మేరీ ప్లీజ్…

Spread the love

సన్నగా రివట లాంటి పొడుగైన శరీరాకృతీ,యే ప్రత్యేకతా లేని సామాన్యమైన ముఖకవళికలూ అయితేనేం ఆయన తెర మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు “అదుగో రమణారెడ్డి” అని కేరింతలు కొట్టే వాళ్లు.
సుమారు పావు శతాబ్దం పాటు తెలుగు సినీ తెరను తన నటన తో సుసంపన్నం చేసిన వ్యక్తి తిక్కవరపు వెంకట రమణా రెడ్డి.1951 లో సినీ రంగ ప్రవేశం చేసి 1974లో చనిపోయే వరకూ చిత్రాలలో నటిస్తూనే వున్నారు.
వేసిన వేషమే వేసినా చేసిన నటన చెయ్యకుండా ప్రేక్షకులకు ఆరోగ్య కరమైన హాస్యం బోరుకొట్టకుండా అందించిన నటుడు
ఆయన నటనలో విశేషమేమంటే ఆయన ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో ఆయన ప్రత్యేకంగా నటిస్తున్నట్టుండేది కాదు సహజంగా ప్రవర్తిస్తున్నట్టుండేది .అందుకే ఆయన సుమారు 215 చిత్రాలలో నటించినా ఆయన నటన మొనాటనస్ గా అనిపించలేదు ప్రేక్షకులకి.

ఆయన వేసిన పాత్రలలో ప్రత్యేకత యేమిటంటే కేవలం హాస్యం పండించే పాత్రలలోనే కాక ,విలనీ టచ్ వున్న పాత్రలలో కూడా అలవోకగా అలరించడం. ఉదాహరణకు “మిస్సమ్మ” సినిమాలో డేవిడ్ పాత్ర విలన్ షేడ్స్ ఉన్న పాత్ర.అయినప్పటికీ సినిమాలో కీలకమైన మలుపుకి కారణమైన పాత్ర .కేవలం ఆయన వలననే నాయికా,నాయకులు భార్యాభర్తలుగా నటిస్తూ ఉద్యోగం చేయాలనే నిర్ణయానికి వస్తారు. ఇకపోతే ఇందులో “మేరీ ప్లీజ్ “అంటూ రమణా రెడ్డీ,”ధర్మం ప్లీజ్ “అంటూ రేలంగి చేసే నటన కి ప్రేక్షకుల పొట్ట చెక్కలవుతుంది. ఇక “గుండమ్మ కథ” సినిమాలో కంచు గంటన్న పాత్ర కూడా ఒక పక్క నవ్విస్తూనే గుండమ్మ కూతుళ్ల పెళ్లిళ్లు చెడగొట్టే విలన్ షేడ్స్ వున్న పాత్ర .అందుకే ఆయనని కామెడీ విలన్ అని కూడా అంటారు.
“రాముడు–భీముడు”సినిమాలో మామగాకర్రతిప్పుతూ ఈయనా ,ఇల్లరికపుటల్లుడుగా రేలంగీ ఒలికించిన హాస్యమూ,”నా గృహంబునకు భోజనంబునకు రావలదు రాతగదు “అంటూ పాడిన పద్యాలూ ఆహా బ్రహ్మాండం.ఆ పారడీ పద్యాలు కొసరాజు రాశారు.
అసలు రేలంగీ-రమణారెడ్డీల జంట తెలుగు సినిమాలలో హాస్యానికి చిరునామా.
ఇంకా ఆయన “మాయా బజారు” లో రాక్షస గురువైన చిన్నమయ్య గా తన శిష్యులతో చేసిన అల్లరీ హడావుడీ అంతా ఇంతా కాదు.సినిమాలో మాయాబజారును సృష్టించిన ఘనమైన పాత్ర ఈయనదే.

రమణారెడ్డి పేరు చెప్పగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పాట “అయ్యొయ్యో చేతిలో డబ్బులు పోయెనే”.”కులగోత్రాలు “లోని కొసరాజు రాసిన ఈ హాస్యగీతానికి నెత్తిన గుడ్డ వేసుకునిఈయన ,రేలంగీ,రామకోటి ,సీతారామ్,బొడ్డపాటి తదితరులతో కలిసి చేసిన నటన సూపరసలు.

అలాంటిదే ఇంకో పాట “లక్షాధికారి” సినిమాలోవుంది. రమణా రెడ్డీ ,సూర్యకాంతం పోటీపడి నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు .”అచ్చమ్మకు నిత్యము శ్రీమంత మాయెను పిచ్చయ్యను చూడ చూడ ముచ్చటాయెనే “అనే ఈపాట రాసింది కొసరాజు.సంగీతం చేసింది టి.చలపతిరావు.అసలు రమణారెడ్డిని చూడాలో ,సిగ్గుపడే సూర్యకాంతాన్ని చూడాలో అర్థం కాదు ఈ పాటలో.

చెప్పాలంటే ఎన్నో పాత్రలు. ఆయనకు బాగా పేరు తెచ్చినవి “రోజులు మారాయి “లో కరణం పాత్ర ,”బంగారు పాప” లో కిరసనాయిలు రామదాసు పాత్ర ,”వేంకటేశ్వర మహాత్యం “లో గొల్లవాని పాత్ర ,”లవకుశ “లోని మునీశ్వరుడి పాత్ర ఇంకా ఎన్నెన్నో .
నాకు బాగా నచ్చినది “పెళ్లిసందడి “(పాత చిత్రం)లో కెప్టెన్ కోటా గారి తమ్ముడు ధన్ పాత్ర .ఎప్పుడూ టూత్ బ్రష్ మీసాలతో కనపడే రమణారెడ్డి ఈ సినిమా లో క్లీన్ గా షేవ్ చేసుకుని యంగ్ గా కనపడటం విశేషం.ఈ చిత్రంలో తనకు జోడీగా నటించిన సురభి బాల సరస్వతి తో కలిసి చాలా సందడి చేస్తారాయన.ఈ సినిమా లో హాస్యం ట్రాక్ అంటూ వేరుగా లేదు.ప్రతి పాత్ర సమయానుకూలం గా హాస్యం పండిస్తుంది.సినిమా ఆద్యంతమూ హాస్యమే .ఘంటసాల సంగీత దర్శకత్వం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.

ఆయన సంభాషణలు పలికే తీరు గురించి చెప్పాలంటే మొదట నటించిన కొన్ని చిత్రాలలో పాత్రోచితంగా డైలాగులు పలికినప్పటికీ “బంగారు పాప “(1955) టైము నుండీ ఆయన డైలాగులు పలికే తీరులో నెల్లూరుజిల్లా యాస ఉట్టి పడేది. “ఎట్టా” అని ఆయన డైలాగ్ పలికే తీరుని కె.వి.రెడ్డి గారితో సహా ఎవరూ తప్పు పట్టలేదెందుకో!
ఒక వ్యక్తిగా ఆయన గురించి తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లాకు చెందిన జగదేవి పేటలో సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టారు .ప్రముఖ వ్యాపార వేత్త టి.సుబ్బరామి రెడ్డి ఈయనకు అన్న కొడుకు .ఈయనకు ఇంటర్మీడియట్ చదివే సమయంలో నాటకాల పట్ల విపరీతమైన ఆకర్షణ కలిగింది.
అందుకే చదువు కొంత వెనకబట్టింది.
దానితో కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళన చెందారు.
ఇంతలో రమణారెడ్డి గారి బావగారు పూనుకుని విజయవాడలో శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు చేయించారు.ఆయన సహాయ సహకారాలతో గుంటూరులో శానిటరీ ఇన్స్ పెక్టర్ ఉద్యోగం కూడా దొరికింది .అయితే అదీ మూన్నాళ్ల ముచ్చటే అయింది.ఈయన కున్న నాటకాల పిచ్చితో ఆ ఉద్యోగం కూడా వదిలేశారు.

నెల్లూరులో నాటకాలాడేటప్పుడు పరిచయమైన ఫన్ డాక్టర్ చంద్రశేఖరం గారు (గాయని యస్ .జానకి మామగారు)రమణా రెడ్డిగారికి తన షోలలో అవకాశం కలిగించి బాగా ప్రోత్సహించే వారు.
ఈయన నటనా ప్రతిభ గమనించిన కొంతమంది మిత్రులు సినిమాలలో చేరమని సలహా ఇచ్చారు .నెల్లూరికి చెందిన మరుపూరి కోదండ రామిరెడ్డిగారు చిత్తూరు నాగయ్య గారికి సిఫారసు చేస్తూ ఉత్తరం కూడా రాసిచ్చారు.అయితే అక్కడా ఇక్కడా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ వుండేవి .

చివరకు నిర్మాత ఎ.శంకర రెడ్డిగారి సినిమా “మానవతి” లో జంగమ దేవర వేషం ఖాయమైంది (1950) .షూటింగ్ మొదలైంది అందులో నటిస్తుండగా చూసిన జి.వరలక్ష్మి ,తన భర్త ప్రకాశరావు తీస్తున్న “దీక్ష” చిత్రంలో వేషానికి రికమండ్ చేసింది .అయితే ముందుగా బుక్కయింది “మానవతి” లోనయినా ముందుగా రిలీజ్ అయింది “దీక్ష” .రమణా రెడ్డి గారి సినీజీవితంలో జరిగిన విశేషమేమంటే .ఆయన నటించిన మొదటి చిత్రం “దీక్ష” చివరి చిత్రం “చీకటి వెలుగులు” రెండింటికీ దర్శకుడు.యస్ .ప్రకాశ రావే.
అలాగే ఇంకో విశేషం బి.విఠలాచార్య గారు 1957లో ” వద్దంటే పెళ్లి” అనే సినిమా తీశారు ,1968లో మళ్లీ అదే కథతో “నిన్నే పెళ్లాడుతా “తీశారు హీరో ,హీరోయిన్లూ ఇతర నటులూ మారారు కానీ రెండు సినిమాల్లోనూ గుమస్తా పాత్ర రమణారెడ్డే పోషించారు.అలా ఒకే కథతో రెండు సార్లు వచ్చిన రెండు సినిమాల్లో ఒకే పాత్రను పోషించిన ఒకే నటుడు రమణా రెడ్డి .

మళ్లీ వెనక్కి వస్తే “దీక్ష” సినిమా నుండీ ఆయనకు వరసగా అవకాశాలు రాసాగాయి.”రోజులు మారాయి” సినిమాలో కరణం వేషం ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పింది ..ఇక వరసగా అవకాశాలు రాసాగాయి “కులగోత్రాలు,మిస్సమ్మ ,రాముడు-భీముడు,మాయాబజార్ ,మాంగల్యబలం ,పెళ్లినాటి ప్రమాణాలు ” ఇలా ఎన్నో చిత్రాలలో నటించారు. తన ఇరవైనాలుగేళ్ల నట జీవితంలో సుమారు 215 చిత్రాలు చేశారు అని చెప్పుకున్నాం కదా .1974 లో ఆయన చనిపోతే ,ఆయన నటించిన చివరి చిత్రం “చీకటి వెలుగులు” ఆయన పోయాక 1975 లో విడుదల అయింది.

1957లో ఆయన “అక్కాచెల్లెళ్లు” సినిమాలో నటిస్తుండగా అందులో రమణా రెడ్డి వేస్తున్న పాత్ర మెజీషియన్ పాత్ర అని తెలిసింది.అయితే ఆయన యేమనుకున్నారో యేమో నిజంగానే ఒక మెజీషియన్(మెసిడ్రీ) దగ్గరకు వెళ్లి మాజిక్ నేర్చుకున్నారు.అప్పుడే ఆ సినిమా రచయిత ఆరుద్ర కూడా వేరే గురువు దగ్గర మేజిక్ నేర్చుకున్నారు.

ఊరికే నేర్చుకోవడమే కాదు ,చాలా ప్రదర్శనలు కూడా ఇస్తూ వుండేవారు అయితే దాదాపు ఆ ప్రదర్శనల వలన వచ్చే డబ్బంతా విరాళాలుగా ఇచ్చెయ్యడమో ,ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడమో చేస్తూ వుండేవారు .నటి సావిత్రి కుమారుని పుట్టిన రోజు సందర్భంగానూ,నటి జమున కొడుకు పుట్టిన రోజు సందర్భం గానూ,విజయావారింట జరిగిన ఫంక్షన్ లోనూ కూడా రమణా రెడ్డి గారి మేజిక్ ప్రదర్శనలు జరగడం విశేషం.ఒకటి రెండు సార్లు ఆయన కు సహాయకుడుగా రచయిత ఆరుద్ర కూడా మేజిక్ ప్రదర్శనలలో పాల్గొన్నారు .

తన మాజిక్ ప్రదర్శనల గురించి ఆయన “విజయచిత్ర”లో యేమని రాసుకున్నారంటే సినిమాల్లో నవ్వించాలంటే నా పక్కన రేలంగో,సూర్యకాంతమో ఛాయాదేవొ ఎవరో ఒకరుండాలి కానీ ఈ మేజిక్ ప్రదర్శనలలో నేనొక్కడినే ప్రేక్షకులను నవ్వించగలను.ఇది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది అని

నటీనటులందరితోనూ చక్కని రిలేషన్స్ మెయింటేన్ చేసేవారు .లారెల్ అండ్ హార్డీ జంటలాగా తెలుగు సినిమాలలో రేలంగి,రమణారెడ్డి జంట చాలా ప్రసిధ్ధి చెందినది.
సినీ రంగంలో దర్శకులైన కె.బి.తిలక్ ,కె.యస్ .ప్రకాశరావు,ప్రత్యగాత్మలతో బాగా స్నేహంగా వుండేవారు.
వ్యక్తిగా ఆయన మితభాషి,చదివింది ఇంటర్మీడియెటే అయినా మంచి ఇంగ్లీషు మాట్లాడేవారు. ఆయన హాబీలు మాజిక్ చేయడం,రేసుకోర్సుల కెళ్లడం.పరిగెత్తే గుర్రాలను చూడడం ఆయనకు సరదా.ఆయన పరిమితులు ఆయనకు తెలుసు .శక్తికి మించి ఖర్చుపెట్టి దివాళా తీయలేదట యేనాడూ.
ఆయనకు అయిదుగురు పిల్లలు .ఇద్దరు కొడుకులూ,ముగ్గురు కూతుళ్లూ .అందరూ ఉన్నత విద్యనభ్యసించి జీవితంలో చక్కగా స్థిరపడ్డారు.అలా పిల్లలు ప్రయోజకులవ్వడం వెనక ఆయన భార్య సుదర్శనమ్మ గారి కృషి చాలా వుంది .ఆవిడ చాలా జాగ్రత్తగా సంసారాన్ని నడుపుతూ వుండేవారు. ఆయన పోయాక కూడా జాగ్రత్తగా వున్న ఆస్తులను కాపాడి పిల్లల అభ్యున్నతికి కృషిచేశారు.

మొదటి నుండీ ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే .జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో బాధ పడుతూ వుండేవారు .కడుపులో అల్సర్ కి రెండు సార్లు సర్జరీకూడా చేయించుకున్నారు.
చివరికి 1974 నవంబర్ 11వతేదీ సాయంత్రం ఏడుగంటల సమయంలో ఆ నవ్వుల రేడు ఈ లోకం నుండీ శెలవు తీసుకున్నారు.

హాస్యాన్ని వృత్తిగానూ,ఇంద్రజాలాన్ని ప్రవృత్తి గానూ చేసుకుని దాదాపు పాతికేళ్ల పాటు ప్రజలను నవ్వులతో అలరించిన రమణారెడ్డిని తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోరు.

——భార్గవి

డా. రొంపిచర్ల భార్గవి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *