మొరటోడి ప్రేమలేఖ

Spread the love

వాడు ఆమె ఎప్పుడూ పరస్పర విరుద్ద ధృవాలే
కాలం మారిన వాళ్లు మారరనే వారందరూ
వాడు అడవిలో కట్టెలు కొట్టి తెచ్చినపుడు
ఆమె ఎన్నడు ఆ కళ్ళలోకి తొంగి చూడలేదు
కొండంత ప్రేమ పంచడానికి ఎన్నో కలలు కన్నాడు
నిజానికి వాడికి చెప్పడానికి మాటలే వచ్చేవి కావు
కానీ గొడుగులా ఉండాలని ఆరాటపడేవాడు
ఆమె అటూ ఇటూ వెళ్ళినపుడు మనసుతో
యుద్ధం చేసి ఓడిగేలవాలనుకున్నాడు
ఆమె కన్నీళ్ళు నలుగురికి కనిపించకుండా దాచుకున్న
ఎన్నిసార్లు ఓదార్చడానికి తన వద్దకు వెళ్లేవాడో
అయినా చూసి చూడనట్టు పురుగులా చూసేది
ఎప్పుడూ అందుబాటులో వుంటే ఇంతేనేమో !
ఎంత మంది చెప్పారో..
ప్రేమంటే ఇంతేనేమో వయసుతో పనేముంది
ఎన్నిసార్లు వాడికి వాడే ఆమెను చూసి మురిసిపోయేవాడో..
ఆ పక్షిలా తనకు ఎప్పుడు కాపాల ఉండేవాడు
ఈమధ్య ఆ మొండోడికి ఓ ఆలోచనవచ్చిందంటా
కొత్తగా నేర్చుకున్న కొన్ని అక్షరాలు పోగేసి
ఓ తామరాకు పై గులాబీ రేకుల అత్తరునద్ది
తన మనోఫలకం పై చూసుకున్న కలను
ఆమెకు ప్రేమ లేఖగా రాశాడని తెలిసింది
నేను ఒంటరినే అని నీకు తెలుసూ…
అన్నీ కోల్పోయి నీ ముందు నిల్చున్నాను
నువు కోరింది ఏది ఇప్పుడు నాదగ్గర లేదు
అయినా నువ్వంటే ప్రాణమని ఎలాచెప్పను
గాలిలోని సంపెంగ పూల పరిమళం ఎత్తుకొచ్చిన
ఆ గంధపు సువాసనలను అడిగితే చెబుతాయి కదా
నువ్వు ఆ కాలువ గట్టు పై బిందెతో అడుగులు వేసినప్పుడు
నీ కాలి మువ్వల సవ్వడిని ఎప్పుడైనా గమనించావా?
అవి ఎందుకు గళ్ళు గళ్ళు మంటున్నాయో తెలుసుకో
నాకు నువ్వో అపురూప చిత్రం అని ఎలా చెప్పాలి
నా బ్రతుకంతా నీముందు ఆవిష్కరించాను చూడు
ఒక్కొక్క రోజును దృశ్యరూపంగా చూపించాడు వాడు
భావాత్మకమైన పదాలను పొన్నచెట్టు క్రింద కూర్చుని
మళ్ళీ మళ్ళీ చదువుకుందటా ..
ఘనీభవించిన ఆమె మనసు మంచులా కరిగింది
ఇప్పుడు కథలో ఇద్దరు ఒకే పాత్రలో ఒదిగిపోయారు
చెప్పేవాడు చెబుతున్నాడు వినేవాడు వింటున్నాడు
ప్రేమ రెక్కలు తొడిన పక్షిలా ఇద్దరు అక్కడ నుండి
ఈ ప్రపంచం వెక్కిరించని చోటుకు వెళ్ళారంటా
కథ సుఖాంతమైంది అనుకున్నారంటా అందరు

వజ్జీరు ప్రదీప్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *