సగం మనిషి

Spread the love

” స్టార్ !  అమ్మని అడిగి కాఫీ తీసుకు వస్తావా ?”

” యస్,  కిరణ్ ..కానీ నేను కాఫీ చేయగలను . అమ్మని కష్టపెట్టడం ఎందుకు .”

” అమ్మ వంట ఇంట్లోకి ఎవరినీ రానివ్వదు. అయినా నువ్వు,  ఇంకా అందరికీ అలవాటు కావాలి . “

” నువ్వు వెళ్ళు .. నేను ఈ లోపు బ్రష్ చేసుకుంటాను.  ” అంటూ కిరణ్ బాత్ రూం లోకి వెళ్ళాడు.

కిరణ్ కాఫీ తీసుకు  రమ్మని పురమాయించిన స్టార్ , ఒక రాబోట్ . దానిని కిరణ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు కిరణ్ మావయ్య  ప్రసాద్ .

ప్రసాద్,  అమెరికాలో సిలికాన్ వేలీ లో ఏ. ఐ,  ల ని తయారు చేసే కంపెనీ లో పని చేస్తాడు. .. కిరణ్ ఇంజినీరింగ్ చేసాడు. కేంపస్ రిక్రూట్మెంట్ లో మంచి కంపెనీ లోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు.  అవుతే ఇంకా పోస్టింగ్ ఆర్డర్  వచ్చేసరికి సమయం పట్టేటట్లు వుంది అని , కిరణ్ ని అతని మావయ్య దగ్గరకి పంపారు కిరణ్ తల్లి తండ్రులు.  అక్కడ ఒక నెల వున్నాడు .  ఏ. ఐ ల , గురించి కిరణ్ చూపించిన ఆశక్తి  ప్రసాద్ ని ఆకట్టుకుంది.

అందుకే , ప్రసాద్ , స్టార్ ని కిరణ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు .. అప్పటికే  ఏ.ఐస్ ల ని కొన్ని కంపనీలు మార్కెట్ లో రిలీజ్ చేసాయి . ఆకంపెనీ లలో ప్రసాద్ పని చేసే కంపెనీ కూడా వుంది. 

స్టార్ ని  ప్రయాణంలో  తీసుకు వెళ్ళడానికి  సులువుగా వుండేటట్లు  పేక్ చేసాడు ప్రసాద్.   అవసరమయిన  పేపర్లు కూడా తయారు చేసి కిరణ్ కి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాక  ఏ విధం గా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాడు. అంతే కాదు దానికి సంబంధించిన సూచనల పట్టిని కూడా కిరణ్ కి ఇచ్చిన పేపర్ల తో పాటు జత చేసాడు. కిరణ్ కి రాబొట్ ని ఇండియా కి తీసుకు  వెళ్ళడానికి ఎటువంటి సమస్యలు కలగకుండా వుండడానికి అవసరమయిన జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రసాద్.

 కిరణ్  ఇండియా కి తిరిగి వస్తూ , ప్రసాద్ గిఫ్ట్ చేసిన రాబోట్ ని అమెరికా నుండి ఇండియా కి  తెచ్చాడు.   వచ్చి పదిహేను రోజులయింది . ఇంట్లో అందరూ కూడా, కొద్ది కొద్దిగా దానికి అలవాటుపడడం మొదలు  పెట్టారు .

అందరికీ స్టార్ తో మాట్లాడడం,  దాని చేత చిన్న చిన్న పనులు చేయించుకోవడం చాలా సరదాగ వుంది. ..కాకపోతే కిరణ్ , దానిని పూర్తిగా అతనితోనే తిప్పుకుంటూ వుండే వాడు.

స్టార్ కూడా అందరినీ ఇంట్లో మనిషిలానే పలకరిస్తుంది. కిరణ్ తల్లి రమ కి సహాయం చేస్తుంది. కిరణ్ చెల్లెలి సౌమ్య కి  సలహలు ఇస్తుంది . ” నీ హైర్ స్టైల్ ఈ విధం గా వుంటే బాగుంటావు . ఈ రంగు దుస్తులు  నీ కు బాగా నప్పుతాయి. “

కిరణ్  తండ్రి రామ్మూర్తి కి కూడా,  అతను ఆఫీసుకి వేళ్ళేవరకూ  అన్నీ అందిస్తుంది ..

రాబోట్ ఇంట్లో అందరితో కలిసి పోతూ అందరికీ సహాయం గా వుండడం కొత్తగా వుంది . కానీ సంతోషం గా కూడా వుంది. రమకి అవుతే చాలా రిలీఫ్ గా వుంది .  కూర గాయలు తరిగి ఇస్తుంది. బట్టలు  మడత పెడుతుంది , ఇస్త్రీ చేస్తుంది.  సద్ది పెడుతుంది . ..రమ అదే పని గా  ప్రసాద్ కి ఫోన్ చేసి థేంక్స్ చెప్పింది . సంతోషం తో ఉక్కిరి బిక్కిరి అవుతూ అంది.

” తమ్ముడూ ! నీ రాబోట్ చాలా సాయం చేస్తోందిరా . నాకు చాలా హాయిగా వుందిరా . బలే తయారు చేసారురా .. నువ్వే చేసావటగా .. అదే లేరా, చేసిన వాళ్ళ ల్లో  నువ్వూ వున్నావుట గా ..  నువ్వే ముఖ్య మయిన వాడివి , అని చెప్పాడులే కిరణ్ . చాలా సంతోషం గాను.  చాలా గర్వం గాను వుందనుకో ..”

***

ఇంట్లో అందరూ వాళ్ళకీ తెలియకుండానే స్టార్ ఇచ్చిన సూచనలని పాటించే వారు.

అందరూ , ప్రతీ రోజూ రాత్రి  భోజనాల సమయం లో తింటూ, స్టార్ గురించిన విశేషాలు చెప్పుకుంటూ వుండే వారు.

” ఈ రోజు రాత్రి వంట కి స్టార్  సహాయం చేసింది ..” అంటూ రమ చెప్పింది .

అందరూ ఆశ్చర్య  పోయారు . బాగుంది అని సంతోష పడ్డారు .

” నాకు , లెక్కలు చేసేడప్పుడు సహాయం చేసింది . ఫిజిక్స్ లెసన్ అర్ధమయేలా చెప్పింది. ” చెపుతూంటే

 సౌమ్య మొహం వెలిగి పోయింది . 

” ఈ రోజు సందీప్ వచ్చాడు . వాడినీ చూడగానే వాడి  బయో డేటా మొత్తం చేప్పేసింది . గుణాలు లక్షణాలు కూడా  చేప్పేసింది స్టార్ ..” కిరణ్ ఆశ్చర్యం గా చెప్పాడు.

ఆ విధం గా అందరూ ప్రతోరోజు  రాత్రి భోజనం చేస్తూ , స్టార్ తో వాళ్ళ  వాళ్ళ అనుభవాలు పంచుకునేవారు. . ఆ విధం గా  రోజులు సంతోషం తో నూ, సందడి గానూ తెలియకుండా జరిగి పోసాగాయి .

రామ్మూర్తి ఎక్కువ సేపు ఆఫీసు లో వుండడం తో అతనికి స్టార్ తో ఎక్కువ సేపు గడప డానికి సమయం వుండేది  కాదు.  ఆ విధం గా అతనికి స్టార్ గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏమీ వుండేది కాదు. కానీ అందరూ చెప్పేది అంతా ఆశక్తి గా వింటూ వుండే వాడు.

***

ఒకరోజు సందీప్ తో పాటు  కిరణ్ స్నేహితులు , మహేష్ , హిమన్ , అమర్ , రాకేష్ వచ్చారు . వాళ్ళు వెళ్ళాక స్టార్,  అందరినీ ప్రొఫైల్ చేస్తూ, 

” మహేష్ తో నీకు  వంద శాతం మేచ్ అవుతుంది . అమర్ తో డెబ్బై శాతం మేచ్ . రాకేష్ తో ఎనభై శాతం మేచ్ . హిమన్ కి , నువ్వంటే అసూయ .  అతనితో నువ్వు జాగ్రత్తగ వ్యవహరించాలి .”  అంటూ చెప్పింది.

ఆ విషయం  కిరణ్ ఆ రాత్రీ అందరి తో చెపుతూ వుంటే

“ అదేమిటిరా  అలా ఎలా చెప్ప గలుగుతుందిరా ? ” అంటూ ఆశ్చర్యపోయింది, రమ.

” మన శరీరం లో జరిగే చిన్న చిన్న మార్పులు కూడా  అది గమనిస్తుంది అమ్మా.  ముఖ కవళికలు   , మాట్లాడే విధానం ,గుండె కొట్టుకునే విధానం , ఊపిరి పీల్చుకునే  విధానం , అన్నీ అది గమనిస్తుంది. ఏ  ఎమొషన్ కి,  మన శరీరం లో ఎటువంటి మార్పులు  వస్తాయి అనేది, దాని దగ్గర వున్న  సమాచారాన్ని బట్టి గ్రహించగలుగుతుంది.”

” అవుతే దీని దగ్గర జాగ్రత్తగా వుండాలి ..” అంది రమ .

ఆ మాటకి అందరూ ఒకసారి స్టార్ కేసి చూసారు . దానీ మొహంలో , కళ్ళల్లో,  వాళ్ళకి ఏదయినా కనిపిస్తుందేమొ అని వెతికారు . కానీ ఏం కనిపిస్తుంది యంత్రం లో ?  అదిమాత్రం వాళ్ళని చదవగలుగుతుందనే ఆలోచన,  కాస్సేపు అందరిలోనూ కాస్త ఆందోళన కలిగించింది . ఎవరికివారు,  ఎక్కువ ఆలోచిస్తున్నాం ఏమో,  అనుకుంటూ , మనసుని కుదుట పరుచుకున్నారు .

స్టార్ వచ్చి నెల రోజులు అవ సాగింది. .

ఒక రోజు రాత్రి నిద్ర పట్టక రామ్మూర్తి లేచి బయటకి వచ్చాడు . నీళ్ళు తాగడానికి  వంట ఇంట్లోకి వెళ్ళబోతున్న రామ్మూర్తి , అక్కడ అటూ ఇటూ తచ్చాడు తున్న స్టార్ ని చూసాడు. స్టార్ ని ఆ విధం గా చూసిన రామ్మూర్తికి కాస్త ఇబ్బంది  గా అనిపించింది.

అది యంత్రం అయినా , ఎందుకో అతనికి మనసులో కాస్త అలజడి గా అనిపించింది. ఎవరో ఒక అగంత వ్యక్తి  ఇల్లు అంతా తిరుగుతున్నట్లు, అభద్రతా భావం  కలిగింది . ‘అది వ్యక్తులని పరిసరాలని కూడా స్కేన్ చేసేస్తూ నే వుంటుంది, దానినుంచి ఏమీ దాచలేము, ‘ అనే ఆలోచన కాస్త భయం కూడా కలిగించింది .. రాత్రి అందరినీ గది తలుపులు , లోపల గడియ  వేసుకోమని  చెప్పాలి , అనుకుంటూనే నవ్వుకున్నాడు,  ఎక్కువగా ఆలోచిస్తున్నాను అనుకుని  .

మర్నాడు పొద్దున్న కిరణ్ ని పిలిచి,  బయటకి తీసుకు వెళ్ళి చెప్పాడు .

” స్టార్ ని రాత్రి  పవర్ ఆఫ్ చేయ్ .. ..” అంటూ .

రామ్మూర్తి మాటలకి ఆశ్చర్యం గా  చూసాడు కిరణ్ ..

కిరణ్ సందేహాలకి తావు ఇవ్వకుండా, ” కరెంట్ బిల్ చూసుకోవాలి కదరా .”

తల ఆడించాడు కిరణ్, “ అవును .” అన్నట్లు .

అందరికీ స్టార్ తో రోజులు ఉత్సాహం గా  గడిచిపోతున్నట్లు అనిపిస్తుంటే , రామ్మూర్తి కి మాత్రం స్టార్ ని చూసినప్పుడల్లా ఒక అగంత వ్యక్తి ఇంట్లో తిరుగుతున్నట్లే అనిపించేది .

రోజులు గడుస్తున్న  కొలదీ ఇంట్లొ అందరిలో నూ మార్పులు రావడం రామ్మూర్తి గమనించాడు . కిరణ్ స్నేహితులు మారారు . బయటకి వెళ్ళడం తగ్గించాడు.

” ఏం చేస్తున్నావు ? ” , అంటే  ” స్టార్ నేను కబుర్లు చెప్పుకుంటున్నాం .” అని చెప్పేవాడు.

” అది ఒక యంత్రం . దానితో కబుర్లు ఏమిటి ?” అని మనసులో  విసుక్కునేవాడు ,  రామ్మూర్తి .

కిరణే కాదు ఎవరిని ఏమి అడిగినా , స్టార్  చెప్పింది ,  చేస్తున్నాం  అంటూ  చెప్పడం మొదలు పెట్టారు . అందరినీ అది  అంత ప్రభావితం  చేయడం, రామ్మూర్తికి ఆశ్చర్యం గా అనిపించేది .

‘ స్టార్ చెప్పినట్లే అంతా చేస్తూ  వుండడానికి ,  మరి వాళ్ళ తెలివి తేటలు ఎక్కడకి వెళ్ళినట్లు ? ‘  అని రామ్మూర్తి అనుకుంటూ వుండే వాడు. 

‘ స్టార్ ని అందరికీ సాయం చేయడానికి , అందరూ చెప్పినట్లు నడుచు కోవడానికి , తెచ్చుకుంటే చివరికి అదే అందరినీ,  వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ప్రభావితం  చేస్తూ,   నడిపిస్తోందా ? ‘ అనే ప్రశ్న రామ్మూర్తి మనసు లో  కదిలేది .

‘ అందరి జీవిత గమనాన్నే మార్చేస్తొంది . మనకి  ఏమి కావాలో, ఏమి అక్కర్లేదో అదే చెప్తే , మనం ఏ విధం గా ప్రవర్తించాలో కూడా అదే చెప్తూంటే ,  మన జీవితాన్ని,  దాని వశం చేసుకుందా ? దాని అదుపులో పెట్టుకుందా ?  ‘ అనే అనుమానాలు  కూడా రామ్మూర్తి కి కలగ సాగాయి

కిరణ్ , వాడి కి చాలా దాగ్గర అనుకున్న  స్నేహితులని , ప్రొఫైల్ మేచ్ అవలేదని స్టార్ చెప్పడం తో మార్చేసాడు .   ..వాడి ఇష్టా ఇష్టాలు మార్చుకున్నాడు . వేసుకునే  బట్టల దగ్గర నుంచి , ఇష్ట పడే అమ్మాయి వరకూ అన్నీ స్టార్ చెప్పినట్లే చేస్తున్నాడు.

చిన్నప్పటినుంచి కలిసి తిరిగిన  అమ్మాయి స్వాతి . స్వాతి ని కూడా దూరం  పెట్ట సాగాడు .

” ఏమయింది , స్వాతి నువ్వూ కలిసి తిరిగే వారు   ఇప్పుడు స్వాతి కనిపించటం లేదు ?” అని అడిగాడు రామ్మూర్తి .

” స్వాతి లో కాస్త మొండితనం వుంది .  నాకు , ఆమెతో లాంగ్ టైం రిలేషన్ షిప్ వర్క్ అవదు అని చెప్పింది స్టార్ ..”  అన్నాడు కిరణ్ .

” ఆశ్చర్య పోతూ చూసాడు రామ్మూర్తి, కిరణ్ ని . “

అక్కడే వున్న రమ కూడా ఆశ్చర్య పోయింది . ” అదేమిటి రా . స్వాతి , నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా . స్టార్ నిన్న మొన్నే గా వచ్చింది. దానికి ఏం తెలుసు ? ” అంది రమ కాస్త అసహనం గా .

” స్టార్ దగ్గర చాలా సమాచారం వుంటుంది  అమ్మా . స్వాతి గురించి ఆమె కి కూడా తెలియని విషయాలు  స్టార్ కి తెలుస్తాయి .  అది ప్రొఫైల్  చేస్తుందమ్మా “

” ఏడిసినట్లుంది . ఇన్న్నేళ్ళల్లో  ఆమె గురించి నీకు తెలిసిన దానికన్న,  స్టార్ కే ఎక్కువ తెలుసు అనుకోవడం నీ మూర్ఘత్వం .

ఇంక కొన్నాళ్ళు పోతే , అది ఏదో ఒకటి మా మీద కూడా చెప్తుంది . . మమ్మల్ని  దూరం పెట్టేస్తావా?  అదొక యంత్రం.  ఏదో పని  చేసిపెడ్తోంది  బాగుందనుకున్నాం కానీ , ఇలా మనుషుల  మధ్య బంధాలని కూడా శాసించడం ఏమిటిరా ? దానికి, మనసు ఆలోచనలు ఎమోషన్స్ ఏమయినా వున్నాయా అసలు ?  పనికి రాని ప్రొఫైల్ ఒకటి మధ్యలో  , అదేదో శాసనం లా ? ..  నీకు ఏమయినా మందు పెట్టిందేమిటి రా ఆ యంత్రం ? “

రమ ఆ విధం గా ఆవేశపడుతూంటే రామ్మూర్తి ఆశ్చర్య పోయాడు .  రమ,  స్టార్ ని చూసి  మురిసి  పోని క్షణం  లేదు . అటువంటిది స్వాతి విషయం వచ్చేసరికి అంత నిష్కర్ష గా మాట్లాడుతూంటే ఆమెని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు . ఎన్నో ఏళ్ళనుంచి స్వాతి , ఇంట్లో మనిషిలానే తిరిగేది . అన్నీ అనుకున్నట్లు జరిగితే  స్వాతి తో కిరణ్ కి పెళ్ళి చేద్దామనే తమ ఆశ . బయటకి అనుకోలేదు కానీ  స్వాతి తల్లి తండ్రుల మనసుల్లో కూడా అదే వుందని తెలుసు రామ్మూర్తికి .

రమ మాటలకి , కిరణ్ కాస్త ఖంగు తిన్నాడు.  స్టార్ గురించి ఎప్పుడు గొప్పగా మాట్లాడినా అవును అవును అంటూ తనకి వత్తాసు  పలికే అమ్మ , ఒక్క సారిగా ఏదో పార్టీ మార్చేసినట్లు మాట్లాడడం , కిరణ్ హారాయించుకో  లేకపోయాడు. .

అవమానంతో అతని మొహం కాస్త  నల్లబడింది . కిరణ్ ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి పోయాడు.  రమ కూడా కాస్సేపుi గదిలోకి వెళ్తున్న కిరణ్ ని, అసహనం గా చూసి,   తన   గది లోకి వెళ్ళి పోయింది

రామ్మూర్తి కి ఏం మాట్లాడాలో తెలియ క అక్కడే కూర్చుండి  పోయాడు .

ఇదొక కొత్త పరిణామం . దీనికి ఎలా స్పందించాలో కూడా అర్ధం కాలేదు .  స్వాతి కిరణ్ లకి,  ఒకరి పట్ల ఒకరి వున్న అభిమానం అందరికీ తెలిసినదే .

కానీ వున్నట్లుండి స్టార్ చెప్పిందని , స్వాతిని దూరం  పెట్టడం ఏ విధం  గా చూసినా రామ్మూర్తి కి కూడా సబబు గా అనిపించలేదు . కిరణ్ ఈ విధం గా తన అభిప్రాయా లు అన్నీ పక్కన పెట్టి , స్టార్ చెప్పినట్లు నడుచుకోవడం సరి అయినది కాదని , రామ్మూర్తి కి కూడా అనిపించినా,  రమ లాగా ఆవేశ పడలేక పోయాడు .. 

‘నిన్న మొన్నటివరకూ రమ కూడా స్టార్  ని ప్రశంసించిన వ్యక్తే .. కానీ అది ఆమెని ఏ విధం గానూ ఆమె ని వాస్తవికతకి దూరం చేయలేదు .  కానీ కిరణ్ స్టార్ ప్రభావం లోపడి అతని వాస్తవికతని కూడా మార్చేసుకుంటున్నాడు .   చాలా రోజులనుంచి అది  తను గమనిస్తున్నా,  తన ఆలోచనలకి ఒక రూప కల్పన చేసుకో లేక  పోయాడు . తన మనసులో సందేహాలని కూడా ఎటువంటి విధం గానూ వ్యక్త పరచ లేని పరిస్తితి .

ఏవిధం గా కిరణ్ కి నచ్చ చెపుతాడు  ? జరుగుతున్నది ఎలా అర్ధం చేసుకోవాలో తెలియని అయోమయం తనది .’ ఆలోచిస్తూ ఒక సారి ప్రసాద్ తో మాట్లాడుతాను . కాస్త స్పష్టత వస్తుంది అనుకున్నాడు.  

సమయం చూసి  ప్రసాద్ కి ఫోన్ చేసాడు .

” ప్రసాద్,  నువ్వు కిరణ్ కి ఇచ్చిన గిఫ్ట్ బాగుంది .. కానీ కిరణ్ స్టార్ ని , అదే ఆ  రాబోట్ ని , నియంత్రించడం కాదు.  అదే కిరణ్ ని నియంత్రిస్తోంది,  అని అనిపిస్తోంది.  నాకెందుకో,  ఈ విషయం లో ఎందుకో  తెలియని ఆందోళన కలుగుతోంది  “

ప్రసాద్ గట్టిగా నవ్వాడు .” బావ గారు ! ఇంకో ఆరు నెలలలో మార్కెట్ అంతా అవే వుంటాయి . ప్రతి ఇంటికి ఒకటి చూస్తారు మీరు ..

మీ ఆందోళనకి ఎటువంటి  ఆధారం లేదు ..  దాని వలన మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగు పడ్తుంది. అక్క చూడండి ఎంత హేపీ గా వుందో. చాలా సాయం గా వుంటొంది అని చెప్తోంది. సౌమ్య కూడా తనకి చదువులో  సహాయం చేస్తోంది,అని చెప్తోంది. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అని అనిపిస్తోంది నాకు. “

” అందరినీ తెలియకుండానే ప్రభావితం చేస్తొంది . ఆ రకం గా వారి  ప్రవర్తనని , ఇష్టాఇష్టాలని , మారుస్తోంది. చివరకి వాళ్ళల్లో కూడా మార్పు తెచ్చేలా వుంది . “

” రాబోట్ అనే ఏముంది బావగారు ? మన చుట్టూ వున్న చాలా విషయాలు , సంఘటనలు , మనుషులు అన్నీ,  మనని ఏదో ఒక విధం గా ప్రభావితం చేస్తూనే  వుంటాయి . ఒక్కొక్కప్పుడు ఆ ప్రభావం వల్ల మనం మారుతాము కూడా.  కాదంటారా ?  “

” కానీ ఎంత ప్రభావితం చేయ బడినా , మనకంటూ వున్న  అస్తిత్వానికి దూరం గా  వెళ్ళం కదా. మన వుండే వాస్తవికతకి దూరం అవము కదా. సహజత్వాన్ని కోల్పోము కదా.  “

”  మనం అనుకున్న  వాస్తవికత కూడా ఎవరో  కల్పించినదే కదా .. అస్థిత్వం అనుకున్నది కూడా  అందరి చేతా ప్రభావితం చేయబడి ఏర్పడినదే కదా. కాదంటారా? మార్పు కి  స్పందించ   కూడదు  అనుకుంటే నే  సంఘర్షణ .. లేకపోతే ఏముంది .. ఆలోచించండి. మన జీవితాల లో బరువంతా దించేసుకున్నట్లే  కదా ..  ఎంతో సమాచారాన్ని వడపోసి ,  విశ్లేషించి , మన చేతిలో అరటి పండు  వలచి పెడుతున్నట్లు పెడుతూంటే  ఏటువంటి  పనులు చేసుకోవడం అయినా , నిర్ణయాలు తీసుకోవడం  అయినా ఎంత సులభం ?..”

‘అతను చెప్పేది ఎలా వుందంటే , నీ జీవితాన్ని అంతా ఆ రాబోట్ కి అప్ప చెప్పి నువ్వు హాయిగా చూస్తూ వుండు. కష్టం ఏముంది ? అనే. ‘ , అనుకుంటూ, ఇంక ఏమీ మాట్లాడ లేక పోయాడు రామ్మూర్తి .

‘ ప్రసాద్ ఆ రాబోట్ ని తయారు చేసిన వ్యక్తి . నాకు ఎటువంటి సాంకేతిక జ్ఞానం లేదు . ఏమి తెలుసు  అని , అతనితో మాట్లాడ గలడు. ఆ కాస్సేపు అయినా నేను  చెప్పేది  విని మాట్లాడాడు . బయట వాళ్ళు అవుతే , నీకేం తెలుసు అని ఎద్దేవా కూడా చేస్తారు. ‘  అనుకున్నాడు.

కానీ అతని మనసులో మాత్రం సందేహాలు  నివృత్తి కాకుండా ,  తేనెటీగల్లాగ ముసురు కుంటూనే  వున్నాయి.

 ఆ తర్వాత , యాదృఛ్చికంగా రామ్మూర్తి చిన్నప్పటి  స్నేహితుడు ఆనంద్ ని  కలవడం జరిగింది.  ఇద్దరూ కాఫీ షాప్ లో కూర్చుని కాస్సేపు చిన్నప్పటి విషయాలు  నెమరు వేసుకున్నారు .

ఆనంద్ , ఐటి  కంపనీ లో పనిచేస్తున్నాడు. అది తెలిసి , మాట్లాడుతూ మాట్లాడుతూ  తన మనసులో సందేహాల గురించి చెపుతూ అన్నాడు

” రాబాట్స్ గురించి ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. మనకి  సహాయం గా వుంటాయి అంటారు కానీ, అవే మనని నెమ్మదిగా నియంత్రిస్తాయేమొ అని అనుమానం కలుగుతుంది . నువ్వేమంటావ్ ? “

” రాబొట్స్ వరకూ  ఎందుకురా. మన  సోషల్  మీడియా వేదిక లు అన్నీ కూడా ఒక విధం గా అందరినీ ప్రభావితం  చేస్తూనే వుంటాయి . అంత ఎందుకు, నీ చేతిలో ఫోన్ కూడా నిన్ను వింటూ వుంటుంది . నిన్ను ఒక రకం గా గమనిస్తూనే వుంటుంది . నిఘా అంటారు చూసావా  ఆవిధం గా నువ్వు ఫోన్ లో, ఫోన్ చేసినా , ఇంటర్ నెట్ ఉపయోగించినా. అన్నీ రికార్డ్ చేసుకుంటుంది , వాటి ఆధారంతో నీ ప్రొఫైల్ తయారు చేసుకుంటుంది . దానికి అనుగుణం గా నువ్వు ఇష్టపడే విషయాలని , నువ్వు ఆశక్తి చూపించ.విషయాలని, నీకు  అందిస్తుంది . నీ ధ్వనికి , ప్రతిధ్వని లాగ . అది వినడానికి బాగానే వుంటుంది,  కానీ అది అంత  తేలికగా కనిపించే విషయం కాదు .  ఒకే విధమయిన సమాచారం అందించడం వలన  వేరు వేరు దృక్పధాలలో ఒక విషయాన్ని చూసే అవకాశం వుండదు.  దానితో వ్యక్తుల దృక్పధాలు సంకుచితం అవడం జరగ వచ్చు . అది గుర్తించి , దాని లోంచి బయట పడితే తప్ప , మనకి మనమే ఒక కృత్రిమ ప్రపంచాన్ని తయారు చేసుకున్నట్లే .

అలాగే ఒక అభి ప్రాయాన్ని  ఎక్కువ మంది చేత సోషల్ మీడియలో ఫీడ్  చేయిస్తే,  దాని  ప్రభావం మల్టిప్లై అవుతుంది.  దాన్ని , అందరూ ఒప్పుకునే విధం గా అందరి మీద ఒక ఒత్తిడి తీసుకు  వస్తుంది. అది మంచికే  అని కూడా చెప్పలేం . నిజమూ అని చెప్పలేం. ఆ విధం గా నిజానికి అబద్ధానికి మధ్య తేడా చెరిగిపోతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో  తెలియని కృత్రిమ వాస్తవికతలో కి మనని నెట్టేస్తుంది.  ఇలా రక రకాలుగా ఈ సాంకేతికత  విస్తరణ , అందరిలోనూ తెలియకుండానే మార్పులు తీసుకు వస్తూనే వుంటుంది.

అదొక్కటే కాదు . సోషల్ మీడియా వేదికలు అయినా, ఏ సాంకేతిక  పరికరాలు అయినా  ఫోన్ ల దగ్గర నుంచి రాబోట్స్ వరకూ అన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్స్ తయారు చేస్తాయి.  కార్పొరేట్స్ , లాభాల ప్రాతి పదిక పైనే  నడుస్తాయి . సమాజానికి ఏది మేలు అనే ఆలోచన తో కాదు . అందుకే  ఎవరు,  ఏ సాంకేతక పరికరాలు  ఉపయోగించినా , వాళ్ళ ప్రవర్తనని  కార్పొరేట్స్ తమకి అనుగుణం గా మార్చుకునే  విధంగా ఆ సాంకేతికత ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు . ఆ ప్రయత్నాలు  నైతికంగా వుంటాయని కూడా  అనుకోలేము .  కొంత మంది,  వాళ్ళ అహం తృప్తి చెందడాని కోసం , దురాశతోనూ చేసే పనుల ఫలితాలు , మనలాంటి సామాన్యులు  భరించాల్సి వస్తుంది . నేను చెప్పినదంతా మచ్చుకి మాత్రమే.” అని , కాస్త ఆగి ” ఏది ఏమయినా ఒక అయిదు ఆరు ఏళ్ళల్లో ఒకకొత్త ప్రపంచాన్ని అవుతే చూడబోతున్నాం . ”  అంటూ నవ్వాడు .

మాట్లాడుతూ మాట్లాడు తూనే ఆనంద్ శెలవు తీసుకున్నాడు .

 రామ్మూర్తి ఆనంద్  మాటలు మననం చేసుకుంటూ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాడు .

మనిషి ఎటువంటి సాంకేతికత లేనప్పుడు కూడా  , ప్రసాద్ అన్నట్లు చాలా రకాల ప్రభావాలకి లోను అవుతూనే వున్నాడు  . కానీ ఏదీ  మనిషిలో సహజత్వానికి  హాని చేయదు . కానీ ఇప్పుడు అలా లేదు .

ఈ సాంకేతికిత వల్ల , తెలియకుండానే   మనిషి సహజత్వాని కోల్పోతున్నా డేమో అనిపిస్తోంది.

రెండు రోజులు అయిన తర్వాత ఒక రోజు రాత్రి ,   కిరణ్ ,  స్టార్ పవర్ ఆఫ్ చేసాడని నిర్ధారించుకుని , రామ్మూర్తి అందరినీ కూర్చో బెట్టుకుని

తన సందేహాలు  చెపుతూ అన్నాడు .

” ఇంక కొన్నాళ్ళల్లో రాబోట్స్ ఎలానూ ఎక్కువగానే చూస్తాము. అప్పుడు మనము మన సహజత్వానికి ఎలానూ దూరం కాక తప్పదు . ఇప్పటినుంచి. ఎందుకు దూరం అవడం ? ఎన్నాళ్ళు వీలవుతే  అన్నాళ్ళు,  మనకి  సహజమయిన ప్రకృతితో జీవిద్దాం .. ఆ తర్వాత  ఈసాంకేతికత విస్తరణ వల్ల అవుతేనేం ,  రాబొట్స్ వల్ల అయితేనేం , మనం నెమ్మదిగా మారిపోయి,  యంత్రాలలాగే  బతుకుతామేమో.”

అందరూ కాస్సేపు  నిశ్శబ్దంగా వుండి పోయారు . రామ్మూర్తి సాలొచనగా గంభీరం గా మళ్ళీ అన్నాడు

” నాకు అర్ధమయింది ఏమిటంటే , డేటా అంటే , సేకరించిన సమాచారాన్ని ఆధారం  చేసుకుని యంత్రాలు,  అదే ఈ రాబోట్స్  పని చేస్తాయి . మనుషులు  అలా కాదు కదా . మనుషుల, ప్రతీ స్పందన లో నూ , ప్రతీ ప్రతిచర్య లో నూ ఒక విధమయిన సహజత్వం వుంటుంది . అది వారి  వారి వ్యక్తిత్వాల బట్టీ మారుతూ వుంటుంది . అందుకే మనుషులంతా  మూస పోసినట్లు  ఒకే విధం  గా వుండరు . అదే సృష్టిలో గొప్పతనం . కానీ ఇప్పుడు ఈ సాంకేతిక జ్ఞానం , దాని నుంచి మనుషుల్ని వేరు చేస్తోంది. అందరినీ ఒకే మూసలో  పెట్టడానికి ప్రయత్నిస్తోంది . అది ఒక రకమయిన యాంత్రీ కరణమే . మనుషులని యాంత్రాలుగా మార్చే ప్రయత్నం. “

” మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే , ముందు ముందు మనుషులు సగం మనుషులుగా నే బతుకు తారు అన్న మాట . ” అంది రమ .

 రామ్మూర్తి రమ కేసి ప్రశంస పూర్వకంగా చూసాడు.

సౌమ్య తల్లి వైపు , తండ్రి వైపు,  భయం గా చూసింది . 

రామ్మూర్తి , ‘భయం లేదు నేను వున్నానుగా .’ ,అన్నట్లు సౌమ్య భుజం మీద చేయి వేసాడు.

కిరణ్ ఆలోచిస్తున్నట్లు తల వంచుకున్నాడు .

***

మర్నాడు కిరణ్ .. స్టార్ ని పవర్ ఆన్ చేయలేదు .. దాని గురించి  ఎవరూ పట్టించు కోలేదు . మునపటిలాగా మళ్ళీ రోజులు సాగిపోవడం మొదలు పెట్టాయి . కిరణ్ , స్వాతి మళ్ళీకలిసి  తిరగడం మొదలు పెట్టారు . కిరణ్ పాత స్నేహితులు తో మళ్ళి కలుస్తున్నాడు ,

సౌమ్య ఎవరి సహాయం ఆశించకుండానే చదువు కుంటోంది . రమ ఎప్పటి లానే  తన పనులు తను చేసుకుంటోంది .

రామ్మూర్తి  మనసుకి ప్రశాంతత చేకూరింది. ‘ రమ చెప్పినట్లు ముందు ముందు సగం మనుషులు గా జీవించడం తప్పదేమో. ముందే అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా  జాగ్రత్త పడ్డాం .’ అనుకుంటూ తేలిక గా ఊపిరి పీల్చుకోసాగాడు .  ‘ ఈ సాంకేతికత విస్తరణ   వల్ల ,  మనిషి సగం మనిషిగా రూపాంతరం చెంది , నెమ్మదిగా అంత రించి పోతాడా ? ‘ అన్న ప్రశ్న మాత్రం అప్పుడప్పుడు రామ్మూర్తిని కలవర పడుతూనే వుంటుంది .

***

మణి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *