సమాజం యొక్క బహుముఖీనతను , దాని సంక్లిష్టతను ప్రదర్శించే అద్దం సాహిత్యం.
అయితే – సాహిత్య సృజనలో రచయిత బాధ్యత ఎటువంటిది ? ఈ ప్రశ్నకు ” Show . Don’t tell ” అనేది సుప్రసిద్ధ రష్యన్ రచయిత అంటోన్ చెఖోవ్ ఇచ్చిన సమాధానం.
” పాఠకుడి అనుభూతికి అందని ఓ దృశ్యాన్ని కేవలం అక్షరాలలో పొందుపరచడం కన్నా –
ఆ దృశ్యాన్ని , భావాన్ని పాఠకుడే స్వయంగా హృదయంలో చిత్రించుకునేలా చేయాలి రచయిత ” అని చెఖోవ్ ఆకాంక్షించారు. ఇది చెఖోవ్ తన కథల్లో పాటించిన కథన సూత్రం.
ఈ సూత్రాన్ని ప్రతిబింబిస్తాయి శారద కావూరి గారి ” జగమంత కుటుంబం” కథలు. డజను కథలతో వెలువడిన ఈ సంపుటి విభిన్నమైన వ్యక్తుల జీవితాల్లో పరచుకున్న చీకటి వెలుగులను పాఠకులకు అనుభూతం చేస్తుంది . కృష్ణానది లంకల నుంచి ఖండాంతరం వరకు సాగిన ఈ కథల విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. శిక్షలు అనివార్యమయ్యే అవస్థకు మనుషులు జారుకోని సమాజం నిర్మితమవ్వాలని ఆకాంక్షిస్తూ శారద గారు రాసిన ‘ క్షమాఛాయ ‘
ఈ సంపుటిలో తొలి కథ .
తన చెడు నడత వల్లే తన భార్య చనిపోయిందని , ఉన్న ఒక్క కొడుకూ తన మూలంగానే చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడని – తెలిసినా ఏమాత్రం స్పందించని విచిత్ర జీవి ‘ దాసు ‘. దాసులో మార్పు తీసుకురావడం కోసం అతడి కొడుకుకు నీడనిచ్చి , ప్రయోజకుడిని చేయాలని సంకల్పించిన ‘ కొండా – సురేఖ ‘ దంపతుల ” కథ ‘క్షమాఛాయ’. మానవ సంబంధాలను మించిన ఆస్తి , గొప్ప విలువ మరోటి లేదనే సత్యాన్ని పాఠకుల హృదయాల్లో ప్రతిష్ఠిస్తుంది ఈ కథ. కథాగతమైన సందేశాన్ని కథ మొదట్లోనే ప్రతిపాదించి , ఇతివృత్తాన్ని స్వీకరించడానికి అవసరమైన మానసిక సంసిద్ధతను పాఠకుల హృదయాలలో ముందుగానే ఏర్పరిచే టెక్నిక్ ను రచయిత్రి ఉపయోగించడాన్ని – “అబ్బూ” కథలో గమనించవచ్చు. వయసు పెరిగే కొద్దీ బంధాలలోని నిజాయితీ తగ్గిపోతున్న కఠోర వాస్తవాన్ని ‘ అబ్బూ ‘ కథలో చెప్పారు రచయిత్రి. కుటుంబం అంటే కేవలం ఆస్తిగా చూసి , ఆస్తిని చేజిక్కించుకున్న తర్వాత బాధ్యత వదిలించుకోవాలనుకుంటాడు చిన్న కొడుకు రశీద్ . నిర్దయుడైన తమ్ముడికి తండ్రి బాధ్యత అప్పజెప్పి – చేతులు దులుపుకోకుండా – అమెరికాను వీడి వచ్చి , మలిసంధ్యలో ఉన్న నాన్నకు తానే నాన్నగా మారి – సాకిన ఓ మంచి కొడుకు కథ ఇది. కన్న మమకారాన్ని గాలికి వదిలేసి ,రెక్కలొచ్చాక విదేశాలకు ఎగిరిపోతున్న కొడుకులకు ఈ కథ కనువిప్పు అవుతుంది. రచయిత్రి గోదావరిఖనిలో జీవించి , అక్కడి బొగ్గు గని కార్మికుల జీవితాల్లోని వేదనలను కన్నులారా చూచిన వారు. అందువలనే సింగరేణి గనుల నేపథ్యంలో రచించిన కథలు ఈ సంపుటిలో నాలుగు కనిపిస్తాయి. ” గనుల్లో పని ఒక చేత్తో బతుకునిచ్చి , మరో చేత్తో ఆరోగ్యాన్ని కోరడం తరతరాల రివాజు ” – అని రాయగలిగారంటే రచయిత్రి శారద కావూరి గారు అక్కడి కార్మికుల మసిబారిపోయిన బతుకులను ఎంత దగ్గరి నుంచి సహానుభూతితో పరిశీలించారో అర్థం చేసుకోవచ్చు. సింగరేణి కాలరీల్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు – అక్కడి ఊళ్ళ నుదుటన కరవు గీతను గీసిన వైనాన్ని , వారి బిడ్డల బతుకుల్ని ఛిద్రం చేసిన వాస్తవాన్ని – కళ్లకు కట్టినట్లు చిత్రించిన కథలు ‘సమ్మయ్య… మరికొందరు ‘ , ‘ గనిలో… పనిలో…’
” మనం సంస్థకు మిగలాలన్నా , కుటుంబాలకు మిగలాలన్నా… గట్టిగా మాట్లాడాల్సిందే…
ఏం…మనం ఆరోగ్యంగా బతికేందుకు అవసరమైంది అడిగితే అగ్గిపుట్టిస్తారా ? అదీ చూద్దాం ” అంటూ గర్జించిన రామన్న (సమ్మయ్య… మరికొందరు) ;
” దేశ ప్రజలకు వెలుగులు నింపేందుకు బొగ్గు నిల్వలని వెలికి తీసిన ఖాళీల్లో వీరి బతుకులు సమాధి అవుతున్నాయి ” అని తలపోసిన ఏజెంట్
(‘గనిలో… పనిలో…’) – సింగరేణి బొగ్గు గని కార్మికుల కష్టాలను పాఠకుల హృదయ ఫలకాలపై ఆవిష్కరిస్తారు.
” ఎన్నిటికో నోసుకోని మా అసంటోల్లకి ఏ లొల్లి జగడాల్లేని రోజే పండగైతది ” – బిడ్డలకు బుక్కెడు బువ్వ కూడ పెట్టలేకపోతున్నానని దుఃఖ పడిన మల్లక్క మాటలివి. గోదావరి ఖని గనుల వల్ల బతుకులను నష్టపోతున్న ఎన్నో కుటుంబాల ఆవేదనకు అక్షర రూపం ఈ మాటలు. బొగ్గు గనుల వల్ల చేలూ – చెలకలూ బొందల గడ్డలై , నష్ట పరిహారం డబ్బులు రాజకీయ రాబందుల పాలైన చోట – కులవృత్తి చేయటం తప్పిస్తే మరోలా బతకటం తెలియక – చావుడప్పు కొట్టి పొట్ట పోసుకునే ఓ కుటుంబం కథ ‘సావుడప్పు’. పూర్తి తెలంగాణ మాండలికంలో రాసిన కథ ఇది . ఈ కథలో – “మస్తుగా ఆకలైతే ఎవలైనా ఊల్లోవాల్లు సచ్చిపోతే బాగుండనిపిత్తది మేడం. ఎవలైనా సచ్చిపోతేనే కదా బావు సావు డప్పుకు బోయేడిదీ , మాకు డబ్బులొచ్చేదీను ” అన్న సత్తి మాటలు – చదవటానికి , వినటానికి ఇబ్బందిగా అనిపించినా ఆకలి మానవత్వాన్ని కూడా చంపేస్తుందన్న కఠిన సత్యాన్ని గుర్తుకు తెస్తాయి ;
పేదవాళ్ల బతుకుపై వాలి , చావు డప్పు కొడుతున్న – నల్ల డేగలు , తెల్ల రాబందుల దుర్మార్గాలను కఠోరంగా వినిపిస్తాయి .
మరో కథ ‘ చీకటి మూసిన ఏకాంతములో ‘ . సింగరేణి నేపథ్యంలోనే రాసినా పై మూడు కథలకు పూర్తిగా భిన్నమైనది. బొగ్గుల మధ్య వజ్రంలా మెరిసే ప్రేమ గురుతుల నెమరువేత ఈ కథ .
” జీవితం అంటే పిల్లల చుట్టూ ఆరాటాలు… ఆపైన పిల్లలు తెచ్చే ఆరాటాలు ” అంటూ ‘ జానకి ‘ పాత్ర ద్వారా రచయిత్రి పలికించిన మాటలు కాలదోషం పట్టని చిర సత్యాలు. ఎదిగే దశలో ప్రవర్తన లోపాలతో కన్నవారిని ఇబ్బందులు పెడుతున్న బిడ్డలను ఎలా సరిదిద్దాలో తెలియక సతమతం అవుతున్న ఈ తరం తల్లులకి స్ఫూర్తినిచ్చే కథ ‘ కాస్త విరామం ‘. ప్రతి చిన్న సమస్యకు చావే పరిష్కారం అయి – నూతులు , గోతులు వెతికే వారు ఎక్కువ అవుతున్న కాలం ఇది.అలాంటి వారికి బతుకు మీద భరోసానిచ్చే కథ బతుకు . ” బాధపెట్టే గతాన్ని , భయపెట్టే భవిష్యత్తుని గురించి ఆలోచించకుండా – ఎవరితోనూ పోల్చుకోకుండా – ఉన్నంతలో సంతృప్తిగా బతకాలి ” అనే చక్కని సందేశాన్ని అందించిన కథ ఇది. ఈ కథ ముగింపులో – రాత్రంతా నడిచి , సూర్యోదయం కాబోతుండగా – ఆత్మహత్య ఆలోచనను మానుకుని ఇంటికి చేరిన ‘ అజయ్ ‘ ఇంటి లోపలికి వెళ్లేందుకు తలుపు తెరుస్తాడు. తెరుచుకున్న ఆ తలుపు – అతడికి మరోసారి జీవితం లోకి ఆహ్వానం పలికిన బతుకు సంకల్పమే ! సూర్యోదయం ద్వారా ఈ సందేశాన్ని సంకేతాత్మకంగా సూచించారు రచయిత్రి. మరో రెండు కథలు – ‘ అమ్మా… కూతురూ… ‘ , ‘ ఒక మనోజ్ కథ ‘ – హృదయాన్ని ద్రవింపజేస్తాయి. మొండితనం , మంకుపట్టుతో భర్తను దూరం చేసుకున్న ఓ మహిళ – తన కూతురు కాపురంలో కూడ చొరబడి – విడాకులు ఇప్పించి – ఆమె బతుకులో నిప్పులు పోసిన కథ
‘ అమ్మా… కూతురూ… ‘
ఈ కథలో కూతురికి – తల్లి చేసిన అన్యాయం , ఆమె స్వార్థ మనస్తత్త్వాన్ని నిరూపించే మాటలూ పాఠకులచే కన్నీరు పెట్టిస్తాయి.
కథ సుఖాంతం అయి , కూతురు కాపురం నిలబడుతుందేమో అని ఆశపడిన పాఠకుల్ని ముగింపు నిరాశ పరుస్తుంది. వాస్తవ సంఘటనలకు రచయిత్రి ఇచ్చిన కథారూపం ఇది ! నిజం అలా ఉన్నపుడు ఎవరు మాత్రం ఏం చేయగలరని సమాధాన పడతారు పాఠకులు . ” కిటికీలు చూడనిస్తాయి కానీ బయట పడనివ్వవు బయట పడేయలేవు .” అంటూ కూతురు నోట తాత్త్వికంగా పలికించిన మాటల లోతు పాఠకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ కిటికీ ఒక Metaphor. కూతురు స్వేచ్ఛను ఆహరించిన తల్లికి సంకేతమే కిటికీ.
బిడ్డ ఆలనాపాలనా భార్యాభర్తల
ప్రేమకు గుర్తు. కాని , జన్యు లోపంతో పుట్టిన తమ కొడుకు వల్ల జీవితంలో ‘ రసానందం ‘ లేకుండా పోయిందని భావించి , వాడిని ఏదో ఒకలా వదిలించుకోవాలని ప్రయత్నించే తండ్రి – వాడి కోసమే జీవిస్తానని స్థిరంగా నిశ్చయించుకున్న తల్లి మధ్య జరిగే సంఘర్షణ ‘ ఒక మనోజ్ కథ ‘ . ప్రతి అక్షరాన ఉద్వేగాన్ని నింపుకున్న ఈ కథలో – బిడ్డ కోసం తల్లి పడే ఆవేదనను తమలో నింపుకున్న మాటలతో ఒకింత బరువుగానే నడుస్తుంది కథనం.
ఈ కథా సంపుటిలో మిగిలిన రెండు కథలూ
‘ గ్రేస్ ‘ , ‘ ఎర ‘ – కూర్పు పరంగా ప్రత్యేకమైనవి.
‘ గ్రేస్ ‘ – కరోనా కాలపు కథ. ఇందులో మొదటి కథకు మరో కథను జోడించి , రెండింటినీ ఒడుపుగా – అర్థవంతంగా నడపటాన్ని గ్రేస్ లో చూడవచ్చు.
‘ కాస్త విరామం ‘ కథలో లాగానే గాడి తప్పిన కొడుకును ప్రేమ పూరితమైన మాటలతో – సరైన దారిలోకి నడిపిన తల్లి గ్రేస్ .
” జగమంత కుటుంబం ” కథా సంపుటిలో చివరి కథ – ఎర. ఇది అప్పుల ఊబిలో చిక్కుకున్న వలస జీవితాల ఇక్కట్లను చిత్రించిన కథ .
‘ ఎర ‘ కథను చదువుతున్నపుడు – ఒక చిన్ని పాత్రలో ఇమడనంత ఎక్కువ పదార్థాన్ని నింపే ప్రయత్నం జరిగిందని అనిపిస్తుంది. ఓ మినీ నవలగా పెంచి రాసే యోగ్యత గల – ఫ్రేమ్ నెరేటివ్ ‘ఎర’. పీతల్ని వేటాడే యానాదుల జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ – శ్రమ దోపిడీ నేపథ్యంలో రాసిన ఈ కథ స్థానికంగా కృష్ణానది లంకల్లో సాగినట్లు కనిపించినా – బలహీనుల్ని దోచుకునే పెత్తందారుల పీడన మాత్రం ప్రపంచమంతా పరచుకున్న సమస్యే. వలస కథలు ఎవరు రాసినా – ఆ కథలకు సుఖాంతం కావడం ఉండదు ! భుక్తి కోసం , ముక్తి కోసం చేసే జీవన పోరాటం లో – వెతలకు కొనసాగింపే తప్ప ముగింపు ఉండదు !
కట్టుకున్న వాడిని , కడుపున పుట్టిన పిల్లల్ని గాలికొదిలేసి – బతుకును పంచుకోవడానికి మరొకడిని ఎంచుకున్న ఓ తల్లి ; అమ్మ వదిలి వెళ్లిన చున్నీని వెతికి పట్టుకుని – దాన్నే అమ్మగా భావించి ఏడుస్తూ ” మా అమ్మ ఎప్పుడొచ్చుద్ది ” అని అమాయకంగా అడిగే బుచ్చక్క , బిడ్డ చేసిన తప్పును తలచుకుంటూ పట్టని నిద్ర కోసం ఎదురు చూసే కాకాని , ” మరి నా బడి ? అక్కడ (వలస ప్రదేశంలో) బడి ఉంటదా ? ” అని అడిగిన సింగడి కొడుకు , ” ఒకసారి ఇక్కడ అడుగు పెట్టినాడు ఎవడైనా ఇప్పటిదాకా ఎనక్కి పోయాడా ? ” అని ప్రశ్నించిన పోలయ్య – ఇలా ఎన్నో పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా , ఉద్వేగభరితంగా సాగే కథ ‘ఎర’. యానాదులకు పీతలు పట్టుబడినట్టే – పెట్టుబడిదారుల గుప్పెట్లో యానాదులు చిక్కుకుంటారు. నిజమైన వేటగాళ్లు పెట్టుబడిదారులే అనేది ఈ కథ ద్వారా రచయిత్రి ఉద్దేశించిన ఆంతర్యం. నాలుగు డబ్బులూ , కనీస అవసరాలూ ఎరవేసి – శ్రమను దోచుకునే పెట్టుబడి దారుల చేతిలో ఒకసారి చిక్కిన తరువాత – శ్రమించే స్థానం మారుతుందేమో కాని బడుగుల బ్రతుకుల్లో ఏ మార్పూ రాదు ” అనే సందేశాన్ని అందిస్తుంది ఈ కథ. ఈ కథల్లో తండ్రి ఇంకా ఎంత కాలం ఉంటాడని నిర్దయగా ప్రశ్నించిన రశీద్ , ” కొడుకు చావు కోసం ” ఎదురు చూస్తున్న ఓ కసాయి తండ్రి , తమ స్వార్థం కోసం బిడ్డలను కష్టాల్లోకి నెట్టేసిన తల్లులు – పాఠకుల్ని నిశ్చేష్టులను చేస్తారు. కథాగమనంలో తారసపడే ” గంగరావి చెట్టు కింద రచ్చబండ , మైనింగ్ ప్రాంతంలో ఈజిప్టు మమ్మీల్ని నిలబెట్టినట్టు కనిపించే ఇళ్ల మొండి గోడలు , తల్లి మూలంగా బతుకును కోల్పోయిన కూతురుకి ఆసరాగా మారిన కిటికీ ” – పాఠకుల్ని వెంటాడుతుంటాయి. నాగరకత ఫలంగా మన జీవితాల్లోకి ప్రవేశించి , అతిపెద్ద సమకాలీన సంక్షోభంగా పరిణమించిన సెల్ ఫోన్ – జీవితాలను , కాపురాలనూ కూల్చేస్తున్న దారుణాన్ని ( ఎర , అమ్మా… కూతురూ..) అక్షర నిక్షిప్తం చేసి పాఠకుల ముందు పెట్టారు రచయిత్రి. ” పట్టుమని 130 పేజీలు కూడా లేని ఈ సంపుటిలోని 12 కథల్లో ఎంత విస్తారమైన , ఎంత లోతైన జీవితం దర్శనమిస్తున్నది ! ” అని ఆశ్చర్యపడ్డారు ముందుమాట రాసిన ప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు . వారి మాటలు అక్షరసత్యం. బొగ్గు గనులలో పని చేసే కార్మికుల కష్టాలను , సముద్ర తీరంలో పీతలను వేటాడే యానాదుల శ్రమను , చావు డప్పు కొట్టే కుటుంబాల బతుకు బాధలను – కథనం చేసిన తీరు ఆకట్టుకోవడమే కాదు మిక్కిలి ఆశ్చర్యపరుస్తుంది . ఆయా కథలు చదువుతున్నపుడు ఆ వృత్తుల్లో ఉన్న వారైనా అంత సూక్ష్మంగా పరిశీలించలేరేమో అనే సందేహం రాకమానదు ! తన కథలకు తాత్త్విక భూమిక తన కుటుంబం నుంచే ఏర్పడిందంటారు రచయిత్రి. అద్వైత భావన , హేతువాద దృక్పథం , ఆలోచనల్లో స్పష్టత , దార్శనికత – చిన్ననాటి నుంచే తన వ్యక్తిత్వానికి ఒక ఆకారాన్ని కల్పించాయని , కృష్ణాతీరం నుంచి గోదావరి ఖని దాకా తాను చూసిన కష్టజీవుల బతుకుల్లో నిండిపోయిన వెతలు తనను రాయడానికి పురికొల్పాయని అంటారు ఆమె. ” తప్పించుకోవటం తెలియని మామూలు మనుషుల పక్షాన నిలబడే రచయిత ” గా తన గురించి చెప్పుకున్నాడు అమెరికన్ రచయిత ‘ జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్‌బెక్ ‘ . బాధల్లో ఉన్న వారి గురించి ఆలోచించే శారద కావూరి గారి కథల్లో సైతం అలాంటి మామూలు మనుషులే కనిపిస్తారు. ఈ పుస్తకం లో వినోదాన్ని మాత్రమే పంచే కాలక్షేపం కథ ఒక్కటీ ఉండదు . జీవితంలో ఉన్న వైవిధ్యమే ఈ పుస్తకం అంతటా కానవస్తుంది. ఆ వైవిధ్యమే పాఠకుల్ని ఈ ‘ జగమంత కుటుంబం ‘ లో తమ అస్తిత్వాన్ని తామే వెతుక్కునేలా చేస్తుంది. నిజాన్ని నిజంగా స్వీకరించగలిగే వారు , స్పందించే జీవశక్తిని సమాజం కోసం వినియోగించే సహృదయులు – హాయిగా చదవదగిన కథలను అందించారు శారద కావూరి గారు. వారి ప్రయత్నం అభినందనీయం.

