1
ముసలి ఆవు గరుకు నాలుక రామ్‌జీ నాయక్ చేతిలోని ఖాళీ రాగి చెంబుకు రాసుకున్నప్పుడల్లా గరగరా అన్న శబ్దం వస్తోంది. చెంబు అడుగున తడి ఆరిపోయి గంటలు గడిచినా, ఏదో ఒక మూల చెమ్మ తగలకపోదా అన్న ఆశతో ఆ మూగజీవి నాలుకను లోపలికి జొప్పిస్తూనే ఉంది. దాని ఎండిపోయిన పొదుగు, బయటకు పొడుచుకొచ్చిన పక్కటెముకలు దేవ్లా తండాను పట్టి పీడిస్తున్న మూడేళ్ల కరువుకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. ఉదయం నుంచీ తూర్పు గుట్ట వెనుక గ్రానైట్ క్వారీలో కొండకు రంధ్రాలు పెడుతున్న జాక్ హమ్మర్ మిషన్ల టకటకలు తండా మనుషుల మెదళ్లలో సుత్తితో కొట్టినట్టు మోగుతూనే ఉన్నాయి.
సరిగ్గా అప్పుడే భూమి కడుపు చీల్చుకుంటూ జిలెటిన్ స్టిక్ పేలింది. ఆ కుదుపుకు రామ్‌జీ నాయక్ ఇంటి రేకుల పైకప్పు జలజలా వణికింది. గోడకు తగిలించిన సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటం వంకర తిరిగింది. పైకప్పు సందుల్లోంచి రాలిన తెల్లటి రాతి దుమ్ము ఆవు కళ్లలో పడి, కన్నీటితో కలిసి బురద బొట్టులా కిందికి జారింది.
రామ్‌జీ నాయక్ తన వణుకుతున్న వేళ్లతో ఆవు కంటిని తుడిచాడు. రాతి దుమ్ము గొంతులో ఇరుక్కుని ఆయన ఖళ్లుఖళ్లున దగ్గాడు. ఎనభై ఏళ్ల ఆయన గుండెలో ఏదో తెలియని అపరాధ భావన. ఇరవై ఏళ్ల కిందట తండాలో మొదటిసారి అడవిని నరికి పోడు కొట్టినప్పుడు తాను మౌనంగా ఉన్నాడు. ఐదేళ్ల కిందట కరువు తట్టుకోలేక తన ఒక్కగానొక్క కొడుకు హైదరాబాద్‌కు వలస వెళ్లి, అక్కడ ఇరవై అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి పడి శవమై తిరిగొచ్చినప్పుడూ తాను ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు గుట్టను క్వారీ దొరలు తవ్వేస్తుంటే చూస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయగలడు?
తండా చివర బోరు బండి రక్కసిలా రొద చేస్తోంది. రామ్‌జీ నాయక్ కర్ర ఊతంతో అక్కడికి నడిచాడు. కంప్రెసర్ నుండి వచ్చే చెవులు చిల్లులు పడే రొదకు, డీజిల్ పొగ వాసనకు చెట్ల మీద పక్షులు గూళ్లు వదిలి ఎగిరిపోయాయి. తండాలోని గర్భిణీ స్త్రీల కడుపులో బిడ్డలు సైతం ఉలిక్కిపడుతున్నారు. భూమి గుండెల్లోకి దిగిన ఇనుప చుట్ట నల్లరాయిని కచకచా నమిలేస్తోంది. వెయ్యి అడుగుల లోతుకు దిగినా నీటి బదులు ఎర్రటి నిప్పుల లాంటి దుమ్ము బుసలు కొడుతూ పైకి వస్తోంది. చుట్టూ మూగిన ఆడవాళ్ల చంకల్లో ఖాళీ బిందెలు వెక్కిరిస్తున్నాయి.
“లాభం లేదు సర్పంచ్ గారూ! కింద పచ్చి రాయి తగిలింది. మీ తండా చుట్టూ ఇరవై బోర్లు వేశారు, భూమిలో చుక్క ఊట లేదు” అంటూ ఆపరేటర్ మిషన్ ఆపేశాడు.
బోరు బండి ఆగిపోగానే తండా మీద చావు నిశ్శబ్దం పరుచుకుంది. రామ్‌జీ నాయక్ కళ్లు పక్కనే నిలబడ్డ జామాయిల్ తోట మీద పడ్డాయి. చేతికి త్వరగా పైసలొస్తాయని తండా జనం నీడనిచ్చే మోదుగను, ఇప్పను నరికి నాటిన ఆ ఆకాశమంత చెట్లు..భూమి అడుగున పాతాళ గంగ గొంతు పిసికి చివరి రక్తపు బొట్టును కూడా తాగేస్తున్న రక్కసి వేళ్లలా ఆయనకు కనిపించాయి. ఆయన తన కర్రతో జామాయిల్ చెట్టు బెరడును బలంగా కొట్టాడు. అందులోంచి వచ్చిన బోలు శబ్దం ఆయన గుండెలో ప్రతిధ్వనించింది.
బోరు గొయ్యి దగ్గర పడి ఉన్న వేడి రాతి పొడిని రామ్‌జీ నాయక్ గుప్పెటలోకి తీసుకున్నాడు. అది ఆయన అరచేతిని కాలుస్తోంది. “భూమి తల్లిని బతికుండగానే దహనం చేస్తే వచ్చే బూడిద లెక్క ఉంది రా ఇది! నీళ్లను వడగట్టి తాగే రోజు వస్తది, నీళ్ల కోసం మనుషులు కొట్టుకు చచ్చే రోజు వస్తదని మన సేవాభాయా రెండు వందల ఏళ్ల కిందనే చెప్పిండు కదరా… మనం వినలే” రామ్‌జీ నాయక్ గొంతులో జీర.
ఇంతలో చేతిలో నెమలి ఈకల కట్టను తిప్పుతూ, ఎండు మిరపకాయల ఘాటుతో భూతాలను వదిలించే పక్క ఊరి భగత్ రంగయ్య అక్కడికి చేరాడు. భయంతో వణికిపోతున్న జనం ముఖాల్లోకి చూస్తూ… “పొలిమేరలో మైసమ్మ నాలుక ఎండిపోయి రక్తం కోసం చాచింది సర్పంచ్ గారూ! గుట్ట కింద భూతాలు ఆకలితో ఘోషిస్తున్నాయి. కత్తికి రక్తం తగలకపోతే తండాలో పసిబిడ్డల ఉసురు తగులుతది. యాభై మేకపోతులను బలిచ్చి ఆ రక్తంతో తండా పొలిమేర తడపండి. మూడు రోజుల్లో ఆకాశం కరుణించకపోతే అడగండి!” అన్నాడు కళ్లు ఎర్రజేస్తూ. నిరాశలో కూరుకుపోయిన తండా జనానికి ఆ మాట గడ్డిపోచలా కనిపించింది. రామ్‌జీ నాయక్ గుప్పెటలోని వేడి బూడిద జారి కింద పడింది.
2
ఆ సాయంత్రం రచ్చబండ దగ్గర నసాబ్(పంచాయితి) కూర్చుంది. పూర్వం తండా పెద్దలు కూర్చుని కట్టుబాట్లు చెప్పిన ఆ చోట ఇప్పుడు ప్లాస్టిక్ కుర్చీలు వేసి ఉన్నాయి. రామ్‌జీ నాయక్ మాత్రం కింద వేపచెట్టు వేర్ల మీదే కూర్చున్నాడు. ఆయన పక్కనే పట్నంలో వ్యవసాయ కళాశాలలో చదువుతున్న ఆయన మనవరాలు సీమ కూర్చుంది.
“దాదా(తాత), ఈ రాళ్లల్లో ఇంకేం మిగిలింది? నాకు సిటీలో విత్తనాల కంపెనీలో ఉద్యోగం వస్తోంది. నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను, ఈ ఇంటికి తాళం వేసేద్దాం. నాన్నను పోగొట్టుకుంది చాలు, నిన్ను కూడా ఈ రాతి దుమ్ముకు బలివ్వలేను” అని సీమ ఉదయం నుంచీ తాతను బతిమాలుతూనే ఉంది. రామ్‌జీ నాయక్ బదులు చెప్పకుండా సభ వైపు చూస్తున్నాడు.
సర్పంచ్ ధన్సింగ్ గొంతులో ఆవేశం కంటే నిస్సహాయతే ఎక్కువగా కనిపిస్తోంది. “జాతరకు, యాభై మేకల బలికి, తండాకు నీళ్ల ట్యాంకర్లు తెప్పించడానికి కనీసం ఐదు లక్షలు కావాలి. తండాలో ఏ ఇంటికీ అప్పు పుట్టే పరిస్థితి లేదు. అందుకే తూర్పున ఉన్న సేవా గుట్టను గ్రానైట్ కంపెనీ వాళ్లకు రాసిద్దాం. తండా ఫండ్ కింద పది లక్షలు ఇస్తామన్నారు. సగం పైసలతో జాతర చేద్దాం, మిగిలిన దాంతో అప్పులు తీర్చుకుని ట్యాంకర్లు తెప్పించుకుందాం” అన్నాడు.
“తల్లి రొమ్ము కోసి రక్తం తాగినోడు బతుకుతాడా రా ధన్సింగ్?” రామ్‌జీ నాయక్ ఒక్క ఉదుటున లేచాడు. ఆయన తల మీది తొమ్మిది గజాల తెల్లటి పాంగడి(తలపాగా) కంపించింది. “ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్లు, మన తండా కరువు ఆ క్వారీ దొరకు కాసుల పంట అయిందా? సేవా గుట్ట మన తాతలు లద్దెతో నడుస్తూ వచ్చి విడిది చేసిన నేల. ఆ గుట్ట మీద సేవాలాల్ మహారాజ్ ద్వాళో(తెల్లని ) ఝండా, జగదాంబ తల్లి ఎర్ర జెండా ఎగురుతున్నాయి. గుట్ట కింద ఉన్న పురాతన మెట్ల బావి నీళ్లే మన జాతిని బతికించాయి. దాన్ని డైనమైట్లతో పేల్చేస్తావా?”
“మరి ఏం చేయమంటావ్ కాకా(బాబాయి)?” ధన్సింగ్ గొంతు పగిలింది. “నీ సిద్ధాంతాలు వినడానికి బాగుంటాయి కానీ, రేపు పొద్దున్న తండాలో పసిబిడ్డ దాహంతో చస్తే నీ సేవాలాల్ జెండా నీళ్లు పోస్తుందా? ఆడవాళ్లు నీళ్ల కోసం మూడు మైళ్లు నడుస్తున్నారు. వడ్డీ వ్యాపారులు ఇళ్ల మీద పడుతున్నారు. నాకు మాత్రం గుట్టను అమ్మాలని ఉందా? మనుషులు బతికితే కదా సంస్కృతి!”
ధన్సింగ్ మాటల్లోని చేదు నిజానికి నసాబ్(పంచాయితి) మొత్తం మౌనంగా తల వంచింది. పక్కనే ఉన్న యువకుడు కిషన్ ఆవేశంగా లేచాడు. డిగ్రీ కాగితం పట్టుకుని పట్నం చుట్టూ తిరిగి చెప్పులరిగినోడు కిషన్. సిటీలో ఆటో తోలుకుందామంటే ఫైనాన్స్ వాడికి కట్టే చేబదులు లేక గుండెల్లో కుంపటి పెట్టుకుని తిరుగుతున్నాడు. “సర్పంచ్ అన్న చెప్పిందే కరెక్ట్! గుట్ట అమ్మితే వచ్చే వాటాతో నేను సిటీకి పోయి బతుకుతా. ఈ ఎండిపోయిన తండాలో ఉండి ఏం సాధిస్తాం?” అన్నాడు.
రామ్‌జీ నాయక్ కళ్లలో నీళ్లు తిరిగాయి. “అరే కిషన్! యాభై మేకపోతులను కోస్తారా? ఒక్కో మేక పదివేల రూపాయలు! తండాలో ఉన్న ఆడవాళ్ల తాళిబొట్లు, వెండి కడియాలు కుదువపెట్టి తెచ్చిన ఆ మేకలను ఒక్క పూటలో నరికి రక్తం పారిస్తే… రేపు మన పిల్లల చదువులకు, మన ఎద్దుల గడ్డికి పైసలు ఆ భగత్ రంగయ్య ఇస్తాడా? సేవాభాయా జంతుబలి వద్దన్నది కేవలం పాపం అని కాదురా… మన పశువులే మన ప్రాణం, మన ఆస్తి అని! ఇంటి ఆస్తిని నరుక్కుని తింటే వానలు పడతాయా? అడవిలో చెట్టును, కొమ్మను, ఆవును కన్నబిడ్డల్లా సాకమని చెప్పిన సంత్ సేవాలాల్ వారసులం మనం! గుట్టను అమ్ముకుని రక్తపు కూడు తింటారా?”
తొంభై ఏళ్ల సోమ్లీ యాడి ముందుకు కదిలింది. ఆమె చేతులకు మోచేతుల దాకా ఉన్న తెల్లని బలియా గాజులు, చెవులకు వేలాడే లోలక్, పాతకాలపు ఫేటియాకు కుట్టిన గవ్వలు, రాగి నాణేలు ఘల్లుమన్నాయి. ముడతలు పడ్డ చేతులతో నేలను తడుతూ ఆమె అంది.. “రామ్‌జీ భాయా చెప్పింది నిజం రా. అద్దం పగిలితే ముఖం వంకరగా కనిపిస్తది కానీ, మన కాంచళికి కుట్టిన అద్దం సూర్యుడినే తిప్పికొడుతది. మన ఆత్మగౌరవం అటువంటిది. గుట్ట మీది ఎర్ర జెండా మూగజీవాల రక్తానికి గుర్తు కాదురా… శ్రమించే మనిషి చెమటకు గుర్తు! మా చిన్నప్పుడు సేవాలాల్ భోగ్ అంటే గోధుమ రవ్వ, బెల్లం, ఆవు నెయ్యితో చేసిన తీపి కడా ప్రసాదం మాత్రమే. ఆ నెయ్యి వాసనకే మేఘాలు కరిగేవి.”
కానీ ఆకలి, భయం ముందు ఆ వృద్ధుల మాటలు ఓడిపోయాయి. మరుసటి రోజు క్వారీ వాళ్లతో బాండు కాగితాల మీద సంతకాలు పెట్టాలని, మేకలను తేవాలని నిర్ణయించి నసాబ్(పంచాయితి) ముగిసింది.
ఆ అర్ధరాత్రి తండా నిద్రలో ఉండగా, క్వారీ వాళ్లు గుట్ట వెనుక దొంగతనంగా భారీ పేలుడు జరిపారు. ఆ ధాటికి భూమి కంపించింది. క్వారీ వాళ్లు పేల్చిన రాకాసి తూటాలా ఎగిరిపడ్డ ఒక రాతి ముక్క కిషన్ ఇంటి రేకును చీల్చుకుని లోపల పడి, నిద్రపోతున్న కిషన్ తల్లి కాలికి బలంగా తగిలి రక్తం చిమ్మింది. అంతకంటే ఘోరం… ఆ పేలుడుకు తండా మొత్తానికి ఆధారమైన చివరి చేతిపంపు భూగర్భ పొర కదిలిపోయి, బురద నీరు కక్కి శాశ్వతంగా ఆగిపోయింది.
3
తెల్లవారేసరికి తండాలో ఏడుపులు, హాహాకారాలు మిన్నంటాయి. చేతిపంపు ఎండిపోవడంతో గుక్కెడు నీళ్లకు కూడా దిక్కులేకుండా పోయింది. అయినా సరే, భగత్ రంగయ్య మాటలకు కట్టుబడి మేకలు తేవడానికి లారీ సిద్ధమైంది.
అప్పుడే తండా జనం ఒక వింత దృశ్యాన్ని చూశారు.
రామ్‌జీ నాయక్ తెల్లటి ధోవతి, తొమ్మిది గజాల పాంగడి ధరించి, భుజం మీద పార, గడ్డపార పెట్టుకుని, చేతిలో సేవాలాల్ తెల్ల జెండా పట్టుకుని సేవా గుట్ట వైపు ఒంటరిగా నడుస్తున్నాడు. పట్నం వెళ్లే ఆలోచనను పక్కనపెట్టి సీమ, తాతను ఒంటరిగా వదలలేక తట్ట పట్టుకుని ఆయన వెనుకే నడిచింది.
రామ్‌జీ నాయక్ నేరుగా గుట్ట పాదాల చెంత ఉన్న పురాతన ‘లఖీ బంజారా మెట్ల బావి’ దగ్గరకు వెళ్లాడు. పూర్వం లక్ష ఎద్దుల లద్దెతో వ్యాపారం చేసిన తమ పూర్వీకులు, మనుషులతో పాటు ఎద్దులు కూడా నేరుగా మెట్ల మీద నడుచుకుంటూ దిగి దాహం తీర్చుకునేలా విశాలంగా కట్టిన ఆ కుండ్..ఇప్పుడు ఇరవై అడుగుల పూడిక మట్టితో, కంపచెట్లతో నిండిపోయి సమాధిలా ఉంది. రామ్‌జీ నాయక్ బావి మెట్ల మీద తెల్ల జెండాను పాతి, చేతులు జోడించాడు.
“హే సేవాభాయా! హే యాడి జగదాంబే! తారో తాండో భుకో ఛ… తారో తాండో తరాసో ఛ!” అంటూ రామ్‌జీ నాయక్ గొంతు జీరబోయింది. నీ తండా ఆకలితో అలమటిస్తోంది తండ్రీ, నీ తండా దాహంతో గొంతు ఎండిపోతోంది తల్లీ… మనిషి దారి తప్పాడు, క్షమించు. ఇదిగో, రక్తపు నైవేద్యం కాదు, మా చెమట నైవేద్యం తెచ్చాను..అంటూ ఆయన కళ్ల వెంట కారిన నీరు ఎండిన మట్టిలో ఇంకిపోయింది.
రామ్‌జీ నాయక్ బావిలోకి దిగి గుడ్డిగా గడ్డపార వేయలేదు. బావి గోడల మీద ఉన్న రాతి పొరలను తన ముడతలు పడ్డ చేతితో తడిమాడు.
“సీమా… ఇటు చూడు బిడ్డా!” అన్నాడు తాత. “మన తాతలు ఈ బావిని ఇక్కడే ఎందుకు తవ్వారో తెలుసా? అదుగో ఆ గుట్ట అంచున ఉన్న మేడి చెట్టు, దాని పక్కన ఉన్న తెల్లని చెదల పుట్ట చూడు. భూమి కడుపులో ముప్పై మూరల లోతున జల నరం పారుతుంటేనే మేడి చెట్టు వేర్లు అక్కడికి దిగుతాయి. బోరు బండి వాడు వెయ్యి అడుగులు తవ్వినా ఎందుకు నీళ్లు రాలేదంటే…వాడు భూమి ఎముకను తొలిచాడు కానీ, భూమి రక్తనాళాన్ని పట్టుకోలేకపోయాడు! మన తాతలు రాయిని పగలగొట్టలేదు, రాయిలో ఉన్న సందును పట్టుకున్నారు. గుట్ట మీద పడే వాన నీరు ఆ సందులోకి ఇంకేలా వాగుకు అడ్డంగా రాళ్ల కట్టలు కట్టారు.”
కాలేజీ పుస్తకాల్లో అక్షరాలుగా చదువుకున్న చదువు, తాత చేతి గడ్డపార మొన మీద ప్రాణంతో మెరుస్తుంటే సీమ కళ్లు చెమర్చాయి.
మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు… ఎండ నిప్పులు చెరుగుతున్నా తాతామనవళ్లు ఇద్దరే బావిని తవ్వుతున్నారు. మొదటి పొరలో గత ఇరవై ఏళ్లలో తండా జనం పారేసిన ప్లాస్టిక్ కవర్లు, పగిలిన గుడుంబా సీసాలు, యూరియా బస్తాల పీలికలు బయటపడ్డాయి. ఇంకా లోతుకు తవ్వేసరికి నల్లని రేగడి బంకమట్టి తగిలింది. ఆ మట్టిలో వందేళ్ల కిందట నీళ్లు తోడుకున్న పగిలిన రాగి కుండల పెంకులు, ఎద్దుల మెడలోని కంచు గంటలు, గుర్రపు నాడాలు బయటపడ్డాయి. సీమ తట్టలోకి మట్టిని ఎత్తుతుంటే, వందేళ్ల కిందట తమ ముత్తాతలు ఆ బావిని తవ్వడానికి వాడిన తుప్పు పట్టిన ఇనుప గడ్డపార ముక్క ఒకటి దొరికింది! బావి గోడల మీద బెల్లం, కరక్కాయ తొక్కు కలిపిన గానుగ సున్నంతో పేర్చిన నల్లరాతి పలకలు, వాటి మీద చెక్కిన ఎద్దు మూపురం గుర్తు బయటపడ్డాయి. అక్కడ తాతామనవళ్లు తవ్వుతున్నది కేవలం మట్టిని కాదు.. తమ జాతి చరిత్రను!
మూడో రోజు రాత్రి జాతర కోసం యాభై మేకపోతులను లారీలో తండాకు తీసుకొచ్చారు. చావు భయంతో ఆ మూగజీవాలు పెడుతున్న అరుపులు తండా నిండా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రాత్రి వెన్నెలలో కూడా రామ్‌జీ నాయక్ బావి అడుగున తవ్వుతూనే ఉన్నాడు. ఒకవైపు తండాలో మేకల ఆక్రందనలు, మరోవైపు బావి లోతుల్లో నుంచి రామ్‌జీ నాయక్ పాడుతున్న ప్రాచీన ‘ఢాణీ’ పాట, గడ్డపార చప్పుళ్లు… నల్లమల అడవిలో జీవన్మరణ సంఘర్షణలా మార్మోగాయి.
నాలుగో రోజు ఉదయం, రచ్చబండ దగ్గర భగత్ రంగయ్య నిమ్మకాయలు కోసి గాలిలోకి విసురుతుంటే మేకల మెడలు నరకడానికి కత్తులు నూరుతున్నారు. సరిగ్గా అప్పుడే బావి లోపల నుంచి సీమ పెట్టిన ఆర్తనాదం తండాను ఉలిక్కిపడేలా చేసింది. నాలుగు రోజుల నిరంతర శ్రమకు, ఎండ తీవ్రతకు రామ్‌జీ నాయక్ చేతిలోని రక్తపు బొబ్బలు పగిలి, గడ్డపార మీద రక్తం కారుతుండగా ఆయన బావి బురదలోనే కుప్పకూలిపోయాడు. ఆయన తల మీది తొమ్మిది గజాల తెల్లటి పాంగడి ఊడిపోయి, ఎర్రటి మట్టిలో, ఆయన అరచేతి రక్తంలో తడిసిపోయింది.
4
ఆ కేక వినగానే తండాలోని ఆడవాళ్ల గుండెలు ఆగినట్లయ్యాయి. సోమ్లీ యాడి అందరికంటే ముందు కదిలింది. క్వారీ రాయి తగిలి కాలికి కట్టు కట్టుకున్న కిషన్ తల్లి కూడా కుంటుతూ పరుగెత్తింది.
బావి అడుగున పడి ఉన్న రామ్‌జీ నాయక్ ముఖం మీద సీమ తడి గుడ్డతో తుడుస్తోంది. ఆయన పిడికిలి ఇంకా మట్టిని గట్టిగా పట్టుకునే ఉంది. సోమ్లీ యాడి బావిలోకి దిగి, రక్తంలోనూ బురదలోనూ తడిసిన రామ్‌జీ నాయక్ తెల్ల తలపాగాను చేతిలోకి తీసుకుంది. తన కన్నీళ్లతో ఆ మట్టిని తుడిచి, మళ్లీ ఆయన తలకు గౌరవంగా చుట్టింది.
ఆమె తన నడుముకు కొంగు బిగించి కట్టి, రామ్‌జీ నాయక్ పక్కన పడి ఉన్న గడ్డపారను అందుకుంది. ఆమె కాళ్లకు ఉన్న బరువైన వెండి వాంకిడి కడియాలు బురదలో కూరుకుపోయాయి. “ఒకప్పుడు మన తాతలు ఉప్పు అమ్మి సంపాదించిన వెండి రా ఇది… ఈరోజు నీళ్ల కోసం మట్టిలో తడవనీ! మన భాయా ఒక్కడే ఎందుకు చావాలి? ఛోరీ వో… ఆవో ! మగవాళ్లు పైసల కోసం గుట్టను అమ్ముతుంటే, మనం మన చేతులతో మన గంగమ్మను తవ్వుకుందాం!” అని గర్జించింది.
అంతే! వంద మంది గోర్ బంజారా మహిళలు బావిలోకి దిగారు. కాలికి గాయంతోనే తట్ట మోస్తున్న తన తల్లిని, ఆమె చేతిలోని రక్తపు బొబ్బలను చూసిన కిషన్ గుండె తరుక్కుపోయింది. తన సిటీ ఆటో కల కంటే తల్లి కన్నీరు, తాత త్యాగం అతనికి నిజమైనవిగా కనిపించాయి.
అప్పుడే క్వారీ యజమాని తన మనుషులతో, బాండు కాగితాలతో అక్కడికి చేరుకున్నాడు. “సర్పంచ్ గారూ, సంతకాలు పెడితే గుట్ట మీద మిషన్లు పెడతాం, ఈ బావిని పూడ్చేసి రోడ్డు వేయాలి” అన్నాడు.
కిషన్ మౌనంగా ముందుకు నడిచాడు. అతని కళ్లలో ఆవేశం లేదు, నిశ్చయం ఉంది. సర్పంచ్ చేతిలో ఉన్న బాండు కాగితాలను లాక్కుని, క్వారీ యజమాని చేతిలో పెట్టాడు. “మా గుట్టలో రాయి కదలదు సాబ్. మా బావి పూడదు. ప్రాణం పోయినా సరే!” అన్నాడు. క్వారీ రౌడీలు ముందుకు రాబోతే, తండా మహిళలందరూ గడ్డపారలు, సేవాలాల్ తెల్ల జెండాలు పట్టుకుని గుట్టకు అడ్డంగా గోడలా నిలబడ్డారు. ఆ ఐక్యత ముందు క్వారీ వాళ్లు తోక ముడవక తప్పలేదు.
కిషన్ వెనక్కి తిరిగి పరుగెత్తుకెళ్లి, కత్తుల ముందు కట్టేసి ఉన్న యాభై మేకపోతుల మెడలోని తాళ్లను విప్పేశాడు. మెడకు తాళ్లు ఊడగానే ఆ మేకపోతులు చావు గండం తప్పినట్టు చెవులు విదిలించుకుంటూ సేవా గుట్ట మీద గరిక పోచల వైపు చెంగున దుమికాయి. సర్పంచ్ ధన్సింగ్ కూడా పశ్చాత్తాపంతో తల దించుకుని, పార పట్టుకుని బావిలోకి దిగాడు.
ఆ రోజు నుంచి దేవ్లా తండాలో ఒక మహా యజ్ఞం మొదలైంది. కింద బావి అడుగున కిషన్, ధన్సింగ్ గడ్డపారలతో నల్లటి బంకమట్టిని తవ్వుతుంటే, విశాలమైన బావి మెట్ల మీద వరుసగా నిలబడిన ముప్పై మంది ఆడవాళ్లు ఒకరి చేతిలోంచి ఒకరి చేతికి మట్టి తట్టలను అందిస్తున్నారు. ఆ తట్టలు చేతులు మారుతున్నప్పుడు సోమ్లీ యాడి గొంతు విప్పి పాట అందుకుంది..
“ఏక్ తట్టా మాటీ కాడ్ ఓ బాయి… గంగమ్మ ఆయేరీ!
దో తట్టా మాటీ కాడ్ ఓ భాయీ… సేవాభాయా ఆయేరో!”
ఒక తట్ట మట్టి తియ్యవే చెల్లీ గంగమ్మ వస్తుంది, రెండు తట్టల మట్టి తియ్యరా తమ్ముడా సేవాభాయా వస్తాడు..అంటూ సాగిన ఆ శ్రమ గీతానికి ఆడవాళ్ల చేతి గాజులు ఘల్లుఘల్లున తాళం వేశాయి.కోలుకుని పైన గట్టు మీద కూర్చున్న రామ్‌జీ నాయక్ వాయిస్తున్న ‘ఢాప్’ దరువు గుట్ట వెనుక క్వారీ మిషన్ల రొదను పూర్తిగా మింగేసింది. బావిలోంచి తవ్వి బయట పోసిన నల్లటి ఒండ్రు మట్టి కింద, భగత్ రంగయ్య కోసి పారేసిన నిమ్మకాయలు, కుంకుమ ఆనవాళ్లు లేకుండా కూరుకుపోయాయి. భయాన్ని శ్రమ కప్పేసింది. పదిహేను రోజుల్లో బావి పూడిక తీయడమే కాక, గుట్ట వాలులో పూర్వీకుల రాతి అడ్డుకట్టలను మళ్లీ నిర్మించి, గుట్ట నిండా ఇప్ప, మోదుగ, వేప మొక్కలు నాటారు.
5
పదహారవ రోజు సాయంత్రం. ఆకాశం ఇంకా నిప్పులు చెరుగుతూనే ఉంది.
మెట్ల బావి అడుగున ముప్పై మూరల లోతున నల్లని రాతి పొర తగిలింది. అందరి చేతులూ బొబ్బలెక్కి రక్తం కారుతోంది. ఇంకా నీరు పడలేదని అందరిలో నిరాశ కమ్ముకుంటున్న వేళ… రామ్‌జీ నాయక్ పైనుంచి చూపించిన మేడి చెట్టు వేరు దిగిన వైపుగా కిషన్ తన గడ్డపారను బలంగా దించాడు.
అడుగున ఉన్న నల్లని రాతి సందులోంచి ‘చెమ్మ’ బయటకు కనిపించింది. అందరూ ఊపిరి బిగబట్టి చూశారు. తండా జనాల చెమట చుక్కలు పడిన ఆ రాతి పగులులోంచి, భూమి తల్లి తన గర్భంలో దాచుకున్న చివరి కన్నీటి బొట్టును తన బిడ్డల శ్రమకు మెచ్చి బయటకు పంపినట్లుగా… సన్నని, స్వచ్ఛమైన చల్లటి ‘ఊట’ జలజలా ఉబికి వచ్చింది!
ఆకాశం ఇంకా కరుణించకపోయినా, మనిషి తన చెమటతో భూమి రక్తనాళాన్ని తాకాడు! గంట గడిచేసరికి ఆ ఊట బావి అడుగున అడుగు లోతు నీటి మడుగులా నిలిచింది. తండా మొత్తం ఆనందభాష్పాలతో కేరింతలు కొట్టింది.
రామ్‌జీ నాయక్ సీమ సహాయంతో బావి మెట్ల మీదకు దిగి వచ్చాడు. ఆ చల్లటి కొత్త నీటిని తన దోసిట్లోకి తీసుకున్నాడు. ఆ మొదటి గుక్కెడు నీటిని ఆయన తాగలేదు.. బావి మెట్ల మీదకు నడిచి వచ్చిన తన ముసలి ఆవు నోటి దగ్గర పెట్టాడు. ఆ మూగజీవి ఆ నీటిని కడుపునిండా తాగుతుంటే, దాని కళ్లలో మెరిసిన కృతజ్ఞతలో రామ్‌జీ నాయక్‌కు సాక్షాత్తూ సంత్ సేవాలాల్ మహారాజ్ కనిపించాడు.
ఆ రాత్రి మెట్ల బావి గట్టు మీద పండుగ జరిగింది. ఎక్కడా ఒక్క చుక్క రక్తం చిందలేదు. ఒక్క మూగజీవి అరుపు వినిపించలేదు.
తెల్లటి జెండా నీడన మూడు రాళ్లు పెట్టి ధూణి పేర్చారు. ఎండిన మోదుగ పుల్లలతో పవిత్రమైన అగ్నిహోత్రం వెలిగించారు. పెద్ద ఇత్తడి కడాయిలో రామ్‌జీ నాయక్ ముసలి ఆవు ఇచ్చిన స్వచ్ఛమైన నెయ్యి వేశారు. ఆ నెయ్యి కాగుతుంటే వచ్చిన కమ్మని వాసన, గత మూడేళ్లుగా తండా ముక్కుపుటాలను వేధిస్తున్న గ్రానైట్ రాతి దుమ్ము వాసనను తరిమికొట్టింది. అందులో ఎర్రటి గోధుమ రవ్వ వేసి దోరగా వేయించి, పాత బెల్లం తురుము, బావిలో అప్పుడే ఊరిన కొత్త పాతాళ గంగ నీళ్లు పోశారు. ఆ నీళ్లు సలసలా కాగుతుంటే..తండా జనం తమ పదిహేను రోజుల చెమట, కన్నీరు ఆ కడాయిలో కరిగి తీపి అమృతంగా మారుతున్నట్టు చూస్తున్నారు.
రామ్‌జీ నాయక్ మోదుగ ఆకుల్లో ఆ వేడివేడి ‘కడా భోగ్’ను పెట్టి, ముందుగా ధూణికి, తర్వాత బావిలోని గంగమ్మకు సమర్పించాడు. తండా జనం అందరూ తమ బొబ్బలెక్కిన అరచేతుల్లో ఆ వేడి ప్రసాదాన్ని తీసుకుని తింటున్నారు. ఆ తీపి వారి గొంతుల్లోకి దిగుతున్న వేళ, కమ్మని నెయ్యి సువాసనకు కరిగినట్లుగా నల్లమల కొండల మీద నల్లని మబ్బు ఒకటి మెరిసింది. చల్లని గాలి తండాను తాకగా, ఆకాశం నుండి రాలిన తొలి వాన చినుకు రామ్‌జీ నాయక్ తెల్ల తలపాగా మీద, ఆయన నాటిన చిన్న మోదుగ మొక్క ఆకు మీద ముత్యంలా పడింది.
