ఆఖరి పట్టా!

Spread the love

ప్రభుత్వ కార్యాలయంలో ఆ ఉదయం కూడా ఎప్పటిలాగే రద్దీగా ఉంది.

ఒక కిటికీ ముందు పుట్టిన బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కోసం కొత్త తల్లిదండ్రులు ఆనందంగా నిలబడి ఉన్నారు. మరో కౌంటర్ దగ్గర పెళ్లి నమోదు కోసం ఓ యువజంట ఫారాలు నింపుతోంది. మూలన ఓ వృద్ధుడు పెన్షన్‌కు అవసరమైన ధ్రువీకరణ పత్రం కోసం ఫైలు పట్టుకుని ఓపికగా కూర్చున్నాడు.

పుట్టుక, పెళ్లి, వృద్ధాప్యం—అక్కడ ప్రతి కౌంటర్ ఒక జీవితాన్ని ఏదో ఒక రూపంలో నమోదు చేస్తోంది.

నేను మాత్రం ఒక జీవితం ముగిసిందని నమోదు చేసే కాగితం కోసం ఎదురుచూస్తున్నాను.

నా టోకెన్ నంబర్ పిలిచారు.

కౌంటర్ దగ్గరకు వెళ్లాను. క్లర్క్ నా వైపు చూడకుండానే ఫైలు తెరిచాడు. కొన్ని వివరాలు అడిగాడు. కంప్యూటర్‌లో నమోదు చేశాడు. కాగితం ప్రింట్ తీసి, ముద్ర వేసి, సంతకం చేసి నా వైపు జరిపాడు.

“తీసుకోండి… పూర్తయింది.”

అతనికి అది ఒక పని పూర్తయినట్టే.

నాకు మాత్రం ఆ కాగితం చేతిలోకి వచ్చిన క్షణంలో ఏదో బరువు పెరిగినట్టనిపించింది.

కాగితం మీద ఆయన పేరు ఉంది. పుట్టిన తేదీ ఉంది. మరణించిన తేదీ ఉంది. వాటి మధ్య ఒక చిన్న గీత ఉంది.

ఆ గీత ఎంత చిన్నదో… దాని వెనుక దాగి ఉన్న జీవితం అంత పెద్దది.

తెల్లవారకముందే పనికి బయలుదేరిన ఉదయాలు. మా చదువుల కోసం తన అవసరాలను పక్కన పెట్టిన రోజులు. జేబులో డబ్బు తక్కువగా ఉన్నా మా చేతుల్లో పుస్తకాలు ఉండాలని చూసిన తండ్రి. ఇంట్లో ఎవరూ తన అలసటను గుర్తించకూడదన్నట్టుగా గుమ్మం దాటేటప్పుడు ముఖం మీద చిరునవ్వు పెట్టుకునే మనిషి.

అంతటి జీవితాన్ని ఒక తెల్లని కాగితం కొన్ని పంక్తుల్లో ముగించింది.

కార్యాలయం బయటకు వచ్చాను.

రోడ్డు మీద జీవితం మాత్రం ఏమీ జరగనట్టుగా సాగుతోంది. ఆటోలు ప్రయాణికులను పిలుస్తున్నాయి. టీ దుకాణం దగ్గర నవ్వులు వినిపిస్తున్నాయి. పిల్లలు పాఠశాల బస్సు కోసం పరుగులు తీస్తున్నారు.

ఒక తండ్రి తన చిన్నబిడ్డను భుజాలపై ఎక్కించుకుని రోడ్డు దాటిస్తున్నాడు.

ఆ దృశ్యాన్ని చూస్తూ కొద్దిసేపు నిలిచిపోయాను.

ప్రపంచానికి అది మరో సాధారణ ఉదయం. నా జీవితానికి మాత్రం ఒక తలుపు మూసుకున్న ఉదయం.

నాన్నకు మనుషులంటే చాలా ప్రేమ.

ఎవరైనా తమ సమస్య చెప్పుకుంటే, అది తనకు సంబంధించినదా కాదా అని ముందుగా ఆలోచించేవాడు కాదు.

“వాళ్ల పరిస్థితి ఎలా ఉందో?” అని ఆలోచించేవాడు.

ఎదుటివాడికి తన వల్ల ఉపయోగం కలుగుతుందనిపిస్తే చేసేవాడు. తన దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడంలో ఆయనకు ఎప్పుడూ లెక్క ఉండేది కాదు.

ఇచ్చిన తర్వాత తిరిగి ఏదైనా రావాలని ఎదురుచూడటం ఆయనకు తెలియదు.

నాన్న చదువు ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. వరకు మాత్రమే. కానీ ఆఫీసులో ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్‌లో ఆయనకు మంచి పట్టు ఉండేది. అధికారిక ఉత్తరాలు రాయడం, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పేలా డ్రాఫ్ట్ చేయడం ఆయనకు బాగా వచ్చేది.

ఆఫీసులో ఎవరికైనా ఉత్తరం రాయాల్సి వచ్చినా, పై అధికారికి ఏదైనా విషయం తెలియజేయాల్సి వచ్చినా, వాళ్లు నాన్న దగ్గరకే వచ్చేవారు.

వాళ్ల మాట ఓపికగా విని, తన చేతిరాతలో డ్రాఫ్ట్ చేసి ఇచ్చేవాడు. అవసరమైతే టైప్ చేయించి పంపించేవాడు.

తనకు తెలిసిన పని తన దగ్గరే ఉంచుకోవడం ఆయనకు చేతకాలేదు.

ఒకసారి మార్కెట్‌ నుంచి తినుబండారాలు తెచ్చాడు. సంచి తెరిచిన వెంటనే కొంత విడిగా తీసి పక్కన పెట్టాడు.

“అది ఎందుకు?” అని అడిగాను.

“పక్కింటి పిల్లల కోసం.”

“మరి మనకు?”

“మనకూ ఉన్నాయి కదా!”

అంతే.

ఆ చిన్న మాటలోనే నాన్న స్వభావం మొత్తం ఉండేది.

తనవాళ్లు, పరాయి వాళ్లు అనే గీత ఆయనకు పెద్దగా ఉండేది కాదు.

అలాంటి నాన్నను ఒక రోజు ఆఫీసులో అవమానించారు.

ఏళ్లుగా తనతో కలిసి పనిచేసిన వాళ్ల ముందే, తాను చేయని తప్పుకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

ఒక అధికారిపై వచ్చిన ఫిర్యాదు నాన్నే రాశారనే ఆరోపణ ఆయన మీద పడింది. చేతిరాత ఆయనదానిలా ఉండటమే అందుకు కారణం.

నాన్నను పై అధికారి గదికి పిలిచారు.

“ఈ ఫిర్యాదు మీరు రాశారా?”

“లేదు.”

“చేతిరాత మీదే కదా?”

నాన్న ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

కొన్ని క్షణాలు దానివైపు చూస్తూ ఉండిపోయాడు.

తన చేతిరాతను చూసి తననే తాను అనుమానించుకోవాల్సినంతగా ఆ క్షణం అవమానంగా అనిపించి ఉండాలి.

“నాదిలా ఉంది. కానీ నేను రాయలేదు,” అన్నాడు.

గదిలో కాసేపు నిశ్శబ్దం.

ఆయన సమాధానాన్ని నమ్మినట్టు ఎవరూ కనిపించలేదు.

ఏళ్ల తరబడి నిజాయితీగా పనిచేసిన మనిషి, ఒక్క కాగితం ముందు నిందితుడిలా నిలబడ్డాడు.

విచారణ జరిగింది.

చివరికి ఎవరో ఆయన చేతిరాతను అనుకరించి ఫిర్యాదు రాసి, ఆయనే రాసినట్టుగా టైప్ చేయించి పై అధికారులకు పంపినట్టు బయటపడింది.

నాన్న తప్పు చేయలేదని తేలింది.

కానీ అప్పటికే ఆయన మనసులో పడిన గాయం మాత్రం ఎక్కడా నమోదు కాలేదు.

అయినా ఆయనకు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి.

ఆ సాయంత్రం ఆయన ఆ ఉత్తర్వును ఇంటికి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు.

“ఇది అన్యాయం కదా, నాన్నా?”

“అవును.”

“అయితే ఎందుకు ఊరుకుంటున్నారు?”

కొద్దిసేపు మౌనంగా ఉండి,

“చెప్పాల్సిన వాళ్లకు చెప్పాను,” అన్నాడు.

ఆ ఉత్తర్వును కొద్దిసేపు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత దాన్ని ఫైల్లో పెట్టి, ఏమీ జరగనట్టుగా లేచి వెళ్లిపోయాడు.

“రేపటి నుంచి కొత్త ఆఫీసు. కొత్త ఆఫీసర్,” అన్నాడు.

కొద్దిసేపటి తర్వాత మెల్లగా,

సిన్సియారిటీకి కూడా విలువ ఉండదేమో…”

అన్నాడు.

ఆ మాటలో కోపం లేదు.

నిరాశ మాత్రమే ఉంది.

ఆ రాత్రి నాన్నను చూస్తుంటే నాకు తెలియని భయం వేసింది.

అందరినీ నమ్మే మనిషి మోసపోతే, మళ్లీ మనుషులను ఎలా నమ్మగలడు?

కానీ మరుసటి ఉదయం ఆయన మామూలుగానే కొత్త కార్యాలయానికి వెళ్లిపోయాడు.

సాయంత్రం చేతిలో ఒక సంచి పట్టుకుని ఇంటికి వచ్చాడు.

“ఏమిటది?”

“బిస్కెట్లు.”

“ఎవరికోసం?”

“పక్కింటి పిల్లల కోసం.”

నేను ఆశ్చర్యపోయాను.

“మీ మీద ఇంత అన్యాయం జరిగింది. ఇంకా పక్కింటివాళ్ల గురించేనా? ఆ పిల్లలు మీకు ఏం చేశారు?”

నాన్న నవ్వాడు.

“పిల్లలు ఏం చేశారు?”

“మీ అతి మంచితనం మరోసారి మీకే కాటు వేస్తుంది,” అన్నాను.

నాన్న ఏమీ మాట్లాడలేదు. మౌనంగా లోపలికి వెళ్లిపోయాడు.

ఆ రాత్రి బిస్కెట్లు పక్కింటికి వెళ్లాయి.

పిల్లలు “తాతయ్యా!” అంటూ ఆయన చుట్టూ చేరారు.

నాన్న ముఖంలో అప్పుడొక చిన్న నవ్వు కనిపించింది.

ఆ నవ్వులో ఆఫీసు అవమానం లేదు. పిల్లల ఆనందం మాత్రమే ఉంది.

కొత్త కార్యాలయంలోనూ నాన్న పద్ధతి మారలేదు.

ఎవరైనా ఉత్తరం రాయించుకోవడానికి వస్తే రాసిచ్చేవాడు.

ఎవరైనా ఫారం నింపలేకపోతే తానే పూర్తి చేసేవాడు.

ఎవరికి పని అర్థం కాకపోతే, వారి పని తన నెత్తిన వేసుకునేవాడు.

బదిలీ ఆయన కార్యాలయాన్ని మార్చింది. ఆయన స్వభావాన్ని మాత్రం మార్చలేకపోయింది.

కాలం గడిచింది.

నాన్న రిటైరయ్యాడు.

ఉదయం పేపర్. మధ్యాహ్నం పుస్తకం. సాయంత్రం స్నేహితులతో కాలక్షేపపు కబుర్లు.

పక్కింటి పిల్లలు వస్తే వాళ్లతో మాట్లాడేవాడు. “బాగా చదవండి” అని సలహా ఇచ్చేవాడు. ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు. తనకు తోచిన సాయం చేసేవాడు.

తన బాధ్యతలన్నీ ఒక్కొక్కటిగా పూర్తయ్యాయని అనుకున్నాడేమో.

ఈ లోకంలో తన వంతు పని ముగిసిందన్నట్టుగా, ఒకరోజు నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు.

నాన్న ఇల్లు అలాగే ఉంది.

ఆయన కుర్చీ అదే చోట ఉంది.

చదివిన పుస్తకం అదే పేజీ దగ్గర తెరిచి ఉంది.

కళ్లద్దాలు టేబుల్ మీద ఉన్నాయి.

గోడ గడియారం మాత్రం తన పని తాను చేసుకుంటూనే ఉంది.

అన్నీ ఉన్నాయి. ఒక్క ఆయనే లేరు.

బంధువులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నప్పుడు ఎవరో నా భుజంపై చేయి వేసి,

“ఇక నువ్వే పెద్దవాడివి,” అన్నారు.

ఆ రోజు ఆ మాట పూర్తిగా అర్థం కాలేదు.

తర్వాత తెలిసింది.

పెద్దవాడవడం అంటే వయసు పెరగడం కాదు. నీకు అండగా నిలిచే మనిషి ఇక లేడని తెలిసిన తర్వాత కూడా, ఇంకొకరికి అండగా నిలబడటం.

నెలలు గడిచాయి-

బ్యాంకు రికార్డుల్లో ఆయన పేరు తొలగిపోయింది.

ఆయన మరణాన్ని నమోదు చేసిన కొద్దిరోజులకే, ప్రభుత్వ రికార్డుల నుంచి ఆయన పేరు కూడా తొలగించబడింది.

పాత ఫోన్ నంబర్‌కు ఎవరూ కాల్ చేయలేదు.

ప్రపంచం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయింది.

కానీ ఇంట్లో మాత్రం ఆయన చిన్నచిన్న జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి.

ఒక రోజు నా కొడుకును నేను గట్టిగా మందలిస్తున్నాను.

అతను చేసిన చిన్న తప్పుకు కోపంగా మాట్లాడాను.

అతను తలదించుకున్నాడు.

నా మాట మధ్యలోనే ఆగిపోయింది.

ఆ స్వరం నాది కాదు—నాన్నది.

ఆ మందలింపులో కూడా నాన్నే కనిపించాడు.

వెంటనే అతని తల నిమిరాను.

ఆ స్పర్శలో కూడా నాన్న ఉన్నాడు.

ఆ రోజు నాకు అర్థమైంది—

మనిషి వెళ్లిపోయిన తర్వాత అతని రూపం కనిపించదు. కానీ అతను మనలో నాటిన అలవాట్లు, మాటలు, విలువలు మన జీవితంలో కనిపిస్తూనే ఉంటాయి.

ఒక రోజు పాత పత్రాలు సర్దుతుండగా, నాన్న ఎర్రపెన్నుతో సరిచేసిన నా పాత ఇంగ్లీష్ ఉత్తరం ఒకటి కనిపించింది.

ఎక్కడో కామా.

ఎక్కడో పుల్‌స్టాప్.

ఇంకెక్కడో మొదటి అక్షరాన్ని పెద్ద అక్షరంగా మార్చి పెట్టాడు.

ఆ ఉత్తరాన్ని చూస్తుండగానే ఆయన గొంతు చెవుల్లో వినిపించినట్టయింది.

“నీకు క్యాపిటల్ లెటర్స్, పంక్చుయేషన్స్ కూడా సరిగ్గా తెలియవు. ఇంత రాస్తావు… వాక్యం ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ఆగాలో మాత్రం తెలియదు!”

ఆ మాట గుర్తొచ్చి, ఇంత బాధలోనూ నా పెదవుల మీద చిరునవ్వు వచ్చింది.

నాన్న లేడు.

కానీ నేను ఏదైనా రాసినప్పుడల్లా, ఆయన నా పక్కనే కూర్చుని తప్పులు సరిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది.

………….

ఎపిలోగ్

నాన్న వెళ్లిపోయి ఏడాది పూర్తయిన రోజు.

ఉదయం పాత కాగితాలను మరోసారి సర్దుతున్నాను.

మరణ ధ్రువీకరణ పత్రం ఒకవైపు ఉంది.

నాన్న ఎర్రపెన్నుతో సరిచేసిన నా పాత ఉత్తరం మరోవైపు ఉంది.

రెండూ కాగితాలే.

ఒకటి ఆయన లేరని చెబుతోంది.

మరొకటి ఆయన నన్ను ఎలా తీర్చిదిద్దాడో చెబుతోంది.

అంతలో తలుపు తట్టిన శబ్దం వచ్చింది.

పక్కింటి చిన్నబాబు.

“అంకుల్…”

“ఏమిటి?”

అతను కొద్దిసేపు మొహమాటంగా నిలబడ్డాడు.

“తాతయ్య ఇచ్చే బిస్కెట్లు…”

అతని మాట పూర్తికాకముందే నాకు అర్థమైంది.

నేను లోపలికి వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాను.

అతను నవ్వాడు.

“థ్యాంక్యూ, అంకుల్.”

అతను వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగాడు.

గుమ్మం దాటేలోపే ఒక్కసారిగా ఆగాడు. ప్యాకెట్ తెరిచి అందులోంచి ఒక బిస్కెట్ తీసుకున్నాడు.

మళ్లీ నా దగ్గరకు వచ్చి నా చేతిలో పెట్టాడు.

“ఇది మీరు తీసుకోండి.”

అతని కళ్లలో నాన్న కనిపించాడు.

నేను ఏమీ మాట్లాడలేకపోయాను.

ఆ చిన్న బిస్కెట్‌ను చూస్తూ నిలబడిపోయాను.

నాన్న కూడా ఇలాగే ఒకసారి అరటి పండు ముక్క నా చేతిలో పెట్టాడు. తన దగ్గర ఉన్నదాన్ని పంచేవాడు. ఎదుటివాడు తిరిగి ఏదైనా ఇవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు.

కానీ ఇచ్చిన ప్రేమ ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గరకు వస్తుందని బహుశా ఆయనకు తెలుసు.

ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది.

ప్రేమకు లెక్క ఉండదు. అది ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మాత్రమే మారుతుంది.

టేబుల్ మీద ఉన్న మరణ ధ్రువీకరణ పత్రం వైపు చూశాను.

ఆ కాగితం నాన్న జీవితం ముగిసిందని చెప్పింది.

నా చేతిలో ఉన్న ఆ చిన్న బిస్కెట్ మాత్రం ఆయన జీవితం ఇంకా ఎక్కడో కొనసాగుతోందని చెప్పింది.

నేను ఆ బిస్కెట్‌ను నెమ్మదిగా తిన్నాను.

నాన్న ఇచ్చినట్టే అనిపించింది.

కిటికీ బయట ఆ పిల్లవాడు అప్పటికే తన స్నేహితులతో కలిసి పరుగెత్తుతున్నాడు.

నేను కుర్చీలో కూర్చుని నాన్న పాత ఉత్తరాన్ని మళ్లీ చేతిలోకి తీసుకున్నాను.

ఎర్రపెన్నుతో ఆయన సరిచేసిన వాక్యం కళ్లముందు కనిపించింది.

ఎక్కడ ఆగాలో…ఎక్కడ మొదలుపెట్టాలో…

ఎక్కడ తప్పు చేయకూడదో…

నా భాషలోని తప్పుఒప్పులను ఆయన ఎర్రపెన్నుతో సరిచేసేవాడు. మనుషుల్లోని తప్పులను మాత్రం క్షమించడం నేర్పి వెళ్లిపోయాడు.

టేబుల్ మీద ఉన్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని మరోసారి చూశాను.

అది ఆయన జీవితం ముగిసిందని నమోదు చేసింది.

కానీ నా చేతిలో మిగిలిన ఆ చిన్న బిస్కెట్, నా మనసులో మిగిలిన ఆయన మాటలు, నా ప్రవర్తనలో మిగిలిన ఆయన మంచితనం—వాటికి ఏ కార్యాలయమూ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు.

నాన్నకు ప్రభుత్వం ఇచ్చింది చివరి పట్టా.

ఆయన జీవితం నాకు ఇచ్చిన పట్టా—మంచి మనిషిగా బతకడం.

బొల్లిమంత శివరామ కృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *