ఏదైనా పని చేస్తున్నపుడు,
ఏ అనుభవాన్నైనా తీసుకొంటున్నపుడు
ఆ సమయం పగలా, రాత్రా ముఖ్యం
పనులపై పగటి కాంతి పడుతోందా,
అనుభవాలపై రాత్రుల పొడి రాలుతోందా
చేతులు పగటిలో చేపల్లా ఈదుతున్నాయా,
కళ్ళు రాత్రి సముద్రంలో మునుగుతున్నాయా ముఖ్యం
నిజానికి, పనులు కాదు, అనుభవాలు కాదు
నువు ఉన్నది పగటిలోనా, రాత్రిలోనా ముఖ్యం
పగటిలోనో, రాత్రిలోనో
చుట్టూ ప్రపంచం ఉండటం ముఖ్యం,
లోపలి ఖాళీలోని ఊహలా
వెలుపలి ఖాళీలో ప్రపంచం ఎగరటం ముఖ్యం
పనులు సరే
జరుగుతాయి, జరగకపోతాయి
అనుభవాలు సరే,
అందుతాయి, అందీ, అందక ఊగుతాయి
దుఃఖాలు, సంతోషాలు, నిస్పృహలు సరే
సంధ్యాకాశంలోని రంగుల మబ్బుల్లానో,
వెన్నెలలోని తెలి, నలి మేఘాల్లానో
నెమ్మదిగా నిన్ను మూస్తూ, తెరుస్తూ
నీ మీదుగా తరలిపోతాయి
ఇంతాచేసి
ఎన్ని పగళ్ళ ఫలాలు రుచి చూశావో ముఖ్యం,
ఎన్ని రాత్రుల నదుల్లో మునిగావో ముఖ్యం,
సూర్యాస్తమయానికి చేరేసరికి
జీవనానందంతో బరువెక్కిన
మేఘంలాంటి నీ ముఖం
నవ్వుల్లో, చూపుల్లో, నిశ్శబ్దంలో
ఎన్ని రంగులు విరజిమ్మిందో ముఖ్యం
ఇంతాచేసి
తెల్లని పగటి లాంటి జన్మ నుండి,
చల్లని రాత్రి లాంటి మృత్యువులోకి
ఎంత మృదువుగా ప్రయాణించావో ముఖ్యం






