నా చదువు కథ Part 3

Spread the love

నేను ఏడో క్లాసులోకి వచ్చేటప్పటికి నవలలు చదవడం మొదలు పెట్టాను అని చెప్పాను కదా.మొట్ట మొదట చదివిన నవలేదో జ్ఞాపకం లేదు గానీ ,స్కూల్లో మా క్లాస్ టీచరైన “చంద్రం మేష్టారు” (ఆయన అసలు పేరు కానూరి చంద్రశేఖరరావు గారు)ఒక రోజు స్కూల్ లైబ్రరీకి తీసికెళ్లి ,మా క్లాసు పిల్లలందరికీ కొన్ని నవలలు ఇంటికి ఇప్పించి చదువుకోమన్నారు.అప్పుడు నా చేతికొచ్చినపుస్తకాల పేర్లు గుర్తులేవు, రచయితల పేర్లు మాత్రం గుర్తున్నాయి.అవి ఇఛ్ఛాపురపు రామచంద్రం,ఇఛ్ఛాపురపు జగన్నాథం.ఇంకా రవీంద్రనాథ్ టాగోర్ రాసిన “నౌకాభంగం” పుస్తకం కూడా నా కొచ్చిన పుస్తకాలలో వుంది.

ఆ రోజు మేమందరం ఆ పుస్తకాలు చేతపట్టుకుని మహదానందం పొందాము.ఒకక్లాస్  టీచర్ అలా తన క్లాసు పిల్లలకి తరగతి పుస్తకాలతో సంబంధం లేని సాహిత్య పుస్తకాలు చదివే అవకాశం కల్పించడం ఈనాడు  తలుచుకున్నా భలే సంతోషంగా వుంటుంది.

ఆరోజుల్లోనే ఎలా దొరికిందో చలం “దైవమిచ్చిన భార్య” నవల నా చేతికి దొరికింది. 

ఆ పుస్తకం చదువుతున్నంత సేపూ నేను గేలానికి చిక్కిన చేపలా గిలగిలా కొట్టుకున్నాను.ఈ రచయిత యెవరూ?యేం చెపుతున్నాడు? నాయికా నాయకులకు కావలసిందేమిటీ? ఇవేమీ నాకు అర్థంకాకపోయినా ,నన్ను ఆయన వాక్యాలు బలంగా ఆకర్షించాయి. ఆయన నేను చదివిన మిగతా రచయితల కంటే విభిన్నంగా అనిపించాడు.

అప్పటినుండీ నేనాయన పుస్తకాలన్నీ వెదుక్కుని చదువుకున్నాను.”మైదానం,బ్రాహ్మణీకం,అరుణ,అమీనా,జీవితాదర్శం,మ్యూజింగ్స్,ఆయన రాసిన వ్యాసాలు,ఉత్తరాలు ,టాగూర్ కవిత్వానికి అనువాదాలు, ” ఇవన్నీ చదివాను.మ్యూజింగ్స్ చదువుతున్నప్పుడే నాకర్థమయింది నా అభిమాన రచయిత ఆయన అని.నాకు ప్రశ్నలుగా కనపడినవే ఆయనకీ ప్రశ్నలుగా కనిపించడం ,నాకు నచ్చే అనేక అంశాలు ఆయన రచనలలో కనపడడం నా అభిమానానికి కారణం.ఆయన రాసిన ప్రతి అక్షరం చదివాను.ఆయన రాసే అక్షరాలు నేరుగా ఆయన హృదయంలోంచి వచ్చినట్టుంటాయి,శక్తివంతమైన వాక్యం ఆయనది.ముసుగులూ,భేషజాలూ లేవు.నిర్భయంగా తనకు అన్యాయం అనిపించిన దానిని గురించి ప్రశ్నించాడు.స్త్రీలూ,పసిపిల్లలూ,బలహీనులూ వీరి పట్ల  జరిగే దౌర్జన్యాలని నిరసించాడు.

చాలామంది ఆయనని స్త్రీజనోధ్ధారకుడు అనీ,సంస్కర్త అనీ అంటూ వుంటారు.నేను అలా అనుకోను ఆయనకి ప్రత్యేకమైన వాదాలూ,ఇజాలూ లేవు నాకు తెలిసి..తనకు నచ్చని దానిపట్ల తనకు వచ్చిన తీరులో స్పందించడంకష్టంలో వున్న జీవి పట్ల సహానుభూతి చూపడం ఆయన స్వభావం అది మనిషైనా కావచ్చు ఒక పిట్టయినా కావచ్చు.

ఆయన రచనలని జాగ్రత్తగా చదివితే అనేక పొరలు కనపడతాయి.ఆయనలో ప్రకృతి ప్రేమికుడున్నాడు ఉత్త గాలినీ,యెండనీ,పిట్టల అరుపులనీ ప్రకృతి సమస్త సౌందర్యాన్నీ ప్రేమిస్తాడు.

 ఆయనలో హాస్య చతురత నాకు చాలా అబ్బురమనిపిస్తుంది “నాటకం,అట్లపిండి,ఉషారాణితో ఇంటర్వ్యూ,యముడిముందు చలం,ఒరేయ్ వెంకటచలం” ఇలాంటి రచనలు చదువుతుంటే నవ్వాపుకోలేక పొట్ట చెక్కలవుతుంది.

ఆయన చాలా నిశితమైన విమర్శకుడు.”దీక్షితులు గారికి రాసిన ఉత్తరాలు” లో ఆయన తన సమకాలీనుల రచనలని యెంత నిర్దాక్షిణ్యంగా విమర్శించాడో చదువుతుంటే  చాలా ఆశ్చర్యమనిపించింది.ముఖ్యంగా “ఒరేయ్ వెంకటచలం” కథలో తన రచనలని తనే విమర్శించుకోవడం నిజంగా గొప్ప విషయం ,అలా తనని తనే వెక్కిరించుకున్న రచయిత తెలుగులో ఇంకొకరున్నట్టు నాకు తెలియదు.”ఈ లోకం” అనే కథలో అయితే పేడ పురుగుల గురించి రాస్తున్నట్టుగా రాసి మొత్తం సమాజాన్నే వేళాకోళం పట్టించాడు .

అంతే కాదు చలంలో అద్భుతమైన కవి దాగి వున్నాడు “మైదానం” లోనూ,”జీవితాదర్శం” లోనూ,”మ్యూజింగ్స్ “లోనూ,”ప్రేమలేఖలు” లోనూ తరచి చూస్తే బోలెడంత కవిత్వం కనపడుతుంది.అసలు “ఓ పువ్వు పూసింది” అయితే అది ఒక కథ కాదు ఓ కవితాఖండిక అనిపిస్తుంది.చలం రచనలలో కవితలలా అనిపించే భాగాలనన్నింటినీ ఒకచోట కూర్చి ,చలం ఫోటోలని వాటికి కలిపి “కవి గా చలం” అనే పుస్తకం తీసుకు వచ్చారు వజీర్ రహ్మాన్ .వజీర్ రహ్మాన్ యెవరంటే చెట్టుకవి అని పిలుచుకునే ఇస్మాయిల్ గారి తమ్ముడు.ఈయన స్వయంగా కవి,మంచి ఫోటోగ్రాఫర్ ,(మనకు దొరికే చలం గారి ఫోటోలన్నీ చాలావరకూ ఆయన తీసినవే )  చలం గారి మూడోకూతురు “పకపక”ని పెళ్లిచేసుకుని చలం గారికి అల్లుడయ్యారు.

చలంలో నాకు చాలా నచ్చిన విషయం తను చెప్పిందే చేయడం,చేసిందే చెప్పడం.చాలామంది రచయితలకి,చాలా మంది కాదు దాదాపు అందరికీ తమ రచనలు వేరు ,తాము గడిపే జీవితం వేరు.చలం విషయంలో అలా కాదుఆయన జీవితమూ ,సాహిత్యమూ వేరు వేరు కాదు.ఆయన రచనలలో చెప్పినట్టుగానే ఆయన జీవితం నడిచింది.ఆయన నమ్మిన విలువల కోసం బోలెడంత ఆస్తిని తృణప్రాయంగా కాలదన్ని,కోరి పేదరికాన్ని వరించాడు.తాను బతికినన్నాళ్లూ తన ఇంటికి వచ్చేవారి ఆర్థిక పరిస్థితినీ,కులాన్నీ అడగకూడదనే ఆంక్షలని తన ఇంట్లో వారిపై విధించాడు.ప్రాథమికంగా ఆయన జీవితాన్నీ,మనిషినీ ప్రేమించాడు కేవలం స్త్రీనే ప్రేమించాడు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే .జెండర్ భేదం లేకుండా చింతా దీక్షితులు గారిపై ఆయన కురిపించిన ప్రేమ ఈ విషయాన్ని రుజువు చేస్తుంది.( “దీక్షితుల కి లేఖలు”  )

చాలామంది చలం  తన చివరి దశలో రమణాశ్రమం చేరడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వుంటారు .

 ఆయన ఒక నిరంతరాన్వేషి,ఒక సమాధానం యేమైనా దొరుకుతుందేమో అని జీవితాంతం వెతికిన వాడు.ఐహిక సుఖాలలో దొరకని ఆనందం ఆధ్యాత్మికతలో దొరుకుతుందేమోనని చివరివరకూ ప్రయత్నీంచినవాడు.మొదటి నుండీ ఆయన ఈశ్వరుడొకడు వున్నాడని నమ్ముతూనే వుండేవాడు అది ఆయన ప్రతి రచన లోనూ అంతర్లీనంగా కనపడుతూనే వుంటుంది .అందుకే నాకాయన రమణాశ్రమం చేరడం ఆశ్చర్యమనిపించలేదు.

 చలంలో లోపాలు లేవని కాదు ఆ మాటకొస్తే లోపాలు లేని రచన కానీ రచయిత కానీ వుంటారని అనుకోను.కథచెప్పే టెక్నిక్ గొప్పగా వుండకపోవచ్చు,అంతర్జాతీయ కథకుని స్థాయి ఆయనకు లేకపోవచ్చు కానీ ఆ రచన చేయడం వెనక ఆయన ఉద్దేశమూ ,నిజాయితీ  పరిగణన లోకి తీసుకుంటే ఆయన లోపాలని  పట్టించుకోవాలసిన పని లేదు.

ఇంకో విషయం ఆయన  ఏనాటి కి యేది సత్యమని తోస్తే అది చెప్పాడు దీనివలన ఒక చోట చెప్పిన అభిప్రాయానికీ ఇంకోచోట చెప్పిన అభిప్రాయానికి పొంతన వున్నట్టు కనిపించక పోవచ్చు.చలం రచనల్లోని ప్రవాహశీలతని గమనించిన వాళ్లకి ఇది అర్థమవుతుంది.దీనినే ఓపెన్ మైండెడ్ నెస్ అన్నాడు చలం.

చలానికి ప్రాగ్మటిక్ వ్యూ లేదన్నారు నా మిత్రులొకరు,ఇంకా చాలా మంది చాలా అంటారు . నిజమే ఆయన యేదీ తూచి,లాభనష్టాలు బేరీజు వేసుకుని చెయ్యలేదు.నా దృష్టిలో చలం అప్రయత్నంగా ఉరికే జలపాతం,ప్రచండంగా వీచే ఝంఝామారుతం.అందుకే ఇస్మాయిల్ గారు ” చలంమీద ఆరోపణలు చెయ్యడం టోర్నడోకి ట్రాఫిక్ రూల్స్ తెలీదని మొత్తుకున్నట్టుంటుంది   ఆయన ఒక మహత్తర శక్తి” అంటారు. చలం మీద పి.హెచ్ .డి చేసిన వాడ్రేవు వీరలక్ష్మిగారు తన సిధ్ధాంత గ్రంథం “సత్యాన్వేషి చలం” లో చలాన్ని “హృదయవాది “అని  నిర్వచించారు .నిజం ఆ మాట.

ఆయనను కలవాలని తపించి పోయాను.ఆయనని కలవ లేకపోయాను కానీ దాదాపు ఆయన కుటుంబసభ్యులందరినీ కలిశాను,వారితో ఈనాటికీ నా అనుబంధం కొనసాగుతోంది. 

అన్నట్టు చలం గారు తన కుటుంబ సభ్యులందరికీ తన రచనలలో స్థానం కల్పించి వారి ఉనికి శాశ్వతం చేశారు. ఆయన రచనలన్నీ చదివిన వారు షౌనీ,డాలీనీ,చిత్రనీ,నర్తకినీ ఇతర కుటుంబ సభ్యులనీ ఇట్టే గుర్తు పడతారు.ఇలా చేసిన రచయితలు తెలుగులో  లేరనుకుంటాను ఇంగ్లీషులో వున్నారేమో మరి!

చలం పుస్తకాలు నాకు ప్రేమించడం నేర్పాయి,ప్రశ్నించడం నేర్పాయి,ఆలోచించడం నేర్పాయి,సృష్టిలో సౌందర్యాన్ని చూడడం నేర్పాయి,జీవితానందాన్ని రుచిచూపాయి అవిచదివాకే నాకు హృదయంతో జీవించడమెలాగో తెలిసింది అది చాలు నాకు.

ఏడవ తరగతి వేసవి శెలవులలో మా ఊరి లైబ్రరీ నుండీ పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. అలా చదివిన పుస్తకాలలో ఒక పుస్తకం నాకు అత్యంత ప్రియమై కూచుంది.అదే హకల్ బెరీ ఫిన్

ఈ పుస్తకం ఈ నాడు చదివినా ఆనాడు మొదటిసారిగా చదివినంత ఉల్లాసం పొందుతాను నేను. ఈ పుస్తకం రాసిన మార్క్ ట్వేన్ ప్రసిధ్ధ అమెరికన్ రచయిత. ఆయన అసలు పేరు శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్.  ఆయన 1884లో అంటే దాదాపు నూటనలభైయ్యేళ్ల క్రితం రాసిన పుస్తకం ఈ హకల్ బెరీఫిన్. అయితేనేం అందరూ మనసారా  నవ్వుకునే ఆరోగ్యకరమైన హాస్యానికి చిరునామాలు ఈయన రచనలు

హకల్ బెరీ ఫిన్ కంటే ముందు అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అనే పుస్తకం రాశాడాయన.కానీ దానికంటే హకల్ బెరీ ఫిన్నే బాగుంటుంది నాకు.మార్క్ ట్వేన్ పుస్తకాలని(హకల్ బెరీ ఫిన్ ,టామ్ సాయర్ ,విచిత్ర వ్యక్తి) తెలుగులోకి అత్యంత అద్భుతంగా అనువాదం చేసిన వారు నండూరి రామ్మోహన్రావు గారు.ఆయన అనువాదాలు చదివాక నాకు ఒరిజినల్ చదవాలని అనిపించలేదు అదీ ఆయన గొప్పదనం.

ఈ సమాజంలోని డొల్లతనాన్ని వెక్కిరిస్తూ,మానవ స్వభావం లోని కపటత్వాన్ని యెత్తి చూపిస్తూ ,బానిసత్వాన్ని నిరసిస్తూ,హాస్యం చమత్కారం,వ్యంగ్యం సమపాళ్లలో మేళవించిన మార్క్ ట్వేన్ రచనలు ప్రపంచ సాహిత్యం మీద చెరగని ముద్రవేశాయి.

 హకల్ బెరీ ఫిన్ లో రచయిత నాగరీకులమనే పెద్దలను వేళాకోళం చేస్తూ యెంత హాస్యం సృష్టిస్తాడో!.మిసిసిపీ నది మీద పది పన్నెండేళ్ల పిల్లవాడుహక్ ఫిన్, నీగ్రో నౌకర్ జిమ్ తో కలిసి చేసే పడవప్రయాణాలు మంచి మజాగానూ, ఆసక్తికరంగానూ వుంటాయి. హక్ ఫిన్ తో బాటు మనమూ ఆ చిన్న పడవలో విహరిస్తాము, నవ్వుతాము, ఏడుస్తాము, వింత ప్రదేశాలను,వింత మనుషులనూ చూస్తాము.అందుకే ఈ పుస్తకాన్ని ఇష్టపడని వారుండరు.

చిన్నపిల్లలయినప్పటికీ, వర్ణ వివక్ష తీవ్రంగా వున్న ఆనాటి పరిస్థితులలో  ఒక నీగ్రోని రక్షిస్తే శిక్ష కు గురి అయ్యే   ప్రమాదం వున్నప్పటికీ ,నీగ్రో నౌకర్ జిమ్ ని బానిసత్వాన్నుండీ తప్పించడానికి హక్ ఫిన్నూ,టామ్ సాయరూ ఇద్దరూ కలిసి చేసే ప్రయత్నాలు చదువరులకు  హాస్యస్ఫోరకంగావుండటమే కాక, వారిలోని మంచితనాన్నీ, మానవత్వాన్నీకూడా చాటిచెబుతాయి.అలా రాయడం సామాన్యమైన విషయం కాదు.అందుకే ఆయన రచయితలకే రచయిత.

ఎంతోమంది రచయితలని ప్రభావితం చేశాడు కూడా

ఆయన ఈ పుస్తకాలు రాసి దాదాపు నూటనలభైయేళ్లయినప్పటికీ ,వాటిలోని విషయాలునేటికీ నిత్యనూతనంగా అనిపించడం గొప్ప సంగతి.

అందుకే మార్క్ ట్వేన్ ని కాలాని కి నిలబడే  రచనలు చేసినప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో చేరుస్తారు.ఆయన పుస్తకాలయిన హకల్ బెరీ ఫిన్ ,టామ్ సాయర్ ,సినిమాలుగా కూడా వచ్చాయి .

అమెరికా లోని డిస్నీలాండ్ లో టామ్ సాయర్ పేరు మీద ఒక థీమ్ పార్క్ కూడా చూశాను నేను.

ఎప్పుడయినా మనసు లో కొంచెం దిగులుగా అనిపించినప్పుడు నేను పట్టుకునే పుస్తకం హకల్ బెరీ ఫిన్ దానితో నా దిగులంతా చేత్తో తీసేసినట్టుగా మాయమవుతుంది.అందుకే మార్క్ ట్వేన్ నా అభిమాన రచయిత——-(సశేషం)

డా. రొంపిచర్ల భార్గవి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *