“నీకు తెలిసినవీ , ప్రపంచానికి ఇంతవరకు ఎవరూ చెప్పనివీ అయిన కథలను -హృదయంలో మోయడాన్ని మించిన వేదన మరోటి లేదు” అంటారు ప్రసిద్ధ అమెరికన్ రచయిత్రి మాయా ఏంజిలో .
స్వీయ జీవితంలోని వేదన కంటే ఎక్కువగా పీడిత సమాజం లోని బాధలనే కవులూ రచయితల కలాలు అక్షరాల్లో మొలిపిస్తాయి . హృదయంలో గూడు కట్టుకున్న అతి సామాన్యుల వెతలను , ప్రపంచమంతా పరచుకుని ఉన్న బలహీనుల మూలుగులను తమ గొంతులో వినిపించే ప్రయత్నం చేస్తాయి. అలాంటి ప్రయత్నం నుంచి పుట్టినవే శ్రీ ఊహ కథలు. ” ఇసుక అద్దం , బల్కావ్ ” తర్వాత ఆమె వెలువరించిన మూడో కథల పుస్తకం
” సిక్కా “. ఇందులో 11 కథలున్నాయి.
సిక్కా కథా సంపుటిలోని తొలి కథ “మహోన్నతుడు” . తమ బతుకులను శ్మశానం లో , ముళ్ల కంపల మధ్య వెతుక్కునే ‘ బైసాకు ‘ కథ ఇది. చచ్చిన గొడ్ల ఎముకలు పోగేసి , సేటు కి అమ్మితే వచ్చిన అయిదో పదో ఆ కుటుంబానికి జీవనాధారం. శ్రమదోపిడీని , హింస ద్వారా భయం పుట్టించే ప్రవృత్తిని నమ్ముకున్న మనుషులు –
‘ మన గొంతు వినిపించినాక ఇక ఉండనియ్యరు ‘ అని తల్లి భయపడినా – తాము రోడ్డు పై నడుస్తున్నపుడు దారి తప్పించుకుని పక్కకు మళ్లే పెత్తందారులపై ధిక్కార స్వరాన్ని బలంగా వినిపించిన పాత్ర బైసాకు. కుళ్లి కంపు కొడుతున్న కుల వ్యవస్థ పై కరుణ చూపించి , మృత కళేబరాల్ని తొలగించే బైసాకు పాత్రలో ఆత్మ గౌరవాన్ని బలంగా ప్రతిష్ఠించారు రచయిత్రి శ్రీ ఊహ.
బ్రతుకు తెరువుగా చిరుద్యోగం చేసే చోట – హేళనను , తిరస్కారాన్ని తట్టుకుంటూ పనిలో నైపుణ్యాలు పెంచుకుని ,
” ఇజ్జత్ ” ను కాపాడుకున్న పాత్రగా లక్ష్మి – ” గెలుపు తలుపు ” కథలో కనిపిస్తుంది. ఉనికికి ఓ గుర్తింపు గా మారిన యూనిఫాం ని సాధించుకోవటంతో పాటు – మనిషిగా తనకూ సంఘంలో ఓ స్థానం ఉన్నదని నిరూపించుకున్న పాత్ర లక్ష్మి.
అత్తర్ , సిక్కా – ముస్లిం జీవిత పార్శ్వాలను స్పృశించిన కథలు.
అత్తర్ పరిమళాన్ని – స్మృతులతో మేళవించి , గతం వర్తమానాల కలనేతగా నడిపిన మంచి కథ ‘ అత్తర్ ’ .
తొలి రాత్రి నుంచి జీవితం కడదాకా అత్తరు సువాసనై అల్లుకున్న ఆత్మీయ బంధాన్ని – హుసేన్ , జైనబ్ ల మధ్య అందంగా చిత్రించిన కేన్వాస్ లా అనిపిస్తుంది అత్తర్ కథ .
ఇరానీ హోటెళ్లలో వందల మంది కస్టమర్ల ఆకలిని కొలిచిన ‘ సిక్కా’ (నాణెము) టోకెన్లు – వాటిని తయారు చేసిన కళాకారుల కడుపులను నింపలేకపోయిన వైనాన్ని , ఆధునిక యాంత్రికత – వృత్తులను దెబ్బ తీస్తున్న వాస్తవాన్ని చెప్పిన కథ “సిక్కా”.
యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల బడి వయసులోనే బతుకులో విషాదం నిండిన ఇద్దరు విద్యార్థుల కథ
” గాజు కన్ను – బోడి బెంచీ ” . స్పర్థ – వైరుద్ధ్యం గా మారి , విషాదాంతం అయిన ఈ కథ చదువరుల కళ్లు చెమర్చేలా చేస్తుంది.
ఈ కథల్లో దేనికదే ప్రత్యేకం అయినా… ” షిఫ్ట్ డిలీట్ ” కథ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ” షిఫ్ట్ డిలీట్ ” అనేది కంప్యూటర్ పరిభాష. ” ఫైల్ ను పునరుద్ధరించడానికి వీలు లేకుండా సిస్టమ్ నుండి శాశ్వతంగా తొలగించడం ” అని ఈ మాటల అర్థం. ఉదయం పదకొండు గంటలకు నిద్రలేచే
ఓ తాగుబోతును అమాయకంగా నమ్మి ,
ఓ సాఫ్ట్వేర్ అమ్మాయి మూడు నెలల పాటు చేసిన రహస్య స్నేహం ఆమె నెత్తి మీద కుంపటిగా పరిణమించి – అతడి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ను , చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన బూతులను – విపరీతమైన టార్చర్ ను మౌనంగా భరించి , తనను తాను కోల్పోయే స్థితిలో చివరకు ఆ నరకం నుండి ఎలా బయట పడిందో చెప్పిన కథ ‘ షిఫ్ట్ డిలీట్. ‘
మొబైల్ చాటింగ్ , ఫోన్ కాల్స్ తో ఆధునిక యువత , ముఖ్యం గా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈ కథలో గమనించవచ్చు.
” అతడు తనకు వద్దు ” అని ఆమె లోలోపల అనుకున్నా , ఆ మాటను బయటికి బలంగా చెప్పలేని ఆమె నిస్సహాయతను గమనించిన పాఠకులు తాము చదువుతున్నది ఒక కథ అని మరిచిపోయి
” ఈ అమ్మాయిని ఎలా రక్షించాలా ” అని మథన పడతారు ! ఈ కథలో – తప్పించుకోలేని ఆలోచనల సుడిగుండాల్లోకి కథానాయిక పాత్రనే కాదు పాఠకుల్ని కూడా నిర్దాక్షిణ్యంగా విసిరివేసారు
శ్రీ ఊహ. అంతలా అక్షరాలతో పాఠకుడి హృదయాన్ని ఆవాహన చేసే విద్య ఏదో పట్టుబడింది ఈ రచయిత్రికి. లైంగిక హింసకు గురైన స్త్రీల పేర్లను బహిర్గతం చేయకూడదని మనదేశంలోని చట్టాలు చెబుతున్నాయి. ఈ కథను రాసేటప్పుడు కూడ ఆ చట్టాలను దృష్టిలో ఉంచుకున్నారో ఏమో చిత్రంగా ఈ కథలోని స్త్రీ పాత్ర పేరేమిటో ఎక్కడా చెప్పలేదు రచయిత్రి.
షిఫ్ట్ డిలీట్ కథలో లీనమైపోయిన పాఠకుడు ” ఆమె జీవితంలోనుండి వీడెప్పుడు బయటకు పోతాడా ” అనుకోక మానడు ! అంతటి అసహ్యాన్ని కథానాయకుడి పాత్ర పట్ల పాఠకుల్లో కలిగేలా చేయడంలో రచయిత్రి విజయం సాధించారని చెప్పాలి.
చివరకు ఈ కథలోని ” ఆమె ” పంజరంలా మారిన బలవంతపు బంధం నుంచి బయటపడుతుంది.
లోకమంతా సగటు స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలే – మాతృస్వామ్య వ్యవస్థ లోని స్త్రీలూ ఎదుర్కొంటున్నారన్న సత్యాన్ని చాటిన కథ “నే”.
అసంతృప్తి , నిరాశ చీకట్లై ముసిరేసిన జీవితాల్లో
“బానే ఉన్నాలే ” అన్న సమాధానమే కాని… “బాగున్నాను” అని తృప్తిగా చెప్పే సమాధానం ఉండదని అనుకుంటుంది ” నే ” కథలోని ప్రధాన పాత్ర. మాతృస్వామ్య వ్యవస్థలో మగవారికి ఏ హక్కులూ లేవు అన్న సాకుతో భార్యను విడిచిపెట్టి , మరో స్త్రీతో తిరుగుతున్న భర్తకు – ” ఫలానా రోజు పిల్ల పుట్టినరోజు అని , పిల్లలు వినకుండా ఫోన్లో గుర్తు చేయాలి . లేదంటే తండ్రి తమను మరిచిపోయాడని వాళ్ళు పడే బాధను చూడలేను ” అనుకుంటూ సంఘర్షణకు లోనయ్యే కథానాయిక పాత్రను తీర్చిదిద్దిన విధానం , ఇలాంటి సీరియస్ కథలలో సంఘటన వర్ణనలో భాగంగా సంభాషణలు నడిపిన తీరు కథారచన పై రచయిత్రి శ్రీ ఊహకు ఉన్న పట్టును తెలియజేస్తాయి.
” మాతృ స్వామ్య వ్యవస్థ కేవలం ఒక భావజాలం మాత్రమే. ఆధిపత్యం కాదు ” అని మగవాడి పెత్తనం , స్త్రీ జీవితంలో సంఘర్షణ ఎక్కడైనా ఒకేలా ఉంటాయని ఈ కథలో కుండ బద్దలు కొట్టారు రచయిత్రి.
ఈ పుస్తకంలోని “పారగాన్ చెప్పులు , పడ్డ మార్గం , బ్యాంకు బర్త్ డే , ప్రెస్ అంకుల్ – పద్మిని ప్రీమియర్ ” కూడ చదివి తీరాల్సిన కథలు. ఎంతో ఇష్టంతో కొనిపించుకున్న పారగాన్ చెప్పుల చేతను పోగొట్టుకున్న చిన్నారి కన్నీళ్లు , అమ్మ నేర్పిన కళతో ఎలాగైనా బతకగలనని నమ్మిన కళావతి ఆత్మస్థైర్యం , మనుమడి చేతిలో మోసపోయి , బ్యాంకు మెట్లపై ప్రాణం వదిలేసిన ముసలమ్మ దీనమైన కళ్లు , ప్రెస్ అంకుల్ పద్మిని కారు – ఇలా ఎన్నో పాఠకుల జ్ఞాపకాల్లో చొరబడి వెంటాడుతుంటాయి.
తెలంగాణ పల్లెలు , హైదరాబాద్ నగరపు బస్తీలు మొదలు ఈశాన్య భారతంలోని ఖాసీ కొండల వరకు స్థలమేదైనా , కాలం ఎప్పుడైనా – ఈ కథల నిండా అట్టడుగు మనుషులే అడుగడుగునా తారస పడుతారు. అందరికీ ఆఖరి మజిలీ అయ్యే శ్మశానం పరిసరాలు బైసాకు (మహోన్నతుడు) కి , ఫహీమ్ (సిక్కా) కి జీవితాన్ని ప్రసాదించే సుక్షేత్రాలుగా కనిపిస్తాయి.
జ్ఞాపకాలతో బతికే వాళ్లు , జ్ఞాపకాలను బలవంతంగా వదిలించుకున్న వాళ్లు , ఎముకలు ఏరుకునే వారు , ప్రింటింగ్ ప్రెస్ పనివాళ్లు , హౌస్ కీపింగ్ ఉద్యోగులు, హస్తకళలతో పొట్ట పోసుకునే స్త్రీలు , కలవారి ఇళ్లలోని పనిమనుషులు, గిరిజన మహిళలు, ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం బతికే ఉద్యోగులు , బడి చదువుల టీనేజర్లు , తరతరాల కళనే వృత్తిగా స్వీకరించి బతకలేక బతికే వాళ్లు – ఇలా శ్రీ ఊహ కథల్లో వస్తు వైవిధ్యం విస్తృతంగా ఉంటుంది.
ఈ సంపుటిలో రచయిత్రి శ్రీ ఊహ తీర్చి దిద్దిన స్త్రీ పాత్రలు – అవమానాలనీ , వేదనను మౌనంగా భరించినా సరైన సమయంలో గొంతు విప్పుతాయి. హక్కులే సంకెళ్లు గా మారిన వేళ ” మరి నాకొద్దా ఆ స్వేచ్ఛ ? ” అని ధైర్యంగా ప్రశ్నిస్తుంది పేరు లేని ఓ కథానాయిక పాత్ర. “వాళ్లే జీవితం అనుకుంటే మన జీవితాలు ఆవిరైపోతాయి మనకోసం మనం అనుకుంటే అది బలం నీకోసం నువ్వు నిలబడటం నీ హక్కు” అని చాటి చెబుతుంది ఓ తల్లి. (నే – కథ)
ఈ కథల్లో రచయిత్రి శ్రీ ఊహ వచనంలో కవితాత్మకత అక్కడక్కడా తళుక్కున మెరిసింది.
” బజార్లు బంగారు చుక్కల్లా వెలిగిపోతుంటే …ఇఫ్తార్ వంటల వాసనలు కవిత్వంలా తేలుతూ గాలి వెంట ప్రయాణిస్తున్నాయి . ” , ” మౌనంగా ఒక చిన్న కొలిమి. దాని నోటి నుంచి పొగలు వికారంగా , దిశా భావం లేకుండా పైకి లేస్తుంటాయి . విసిరివేసిన నీలి టార్పాలిన్ షీట్ జ్ఞాపకాలు కప్పిన ఓ పాత తలపులా చిరిగి పడుంది ” లాంటి వాక్యాలు ఆమెలోని కవితా శక్తిని పట్టి చూపుతాయి. ‘ మబ్బులో పోయి ‘ , ‘ వాకింగ్ ఆన్ ఎగ్ షెల్స్ ‘ వంటి పలుకుబడులు ; ‘ నోటి నిండా మరమరాలు పోసినట్టు ఎగుడు దిగుడుగా ఆమె పళ్ళు ‘ వంటి కొత్త ఉపమలు – నిశ్శబ్దంగా వచ్చి కథనంలో అవసరమైన చోట చక్కగా ఒదిగిపోతాయి.
సిక్కా కథలకు ముందు రెండు కథా సంపుటాలు వెలువరించారు రచయిత్రి శ్రీ ఊహ . కథా శిల్ప నిర్మాణంలో , వస్తువు ఎంపికలో ఆమెది ప్రత్యేక స్థానం అని అన్నారు ముందుమాట లో ప్రముఖ విమర్శకులు శ్రీ ప్రసేన్. సూక్ష్మ అనుభూతులను , స్థూల భావనలను రెండిటినీ ఒడిసి పట్టుకున్న శ్రీ ఊహ కథలు – కథనంలో ఆమెకున్న ప్రతిభను ప్రదర్శిస్తున్నాయని ప్రశంసించారు మరో ప్రసిద్ధ రచయిత శ్రీ జి.వెంకటకృష్ణ. స్వీకరించిన వస్తువు ఏదైనా – పటువైన ఊహలతో – బాధల సాంద్రతను పొదువుకున్న మాటలతో ప్రతి కథను చిక్కగా నడపడంలో రచయిత్రి శ్రీ ఊహ తమ పరిణతిని ఆద్యంతం చాటుకున్నారు. అతి సామాన్యుల బ్రతుకు చిత్రాలను ప్రతిపలించే ఇలాంటి కథలు మరిన్ని
శ్రీ ఊహ గారి కలం నుంచి వస్తాయని ఆశిద్దాం.
