డాకరాసంగం మండల మీటింగుకు పొద్దుననంగ టౌనికి వస్తి. మీటింగు చూసుకోని, చిన్నపెద్ద పనులు చేసుకోని ఊరికి పొదామని బస్టాండ్ కు పొయిన. మా ఊరు మీద గంటకొగ బొస్సు పోతుంది. బొస్సు బస్టాండుకు రాకనే నడిదవులోనే జనాలు ఎక్కేస్తా ఉండారు.అరవై డెబ్బై మంది పట్టే బస్సుకు నూరు ఇన్నూరు మంది ముసురుకుంటే ఏమి చేయను?ఎప్పుడో పొద్దున తిన్నసంగటి. కడుపు కాలతా ఉంది.
నేను చిన్నగా ఉన్నబుడు మాయవ్వ నాకొగ కత చెప్పేది. అది గ్యాపానికొస్తావుంది. అనగనగా ఒగూర్లో ఒగ ఆలు మొగుడు. వాల్లకు కూటికి గుడ్డకు జరిగేది చానా గగనమంట. వాళ్లకి బిడ్డలు లేరు. కొత్తోలెవురన్నా ఈల్లను చూస్తే ఇద్దరూ పాయంగా ఉండారు, ఏం బింగరమా ఎవురి కన్నా పనికి పోయి సంపాచ్చుకోని తిని బతకచ్చు కదా అనుకుంటారు . కాని ఒగబుడు వాళ్ళ తాతగారు నాయున గారు బాగా బతికినోల్లంట. ఊరంతా ఈల్లకాడికొచ్చి పని బాట్లు చేసుకొని ఈల్ల దగ్గర సొమ్ము తీసుకు బతకతావున్నోల్లు . పూలమ్మిన తావన కట్లమ్మితే నాలీసుగా ఉంటుంది కదా అని ఈళ్లు ఎవురు కాడికి పనికి పోరు. ఎవుర్ని సాయిమడగరు. యాలవ్వ అట్ల బతికినోలు ఇట్లేటికైనారు అనడిగితే,మన చేతికి ఐదేల్లు ఒగటిగా ఉంటాయా అంటారు . వాళ్ల సంసారంలో కూడా ఎవుడో వొగడు దుబారికో,మంచికో,చెడ్డకో వాళ్లను బికారోల్లను చేసేదానికి పుట్టింటాడు. వాని వల్లనే ఈల్లకు ఈగెతొచ్చి ఉంటుంది.ఈ ఆలు మొగునికి ఒగ అలవాటుంది. తల్లీ బిచ్చుము అని ఇంటి ముందర కొచ్చినోళ్ళకి ఏదో ఒగటిచ్చి పంపిస్తా ఉంటారంట! ఆకిలనొచ్చినోనికి వాళ్ళు తినేదైనా పెట్టేస్తారు. ఇట్ల జరగతా ఉంటే ఒకనాడు కడవలో నీళ్లు తప్ప ఏమీ లేవు. ఇద్దరూ కడుపును అరచేత్తో అదంపట్టుకొని పొనుకోనుండారంట. అబ్బుడనంగానే వొగాయప్ప అమ్మా బిచ్చం బెట్టు అని ఆలింటి ముందరకి పోయినాడు. ఆ మాట చెవుల్లో పడతానే వాళ్లకు ఆకిలి, బాద ఏడ పోయిందో తెలియదు,ఆ యప్పకు ఏం బిచ్చం పెట్టేది?అనే తారాట పుట్టిపోయింది. ఇల్లంతా బూతద్ద మేసి గాలిచ్చినా బోకులన్ని ఉత్తవే, ఆయమ్మ ఆకీరుకు ఉప్పుసట్టి తెరిసి చూసింది. అడుగున పిడికెడు ఉప్పు .ఆయమ్మ కండ్లకు ఆ ఉప్పు ఎండి, బంగారు,రత్నాలు,మెరిసినట్లు కనపన్నాయి. దానం జైను యాదో ఒగటి సిక్కిందన్న సంబరం ఆయమ్మకు. కానీ ముందటి పెద్దోళ్ళు ఊరికే ఉండ్రు కదా, మోకాలికి బోడి గుండుకి ముడేసే మాట్లు సందించి పెట్టింటారు. అట్లా ఉప్పు ఊరికే తీసుకోకూడదు, ఉప్పు ఊరికే పెట్టకూడదు అనే మాట ఆయమ్మకు గుర్తు రానే రాదు.
ఆ పిడికెడు ఉప్పు ఎత్తుకోని పోతుంది. ఇబుడు బిచ్చిగాల్లకు టోరుబీము పెట్టను పోతే వద్దంటారు, మిసను బీమే కావలంటారు. వొడ్లు గింజలు పెడితే వద్దంటారు, దుడ్లు మాత్రమే ఇమ్మంటారు, అది రూపాయి,రెండ్రుపాలిస్తే తీసుకోరు, పది రూపాయలు చూస్తేనే మగం మంచిగా పెట్టుకుంటారు, లేదంటే మగమంతా ముడేసుకొని తిట్టుకుంటా పాతారు. కానీ ఆ కాలాన జోలి బుజానికి ఏసుకొని ఇంటి ముందరకొస్తే ఏమిచ్చినా జోలి పట్టేవాళ్ళు. ఇదే పెట్టు అనడిగేవాళ్లు కాదు. ఇబ్బుడు మాదిరి బిచ్చిగాళ్లలా అట్టాసము చేసేది లేదు.
యాకాలమైనా చెడ్డోల్లు మంచోల్లు అని రెండు రకాలు ఉంటారు. ఇట్లే వొగూర్లో బిచ్చగాడు పోయింటే ఒగాయమ్మ ఇల్లలుక్కుంటా ఉన్నిందంట ఈ బిచ్చగాడు ఆయమ్మింటి కాడికి పొయ్యి అమ్మా బిచ్చం పెట్టు అన్నాడు. ఆ యమ్మ ఎట్లాడిదంటే ఏలిరిగింది ఉచ్చలు పొయ్యి అంటే ఉచ్చలు పోస్తే కుత్త సముస్తుందేమో అన్న రకం, అంత పాసినాడది. ఇల్లలికే పేడ పిడస ఎత్తకొచ్చి జోల్లో ఏసిందంట. వాడు ఆజోలిప్పితే ఏముంది పేడ ముద్ద. అదక్కడ పారేసి దేవుడా నువ్వే దిక్కు అని ఎలిపాయనంట. ఈయమ్మ సచ్చినంక నరకానికి పోయిందంట. దేవుడు ఈ యమ్మకు తినేదానికి పేడ ముద్దలే పెట్నాడంటారు పెద్దోళ్ళు.అయినా పైనేమి జరిగేది ఎవరు చూసినారు. మనసుల్లో మంచితనం పాకూడదనే ఉద్దేసంతోనే ఈ ఉబకతలన్నీ కనిపెట్టింటారు.
సరే ఇట్లా ఆ ఉప్పు ఆయమ్మ పిడికిట్లో ఉండేది ఆ బిచ్చిగాడు చూసి “తల్లీ ఉప్పు రుణమమ్మ ” అని వాని జోల్లో వొగ కాసుంటే అది ఇస్తాడు. ఆ కాసు దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఈరూకతో ఏం చేయల్ల అని ఆలు, మొగుడు ఇద్దరూ ఆలోసన చేసి ఆ కాసిచ్చి చిన్నకోడి పిల్లను పట్టుకొని ఇంటికొస్తారు. దాన్ని మేపి దాని గుడ్లు పొదగేసి అది చేసిన పిల్లలు, కోడిగుడ్లు అమ్ముకుంటా ,దిన దినానికి ఆల్ల యాపారం పెంచుకుంటా నాలుగు రకాల పనులు చేస్తా మల్ల దుడ్డు మిందకొస్తారు .ఇది నిజమైన కత.
కానీ మాయవ్వ చెప్పేకత ఏరే , అంటే ఆ బిచ్చిగాడిచ్చిన రూక దేవునిదగ్గర పెట్టి పొనుకోనుంటే రేయికి రెయ్యే పెద్ద కంచు బిందెడు కాసులయ్యి వాళ్ళు కోటిసులైనారు. మల్ల దాన దర్మాలు చేసినారు. ఆ వొచ్చింది దేవుడే అన్నట్లు కైకట్టుకొని ఇంటి ముందరకి ఎవురొచ్చినా ఉత్త చేతులతో అంపించకూడదు అని ఆడుక్కోనొచ్చింది మంచోడా, ముసలోడా, దిక్కు దారి లేనోడా, కన్నుకాలు చేయి లేనోడా ఇవన్నీ ఏమి చూడదు. యాదో ఒగ రూపంలో దేవుడే వస్తాడు. నన్ను మెచ్చి నాబతుకు మార్చేస్తాడు అనుకోని దానం చేస్తానే ఉంది. ఆ బిచ్చిగాడేమో ఉన్నోని కాడ, లేనోని కాడ అనే తేడా లేకుండా అడుక్కుంటాడు. ఆ దేవునికి అడుక్కునే వాని మిందా దయ లేదు, దానం చేసే మా యవ్వ మింద దయ లేదు. ఎందుకంటే వాని జోలి పారేసి బతికే అంత దానము అవ్వజేయలేందు . అట్లా మేము రాజుల కతల కాన్నుండి ఇబుడు రాజకీయ పాలన దాకా కూడా జోలి తీసేసి బతికే దానికి చేసే దానాలు చూసింది చానా తక్కువ !
ఇబుడుండే రాజకీయ నాయకులు ఏం చేస్తా ఉండారో వాళ్లకి ఏమన్నా తెలుసునేమో, మాకైతే వాళ్ళు చేసే పనుల గురించి అంతు సిక్కలా! ఈ ప్రీ బస్సులేసినబుడు నుండి, బస్సు ఎక్కి దిగల్లంటే దేవుడు కనపడతా ఉండాడు. ఒగబస్సన్నా కాలీగా తిరగలా, ఏమన్నా మాట్లాడితే ఇండ్లలో మొగోళ్ళు మీకు బస్సులో ప్రీ నే కదా పాండి అంటారు. వాళ్లు తిరిగి చేసే పనులు ముక్కాలు బాగం మేము చేయాల్సి వొస్తా ఉంది. దీనికి తోడు యాడ నలుగురాడోళ్ళు ఉడ్డగా కనబడితే చానా దగ్గర్ల బస్సు ఆపరు. ఉరుము ఉరిమి మంగలం మింద పడిందంట. అట్లా ఆడవాళ్లను చూస్తే ఈ డైవోర్లకు,కండక్టర్లకు ఎక్కల్లేని కోపాలు? ఈ కోపాలతో డైవోర్లు బస్సులను యాడ గుద్ది పారేస్తారో అనే బీతి చుట్టుకునింది.
వాడెవడో ఉచితంగా ఉరితాల్లిస్తానంటే యా పొద్దుకైనా పనికొస్తుందని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేట్టుంది మా పరిస్తితి . ఇబుడు సుమారుగా మూడు బస్సులు పొయినాయి. ఆ డోరు కాడ మూడు మెట్లెక్కి బస్సులోకి అడుగు పెట్టాలంటే ఒగ ఇద్దం చేసినట్లే. సీట్లు కోసం మనిసి కాళ్లుసేతులు ఇంచేస్తారు, లేదా మనిసి నెత్తిన కూడా అడుగులు పెట్టి దూకతారు, ముసలి ముతక,రోగం రొచ్చు వొచ్చినోల్లైతే పానాలు పిడికిట్లో పెట్టుకొని ఎక్కాల్సిందే, కుక్కలకు కాకులకు గద్దలకు కండేసి కోట్లాట పెట్టినట్లుంది. ఆ జనాల్లో తోసుకొని, దొబ్బుకొని పోయి బస్ఎక్కలేక బస్టాండ్లోనే ఉండా, ఈ బస్సులన్నీ పాతా ఉండాయి, నేనెక్క లేదే అనే బాదతో దిక్కులు చూస్తా ఉంటే నా నేస్తురాలు నన్ను గుర్తుబట్టి
ఏంబా బాగున్నావా అనే. నాకు టక్కుమని గుర్తుచిక్కలే ! నాకీ నడన మతిమరుపు సానా ముదిరిపోయింది. నేనట్లే చూస్తా ఉంటే ఏంబా మర్చిపోయినావా అనే, అబుడు గుర్తుకొచ్చే
“అయ్యో శామల నువ్వా, యాల్నేయమ్మ ఇట్లయి పోయినావు, గుర్తే సిక్కలేదు, నల్లగైనావు, సన్నగైనావు, ఏమన్నా బాగాలేదా ?నిన్ను చూసి సుమారు ఏడెనిమిదేండ్లాయ” అంటి. శ్యామల “‘సరేరా చాన్నాల్లాయ చూసి, అట్లా పోయి టీ తాగి మాట్లాడుకుంటాము ,నీకింకా ఒక గంట బస్సు రాదు” అనే. సరే పద నాకు ఈ బస్సులతో తలకాయ నొప్పి వస్తా ఉంది అనుకుంటా ఇద్దరం పోయి టీ తాగి ఆ బస్టాండ్లో కాలిగా ఉండే బెంచి చూసి కుసుంటిమి.
ఈ శామల గురించి మీకు చెప్పల్ల. మా పక్కూరు వాళ్లది. డాకరా సంగాల్లో లీడర్ గా పనిచేసేటబుడు సంగం మీటింగ్లకు పాతా వస్తా బాగా సావాసం ఏర్పడింది మాకు . అబుడు నుండి ఇద్దరు అక్క చెల్లెల్లు మాదిరి ఉండేది. శామల మనిసి గిత్తగా తెల్లగా మట్టంగా ఉంటుంది. డిగిరి వరకు చదివింది,తెలివైనది . ఆయమ్మి మొగుడు కూడా డిగిరి సదివినాడు .అంత చదివినా , పెండ్లాము ఉద్యోగానికి పోకూడదు, వాడు ఉద్యోగం చేయకూడదు, ఉల్పాగా గడిచిపావల్ల అనే రకం. ఊర్లో కాసింత బూముంది. వాళ్ళ అమ్మానాన్న పండిస్తే తినేది. ఇట్లా ముగ్గురు బిడ్డలు పుట్నారు. ఇట్ల కాదని లోలోపల మొగుడుతో రంపులాడుకొని మొగుడ్ని తీసుకుని టౌను కొచ్చేసింది .అది సుత దాన్ని చూడ్డం ఇబుడే.
శామల నన్ను చూసి “ఏం బా బాగున్నావా! మీపిల్లోల్లు బాగుండారా! ” అని మంచి చెడ్డ అడిగే. నేను “ఏమి శామల టౌనుకొచ్చి ఏడెనిమిదేండ్లు అయ్యిండలా , బొత్తిగా పల్లికి రానే రావే, టౌనులో ఏంచేస్తా ఉండావు, నీ బిడ్లు ఏం చేస్తా ఉండారు. నువ్వైతే మనిసి గుర్తు సిక్కకుండా అయినావు”. అనడిగితే ఆ మాటకు శామల ” అయ్యో నా బాద చెప్పనలిగాదు, ఆ దేవుడు నా రాతను కలం పుల్లతో రాయలా గాడిద మడ్డతో ఏమో రాసినాడు అందుకే నాకీ కష్టాలు. ఇద్దరం సదువుకొని పల్లిలో బతకలేక బిడ్డలనన్నా బాగా సదివించు కుందాము, ఏదన్నా యాపారం చేసుకుందామని, డాకరా సంగంలో ఐదు లచ్చలు లోనెత్తుకొని ఆర్టీసీ బస్టాండు పక్కన ఇంటర్నెట్ సెంటర్ పెడితిమి. సెంటరేమో బాగానే జరగతా ఉండే. మేము సాపు తీసుకోనుండే ఇల్లు మూడంతస్తులు. ఆ సాపు ఓనరు ఆ మూడంతస్తుల్లో అన్నీ అంగిడి రూములేసి బాడిక్కి ఇచ్చినాడు. మూడంతస్తులకి కలిపి ఆ వోనరు నాబట్ట పైనేన్నో మూల ఒగ చిన్న బాతురూము పెట్నాడు. అది కూడా గలీజు చేస్తారు, నీల్లెక్కువ వాడతారు, అని బీగమేసేస్తాడు. ఆడ సాపుల్లో చానా మంది మగోల్లే పనులు చేస్తా ఉండారు. నీకు తెలిసిందే గదా నేను ఒంటికి తాలబట్లేనని, ఎబుడు బాతురూము కాడికి పొయినా మొగోల్లు కాస్కోనుంటారు. నాకు తలకాయ తెగ్గొట్టినట్లయ్యేది.
ఒకొక్క అంగడిరూముకు పది వేలు,పదైదు వేలు బాడిగలు తీస్తాడు. పొద్దున్నేఆరు నుండి రేతిరి పది వరకు సాపుల్లో ఉంటారు . ఒంటికి దొడ్డికి ఎక్కడ పారతారు అన్న బుద్ది కూడా లేదు వానికి. పొద్దున్నే తొమ్మిది కి సాపు తెరిస్తే రేతిరి పద్దంకా నేను నా మొగుడు ఇద్దరు సాపుల్లోనే ఉండేది. అట్లయి నీళ్లు తాగేదేలే, దినానికి ఒగ సారి ఒంటికి పావల్లన్నా గగనమయ్యేది. ఒగనాడు.ఆర్టీసీ బస్టాండుకు పోదు, ఆడ పది రూపాయల లిచ్చి పోసొచ్చేది. ఓనాడు పక్కన సూపర్ మార్కెట్ ఉంటే ఆడికి బోదు, అదే బజార్లో కడన జి ఆర్ టి బంగారుసాపు వుంది ఆడికి బోదు.యా మాటకు ఆమాట చెప్పుకోవల్ల ఆ బంగారు సాపులో ఉండే బాతు రూములు చూస్తే పాలు పోసి పాలెత్తుకోవచ్చు, అంతా సుద్దంగా ఉంటాయి.
ఆ బాతురూముల్లోకి పోతే గలీజు చేసే వానికి కూడా ఇంత సుద్దంగా ఉండేదాన్ని మనమెట్లా గలీజు చేసేది, మనమూ సుద్దంగా పెట్టల్ల అనిపిస్తుంది. ఈ బంగారంగిటోడు వాని కర్చులన్నీ మనమేందేసినబుడు ఆ బాదతో ఆ బాతురూముల్లోకి పోతే ఆ కాన్చేడి అవన్నీ మర్చిపోతాము. పోతే ఆడుండే సెకూరుటీ తొలినాడు నన్ను చూసి ఈ యమ్మ బంగారం కొనేదానికి వొచ్చిందనుకొని దండాలు పెట్టి సూసిరి. నేను కూడా కొనే దాని మాదిరి బిల్డప్ ఇస్తా అట్లా సాపు లోకి పోయి ఒగ రౌండేసుకొని బాతురూముకి పోయి వొచ్చేస్తి !
ఇట్లా దినం మార్సి దినం, మూడోదినము,నాలుగో దినము అట్ల నెల,రెన్నెల్లు పోతి .దినాము పాతా ఉంటే గుర్తు చిక్కనా ,ఈయమ్మ బాతు రూము కె వస్తా ఉంది. బంగారం కొనేదానికి కాదని కనిపెట్టేసిరి. ఆ వాకిలి కాడ ఉండే సెకూరిటీ కూడా నన్ను అదొక రకంగా చూసేది. వాల్లే వొగనాడు తెగాయించి చెప్పేసిరి. బైటోల్లు రాకూడదమ్మ సీసీ కెమెరాల్లో చూసి ఓనర్లు అడుగుతారని. అక్కడకు పోయేది సాలించేస్తి. నా మొగునికి ఆ బాద లేదు. చిన్నగా దిగబడి వచ్చి ఆడ ఏట్లో పోసుకోనోస్తాడు. నేను కూడా అట్ల దిక్కులేక రెండు, మూడుసార్లు పోయిన. పోయినసారల్ల చుట్టూ జనాలు చూస్తానే పోతా ఉంటే నాకు బగిశనం అయ్యేది.
ఇట్లా ఇబ్బందులు పడతానే మూడేళ్లు గడిపిన. ఆయాలకు నాకు ఒళ్ళు బాగాలేక యూరిను ఇనుపెక్షను అయిపోయి చానా ఆసుపత్రిలు తిరిగి నాకు సాద్యం గాక ఆసాపులో నామొగిన్ని పెట్టేసి నేను ఇంటికాడే ఉండిపోతి. నా మొగుడు ఏమి చేసినాడూ , ఆ నెట్టు సెంటర్ కు ఒగతి వస్తా పాతా ఉంటే దాని సావాసం చేసి ఇంట్లోకి దుడ్డీ కుండా అడిగితే తిరగబడేది, నా మింద రంపుకొంచ్చేది ఇట్లా చేస్తా వుంటే నేను కనుక్కొని ఆసాపే వొద్దని వొదిలేసి మల్ల మేము మేకలపల్లిలో గుత్తకు బూమి కట్టుకొని సేద్యం చేసుకుంటా ఉండాము. నన్ను మాయమ్మ నాయన సుగంగా సాకిరి,ఏమిసుగము వానికిచ్చి చేసి నానెత్తిన రాల్లేసిరి. బిడ్లు పుడితే మారతాడు బాద్యత ఉంటుందని వుగరు కాదని ముగ్గురు బిడ్డలు కంటి,ఏం మారినాడు ఆ బిడ్లతో సాకే దానికి నానా అగసాట్లు పడతావుండా” అని దాని బాదంతా ఎలగక్కే .
అయినా ఈ టౌన్లో అంగల్లలో పనులు చేసే ఆడోళ్లు ఎంతమంది బాతురూములు లేక ఇబ్బంది పడతాఉండారో, ఈ సాపులు కట్టే ఓనర్లకేమి , ఆ బాతురూములు కూడా అంగిటి రూములు చేసి బాడిక్కిస్తే దుడ్డొస్తుంది అనే లెక్కన ఉండారు. గవర్నమెంటుకే తెలీదు మామూలు జనాల అగసాట్లు. మామూలు జనాల కేమి తెలుస్తుంది, అందరూ ఆడదాని ఒళ్ళునిండ గుడ్డ కట్టుకునే దాని గురించి మాట్లాడతారు. ఆడదానికి ఒంటికి, దొడ్డికి వొస్తే ఎట్లా చేయల్ల అనేది ఎవురూ మాట్లాడరు, ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నట్లే మా ఊరు బొస్సొచ్చే.ఈసారి బిరిన్న పోయి కిటికీలో బాగేసి బొస్సులోకి జొరబడి సీట్లో కుసుంటి. శామల వాల్లూరికి బాయ. నేను సచ్చి బతికి ఇంటికొస్తి!

