ఈ సినిమా స్టీఫెన్ హాకింగ్ నిజజీవిత కథ ఆధారంగా తయారయినది.స్టీఫెన్ హాకింగ్ ఎవరంటే ప్రపంచమంతా ఐన్ స్టీన్ అంతటి మేథావి అని కీర్తించిన భౌతిక శాస్త్రవేత్త మరియూ అంతరిక్ష విజ్ఞాన వేత్త (physicist and cosmologist)
ఆయన తన జీవితకాలమంతా అనంత విశ్వం గురించీ,కాలబిలాల గురించీ,కాలం గురించీ పరిశోధించి అనేక సిధ్ధాంతాలను ప్రతిపాదించాడు.క్వాంటమ్ థీరీనీ,జనరల్ రిలేటివిటీ ని అనుసంధానిస్తూ పరిశోధించి బ్లాక్ హోల్స్ నుండీ రేడియేషన్ వెలువడుతుందని ప్రతిపాదించాడు. దీనినే “హాకింగ్ రేడియేషన్ “అని పిలుస్తారు.అంతే కాదు బిగ్ బాంగ్ థియరీ మీదా,కాలబిలాలమీద అనేక పరిశోధనలు చేశాడు పాతిక పైగా పుస్తకాలు రాశాడు.
ఆయన రాసిన “ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ” అనేక లక్షల కాపీలు అమ్ముడుపోయి ,అమ్మకాలలో రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.ప్రపంచ వ్యాప్తంగా నలభై భాషలలోకి అనువదింపబడింది ,”కాలం కథ “అనే పేరుతో మన తెలుగులో కూడా ప్రచురించబడింది పీకాక్ బుక్స్ వారు ప్రచురించారని గుర్తు.నేను కూడా కొని చదివాను.
అంతే కాదు అనేక పురస్కారాలు అతనిని వరించాయి.
అమెరికా అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ని అందుకున్నాడు.బిబిసి ఎన్నిక చేసిన అత్యున్నత బ్రిటీషర్ల వందమంది జాబితాలో 25వ స్థానంలో నిలిచాడు.
ఇవన్నీ ఆరోగ్యంగా వుండే ఒక మనిషి సాధించా డంటేనే నమ్మశక్యం గాదు అలాంటిది ప్రాణాంతకమైన వ్యాథి తో బాధపడుతూ ,ఒంట్లో వున్న కండరాలన్నీ చచ్చు పడి పోయి కనీసం లేచి నడవలేని పరిస్థితులలో వున్న ఒక వ్యక్తి సాధించాడంటే మానవ మేథస్సు మీద అపారమైన గౌరవం కలుగుతుంది. అంతేకాదు అతను 76యేళ్ల వయసులో చనిపోయే వరకూ తన పరిశోధనలను కొన సాగిస్తూనే వున్నాడు.
అలాంటి అతని జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.
అందుకే అతని జీవిత విశేషాలతో నిండిన ఈ సినిమా నాకు ఆసక్తి దాయకంగా అనిపించింది
స్టీఫెన్ హాకింగ్ బ్రిటన్ కి చెందిన వాడు1942లో ఆక్స్ ఫర్డ్ లో జన్మించాడు .చిన్ననాటినుండీ భౌతిక శాస్త్రం లోనూ ,
అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన పరిశోధనల్లోనూ ఆసక్తి చూపేవాడు(cosmology) .
అతను ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా వున్నప్పుడే అతని ఇరవై ఒకటవ యేట (1963)మోటార్ న్యూరాన్ డిసీజ్ అనే నాడీవ్యవస్థకూ,కండరాలకూ సంబంధించిన వ్యాథి వుందని బయట పడింది.ఇది ఒక ప్రాణాంతకమైన చికిత్సలేని వ్యాథి.ఈ వ్యాథి
నెమ్మది నెమ్మదిగా శరీరంలో వున్న కండరాలన్నిటినీ నిర్వీర్యం చేస్తుంది.మనిషిక్షీణించి పోవడమూ కదలికలన్నీ చచ్చుపడి పోవడమూ జరుగుతుంది.చివరికి తినడమూ,తాగడమూ ,శ్వాస తీసుకోవడమూ కూడా కష్టమయి మరణం సంభవిస్తుంది.స్టీఫెన్ హాకింగ్ కి వచ్చిన వ్యాథి రకాన్ని “ఎమయోట్రోఫిక్ లేటరల్ స్క్లీరోసిస్ ” అంటారు.వైద్యులు ఈ వ్యాథిని నిర్థారించడమే కాక అతను చాలా కొద్ది కాలం మాత్రమే జీవించ గలడనీ బహుశా అతని జీవన కాలపరిమితి రెండు మూడేళ్లకి మించి ఉండక పోవచ్చనీ హెచ్చరించారు.
ఇదంతా ఎంతో జీవన కాంక్షతో ,ఆసక్తితో పరిశోధనలు చేస్తున్న స్టీఫెన్ ని సహజంగానే నిరాశతో కృంగి పోయేట్టు చేశాయి.
అదే సమయంలో వ్యాథి రాక ముందే తనకు ఒక యూనివర్సిటీ పార్టీలో పరిచయమయి,ప్రేమికురాలిగా మారిన జేన్ ఎంతో ధైర్యం చెప్పింది ,అండగా నిలబడింది.
ఎవరెన్ని చెప్పినా వినకుండా అతనినే పెళ్లాడతాననీ ,అతనికి అన్ని విధాలా తోడు నీడగా నిలుస్తాననీ చావైనా బతుకైనా అతని తోనే అనీ బాసటగా నిలిచింది.
1965లో వారిరువురూ పెళ్లాడారు.జేన్ ని పెళ్లాడిన వేళావిశేషమో,స్టీఫెన్ జీవనకాంక్షో, ఆత్మస్థయిర్యమో,.మానవాళి చేసుకున్న అదృష్టమో
అందరూ ఊహించినట్టుగా స్టీఫెన్ జీవితం రెండుమూడేళ్లలో ముగిసిపోలేదు.వ్యాథి అనుకున్న దానికంటే చాలా నెమ్మదిగా వ్యాపించ సాగింది .వ్యాథి నిర్థారణ అయ్యాక దాదాపు యాభై రెండేళ్లు జీవించాడు స్టీఫెన్ హాకింగ్ .ఇది వైద్య చరిత్రలోనే జరిగిన ఒక అద్భుతంగా పరిగణించ వచ్చు
1967లో ఆ జంటకి మొదటి బిడ్డ గా రాబర్ట్ జన్మించాడు.1970లో రెండవ బిడ్డ గా లూసీ అనే ఆడపిల్ల జన్మిస్తే 1979 లో తొమ్మిదేళ్ల తర్వాత తిమోతీ అనే అబ్బాయి పుట్టాడు.
1970 లలో అతని మాట పూర్తిగా పడిపోయింది.అతని హావ భావాలూ,గొణుగుడు మాటలూ అతని సన్నిహితులకూ,కుటుంబ సభ్యులకూ మాత్రమే అర్థమయ్యేవి.
అనేక సార్లు ఆహారం మింగుడు పడటం కూడా కష్టమయి పొలమారి ప్రాణాంతక మయ్యేది.
అలాంటి పరిస్థితుల్లో 1985 లో న్యూమోనియా వచ్చింది ,ప్రాణం కాపాడటానికి చేసిన ట్రఖియాస్టమీ వలన మాట పూర్తిగా పోయింది.అప్పుడే చక్రాల కుర్చీ సహాయం అవసరమైంది. దానికి అమర్చిన మీటను చిటికిన వేలు తో నొక్కి ,దానికినుసంధానించిన వాయిస్ సింథసైజర్ సహాయంతో తన భావాలను వ్యక్త పరచే వాడు స్టీఫెన్ .ఆ తర్వాత ఒక చిన్న కంప్యూటర్ ను చక్రాలకుర్చీకి అమర్చారు,అందులోని వాయిస్ సింథసైజర్ ఆయన రాసిన విషయాన్ని మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తూ వుండేది.అలా వినిపించడానికి మాటపోక ముందు వినపడ్డ ఆయన సొంత గొంతుని ఉపయోగించమన్నాడు స్టీఫెన్ .అదే వినపడేది ప్రేక్షకులకు.ఈ సాంకేతిక సహాయం అందించిన వారిలో బొంబాయికి చెందిన మన భారతీయ ఇంజనీర్లు ఇద్దరు వుండటం విశేషం. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆయన అనేక పరిశోధనలు చేశాడు,పాతిక పైగా పుస్తకాలు రాశాడు,కొన్ని యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.అనేక ఉపన్యాసాలిచ్చాడు.ఊపిరి ఆగిపోయే చివరి క్షణం వరకూ పరిశోధక విద్యార్థిగానే వున్నాడు.
అతను ఈ విజయాలన్నీ సాధించడం వెనక అతని భార్య అందించిన సహాయ సహకారాలు మరువలేనివి.
అందుకోసం ఆమె పడిన శ్రమ గురించీ ,ఆమె అనుభవించిన ఒత్తిడి గురించీ కూడా ఆలోచించాలి
ముగ్గురు పిల్లలతోనూ ,ఆ పిల్లలతో సమానమైన స్టీఫెన్ తో నూ ,అతని ఆరోగ్య సమస్యలతోనూ సంసారం దిద్దుకోవడానికి చాలా సతమతమయ్యేది.జేన్ .దానికి తోడు అతని పరిశోధనల్లో కూడా ఆమె చాలా సహాయ సహకారాలందించ వలసి వచ్చేది.
ఇదంతా ఆమెమీద శారీరకంగా ,మానసికంగా ప్రభావం చూపింది .ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనయింది.కుటుంబ సభ్యులలో ఎవరికైనా దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్య వస్తేనే ఎదుర్కోవడం చాలా కష్టం .అలాంటిది జీవిత భాగస్వామికి వస్తే ఆ భార్య పడే క్షోభ అనుభవించిన వారికే తెలుస్తుంది.ఇదంతా చూసిన వారు అయ్యో ఎంత సాధ్వీ ఈమె,ఎంత కష్టం వచ్చింది అని పలికే జాలిమాటల వలన ఆమె కేమీ సాంత్వన కలగదు.
తన కష్ట సుఖాలు పంచుకునే తోడు కావాలనీ,కన్నీటితో నిండిన తన మొహాన్ని దాచుకోవడానికి ఒక భుజం ఆసరాగా వుండాలనీ
కోరుకోవడం అత్యంత సహజం.
ఈస్థితి నుంచీ బయట పడటానికి ఆమె తన రీసెర్చిని కొనసాగించి స్పానిష్ పొయెట్రీ మీద పి.హెచ్ .డి చేసి డాక్టరేట్ సాధించింది.చర్చ్ లో కాయిర్ పాడే బృందం లో చేరింది.
అదుగో అలాంటి సందర్భంలోనే కాయిర్ లో శిక్షణ ఇచ్చే జోనాథన్ అనే అతను వారికుటుంబంలోకి ఒక చిరుజల్లులా ప్రవేశించాడు.వారికి తన వలన ఏ సహాయం కావాలన్నా సిధ్ధమన్నాడు.లుకీమీయా తో భార్యను కోల్పోయిన అతనికి జేన్ కష్టం అర్థమయింది.స్టీఫెన్ కి సహాయంగా వుండేవాడు,పిల్లలతో కలిసి ఆటలాడేవాడు .అలా ఆ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు
స్టీఫెన్ కూడా అతని మీద చాలా ఆధారపడేవాడు.కానీ చుట్టూ వున్నవాళ్లు చాలా గుసగుసలు పోయారు.జేన్ కి పుట్టిన ఆఖరి బిడ్డ గురించి కూడా అనేక అనుమానాలు వెలిబుచ్చారు .ఇదంతా గ్రహించిన జొనాథన్ ఆ కుటుంబానికి దూరమయ్యాడు .కానీ జేన్ ,జొనాథన్ ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి అనురాగం వుందనే విషయం వెలిబుచ్చుకున్నారు.
స్టీఫెన్ ఆరోగ్యం దిగజారుతున్న కారణంగా అతనికి నర్సింగ్ కేర్ అవసరమయ్యే పరిస్థితి వచ్చింది.1980 నుండీ అతను నర్సుల సంరక్షణలో వుంటూ వచ్చాడు.అయినా జేన్ అతనికి కావలసిన పరిచర్యలు చేస్తూ అతని రీసెర్చ్ లో సహాయపడుతూనే వుంది.
అలా ముఫ్ఫయి సంవత్సరాలు కేవలం కంటి రెప్ప ,దవడ కండరమూ మాత్రమే పని చేస్తున్న స్టీఫెన్ హాకింగ్ ని కంటికి రెప్పలా కాపాడింది భార్య జేన్ .
కానీ ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్ అనే విషయం అనేక సార్లు రుజువవుతూ వుంటుంది జీవితంలో .1995 లో తనకు సేవ చేస్తున్న నర్స్ ఎలాన్ మేసన్ తో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు స్టీఫెన్ హాకింగ్ .అంతే కాదు జేన్ కి విడాకులిచ్చి ఎలాన్ మేసన్ ని వివాహమాడాడు. అతను పెళ్లాడిన రెండు సంవత్సరాలకి 1997లో జేన్ కూడా జొనాథన్ ని పెళ్లాడింది.
చిన్ననాడు చిగురించిన స్నేహం ప్రాతిపదికగా జరిగిన వివాహం జేన్ ,స్టీఫెన్లది.అతను ప్రఖ్యాత ప్రొఫెసర్ గానూ ,ప్రపంచ మేథావి గానూ గుర్తింపబడిన తర్వాత జరిగిన వివాహం ఎలాన్ ,స్టీఫెన్లది .త్వరలోనే విభేదాలు పొడసూపాయి.ఎలాన్ అతనిని శారీరకంగా హింసింస్తోందనే ఆరోపణలు వచ్చాయి.2006 లో వారిద్దరూ విడిపోయారు.
జేన్ ,జొనాథన్ లసాహచర్యం కోరుకుని వారి ఆశ్రయం లోకి తిరిగి వచ్చాడు స్టీఫెన్ హాకింగ్ .
జేన్ సంతోషంగా ఆహ్వానించింది ,వారి తోనూ పిల్లలతోనూ ఆనందంగా జీవిస్తూ తన పరిశోధనలను కొనసాగిస్తూ, 2018లో తన 76 వ యేట కన్ను మూశాడు స్టీఫెన్ హాకింగ్
స్టీఫెన్ హాకింగ్ తో తన జీవన ప్రయాణాన్ని రెండు పుస్తకాలుగా వెలువరించింది జేన్ .మొదటిది “మ్యూజిక్ టు మువ్ ది స్టార్స్ –ఎ లైఫ్ విత్ స్టీఫెన్ హాకింగ్ “(1999),దీనికి కొన్ని మార్పులూ ,చేర్పులూ చేసి రెండవ పుస్తకం”ట్రావెలింగ్ టూ ఇన్ఫినిటీ–మైజర్నీ విత్ స్టీఫెన్ (2009)”రాసింది.రెండవ పుస్తకం ఆధారంగానే “ది థియరీ ఆఫ్ ఎవ్విరి థింగ్ “అనే సినిమా తయారయింది .ఈ సినిమా 2014 లో స్టీఫెన్ హాకింగ్ బ్రతికి వుండగానే రిలీజయ్యింది .మూడు అకాడెమీ అవార్డులు గెలుచుకుంది.
జేన్ గా నటించిన ఫెలిసిటీ జోన్స్ కీ,స్టీఫెన్ గా నటించిన లిసా డిల్లాన్ కీ ఉత్తమ నటీ నటులుగా ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయాలూ ,ఆలోచనలూ
—ఈ అనంత విశ్వం ఒక్క బిగ్ బాంగ్ తో ఎలా విస్తరించిందో ఒక నాడు అలాగే ఎండి పోయిన బ్రెడ్ లాగా ముడుచుకు పోయి ముక్కలుగా విరిగి పిండి పిండి అయిపోయి నశిస్తుంది.
విశ్వాంతరాళి దాని నియమాల ప్రకారం నడుస్తుందే కానీ ఏ భగవంతుడూ తీరికూర్చుని ఇలా నడవాలని శాసిస్తే జరుగుతున్నది కాదు.
మరణం తర్వాత జీవితం లేదు.స్వర్గం,నరకం అనేవి మానవాళి తన నమ్మకం కోసం అల్లుకున్న కట్టుకథలు.
కంప్యూటర్ విడిభాగాలు పాడయి పోయాక కంప్యూటర్ ఆగిపోయినట్టే .మన శరీరంలో మెదడు లోని భాగాలు కూడా పని చేయడం ఆగి పోయాక మరణం సంభవిస్తుంది తర్వాత అంతా శూన్యమే
అందుకే జీవం వున్నంత వరకూ మనం చేయ గలిగిన పనులన్నీ చేయాలి నన్ను చాలా సంవత్సరాలుగా మరణం వెన్నంటే వుంటోంది అయినప్పటికీ నేనేం భయపడటం లేదు ,త్వరగా మరణించాలని కోరుకోవడం లేదు,మరణానికి ముందే నేను చేయాలనుకున్న పనులన్నీ చేస్తున్నాను.
“వేర్ దేర్ ఈజ్ ఎ లైఫ్ దేరీజ్ ఎ హోప్ “
ఇదండీ శరీరమంతా చచ్చుపడిపోయినా ,చైతన్యవంతమైన మెదడుతో పరిశోధనలు చేసి అద్భుతాలు సృష్టించిన మేథావి స్టీఫెన్ హాకింగ్ కథ.
చిన్న వయసులోనే అమ్మ కొట్టిందనో,నాన్న తిట్టాడనో ,పరీక్షల్లో కావలసిన మార్కులు రాలేదనో ,ప్రేమ ఫలించలేదనో ,చిన్నచిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్న యువతా, వ్యాథులేవైనా సోకినప్పుడు నిరాశా నిస్పృహలలో కూరుకు పోయే ప్రజలూ తప్పకుండా స్టీఫెన్ జీవితాన్నుండీ నేర్చుకోవాలిసినదీ,స్ఫూర్తి పొందవలసినదీ ఎంతైనా వుందనిపిస్తుంది….
—–భార్గవి














