రంగులతో భావాలను వ్యక్తం చేసే సంవిధానం వంశీకృష్ణ గారి మూడో కథా సంపుటి లో కన్పిస్తున్నది. ఆలోచనలకీ రంగులుంటాయి. పెద్ద పెద్ద సామాజిక భావనలు ఒకానొక రంగుతో నిర్ధేశించడం మనకు తెలిసిందే.వంశీకృష్ణ యీ కథల్లో పసుపు పచ్చ రంగునూ, గోధుమ రంగునూ జీవితంలో వాటి అన్వయాన్నీ కథనం చేసాడు. అంటే ప్రతి కథా రంగులు గురించి మాట్లాడుతుందనీ, లేదూ ప్రతి కథలోనూ రంగుల సంకేతం వుంటుందనీ నేననడం లేదు.
సారాంశంలో చూసినప్పుడు అన్ని కథల్లో యీ రెండు రంగుల్లో ఏదో ఒకటి వున్నదని మన గమనింపులోకి వస్తుంది. వంశీకృష్ణ తన పుస్తకానికి ‘గోధుమ రంగు ఊహ’ అనే టైటిల్ పెట్టుకోవడానికి యిదంతా చేసాడని అనడానికి కూడా లేదు.
స్త్రీ పురుష సంబంధాల మధ్యా అగాధాల్ని మనం చూస్తాం. కొందరు వాటిని పరిష్కరించుకొని ముందుకు పోతారు. కొందరు వాటిని అలాగే వుంచుకొని కొనసాగుతూ వుంటారు. ఈ సంపుటిలోని రెండు కథల్లో యీ సంవిధానం వుంది. ‘ఒక పసుపు పచ్చ సాయంకాలం’ కథలోని జంటకు అగాధాన్ని పూడ్చుకోవడానికి నిరాసక్తత యేర్పడి, నిరాసక్తతతో గడపడంలో ఒక మాధుర్యాన్ని అనుభవిస్తుంటారు. అతనికి ఒక సాయంకాలం జీవితానికి
అర్థం యేమిటి అనే ప్రశ్న ఎదురవుతుంది. దానికి సమాధానమన్నట్లుగా ఆ సాయంత్రం యిద్దరూ యాదృచ్ఛికంగా పసుపు పచ్చని ఆలోచనలు చేస్తారు. ‘The yellow shades of Human experience ‘ అనే పుస్తకం ఆధారంగా నిస్సారంగా, నిస్త్రాణంగా పడి వున్న భావోద్వేగాలను స్టిమ్యులేట్ చెయ్యడంలో పసుపు పచ్చ రంగు వుపయోగపడుతుందనే ఎరుకతో కథ చెప్పే కథకుడు , పాతికేళ్లుగా తన భార్య సంతోషంగా వుందా? అని కనుక్కోలేక పోయాననే విషయాన్ని గ్రహిస్తాడు. దాన్నే ఆమెను అడిగి ఆ సాయంకాలం ఆమె అనుగ్రహాన్ని పొంది తాదాత్మ్యం చెందుతాడు.
భార్యా భర్తల మధ్య యేర్పడే అగాధం, ఒక్కసారి వాళ్లని మింగేస్తుంది. అలాంటిదే యీ సంపుటి లో ‘ మౌన’
అనే యింకో కథ. ఆనందంగా సాగుతున్న బంధంలో చిన్న పాప మరణంతో గాయం రేగుతుంది. గాయంకు సరైన (వి) చికిత్స చేసుకోకపోవడంతో యిద్దరి మధ్య అగాధం యేర్పడుతుంది. దాంతో జీవితం దట్టమైన మంచు కప్పుకున్న మల్లెపొదలా అయిపోతుంది.
సంబంధాలు ప్రేమ దశలో వున్నప్పుడు పెళ్లి వరకూ అతి సహజంగా వెళ్ళాల్సిన బంధాన్ని తుంచేసిన కరుణాకర్ , సోషియల్ మీడియాలో రేవతి మరణ వార్తను చూసి ఆమెను ఆఖరుగా చూడ్డానికి వెళ్తే ఆమెనే ఎదురొస్తుంది, ఎదురైన దృశ్యం కథలో. చావు వార్త నేపథ్యంలో ఆమెను గుర్తుచేసుకోవడమే కథ. సోషియల్ మీడియా నిర్వాకాలు చెప్పడమే కథ. అయితే కరుణాకర్ లాంటి వారికి జీవితంలో సర్దుబాటు అనేది ప్రాథమిక విషయం, అని తెలియక పోవడాన్ని కథ చెప్పకనే చెబుతుంది.
మానవ సంబంధాలలో వున్న వైరుధ్యాలను చెప్పడానికి వంశీకృష్ణ ప్రయత్నించాడని యీ కథలు చదివితే తెలుస్తుంది. ఒక కథలోని ‘అంశం’ , మరొక కథలో మరో కోణంలో ( జెక్స్టాపోజ్ గా) కన్పిస్తుంది. దాంపత్యంలో అగాధం అనే అంశం, రెండు కథల్లో రెండు రకాలుగా పరిణమించడం మనం చూసాం. అలాగే
కులవివక్ష అనే అంశం, ‘ ఆట ముగిసింది ‘ కథలో ఒక రకంగానూ ‘ సెలవు ‘ కథలో మరో రకంగానూ వ్యక్తం అయ్యింది. ఆట ముగిసింది కథలో అణగారిన కులానికి చెందిన అధికారి తన స్వీయ మానసిక ధోరణితో తన కింద పనిచేసే ఒక అగ్రవర్ణాల ఉద్యోగికి ప్రమోషన్ యివ్వడు. అయితే రిటైర్మెంట్ తర్వాత పాశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ కథలో కులవివక్ష కు ఒక ప్రాయిశ్చిత్యం వుంది. అదే సెలవు కథలో ఇదే కులవివక్ష రోహిత్ ప్రాణం
తీసుకుంటుంది. రోహిత్ వేముల కథ లాంటి కథే యిది. ఇదే తీరులో అణగారిన వర్గాల అప్పు ఎగవేతల మీద రెండు పరస్పర విరుద్ధ కథలున్నాయి. గాంధీ కథలో , పూర్తిగా విలువలు లేకుండా అప్పులు ఎగ్గొడుతూ దిగజారి
బతుకుతున్నారనే చిత్రీకరణ కన్పిస్తుంది.అదే’ పైసా వసూల్ ‘ కథలో వాళ్ల నిస్సహాయతకు తోడు వ్యవస్థాగత దుర్మార్గాలు కూడా కారణమై ఎగ్గొటడం జరుగుతోందని రచయిత చిత్రించాడు.
అలాగే రంగులతో భావాలను వ్యక్తం చేసే కథా సంవిధానం.
ఒక పసుపు పచ్చ సాయంకాలం కథలోనూ గోధుమ రంగు ఊహ కథలోనూ చూడొచ్చు. ఇక్కడ కూడా గోధుమ రంగు ఊహ, మృత్యువు కు సంబంధించిన ఆలోచన. పసుపు పచ్చ రంగు వుధ్ధీపనానికి, కొత్త ఉత్సాహపు పుట్టుకకు సంబంధించినది. ఒకటి మరణం అయితే యింకొకటి జననం అనుకోవచ్చు. గోధుమ రంగు ఊహ లో కథకుడి ఆలోచల్లోకి వచ్చిన గోధుమ రంగు అతడి అంతరంగంలో అనేక ఆలోచనలను రేపుతుంది. అవి, గోధుమ రంగులో వుండిన కృష్ణమాచారి అనే బాల్య మిత్రుడివి, నీవన్నీ గోధుమ రంగు ఊహలు అని చిన్నప్పుడు చెప్పి మాయమై పోయిన కృష్ణవేణి అనే స్నేహితురాలివి, నువ్వు గోధుమ రంగులోకి మారిపోతున్నావు అని హెచ్చరించిన తన భార్య కల్యాణివీ. కథలో చివరికి గోధుమ రంగు ట్రక్కు కేఫ్ లోకి దూసుకొచ్చి కథకుడ్ని గుద్దడంతో మరణిస్తాడు.
కథలో మృత్యువు వుండడం, మృత్యువు చుట్టూ కథ నడవడం లేదా మృత్యువు తో కథ ముగియడం యీ సంపుటి లోని పదమూడు కథల్లో కనిపిస్తుంది. గోధుమ రంగును మృత్యువుకు సంకేతంగా కథకుడు చెప్పాడు కాబట్టి యీ సంపుటిని గోధుమ రంగు ఊహ అనడం న్యాయంగానే వుంది.
బ్యాంకు వుద్యోగిగా వంశీకృష్ణ కు అప్పులు యివ్వడంలో, వాటి వసూళ్లలో లోతుపాతులు తెలుసు. గాంధీ కథలో గోలీ రామాంజనేయులు అనే కింది కులాల వ్యక్తి అప్పు ఎగవేతదారుడు. దానికి కారణం ఆదాయం లేకపోవడమే.
స్కూలుకు పోవాల్సిన కొడుకు సెంటర్లో గాంధీ వేషం వేసి బిక్ష అడుక్కునేంత స్థితి. ఊర్లో యీ స్థితి ముమ్మరంగా వుండడంతో ,ఆ సెంటర్లో అడుక్కోవడానికి పోటీ. దానికోసం కొట్లాడుకుంటూ చావు వరకూ వెళ్లేంత. గోలీ రామాంజనేయులు కొడుకు అలాంటి దెబ్బలాటలో చనిపోతే శవసంస్కారానికి మళ్ళీ డబ్బులు అడుక్కోవ
డానికి యీ బ్యాంకు వుద్యోగి దగ్గరకే రావడం. ఈ బ్యాంకు మనిషి దాన్ని కూడా గో.రా ఎత్తుగడేనా అని అనుమాన పడతాడు. ఈ కథలో ఒక చావు వుంది , ఈ చావు గురించి కథకుడేమీ మాట్లాడడు.
పైసా వసూల్ అనే యింకో బ్యాంకు హత్యా కథుంది. బ్యాంకు అధికారిణి యింటి వద్దకు వెళ్ళి అప్పు గట్టిగా అడిగినందుకు అవమానంగా యెంచి వురేసుకుంటాడు. ఆ కేసు నుంచి అధికారిణిని కాపాడడానికి బ్యాంకు చనిపోయిన రైతు కూతురు పేరు మీద లోన్ పెంచి యిస్తూ బకాయీ పడ్డ లోనుకు జమేసుకుంటారు. ఇదే తీర్చలేక పోయాడే, కొత్తగా యిచ్చిన ఎక్కువ మొత్తం యెలా తీరుతుంది? బ్యాంకు యిలాంటి దారుణాల్ని చేస్తే ఎలా? అనే ప్రశ్నల వద్ద కథ ముగుస్తుంది. ఈ కథలోనూ చావుంది. ఆ చావు తర్వాత యింకో పెద్ద చావుకు రంగం సిద్ధంచేసి కథ నిలిచింది.
శ్యామ కల్యాణి కథలో సూరావజ్జుల సూర్యనారాయణ శాస్త్రి పండితుడు, సంగీతజ్ఞుడు. కూతురు కల్యాణి శూద్రుడ్ని వివాహం చేసుకుంటే ఆమెను పట్టించుకోడు. కల్యాణి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాక ఆమె జ్ఞాపకం వెంటాడడం ప్రారంభమవుతుంది. భార్యా చనిపోతుంది. శాస్త్రి గారి అన్న కొడుకు ఆస్తిని గుంజేసుకొని తన అపార్ట్మెంట్ సెల్లార్లో మంచానికి పరిమితం చేస్తాడు. వృద్ధాప్యం, లేవలేనితనం శాస్త్రి గారి మరణ నిస్సహాయత
ముందు, ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ కూతురి,నల్లని పసిబిడ్డ ఆయనలో సంవేదనల్ని రగిలిస్తుంది.ఈ శ్యామ కల్యాణి వల్ల శాస్త్రి గారి చివరి నెలల్లో పాశ్చాత్తాపానికి అనునయం దొరుకుతుంది. ఈ కథలోనూ చావుంది. అయితే జననం కూడా వుంది. గోధుమ రంగు వుంది. పసుపు పచ్చ రంగు వుధ్ధీపనా వుంది.
దుస్తులు కథలో చంద్రకళ కొడుకు చావుకు కారణం, చంద్రకళ ఎంచుకున్న ప్రవృత్తి. ఆమె కళాకారిణి. కొడుకు చావు కూడా ఆమె ప్రవృత్తిని మార్చదు. కథలో ఆమె డబ్బు సంపాదించి తీరాల్సిన పరిస్థితి లేదు.పొట్టి దుస్తులు వేసుకుని షో నడపడం ఆమె కల్గించుకున్న ఆసక్తి. ఆ ఆసక్తి ఒక చావుకు కూడా చెక్కుచెదరదు. ఈ కథ ప్రకారం స్త్రీ స్వేచ్ఛను అమానవీయంగా నైనా సరే సమర్థించాల్సిందే. గోధుమ రంగు ఊహ యీ కథలో పొట్టి దుస్తులతో శివతాండవమాడింది, కథకుడికి కూడా యేమీ అభ్యంతరం లేకుండా.
ఈ కథకుడి గోధుమ రంగు ఊహకు అందిన మూడు అతి పెద్ద సామాజిక, రాజకీయ వర్తమాన కల్లోలాలు కథలుగా యీ సంపుటి లో వున్నాయి.అతి పెద్ద సంఖ్యలో మానవ మరణాలకు కారణమయిన కరోనా కాలపు వ్యవస్థాగత దుర్మార్గాలను,పంచతంత్రం శైలిలో ‘అడవి అంటుకుంది’ లో వివరిస్తాడు. ఈ కథలోని మృగరాజు, ‘అద్దంలో ఆమె
రేంద్ర ‘ లో ఒక దేశపు ప్రధాని అయిపోయి, నమో నమో అనే జయజయ ధ్వానాలు అందుకుంటూ తన ముప్పై ఆరు అంగుళాల ఛాతీ మీద కనిపిస్తున్న ఎర్రటి నెత్తుటి మరకను చూసుకుంటాడు. ఆ నెత్తుటి మరక వేలాది మందిని వూచకోత కోపించి చంపించి వుండటానికి గుర్తు. అతడెంత గొప్ప స్థానంలో వున్నా నెత్తుటి మరక చెరగదని
రచయిత యీ కథలో సంకేతిస్తాడు. ‘కొండమీద’ కథలో క్యాన్సర్ సోకిన స్త్రీ చన్నులా వుంటుంది కొండ . ఆధునిక రాజకీయ వ్యవస్థ చేస్తున్న పర్యావరణ దోపిడీని యీ కథ మాట్లాడుతుంది. పైన చెప్పిన కథలన్నింటిలో మనుషుల చావుల గురించి చెప్పిన/ సంకేతించిన వంశీకృష్ణ యీ సంపుటి చివరి కథలో మనుషులకు తల్లిలాంటి ప్రకృతి మరణం గురించి మాట్లాడతాడు. సమాజానికి వినియోగ
మనే జాడ్యం పట్టుకుంది. ప్రకృతి వినియోగం ప్రకృతి విధ్వంసం ఒక నాణేనికి రెండు వైపులు. మనిషి తనకు తాను తెచ్చుకునే చావు యిది. ఇది విస్తారమైన గోధుమ రంగు ఊహ.
ఈ మొత్తం సంపుటి కి తలమానికంగా నిలిచే కథ ‘ ఉష్ మాన్ చెప్పని కథ ‘ . యీ వర్తమానాన కాలాన యే భారతీయ రచయితైనా రాసితీరాల్సిన కథ. ఆ మేరకు యీ కథ జాతీయ స్థాయిది. ఇది కూడా చావు కథే. చచ్చి బతుకుతున్న ఒక సమూహం కథే. ఉనికే ప్రశ్నార్థకంగా మారి జీవితానికే కాదు దేశ భక్తి కూడా ఆధారాలు వెతుక్కోవాల్సిన అగత్యం యేర్పడ్డవాళ్ల కథ. అయితే వంశీకృష్ణ గారి నైపుణ్యం కథలోకి యే రాజకీయ జార్గాన్
రాకుండా రాయడంలో వుంది. ఒకానొక పల్లెటూరి యిద్దరు బాల్య స్నేహితుల కథ లాగా మలచడంలో వుంది.ఈ కథ ఎత్తుగడలో సాల్మన్ రష్దీ నవల మిడ్ నైట్ చిల్డ్రన్ వ్యూహం కనిపిస్తుంది.ఒకే రోజు పుట్టిన హిందూ ముస్లిం కుటుంబాల పిల్లలు సుందర రామ శర్మ, ఉస్మాన్ , వేరు వేరు వీధుల్లో పుట్టినా, ఉమ్మడిగా పెరిగి మంచి స్నేహితులై విడిపోతారు . యువకులయ్యాక ఎవరి బతుకు వాళ్ల దే. బతకడానికి హిందువుకున్న సానుకూలత ముస్లింకు వుందా? అతను ఉగ్రవాదిగా మారి చావాల్సిందేనా? ఇంతే కథ. చావు స్పర్శతో ముగిసే కథ.
పద్నాలుగు కథల యీ సంపుటి లో రచయిత దృక్పథాన్ని
ప్రశ్నించడానికి యేమీ లేదు. బాగా చెప్పని కథల్లో కూడా ఫోకస్ అయిన, ఫొకస్ కాని అంశాలను రెండింటినీ కలిపి చూసినప్పుడు వంశీకృష్ణ గారి చెక్కుచెదరని ప్రగతిశీల దృక్పథం కన్పిస్తుంది. కొన్ని కథల్లో రచయిత సెట్ చేసుకున్న కథా సంవిధానం కథను లక్ష్యాన్ని చేరకుండా ఆపిందనిపిస్తుంది. అడవి అంటుకుంది కథకు కరోనా నేపథ్యం బలంగా అమరలేదు. పంచతంత్రం కథా సంవిధానం సార్వజనీన సత్యాలకు నప్పినంతగా మరొక తాత్కాలిక విషయాలకు కుదరదేమో. జంతు పాత్రలతో కరోనాను చెప్పడం ఆసక్తికరంగా రాలేదు. ఎదురైన దృశ్యం కథలో ముగింపు చప్పగా అనిపించింది. సోషియల్ మీడియా (యిస్తున్న సమాచారం) లొసుగులు చెప్పడమే కథ అయితే రేవతి కరుణాకర్ ల ప్రేమ కథ ప్రయోజనం లేనిదైపోయింది. లేదూ రేవతి కరుణాకర్ ల ప్రేమ కథ చెప్పలని వుంటే సోషియల్ మీడియా ఫేక్ సమాచార ప్రస్థావన అవసరం లేదు. ఇక గాంధీ కథ, టైటిల్ దగ్గర్నుంచి , ఫోకస్ అయిన విషయం దాకా కుదరలేదు.
కథ అంతిమంగా యేం చెబుతుంది , కింద కులాల వ్యక్తులు బ్యాంకు లోన్లు ఎగ్గొట్టి విలువలు లేకుండా బతుకుతున్నారని చెప్పడమే కదా. ఇది వంశీకృష్ణ లాంటి ప్రగతిశీల రచయితకు పొసగనిది. కింద కులాల వ్యక్తులు లోన్ ఎగ్గొట్టడంలో వ్యవస్థాగత కారణాలే అధికం కదా. ఆ విషయం పైసా వసూల్ కథలో యీ రచయితే చెప్పాడు.
అద్దంలో అమరేంద్ర కథను యింకొంత మార్మికంగా రాసి వుండాల్సింది. ఇక దుస్తులు కథలో స్త్రీ వాదం తలెత్తుకొని కాలిమీద కాలు వేసుకుని వెళ్లడానికి కొడుకును బలి యివ్వనవసరం లేదు. అంత కర్కశంగా సమర్థిస్తేనే స్త్రీ వాదాన్ని గౌరవించినట్లు అనుకోవడం బాగా లేదు.
వంశీకృష్ణ గారి కథలన్నీ చదివాక మన కళ్ళ ముందు ఎన్నో సంక్షుభిత సన్నివేశాలు కదలాడతాయి. అవన్నీ వ్యక్తిగత స్థాయిలోనూ సామాజిక స్థాయిలోనూ తోసుకొస్తున్న అనేక పరిణామాల ప్రతిఫలనాలు. ఒక ఆలోచనా పరుడిగా వంశీకృష్ణ కొన్ని అనుభవాల నుంచి ఎన్నో పరిశీలనల నుంచి యీ ప్రతిఫలనాలను చూసి కథనం చేసి వుంటాడు. వ్యక్తులు యింటాబయటా మాట్లాడుకోవడం లేదనీ భావాల వినిమయం అనే ప్రాథమిక సూత్రమే అములవనప్పుడు, వ్యవస్థాగతంగా ప్రకృతి వినిమయం కాస్తా( దానికి రాజ్యం కూడా తోడైతే) విధ్వంసంగా మారడాన్ని ఎవరాపగలరనే వేదన ఈ కథల్లో చూస్తాం. దళిత , బహుజన, స్త్రీ వాదాల సారాంశం కూడా యీ కథల్లో కన్పిస్తుంది. దళితులు గానీ అగ్రవర్ణాలు గానీ తమ ఆట ముగిసాక ఎక్కడికొచ్చి నిలబడతారో కొంచెం గమనించమని చెప్పే సూచన వుంది. ఒక అగ్రవర్ణ పురుషుడి ఆఖరి ఘడియల్లో విముక్తి నిచ్చిన పసిపాపది శూద్ర వర్ణమవడమే రచయిత వుద్దేశ్యాన్ని చెబుతుంది. ఉద్యమాలు యింకిన ఆలోచనల్లో ఎంత పరిణితి వుంటుందో చెప్పడానికి కూడా యీ కథలు మంచి ఉదాహరణగా నిలుస్తాయి

