేకాకుండా సంఘపాలథేరస్వామి ధర్మబోధ, అశ్వఘోషుని బుద్ధచరితం నాటికను భిక్కుణులు ప్రదర్శించబోతున్నారనే విషయం నగరమంతా చాటింపు వేయబడింది. తెల్లవారుఝామునుంచే తండోపతండాలుగా జనం, ఎక్కడ చూసినా శరణుఘోష. వర్షావాసనిమిత్తం ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్న భిక్కు సమూహాలు. స్నానఘట్టాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఉపాసకులు, ఉపాసినులు తెల్లని వస్త్రాలు ధరించి తమ చేతుల్లోని కడవలతో కృష్ణ నుంచి నీటిని తెచ్చి చైత్యాన్ని, ఆరాధన స్తూపాలను, బుద్ధుని విగ్రహాలను ఆ నీటితో అభిషేకించి కలువ, తామరపూలను అక్కడ ఉంచి అలంకరిస్తున్నారు. దీపాలు వెలిగిస్తున్నారు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తిరుగుతున్నారు. భిక్కులు అభిషేక జలాన్ని, ఆకులతో నిండిన కొమ్మలతో ప్రజల శిరస్సున చిలకరించి దీవిస్తున్నారు.
ఎక్కడ చూసినా కోలాహలం. రకరకాల అంగళ్లు. నగరమంతా తిరుగుతూ, వివిధ విహారాలను, చైత్యాలను, దర్శించే ప్రజలు, బుద్ధని విగ్రహాలకు, బోధి వృక్షాలకు, స్తూపాలకు మొక్కుకుంటున్నారు. ఇంకొద్ది మంది, అక్కడక్కడ మహాచైత్యం వైపు కూర్చొని భక్తిగా రెండు చేతులతో నమస్కరిస్తూ సుత్తాలను వల్లెవేస్తున్నారు. భగవాన్ బుద్ధుని శరణు కోరుతున్నారు. అందరి మొహాల్లో ఏదో అనిర్వచనీయమైన సంతోషం. సంబరంగా పిల్లల కేరింతలు.
అందరి సమక్షంలో ఆచార్యులవారి చేతులపైన సింహాళవిహార ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
**
సాయంత్రం మహాచైత్య ప్రాంతం రంగరంగ వైభవంగా ఉంది, కాసేపట్లో సంఘపాలథేర అక్కడికి విచ్చేస్తున్నారు, ఆయన ధర్మోపదేశమే కాకుండా, బుద్ధచరితం నాటిక ఉండటంతో ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేళతాళాలు, డప్పుల చప్పుళ్లు మొదలయ్యాయి. జనం కొంచెం పైకి లేచి చూస్తున్నారు, ఛత్రచ్ఛాయలో చెక్కతో చేసిన ధర్మచక్రాన్ని పట్టుకొని వస్తున్న సంఘపాలథేర, వెనక రాజమాత, మహా రాణి సిరిశ్రీ, ఇతర రాణులు చైత్యపూజకు కావల్సిన పూలు, పరిమళజలాన్ని, దీపాలను శిరస్సున మోసుకుంటూ వస్తున్నారు.
ఆచార్యుల వారు చైత్యపూజ నిర్వహించారు, రాణులు దీపాలను వెలిగించి భక్తితో నమస్కరించారు.
గంటలు మోగాయి. అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. సంఘపాల థేర తన ధర్మబోధను ప్రారంభించే ముందు కాసేపు ధ్యానముద్రలో నిమగ్నమయ్యారు. అంతా నిశ్శబ్దంగా ఉంది.
న హి వేరేన వేరాని, సమ్మన్తీధ కుదాచనం;
అవేరేన చ సమ్మన్తి, ఏస ధమ్మో సనన్తనో.
ఎక్కడా వైరం వైరంచేత తొలగించబడదు. మైత్రీభావం వలన మాత్రమే శత్రుత్వాలు శమిస్తాయి. ఇదే సనాతన ధర్మం. మంద్రంగా, శ్రావ్యంగా సంఘపాలథేర నోటినుంచి వెలువడుతుంది దమ్మపదంలోని సుత్తం. ప్రశాంతమైన వాతావరణం, అప్పుడప్పుడే తూర్పున ఉదయిస్తున్న నిండు చందమామ, నదినీటిఉపరితలంపైనుంచి లేత అరుణవర్ణంతో ఉదయిస్తూ శ్రద్ధగా ఆచార్యులవారి మాటలు వింటున్నట్లుంది.
ఇక్కడకు విచ్ఛేసిన నాలుగు బుద్ధపరిషత్తులకు బుద్ధదేవుని ఆశీస్సులు. ఈనాటి ఈ పర్వదినం మన మనసులకు ప్రశాంతత చేకూర్చి మన ప్రజ్ఞా, శీల సంపదల్ని ఉన్నతమైన స్థితులలో నిలుపుకోవడానికి తోడ్పడుతుంది. ఆషాడ పున్నమి బుద్ధభగవానుని జీవితంలో కొన్ని ముఖ్యసంఘటనలను గుర్తు చేసుకోవడానికి ఉపయుక్తమైన రోజు. మహామాత మయాదేవి గర్భంలోకి కలువ పువ్వు పట్టుకున్న తెల్ల ఏనుగు రూపంలో ప్రవేశించిన రోజు, జ్ఞానాన్వేషణ కొరకు భగవానుడి మహాభినిష్క్రమణ జరిగిన రోజు, బుద్ధత్వం సిద్దించాక, తను తెలుసుకుంది ఎవరికి చెప్పాలో నిశ్చయించుకొని, వారణాశి సమీపంలోని హరిణవనాన పంచవర్గీయ బిక్షు సమూహానికి తొలిసారిగా ధర్మాన్ని బోధించి గురువుగా మారిన రోజుగాను ఈ ఆషాడ పున్నమి మనకు ఎంతో పర్వదినం. అందువల్లనే ఈ పర్వదినాన్ని మనం గురుపౌర్ణమి గా కూడా భావిస్తాం. దేవానం ప్రియదర్శి అశోకుని కుమారుడు మహేంద్ర స్థవిరుడు మా లంకాద్వీపాన రాకుమారుడికి బౌద్ధ దీక్ష ఇచ్చిన రోజు కూడా ఇదే. ఇంతే కాదు, మొట్టమొదటి బౌద్ధ సంగీతి ఐదువందలమంది అర్హతులతో మగధ మహారాజు అజాతశత్రు పర్యవేక్షణలో మొదలయిన రోజు ఇది. అంతే కాక వర్షావాస ప్రారంభదినము కూడా ఇదేనని మీ అందరికీ తెలుసు. ఇన్ని సంఘటనలతో ముడిపడి ఉన్న ఈ పర్వదినాన మీ అందరితో ధర్మం గురించి ముచ్చటించడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మానవ జీవితంలో అంటూ తమ ఉపదేశాన్ని మొదలుపెట్టారు ఆచార్యులవారు. ఈ రోజు ధర్మాచరణలో ముఖ్యమైన దశపారమితులలో ఒక్కో పారమితిని తీసుకొని వాటినుంచి మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను అంటూ వాటిపైన అనర్గళంగా ఉపన్యసించారు. భగవానుని కరుణ మీపై అపారంగా వర్షించాలని కోరుకుంటున్నాను అని ధర్మోపన్యాసాన్ని ముగించారు ఆచార్యులవారు.
అంతలో ఓ ఉపాసిక లేచి, “భంతే, ధర్మం దయవలన పంటలు పండుతున్నాయి, సంపదలు పుష్కలంగానే చేకూరుతున్నాయి, కాని మా కడుపున నలుసులే చేతికి అందడంలేదు, గత సంవత్సరం మూడో బిడ్డను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నెలలు నిండాయి బుద్ధదేవుని దయ లభిస్తుందా ఈ సారైనా” అంది విలపిస్తూ.
ఆమెను సముదాయించి, “ఈ విపత్తులకు కారణాలు ఏమైనా అన్వేషించారా మహారాణి” అని ప్రశ్నించాడు ఆచార్యుల వారు. “భంతే ప్రయత్నించాను, కాని ఎందుకో గత కొంత కాలంగా ఇక్కడ పురిటిలోనే బిడ్డలు మరణిస్తున్నారు. దాన్ని దాటినా శైశవాన్ని దాటలేకపోతున్నారు. అనేక మంది వైద్యులను సంప్రదించాము. మా ప్రయత్నాలు ఫలించడం లేదు” అంది మహారాణి దిగులుగా. భిక్కుని విమలకీర్తిని పిలిచి “ఆర్యే, రేపు నగరంలో ఉన్న గర్బిణులతో సమావేశాన్ని నిర్వహించి వారి ఆరోగ్యాన్ని పరీక్షించండి. సంఘంలో ఇరవై వర్షాలు పూర్తిచేసుకున్న మీరు ఈ సమస్యను పరిష్కరించగలరు అని ఆశిస్తున్నా” అని ఆ బాధ్యతను అప్పగించారు ఆచార్యులవారు. మహారాణి సిరిశ్రీ లేచి, “ధర్మం గురించే కాకుండా నిత్యజీవితంలో మనం ఎదుర్కునే అనేక అంశాలను విపులంగా వివరించడమే కాక, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్యంపై దృష్టిసారించిన ఆచార్యుల వారికి నా ధన్యవాదాలు, ఇప్పుడు భగవాన్ బుద్ధుని జీవితవిశేషాలతో రూపొందించిన ప్రదర్శనను తిలకించండి అని ప్రకటించింది.”
రంగస్థల వేదికపైన బుద్ధచరితం ప్రదర్శన మొదలైంది. భిక్కునులు రకరకాల హావభావాలతో, స్వరబద్ధమైన ఉచ్ఛారణతో బుద్ధని జీవితంలోని ముఖ్యఘట్టాలను ప్రజల కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి అందరి హర్షద్వానాల మధ్య ముగించారు. అప్పటికే వెన్నెల్లో నగరం స్నానం చేస్తున్నట్లుగా ఉంది. చైత్యం చుట్టూ ఉన్న తెల్లటిరాతి ఫలకాలు కాంతివంతంగా మెరిసిపోతున్నాయ్. బుద్ధుడు సంతోషంగా ప్రజలను దీవిస్తున్నట్లుంది.
**
“మిడతల దండు నిండుచేలను ఆశ్రయించినట్లుంది వీళ్లను చూస్తుంటే. దశపారమితులంట, ఒక్కో పారమితి మనలో ఒక్కో శిరస్సంట, ఔరా ఈ బుద్ధలు మరీ తెలివిమీరిపోతున్నారు. మహారాజు అండ ఉన్నా వీరిని నిరోధించలేకపోతున్నాం” అంటూ తన భవనం పై నుంచి ఈ కార్యక్రమాన్ని చూసి అటుఇటు ఆలోచిస్తూ తిరుగుతున్నాడు ఆచార్య భరధ్యాజుడు. “మనం ఏదో ఒకటి చేయాలి మిత్రమా” అన్నాడు లోహిత్య బ్రహ్మణుడు. “అవును లోహిత్యా, చాలా చేసాం, చేస్తునే ఉన్నాం. కాని ప్రజలనుంచి ధర్మాన్ని దూరం చేయలేకపోతున్నాం, తంత్రాన్ని మరింత తీవ్రం చేయాలి. మన పూర్వీకులనుంచే ప్రయత్నాలు మొదలైనా, ప్రజలను మనవైపు తిప్పుకోలేకపోతున్నాం. ఎంత కాలమీ సహనం. యజ్ఞాలు, భూరి దానాలు తగ్గిపోయాయి. గోవుల, అశ్వాల లేత మాసం దూరమైంది. వేదసమ్మతమైన గోవధను, సోమపానాన్ని తప్పుగా చూసే సమాజం. వీటిని ఎంత కాలం భరించాలి. మన తరంలోనైనా వీటికి చరమగీతం పాడి, మన వైదికి క్రతువులకు మహారాజయోగాన్ని పట్టించలేమా? ఛీ, బ్రహ్మణులమై ఏ బతుకుకి వచ్చాం, బౌద్దుల వెనక వెనకే అడుగులు వేస్తున్నాం. ఇది పతనమా? పరావర్తనమా? ఏదైనా ఫరవాలేదు. మన ఆధిక్యాన్ని మనం నిరూపించుకోవాలి, మహారాజు కూడా ఎందుకో ఆ రాణులను నియంత్రించడు. కోశాగారం పైన వాళ్లకీ అధికారమే. స్త్రీలను అదుపుచేయకుండా బౌద్దాన్ని నియంత్రించలేమనిపిస్తుంది లోహిత్యా. ఈ సంవత్సరం ఇంకో వంద బలమైన కుటుంబాలను ఉత్తర దేశాలనుంచి పిలిపించి, ఇంకొన్ని ఊర్లను మన అగ్రహారాలుగా తీసుకుందాం. గ్రామల్లో స్థానిక దేవతల పూజారులను కూడా బ్రహ్మణుల్లో కలుపుకోవాలి, లేకుంటే ప్రజలతో సంబంధాలను విస్తృతం చేసుకోలేం. ఆదాయానికి ఆదాయం, అధికారానికి అధికారం. అంతే కాకుండా ప్రజల్ని క్రమంగా మనవైపు తిప్పుకోవాలంటే వాళ్లు పాటించే బలమైన ఆచారాలను మనవి అని చెప్పే ప్రణాళికను కూడా క్రమంగా పెంచాలి. ఈ ఆచరణ, ప్రచారం ఏ స్థాయిలో ఉండాలంటే, వాళ్లు కూడా బ్రహ్మణమతమే సనాతనధర్మం అని నమ్మేంతగా పెంచాలి. లేకుంటే ఈ సమాజం బౌద్ధ సంఘ ప్రతిరూపంగా మారిపోతుంది, ఎవరికి వారే విద్య నేర్చుకొని, అర్హతులుగా మారిపోతూ ఉంటే మన విద్య, ఉపాధి అంతరించిపోతుంది. ఇప్పటికే అనేక మంది బ్రహ్మణులు కూడా భిక్కులుగా మారిపోయారు. ఆచార్య నాగార్జనుడులాంటి మనవాళ్లుకూడా మన మతాన్ని కాదనడం ఎంత విషాదం.”
“అవును ఆచార్య, దైన్యానికంటే దుర్మార్గమే మేలు. మన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి వేరే మార్గమేమి లేదు. మనం చేయాలి, చేయగలం” అన్నాడు నమ్మకంగా లోహిత్యుడు.
“త్వరలోనే కార్తికేయ ఉత్సవాన్ని ప్రకటించి, దాన్ని వైభవోపేతంగా జరిపి బ్రహ్మణులకు సహస్త్ర గో దానాలు, భారీ హిరణ్య దానాలు, రైతు సంక్షేమ యాగాలు ఏర్పాటు చేయిద్దాం” అంటూ క్రిందకు దిగసాగాడు.
**
“భంతే, అనేక మంది గర్భిణులను, నవజాత శిశువులను పరిక్షించాను. బలహీనంగా ఉండటం, ప్రసవసమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పరిశుభ్రత లేకపోవడం వంటివి గమనించాను. వీరిలో రక్తహీనత అధికంగా ఉంది. గర్భం దాల్చిన వారు అనేక పత్యాలతో సరైన ఆహరం తీసుకోకపోవడం వలన మరణాలు సంభవిస్తున్నట్లున్నాయి. నాటువైద్యం, మూడనమ్మకాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. దేవీవిహారంలో ఖాళీగా ఉన్న గదులలో ఇద్దరు కొత్తగా ప్రసవం అయిన వారినే కాకుండా, మరికొద్ది రోజుల్లో ప్రసవం అయ్యే అవకాశం ఉన్న ఇంకో నలుగురిని కూడా మా సంరక్షణలోనే ఉంచాను. స్థానికంగా పురుడు పోస్తున్న కొంత మందిని, ఇంకొంత మంది ఉపాసికలను కూడా మాతో ఉండమని చెప్పాం. గర్భిణులు, బాలింతలు ఎలాంటి ఆహరం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు వారికి కూడా నేర్పుతున్నాం” అని చెప్పింది భిక్కుని విమలకీర్తి.
“మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇక్కడ స్థానికంగా ఉండే వారికి నేర్పే ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది. మనం వెళ్లిపోయినా ఇప్పుడు నేర్చుకున్న విద్య వారి వెంట ఉండి రక్షిస్తుంది. మొన్న నిలబడి అడిగిన ఉపాసికను కూడా పరీక్షించారా?”
“రాగమాలను పరీక్షించాను భంతే, ఆమెకు సుఖ ప్రసవం అయ్యే అవకాశం ఉంది. ఆమె కూడా మావద్దే ఉంది. ఇక్కడి తల్లులు మీతో ఓ మాట చెప్పమన్నారు. బుద్ధుడు తల్లి బిడ్డల సంరక్షణ బాధ్యత అప్పగించిన హారీతి దేవికి ఆలయాన్ని నిర్మిచుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఓ సారి మహరాణిగారితో మాట్లాడండి. ఆ ఆలయ ఆవరణలోనే గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు వైద్యశాలను నిర్మించి, కొంతమంది ఉపాసికలను సిద్దం చేద్దాం. ఈ వర్షావాస సమయంలోనే అది కూడా పూర్తి అవుతుంది” అంది వినయంగా.
“సంతోషకరమైన విషయం ఆర్యే. దుఃఖనివారణలో ఆరోగ్యానిది కూడా కీలకపాత్ర. అందుకే భగవానుడు ఆరోగ్యం గురించి అనేక విషయాలు చెప్పారు. వాటిని మనం ఆచరించడమే కాదు, పదిమందికి నేర్పుతూనే ఉన్నాం. ఆచార్య నాగార్జనులవారు శస్త్ర వైద్యంలో నిష్ణాతులు. వారి శిష్య పరంపరలో ఎవరైనా అందుబాటులో ఉంటే వారి నుంచి మనం కూడా కొత్త విషయాలు తెలుసుకుందాం” అని చెప్పారు సంఘపాలథేర.
**
“భంతే, హారీతిదేవి ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టాము. మహారాజు స్త్రీల, పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధతో శిల్పులందరిని అదే కార్యం మీద నియమించారు. బహుశా మీరు వర్షావాసాన్ని పూర్తిచేసే లోపే హారీతిదేవికి తొలిపూజను నిర్వహించే అవకాశం ఉందనిపిస్తుంది.”
“మహారాణి, స్త్రీల పట్ల మీ శ్రద్ధ, మా వర్షావాసం కోసం మీరు చేసిన ఏర్పాట్లు కూడా అభినందనీయం. బుద్ధభగవానుని ధ్యానంలో, ధర్మచర్చల్లో, నికాయాల అధ్యయనంలో భిక్కుల ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. అంతేకాకుండా నగరంలో సంచరిస్తూ ధార్మిక ప్రవచనాలను బోధిస్తు ఉపాసకుల గృహాలను సందర్శిస్తున్నారు. మహాయానంలోని కొన్ని అంశాలను లంకాపురి భిక్కువులు అధ్యయనం చేస్తున్నారు. నాగార్జునుల వారు రచించిన లంకావతార సూత్ర వంటి గ్రంధాలను, కొన్ని ప్రతులను కూడా సిద్దం చేస్తున్నారు. ఇవన్నీ మాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి మహారాణి.”
“భంతే, నాదొక చిన్న విన్నపము, నాకు త్రిపిటకలను అధ్యయనం చేయవలననే ఆసక్తి. మీరు అనుమతిస్తే భిక్కునులతో కలసి అభ్యసన మొదలుపెడతాను. ఇక్కడ భగవానుని బోధనలు అనేక శాఖలుగా చీలిపోవడం, మహాయానబౌద్ధం పట్ల ఆరాధన కొనసాగుతున్నందువల్ల మూలధర్మాన్ని బోధించడాన్ని క్రమంగా విస్మరిస్తున్నారు. నాకు సరైన మార్గదర్శనం మీ నుంచి లభిస్తుందని ఆశిస్తాను” అంటూ తన ఆకాంక్షను తెలియచేసింది మహరాణి.
“అమ్మా, త్రిపిటకలను ఉపాసికగా ఉంటూ అభ్యసించడం అంత సులువైన విషయం కాదు. ధర్మ ఆచరణనుంచి ధర్మపు లోతుల్లోకి పయనించాలనే మీ ఆకాంక్షను చూస్తే ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రవజ్య తీసుకోని వారు, కేవలం ధర్మ ఆచరణలో వారి జీవితాలను ధన్యం చేసుకుంటారు. త్రిపిటకలలో కొంతైనా అభ్యసించాలంటే ఈ కొద్ది కాలం సరిపోదు. మీరూ మాతో పాటు లంకాద్వీపానికి రాగలిగితే త్వరగానే మీ అభిలాష తీరవచ్చు. అశోక మహరాజు కుమార్తె సంఘమిత్ర ద్వారా బోధి వృక్షపు కొమ్మను నాటిన చోట ఒక పెద్ద వనంలో భిక్కుణుల త్రిపిటికల అధ్యయనం కొనసాగుతుంది. మీకు త్రిపిటకలను బోధించగల సమర్ధులు అక్కడ ఉన్నారు. అక్కడికి రాగలిగితే మీ కోరిక త్వరగా నెరవేరగలదు. కాని మీరు మహారాణి, మాతో రావడం అంత సులభసాధ్యమైన విషయం కాదనిపిస్తుంది, ఆలోచించండి” అన్నాడు చిరునవ్వుతో సంఘపాల మహాథేర.
“అవును భంతే, నిజంగా కొంచెం బలమైన ఆలోచన చేయాల్సిందే అలా రావాలంటే. ఇంకా రెండు మాసాల గడువు ఉంది, ఈ లోపు నేను ఆలోచించుకొని మహారాజు అనుమతి కోరతాను, సింహాళరాజ్యంలో కొంత కాలం ఉండి ధర్మాన్ని నేర్చుకునేందుకు అనుజ్ఞ ఇవ్వమని. ఇప్పటికే మీ రాక వల్ల వారి చుట్టూ ఉండే బ్రహ్మణ గురువులు వారి మనసుని చెదరగొడుతున్నట్లనిపిస్తుంది. ఇక నా కోరికను వింటే ఏమంటారో.”
“అంతా మంచి జరుగుతుంది. వెళ్లిరండి మహారాణి” అన్నారు ఆచార్యులవారు.
**
“మిత్రమా, రేపు మహారాజు గారు, సింహాళ భిక్కువులను భిక్షకు పిలిచారట విన్నారా?” అన్నాడు లోహిత్యుడు.
“విన్నాను మిత్రమా, వారి తిరుగు ప్రయాణానికి ఆరు తెరచాపల కొత్త నౌకను కూడా తయారు చేయించి, లంకాపురి మహారాజుకి కానుకగా పంపుతున్నారట. మన మహారాజేమో రాణీదాసుడు. మన శిల్పుల సంగతి తెలిసిందే కదా! వారు మొదటినుంచి బుద్ధదాసులు. అందుకే నౌకలో కూడా బుద్ధుడి శిల్పాలను చెక్కుతున్నారంట. ఎప్పుడూ లేని విధంగా ఇలా నౌకను పంపటమేమిటో అర్థంకావడంలేదు లోహిత్యా. మన రాణి వాసమంతా బుద్ధునికి ఊడిగం చేయడంలో కాలం వెళ్ళబుచ్చేస్తుంది. మహారాజు వారిని వారించే ప్రయత్నకూడా చేయడు.”
“మహారాజు కూడా బౌద్ధం పట్ల మొగ్గుచూపుతున్నడంటవా? రేపు భిక్ష ఇచ్చే సమయంలో ఏ నిర్ణయం ప్రకటించబోతున్నాడో? ఉభయ మత మిత్రుడు అని బిరుదు అందుకోవాలనుకుంటున్నారేమో ఇద్దరి మధ్యన నిలబడి” అన్నాడు లోహిత్యుడు చేతులు రుద్దుకుంటూ, ఆయన ముఖంలో ఆదుర్దా.
“అలా ఏమీ ఉండదులే లోహిత్య, రాజమాత ఆదేశమై ఉంటుంది. సరే, పిలిచినప్పుడు వెళ్లక తప్పదు కదా, రేపు మీ శిష్యులను అందరినీ కూడా రమ్మనండి,అందరం వెళితే మనం కూడా అక్కడ నిండుగా కనబడతాం.”
“ఈయన లంకాపురిలోని రావణవెలిసియా స్తూపం దగ్గర మహామేఘవిహారంలో పెద్ద స్వామి అని చెబుతున్నారు. త్రిపిటికల అలవోకగా ఆయన నాలికపైననే నాట్యమాడుతాయని, భిక్కులను బిడ్డల్లాగ చూసుకుంటారని మంచి పేరు సంపాదించుకున్నారు, అంతేకాక మంచి బిషక్కులుగా కూడా పేరు పొందారు. ఇక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజలలో మమేకమై విస్తరిస్తున్నారు, ఇలాంటి వారివల్లే బౌద్ధం ఇంతగా బలపడిందేమో!” అన్నాడు లోహిత్య బ్రహ్మణుడు.
**
“మీ బౌద్ధ ఆచార్యులు, మా బ్రహ్మణ గురువులతో కూర్చొని మాట్లాడుకోవడం బావుంది మహారాణి చూడటానికి” అంటూ చిలిపిగా నవ్వాడు మహారాజు. “బావా మీకన్నీ వేళాకోళాలే” అంటూ మిగతా పరివారానికి కావలసిన బోజన ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తుంది సిరిశ్రీ.
“మీ వర్షావాసం ఎలా సాగుతుంది సంఘపాల?” అని దర్బంగా అడిగాడు భరధ్యాజుడు.
“విజయపురి నేలమీద ధర్మసంరక్షణలో ప్రశాంతంగా సాగుతుంది భరధ్యాజ బ్రహ్మణా.”
“మీ వెంట వేలమంది ప్రజలు ధర్మాచరణలో ఉండటం మాకెప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది. మా బ్రహ్మణులు కూడా బౌద్ధ మతం పట్ల ఎందుకు అంత అనురక్తిని ప్రదర్శిస్తున్నారో అర్థంకాదు . మీరు ఎలా వశపరుచుకుంటున్నారు ఇన్ని సమూహాలను?”
“భరధ్యాజా, ప్రజల సామాజిక జీవనంలోని అంశాలకు కొంత దగ్గరగా బౌద్ధం వెళ్లగలిగింది. వారి నైతిక ప్రవర్తనలు, శాంతియుత జీవనం, ఆరోగ్య అంశాలమీద భగవానుడు అనేక మందితో జరిపిన సంభాషణల పలితాలే ఇప్పటికీ ధర్మాన్ని నడిపిస్తున్నాయి. అదే సంఘాలకు రక్షగా నిలబడుతుంది. ఇది మనలోని జ్ఞానాన్ని మరింత ప్రజ్వలింపచేసుకునే మార్గం. తాత్విక విచారణను తర్కసమేతంగా కొనసాగించగల యజ్ఞం.”
“మీరు పర్యటనకి ఏమైన ప్రత్యేక కారణాలు ఉన్నాయా సంఘపాల?”
“జంబూద్వీపంలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా మగధ, ఉజ్జయిని, కళింగలో బౌద్ధానికి ఎదురవుతున్న పరిస్థితులను చూసినప్పుడు ఆలోచనలో పడ్డాం. మా రాజు మహాసేన చక్రవర్తి ఓ సారి ఆ ప్రాంతాలను దర్శించి, వాస్తవ పరిస్థితులను కనుక్కురమ్మని చెప్పి ఉన్నారు. కొన్ని చోట్ల బ్రహ్మణ, జైనమతాలు బలంగా ప్రజలపై ప్రభావం చూపడాన్ని గమనించాము. మహారాజుల నుంచి కూడా వాటికి ఆదరణ లభిస్తున్నట్లు తెలిసింది. అన్నిటిని పరిశీలించుకుంటూ వర్షావాసానికి మీ రాజ్యానికి చేరుకున్నాము భరధ్యాజ.”
“శాంతిని, సహృద్భావాన్ని పెంచే మీరు, ప్రజలను, రాజులను బ్రహ్మణ క్రతువులనుంచి దూరంచేసి, మా మీద ద్వేషాన్ని పెంచే ప్రయత్నాలు చేయడం ఏమన్నా భావ్యమా సంఘపాల?”
“మేము, ద్వేషమా” అంటూ నవ్వాడు సంఘపాలథేర. “బ్రహ్మణుల మీదే కాదు మరే ఏ ఇతర శ్రమణులపైన కూడా బౌద్ధం ఏనాడు ద్వేషాన్ని పెంచలేదు భరధ్యాజ. ప్రతి చోట బ్రహ్మణులకు, శ్రమణులతో సమానమైన గౌరవాన్నే కలిగించింది. అనేక సుత్తాలు ఆ విషయాన్ని స్పష్టంగానే చెబుతాయి. కాకుంటే యజ్ఞహింసను, మద్యపానాన్ని, శీలభ్రష్టతను ఏ మాత్రం జంకు లేకుండా వ్యతిరేకించింది. దైవ ఆరాధనను అంత హింసాత్మకం చేసి ఎవరైనా సాధించేదేముంది. ఆ పశువులను, వ్యవసాయానికి ఉపయోగించుకోమన్నాము. ఈ రోజు ఇంత మంది వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారన్నా, గ్రామగ్రామాన ఓ చైత్యం, చైత్యం పక్కన ఓ చెరువుందన్నా అది బౌద్ధం కృషేనేమో. ఇప్పుడు ప్రజలు కూడా వ్యవసాయ యజ్ఞంలో నిమగ్నమవ్వడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది భరధ్యాజ. బ్రహ్మణమతానికి, బౌద్దానికి ప్రధానమైన తేడా ఏంటంటే, మీరు కోరిక కోరుకో, దాన్ని తీర్చుకొని సంతోషంగా ఉండు అంటారు. మేము కోరికను వదలుకోవడం ద్వారా దుఃఖాన్ని నివారించమంటున్నాం. కోరిక కోరుకున్న తరువాత అది కేవలం ఆ మనిషికి పరిమితమై ఉండదు. అది ఎదుటి మనిషి, ఊరు, వస్తువు, రాజ్యం ఎంతవరకైనా దాని విస్తృతి ఉండొచ్చు. కోరిక తీర్చుకోవడంతో కోరికలు ఆగవు, వాటికి మనసొక అక్షయపాత్ర. కోరిక వెంట కోరిక వెంటాడుతూనే ఉంటుంది. తీరని కోరికలు అశాంతై వేధిస్తూనే ఉంటాయి. దుఃఖానికి కారణమవుతూనే ఉంటాయి. వదులుకోవడం కేవలం మనకు సంబంధించిన పని. చాలా సులభంగా దానినుంచి బయటకు రాగలుగుతాం. మనతో మనం మానసికంగాచేసే యుద్దం ఇది. భగవానుడు భౌతికంగా దేనితోను ఘర్షణను ఆశించలేదు. కొన్ని సామాజిక అంశాలను సంఘర్షణలేని ధర్మమార్గంలో సంస్కరించడమే బౌద్ధం ధ్వేయం. అందుకే అనేక వర్గాల ప్రజలు, మహారాజులు, వేశ్యలు, దొంగలు, చంఢాలురు, బ్రహ్మణులు, గురువులు, స్త్రీలు అందరూ భగవానుని శరణు వేడారు. ఎవరిని వారు సంస్కరించుకునే ప్రయత్నంలో దుఃఖాన్ని నివారించుకునే ప్రయత్నంలో ఉన్నారు.”
“మీరు మహా మాయగాళ్లు సంఘపాల, బుద్ధడు క్షత్రియుడు, అందుకే రాజుల మావాడు, మావాడు అని అతని వెంట నడిచి ఇంత వైభవాన్ని సంపాదించిపెట్టారు” అన్నాడు భరధ్యాజులు కాస్తంత ఉక్రోషంగా.
సిరిశ్రీ మహాదేవి, మహారాజు వైపు చూసి చిరునవ్వు నవ్వింది.
**
“ఎందుకు సిరి ఇలాంటి నిర్ణయం, ఇప్పుడేమైంది అంతఃపురంలో ఉంటూనే, ఇక్కడి విహారాలలోనే బౌద్ధం గురించి అధ్యయనం చేయొచ్చు కదా!” అంటు దగ్గరగా వచ్చి హత్తుకున్నాడు. అతని కన్నుల్లో తడి. ఓ సారి గట్టిగా హత్తుకొని దూరంగా జరిగింది సిరి.
“బావా! నిన్ను చేసుకునేప్పుడు నా మనసు నీపైన కంటే బుద్ధడిపైన ఎక్కువ లగ్నమై ఉండేది. ఒక పరివ్రాజికగా మారాలనే బలమైన భావన నాలో. నువ్వు చాలా ఇష్టంగా నన్ను చేసుకున్నావు. ఈ అంతఃపురంలో ఓ అద్భుతంలా నన్ను చూసుకున్నావ్. నా కోసమే బుద్ధుడు నీలాంటి భర్తని పంపాడనుకున్నాను. ఆ సమయంలో నాకు బుద్ధుడు కూడా గుర్తురాలేదు. ఓ సంవత్సరం తరువాత, ఇంకో రాణి, తరువాత ఇంకో రాణి. నిజంగా అప్పుడే నాకు నా పరిస్థితి అర్థమైంది. నీకు అనేక అరల్లో ప్రేమలు ఉంటాయని. నా గదిలోకి వచ్చినప్పుడు నాకు సంబంధించిన ప్రేమను తెరవగల చాకచక్యం నీకుందని. అప్పుడు మాత్రమే నేను నీ ప్రపంచాన్ని. కాని నా పరిస్థితి అది కాదు బావా, ప్రతిక్షణం నువ్వే నా ప్రపంచం. నువ్వు క్రమంగా దూరమవుతున్నప్పుడు మహాదుఃఖం. నాకు అర్థమవుతుంది నువ్వు ఎలా దూరమవుతున్నావో. అవి రాచకార్యాలు కాదు, కేవలం వేరే స్త్రీలతో నీ అనుభవాలకోసం జరుగుతున్న దూరం. నీ జీవితంలో అది చాలా సాధారణం కావచ్చు. ఎలాంటి ఆశలు లేకుండా నీ జీవితంలోకి వచ్చిన నేను నిన్ను అంతగా ప్రేమించడం నాకూ ఆశ్చర్యమేసేదప్పుడు. కొన్ని సందర్భాలలో నిన్ను దూషించాను. ద్వేషించాను. అంతకంటే ఎక్కువ ప్రేమిస్తూ హాత్తుకున్నాను. క్రమంగా కొంత కుదటపడ్డాను. నా దగ్గరకు నువ్వొచ్చిన ప్రతిసారి నిన్ను సంతోషంగా ఉండే విధంగానే చూసుకుంటున్నాను. క్రమంగా విహారాల అభివృద్దికి, ప్రజల్లో ధర్మవికాసానికి సంబంధించిన పనులతో నన్ను నేను మర్చిపోవడానికి ప్రయత్నంచాను. కాని నీకు నేను జరుగుతున్న దూరం నాకు తెలుస్తూనే ఉంది బావా, మానసికంగా, శారీరకంగా నాకు మాత్రమే తెలుస్తున్న దూరం. మళ్లీ బుద్ధభగవానుడే చేయందించాడు. దుఃఖానికి కారణాన్ని అన్వేషించమన్నాడు. ఆలోచించాను. కారణం నువ్వు కాదని అర్ధమైంది. నేను నిన్నుఅనుక్షణం కోరుకుంటున్నా, నీ ఆలోచనల్లోనే ఉండిపోతున్నాను. అవి తీరనప్పుడు పొరలు పొరలుగా దుఃఖం ఆవహించడాన్ని కనుగొనగలిగాను. నా మానసిక దుర్బలత్వాన్ని నీ వల్లనే తెలుసుకోగలిగాను బావా. అది మీరు నాకిచ్చిన ఒక వరం. నేనిప్పుడు దుఃఖంలేని స్థితిని ఆస్వాదిస్తున్నాను. బౌద్దాన్ని ప్రశాంతంగా అధ్యయనం చేయగలుగుతున్నాను. తెలుసుకునే కొద్ది ఇది నన్ను మాయలోకి నెట్టడంలేదు, మరింత వెలుగువైపుకి పయనింప చేస్తుంది. ఇవన్నీ నీకు చెప్పడం, నిన్ను బాధపెడదామని కాదు బావా, ఒక అనుభూతి నుంచి ఇంకో అనుభూతికి చేసే ప్రయాణంలో దుఃఖం కలుగుతూనే ఉంటుంది. అందుకేనేమో బహుశా నాలోకి నేను ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాను. దానిలోనే ఈ సింహళ పయనం కూడా. మరల వచ్చేసరికి ఎంతకాలమవుతుందో తెలియదు. నువ్వు నన్ను హత్తుకున్నప్పుడల్లా నేను నీ ప్రేమను చూశాను. అది నిన్ను బాధపెట్టాలని అనుకోను. నేను గుర్తొచ్చినప్పుడు నీ పెదవులపైన ఓ చిన్న చిరునవ్వు మొలకెత్తాలనే కోరుకుంటాను బావా, మన ఇక్ష్యాకు వంశం అనేక సంవత్సరాలు ఈ నేల మీద మీదైన ముద్రవేయాలి అంటున్న సిరిని దగ్గరకొచ్చి బలంగా హత్తుకొన్నాడు మహరాజు వీరపురషదత్తుడు. అదొక అవ్యక్తమైన స్థితి. కన్నీరు, సంతోషం ఏమీలేని ఒక నిరానుభూత సమయం.
ఇక పడుకో సిరి, మీ అభీష్టం మేరకు వెళ్లిరండి అంటూ అంతఃపురం నుంచి బయటకు నడిచాడు. అతనినుంచి అనుమతి లభించడం సిరిశ్రీ హృదయాన్ని ఎంతో తేలిక చేసింది.
**
“మీరు స్త్రీకి ఇస్తున్న ప్రాధాన్యత వల్లన వారు ఆర్థికంగా, భావజాలపరంగా స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని పొందుతున్నారు. స్త్రీలు ఎందుకు అంతగా బౌద్దాన్ని అభిమానిస్తున్నారో అర్థంకావడంలేదు. మీ ఇష్టరాణులే బౌద్దాన్ని ఆరాధిస్తారు, విహారాలు నిర్మిస్తారు. వారికి నచ్చిన ప్రాంతాలకు వెళ్లడం, వారికి నచ్చిన విద్యలను అభ్యసించడం ఇవన్ని మన బ్రహ్మణమతానికి గొడ్డలి పెట్టులా పరిణమించే అవకాశాలు చాలా ఉన్నాయి మహారాజా. క్రమంగా ఈ విషయంలో మనమేదైనా ఆలోచన చేయడం మంచిది. స్త్రీ స్వేచ్ఛను, బౌద్ధం ఆరాధనను క్షీణింపచేసే నిర్ణయాలు ఇప్పుడు చాలా అవసరం. అయినా, ఈ సింహాళ బౌద్దుల వెంబడి మన మహారాణిని పంపడం ఏమిటి మహారాజా. ఇది మన రాజ్యానికే అవమానం. త్రిపిటక జ్ఞాన సముపార్జన పేరుతో, వీరి వెంట పంపడం మాకేమి సదుద్దేశ్యంగా కనపడటం లేదు మహారాజా. ప్రజలు ఏమనుకుంటారోననైనా ఆలోచించారా. అంత దూరం వెళ్లి రావడానికే సంవత్సరం పైన పడుతుంది. అవి నేర్చుకోవడానికి రెండు మూడు సంవత్సరాలు. ఇక మళ్లీ రావడమంటే” సంశయంగా ఆగిపోయాడు భరధ్యాజ బ్రహ్మణుడు మహారాజు తన ఆసనం నుంచి అసహనంగా లేవడం చూసి
**
“బావా! నేను నీ అంత తెలివైనదాన్ని కాకపోవచ్చు. నీవు ఉచ్చుపన్నే వేటగాడిని, నిన్ను జాగ్రత్తగా సంరక్షించే తోటమాలిని ఒకేలాగా చూడగల మానసిక స్థిమితం ఉన్న వ్యక్తివే కావచ్చు. అది నీ ధైర్యం కావచ్చు, దేనినుంచైనా మెలుకువగా బయటకురాగల నేర్పు ఉందనే భావన కావచ్చు. కాని క్రమంగా నీ చుట్టూ వేటగాడి బృందం బలంగా చేరుకున్నాక, నువ్వు కూడా వేటలో భాగమవుతావ్, అక్కడ కూడా నీ తెలివేవాళ్లకు ఆయుధంగా మారొచ్చు. బావా! బ్రహ్మణ ప్రశంసలు, వారు నీకు చూపుతున్న మార్గం నిన్ను ఎలా వారి వెంట నడిచేలా చేస్తున్నాయో నాకు అర్థమవుతుంది. నువ్వు నా మార్గాన్ని మూర్ఖత్వం అనుకుంటున్నావు. నేను నిన్ను అనుకున్నట్లుగానే. సామాన్య జనంలో నేను ఒక్క దానిగా విహారంలో జరిగే బోధనలలో పాల్గొనడం, స్తూపాలకు మొక్కడం, బౌద్ధ బిక్షువుల పాదాలకు నమస్కరించడం, పాతిమోక్కాన్ని ఆచరించడం, ఉపవాసాలు చేయడం, ప్రజలనుంచి దానాలు సేకరించి విహారాలను, స్తూపాలను నిర్మించడం, పిటకాలను పారాయణం చేయడం ఇవేమీ నీకు నచ్చకపోవచ్చు. ఇక్కడ అనేక వర్ణాల ప్రజలు కలిసి ఒక్కటనే అనుకుంటాము. కాని బ్రహ్మణ గురువులు వారు అధికులమంటారు. నిన్ను మిగతావారి నుంచి వేరుచేసి వాళ్లకంటే అధికుడివంటారు. వైశ్యులను ఇంకొంత మందిపైన అధికుడు అంటారు. ఇలా ఎక్కడికక్కడ మెట్ల వ్యవస్థలో పుట్టకతో మొత్తం వ్యవహారాన్ని వాళ్ల గుప్పెట్లోకి తెచ్చుకునే వర్ణ వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారి స్థానాన్ని సుస్థిరం చేయాలనుకుంటున్నారు. వీటికి నువ్వు తోడ్పాటునందిస్తున్నావు. ఇక్కడ ఎవరమూ శాశ్వితం కాదు బావా, కాని ధర్మం, అందులోను బహుజనులకు దుఃఖాన్ని లేకుండా చేసే ధర్మం చాలా అవసరం. మళ్లీ కాలాన్ని వెనక్కి నడపే ప్రయత్నాలు వద్దు బావా. నువ్వు బ్రహ్మణ పూజలు, యజ్ఞాలు నిర్వహించుకో, వారికి కావలసిన కాంతా, కనకాలను, భవనాలను, భూములను దానం చేసుకో. సురాపానంతో మత్తిల్లు. కోరికలను తీర్చుకోవడమే జీవితం అని భ్రమించు. కాని ప్రజలందరిని దానిలోకి నెట్టకు దయచేసి. నేను బహుశా మళ్లీ మన విజయపురికి వచ్చి నీ చెంత నిలిచి నీతో ఇలా మాట్లాడగలనో లేదో తెలియదు.”
మౌనంగా వింటున్న మహారాజు వీరపురుషదత్తుడు, సిరిశ్రీ మాటలు వింటూ ధీర్ఘంగా నిట్టూర్చాడు.
**
వర్షావాసం చివరి రోజు
పవరణ కార్యక్రమాన్ని ముగించుకొని వస్తున్న భిక్కువులందరి ముఖాలలో ప్రశాంతత. భిక్కువులుగా మరో సంవత్సరం పూర్తిచేసుకున్న ఉత్సాహంలో ఉన్నారు వారందరు. వివిధ ప్రాంతలనుంచి వచ్చి తిరిగి రేపటి నుంచి ధర్మప్రచారానికై బయలుదేరుతున్న భిక్కులకు, భిక్కుణులకు కటినచీవరదానం చేయడానికి అనేక మంది ప్రజలు కాషాయవస్త్రాలు, నూనె పాత్రలు, బెల్లం కలిపిన నువ్వులపొడి తీసుకొని మహాచైత్యం దగ్గరకు వస్తున్నారు. తమ గృహాలకు భిక్షకై వచ్చిన భిక్కులకు, భిక్కుణులకు వాటిని దానంగా ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.
ఆ సాయంత్రం మహాచైత్యం దగ్గర, వివిధ ఆరాధన స్థలాలలో, వివిధవిహారాలలో, శ్రీపర్వత విజయపురిలోని ప్రజలు వారి పెద్దలను తలుచుకొని దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులో ఆ నగరం కళకళ లాడుతుంది.
**
తన నగలనన్ని తీసి మూట కట్టి చారులతకు ఇచ్చి వీటిని దేవీ విహార మర్మత్తులకు కానుకగా అందచేయమంది. తన దుస్తులను అంతఃపురంలోని పరిచారికలకు అందచేసింది. ప్రవజ్య తీసుకోకుండానే కాషాయ దుస్తులు ధరించేందుకు అనుమతించిన సంఘపాలథేరకు మనసులోనే కృతజ్ఞతలు తెలియచేసుకుంది. అందరి భిక్కుణులతో పాటు మహారాణి సిరిశ్రీ చాంతమూలాదేవి కూడా కాషాయచీవరాన్ని ధరించింది. కొత్తగా నిర్మించబడి రంగురంగుల పూలతో అలంకరించబడిన బుద్ధప్రభ నౌకను ఎక్కి, ప్రజలవైపు చూసింది. మహారాజు, రాజమాత, రాణులు, అనేక వందలమందితో ఆ ప్రాంతమంతా నిండిపోయి కనిపిస్తుంది. సిరిశ్రీ కళ్లలో ఓ నిర్మలత్వం. మనసులో ప్రశాంతమైన భావన. మహారాజు తడినిండిన కనులతో తననే చూస్తున్నాడు. ప్రజలందరి శరణుఘోష మధ్య ఓడ కళాసీలు తెడ్లు మోగుతున్న బేరీలకు అనుగుణంగా వేయడం తో ఒక్కసారి నౌక ముందుకు దూకింది.
కృష్ణమ్మ వరవడిలో వేగంగా కదులుతున్న నౌకను చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు, భరద్యాజ బ్రహ్మణుడు.

