లాపతా లేడీస్ 2024 లో ప్రత్యేకంగా నిలిచిన సినిమా. బడ్జెట్ పరంగా ఈ ఏడాదే వచ్చిన యానిమల్, చందూ చాంపియన్, సామ్ బహదూర్, ఆర్టికల్ 370, కల్కి 2898 ఎ.డి. లాంటి సినిమాలతో పోల్చుకుంటే బడ్జెట్ పరంగా చిన్న సినిమానే. అయినా పై సినిమాలన్నిటినీ పక్కకు తోసి మరీ ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైంది.
ఇంతకీఏముందీ సినిమాలో? 13 మంది సభ్యులున్న ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేయటానికి కారణం ఏమిటి? 2023లోనే టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన నాటినుంచి మంచి ఆదరణ పొందుతూ, 2024 మార్చిలో థియేటర్లలోనూ, ఎనిమిది వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనూ అత్యధిక వ్యూయర్ షిప్‌ను సాధించింది.
2001 సంవత్సరం బ్యాక్‍డ్రాప్‍లో అంటే ఇరవయ్యేళ్ల క్రితం వాతవరణంలో కథ నడుస్తుంది. దీపక్ కుమార్, పూల్ కుమారి పెళ్లయ్యాక దీపక్ సొంత ఊరికి వెళ్లేందుకు ఇద్దరూ ఓ రైలు ఎక్కుతారు. అదే ట్రైన్‍లో కొత్తగా పెళ్లయిన మరికొన్ని జంటలు ఉంటాయి. కొత్త పెళ్లి కూతుళ్లందరూ సాంప్రదాయంప్రకారం మొహం కనిపించకుండా కొంగుకప్పుకొని, దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు. అయితే, దిగాల్సిన స్టేషన్ వచ్చిన తొందరలో రాత్రి వేళ పూల్‍ను కాకుండా మరో పెళ్ళికూతురైన పుష్ప రాణిని దీపక్ తీసుకెళతాడు. ముసుగు ఉండటంతో దీపక్‍ను పుష్ప చూడలేకపోతుంది. అయితే, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆమె పూల్ కాదు.. పుష్పరాణి అని తెలుసుకొని దీపక్, వారి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. పూల్ కోసం దీపక్ వెతుకుతాడు.
మరో వైపు మరోచోట ఫూల్ రైలు దిగేసరికి దీపక్ కనిపించడు. తనకన్నా ముందే రైలు దిగిన భర్త ఎక్కడికి వెళ్లిపోయాడో అని స్టేషన్ అంతా వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు. కనీసం భర్త ఊరిపేరుకూడా ఆమెకు తెలియదు పూల్ ఆ రైల్వే స్టేషన్‍లో దిగి దిక్కుతోచని పరిస్థితులో ఉంటుంది. మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ర్టాల్లో నిరుపేద కుటుంబాల్లో నేటికీ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికి మనదగ్గర కాస్త మెరుగే అయినా బాల్య వివాహాలు, ఇష్టం లేని వివాహాలూ మనకూ మామూలే కదా. పెద్దవాళ్లు నిశ్చయించడం.. పిల్లలు తలలు వంచడం, కట్నం సమర్పించుకోలేని నిరుపేద తండ్రులు గంతకు తగ్గ బొంత అని ఓ సంబంధం చూడటం, పెండ్లి కానిచ్చేయడం ఇప్పటికీ అక్కడే కాదు.. చాలాచోట్ల కామన్. పుష్ప వివాహం కూడా అలాగే జరిగింది. అందుకే ఆమెకు భర్త గురించేం తెలియదు. మగవాళ్లు మొహమ్మీద కొంగుకప్పుకునే అవసరం లేదు కాబట్టి ఆమెకు భర్త మొహం ఎలా ఉంటుందో తెలుసు.
అసలు పుష్పరాణి పేరుతో ఉన్న జయ ఎవరు? పూల్ ఎక్కడికి చేరింది? దీపక్‍కు ఆమె దొరికిందా? జయ కావాలనే దీపక్‌తో వచ్చిందా? అనే ప్రశ్నలన్ని ఒక్కొక్కట్టే రివీల్ అవుతూ వస్తుంటాయి. గుండెలు పిండే బాధనీ, సమాజంలోని భయంకరమైన దురాచారాలనీ, పితృస్వామ్య భావజాలాన్నీ ఎత్తి చూపుతూనే కామెడీ ప్రధానగా నడిపించటం దర్శకురాలుగా కిరణ్ రావు ప్రతిభ. ఎక్కడా సీరియస్‌గా, ఆవేశంగా నినాదాలు ఇవ్వటం, రొటీన్ పద్ధతిలో నిందించటం కనిపించదు కానీ పడాల్సిన చోట మాత్రం దెబ్బ గట్టిగానే తగులుతుంది. రైల్వే స్టేషన్‌లో ఫూల్, ఆమెను ఆదరించిన పెద్దమ్మ మాటలు, పుష్పరాణి దీపక్‌తోనూ, పోలీస్ ఇన్స్పెక్టర్ తోనూ చెప్పే మాటలూ ప్రేక్షకుల మనసులోకి వెళ్తాయి.
అయితే ఆస్కార్ ఎంట్రీ వరకూ వెళ్లినా అవార్డ్ విషయంలో మాత్రం ఇప్పుడే ఏ ఆశలూ ఉందవు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో పంపిన చిత్రాలను ఆస్కార్ జ్యూరీ పరిశీలిస్తుంది. సినిమాను వాళ్ల దృష్టికి తీసుకువెళ్లాలంటే ఆయా సినిమాల నిర్మాతలు చాలా పబ్లిసిటీ ఏర్పాట్లు చేసుకోవాలి. అ ఖర్చు కోట్లలో ఉంటుంది. అయితే లాపతా లేడీస్ ఆస్కార్ అందుకున్నా లేకపోయినా భారతీయుల ఆదరాభిమానాలను మాత్రం అందుకుది. ఇండియన్ సినిమాలోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా స్థానం పొందినట్టే అనుకోవాలి.
