“ఒట్టేసి చెప్తున్నాను. నేను ముసలివాడిని. కీళ్లనొప్పులతో బాధపడుతున్నాను; నా రెండు కాళ్లూ బిగుసుకుపోయి రెండు చెక్క ముక్కల్లా ఉన్నాయి.అయినప్పటికీ,ఒక అందమైన ఆడపిల్ల నన్ను సూది కన్ను లోపలి నుంచి దూక మంటే ఎగిరి గంతేసి దూకేస్తాను; సర్కస్ లో బఫూన్ మండుతున్న రింగ్ లో నుంచి దూకేసినట్టే. ఆ సాహసం చేస్తూ నేను చనిపోవడానికి అయినా సిద్ధమే. అది నా రక్తంలోనే ఉంది. నేను ఒక ప్రేమికుడిని. పాతతరం ప్రేమికుడిని. అందమైన మహిళ, నా నరాలలో నఖశిఖ పర్యంతం ఉద్రేకాన్ని నింపుతుంది. అక్కడంతా.” అన్నాడు కల్నల్ లాపోర్టే .
“ఫ్రాన్స్ వాసులం, మేమంతా అలాగే ఉంటాం. మేమంతా వీరులం. ప్రేమ వీరులం. అదృష్టం మా సొంతం. ఒకప్పుడు మేము దేవుడికి నిజమైన అంగరక్షకులుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇక ఆ దేవుడే లేకుండా చేసారు. కానీ, మా హృదయాలలో నుంచి మహిళలని మాత్రం ఎవరూ తీసేయలేరు. ఆమె అక్కడే ఉంటుంది. శాశ్వతంగా ఉంటుంది. మీము ఆమెని ప్రేమిస్తూనే ఉంటాం. ఎల్లప్పుడూ. ఆమె కోసం ఎన్ని తిక్క పనులు అయినా చేస్తాం. ఎప్పుడైనా చేస్తాం. ఫ్రాన్స్ యూరప్ మ్యాప్ లో ఉన్నంతవరకు చేస్తాం. నిజానికి ఫ్రాన్స్ ని యూరప్ మ్యాప్ లో నుంచి తుడిచేసినా, ఫ్రెంచ్ వాళ్ళు అంటూ ఉంటారు కదా.”
“నేను ఒక మహిళ ఎదురుగుండా ఉన్నప్పుడు, ముఖ్యంగా అందమైన మహిళ ఉన్నప్పుడు, ఏదైనా చేయగలనని నాకు అనిపిస్తుంది. దేవుడి సాక్షిగా, ఆమె చురకత్తి చూపులు నన్ను గుచ్చుకున్నంత సేపూ, నాలో రక్తం మరుగుతుంది. సాధారణంగా చేయలేని పనులు నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఒక ద్వంద యుద్ధం చేస్తాను; నా బలాన్ని ప్రదర్శించడానికి ఫర్నిచర్ ని ధ్వంసం చేస్తాను. నేను అత్యంత దృఢమైన వాడిగా, ధైర్యవంతుడిగా, సాహసిగా, పురుషులందరిలోకి ఆమె పట్ల అత్యంత విధేయుడిగా ఉన్నట్లు నిరూపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాను.”
“అయితే ఇందుకు సిద్ధపడేది నేనొక్కడినే కాదు. మొత్తం ఫ్రెంచ్ సైన్యంలో ఉన్న నాలాంటి వాళ్లంతా ఇందుకు సిద్ధంగానే ఉంటారు. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. ఒక సాధారణమైన సైనికుడి దగ్గర్నుంచి జనరల్ వరకు; మొదటి దళం నుంచి చివరిదళం వరకు, ఒక అందమైన మహిళ మాకు స్ఫూర్తి. జాన్ ఆఫ్ ఆర్క్ ఏం చేయించిందో మీకు తెలుసుగా! సెడాన్ లో ఆరోజు సాయంత్రం మార్షల్ మెక్‌మోహన్ గాయపడిన తర్వాత ఒక అందమైన మహిళ అధికారాన్నితన చేతుల్లోకి తీసుకొని యుద్ధం నడిపి ఉంటే మేము కచ్చితంగా ప్రష్యన్ సేవలను చెల్లాచెదురు చేసి ఉండే వాళ్లం. మా సౌర్య ప్రతాపాలు చూపించి ఉండేవాళ్ళమని ఘంటాపదంగా చెప్పగలను.”
” ఒక అందమైన మహిళ సైన్యం అధికారాన్ని చేపడితే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఆనాడు పారిస్ కి కావాల్సింది త్రొచ్ కాదు. సెయింట్ జెనీవివ్. యుద్దంలో మహిళల ముందు పురుషులు ఎంతకైనా తెగిస్తారన్న యుద్ధనీతిని మనం గుర్తు పెట్టుకోవాలి. నా అనుభవం లోని ఒక సంఘటను ఉదాహరణగా చెప్తాను.”
“ఆ రోజుల్లో నేను ఒక కెప్టెన్ ని. సాధారణమైన కెప్టెన్ ని. ఒక సైనిక దళం అధిపతిగా ఒక ప్రాంతం గుండా మేము వెనక్కి వెళ్తున్న స్కౌట్ల బృందానికి నాయకత్వం వహిస్తున్నాను. ఆ ప్రాంతం అంతా ప్రష్యన్ సైనికులతో నిండి ఉంది. వాళ్లు మమ్మల్ని చుట్టుముట్టారు. మమ్మలిని వెంబడిస్తున్నారు. మేము బాగా అలసి ఉన్నాం. నీరసించి ఉన్నాము. ఆకలితో ఉన్నాము. కానీ మేము మర్నాడు పొద్దుటికల్లా బార్ సుర్ టైన్ కి చేరుకోవాల్సి ఉంది. లేకపోతే వాళ్లు మమ్మల్ని చంపేస్తారు; ముక్కలు ముక్కలు చేస్తారు; నరికేస్తారు. ఎలా మేము తప్పించుకో గలిగామో నాకైతే ఇప్పటికే అర్థం కాదు. ఆరోజు మేము ఇంకా 10 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. 10 కిలోమీటర్లు. అదీ రాత్రి లోపల. పైగా మంచు లో. ఆకలితో. నా వరకు నేను ఇక అంతా అయిపోయింది, పాపం, ఈ పిచ్చోళ్ళు: వీళ్ళ పని ముగిసినట్టే. వీళ్లు ఇంక ఎప్పటికీ గమ్యం చేరలేరు, అనుకున్నాను.”
“నిన్నటి నుంచి మాకు ఆహారం లేదు. రోజంతా మేము గడ్డి పొదల్లో దాగుని ఉన్నాము. ఒకరిని ఒకరం గట్టిగా పట్టుకొని కూర్చుని శరీరాలను వెచ్చచేసుకుంటున్నాము. మా కడుపులు నకనక లాడుతున్నాయి. కనీసం మాట్లాడలేకపోతున్నాము. కదలలేకపోతున్నాము.కొందరు అప్పుడప్పుడూ శ్రృహతప్పి కూడా పడిపోతున్నారు.”
“సాయంత్రం ఐదు గంటలకే చీకటి పడిపోయింది. మంచు కురుస్తోంది. నేను నా సైనికులని కదిలించే ప్రయత్నం చేస్తే, ఒక్కడు కూడా లేచి నిలబడేందుకు సిద్ధంగా లేడు. అటు ఇటు కదలడానికి కూడా ఓపిక ఉన్నట్టు కనిపించడం లేదు. లేచి నిలబడలేక పోతున్నారు. వాళ్ళ కాళ్ళన్నీ చలికి, ఆకలికి, గడ్డకట్టుకొని కొయ్యబారిపోయాయి. “
“మేము ఒక గడ్డు దారి గుండా నడవాలి. తినడానికి ఏమి దొరకని నిర్మానుష్యమైన గ్రామీణ ప్రాంతంలో మా ప్రయాణం.ఆ ప్రాంతం అంతా మంచు తెరలు తెరలుగా కురుస్తూనే ఉంది. తెల్లని మంచు ముక్కలు కురుస్తూ, భూమిపై ఉన్న ప్రతి దాన్ని చిక్కటి పొరలతో కప్పేస్తున్నాయి. ప్రపంచం అంతమై పోతుందేమో అనేంతగా మంచు కురుస్తోంది.”
“అప్పుడు నేను సైనికులారా పదండి కదులుదాం అన్నాను.”
“వాళ్లు తెల్లటి మంచు పొరలను చూస్తూ కూర్చున్నారు. ‘మాకు ఇక భరించే ఓపిక లేదు మమ్మల్ని చనిపోనియ్యి’ అనేటట్టు ఉన్నాయి వారి చూపులు. నేను అప్పుడు నా చేతిలోని తుపాకీ తీసి ‘జంకిన మొదటి వాడిని చంపేస్తాను’ అన్నాను. ఇక చేసేది లేక వాళ్ళు నెమ్మదిగా లేచి నడిచే ప్రయత్నం చేశారు. వాళ్ళ కాళ్ళల్లో ఏమాత్రం బలం లేనట్టుగా కదులుతున్నారు. ఉన్నవాళ్లలో నలుగురిని 300 గజాలు ముందుగా వెళ్లి పరిస్థితి ఎలా ఉందో గమనించమని పంపించాను. ఆ తర్వాత వాళ్ళందరూ గందరగోళంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తూ,అటూ ఇటూ ఊగిపోతూ అడుగులు వేస్తున్నారు. కాస్త గట్టి వాళ్ళని వెనక భాగంలో పెట్టాను;వాళ్ళచేత నత్త నడక నడుస్తున్న వాళ్ళ గమనాన్నిపెంచమని ఒత్తిడి చేయడానికి, ముందున్న వాళ్ళవీపుల పై తుపాకి మొన పెట్టించాను.”
“మంచు పడుతున్న విధానం చూస్తే మమ్మల్ని బతికుండగానే పూర్తిగా మంచు లో పాతరేస్తుందేమో అని అనిపించింది. మంచు భయంకరంగా పడుతోంది. మేము వేసుకున్న కోట్లు, టోపీలు-అన్ని మంచుతో నిండిపోయాయి. మంచు అసలు ఏమాత్రం కరగడం లేదు.
అలసిపోయి, మంచులతో కప్పబడిన మేము చనిపోయిన వాళ్ళ ప్రేతాల లాగా కనిపిస్తున్నాము. ఏదో అద్భుతం జరగితే తప్ప, ఈ విపత్తు నుండి బయటపడే అవకాశమే లేదని నాకు అనిపించింది. “
“సైనికులో కొంతమంది బొత్తిగా నడవలేకపోవడం వల్ల, మమ్మల్ని అనుసరించలేకపోవడం వల్ల, మేము ఒకచోట వాళ్ళకోసరం కొన్ని నిమిషాలు ఆగాల్సి వచ్చింది. మా చుట్టూ, రాలుతున్న మంచు శబ్దం తప్ప మరో శబ్దం వినిపించడం లేదు, కొంతమంది పడుతున్న మంచును విదుల్చుకుంటున్నారు, మరి కొంతమంది శరీరాన్ని కదల్చలేకపోతున్నారు, అందువలన మళ్లీ నడక ప్రారంభవించమని నేను ఆదేశాలు ఇచ్చాను, వాళ్ళ తుపాకులు భుజాలకు తగిలించుకొని, కాళ్ళు ఈడ్చుకుంటూ, మళ్లీ నడక మొదలుపెట్టారు. కాసేపయిన తర్వాత మళ్లీ కొంత మంది సైనికులు నడక వేగం బాగా తగ్గి వెనకబడిపోయారు. అప్పుడే స్కౌట్లు వెనక్కి వచ్చారు.వాళ్లకేదో అనుమానం వచ్చింది. కొంత దూరంలో ఎవరివో మాటలు వినిపించాయి. నేను వెంటనే ఆరుగురు సైనికులని, ఒక సార్జెంట్ ని, ఏం జరుగుతుందో చూడడానికి పంపించి, వాళ్ళు తెచ్చే వార్త కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాం.”
“ఉన్నట్టుండి ఒక మహిళ గట్టిగా అరవడం వినిపించింది;అది తీవ్రంగా పడుతున్న మంచును చీల్చుకుంటూ మా చెవులకు సోకింది. వెళ్లిన సైనికులు కాసేపట్లో ఇద్దరు ఖైదీలను తీసుకువచ్చి మా ముందు పెట్టారు. ఒకరు ముసలాయన, మరొకరు ఒక అమ్మాయి. వాళ్లు ప్రష్యన్యల నుంచి తప్పించుకొని పారిపోతున్నారు. ఆ ప్రష్యన్లు వాళ్ళ ఇంటిని ఆరోజు సాయంత్రం ఆక్రమించుకున్నారు. వారు బాగా మద్యం తాగుతున్నారు. తండ్రికి కూతురి క్షేమం గురించి ఆందోళన కలిగింది. అందువలన కనీసం వాళ్ళ పని వాళ్లకు కూడా చెప్పా పెట్ట కుండా, చిమ్మ చీకట్లో పారిపోయి వచ్చారు. వాళ్ళని చూస్తే కాస్త ఉన్నత తరగతికి చెందిన వాళ్లు అనిపించింది. వాళ్లను మాతోపాటు నడవమని చెప్పాను. మేమందరం మళ్ళీ కలిసి నడక మొదలుపెట్టాము. ఆ ముసలాయనకి అక్కడి దారులన్నీ సుపరిచితం. అందువలన అతన్ని మాకు దారి చూపవలసిందిగా కోరాను. “
“కాసేపటికి మంచు కురవడం తగ్గింది. నక్షత్రాలు కనిపిస్తున్నాయి. తండ్రి భుజం మీద వాలి నడుస్తున్న ఆ అమ్మాయి బాధతో అటు ఇటు ఊగుతూ నడుస్తోంది. చాలా సార్లు ‘నా కాళ్ళల్లో ఏ మాత్రం చలనం లేదు’ అంటుంది. పాపం ఆ అమ్మాయి మంచులో కాళ్లు ఈడ్చుకుంటూ నడుస్తోంది. కానీ ఉన్నట్టుండి ఆగిపోయి, ‘నాన్నా, నాకెంత నీరసంగా ఉందంటే, నేను ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేను’ అనింది.”
“తండ్రి అమ్మాయిని వీపు మీద మోద్దామనుకున్నాడు. కానీ అతను అమ్మాయిని ఎత్తే స్థితిలో లేడు. ఎత్తబోతే ఆమె జారీ కింద పడిపోతున్నది. మేమందరం ఆమె చుట్టూ చేరాము .ఏం చేయాలో తెలియక నేను పాదాన్ని నేలపై చరుస్తున్నాను. అమ్మాయితో పాటు ముసలాయనని దారిలో వదిలేయలేం.ఉన్నట్టుండి మా సైన్యంలోనే ఉన్న ప్రాక్టీక్ అనే ఫ్రెంచ్ సైనికుడు,
‘కామ్రేడ్స్, మనం ఈ యువతిని మనతోపాటు తీసుకు వెళ్ళ వలసిందే. లేకపోతే మనం ఫ్రెంచి మగధీరులమని అనిపించుకోలేం.’ అన్నాడు. ”
“నాకు ఆ సైనికుని మాటలు బాగా నచ్చాయి. ‘నువ్వు చెప్పింది చాలా సమంజసంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చాలా మంచి వాడివి. నేను కూడా నా వంతుగా నీ బరువును పంచుకుంటాను’ అన్నాను.”
“అప్పటికి అక్కడక్కడ ఉన్న చెట్ల కిందకి చేరిన సైనికులు నెమ్మిది నెమ్మదిగా రోడ్డు మీదికి కొమ్మలను తీసుకుని రావడం అంత చీకట్లో కూడా గమనించగలిగాను. ఆ కొమ్మలతో వాళ్లొక డోలి తయారు చేసారు.
‘ఈ అమ్మాయికి ఎవరు తమ కోటు ఇస్తారు’ అని అడిగాడు ప్రాక్టీక్ . అప్పటికప్పుడు ఆమె వేసుకోవడానికి 10 కోట్లు వచ్చి పడ్డాయి. ఒక్క క్షణంలో ఆ అమ్మాయి వెచ్చగా, సౌకర్యంగా పడుకోగలిగింది; మాతో పాటు ఉండగలిగింది. ఆమె చుట్టూ ఆరుగురు సైనికులు చేరారు. డోలిని ఆరుగురు సైనికులు తమ భుజాలపై ఎత్తుకున్నారు.ఇప్పుడు సైనికులంతా వరుసలలోకి చేరారు. డోలిపట్టుకున్న వాళ్ళు అలిసిపోగానే వెనుక వరుసలో ఉన్న వాళ్ళు అందుకుంటున్నారు. వాళ్లందరికీ కుడి వైపు నడుస్తూ నేనే సంతృప్తికరంగా నాయకత్వం వహించాను.”
“ఇప్పుడు నడక మరింత వేగంగా సాగింది. మేము కొంత సారా కూడా తాగాము. కొంతమంది జోక్స్ వేస్తున్నారు. ఫ్రెంచ్ పురుషులను ఉద్రేక పరచడానికి ఒక మహిళ దగ్గరలో ఉంటే సరిపోతుంది. కాస్తంత వాన తెరిపిన పడ్డ తరువాత సైనికులు వాళ్ళ వాళ్ళ ర్యాంక్స్ కి అనుగుణంగా వరుసలలో నిలబడటం మొదలుపెట్టారు. డోలిని అనుసరిస్తున్న ఒక స్వచ్ఛంద సైనికుడు, ఫ్రాంక్-టిర్యుర్-నాకు కూడా వినబడేటట్టు-తన పక్క వాడితో,”నేనిప్పుడు యువకుడిని కాను. కానీ సైన్యంలో ఒక మహిళ ఉంటే సైన్యానికి అంతటికి ధైర్యం అదే వస్తుంది” అన్నాడు.
“మా సైన్యం అంతా తెల్లవారుజాము మూడు గంటల వరకు నడుస్తూనే ఉన్నది. ఉన్నట్టుండి స్కౌట్స్ మళ్లీ వెనకకకు వచ్చారు. మళ్ళీ మొత్తం సైన్యం పటాలం అంతా నెమ్మదిగా మంచు మీద పడుకుని ఒక సన్నటి నీడ లాగా కదులుతున్నది. నేను తగ్గు స్వరంతో ఆదేశాలు ఇచ్చాను. వెంటనే తుపాకులన్నీ గట్టి లోహపు శబ్దాలు చేస్తూ నా ఆదేశాలు పాటించడం మొదలుపెట్టాయి. అక్కడ ఆ మైదాన మధ్య ప్రాంతం మధ్యలో ఒక వస్తువేదో అటు ఇటు మెలికలు తిరుగుతూ కదులుతున్నట్టు గమనించాము. అప్పుడప్పుడు అది ఒక పెద్ద జంతువు పరిగెడుతున్నట్టు ఉంది. అప్పుడప్పుడు ఒక పాములాగా మెలికలు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. కొన్ని సార్లు బంతిలాగా దొర్లుతోంది. కుడివైపు, ఎడమవైపు దూసుకెళుతూ, అప్పుడప్పుడు ఆగుతోంది. ప్రస్తుతం అది అక్కడే ఉంది. మళ్లీ బయలుదేరే ప్రయత్నం చేస్తుంది. ఆ కదులుతున్న వస్తువు మా దగ్గరికి వచ్చింది. నేను ఒక డజన్ మంది గుర్రపు స్వారీ చేసేవాళ్లు, ఒకరి తరువాత ఒకరు అక్కడికి చేరడం చూశాను. వాళ్ళు దారి తప్పారు. దారిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు.”
“ఇప్పుడు వాళ్లు మా దగ్గరకు వచ్చారు. మాకు ఎంత దగ్గరగా ఉన్నారంటే, వాళ్ళ గుర్రాలు శ్వాస తీసుకోవడం మాకు చక్కగా వినిపిస్తోంది. వాళ్ళ కత్తుల ఖణేల్ ఖణేల్ మనే శబ్దాలు, జీన్ల టకటక శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.” కాల్చండి” అని ఆదేశం వినిపించింది.
50 తుపాకులు మోగిన శబ్దం ఆ నిశీధి నిశ్శబ్దాన్ని చీల్చింది. ఆ తర్వాత నాలుగైదు తుపాకుల మోత వినిపించింది. ఆ తర్వాత ఒకటి. గాలిలో పొగ నెమ్మదిగా తగ్గడం మొదలైంది. 12 మంది సైనికులు, 9 గుర్రాల నేలకొరిగాయి. మూడు గుర్రాలు భయంకరమైన వేగంతో ముందుకు పరిగెడుతున్నాయి. అందులో ఒకటి చనిపోయిన అశ్వికుడిని తన వెంట ఈడ్చుకొని వెళ్తోంది. అయితే, అతనిని గుంజుకుంటూ వెళ్లాల్సివస్తోంది. ఎందుకంటే అతని ఒక కాలు గుర్రపు స్వారీ చేసేటప్పుడు పెట్టుకునే వలయంలో చిక్కుకొని ఉండిపోయింది. “
“నా వెనక ఉన్న సైనికులలో ఒకడు గట్టిగా నవ్వాడు.’ అందులో కొంతమంది విధవలు’ అయ్యారు, అన్నాడు.
బహుశా అతనికి వివాహం అయి ఉంటుంది. మరొకడు ,’ఇంక, ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.’
ఇంతలో డోలీలో నుంచి మాట వినిపించింది.
“విషయం ఏమిటి? మీరు ఏమన్నా యుద్ధం చేస్తున్నారా?”
“ఏం లేదు మేడం. ఇప్పుడే మేము డజన్ మంది ప్రష్యన్ సైనికులను చంపేశాం.
“పాపం” అనిందామె. వెంటనే లోపలికి వెళ్లి ముడుచుకు కూర్చుంది. తర్వాత మా ప్రయాణం మళ్ళీ కొనసాగింది. మేము చాలా సేపు కదం తొక్కుతూ నడిచాము. ఆఖరికి ఆకాశంలో వెలుతురు కనిపించింది. మంచు స్పష్టంగా కనిపించడం, వెలుతురులో మెరుస్తూ కనిపించడం, మొదలైంది. తూర్పు గులాబీ రంగులో మెరుస్తోంది.
దూరం నుంచి ఒక గొంతు,
“ఎవరక్కడ?” అనే అరవడం వినిపించింది.
“సైన్యం బెటాలియన్ అంతా ఒకసారి ఆగింది.మా సాంకేతిక పదం చెప్పడానికి నేను ముందుకు వెళ్లాను. మేము ఫ్రెంచ్ సరిహద్దులకు చేరాం. మా మనుషులు అవుట్ పోస్ట్ దగ్గర వరుసలలో నుండి బయటకు వచ్చి నిలబడ్డారు. గుర్రపు స్వారీ చేస్తూ ఒక కమాండర్ వచ్చి, ఖంగుమనే గొంతుతో పక్కనుండి తనను దాటి వెళుతున్న డోలిని చూపించి, ‘అందులో ఉన్నదెవరు?’ అని అడిగాడు.”
“వెంటనే లోపల నుంచి ఒక మృదువైన పట్టు శిరోజాలు గల చిన్నదాని తల బయటికి వచ్చి ,
” నేనే మాన్షియర్” అనింది.
ఆ మాటలు వినగానే అడిగిన ఆ పెద్దమనిషి మనస్ఫూర్తిగా నవ్వాడు. మేమందరం ఊపిరి పీల్చుకున్నాం. డోలి పక్కనే నడుస్తున్న ప్రాక్టీక్ చేతులు పైకెత్తి,”ఉఫ్రాన్స్ వర్ధిల్లాలి” అని అరిచాడు. అది ఉద్వేగానికి ఎందుకు గురి చేసిందో నాకే తెలియలేదు. కేవలం అద్భుతమైన,వీరోచితమైన విషయంగా నాకనిపించింది.”
“మేము మొత్తం ఫ్రాన్స్ అంతా గర్వించదగ్గ, మరెవరూ చేయలేని గొప్ప సాహసోపేతమైన పనిని సాధించామని అనిపించింది. నిజమైన సాధారణమైన దేశభక్తి అది. ఆ చిన్న ముఖాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నాకే గనక అధికారం ఉంటే నేను బాజా భజంత్రీలు, ఈలల స్థానంలో, ప్రతి రెజిమెంట్ లోనూ ఒక అందమైన అమ్మాయిని పెట్టమని ఆదేశించేవాడిని. ఒట్టేసిచెబుతున్నా, దేశభక్తిని చాటే ‘మార్సెల్లీస్’ పాడడం కన్నా మంచి పని అది. ఒక మడోనా లాంటి అందమైన అమ్మాయి ఉన్న సైనిక పటాలం తప్పనిసరిగా విజయాలు సాధిస్తుంది. “
కల్నల్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ తర్వాత తన మాటలను తానే మరింత సమర్ధించుకుంటున్నట్టు తల ఊపుతూ”, అదే సమయంలో మనకి మహిళలంటే చాలా ఇష్టం-మన ఫ్రెంచి మగవారికి.” అన్నాడు.

