సేకరణ

Spread the love

ధాన్య సేకరణకోసమని జిల్లా ప్రొక్యూర్‌మెంటు కమిషనర్ తాలూకా ముఖ్య నగరానికి వచ్చాడు. నున్నటి నీలిరంగు బుగ్గల్ని నొక్కుకుంటూ తొందరగా చదవసాగాడా ప్రకటన.

“మీకు ఒప్పచెప్పిన తాలూకాకు సంబంధించిన గణాంకశాస్త్రపు లెక్కల ప్రకారం ఆ తాలూకా లక్షా యాభైవేల పూడ్ల ధాన్యం సమర్పించాల్సి వుంది. కామ్రేడ్ బొద్వాగిన్! మీరు కార్యదక్షులనీ, సాహసికులయిన కార్యకర్తలనీ నాకు తెలుసు. అందుకనే ఆ తాలూకాలో ప్రొక్యూర్‌మెంటు పనికి మిమ్మల్ని నియమించడమయింది. ఈ కార్యాన్ని మీరు జయప్రదంగా నిర్వహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక నెల గడువుంది. రివల్యూనరీ ట్రిబ్యూనలు అక్కడికి వచ్చి సైన్యానికీ, కేంద్రానికీ ధాన్యం యెంత అవసరమో…” అని చదువుకుపోయాడు.

సూదిగా పొడుచుకొస్తున్న గొంతు ముడిని అరచేతి అంచుతో కిందకీమీదకీ తడుముకుంటూ ‘దుష్టబుద్ధితో ధాన్యం దాచేసేవాళ్ళని గుండేసి కాల్చేయాల్సిందే’ అనుకున్నాడు.

తర్వాత నున్నగా గుండుచేసిన తలకాయని పంకించి గదిలోంచి బయటకెళ్ళిపోయాడు.

పిచికల్లా వెనక్కి పరుగెత్తుతూన్న టెలిగ్రాపు స్తంభాలు “ప్రొక్యూర్‌మెంటు, ప్రొక్యూర్‌మెంటు” అంటున్నాయి. గూడేల్లోనూ, పల్లెల్లోనూ కాస్సాకులు బుటేదారీ ధట్టీలను బానకడుపులచుట్టూ గట్టిగా బిగించారు. పూర్వాపరాలు ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే నిశ్చయం చేసుకున్నారు.

“ఉత్తపుణ్యానికే గింజలిచ్చేయడమా? చస్తే ఇచ్చేదిలేదు” అని తేల్చుకున్నారు. ముంగిళ్ళలోనూ, వీధుల్లోనూ ఒక చోటేమిటి, ఎక్కడపడితే అక్కడ రాత్రిళ్ళు గోతులు తవ్వి, ఆ గోతుల్లో పదులూ, పాతికలూ కావు వందల పూడ్ల గోధుమలు చక్కగా బాగుచేసినవి పూడ్చి పెట్టేశారు. ప్రతివాడికీ తెలుసు, తన పొరుగువాడు ఎన్ని గోధుమల్ని దాచినదీ, ఎక్కడ దాచినదీ, ఎలా దాచినదీను.

కాని ఎవ్వడూ నోరు విప్పలేదు.  బొద్వాంగిన్ తన ప్రొక్యూర్‌మెంటు దళంతో తాలూకంతా తిరుగుతున్నాడు. బండిచక్రాలు కరకరమంటూ మంచుమీద పరిగెడుతున్నాయి. సన్నని మంచుపడిన చెట్లరెమ్మల దళ్ళ పక్కనుండి చెరచేరా పరుగెడుతున్నాయి. సాయంకాలపు కనుచీకటి. అన్ని గూడేలు వంటిదే ఈ గూడెమున్నూ. కాని బొద్వాగిన్‌కి మాత్రం ఇది ప్రత్యేకమయినది. ఇది తనుపుట్టిన గూడెం. ఆరేళ్ళయింది. తనగూడెం వదిలిపెట్టి….మళ్ళీ ఇదే రావడం.

జూలై ఎండలు నిప్పులు కక్కుతున్నాయి. పొలాలగట్లంట పసుప్పచ్చని కేమోమైల్ పువ్వులు, పంటకోతలు అన్నీ వెనకట్లాగే వున్నాయి. అప్పుడు తనకి ఇగ్నోష్క బొద్వాగిన్‌కి పధ్నాలుగేళ్ళు.

తండ్రి, తనూ, కమతగాడూ పైరు కోస్తున్నారు. కమతగాడు పనలు కూడదీస్తున్నపుడు వాడి చేతిలోవున్న పంటికర్ర పన్నొకటి విరిగిపోయిందని తండ్రి వాణ్ణి చితగ్గొట్టాడు. అదిచూసి ఇగ్నోర్ తండ్రిదగ్గరికి పరుగెత్తుకెళ్ళి పళ్ళుబిగించి తండ్రితో అన్నాడు…

“నువ్వొట్టి పంది వెధవ్వి నాన్నా!”

“నేనా?”

“నువ్వే!”

తండ్రి పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు కొడుకుని. దాంతో ఇగ్నోర్ కిందపడ్డాడు. తండ్రి పటకా విప్పుకుని వాడి వొంటినుండి రక్తాలు కారేవరకూ బాదాడు. పొలం నుండి సాయంకాలం ఇంటికెళ్ళిన తరువాత తండ్రి తోట్లోకెళ్ళి చెర్రీ కొమ్మ ఒకటి నరికి దాన్ని సాపుగా చెక్కి, గెడ్డం సవరించుకుని మడకర్రని ఇగ్నోర్ చేతిలో పెట్టి-

“ఒరే అబ్బాయ్! ఇహ నీ బతుకేదో నువ్వు చూసుకో. నువ్వు బుద్ధీ జ్ఞానమూ సంపాదించావు. ఈ ఇంటిమొహంనువ్విక చూడక్కరలేదు.” అన్నాడు వంకర నవ్వు నవ్వుతూ.

అలా జరిగిందానాడు. ఇప్పుడు బండి కంచెదళ్ళవెంట మంచు మీద కరకరమంటూ వెళ్ళింది. పూరిగుడిసెల పక్కనుండీ, రంగు రంగుల కిటికీల ముందు నుండీ పరుగెత్తుతోంది. తండ్రి తోట కోరడికున్న కూచిపోప్లార్ చెట్లూ, ఇంటి కప్పు మీద కుక్కొరోకో అని కూయకుండానే రెక్కలు చాచుకున్న తగరపురేకు కోడి పక్క నుండి పారిపోవడం చూశాడు. తన గొంతుకలో ఏదో అడ్డుకున్నట్టూ, తనకి ఊపిరాడనట్టూ అనిపించింది. తను బసచేసిన ఇంటతన్ని సాయంకాలం అడిగాడు.

“ముసలాయన బొద్వాగిన్ బాగున్నాడా?”

ఇంటతను గుర్రపు జీను మరమ్మత్తు చేసుకుంటూ కర్పూరతైలం పూసుకున్న వేళ్ళతో గుర్రపు వెంట్రుకల్ని తీగలాపేన్తూ కళ్ళు చికిలించి,

“బాగుండకేం—-రోజుకి రోజూ సంచుల కొద్దీ డబ్బు సంపాదిస్తున్నాడు. పెళ్ళాం ఏనాడో చచ్చిపోయింది. ఈమధ్యనే మళ్ళీ ఓ కొత్త ఆడదాన్ని చేరదీశాడు. కొడుకెక్కడికిపోయాడో మరి కనబడ్లేదు. మరి తలనెరసిన ముసలాడు సోల్జర్ల పెళ్ళాల వెంట పడుతున్నాడు” అన్నాడు.

తర్వాత గొంతుక మార్చి గంభీరంగా అన్నాడు-

“అతడంటే నాకేం కోపం లేదు. తెలివైన బుర్ర. అతడితో మీకు పరిచయం వుందా ఏమిటి?”

మర్నాడు ఉదయం ఫలహారం అయినాక, రివల్యూషనరీ ట్రిబ్యూనలు సమావేశం అయినప్పుడు ట్రిబ్యూనలు అధ్యక్షుడు అన్నాడు-

“నిన్న జరిగిన గ్రామస్థుల సమావేశంలో ఇద్దరు కులాక్కులు అందోళన లేవదీశారు – కొస్సాల్‌లు ధాన్యం ఇవ్వకూడడని. ఓ ఇల్లు సోదా చేస్తూండగా ప్రతిఘటన జరిగింది. ఆ ప్రతిఘటనలో ఇద్దరు ఎర్ర సైనికుల్ని తీవ్రంగా కొట్టారు కూడానూ. ఇందుకు యధావిధిగా ఒక కోర్టుని నియమించి, నేరస్తులకి తగిన శాస్తి చెయ్యాలి”

గతంలో పీపాలు తయారు చేసే ఓ వడ్రంగి ఆ ట్రిబ్యూనలుకి అధ్యక్షత వహించి, గ్రామ సంఘం ఆఫీసులో నలుచదరంగా వున్న వేదికపైన కూచున్నాడు. కచ్‌కచ్‌మని చప్పుడవుతూన్న కొత్త ఉక్కు రేకు పట్టీని చెక్కబాల్చీ చుట్టూ మేకులేసి కొడుతూన్నట్లు అరిచాడు. “గుండేసి కాల్చేయండి!”

ఇద్దర్నీ గుమ్మంలోంచి తీసుకుపోతున్నారు. ఇద్దర్లోనూ వెనకవాడు తన తండ్రియని పోల్చుకున్నాడు వెనక నుండి వస్తూన్న బొద్వాగిన్. కాస్త ఎరుపెక్కిన గడ్డపుటంచులనున్న వెంట్రుకలు మాత్రం నెరుస్తున్నాయి. ముడుతలు పడిన నలుపు మెడకేసి అలా చూస్తూ వెనుకనుంచి వెళ్ళిపోయాడు బొద్వాగిన్.

పోర్చిలో మెట్లదగ్గిరున్న పహరా సైనికుడితో చెప్పాడు బొద్వాగిన్-

“ముసలతణ్ని నాదగ్గిరకి తీసుకురా!” నడుం వంగిపోయి అడుగులు భారంగా వేసుకుంటూ వచ్చాడు ముసలాడు. కొడుకుని గుర్తుపట్టగానే ముసలాడి కళ్ళల్లో రెప్పపాటు నిప్పురవ్వలు కురిశాయి. తరువాత మళ్ళీ ఆరిపోయాయి. గుబురుగా వున్న కనుబొమల కింద అతని కళ్ళు అవుపించడమే లేదు.

“ఎర్రవాళ్ళ పక్షాన చేరావా అబ్బాయీ?”

“అవును నాన్నా.. ఎర్రవాళ్ళ పక్షాన్నే”

“అ..లా..గా..” అంటూ మొహం తిప్పేశాడు ముసలాడు.

ఇద్దరూ కాస్సేపు మౌనంగా వుండిపోయారు.

“ఆరేళ్ళయింది ఒకరినొకరం చూసుకుని. మాట్లాడుకోడానికి మనకి మాటలే లేవా నాన్నా?” అన్నాడు కొడుకు.

ముసలాడు ఆగ్రహంతో తిరస్కారంగా కనుబొమలు ముడిపెట్టాడు.

“ఏమీ లేనట్టే… నీ దారీ, నా దారీ వేరయ్యాయి. నా సంపాదన్ని నేను జాగ్రత్త పెట్టుకున్నందుకూ, నా ధాన్యపు కొట్లల్లోకి పైవాళ్ళెవర్నీ తలదూర్చనివ్వనందుకూ నన్ను గుండేసి కాల్చేస్తున్నారు. సరే…నేను విప్లవ ప్రతీఘాతకుణ్నే! కాని ఏ చట్టం ప్రకారం పరాయివాడి ధాన్యపు కొట్టుని దోచుకుంటున్నారు మీరు? మీకు బలం వుంది కనుక దోచుకుంటున్నారు” అన్నాడు.

కమిస్సార్ బొద్వాగిన్ ముఖం మీద సూదిగా పైకి పొడుచుకొస్తూన్న దవడ ఎముకలపైన చర్మం వెలిమిడి కచ్చికలా వెల్లబారింది.

“మేం బీదవాళ్ళని దోచుకోవడం లేదు. కాని పరాయివాడి కాయకష్టాన్ని దోచుకొన్నవాళ్ళనే మేం దోచుకుంటున్నాం. కమతగాళ్ళ బతుకుల్ని పీల్చి పిప్పిచేయడంలో నువ్వు మొనగాడివి” అన్నాడు కొడుకు.

“నేను కష్టపడ్డాను. పగలనక రాత్రి అనక దేశాలమ్మట తిరగలేదు నీలాగ! “

“కష్టపడిన వాళ్ళందరూ కార్మిక కర్షకుల రాజ్యంవెనక నిలబడుతున్నారు. మరి నువ్వేమో వాళ్ళని కొరడాతో ఎదుర్కొన్నావు. నీ ఇంటికంచె గోడవరకేనా రానిచ్చావు కావు. కనుకనే అంతిమ యాత్రకి అడుగులేస్తున్నావు….”

ముసలాడు వొగర్చుకుంటున్నాడు. ఊపిరి తెరలుతెరలుగా వస్తూంది. అతడు మాటాడబోయేసరికి గొంతుక వెలుగు రాసిపోయి అంతవరకు వాళ్ళిద్దరిని బంధించిన దారంలా తునాతునకల కింద తెగిపోయి ధ్వనించింది.

“నువ్వు నాకు కొడుకువికావు. నేను నీకు తండ్రినికాను. తండ్రిని ఇలాంటి మాటలాడినందుకు నీకు ముమ్మాటికీ నరకం తప్పదురా. శపిస్తున్నానురా నిన్ను” అని కాండ్రించి ఉమ్మి మారుమాటాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాలుగడుగులు వేసి, మళ్ళీ తిరిగొచ్చి అణచుకోలేని ఉద్వేగంతో గట్టిగా అరిచాడు.

“”కా…ని, ఇగ్నాష్క.. ఒరేయి! మనిద్దరం మళ్ళీ మొహం మొహం చూసుకోం. నిన్ను శపిస్తున్నాన్రా హాప్యాయ్ నుంచి వస్తూ దార్లో ఉన్నార్రా కొస్సాకులు మీ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికీ, దైవ మాతను రక్షించడానికీ. నేనుగనక ప్రాణాలతో బయటపడితే మాత్రం నా చేతుల్తో నేను నీ చర్మాన్ని నిలువునా వొలిచేసి, నీరక్తం కళ్ళచూస్తాన్రా!”

***

సాయంకాలమైంది. గూడెం వెనకతట్టు గాలిమరకి చేరువగా నున్న రేగడిమట్టి గొయ్యి. ఏగోతిలోనైతే చచ్చిన పశువుల్ని పారేస్తారో ఆ గొయ్యి దిశగా ఓ గుంపు జనం మళ్ళింది. ప్రొక్యూర్‌మెంటు దిటాచ్‌మెంటు నాయకుడు తెస్లేంకో తను కాల్చిన పైపునుతట్టి, దాన్ని ఖాళీచేసి ముక్తసరిగా అన్నాడు–

“గోతికింకా దగ్గరగా వెళ్ళండి!”

రోడ్డంచునున్న ఊదారంగు మంచులో వాళ్ళు కోసిన స్లైడ్జికేసి బొద్వాగిన్ రెప్ప వాల్చకుండా చూసి గొంతుక నొక్కుడుపోయినట్టు అన్నాడు.

“కోపం పెట్టుకోకు నాన్నా!”

తండ్రి దగ్గర నుంచి జవాబుకోసం ఎదురుచూశాడు. అంతా నిశ్శబ్దం.

“అటెన్‌న్షన్! ఒకటి…. రెండు…మూడు….!”

గాలిమర వెనక కట్టిన గుర్రం బెదిరిపోయి తాడు తెంపేసుకుని, వెనక్కితిరిగి దౌడుతీసి, స్లెడ్జిబండిని గతుకుల దారంట యీడ్చుకుపోయింది. గతుకులు దాటుతూ ఇటూ అటూ ఊగుతూ తూగుతూన్న

స్లెడ్జిబండి కమానకర్రలు నీలిరంగుతో మెరుస్తూన్న మంచుతెర పైన చాలాసేపు నాట్యం చేశాయి.

“హొప్యోర్‌లో తిరుగుబాటు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇల్లు తగులపెట్టేశారు. కమిటీసభ్యుల్లో కొందర్ని హత్య చేసేశారు కొందరు తప్పించుకు పారిపోయారు” అంటూ తాలూకా అంతటా టెలిగ్రాఫు స్థంభాలు పిచికల్లా కిచకిచలాడాయి.

ప్రొక్యూర్‌మెంటు కోసం వచ్చిన సాయుధదళం తాలూకా లోతట్టు గ్రామాల్లోకి వెళ్ళింది. బౌద్వాగిన్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు, తెస్లేంకో వీళ్ళిద్దరే ఊళ్ళో ఉండిపోయారు. కడపటిసారి సేకరించిన గోధుమల్ని ఆదరాబాదరా డిపోకి తరలించారు. పొద్దున్నకల్లా తుఫాను వచ్చేసింది. తుఫానుగాలి మంచును కొండల్లా పోగుపెట్టింది. యావత్తు గూడేనికి బురద కలిపిన తెలుపురంగు పూత పూసేసింది. చీకటి పడుతూందనగా ఓ ఇరవైమంది రౌతులు గుర్రాల్ని దౌడుతీయిస్తూ గూడెం చౌకులోకి చొరబడ్డారు. తుఫాను ప్రమాద చిహ్నమైన ధ్వని మంచుగుట్టల్లో కూరుకుపోయిన గూడెంపైన ఝాంకరించింది. గుర్రాల సకిలింపులూ, కుక్కల మొరుగులు, జీరబోయి కఠోరమైనగంటలమోత!

తిరుగుబాటు.

బోడిగా ఉన్న దిబ్బ దగ్గర ఇద్దరు రౌతులు తమగుర్రాల్ని తమ శక్తి యంతటితోనూ సతాయిస్తున్నారు. దిబ్బకిందున్న వంతెనమీద గుర్రము డెక్కల టకటక చప్పుడు. రౌతులగుంపు. అందరికంటే ముందున్న రౌతు ఆఫీసరు ఓవర్ కోటు తొడుకున్నాడు. తను స్వారి చేస్తూన్న పొడుగుకాళ్ళ జాతి గోడిగని నిర్దాక్షిణ్యంగా కమ్చీతో చరుస్తూ అరిచాడు.

“ఇహ వదిలిపెట్టేది లేదురా ఈ కమ్యూనిస్టుల్ని!”

దిబ్బ వెనకాలవున్న మీసాల ఉక్రేనియన్ తెస్లేంకో కిర్గిజు, గుర్రాన్ని కళ్ళెంతో బిగించిపట్టి అదిలించాడు.

“లంజ కొడుకులు! వీళ్ళకి దొరక్కూడదు!” అన్నాడు.

గుర్రాల సత్తువంతా పోయింది. ఇంకా చాలా చాలా స్వారీ చేస్తేనేకాని నెరియలు వారిన ఆ దిబ్బ దాటలేమని వారికి తెలుసు.

వాళ్ళని తరుముకొస్తున్న వాళ్ళు నాలుగువైపులనుంచీ చుట్టవేసుకొస్తున్నారు. దిగ్మండలం పడవ అంచున రాత్రిగూనిగా వొంగివుంది. వాళ్ళు వూరుదాటి కొంచెం దూరం వెళ్ళారో లేదో కిందున్న గోల్జెలో జడలు కట్టి పోగుపడిన మంచు కుప్పలోంచి ఓ మనిషి ఆకారం కనబడింది. బోద్వాగిన్‌కి గుర్రాన్ని అక్కడికి నడిపించి రాపుగొంతుకతో అరిచాడు–

“అరె, నీమొగం యిడ్చా, ఇక్కడ కూర్చున్నావేమిట్రోయ్”

అక్కడ ఓ కుర్రాడు కూర్చునున్నాడు వొంటిమీద నీలిరంగు మైనపు పూత పూసినట్టు అవుపడ్డాడు. కుర్రాడు లేచేందుకు ప్రయత్నించి తొట్రుకున్నాడు. బొద్వాగిన్ కమ్చీ ఆడించాడు. గుర్రం జూలు విదిలించి మోర ఆడించి, నాట్యం చేసినట్లు పక్కపక్కగా అడుగులేసుకుంటూ వెళ్ళి ఆ కుర్రాడి పక్కనే నిలబడింది.

“మంచులో కరడు కట్టుకుపోవాలనుందిరా నీకు? ఓరి వెధవా ! ఇక్కడికెలా వచ్చావురా?”

జీనులోనుంచి కిందకి వురికి, వొంగి అన్నాడు బొద్వాగిన్. ఆ కుర్రాడు గొణుగుతూన్నది.

“చలిలో గడ్డకట్టుకుపోతున్నాను మామయ్యా. నా తల్లిదండ్రులు చచ్చిపోయారు. ముష్టెత్తుకుంటూ ఇలా వచ్చా” అన్నాడాకుర్రాడు చలితో గజగజ వణికిపోతూ. తను తొడుక్కున్న ఆడవాళ్ళ కోటును పైకి యెగదీసి, తలపైన ముసుగులా వేసుకున్నాడు కుర్రాడు. బొద్వాగిన్ తను తొడుగుకున్న పొట్టి ఫర్‌కోటు విప్పి మౌనంగా ఆ అర్భకుడి రవంత వొంటి చుట్టూ చుట్టబెట్టి చికాకుపడి చిందులు తొక్కుతూన్న గుర్రంపైన యెంతో ప్రయత్నం చేసి ఆ కుర్రాణ్ని యెక్కించి తనూ యెక్కాడు.

గుర్రాలు మళ్ళీ దౌడు తీశాయి. పొట్టి ఫర్‌కోటు వెచ్చదనానికి కుర్రాడు తెప్పరిల్లాడు. తన ముందు కూచున్న బొద్వాగిన్ నడుముకున్న తోలు పట్టీని దృఢంగా పట్టుకున్నాడు. గుర్రాల వడి గణనీయంగా తగ్గింది. అవి బుసకొట్టాయి. ఉండుండి సకిలించటం మొదలెట్టాయి. వాళ్ళవెంట వినవస్తూన్న డెక్కల చప్పుడు మరింత మరింత దగ్గిర పడుతుంది.

తెస్లేంకో, బొద్వాగిన్ గుర్రాన్ని జూలుతో పట్టుకుని, ముఖాన్ని కత్తిలా నరుకుతూన్న చలిగాలిలో

“ఆ లొడితెడిని అక్కడ పారేయ్! వినపడిందా గాడెద్దకొడకా? వాణ్నిక్కడ పారేయ్, లేకుంటే మనం దొరికిపోతాం” దేవుణ్నీ, దైవమాతనీ నానా తిట్లు తిడుతూ తెస్లేంకో తన కమ్చీతో చలికి నీలిరంగున పడిన బొద్వాగిన్ చేతిమీద ఫెట్‌మని ఒక్కచరుపు చరిచాడు.

“వాళ్ళ చేతుల్లో పడ్డామో మన్ని నరికి పారేశారన్నమాటే! నువ్వూ, నీ కుర్ర వెధవా కట్టుగట్టుకు నరకంలో పడి చావండి.” అని అరిచాడు తెస్లేంకొ.

నురుగులు కక్కుతున్న రెండు గుర్రాల మోరలూ పక్కపక్కనే వున్నాయి. తెస్లేంకొ కమ్చీ దెబ్బకి బొద్వాగిన్ చేతులనుండి రక్తం కారుతూంది. వొడిలిపోయిన ఆ కుర్రాడి శరీరాన్ని బొద్వాగిన్ గట్టిగా పట్టుకుని కళ్ళేన్ని జీను ముఖానికి చుట్టి రివాల్వరు పైకి బారు చేసి-

“కుర్రాణ్ని వదిలిపెట్టను. వాడు చలికి చచ్చిపోతాడు. మనకి వైరం వద్దు. ముసలి పీనుగా! లేదంటావూ యిదిగో చూస్కో” అన్నాడు.

ఆ నలుపు మీసాల ఉక్రేనియన్ కళ్ళెం బిగించి పట్టుకుని మొర్రపెట్టాడు

“మనం ఇహ పారిపోలేం! అంతా అయిపోయింది”

వేళ్ళు వశం తప్పిపోయాయి. మరెవరి

వేళ్ళల్లాగోవున్నాయి. బొద్వాగిన్ పళ్ళు బిగించి తన పటకాతీసి దాంతో కుర్రాణ్ని బిగించి కట్టి, దృఢంగా ‘వుందోలేదో చూచి నవ్వుతూ అన్నాడు…

“ఒరేయి చింపిరి జుట్టు నాగన్నా! గుర్రాన్ని జూలుతో గట్టిగా పట్టుకోరా”

బొద్వాగిన్ తన పట్టా పట్టా కత్తి వొరతో గుర్రాన్ని డొక్కలో పొడిచాడు. తెస్లేంకొ తన రెండు వేళ్ళని పెదవుల పక్కనుండి వాలిన మీసాల కిందనుండి నోట్లోకి దూర్చి చెవులు చిల్లుపడేటట్లు ఖంగుమని దొంగలు వేసే ఈలవేశాడు. వాళ్ళని తరుముకొస్తూ తేలిగ్గా దౌడు తీసి పరుగెత్తుకొస్తూన్న గుర్రాలకేసి వాళ్ళిద్దరూ యెంతోసేపు అలా చూస్తూ నించున్నారు. తర్వాత మంచులో బోర్లా పడుకున్నారు.

******

మూడురోజులై వాళ్ళు అక్కడ పడున్నారు. ఊహింపనలవికానంత కుళ్ళు షరాయితో ఈ చెవినుండి ఆ చెవివరకూ నరుకుతో గడ్డ కట్టుకుపోయిన నెత్తురు నురుగుల పెచ్చులు నిండిన నోటిని ఆకాశంకేసి తెరుచుకున్నాడు తెసేంకొ. బొద్వాగిన్ నగ్న వక్షం పైన సైప్ మైదానపు మచ్చల పిట్టలు నిర్భయంగా గంతులేస్తున్నాయి. “చీరుకుపోయిన పొట్టనీ, ఖాళీగా వున్న కను గుంటల్నీ… వాట్లో నలుపు ముళ్ళ బార్లీ గింజలు దొరుకుతాయేమో అని కాబోలు సావకాశంగా పొడుచుకు తింటున్నాయి ఆ పిట్టలు.
[రష్యా విప్లవం విజయం పొందిన తొలిదినాల నాటి కథ]

Mikhail Sholokhov
Author
ఉప్పల లక్ష్మణరావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *