ఓ రచయిత కథ

Spread the love

రచయిత ఓ కథ మొదలుపెట్టాడు. ఎడారిలో మొదలైంది ఆ కథ. అందులో రెండు భాగాలున్నాయి.

మొదటి భాగం
ఆ రైలు ఎడారిగుండా వెళుతోంది. అందులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆ నలుగురినీ ప్రధాన పాత్రధారులుగా రచయిత భావించడంతో వారిచుట్టే కథ తిరగడం మొదలుపెట్టింది. వారిలో ఇద్దరు సబ, నారంగ్. సైంటిస్టులు. ఒకప్పుడు ప్రేమించుకొని విడిపోయారు. విడిపోవడానికి కారణాలు వాళ్లు అప్పుడప్పుడు లోపల అనుకుంటారేమో కానీ బయటకు ఎప్పుడూ మాట్లాడుకోరు. ఇప్పుడు వారు తమను తాము సైంటిస్టులుగానే  ఎక్కువగా గుర్తించుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. తమ జీవితంలో అదే ముఖ్యమైనట్లు, ఎప్పుడూ తమ సబ్జెక్టుకి సంబంధించిన విషయాలే మాట్లాడుతుంటారు. బహుశా ఆ మాటలే వారిద్దరిని దగ్గరగా ఉంచుతున్న అనుభూతిని కలిగిస్తుండొచ్చు. ఇప్పుడు వారు ఎడారిలో పడిన ఒక ఆస్ట్రాయిడ్‌పై పరిశోధన చేయడానికి వెళుతున్నారు. రచయిత వీరిద్దరికి సంబంధించి ఇంకా ఏమి అనుకుంటున్నాడో ఇప్పుడప్పుడే తేల్చదల్చలేదు.

వారితోపాటు మరో ఇద్దరు సహ ప్రయాణికులూ ఉన్నారు. వారిలో ఒకరు స్కూల్ టీచర్. అతనికి మంచి టీచర్ అని పేరు ఉంది. అతణ్ణి పిల్లలు కూడా ఇష్టపడతారు. కానీ అతడి కూతురు సారా మాత్రం అతడికి దూరంగా ఉంటుంది. వారిద్దరి మధ్య బంధం సరిగా లేకపోవడానికి కారణం.. అతడు మంచి ఉపాధ్యాయుడు కావడమేనని రచయిత అనుకుంటాడు.

ఈ కథలో నాలుగో పాత్ర ఒక పర్యాటకురాలు. ఆమె ఎక్కడినుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అనే వివరాలు కథలో చెప్పకూడదనుకున్నాడు రచయిత. ఆమెను అపరిచితురాలిగా ఉంచాలని నిర్ణయించాడు. కానీ పేరు మాత్రం చెప్పక తప్పలేదు – “నీర” అని పరిచయం చేసాడు. అయితే, రచయిత ఆ పాత్రలకు ఇచ్చిన  కొద్దిపాటి స్వేచ్ఛతో ఆమె గురించి కొన్ని వివరాలు మిగతావారు బయట పెట్టారు.

కథలో ఎప్పుడైనా పాత్రలు తమకు తామే ఆలోచించి, స్వతంత్రంగా మసులుకోవడం ప్రారంభిస్తే, అప్పుడు రచయిత మేనేజర్ అనే పాత్రలోకి ప్రవేశించి కథను తనకు నచ్చినట్లు మలచాలని భావించాడు. అందుకు అతడు మధ్యమధ్యలో మేనేజర్‌గా వచ్చి నీతి వాక్యాలు, జీవితంపై తన ఫిలాసఫీ చెప్తూ ఉంటాడు. ఇవి కథను రచయిత చేతుల్లోకి తీసుకోవడానికి చేసే ప్రయత్నంలా కనిపిస్తాయి.

మొదటగా, కథ సబ – నారంగ్ మధ్య మొదలైంది.
వారిద్దరికీ కేటాయించబడిన ఫస్ట్ క్లాస్ కేబిన్‌లో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు.

“మనిద్దరినే ప్రభుత్వం ఈ పరిశోధనకు ఎందుకు ఎంపిక చేసిందో ఎప్పుడైనా ఆలోచించావా?” అని సబ అడిగింది.
నారంగ్ దానికి సమాధానం ఇవ్వలేదు.

అతడు పంజాబ్‌లో చిన్న పసుపుపూల పొలంలో ఉన్న తన అమ్మను, వెళ్లేముందు ఆమె అన్న మాటలను గుర్తుచేసుకుంటున్నాడు. తన తల్లి పదే పదే, “త్వరగా వెనక్కి రా” అని ప్రాధేయపడింది. ఆమె గొంతులో బాధ, ఆత్రుత ధ్వనించాయి. అంతుకుమించి ఇంకా తనను వెంటాడుతున్న అనుభూతి ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. “అమ్మ బాగుందా? లేక ఏదైనా ఇబ్బంది పడుతుందా? నాకు ఇంకా ఏ తోడు దొరకలేదని తను బాధ పడుతుందా? లేదా ఇంకేమైనా జరుగుతోందా?” అని.

సబ పిలిచింది ‘రంగ్’ అని. మళ్లీ తన ప్రశ్నను రిపీట్ చేసింది. సబ తన ప్రశ్నని రిపీట్ చేసినా.. నారంగ్ దృష్టిలో సబకి పెద్దగా ప్రాధాన్యం లేదనేవిధంగా చూపించాలని రచయిత అనుకున్నాడు.

  “మనిద్దరం ఆస్ట్రోఫిజిక్స్‌, కెమిస్ట్రీలో పరిశోధన చేయడం వల్ల మనకీ అవకాశం ఇచ్చారు” అని అతను చాలా సింపుల్‌గా చెప్పాడు. “మనిద్దరినే“ అన్నమాటకు అతడు ప్రాధాన్యం ఇచ్చాడో, లేదో సబకు అర్థం కాలేదు. అయినా మగవాళ్లు ఏ విషయాన్ని అయినా ఒకే రకంగా అర్ధంచేసుకుంటారు. దానికి తగ్గట్టుగానే వారి సమాధానం ఉంటుంది. తమకు ఎదురైన ప్రశ్నలో ఇంకేమైనా దాగి ఉందా? ఎదుటి వారి ఉద్దేశం ఏమై ఉంటుంది వంటివి వారు ఆలోచించరేమో? అనుకుంది సబ. ఆమెకి సమాధాన పడటం కావాలి.

ఆమెదో తెలుసుకున్నట్లు అడిగింది: “మీ మదర్ ఎలా ఉన్నారు? ఆమె ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారా?”
నారంగ్‌కు సబ అలా తన ఆలోచనలోకి ఎలా దూరిపోగలదో అర్థం కాదు. “అమ్మ బాగానే ఉంది. ఆమెకు ఆ పొలం ఇచ్చిన సంతోషం, నేను పెళ్లి చేసుకున్నా ఇవ్వలేనేమో” అని జోక్ చేసాడు. సబ ఏదో అడగబోయింది.
నారంగ్ తనకు ఇచ్చిన పాత్రను న్యాయం చేయదలిచాడు. “ఈ ఆస్ట్రాయిడ్‌లో కొత్త మెటల్ ఏదైనా కనుక్కుంటామని అనుకుంటున్నావా?” అని అడిగాడు. ఆ సంభాషణ నారంగ్‌కు టెక్స్ట్ రావడంతో ఆగిపోయింది: “మీరు లంచ్‌కు బుక్ చేసుకున్న రెస్టారెంట్‌లో మరో ఇద్దరు ప్రయాణికులతో నలుగురికి టేబుల్ బుక్ అయ్యింది” అని.

రెస్టారెంట్ లంచ్ టేబుల్ దగ్గర..

కొద్దిగా రివీలింగ్‌గా ఉందా డ్రెస్? మరోసారి తనని చూసుకుంది సైంటిస్ట్ సబ. కానీ కనిపించని క్లీవేజ్ పర్వాలేదు, అంత చీప్‌గా లేదు. చామన చాయగా ఉన్న మెడ కింద తెల్లగా కనిపిస్తున్న క్లీవేజ్. ఇలాంటి డ్రెస్ వేసుకునే అవకాశం ఆమెకు ఎక్కువసార్లు రాలేదు. ఇంతవరకు బయట ప్రపంచాన్ని చూడని స్కిన్ తెల్లగా మెరుస్తోంది. అది అందంగా ఉందా లేదా అన్నది తర్కం.

నారంగ్ ఆమె వైపు చూసాడేమో! చూడకపోయి ఉండొచ్చు. ఇద్దరూ రెస్టారెంట్‌లో టేబుల్ దగ్గర ఉన్నారు. అప్పటికే టీచర్ వచ్చి కూర్చున్నాడు. అతని నవ్వు శాంతంగా ఉంది. వారిని చూసి పరిచయం అన్నట్లు నవ్వాడు. పరిచయాలు జరుగుతున్నలోగా రచయిత కావాలని ప్రవేశపెట్టిన మేనేజర్ అక్కడికి వచ్చాడు.

“ఈ రోజు మీతో పాటు ఇంకో ప్రత్యేక అతిథి లంచ్ చేస్తారు. ఈమె నీర” అని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఒకరినొకరికి ఇంట్రడ్యూస్ చేశాడు. రచయితకి టీచర్ పేరు చెప్పే ఉద్దేశం లేనట్లుంది. అతనికి కథలో ప్రాముఖ్యత లేదన్నట్లుగా, పాత్రలతో కలివిడిగా ఉండటానికి మాత్రమే ఉంచినట్లున్నాడు రచయిత. లోతైన ఆలోచనలు లేని పాత్రకోసం టీచర్‌ని పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. కొన్నిసార్లు రచయితకి టీచర్ పాత్రపై కొంచెం విముఖత ఉన్నట్లు కూడా తోస్తుంది.

ఇంకో పాత్రను మాత్రం రచయిత బాగా ఇష్టపడ్డట్లు అనిపిస్తుంది. అది నీర. ఆమె పొడవైన ముఖం, పైకి కట్టిన జుట్టు, పొడవాటి లాంగ్ గౌన్ వేసుకుంది. ఆమెని చూస్తే వెంటనే చెప్పగలరు ఆమె ఆఫ్రికా నుండి అని. ఆమె నల్లని శరీరం ప్రత్యేకంగా మెరుస్తోంది. నీర చర్మం మెరుస్తూ ఉండగా, సబకి చిన్నప్పుడు చూసిన త్రాచుపాము చర్మం గుర్తుకొచ్చింది. నీర కళ్ళు చిన్నగా, చురుకుగా ఉన్నాయి. ఎవరి లోనుంచైనా లోతుగా చూసే విధంగా ఉన్నాయి.

వాళ్ల మధ్య సంభాషణలో నీర ప్రాధాన్యం ఎక్కువ కనిపించింది.

“మీరిద్దరిని చూస్తుంటే స్నేహితుల్లా లేరు. ఒకరిపై ఒకరికి విసుగొచ్చిన పాతబడ్డ భార్యభర్తల్లా ఉన్నారు” అంది నీర.

ఆ మాట సబకి సంతోషకరమైన ఇబ్బందిలా అనిపించింది. నారంగ్ మాత్రం పట్టించుకోలేదు.

“మీరు ఆస్ట్రాయిడ్ చూడటానికి చాలాదూరం నుంచి వస్తున్నారు కదా! ఏదైనా కారణం ఉందా?”  అని నారంగ్ అడిగాడు.

“ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమికి ఇతర జీవులు పంపే సందేశాలని నేను నమ్ముతాను” అంది నీర.

“అసలు ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటో మీకు తెలుసా?” నారంగ్ మాటలో దాచినా దాగని వ్యంగ్యం ఉంది.

“మీకు నిజంగా తెలుసా?” అని నీర కూడా అంతే షార్ప్ గా అడిగింది.

“మా తెగలో ఒక సంప్రదాయం ఉంది. ఆకాశం నుంచి ఏదైనా భూమిపై పడితే, అది భూమికి ఒక సంకేతం. ఇలాంటివి జరిగినప్పుడు భూమిపై పెద్ద మార్పులు వస్తాయి. ఒక్కోసారి ఎలియన్స్ భూమిపైకి వచ్చే ముందు ఇలాంటివి జరుగుతాయి” అంది నీర.

“ఆహా! అంటే ఎలియన్స్ ఉన్నారని మీరు అనుకుంటున్నారు?” అని సబ ఆశ్చర్యంగా అడిగింది.

“అదేంటి? ఎందుకు ఉండకూడదు?” టీచర్ వంతు వచ్చింది మాట్లాడటానికి. కానీ రచయితకి టీచర్‌ని ఎక్కువగా మాట్లాడించే ఉద్దేశం లేదనిపించింది.

ఇంతలో మేనేజర్ మళ్లీ వచ్చాడు. ఒక మంచి ప్లాస్టిక్ నవ్వుతో, “మీ అందరినీ ఇక్కడ కలపడం ఆనందంగా ఉంది. ఏదో ఒక కారణంతో మనుషులు ఇలా కలుస్తారు, అదే జీవితం కావచ్చు. మీరు కావలసినవి ఈ మెనూ నుంచి ఆర్డర్ ఇవ్వండి. మీ అందరికీ గుడ్ డే” అన్నాడు. అందరూ అతనికి గ్రీటింగ్ చేస్తున్నట్లు తలూపారు. రచయిత ఏదైనా ఫిలాసఫీ చెప్పాల్సినప్పుడు మేనేజర్‌ని రంగంలోకి దింపుతున్నట్లుగా కూడా అనిపించింది.

టీచర్ అన్నాడు:“నేను ఇక్కడికి రావడం కోసం ప్రభుత్వమే ఎంపిక చేసింది. ఇలాంటి వాటిపై మూఢనమ్మకాలను తొలగించడానికి, దగ్గరగా చూసి తెలుసుకుని, ఒక సాధారణ వ్యక్తిలా ప్రపంచానికి చెప్పడానికి వచ్చాను.”

అందువల్ల నీర తప్ప మిగతా ముగ్గురినీ ప్రభుత్వమే పంపిందని అర్థమైంది కథలో.

సబ అంది:
“ఈ ఆస్ట్రాయిడ్ ప్రత్యేకమైనదిగా కనిపిస్తోంది. అది భూమికి చేరినా గట్టిపడలేదు. ప్రత్యేకమైన రంగులో మెరుస్తోంది. దానినుంచి సన్నని వింత కాంతి వస్తోంది. ఏదైనా కొత్త లోహం కనుగొంటామనే నా intuition చెబుతోంది.”

“ కొత్త లోహం కనుక్కొని ఏమి చేస్తారు?” అని అడిగింది నీర.
“మానవాళికి దానివల్ల ఎంతో ప్రయోజనం జరుగుతుందని అనిపిస్తుంది” అన్నాడు నారంగ్.

నీర నవ్వింది. ఆమె కళ్ళు చిత్రంగా తీక్షణంగా మారాయి. నవ్వుతూ కూడా కళ్ళు అంత తీక్షణంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు సబ.
“మనుషులకి ఉపయోగమని కనుక్కున్నదేదైనా, మనుషులకి గుదిబండలా తయారై వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఎంత గొప్ప ప్రయోజనం ఉందనిపిస్తే, అంత పెద్ద వినాశనానికి దారి తీస్తుంది” అంది నీర.

ఆమె చెప్పిన దాంట్లో అర్థం ఉండటంవల్లనేమో, సబ, నారంగ్ నిశ్శబ్దంగా విషాదాన్ని ప్రకటించారు. అలాగే మౌనం వహించారు.

“అలా ఎలా అనుకుంటాము? వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగిస్తే, అంత ప్రమాదకారంగా ఏవీ అవ్వవు,” అన్నాడు టీచర్.
“తన చూపుకి కూడా అందనిదాన్ని ఆక్రమించుకోవాలన్న గ్రీడినెస్ ఉన్నది మనిషిలో. మీరన్నట్లు జరగడం సాధ్యమేనా?” అంది నీర.

సబ నారంగ్ వైపు చూసింది, అతడు ఇంకేమైనా మాట్లాడతాడా అని. కానీ అతడు కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు. తాము కనిపెట్టబోయేది భవిష్యత్తులో ఎన్ని ఉపద్రవాలకు దారితీస్తుందో అనుకుంటున్నాడు.

అంతుచిక్కని ఎడారి గుండా రైలు వెళుతోంది. ఈ రైల్లో ఉన్న ప్రయాణికులందరూ ఆస్ట్రాయిడ్‌ను చూడటానికి వస్తున్నవాళ్ళే. గవర్నమెంట్ పంపడం వల్ల వీరి ముగ్గురికి ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే అవకాశం లభించింది.

సబ ఇంకా ఎదో చెప్పాలని గొంతు సవరించుకుంది. ఇంతలో మేనేజర్ సర్వర్ తో సహా అక్కడకి వచ్చాడు . సబ చిరాగ్గా చూసింది మేనేజర్ వైపు. వేడి వేడి చికెన్ సూప్, చేపల వేపుడు, కొద్దిగా అన్నం వడ్డించారు. ఆ పూటకి వారి టేబుల్ సమావేశం ముగిసింది.

రెండో భాగం మొదలైంది

ఇంకా కొన్ని గంటల ప్రయాణం.

కేబిన్‌లో సబ నారంగ్ ఉండగా టీచర్ తలుపు తట్టాడు. రచయిత వారిద్దరి మధ్య ఏకాంతానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు.  పెద్దగా అనుమతి కోసం వేచి చూడకుండానే ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. అతని కళ్ళల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా సందిగ్ధత.
“నాకొక విషయం చెప్పండి. మీరిద్దరూ సైంటిస్టులు కదా. మానవాళికి ముప్పు జరుగుతుందని తెలిసినా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో వెతకడం ఎందుకు ప్రభుత్వాలు చేస్తున్నాయి ? మీలాంటి వారు దీనికి ఎందుకు సహకరిస్తున్నారు?” అన్నాడు.

నీర మాటలు అతని మీద బాగా ప్రభావం చూపించాయి. సబ ఏదో చెప్పబోతుండగానే నారంగ్ అన్నాడు:
“మీరు ఆమె మాటలు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏమైనా ఉంటే ప్రభుత్వం మన ముగ్గురిని ఎంపిక చేసి పంపేది కాదు కదా. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో రహస్య ప్రాజెక్టులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది అలాంటిది కాదు. దీనివల్ల మానవాళికి గొప్ప ఉపయోగం ఉండబోతుందని అనుకుంటున్నా.”

“చరిత్రలో ప్రతి సైంటిస్ట్ కనుగొన్న విషయం మనుషులను ప్రభావితం చేస్తుంది – మంచిగానో చెడుగానో. సైంటిస్ట్ చేసే పని కనుగొనడమే. అతడికి మేలుతో, కీడుతో సంబంధం ఉండదు. Necessity is the mother of invention అన్నది అన్ని చోట్ల వర్తిస్తుందని నేను అనుకోను. అయినా ప్రతిదాన్ని అవసరంతో ముడిపెట్టడం అలవాటైంది మనిషికి” అన్నది సబ. గొంతులో నిరసన ధ్వనించింది .

నారంగ్ వైపు ఒకసారి చూసి సబ తాను ఇంకా ఏదో  చెప్పదలచుకున్నది. సబ ఆ మాత్రం తెలివిగా మాట్లాడటం కానీ,  నారంగ్‌ను ఇంకొకరకంగానో ప్రేరేపించడం ఇష్టం లేదు రచయితకు. రచయిత పెట్టుకున్న మేనేజర్ హడావుడిగా కేబిన్ తలుపు తట్టాడు. కథ మలుపు తిప్పాల్సిన సమయం వచ్చింది అనుకున్నాడు రచయిత.

“ఇంకొక అరగంటలో మీకిచ్చిన కిట్ నుండి లాంగ్ కోట్స్, హెల్మెట్లు, గాగుల్స్ ధరించి, మీరు అందరూ మూడు నంబర్ బోగీలోకి రావాలి. ఇప్పటినుండి ప్రయాణం కొంచెం ఉత్కంఠగా సాగబోతోంది. మీరు త్వరగా అక్కడికి చేరుకోవాలి” అన్నాడు.

టీచర్ తనకు కేటాయించిన కేబిన్‌కి వెళ్ళిపోయాడు. ఆ లాంగ్ కోట్స్ బరువుగా ఉన్నాయి. వాటితోపాటు గ్లౌవ్స్, గాగూల్స్‌ వేసుకుంటే వేరే ప్రపంచం నుండి వచ్చిన మనుషుల్లా కనిపించారు.

“ఇవన్నీ మనం రేడియేషన్‌కి తప్పించుకోవడానికి. ఈ ప్రమాదకరమైన వాతావరణంలో మనలో ఎవరికైనా ఏదైనా జరిగిపోవచ్చు. “నువ్వెప్పుడైనా నన్ను నిజంగా ప్రేమించావా?” అంది సబ.

 అనుకోకుండా వచ్చిన ప్రశ్నకి నారంగ్ ఏమి చెప్పాలో తోచలేదు.
“ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రశ్న అడుగుతున్నావా?” అన్నాడు.
“నాకు తెలుసుకోవాలని ఉంది” అంది సబ.

దానికి జవాబు దొరకకముందే అలారం మోగడం మొదలైంది. వాళ్ళు మూడో నంబర్ బోగీలోకి అడుగుపెట్టారు. అక్కడ దాదాపు పది పన్నెండు మంది ఉన్నారు. అందరూ పొడవైన కోట్లు, కళ్లజోడులు, గ్లౌవ్స్‌ ధరించి ఒకేలా కనిపిస్తున్నారు. ఆ బోగీలో కిటికీ అద్దాలు ఒక ప్రత్యేకమైన ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఆ అద్దాల ద్వారా చూస్తే, బయట అంతా వెన్నెల కురుస్తున్నట్లు చల్లగా ఉన్న అనుభూతి కలుగుతోంది. మేనేజర్ ఈసారి ఉత్సాహంగా ముందుకు వచ్చాడు. ఇప్పుడు అతనికి చెప్పాల్సింది చాలా ఉంది. జీవిత సత్యాలను చెప్పే అవకాశం తనకే వచ్చింది. “కొన్ని గంటల్లోనే గమ్యానికి చేరబోతున్నాం. మీరందరూ చాలా ప్రత్యేకమైన వారు, అందుకే ఇక్కడ ఉన్నారు. ఈ రోజు మీకు లభించిన ఈ అవకాశం ఎవరికీ రాలేదు. మీకిప్పుడు ఎడారి కూడా చల్లగానే అనిపిస్తోంది” అని అన్నాడు.

“మీలో కొందరు మాత్రమే అక్కడ దిగబోతారు. మిగతావారిని ప్రత్యేక బస్సులో అక్కడికి తీసుకెళ్లి ఆస్ట్రాయిడ్‌ని చూపించి తిరిగి రైలులోకి తీసుకువస్తారు. ఎంపిక కానివారు ఈ రైలులోనే ఉండిపోతారు. అంటే వారు ఆ వాతావరణాన్ని తట్టుకోలేని వారు. ఇంకా ఎవరికైనా వెళ్ళకూడదనిపిస్తే ఇప్పటికీ ఆలస్యం కాలేదు. మీరు రైలులోనే ఉండవచ్చు,” అని గట్టిగా చెప్పాడు.

సబ అనుమానంగా మేనేజర్ వైపు చూసింది. ఇతను ఎందుకు ప్రతిసారి అడ్డం వస్తున్నాడు? నారంగ్, గమనించావా? మనం ఏదైనా మాట్లాడే ముందు ఇతనే ముందుకు వచ్చేస్తున్నాడు అని గుసగుసగా చెప్పింది.

రైలు కాస్త నెమ్మదించినట్లు అనిపించింది. బయట వెలుతురు మారినట్లుంది కానీ ఆకుపచ్చ అద్దాల కారణంగా స్పష్టంగా కనిపించడం లేదు. ప్రయాణికులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. సబ్, నారంగ్, టీచర్ ఒక చోట కూర్చున్నారు. నీర వారి దగ్గరకు వచ్చింది. ఇది మంచి వాతావరణం కాదు. భూమికి ఏదో కీడు జరగబోతుందన్న భావన వస్తోంది. రైలు దిగడం అంత క్షేమకరం కాదు,” అంది.

నారంగ్ అన్నాడు: అంత భయపడాల్సిన పనిలేదు. అదొక ఆస్ట్రాయిడ్ మాత్రమే. నిజంగా ప్రమాదముంటే ఇలా అనుమతించరుగా!”

కానీ ఈ వాతావరణం మన మెదడుని ప్రభావితం చేస్తున్నట్టుంది అంది నీర.

నీర ఆ మాటలు చెప్పగానే, రచయిత సబలో మార్పులు చూపించడం మొదలు పెట్టాడు. ఎలాగైనా నీర ప్రాధ్యాన్యత మిగతా పాత్రలు చూడాలి అని రచయిత ఉద్దేశం. సబకి తలనొప్పి మొదలైంది. కళ్ళు తిరుగుతున్నట్టుంది.

 అది కరెక్ట్ అన్నట్లు వెంటనే మేనేజర్‌తో చెప్పించడం మొదలు పెట్టాడు రచయిత మీకు తలనొప్పి, తేలికగా తల తిరిగినట్టు అనిపించినా భయపడకండి. తర్వాత కొత్త శబ్దాలు వినిపించవచ్చు. ఎవరో సంకేతాలు ఇస్తున్నట్టూ అనిపించవచ్చు. ఇది వాతావరణ మార్పు మాత్రమే. భయపడాల్సిన అవసరం లేదు.”

చిన్న అనుమానం కాస్త పెద్దది అయింది సబలో. “అదేంటి నీర చెప్పగానే నా లోపల ఏదో మొదలైంది. వెంటనే మేనేజర్ కూడా చెప్పడం ప్రారంభించాడు.. మేనేజర్ కూడా ఇక్కడకి మొదటిసారే వస్తున్నాడు కదా! మరి ఇవన్నీ ఇతనికి ఎలా తెలుసు?” అని సబ అడిగింది.

టీచర్ అన్నాడు: అందులో ఆశ్చర్యమేముంది? ఎవరో అతనికి ముందే చెప్పి ఉండవచ్చు.”

ఎవరు చెప్పి ఉంటారు? మొదటినుంచీ మనం ఏమి చేయాలో, ఎప్పుడు గమ్యానికి చేరుతామో ఇతడే కరెక్ట్గా చెప్తున్నాడు. మేనేజర్కి ఎవరు ఇవన్నీ చెప్తున్నారు?” అని సబ ఆలోచించింది.

నీర సబ వైపు చూసి, నువ్వు ప్రతిదానిని అనుమానంగా చూడకు. మేనేజర్తో నీకు ఏదో సమస్య వచ్చిందనుకున్నప్పటి నుంచి అతనిపై చికాకు పడుతున్నావు అంది.

సబ కి అర్ధం కాలేదు. “నాకు మేనేజర్ పైన చికాకు ఉన్నట్లు నీరకు ఎలా తెలుసు. నేను చెప్పకుండానే అలా ఎలా అనుకుంటుంది. అంటే నీరతో చెప్పించేది మేనేజరేనా?“ అని సబ తన లోలోపల అనుకుంది. అసలుస నారంగ్‌ను మాట్లాడకుండా చేస్తోంది ఎవరు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అసలు ఈ గమ్యానికి ఎంపిక చేసింది ఎవరు? అసలు సురక్షితంగా వెళ్తామా అక్కడికి? సబలో ప్రశ్నలు తలెత్తాయి.

దాంతో రచయిత వెంటనే కథను మలుపుతిప్పాడు.

ఇంతలో మేనేజర్‌ అనౌన్స్‌మెంట్:
అందరూ అప్రమత్తంగా ఉండండి. రైలు సొరంగ మార్గంలోకి వెళ్తుంది. సమయంలో ఎక్కువ శబ్దం చేయకపోవడం మంచిది. నిశ్శబ్దంగా ఉండండి. మీరందరినీ సురక్షితంగా గమ్యానికి తీసుకెళ్లే బాధ్యత నాది.”

ఏదో అర్ధమవుతుంది సబకి.

రచయిత మాత్రం సబ ఎక్కువగా ఆలోచించడం ఇష్టపడటం లేదు. అతని కథలో సబని తెలివైన వ్యక్తిగా చూపించాలనుకోలేదు. నిజానికి, రచయిత నీరను ఒక అతీతమైన వ్యక్తిత్వంగా చూపించాలని అనుకున్నాడు—మానవాళికి ప్రబోధం చేసే, ఉన్నత పాత్రగా. కానీ సబ అనుకోకుండా తన అనుమానాలతో కథలో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అందుకే రచయిత కథని నియంత్రించాలని ఎడారిలో సొరంగ మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ సబ ఆలోచనల్ని ఆపలేకపోయాడు.

ఎడారిలో సొరంగం ఎందుకు ఉంటుంది? ఎవరు ఈ మాయ ఆట ఆడిస్తున్నారు? మేనేజర్కి ఎవరు చెప్తున్నారు?” అని సబ అనుకుంది. ఆలోచనల మధ్య నారంగ్ నిజంగా తనని ప్రేమిస్తున్నాడా అన్న సందేహం కూడా తలెత్తింది. ఒకే కేబిన్‌లో ఉన్నా, తన చేతిని తాకలేదు ఎందుకు? ఆ ఆలోచనలతో తలమునకలైన సబ నారంగ్‌కి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది. చీకటిలో నారంగ్ ఆమె చేతిని పట్టుకొని గట్టిగా ఒత్తి గుండె దగ్గర పెట్టుకున్నాడు. సబకి సంతోషం వేసింది.

రచయితలో కంగారు మొదలైంది. ఈ నారంగ్ ఏంటి ఇలా చేస్తున్నాడు. రైలు ఒక్కసారిగా సొరంగం నుంచి బయటకి వచ్చింది. నారంగ్ ఆమె చేతిని వదిలేశాడు.

సబకి నిజం అర్థమైంది. ఆమె ఒక్కసారిగా లేచి అందరితో మాట్లాడటానికి సిద్ధపడింది.

కానీ వెంటనే మేనేజర్‌ అనౌన్స్‌మెంట్ వినిపించింది:
మీరు మీ సీట్లలో కూర్చోండి. మీకు టీ వస్తోంది.”

సబ వినకుండా లేచి గట్టిగా అన్నది:
చూడండి! మనం ఎంచుకోని గమ్యానికి ఈ రైలు మనల్ని తీసుకెళ్తోంది. మన ఫ్రీ విల్ ఏమీ లేదు. ప్రయాణం కోసం మనల్ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. రైలుని ఆపి వెనక్కి వెళ్ళమని చెప్పుదాం! లేకపోతే మనల్ని ఉపయోగించుకొని త్యాగం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మనం స్వేచ్ఛగా ఆలోచించే మనుషులం. ఆలోచించండి!” అని గట్టిగా అరిచింది.

ఎవరూ కదల్లేదు. నారంగ్ భయంతో ఆమె చేయిని లాగాడు.

అప్పుడు నీర లేచి చెప్పింది:
సబ, రైలు ఎక్కినప్పుడే నువ్వు తిరిగి వెళ్లలేని నిర్ణయానికి కట్టుబడ్డావు. ఇక వెనక్కి వెళ్లలేవు. నా మాట విను, ప్రయాణానికి అడ్డు చెప్పకు

నువ్వెవరు నీర? నీతో ఎవరు చెప్పిస్తున్నారు ఈ మాటలు? అసలు నువ్వే చెపుతున్నావారెట్టించింది సబ.

రచయితలో భయం మొదలైంది. అతడు నిర్దేశించుకున్న, రాసుకున్న ముగింపు ఇది కాదు. ఏమీ కనిపించకుండా కిటికీలకు ముసుగు వేసినట్టు పదే పదే మేనేజర్ వచ్చి చెప్పినా, సబ పాత్ర నిజం తెలుసుకుంది. అదెలా సాధ్యమైంది? తాను కథలో ఎక్కడ తప్పు చేసాడో రచయితకు అర్థం కాలేదు.

“సబకి ఆలోచించే అవకాశం నేను ఎప్పుడూ ఇవ్వలేదు. ఆమెను నారంగ్‌తో పిచ్చి ప్రేమలో ఉన్నట్టుగా చూపించడానికి ఎంత ప్రయత్నించినా, ఆమె ఆలోచించడం మానడంలేదు. ఆమె ఈ కథలో ముఖ్య పాత్ర కాదు. అయినా తన పరిధిని దాటిపోయింది. ఇప్పుడు నాకు ఉన్నది ఒక్కటే మార్గం సబను తొలగించడం!” రచయిత తనలో తాను గొణుక్కున్నాడు. రచయితకు దుఃఖం వచ్చింది. సబను కథలోనుంచి తీసివేయాలని అతడు అసలు అనుకోలేదు. రచయితకి సబపై కొంత సానుభూతి కూడా ఉంది. కానీ తప్పలేదు.

రైలు ఇంజనులో ఉన్న రచయిత తలుపును ఎవరో బిగ్గరగా కొడుతున్నారు. గుండె రాయిగా చేసుకొని రచయిత సబను త్యాగం చేసాడు. రైలు ఇంజను తలుపు చప్పుడు ఆగిపోయింది. రచయిత ఊపిరి పీల్చుకున్నాడు.

కథ ముగింపులేకుండా ఆగిపోయింది.

Srisudha Modugu

పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన శ్రీసుధ మోదుగు 'రెక్కల పిల్ల, 'డిస్టోపియ' వంటి కథా సంకలనాలతోపాటు 'అమోహం', 'విహారి', 'గొంగళి పురుగుల సామ్రాజ్యం' మొదలైన కవితా సంకలనాలు తెచ్చారు.. వీరి 'అమోహం' కవితా సంకలనానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డ్, (2017), 'అంతర్హిత' నవలకి శ్రీ జొన్నలగడ్డ రాంభొట్ల సరోజినమ్మ స్మారక పురస్కారం వచ్చాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *