11. సంత…..లో
ఒక అందమైన పల్లెటూరి యువతి సంతకు
వస్తుంది. ఆమెముఖం కలువ, గులాబీల మృదుత్వాన్ని సంతరించుకుంది. నల్లటి మేఘాలాంటి కురులు. పెదవులపై ఉషోదయం లాంటి హాసం.
ఆ అందమైన యువతి వారి దృష్టిలో పడగానే, సంతలోని యువకులు కోరికతో ఆమెను
చుట్టుముట్టారు. ఒకడు ఆమెతో నాట్యం చేయడానికి తయారైతే, ఇంకొకడు ఆమె కోసం కేకు తీసుకు వచ్చాడు. అందరి కోరికా ఆమెను ముద్దాడాలనే! సంత కదా!
ఆ యువతి కంగారు పడింది. ఆశ్చర్య పోయింది ! వాళ్ళను చెడుగా అనుకుంది. మంద లించింది. ఒకరిద్దరిని ముఖంమీద కొట్టింది కూడా!
తరవాత వాళ్లనుండి దూరంగా పరిగెత్తింది.
ఇంటికి వెళుతూ తనలో తాను ఇట్లా నుకుంది. ” నాకు అసంతృప్తి గానూ, చిరాగ్గాను ఉంది. వాళ్ళు ఎంత అసభ్యంగా, కుసంస్కారంగా ప్రవర్తించారు ! వారి ప్రవర్తనతో నా సహనం నశించింది.”
ఏడాది గడిచింది. ఆ ఏడాదిలో ఆమె మనుషుల ప్రవర్తన గురించి, సంతల గురించీ చాలా ఆలోచించింది. అదే నాజూకైన ముఖంతో, నల్లటి కురులతో, ఉషోదయ హాసంతో ఆమె మరలా సంతకు వచ్చింది.
ఈసారి యువకులు ఆమెను చూసి ముఖం తిప్పుకున్నారు. పలకరించే వారు కరువై , రోజంతా ఆమె ఒంటరిగానే తిరిగింది.
ఆ సాయంత్రం ఇంటికి వెళుతూ మనసులో దుఃఖంతో ఇట్లా అనుకుంది. ” నాకు అసంతృప్తి గానూ, చిరాగ్గాను ఉంది. వాళ్ళెంత అసభ్యం గాను, కుసంస్కారులు గానూ ఉన్నారు . నా సహనం నశించింది!”
సంచారి తత్త్వాలు
12. సన్యాసి — జంతు జాలం
ఒకానొకప్పుడు పచ్చని కొండల మధ్య ఒక సన్యాసి నివాసం ఉండేవాడు. అతడు ఆత్మశుద్ధి మరియు స్వచ్ఛమైన మనసు కల వాడు. భూచరాలైన జంతువులు, ఆకాశ యానం చేసే గ్రద్ద, రాబందుల లాంటి పక్షులు జంటలుగా అతని వద్దకు వచ్చేవి. వాటితో ఆ సన్యాసి మాట్లాడేవాడు. అవి ఆయన చెప్పే మాటలు సంతోషంగా వినేవి. రాత్రి అయ్యే వరకు కదిలేవి కావు. అప్పుడాయన వాటిని ఆశీర్వదిస్తూ , వాటి నివాసాలకు సాగనంపేవాడు.
ఒక సాయంత్రం వేళ ఆ సన్యాసి వాటికి ‘ప్రేమ’ గురించి చెప్పసాగాడు. ఇంతలో ఒక చిరుత పులి ఇలా అంది ” స్వామీ ! మీరు ప్రేమ గురించి చెబుతున్నారు. మరి మీ సహచరి ఎక్కడ?”
“నాకు సహచరి లేదు.” అని సన్యాసి జవాబిచ్చాడు.
జంతువులు, పక్షులు ఒక్కసారిగా ఆశ్చర్యంతో అరిచి వాటిలో అవి ఇలా అనుకోసాగాయి ! ” సహచరియే లేనప్పుడు ఈయన మనకు ప్రేమ, శృంగారం గురించి ఏమి తెలుసునని చెబుతాడు ?!’
అవి నెమ్మదిగా తృణీకార భావంతో అక్కడినుండి వెళ్లిపోయాయి.
ఆ రాత్రి సన్యాసి పడక మీద బోర్లా పడుకొని గుండెలవిసేలా దుఃఖించాడు.
సంచారి తత్త్వాలు
13. స్వప్నాలు
ఓ మనిషి ఒక కల కన్నాడు. మెలకువ వచ్చిన తరువాత అతను ఒక భవిష్యత్తు చెప్పే గురువు దగ్గరకు వెళ్లి తన కలకు అర్ధం వివరించమని కోరాడు.
ఆ గురువు అన్నాడు కదా ! “నీవు మెలకువలో ఉన్నప్పుడు కన్న కలలతో నా దగ్గరకు రా! వాటి అర్థం వివరిస్తాను. నీవు నిదురలో కన్న కలలు నా బుద్ధికీ అందవు. నీ ఊహాలకూ అందవు.
14. ప్రజలే ప్రభువులు
సాదిక్ సామ్రాజ్య ప్రజలు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ రాజ భవనాన్ని చుట్టు ముట్టారు. రాజు ఒక చేతిలో కిరీటం, రెండో చేతిలో రాజ దండం పట్టుకుని ప్రాసాదం మెట్లు దిగి వచ్చాడు. అతని గంభీరత చూసి ప్రజలు మౌనం దాల్చారు. రాజు వారి ముందు నిల్చొని ఇలా అన్నాడు. ” మిత్రులారా! ఈ కిరీటమూ మరియూ రాజా దండం ఇంకెంత మాత్రమూ నాకు చెందినవి కావు. మీకు స్వాధీన పరుస్తున్నాను. నేనూ మీలో ఒకడినవుతాను. మన రాజ్యం మేలు కోసం మీతో కలిసి పని చేస్తాను. ఇంక రాజు అవసరం లేదు. మనందరం పొలాల్లోకి, ద్రాక్ష తోటల్లోకి వెళ్లి, చేయీ చేయీ కలిపి పని చేద్దాం. నేను ఏ పనికి వెళ్ళాలో మీరే నిర్ణయించండి. ఇపుడు ప్రతి ఒక్కరూ రాజే.”
ప్రజలు ఆశ్చర్య పోయారు. ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. ఇప్పటి వరకూ వారి అసంతృప్తికి ఎవరు కారణమనుకుంటున్నారో , ఆ రాజే స్వయంగా కిరీటమూ, రాజ దండమూ వారికిచ్చేసి వాళ్లలో ఒకడయిపోయాడు.
తరువాత ఎవరికి వారు వారి పనుల్లోకి వెళ్లి పోయారు. రాజు కూడా వారిలో ఒకనితో కలిసి పొలానికి వెళ్ళాడు.
కాని, రాజు లేకుండా సాదిక్ సామ్రాజ్యం ఏమీ మెరుగు పడలేదు. అసంతృప్తి అనే మంచు పొర ఇంకా ఆ సామ్రాజ్యాన్ని కప్పుకునే ఉంది. “మనల్ని పరిపాలించడానికి ఒక రాజు తప్పకుండా కావాలి. ” అని జనాలంతా బజారుల్లో హాహాకారాలు చేయసాగారు. పిన్నలూ, పెద్దలూ అందరూ ఏక కంఠంతో “మనకు రాజు కావాలి.” అన్నారు.
పొలంలో శ్రమించే రాజును వెతికి పట్టుకున్నారు. అతని చేతికి కిరీటము, రాజ దండం ఇచ్చి సింహాసనం ఎక్కించారు. వారు రాజుతో ఇలా అన్నారు “మమ్మల్ని న్యాయంగా, సమర్థతతో పరిపాలించండి.”
రాజు వారితో “నేనైతే సమర్థతతో పరిపాలిస్తాను. న్యాయంగా పాలించడానికి భూమి మరియు ఆకాశ దేవతలు నాకు తోడ్పడతారని ఆశిస్తున్నాను.” అన్నాడు.
ఒక రోజు ప్రజలు (ఆడా, మగా ) అంతా కలిసి రాజు దగ్గరికి వచ్చారు. వారి పట్ల దుష్ప్రవర్తనతో ఉంటూ , వారిని సేవకులుగా చూసే ఒక జమీందారు గురించి ఫిర్యాదు చేశారు. వెంటనే రాజు ఆ జమీందారుని పిలిపించి , అతనితో ఇట్లా అన్నాడు ” భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమే. నీవు, నీ పొలంలోను, ద్రాక్ష తోటలలోను పని చేసేవారిని నీతో సమానంగా చూసుకోవడం లేదు. కాబట్టి నిన్ను ఈ రాజ్యం నుండి బహిష్కరిస్తున్నాను. వెంటనే రాజ్యం వదిలి పో!”
మరుసటి రోజు మరి కొంత మంది ప్రజలు వచ్చారు. కొండల వెనుక ఉన్న వారి ప్రాంతపు దొరసాని యొక్క క్రూరత్వాన్ని గురించి మనవి చేసుకున్నారు. ఆమె వారిని ఎన్ని బాధలు పెడుతోందో చెప్పారు. వెంటనే రాజు అమెను సభకు పిలిపించి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తూ ఇట్లా అన్నాడు .” నిరంతరం మన పొలాల్లోనూ, ద్రాక్ష తోటల్లోనూ శ్రమించే ప్రజలు- వారు చేసిన రొట్టెలు తినే, ద్రాక్ష సారా తాగే మనకంటే – ఉన్నత మైన వారు. నీకు ఇది కూడా తెలీదు కాబట్టి నీవు ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ల వలసిందే !”
తరువాత మరి కొంత మంది ప్రజలు వచ్చి, వారి బిషప్ మీద ఇట్లా ఫిర్యాదు చేశారు. “ఆ బిషప్ చర్చి కట్టడానికి పెద్ద రాళ్ళను తెఛ్చి, వాటిని చెక్కమని చెప్పి మాతో పనులు చేయించుకుని, మాకు ఏమీ ఇవ్వలేదు. ఒక వైపు మేము డబ్బు లేక తిండి లేక బాధ పడుతుంటే, బిషప్ మాత్రం తన పెట్టెను బంగారం, వెండితో నింపుకున్నాడు.”
రాజు వెంటనే బిషప్ ను పిలిపించి ఇట్లా అన్నాడు ” నువ్వు నీ మెడలో ధరించిన శిలువ యొక్క అర్థం ఏమిటో తెలుసా? నువ్వు ప్రజలకు అండగా ఉండాలి. కాని నీవు వారి జీవితాలను దోచుకుంటున్నావు. అందుచేత జీవితాంతం నిన్ను దేశ బహిష్కరణ చేస్తున్నాను.”
అలా ఓ పక్షం రోజుల్లో ప్రజలు వచ్చి రాజుకు వారి బాధలు చెప్పుకోవడమూ , ఆ పక్షంలో ప్రతి రోజూ, రాజు ఒక దోపిడీ దారుని రాజ్య బహిష్కరణ చేయడమూ జరిగింది.
సాదిక్ ప్రజలు ఆశ్చర్య పోయారు. వారి హృదయాలు ఆనంద భరిత మయ్యాయి.
తదుపరి ఒక రోజు యువకులు, పెద్దలు అందరూ కలిసి, రాజ ప్రాసాదానికి వచ్చి రాజుని చూడాలని అడిగారు. రాజు, కిరీటం ఒక చేతిలో, రాజ దండం మరో చేతిలో పట్టుకుని కిందకు దిగాడు.
రాజు వారితో ఇలా అన్నాడు ” ఇప్పుడేం చేద్దాం? చూడండి, మీరు కోరినట్లుగా రాజ్యాధికారం తీసుకున్నాను. మరల మీకే అప్పగిస్తున్నాను.”
ప్రజలు ఏడుస్తూ ఇలా అన్నారు ” లేదు! లేదు ! మీరే మాకు సరైన రాజు. రాజ్యంలో విష సర్పాలు లేకుండా చేశారు. తోడేళ్లను తరిమేశారు. మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటానికి వచ్చాం. మీరే ఆ కిరీటానికి ఘనత, రాజ దండానికి కీర్తి తెఛ్చిపెట్టారు. అవి మీకే చెందుతాయి.”
అపుడు రాజు ఇలా అన్నాడు ” నేను కాదు! మీకు మీరే ప్రభువులు ! నన్ను బలహీనుడు గాను, చెడ్డ రాజు గానూ భావించినపుడు మీకు మీరే బలహీనులుగా ఉన్నారు. మిమ్మల్ని మీరే చెడుగా పరిపాలించుకున్నారు. ఇపుడు ఈ రాజ్యం చాలా బాగా ఉందంటే – అది మీ కాంక్ష మూలంగానే ! నేను మీ మనసుల్లో ఒక భావాన్ని మాత్రమే . ప్రభువు అనేవాడు ఎవరూ లేరు. ఎవరికి వారే వారిని పాలించుకుంటారు. “
కిరీటమూ, రాజా దండం పట్టుకుని మరల రాజు కోటలోకి వెళ్ళాడు. ప్రజలు సంతృప్తిగా ఇంటి ముఖం పట్టారు.
ఒక చేత్తో కిరీటం, ఇంకో చేతిలో రాజ దండం పట్టుకున్నట్లుగా ఊహించుకుని, ప్రతి ఒక్కరూ – వారికి వారు రాజుగా భావించుకున్నారు.
సంచారి తత్త్వాలు
15. మూడు కానుకలు
——————
ఒకానొకప్పుడు బచారే నగరంలో ఒక దయగల రాజు ఉండేవాడు. అతనంటే ప్రజలందరికీ ప్రేమ, గౌరవమూనూ!
ఆ నగరంలో ఒక నిరుపేదకు మాత్రం రాజంటే పడేది కాదు. అతడు అస్తమానమూ రాజుని తెగుడుతూ నోరు పారేసుకునేవాడు. రాజుకా విషయం తెలిసినా గాని సహనంగా ఉన్నాడు.
చివరిగా రాజు అతని గురించి ఆలోచించాడు. ఒక శీతాకాలం రాత్రి రాజు గారి సేవకుడు మూడు కానుకలు పట్టుకొని ఆ నిరుపేద ఇంటికి వచ్చాడు. అవి ఏమిటంటే –
1.ఒక సంచి గోధుమ పిండి
2. ఒక సంచి సబ్బులు
3.ఒక చక్కెర సంచి.
” రాజు గారు వారి గుర్తుగా ఈ బహుమతులు నీకు పంపారు.” అని ఆ పేద మనిషితో సేవకుడు చెప్పాడు.
అతని పట్ల మర్యాదతో రాజు ఆ బహుమతులు పంపాడని తలచి పేద మనిషి పొంగిపోయాడు. అప్పుడు అతను బిషప్ దగ్గరకు గర్వంగా వెళ్లి ఇట్లా అన్నాడు ” నా సద్భావన రాజు కోరుకుంటున్నాడని నీకు అర్ధమవుతోందా ?”
బిషప్ ఆ పేద మనిషితో ఇట్లా అన్నాడు ” రాజు ఎంత తెలివైన వాడు ! నీకేమర్ధమయ్యింది ? ఆయన (రాజు) ఆ వస్తువుల ద్వారా నీకు సంకేతాలు ఇచ్చాడు. నీ ఆకలి తీర్చడానికి గోధుమ పిండి, నీ పరిశుభ్రత కోసం సబ్బులు, నీ వాక్కులో కాఠిన్యం తగ్గించడానికి చక్కెర పంపాడు.”
ఆ రోజు నుండి ఆ పేద మనిషి తనను చూసి తానే సిగ్గు పడసాగాడు. రాజు పట్ల ద్వేషం మునుపటి కంటే ఎక్కువైంది. రాజు ఆలోచన గురించి వివరించిన బిషప్ ను రాజు కంటే ఎక్కువ ద్వేషించ సాగాడు.
కాని , ఆ తరువాత అతను మౌనం దాల్చాడు.
