మన భారతీయ సినిమాల్లో పాట కొక ప్రాధాన్యత వుంది.మన చిత్రాలలో పాట లేని చిత్రమే వుండదు. పాశ్చాత్య చిత్రాల విషయానికి వస్తే మొదట్లో మ్యూజికల్స్ బాగా ప్రాచుర్యం లో వుండేవి.కానీ కాలక్రమేణా నేటి పాశ్చాత్య చిత్రాలలో పాటలనేవే లేకుండా పోయాయి .బహుశా సహజత్వానికి దగ్గరగా వుండాలనే ఉద్దేశంతో పాటలు పరిహరించినట్టున్నారు .
అసలు సినిమాల్లో పాటయొక్క ప్రయోజన మేమిటీ? అని ఆలోచిస్తే.
సినిమాల్లో పాట ఒక సన్నివేశానికి తగిన మూడ్ ని తీసుకు రాగలదు,సన్నివేశాన్ని పరిపుష్టం చేయగలదు .కథని ముందుకు నడపగలదు,. సినిమా చూసినా చూడకపోయినా ప్రజలు పాటలు పాడుకుని ఆనందించ గలిగే అవకాశం కూడా వుంది. మంచి పాటలు సామాన్య ప్రజానీకంలో బాగా ప్రచారమయ్యి, పదే పదే ప్రేక్షకుణ్ణి సినిమా హాలుకు లాక్కుని రాగలిగే సామర్థ్యం కలిగి వుంటాయి.అలా అవి కొన్ని సార్లు సినిమా విజయానికి కూడా దోహద పడతాయి.అంతే కాదు ఈనాడు సినిమా పాట మన జీవితంలో ఒక భాగమైపోయింది.సినిమా పాట లేని వేడుక లేదు.అది భగవంతుని పూజించే సమయమైనా, పండుగ వేళైనా, ఉత్సవాలలోనైనా , పెళ్లిలాంటి శుభ కార్యాలలో అయినా, అశుభ కార్యాలలో అయినా సినిమా పాట ఉండవలసిందే అంటే సినిమా పాట మన జీవితంలో యెలా పెన వేసుకుపోయిందో అర్థమవుతుంది.అలాంటి మన తెలుగు సినిమా పాట యెలా పుట్టిందీ? దాని ప్రస్థానమేమిటీ? దానిని తీర్చిదిద్దిన వారెవరూ? ఒక సారి పరిశీలించి చూద్దాం.
మొట్ట మొదట తెలుగు సినిమా లన్నీ పద్య నాటకాల ఆధారంగానే తయారయ్యేవి.అందువలన సినిమాలలో పద్యాలే ఎక్కువగా వుండేవి.
కొంత కాలం తర్వాత జనసామాన్యాన్ని అలరించడానికి లలిత గీతాలూ,సంప్రదాయ గీతాలూ,జానపద గేయాల ధోరణిలో కొన్ని పాటలను కూడా రూపొందించి, పద్యాల మధ్యలో చొప్పించే వారు.క్రమేణా సాంఘిక చిత్రాలు రావడం మొదలు పెట్టాక పద్యాలు మాయమయ్యి పాటకి ప్రాధాన్యం పెరిగింది.అలా సినిమా పాట రూపు దిద్దుకుంది.పౌరాణిక చిత్రమైనా, జానపదచిత్రమైనా, సాంఘిక చిత్రమైనా, క్రయిమ్ థ్రిల్లర్ అయినా, కామెడీ చిత్రమైనా నేడు చిత్రాలలో పాట తప్పని సరి. పరిశీలించి చూస్తే పాట లేని సినిమాల సంఖ్య చాలా తక్కువ వేళ్లమీద లెక్కించవచ్చు .
1932లో మొదటి సినిమా పాట పుట్టిన దగ్గరనుండీ నేటి వరకూ చేసిన తొంభై యేళ్ల ప్రయాణంలో,సినిమా పాట నాటక గీతం, మరాఠీ నాట్య గీతం, జానపద గీతం, హిందీ చిత్ర గీతం, పాశ్చాత్య గీతం ఇలా యెన్నో రకాల గీతాల ప్రభావాలకు గురి అయ్యింది,ఎన్నో మార్పులకు లోనయ్యింది.1950 -1965 ప్రాంతాలు వచ్చేసరికి తెలుగు సినిమా పాటకి ఒక ఒరవడి యేర్పడింది. అప్పుడు వచ్చినన్ని మంచి సాహితీ విలువలున్న మాధుర్య ప్రధానమైన పాటలు తర్వాత రాలేదనిపిస్తుంది. అందుకే ఆ కాలాన్ని తెలుగు సినిమా పాటకు స్వర్ణయుగం అని భావిస్తాను నేను.
సినిమా పాట కి వుండ వలసిన లక్షణాలేమిటీ? అని ఆలోచిస్తే. పాట సందర్భోచితంగా వుండాలి, అందులో భాష పాత్రోచితంగా వుండాలి, ప్రజల నోటికి సులువుగా పట్టుబడేటట్టుగా వుండాలి,ప్రజారంజకమైన బాణీలలో ట్యూన్ కట్టబడి వుండాలి. ఇక్కడ సినిమా పాట హిట్టవ్వడానికి సంగీతం పాత్ర చాలా వుంటుందనే విషయం విస్మరించరాదు. ఇంకో ముఖ్యమైన గమనించ వలసిన విషయం యేమిటంటే చాలామంది సంగీత దర్శకులు రచయిత రాసిన సాహిత్యానికి బాణీ కట్టడానికి ఇష్టపడరు.వారు ముందే తయారు చేసుకున్న బాణీకి అనుగుణంగా రచయితని పాట రాయమంటారు. ఇది ఒక రకంగా పాటల రచయితకి అగ్నిపరీక్షే! అయితే సినిమా పాటకి జనరంజకత్వం అనేదే ప్రధానమైన విషయం అనేది మరిచి పోకూడదు కూడా. ఇన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని రాసే పాటలో సాహితీ విలువలని కూడా నిలుపుతూ రాయడమంటే కత్తిమీద సామే!
ఈ అసిధారా వ్రతాన్ని అత్యంత లాఘవంగా, అలవోకగా నిర్వహించిన రచయితలెందరో! మనమిప్పుడు వారిలో కొందరి గురించి మాట్లాడుకుందాం. అందరి గురించీ మాట్లాడుకోవడం అసాధ్యమైన విషయం కాబట్టి కొంతమంది ముఖ్యమైన వారి గురించి మాత్రమే ముచ్చటించడం జరుగుతోంది.
చందాల కేశవ దాసు—

మొదటి సినిమా పాట రాసిన కవి శ్రీ చందాల కేశవదాసు. ఆయన నాటక రచయిత, అష్టావధాని, హరికథలు చెప్పేవారు.
1932లో వచ్చి మొదటి టాకీ “భక్త ప్రహ్లాద” కోసం దర్శకుడు హెచ్ .యం .రెడ్డి , చందాల కేశవదాసుని పిలిచి మూడు పాటలు రాయించారు.వాటిలో “పరితాప భారంబు భరియింప తరమా” అనే పాట ఆ సినిమాలో లీలావతి పాత్ర ధరిస్తున్న సురభి కమలా బాయి పాడారు. అదే మొదటి సినిమా పాట గా చరిత్రకారులు భావిస్తున్నారు.ఆ తర్వాత కేశవ దాసు రెండు మూడు సినిమాలకు పని చేశారు.
ముత్తరాజు సుబ్బారావు రచించిన నాటకం ఆధారంగా తయారయిన “శ్రీకృష్ణ తులాభారం” సినిమా ఇప్పటికి మూడుసార్లు వచ్చింది(1933,55,66) వచ్చిన మూడుసార్లూకూడా వినపడిన”భలే మంచి చౌకబేరమూ, మునివరా, కొట్టండి కొట్టండి” అనే పాటలు చందాల కేశవ దాస్ రాసినవే. అంటే ఆ పాటలు ఎంత హిట్టో ఆలోచించండి.ఈ నాటికీ ఏ నాటకం అయినా మొదలు పెట్టే ముందు పాడే ప్రార్థన గీతం “పరబ్రహ్మ పరమేశ్వర “ఆయన రాసిందే!
1932 నుండీ జరిగిన దాదాపు పదేళ్ల కాలంలో చాలా వరకూ నాటకాలనే సినిమాలుగా రూపొందించే వారు, అందు వలన నాటక రచయితలే సినిమారంగంలో కూడా ప్రవేశించి మాటలూ, పాటలూ రాసే వారు .అలా వచ్చిన వారే బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, మల్లాది విశ్వనాథ కవిరాజు, చిలకమర్తి లక్ష్మీనరసింహం మొదలైన వారు.
బలిజే పల్లి వారు “మళ్లీపెళ్లి “(1939)సినిమాకి పని చెశారు.అందులో పాటలన్నీ ఆయనే రాశారు .అందులో ఆయన రాసిన
“ఆనందమేగా వాంఛనీయము, నా సుందర సురుచిర రూపా” పాటలు బాగా హిట్టయ్యాయి.
తాపీ ధర్మారావు

అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రోత్సాహంతో కవీ,తెలుగు పండితుడూ , జర్నలిస్టూ, హేతువాదీ, నాస్తికుడూ అయిన తాపీ ధర్మారావు నాయుడుగారు కూడా సినిమాలలో ప్రవేశించారు. ఆయన1939లో వచ్చిన గూడవల్లి రామబ్రహ్మం గారి “మాలపిల్ల” చిత్రానికి ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం గారితో కలిసి మాటలు రాశారు.”కీలుగుర్రం, రోజులుమారాయి” చిత్రాలకు పాటలు రాశారు. ఆరోజుల్లో “కీలుగుర్రం” లోని “కాదుసుమా కలకాదు సుమా” పాటవిని ప్రజలు వెర్రెత్తి పోయారు.ఆ పాట ఈరోజువిన్నా హాయిగానే వుంటుంది .పాట సాహిత్యానికి ఘంటసాల చేసిన బాణీ మరింత వన్నెలద్దింది. అలాగే “రోజులు మారాయి” లో “ఇదియే హాయి కలుపుము చేయి” అని అభ్యుదయ భావాలు మిళాయించి రాసిన పాట కూడా చాలా బాగుంటుంది.
బసవరాజు అప్పారావు—

బసవరాజు అప్పారావు గారు భావకవులుగా పేరొందిన వారు .చాలా చిన్నవయసులోనే (1933) కాలం చేశారు.అయితే గూడవల్లి రామబ్రహ్మంగారు వారి పాటల హక్కులను వారి మరణానంతరం కొనుక్కుని తాముతీసిన “మాలపిల్ల,రైతుబిడ్డ” మొదలైన చిత్రాలలో చక్కగా ఉపయోగించుకున్నారు.ఆ రోజుల్లో ప్రతివారి నోట్లోనూ నానిన
“నల్లవాడే గొల్లపిల్ల వాడే”
“కొల్లాయి గట్టితే నేమి మా గాంధీ” పాటలు ఆయన రాసినవే!
దైతా గోపాలం–ఈయన కవీ,నటుడూ,గాయకుడూ కూడా.ఈయన వద్ద నటనలో తర్ఫీదు పొందిన వారిలో అక్కినేని నాగేశ్వరరావూ,కాంచనమాలా కూడా వున్నారు.అలాగే సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కూడా ఆయన శిష్యుడే.ఆయన “సతీ సుమతి” కోసం రాసిన “నిన్న సాయంత్రమున మిన్నేటి ఛాయలలో నిను సన్నచేసి పిలచిన చిన్నదెవరు స్వామీ” బాగా ప్రసిధ్ధి చెందిన పాట.
ఆయన సతీ సక్కుబాయి నాటకం కోసం రాసిన పాటలు చాలా పాప్యులర్ “కాలి అందియలు ఘల్లు ఘల్లుమన,రంగా రంగా యనుడీ,జాగేలా గోపాల బాలా”అనే పాటలు ఆయన రాసినవే.
బాలాంత్రపు రజనీకాంతరావు—

ఈయన బహుముఖీనమైన ప్రజ్ఞకలవారు.వాగ్గేయకారులు అంటే పాట రాయడమే కాదు దానికి తగిన బాణీకూడా కట్టగలరు.ఆయన రాసిన పాటలు వేరొకరు కట్టిన బాణీకి సాధారణంగా ఒదగవు.”రజనీ” ,”తారానాథ్ ” ” నాగరాజు”. మొదలైనవి ఆయన కలం పేర్లు. “తారుమారు” “భలే పెళ్లి” (1938) చిత్రాలతో చలన చిత్ర రంగ ప్రవేశం చేసినా ఆయన కు బాగా పేరు తెచ్చిన పాట “స్వర్గసీమ “(1945) లో భానుమతి పాడిన”ఓహోహో పావురమా”. కానీ ఆ పాట రచయితగా ఆయన పేరు సినిమా క్రెడిట్స్ లో కనపడదు.ఆ పాటకి ట్యూన్ కూడా తానే చేశాననీ సంగీత దర్శకుడు నాగయ్య గారు ఆ ట్యూన్ కి చిలవలూ పలవలూ కల్పించి వాయిద్య గోష్ఠి కలిపి రికార్డ్ చేశారనీ తన జీవిత్ర లో రాసుకున్నారు “రజనీ”. ఆ రోజుల్లో ప్రజలకు పిచ్చి పట్టించిందా పాట. అది ఎంత హిట్టయ్యిందంటే ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ ఈ ఒక్కపాట కోసమే ఈ సినిమా ఇరవై సార్లు చూశానని ఒక సందర్భంలో నటి భానుమతితో చెప్పారు.
వీరు యల్వీ ప్రసాద్ , భానుమతి హిరో హీరోయిన్లుగా నటించిన “గృహప్రవేశం” (1946)
చిత్రానికి అన్ని పాటలూ రాయడమే కాక సంగీత దర్శకుడు గా కూడా వ్యవహరించారు .అయితే ఆయన పేరుండదు వారి అన్నగారు నళినీకాంత రావు గారి పేరు ఉంటుంది.భానుమతి పాడిన “అనగనగా ఒక రాణి”,సి.యస్ .ఆర్ అద్భుతంగా పాడుతూ అభినయించిన “జానకి నాదేనోయ్ ,మదిలో కోరికలీడేరాయ్ ” బల్ చక్కని పాటలు.
“మానవతి” సినిమాలో మలయ మారుత రాగంలో అత్యంత మృదువైన బాణీ కట్టి బాలసరస్వతి,యం.యస్ ..రామారావు చేత పాడించిన “ఓ మలయ పవనమా నిలునిలు నిలుమా”కూడా ఆయన రాసిందే.
“లక్ష్మమ్మ “లో పాటలన్నీ ఆయనే రాశారు, సంగీత దర్శకుడు గా ఘంటసాల పని చేశారు. “ఊయల ఊపనా సఖీ,నేనే విరజాజినైతే నీవే ఎలమావి వయితే” మొదలైన పాటలన్నీ నేడు విన్నా చాలా బాగుంటాయి. ఈ చిత్రంలో ఆయన “తారానాథ్ “అనే పేరుతో రాశారు.
“బంగారు పాప” లో మాధవపెద్ది పాడిన “తాథిమి తకథిమి తోల్ బొమ్మా “అనే తాత్త్విక గీతం “రజనీ” రాసిందే కానీ చిత్రంలో ఆయన పేరుండదు.
“రాజ మకుటం ” (1960)చిత్రంలో ఆయన “నాగరాజు “పేరుతో నాలుగు పాటలు రాశారు.
“ఊరేది పేరేది ఓ చందమామ
జాబిల్లి నీలి కలువ విడరాని జంట” అనే పాటంటే చెవి కోసుకుంటాను నేను.ఈ పాటలో ఆయన “తరిపి వెన్నెలల దొర రారా” అనే ప్రయోగం చేశారు .చంద్రుణ్ణి అలా సంబోధించడం యెక్కడా వినలేదు నేను.తరిపి వెన్నెల అంటే చిక్కని తెల్లని వెన్నెల అట.నిజంగా “రజనీ” గారిలాంటి వారు సినిమా రంగం లోకి రావడం వలన సినిమా పాట స్థాయీ,గౌరవం పెరిగాయనడంలో యే మాత్రం సందేహం లేదు.
“ఠింగన ఠింగన ఠిల్లా,కొంగన ముక్కున జెల్లా”
అనే జానపద ధోరణి పాటా,”అంజలిదే జననీ “అనే కరుణరసం చిప్పిల్లే పాటా”జయ జయ మనోజ మంగళమూర్తీ” అనే హిందూస్థానీ బాణీ లోపాటా కూడా “నాగరాజు” పేరుతో అదే సినిమాలో ఆయనే రాశారు . ఇది ఆయన వైవిధ్యమైన ప్రతిభ కు ఒక ఉదాహరణ.
సముద్రాల రాఘవాచార్యులు—-

1937 ప్రాంతాలలో చిత్ర సీమలోకి ప్రాచీనాంధ్ర సాహిత్యాలను బాగా చదువుకున్న వారైన సముద్రాల రాఘవాచార్యులు(సముద్రాల సీనియర్ ) , గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రోత్సాహంతో “కనకతార “(1937)సినిమాకి మాటలు పాటలూ రాయడానికి కుదురుకున్నారు.ఆయన అప్పటి నుండీ దాదాపు ముఫ్ఫయి సంవత్సరాలు ,అంటే 1968లో చనిపోయే వరకూ చిత్ర సీమలో సాటిలేని రచయితగా వెలుగొందారు ముఖ్యంగా 1940-65 మధ్య వచ్చిన తెలుగుసినిమా పాటలలో సీనియర్ సముద్రాల రాసిన పాటలు ఉన్నత శ్రేణికి చెందినవి.తెలుగు సినిమా పాటకు ఒక ఒరవడి దిద్దిన కవిగా ఆయనను చెప్పుకోవచ్చు. పౌరాణికమైనా, జానపద మైనా, సాంఘిక మైనా ఆయన కలంలో పదును యేమాత్రం తగ్గదు.
“సీతారామ కల్యాణం, భూకైలాస్ ,పాండవ వనవాసం,శ్రీకృష్ణ పాండవీయం” లాంటి సినిమాలకు ఎలాంటి పాటలు రాశారని!
“సీతారాముల కల్యాణము చూతము రారండీ”
“నీలకంధరా దేవా దీన బాంధవా రారా”
“హిమ గిరి సొగసులూ మురిపించునూ మనసులూ”
“జననీ శివ కామినీ “
“ప్రియురాల సిగ్గేలనే” ఇవన్నీ పౌరాణికాలలో ఆయన రాసిన పాటలు.
సాంఘికాలైన “దొంగ రాముడు” లో
“రారోయ్ మా ఇంటికీ ఓ మావో మాటున్నదీ మంచి మాటున్నదీ” అన్న పాటలో పల్లెటూరి వారి పలుకుబళ్లు ఎంత బాగా పట్టుకున్నారు!
ఇక “షావుకారు” “దేవదాసు” సినిమాల్లో పాటల గురించి చెప్పే పనే లేదు అయితే వాటి వెనక మల్లాది వారి హస్తం వుందనే వదంతి బలంగా వుండటం చేత వాటి గురించి మాట్లాడటం లేదు.
“విప్ర నారాయణ” ,”బాటసారి ” చిత్రాలలో పాటల గురించి సినీ పాటల ప్రియులు ఎప్పుడూ తలుచుకుంటూనే వుంటారు,
ఆయన సుమారు వందకు పైగా చిత్రాలలో పని చేశారు ,వెయ్యి పాటల వరకూ రాశారు ,మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన చివరి పాట రాసింది నటుడు పద్మనాభం తీసిన “శ్రీరామ కథ”(1968)సినిమాకి
కొసరాజు రాఘవయ్య చౌదరి—-

“జానపద కవి సార్వభౌమ” అని పేరు పొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి కూడా గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతోనే ,ఆయన సొంత చిత్రం “రైతుబిడ్డ “(1939) తో సినిమారంగ ప్రవేశం చేశారు .అందులో ఆయన కొన్ని పాటలురాశారు, పాడారు,రైతు రామిరెడ్డి వేషంలో నటించారు కూడా—-
జానపద ధోరణి లో వ్యంగ్యమూ హాస్యమూ మిళాయించి సమాజపు పోకడ మీద ఒక చక్కని చురక వేయడం ఆయన పాటలలోని ప్రత్యేకత.
ఆయన సుమారు ఆరు వందల చిత్రాలలో యెనిమిది వందల పైచిలుకు పాటలు రాశారు.
“రైతుబిడ్డ(1939) “అపవాదు (1941) చిత్రాలకు పాటలు రాసి కొంత కాలం సినిమాలకు దూరంగా వున్నారు.
మళ్లీ 1954లో డి.వి.నరసరాజు గారి ప్రోద్బలంతో “పెద్ద మనుషులు “సినిమాలో ఆణిముత్యాల్లాంటి పాటలు రాశారు
తర్వాత 1954లో “రాజూ-పేద”సినిమాకీ
1955 లో “రోజులు మారాయి “సినిమాకీ పాటలు రాశారు.
“రోజులు మారాయి” లో “ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా” పాటతో ఆయనకు మంచి పేరొచ్చింది దశ తిరిగింది.అప్పటి నుండీ 1986లో ఆయన చనిపోయేదాకా పాటలు రాస్తూనే వున్నారు.ఏ చిత్రం లోనయినా వ్యంగ్య ,హాస్య ,జానపద ధోరణి పాటలుంటే కొసరాజు గారినే పిలిచే వారు.అయితే ఆయన కొన్ని ప్రబోధ గీతాలూ,తాత్త్విక గీతాలూ,యుగళగీతాలూ కూడా రాశారు.
కొసరాజు గారి గీతాలు కొన్ని మచ్చుకి
“శివ శివ మూర్తివి గణనాథా”
“నందామయ గురుడ నందామయా”
“జేబులో బొమ్మా జేజేల బొమ్మా”
ఏరు వాకా సాగారో రన్నా చిన్నన్నా”
“టౌను పక్కకెళ్లొద్దురా డింగరీ డాంబికాలు పోవద్దురా”
“జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా”
“కళ్లు తెరిచి కనరా సత్యము ఒళ్లు మరచి వినరా”
“అయ్యొయ్యో చేతిలో డబ్బులు పోయెనే”
“ఏ నిమిషానికి యేమి జరుగునో ఎవరూహించెదరూ”
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.
మల్లాది రామకృష్ణ శాస్త్రి—-

ఈయన ” వచన రచనకు మేస్త్రి “అని పేరు గాంచారు .అనేక భాషలు అలవోకగా నేర్చారు .సంగీత సాహిత్యాల లోతును తరచిన వారు.ఆరుద్ర,శ్రీశ్రీ లాంటి మహా రచయితలు ఈయన్ని తమ గురువుగా భావిస్తారు.మల్లాది వారు చిత్రసీమలోకి అడుగు పెట్టి రచనలు చేయడం వలన తెలుగు సినిమా పాటస్థాయీ,గౌరవమూ పెరిగిందని భావిస్తారు.
మొదట్లో ఆయన సీనియర్ సముద్రాల గారికి ఘోస్ట్ రైటర్ గా పని చేసేవారని చెప్పుకుంటారు
“షావు కారు”, దేవదాసు” లలోని పాటలలో ఆయన ముద్ర స్పష్టంగా తెలుస్తుందని ఆయన అభిమానులు అంటూ వుంటారు.
ఉదా—-“ఏమనెనే చిన్నారి యేమనెనే “
“జగమే మాయ బ్రతుకేమాయ”
మొదలైన పాటల్లో వుండే చిన్న చిన్న అచ్చతెలుగు పదాల పొందిక ,లోతైన అర్థమూ శాస్త్రి గారి హస్తవాసిని పట్టిస్తాయని వారి అభిమానుల అభిప్రాయము.
1945 లో సినిమా పరిశ్రమ లోకి అడుగు పెట్టిన మల్లాది వారు 1952 వరకూ అజ్ఞాతంగానే వున్నారు.వారు తన పేరుతో పాటలు రాసిన మొదటి చిత్రం “చిన్నకోడలు”.వారు సుమారుగానలభై చిత్రాలకు పని చేశారు నూటయాభై వరకూ పాటలు రాసి వుంటారని ఒక అంచనా.
రాశి లో తక్కువైతేనేం వాసిలో మహ గొప్పవీ పాటలు. లాలిత్యమూ,సొగసూ,లోతైన అర్థమూ
వాటిని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి.సినిమా పాటకు కావ్యగౌరవం తీసుకు వచ్చిన కవులలో ఆయన మొదటి వారు.
సినిమాలకు ఆయన రాసిన పాటలన్నీ ఒకఎత్తయితే,”రహస్యం” చిత్రానికి ఆయన రాసిన “గిరిజా కల్యాణం “ఒక్కటే ఒక ఎత్తు.
ఆయన ఎలాంటి పాటలు రాశారో ఒక సారి చూద్దాం
“రారాదో రాచిలుకా చేర రారాదో చిలుకా”—-చిన్న కోడలు
చికిలింత చిగురూ సంపంగి గుబురూ చినదానీ మనసూ చినదాని మీద మనసూ—-చిరంజీవులు
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్లీ పరుండేవు లేరా —-చిరంజీవులు
సన్న జాజి తీవలోయ్ సంపంగి పూవులోయ్ —అనురాగం
అందానికి అందం నేనే జీవన మకరందం నేనే —చివరికి మిగిలేది
రసిక రాజ తగువారము కామా అగడు సేయ తగువా—జయభేరి
రాగమయీ రావె—-జయభేరి
లలిత భావ నిలయా నవ రసానంద హృదయా —రహస్యం
గిరిజా కల్యాణం యక్షగానం —-రహస్యం
1965లో ఆయన పరమ పదించారు .ఆయన పాటలు రాసిన చివరి చిత్రం “వీరాంజనేయ”
పింగళి నాగేంద్రరావు —–

ఈయన విజయా వారి ఆస్థాన కవి.కొత్త కొత్త తెలుగు పదాలను ప్రయోగించి వాటిని పాప్యులర్ చేసిన ఘనత ఈయనిది.”మాయాబజార్ “సినిమాలో ఆయన రాసిన డైలాగ్ “ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి వేయండిరా వీడికొక వీరతాడు” ఆయనకు కూడా వర్తిస్తుంది,ఈ నాటికీ ఎంతోమంది నోట ఈ డైలాగ్ వినపడుతూనే వుంటుంది.
ఆయన రాసిన పాటల పల్లవులు జనం నోళ్లలో యెంతగా నానిపోయాయంటే కొంత మంది వాటిని తమ కథలకు పేర్లుగానూ,సినిమాలకు పేర్లుగానూ కూడా పెట్టుకుంటూ వుంటారు .ఉదా— “ఎంత ఘాటు ప్రేమయో,ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు ,లాహిరి లాహిరి లాహిరి లో ”
మొట్ట మొదట తాను రాసిన “వింధ్యరాణి” నాటకాన్ని సినిమాగా తీయడం కోసం మద్రాసు వచ్చిన పింగళి నాగేంద్ర రావు గారిని కమలాకర కామేశ్వరరావు గారు కె.వి.రెడ్డి గారికి పరిచయం చేశారు.రెడ్డిగారు తాను తలపెట్టిన “గుణసుందరి కథ”కు రచయితగా వుండమని పింగళి గారిని కోరారు.
“గుణసుందరి కథ ” (1949)చాలా పెద్ద హిట్టు .పింగళి గారి మాటలూ,పాటలూ జనానికి బాగా పట్టాయి
“గిడి గిడీ” “డింగరీ “,”శాయరా”లాంటి పద ప్రయోగాలు ప్రజలను బాగా ఆకర్షించాయి.
ఆయన రాసిన సినిమా పాటలన్నీ దాదాపు సూపర్ హిట్లనే చెప్పాలి.
“పాతాళభైరవి,మిస్సమ్మ ,గుండమ్మ కథ,పెళ్లిచేసి చూడు,మాయాబజార్ జగదేక వీరుని కథ ,శ్రీకృష్ణార్జున యుధ్ధం”లలోవి ఎలాంటి పాటలు !
ఆయన సుమారు ముఫ్ఫయి చిత్రాలకు పని చేశారు ,దాదాపు మూడువందలు పాటలు రాసి వుంటారని ఒక అంచనా
ఆయన రాసిన పాటల పల్లవులు కొన్ని చెబితే ఆయన ఎంత హిట్ పాటలు రాశారో అర్థమవుతుంది.
.ఈ వనిలో కోయిలనై–గుణసుందరి కథ
.ఎంత ఘాటు ప్రేమయో —పాతాళభైరవి
.పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని —పెళ్లి చేసి చూడు
.ఆడువారి మాటలకు అర్థాలే వేరులే —–మిస్సమ్మ
.లాహిరి లాహిరి లాహిరిలో—-మాయాబజార్
.శివశంకరీ —జగదేక వీరుని కథ
.ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి—గుండమ్మ కథ
ఇలా వుంటుంది లిస్టు.
విజయా సంస్థలో ఆయన పనిచేసిన చివరి సినిమా “ఉమా చండీ గౌరీ శంకరుల కథ”
అనారోగ్యంతో ఆయన 1971లో మరణించారు.
దేవులపల్లి కృష్ణ శాస్త్రి—-

భావకవులలో అగ్రగణ్యుడూ,మధురకవి,సౌందర్యోపాసకుడూ అయిన కృష్ణశాస్త్రి సినీరంగ ప్రవేశం ఆ రంగానికి ఎంతో వన్నె తీసుకువచ్చింది అనడంలో సందేహంలేదు .సినిమా పాటకు కావ్యగౌరవం కల్పించిన కవి ఆయన.పాటలో వచ్చే ప్రతి మాటను ఆచి తూచి వేసేవారు.సరైన మాటకోసం ఎంత సమయమైనా వేచి వుండాల్సిందే అనేవారు.
ఆయనను సినీ రంగానికి తీసుకురావాలని తపించీ,ఉవ్విళ్లూరి చివరికి సాధించిన వారు బి.యన్ .రెడ్డి గారు.
ఆయన చిత్రం “మల్లీశ్వరి” (1951) లో దేవులపల్లి రాసిన ప్రతి పాటా ప్రజలను అలరించింది.ఈ నాటికీ “మనసున మల్లెల మాలలూగెనే “అని పాడుకుని పరవశించని మనసు వుండదంటే అతిశయోక్తి కాదు.
ఆయన రాసిన పాటలు సంఖ్యలో తక్కువే అయినా ,వాటికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు చాలా ఎక్కువ .ఆయన రాసిన ప్రతి పాటా ఆణిముత్యమే .ఆయన రాసిన లలిత గీతాలు కొన్ని ఆయన చనిపోయాక కూడా చిత్రాలలో వాడుకున్నారు .”మేఘ సందేశం” లో వినపడే
“ఆకులో ఆకునై”
“ముందు తెలిసెనా ప్రభూ”
“సిగలో అవి విరులో ” —పాటలు ఆయన పోయాక సినిమాకి ఉపయోగించిన లలిత గీతాలు.
సినిమాలకోసం ఆయన రాసిన పాటలు అన్నీ కలిపి రెండువందలలోపే వుంటాయని అంచనా.
ఆయన కలం నుండీ జాలువారిన కొన్ని పాటలు
.ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు—-మల్లీశ్వరి
మల్లెపూలు మల్లెపూలు కల్వపూలు కావాలా —రాజీ నా ప్రాణం
.చుక్కలతో చెప్పాలనీ యేమనీ—ఉండమ్మా బొట్టు పెడతా
.సడిసేయకో గాలి సడి సేయబోకే—-రాజమకుటం
.నీవుండే దా కొండపై—-భాగ్యరేఖ
.ఇది మల్లెల వేళయనీ—-సుఖదుఃఖాలు
.ప్రతీ రాత్రీ వసంత రాత్రీ ప్రతి గాలి పైరగాలి—-ఏకవీర
.ఊరకే కొలను నురు ఉలికి ఉలికి పడుతుంది—-సంపూర్ణ రామాయణం
.పాడనా తెనుగు పాట—అమెరికా అమ్మాయి
.మావి చిగురు తినగానే కోవిల పలికేనా —-సీతామాలక్ష్మి
.గోరింట పూచింది కొమ్మ లేకుండా—-గోరింటాకు
.నాపేరు బికారి నాదారి ఎడారి—రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్
చెప్పాలంటే చాలా వుంటాయి ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే
“ఆంధ్రా షెల్లీ “అని పిలువబడే ఆయన 1980 లో పరమ పదించారు.
ఆచార్య ఆత్రేయ—–

ఈయనను “మనసు కవి” అంటారందరూ .మనసుకి సంబంధించిన పాటలు రాయడంలో ఆయనను మించిన వారు లేరని భావిస్తారు.
ఆయన అసలు పేరు కిడాంబి వేంకట నరసింహాచార్యులు “ఆత్రేయ” ఆయన కలం పేరు.
చిన్న చిన్న సరళమైన వాడుక పదాలతో లోతైన అనుభూతి కలిగించేలా పాట రాయడం ఆత్రేయ ప్రత్యేకత.ఆత్రేయ గురించి ఇంకో ప్రచారం వుంది ,పాట రాయడానికి చాలా సమయం తీసుకుంటారని. “ఆత్రేయ రాసి ప్రేక్షకులనీ,రాయక నిర్మాతలనీ ఏడిపిస్తాడని”సినీ జనుల ఉవాచ.
ఆయన పాటలు కొన్నిటిలో శృంగారం మోతాదు ఎక్కువగా వుంటుందనీ ఆయనను “బూత్రేయ” అని కూడా పిలిచే వారున్నారు .దీనికాయన యేమంటారంటే “సినిమాలో సన్నివేశానికి అనుగుణంగా పాట రాయాలి మనం మడికట్టుక్కూర్చుంటే కుదరదు” అని
ఆయన 1951లో వచ్చిన “దీక్ష” సినిమాలో “పోరాబాబూ పో ,పోయి చూడు ఈ లోకం పోకడ” అనే పాటతో సినీ రంగ ప్రవేశం చేశారు.
1989లో చనిపోయే వరకూ రచనలు చేస్తూనే వున్నారు.సుమారు 38సంవత్సరాల సినీ జీవితంలో నాలుగువందల డెభ్భై యేడు సినిమాలకి పని చేశారు,1636పాటలు రాశారని “ఆత్రేయ సాహితి” వారు నిగ్గు తేల్చారు.
ఆత్రేయ అన్ని రకాల పాటలూ రాసి మెప్పించారు.భక్తి గీతాలు,శృంగార గీతాలు తత్త్వగీతాలు ఇలా.అయితే ఆయన ఆదుర్తి సుబ్బారావు,కె.వి.మహాదేవన్ లతో కలిసి పని చేసిన సినిమాలలో పాటలు ప్రత్యేకంగా చాలా బాగుంటాయి”మూగమనసులు,తేనె మనసులు,కన్నెమనసులు,సుమంగళి,డాక్టర్ చక్రవర్తి” మొదలైన సినిమాలలో పాటలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
తెలుగు సినిమా పాటల రచయితలలో ఆత్రేయ స్థానం సమున్నతమైనది.ఆయనను తమ గురువుగా భావించి గౌరవిస్తారు వేటూరి సుందరరామమూర్తి,సిరివెన్నెల సీతారామ శాస్త్రీ.
ఆయన రాసిన పాటలు ఒకసారి చూస్తే వారెందుకలా భావించారో అర్థమవుతుంది.
ఎవరురా నీవెవరురా—-అగ్గి రాముడు
వద్దురా కన్నయ్యా—-అర్థాంగి
శేషశైలవాసా శ్రీవేంకటేశా—-శ్రీవేంకటేశ్వర మహాత్యం
కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి చాన—-తోడికోడళ్లు
తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతిలేదు నీకు—-మనసే మందిరం
పులకించని మది పులకించు—-పెళ్లి కానుక
వెలుగు చూపవయ్యా—-వాగ్దానం
శిలలపై శిల్పాలు చెక్కినారు—-మంచిమనసులు
పాడుతా తీయగా చల్లగా—మూగమనసులు
ఎవరికి వారౌ స్వార్థంలో —-గుడిగంటలు
చందమామా అందాల మామా—తేనెమనసులు
మనసు గతి ఇంతే—ప్రేమనగర్
మౌనమే నీ భాష ఒ మూగ మనసా —-గుప్పెడు మనసు
పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకూ కోటి దండాలూ—–మరో చరిత్ర
నీవులేక వీణ పలుకలేనన్నది—-డాక్టర్ చక్రవర్తి
నువ్వేనా సంపెంగ పువ్వుల నువ్వేనా —-గుప్పెడు మనసు
ఆయన పాటలు రాసిన ఆఖరి సినిమా “ఆత్మబంధువు” తమిళ్ నుండీ డబ్బింగ్ (1989)
ఎన్నటికీ మరిచిపోలేని మధురమైన పాటలను తెలుగు సినీ ప్రేమికులకు కానుకగా వదిలి దివి కేగారు ఆత్రేయ 1989లో.
శ్రీశ్రీ

శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.ఆయన ప్రాచీన కవిత్వాన్నీ,ఆధునిక కవిత్వాన్నీ బాగా ఆకళింపు చేసుకున్నారు .సినిమారంగంలోకి అడుగు పెట్టకమునుపే “మహాప్రస్థానం” అనే గేయ కావ్యాన్ని రాసి ,”మహాకవి” అని కీర్తించబడ్డాడు.
ఆయనకి శబ్దం మీద మంచి అధికారమూ,పదాలమీదా, నుడికారం మీదా మంచి పట్టూ వున్నాయి.అందుచేత ఆయన ఏది రాసినా ఏ పదం ఎక్కడుండాలో అక్కడ వచ్చి కూచుంటుంది లెక్క ప్రకారం.అందుకే ఆయనను ఆరుద్ర
రెండు శ్రీలు ధరించి
రెండు పెగ్సు బిగించి
వరలు శబ్ద విరించి
ఓ కూనలమ్మా —–అన్నారు
శ్రీశ్రీ కమ్యూనిస్ట్ భావజాలం కలవారు,నాస్తికులు.అయినా సరే సినిమాలలో సన్నివేశాలకనుగుణంగా ఎన్నో రకాల పాటలు రాసి ఒప్పించారు.
కానీ అవకాశం దొరికినప్పుడల్లా సమ సమాజ స్థాపన గురించిన సందేశం పాటలో చొప్పిస్తూ వుండేవారు.
ఉదా—–ఉందిలే మంచి కాలం ముందు ముందునా,అందరూ సుఖపడాలి నందనందనా—-రాముడు భీముడు.
నలుగురు కలిసీ
పొరుపులు మరచీ చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం—-తోడి కోడళ్లు
ఆయన రాసిన దేశభక్తి గీతాలు కూడా రక్తం ఉప్పొంగిస్తాయి
ఉదా—–తెలుగు వీర లేవరా
దీక్షబూని సాగరా——అల్లూరి సీతారామరాజు
పాడవోయి భారతీయుడా—-వెలుగు నీడలు
శ్రీశ్రీ చాలా డబ్బింగ్ చిత్రాలకు కూడా పని చేశారు అసలు ఆయన సినిమాల్లోకి ప్రవేశించడమే “ఆహుతి”(1950)అనే డబ్బింగ్ సినిమాతో .
అందులో “ప్రేమయే జనన మరణ లీలా” అనేది ఆయన రాసిన మొదటి సినిమా పాట.
ఆయన దాదాపు రెండు వందల యాభై చిత్రాలకు పాటలు రాస్తే అందులో యాభై చిత్రాలు డబ్బింగ్ చిత్రాలు .1950–1983 మధ్యకాలంలో సినిమాల కి ఆయన సుమారు వెయ్యి పాటల వరకూ రాస్తే అందులో అయిదు వందలు పైగా డబ్బింగ్ పాటలు ,నాలుగు వందలు పైగా నేరుగా చిత్రాలకు రాసినవీ.
ఆయన రాసిన చివరి సినిమా పాట “అర్థరాత్రి స్వతంత్రం అంధకార బంధురం”—-నేటి భారతం.
ఆయన కవితా ఖండికలని ఆయన బ్రతికి వుండగానే “ఆకలి రాజ్యం” (1980)సినిమాలో హీరో కమల హాసన్ చేత పాడించారు.ఆయన పోయాక ,మాదాల రంగారావు తన సినిమాలలో ఆయన గేయాలు ఉపయోగించుకున్నారు.
శ్రీశ్రీ సినిమా పాటలన్నీ సంకలనాలుగా వెలువడ్డాయి.
శ్రీశ్రీ ని తలుచుకోంగానే గుర్తుకొచ్చే పాటలు కొన్ని——–
కలకానిదీ విలువైనదీ బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకూ—-వెలుగు నీడలు
.మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ—-డాక్టర్ చక్రవర్తి
.హాయిగా ఆలూ మగలై కాలం గడపాలి —-మాంగల్యబలం
.పాడవేల రాధికా—-ఇద్దరు మిత్రులు
.నా హృదయంలో నిదురించే చెలీ—–ఆరాధన
.నిను చేర మనసాయెరా—-బొబ్బిలి యుధ్ధం
.నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగె—-చిలకా గోరింక
.ఏమని పాడెదనో ఈ వేళ—-భార్యాభర్తలు
.ఎవరో వస్తారని ఏదో చేస్తారని —భూమికోసం
.కొంత మంది కుర్రవాళ్లు పుట్టుకతో వృధ్ధులు—-విప్లవ శంఖం
తెలుగు సినిమా పాటను తన జీవన భృతికి ఒక సాధనంగానే చూశారు శ్రీశ్రీ అంతకు మించిన ప్రాముఖ్యత ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన రాసిన పాటలలోని పదాల పొందికలో,భావ వ్యక్తీకరణలో ఆయన ప్రతిభ ద్యోతకమవుతూనే వుంటుంది.
1983 లో తన పాటల ఖజానాను మనకు వదిలి ఈ లోకం నుండీ నిష్క్రమించారు మహాకవి శ్రీశ్రీ
ఆరుద్ర—

ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదా శివ శంకర శాస్త్రి.ఈయన శ్రీశ్రీకి దగ్గర బంధువు.ఇద్దరి మధ్యా లవ్ హేట్ రిలేషన్ షిప్ వుండేది.ఆరుద్ర బహుముఖప్రజ్ఞాశాలి.అనేక రంగాల మీద మంచి అవగాహన వుండేది యే విషయాన్నయినా చాలా లోతుగా అధ్యయనం చేసేవారు.అందుకే ఆయనను “పరిశోధనా పరమేశ్వరుడు” అంటారు.సాహిత్యంతో పాటు చదరంగం, మేజిక్, నాట్యమూ,సంగీతమూ వీటిని కూడా అధ్యయనం చేసి పుస్తకాలు కూడా రాశారు.
“సమగ్రాంధ్ర సాహిత్యం” అనే గ్రంథం రాసి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు.
అనేక వైవిధ్యమైన పాటలు,వేగంగా రాయగల ప్రతిభ ఆయన సొంతం.
అంత్య ప్రాసలను అందంగా రాయగల నేర్పు వున్నవాడు,అందుకే “అంత్యప్రాసలకు ఆరుద్రను వాడుడు” అని అనుకుంటూ వుండేవారు.
తాను నాస్తికుడయినప్పటికీ భక్తి పాటలు చాలా బాగా రాసే వారు ఉదా—“రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా”
1950 లో “బీదలపాట్లు” సినిమాలో “చూలాలు సీతమ్మ కానలకు నడిచె” అనే పాటతో సినిమాలలో ప్రవేశించారు.రాజ్ కపూర్ డబ్బింగ్ చిత్రం “ప్రేమలేఖలు” (1953)చిత్రంలో పాటలు బాగా హిట్టయ్యాయి ఉదా—“పందిట్లో పెళ్లవుతున్నాది”.అప్పటి నుండీ ఆయన సినీ గేయ రచన అప్రతిహతంగా సాగిపోయింది.
ఆరుద్ర,కె.బి.తిలక్, పెండ్యాలల కలయికలో వచ్చిన పాటలు ఆణిముత్యాలలాగా వుండేవి.
తెలుగు సినీ ప్రేక్షకులు వాటి కోసం ఎదురు చూసేవాళ్లు.
“అత్తా ఒకింటి కోడలే,యం.యల్ ఏ,ఈడూ-జోడూ,ఉయ్యాల -జంపాల ,ముద్దు బిడ్డ “లలోని పాటలే ఇందుకు సాక్ష్యం.”ముద్దుబిడ్డ” లోని “ఎవరు కన్నారెవరు పెంచారు “అనే పాట విని మల్లాది రామకృష్ణశాస్త్రి గారు “ఇప్పుడు తెలుగుసినిమా పాటకేం తక్కువయింది” అని మెచ్చుకున్నారు.ఆయన రాసిన
“కొండగాలి తిరిగిందీ” పాటలాంటి సినిమా పాట ఇంకోటి కనపడదు (ఉయ్యాల-జంపాల). అదొక ప్రత్యేకమైన పాట,పాటలో నిండివున్న మార్మికత,ప్రతీకలూ రచయిత ప్రతిభకు తార్కాణాలు,ప్రముఖ మ్యూజికాలజిస్ట్ ,ఆరుద్రకి సన్నిహితులూ అయిన వి.ఎ.కె.రంగారావు గారు “కొండగాలి తిరిగిందీ” అనే పేరుతో ఆరుద్ర పాటల సంకలనం తీసుకువచ్చారు. ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి గారు కూడా ఆరుద్ర పాటలన్నీ కూర్చి సంకలనాలుగా తీసుకు వచ్చారు.
ఆరుద్ర అన్ని రకాల పాటలూ రాశారు .దాదాపు అయిదు వందల చిత్రాలకు రచన చేశారు ,సుమారు మూడు వేల పాటలు రాసి వుంటారని ఒక అంచనా.ఆయన పాటలు రాసిన చివరి చిత్రం “పెళ్లి కొడుకు”(1996)
ఆరుద్ర రాసిన కొన్ని పాటలు—
నీలిమేఘాలలో గాలికెరటాలలో —-బావా మరదళ్లు
ఊహలు గుసగుస లాడే —బందిపోటు
అమ్మ కడుపు చల్లగా అత్తకడుపు చల్లగా—సాక్షి
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ—-ముత్యాల ముగ్గు
.దగడానికెందుకురా తొందరా —అందాలరాముడు
.ధనమేరా అన్నిటికీ మూలం—–లక్ష్మీనివాసం
.అదిగో నవలోకం—-వీరాభిమన్యు
.ఇదేమి లాహిరీ ఇదేమి గారడీ—-ఈడూ—జోడూ
గొప్ప ప్రతిభావంతుడైన కవి ఆరుద్ర 1998 లో మూత్రపిండాల వ్యాథితో చనిపోయే వరకూ తెలుగు సినిమాకీ,సాహిత్యానికీ సేవ చేస్తూనే వున్నారు.
దాశరథి

-దాశరథి పూర్తిపేరు దాశరథి కృష్ణమాచార్యులు .ఈయన తెలంగాణాలో జన్మించారు.”నా తెలంగాణా కోటి రత్నాల వీణ”అని నినదించారు.నిజాంకి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.”అగ్నిధార,రుద్రవీణ” మొదలైన గ్రంథాలు రాశారు.మీర్జా గాలిబ్ కవితలని “గాలిబ్ గీతాలు” పేరిట తెలిగించి నటుడు అక్కినేని నాగేశ్వరరావుకి అంకిత మిచ్చారు.దీనికి బాపూ వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా వుంటాయి.
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందారు, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేసిన ఆఖరి కవి ఆయనే!
ఉర్దూ లోనూ,ఇంగ్లీషులోనూ,తెలుగులోనూ మంచి పాండిత్యం వున్న ఆయన సినీ రంగంలో ప్రవేశించడం వలన ఎన్నో చక్కటి పాటలు సిధ్ధించాయి.
ఉర్దూ భాష పరిమళించే పదాలతో ఆయన సినీ గీతాలకు సొగసులద్దారు ఉదా—“ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనుల దానా”
“ఇద్దరు మిత్రులు”(1961) కోసం రాసిన ఈ పాటే ఆయన మొదటి పాట
ఆయన కెందుకో పారిజాత పుష్పమంటే ఇష్టమనుకుంటాను ,అందుకే ఆయన పాటల్లో పారిజాతం ప్రస్తావన చాలా సార్లు వస్తూ వుంటుంది.కావాలంటే చూడండి ఈ పాటలు
“ఏ దివిలో విరిసిన పారిజాతమో “—-కన్నెవయసు
“దివినుండీ భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై”—-తేనె మనసులు
“వలపుతో పెనవేయు పారిజాతమునై ఎద మీద నిదురించు అడియాసలేదు”కనరాని దేవుడే “—-“రంగుల రాట్నం”
ఆయన అతి చక్కని వీణ పాటలు కూడా రాశారు
మదిలో వీణలు మ్రోగె —ఆత్మీయులు
పాడెద నీనామమే గోపాల –అమాయకురాలు
మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన —జమీందారు గారి అమ్మాయి.
హిందూస్థానీ సంగీత సాహిత్యాల మీద తనకున్న పట్టుతో ఆయన రాసిన ఖవ్వాలీలు కూడా చాలా బాగుంటాయి
ఉదా–
“అందాల ఈరేయి నీదోయి నీదోయి—లేత మనసులు
1987లో ఆయన కన్ను మూసే నాటికి సుమారు అయిదారు వందల పాటలు రాసి వుంటారని అంచనా
ఆయన ఎలాంటి హిట్లిచ్చారో మచ్చుకి కొన్ని పాటలు చూడండి.
నడిరేయి యే జాములో —-రంగులరాట్నం
వినిపించని రాగాలే -చదువుకున్న అమ్మాయిలు
నా కంటిపాపలో నిలిచి పోరా —-వాగ్దానం
అన్నా నీ అనురాగం—-ఆడపడుచు
గోదారీ గట్టుందీ—–మూగమనుసులు
ఓహో గులాబి బాలా–మంచిమనిషి.
.కన్నయ్యా నల్లని కన్నయ్యా —నాదీ ఆడజన్మే
.ఆకాశ పందిరి లో నీకు నాకు పెళ్లంటా—-శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్
సి.నారాయణ రెడ్డి

-ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.
ఆయన అటు విశ్వవిద్యాలయం లో ఆచార్యుడు గానూ,ఇటు సినీరంగంలో గేయ కవిగానూ రెండు విధులూ అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు.ఆయన అతి ప్రతిభావంతుడైన కవి ఆయన స్పృశించని కవితా ప్రక్రియ లేదు. పద్యం రాశారు,గద్యం రాశారు,గేయం రాశారు,గజల్ రాశారు,ఆధునిక కవిత్వం రాశారు,ఆధునికానంతర (పోస్ట్ మాడర్న్ పోయెట్రీ)కవిత్వంకూడా రాశారు.ఊరికే రాయడం వేరూ ,రాసి మెప్పించడం వేరూ .ఆయన ఆయా ప్రక్రియలలో రాసి మెప్పించడం విశేషం
అంతే కాదు తాను రాసిన “విశ్వంభర”కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన “జ్ఞానపీఠ్ “అవార్డ్ కూడా పొందిన ఘనత వారిది.తెలుగూ,హిందీ,ఉర్దూ భాషలమీద
ఎంతో పట్టు వున్న కవి కావడం చేత సినిమా పాట ఆయన చేతిలో కొత్త వన్నెలు దిద్దుకుంది.
.ఆయన సినీరంగంలో ప్రవేశించే నాటికే “విశ్వంభర,కర్పూర వసంత రాయలు ” వంటి కావ్యాలు రాసి వున్నారు.
వారి శ్రావ్యమైన కావ్యగానం విన్న నటుడు యన్ .టి.ఆర్ వారిని సాదరంగా చిత్ర సీమకు ఆహ్వానించి తన సొంత చిత్రమైన “గులేబకావళి కథ “(1962)కు పాటలన్నీ ఆయన చేతే రాయించారు.ఆనాటి నుండీ యన్ .టి. ఆర్ చనిపోయే వరకూ వారిద్దరి మధ్యా అదే అనుబంధం కొనసాగింది.
సి.నా.రె. కలంనుండీ మొట్టమొదట వెలువడినది “కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై” అనే మధురమైన పాట అయితే మొదట రికార్డ్ అయిన పాట మాత్రం “నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని” అనేది. “గులేబకావళి కథ”
పాటలన్నీ హిట్టవ్వడంతో సి.నా.రె. ఇంక వెనుదిరిగి చూడలేదు.
ఇంకో సంగతి ఆయన రాసిన పాటల్లో ఎంతో వైవిధ్యం కనపడుతుంది.ఆయన కాలంలో సినిమా పాటకి ప్రౌఢ యవ్వనం సిధ్ధించిందని చెప్పవచ్చు అనిపిస్తుంది.”శ్రీకృష్ణ పాండవీయం”లో ఈ కింది పాట వింటే ఆ మాట మీరే ఒప్పుకుంటారు!అదే “ఛాంగురే బంగారు రాజా” అనే పాట.
ఈ పాటలో “కైపున్న మచ్చెకంటి చూపు ,అది చూపు కాదు పచ్చల పిడిబాకు,పచ్టల పిడిబాకో విచ్చిన పూరేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా ,మనసుచ్చుకుంటే తెలుస్తుందిరా” అని రాశారు .ఇంతకంటే శృంగారం నేనింకే సినిమా పాటలోనూ వినలేదు. ఆ పదాల పోహళింపు అనుపమానం!
అలాంటిదే “కలియుగ రావణాసురుడు”లో “నల్లా నల్లని కళ్లూ” పాట “మగతని ఎగదోసే కళ్లూ మనసుని నమిలేసే కళ్లూ “అంటూ ఆయన రాసిన ఈ పాటలాంటి పాట కళ్ల మీద నేనింకెక్కడా వినలేదు.
సంస్కృతభూయిష్టమైన సమాసాలతో నిండిన పాటలు రాసి హిట్లిచ్టారు ఉదా—చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన —చెల్లిలి కాపురం.
అచ్చ తెలుగు పదాలను వాడుతూ సొగసైన పాటలు రాసి అలరించారు ఉదా—“ఛాంగురే బంగారు రాజా” –శ్రీకృష్ణ పాండవీయం
“చిత్రం భళారే విచిత్రం”—-దానవీర శూర కర్ణ
సి.నా.రె. గారిని తలుచుకోంగానే గుర్తొచ్చే కొన్ని గీతాలు.—-
ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో—-అమర శిల్పి జక్కన
నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో —పూజాఫలం
పగలే వెన్నెల జగమే ఊయల—-పూజాఫలం
మల్లియలారా మాలికలారా మౌనముగా వున్నారా—నిర్దోషి
తోటలో నారాజు తొంగి చూసెను నాడు—ఏకవీర
వస్తాడు నారాజు ఈ రోజు—అల్లూరి సీతారామరాజు
బలే మంచి రోజు పసందైన రోజు—-జరిగిన కథ
శివరంజనీ నవరాగిణీ—–తూర్పు పడమర
గోరంత దీపం కొండంత వెలుగు—-గోరంత దీపం
నల్లా నల్లని కళ్లూ —–కలియుగ రావణాసురుడు
1962—2011 వరకూ అడపా దడపా అయినా సినిమాలకి పాటలు రాస్తూనే వున్నారు .సుమారు 3000పైగా పాటలు రాసి వుంటారని అంచనా. 2017లో అనారోగ్యంతో కన్నుమూసినా ఆయన గీతాల ద్వారా ఆయన ఎల్లప్పుడూ మనకు వినిపిస్తూనే వుంటారు.
వేటూరి

వేటూరి పూర్తిపేరు వేటూరి సుందరరామ మూర్తి.వీరిది కృష్ణాతీరం లోని పెద కళ్లేపల్లి గ్రామం.పండిత వంశానికి చెందిన వారు సంస్కృతాంధ్రాలలో పండితుడూ,చరిత్ర పరిశోధకుడూ,శాసనాల పరిష్కర్తా శ్రీవేటూరి ప్రభాకర శాస్త్రి స్వయానా ఈయనకు పెదతండ్రి.
వేటూరి సంస్కృతాంధ్రాలు బాగా చదువుకున్నారు.కొంతకాలం పాత్రికేయ వృత్తి స్వీకరించి పత్రికలలో పని చేశారు. ఆకాశవాణిలో ప్రసారమైన వీరి సంగీత నాటిక “సిరికాకొలను చిన్నది” విన్న నటుడు యన్.టి.ఆర్.యెంతో ముచ్చట పడి వీరిని సినిమా రంగానికి రమ్మని ఆహ్వానించారు.
కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.
ఆ తర్వాత కె.విశ్వనాథ్ గారి ప్రోత్సాహంతో “ఓ సీతకథ ” లో “భారతనారీ చరితము ” అనే హరికథ రాశారు. అదే ఆయన మొదటి పాట.
“భక్త కన్నప్ప, సిరి సిరి మువ్వ, అడవి రాముడు” సినిమాలలో పాటలు ఆయనను ఆకాశానికెత్తేశాయి.
ముఖ్యంగా “అడవి రాముడు”లో పాటలుసూపర్ హిట్లు .”ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అనే పాటని కోటి రూపాయల పాట అనే వారు.
పాటని వేగంగా రాయడం, ట్యూన్ కి తగ్గట్టుగా రాయడం,సమయానికి అందించడం, అర్థవంతంగా , భావయుక్తంగా రాయడం వేటూరి ప్రత్యేకతలు.
విశ్వనాథ సత్యనారాయణ, దైతా గోపాలం, ఆచార్య ఆత్రేయ,మల్లాది రామకృష్ణ శాస్త్రి మొదలైన వారి దగ్గర చేసిన శిష్యరికం ఆయనని ఉత్తమమైన పాటల రచయితగా తయారు చేసింది.
ఎటువంటి చిత్రాలూ! ఎంత గొప్ప పాటలూ!” శంకరాభరణం, సాగరసంగమం, ముద్దమందారం, సప్తపది,పంతులమ్మ, ప్రతిఘటన, గీతాంజలి, వేటగాడు, యమగోల”. లిస్ట్ చాలా పెద్దది.
తెలుగు సినిమా చరిత్రలో వేటూరి రాసినన్ని పాటలు యెవరూ రాయలేదంటారు.ఆయన సుమారు డబ్బింగ్ చిత్రాలతో కలిపి వెయ్యికి పైగా చిత్రాలలో అయిదు వేల పాటలు రాశారని అంచనా.ఆయన పాటలకి ఆరు సార్లు నందీ అవార్డులు వచ్చాయి.
“రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే “అనే పాటకి జాతీయ అవార్డ్ లభించింది.(మాతృదేవోభవ).
ఎటువంటి సన్నివేశానికైనా ,ఎటువంటి పాటైనా వేటూరి కలానికి ఎదురు లేదు ,అందుకే ముళ్లపూడి వెంకటరమణ గారు “వేటూరి కి సాటి వేటూరే “అంటారు.
“ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక” అని రాసిన కవే “ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో “అని రాశారంటేనూ,
“ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే ,ఎత్తగలడా సీత జడను తాళికట్టే వేళలో “అని రాసిన కవే “అబ్బ నీ తీయనీ దెబ్బ “రాశారంటేనూ రచయిత ఊహకూ ప్రతిభకూ ఆశ్చర్యంగా వుంటుంది
ఆయన పాటల పల్లవులు మరికొన్ని
ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరా భరణమూ—-శంకరా భరణం.
వ్రేపల్లియ యెద ఝల్లన పొంగిన రవళీ—సప్తపది
వానా వానా వందనం—అడవి దొంగ
చినుకులా రాలి —నాలుగుస్తంభాలాట
సుందరమో సుమధురమో—–అమావాస్యచంద్రుడు
తెలుగు పదానికి జన్మదినం —-అన్నమయ్య.
నీలాలు కారేనా కాలాలు మారేనా —ముద్దమందారం
అ అంటే అమలాపురం—-ఆర్య
ఓ పాపా లాలి —-గీతాంజలి
తమ పాటల నిధిని మనకు వదిలి వేటూరి 2010మేలో తనువు చాలించారు.
సిరివెన్నెల—–

తెలుగు సినిమా పాటను వెన్నెల దారులలో నడిపించిన “సిరివెన్నెల” అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి.ఆయన పాటలు రాసిన “సిరి వెన్నెల “సినిమానే ఆయన ఇంటి పేరుగా చేసుకున్నారు.
వేటూరి తర్వాత అంత పట్టుతో పాటలను రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
తాత్త్వికత, ఆశావహ దృక్పథం, స్ఫూర్తిని రగిలించడం, మానవత్వం, సమానత్వం ఇవన్నీ ఆయన పాటలలో కనపడతాయి.
“జగమంత కుటుంబం నాది” అనే పాటలో అయితే ఒక డిటాచ్మెంటూ,ఒక అటాచ్మెంటూ కూడా కనపడతాయి.
ఆయన పాట రాయడానికి చాలా మథన పడేవారు, చాలా సమయం తీసుకునే వారు తనకు తృప్తిగా అనిపిస్తే గానీ పాట ఇచ్చే వారు కాదు.
ఇక భాష విషయానికి వస్తే లలితమైన తెలుగు పదాల పోహళింపుతో పాటు,అవసరమైతే ఆంగ్లపదాల మేళవింపు కూడా చేయగలరు ఉదా—-“భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ భర్తగ మారకు బాచిలరూ”
“వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసూ”
“బోటనీ పాఠముంది మేటనీ ఆటవుంది దేనికో ఓటు చెప్పరా”
ఆయన రాసిన పాటల్లో ప్రబోధ గీతాలు ప్రత్యేకంగా స్ఫూర్తి దాయకంగా ఉంటాయి. ఉదా—“ఎప్పుడూ ఒప్పు కోవద్దురా ఓటమి”
ప్రేమ గీతాలు రాశారు,కామెడీ పాటలు రాశారు ఇంకా అన్ని రకాల పాటలూ రాశారు
అన్నమయ్య పదాలతో సరితూగే పాటలు కూడా రాశారు ఉదా– “తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ”(స్వాతికిరణం)
సీతారామ శాస్త్రిగారు సుమారు మూడువేల పాటలు రాసి వుంటారని అంచనా.
వారికి అనేక అవార్డులు వచ్చాయి.11నంది పురస్కారాలు లభించాయి.ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.2019లో ఆయన్ని ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.
ఆయన పాటలు రాయడమే కాదు తాను రాసిన పాటలను రెండు చిత్రాలలో పాడారు కూడా అవి “కళ్లు”(తెల్లారింది లెగండో ),”గాయం” (నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని లోకాన్ని)
ఆయన రాసిన పాటల పల్లవులు కొన్ని —–
విధాత తలపున—సిరివెన్నెల
అందెల రవమిది—–స్వర్ణ కమలం
తరలి రాద తనే వసంతం —-రుద్రవీణ
చిలకా ఏ తోడు లేక—–శుభలగ్నం
జగమంత కుటుంబం నాది—–చక్రం
ఆకాశగంగా దూకావే —వాన
నువ్వూ నువ్వూ —ఖడ్గం
ఎవరో ఒకరు ఎపుడో అపుడు—అంకురం
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో—నేనున్నాను
2021లో “నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం “అని రాసిన శాస్త్రిగారి శ్వాస ఆగిపోయింది అయితేనేం ఆయన పాటలు ఎల్లప్పుడూ మనతోనే వుంటాయి
తెలుగుసినిమా పాటను తీర్చిదిద్ది పరిమళాలద్దిన వారు ఎందరో మహాను భావులు
అందరినీ పేరు పేరునా తలుచుకోవడం సాధ్యపడదు స్థలాభావం చేత కొంతమంది గురించే చెప్పడం జరుగుతోంది మన్నించాలి.
వెన్నెలకంటి , భువనచంద్ర, జొన్నవిత్తుల, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ సాధించి పెట్టిన చంద్రబోస్, కులశేఖర్, వనమాలి, జాలాది, మోదుకూరి జాన్సన్ యస్వీ భుజంగరాయశర్మ, దాసం గోపాలకృష్ణ, మైలవరపు గోపి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ,సముద్రాల జూనియర్, అనిశెట్టి, నార్ల చిరంజీవి, ఆలూరి బైరాగి, ముద్దుకృష్ణ ఇంకా ఎంతో మంది కవులు రాశారు రాస్తున్నారు.
అయితే ఒక పచ్చి నిజం ఒప్పుకోక తప్పనిది యేమిటంటే పూర్వం వచ్చిన పాటలలో నూటికి తొంభై బాగుంటే పది బాగుండనివి వుండేవి పాటలో సాహిత్యం చెవికింపుగా వినపడేది. నేడు నూటికి పది పాటలే బాగుంటున్నాయి సాహిత్యమయితే వినపడటం చాలా కష్టం వాయిద్య ఘోషల.
అయినా మళ్లీ మంచి రోజులు వస్తాయనీ ,తెలుగు సినిమా పాట మంచి సాహిత్య విలువలతో చెవికింపుగా వినపడుతుందనీ ఆశిస్తూ ….
