ఇంటి నెం: 8

Spread the love

1
సాళవూర్ వీధులు విశాలంగా ఉన్నాయి. రెండువైపులా వేపచెట్లు ఆకాశాన్నంటే ఎత్తుకు గంభీరంగా నిలబడున్నాయి. ఒక్కొక్క చెట్టు కింది భాగాన రావిచెట్టు చిగుర్లను చూడగలం. ఒక్కొక్కటి తారురోడ్డు నుండి స్వయంభువులా వాటంతటవే మొలిచాయి. అప్పుడప్పుడు చెట్టు వెనుక ఇంటివాళ్ళు రావిచెట్టు చిగుళ్ళు ఇంటికి అరిష్టమని పీకి పడేస్తారు. చెట్లు దట్టంగా ఉన్నప్పటికీ ఆ వీధిలో ఎండ తీవ్రత ఎక్కువగానే వుంది.
అతడు సైకిల్ పెడల్ని మెల్లగా తొక్కాడు. రోడ్డు పల్లం కావడంతో కాళ్ళు కదపకుండా తొక్కుకుంటూ వచ్చాడు. ఆఫీస్ ముందు రబ్బరు తాళంతో సైకిల్ తాళం వేసేసి లోపలికి వెళ్ళాడు. గుమ్మంలోని పోస్టుబాక్స్ని తుడుస్తున్న రాసుమాణిక్కం అతడిని చూడగానే ప్రశ్నతోనే పలకరించ సాగాడు.
“ఏంటీ పంతులుగారు ఈ రోజు లేటా?”
తనని సార్ అని పిలవడంతో వచ్చిన సిగ్గుని నవ్వుతూ దాటుకుని ముందుకు వెళ్ళాడు.
“అదే పనేం లేదు కదన్నా. వచ్చిన ఏడు రోజుల్లో ఒక్క ఉత్తరం కూడా రాలేదు. ఉత్తరమే రావడం లేదు అనుకుంటుంటే, దీనికి తోడు ఈ ఊరోళ్ళు కూడా ఏదీ పంపనంటున్నారు.”
పోస్టుబాక్స్ నుండి పక్కకు వచ్చి రాసుమాణిక్కం మాట్లాడాడు.
“మాట్లాడటానికి బాగా సౌకర్యంగా వుంది సార్. ప్రస్తుతానికి ఉత్తరాలు మనం మాత్రమే వాడుతున్నాం.”
“అయ్యో అన్నా! దయచేసి నన్ను సార్ అని పిలవమాకండి. బాగా సిగ్గేస్తుంది. నాకు ఇంచుమించు మీ అబ్బాయి వయస్సు వుంటుంది.”
“సరే తమ్ముడూ, ఈ రోజైనా ఏమన్నా వచ్చిందేమో చూడు.”
“ఈ రోజు కాకపోయినా రెండు మూడు రోజుల్లో వస్తుందనుకుంటున్నాను. కనీసం ఎవరికైనా ఒక బిల్, లేదంటే అప్లికేషన్ అని ఏదైనా వచ్చితీరాలిగా. అదీ లేదంటే నేనే ఒక పథకం పెట్టుకున్నాను.”
చివరిమాటని తన వయసుకే ఉండే తుంటరి నవ్వుతో చెప్పాడు. రాసుమాణిక్కం కూడా ముఖాన నవ్వుతో ఏమిటని ప్రశ్నించాడు.
“ఎవరి ఇంటి నుండైనా రేషన్ కార్డో, ఓటర్ ఐడినో, అదీ లేదంటే ఆధార్కార్డో ఎత్తుకొచ్చేదాం అనుకుంటున్నాను. కనీసం దాని కోసమన్నా అప్లై చెయ్యడానికి వస్తారు కదా.”
ఇద్దరూ పరస్పరం నవ్వుకుని ఆపై అక్కడ నుండి తప్పుకున్నారు. ఆఫీసులోకి వెళ్ళి ఆ రోజు అటెండన్స్లో సంతకం పెట్టి, కిటికీ దగ్గర కూర్చున్నాడు. వెంట ఉండే సుబ్రమణియన్ ఆ పోస్టాఫీస్ సీనియర్, ఎప్పుడూ ఏదో ఒక వారపత్రికలో లీనమైపోతాడు. మధ్యాహ్నానికి పైన మేజాపై తలవాల్చి చిన్న కునుకు కూడా తీస్తాడు. రోజులో ఎక్కువ సమయం అతడిని చూడటంతోనే గడిచిపోతుంది. భోజనం చేసే సమయానికి రాసుమాణిక్కం కూడా వచ్చేస్తుండడంతో ముగ్గురూ తినేందుకు కలిసి కూర్చునేవారు. చాలామటుకు తినేటప్పుడే వాడివేడి చర్చలు తలెత్తుతాయి. ఒకసారి ఇటువంటి సమయంలోనే రాసుమాణిక్కం అతడి గురించి వాకబు చేశాడు.
“నిన్ను చూస్తే చదువుకునే కుర్రాడిలా వున్నావు. ఎండకు కందిపోకుండా సుకుమారంగా పెరిగిన ఒళ్ళు లాగుంది. నోరు విప్పితే ఖచ్చితంగా ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడుతావని ఒక తేజస్సు చెబుతుంది. కానీ, పోస్టుమేన్ అయ్యావు, ఏం అర్థం కాలేదు. అడిగితే ఇంటి కష్టం అని అంటావు. అసలు ఇంతకీ ఏమిటి ఆ కష్టం?”
“నాన్న చనిపోయాడు. ఉన్న కిరాణకొట్టు కూడా అప్పు మీదే రన్ అవుతుంది. అసలూ వడ్డీ లెక్కకడితే అన్నీ పోనూ ఒక నెల సామాన్లు మాత్రమే మిగిలాయి. అన్ని అప్పులు. అమ్మని పనికి పంపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. చదువుతూనే వున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో చదువు కంటే డబ్బులే ముఖ్యమని ఇటువైపు వచ్చేశాను. దొరికిన ప్రభుత్వ ఉద్యోగమేమో సాళూర్ లాంటి చోట్లో తీసుకొచ్చి పడేశారు. చెన్నై లాంటి చోట్లో వేసుంటే అమ్మకి ఆ ఐదు పదీ కూడా పంపించేందుకు వీలయ్యేది కాదు.
“అంత ఖర్చు పెడతావా?”
“ఖర్చయి పోతుందని ఆ నోటా ఈ నోటా విన్నదే”
ఇద్దరి నుండి ఒకే ధోరణిలో వెటకారం నిండిన నవ్వు వెలువడింది. ఆ నవ్వు అప్పుడు కూడా అతడిలో కొనసాగింది. వారపత్రికలో మునిగిపోయిన సుబ్రమణియన్ ధ్యాస అతడివైపుకు మళ్ళించి అతడితో మాట్లాడాడు.
“ఏమయ్యా నువ్వు పంతులువే కదా. నాన్నగారికి జ్యోతిష్యం చూడటం వచ్చా?”
“లేదు. ఆయనకి లెక్కలు మాత్రమే తెలుసు. జ్యోతిష్యం అవి రావు.
కిటికీకి అవతల చూస్తున్నా చూపు తిప్పుకోకుండా సమాధానమిస్తున్నాడు.
“ఎందుకు సడెన్గా అడిగారు?”
“జ్యోతిష్యంలో ఎనిమిదవ నెంబరుకి ఏమన్నా ప్రత్యేకత ఉందేమో తెలుసుకుందామని చిన్న ఆశ. నన్ను చూసిన జ్యోతిష్యులు అందరూ ఎనిమిదవ పాదం అని మాటిమాటికీ అనడం విన్నాను. నువ్వు అతడిని పంతులు అని అన్నావుగా, అందుకే టక్కున గుర్తుకొచ్చింది. అందుకే అడిగాను.”
మళ్ళీ వారపత్రికలో మునిగిపోయాడు. ఆయన మాటలు నాన్నకు సంబంధించిన ఏదో ఒక వాక్యాన్ని అతడిలో తట్టి లేపాయి. నాన్న కిరణాకొట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన తరుచూ అనే మాట అది.
ఖాతాదారుడు తనకి రాసిచ్చిన రసీదుని వదిలేసి వెళ్ళిపోయాడు. దానిని చేతుల్లోకి తీసుకుని కాగితం పడవ చేద్దామనుకున్న సమయం అది. అతడి చేతి నుండి పడిన రసీదుని ఇచ్చేందుకు వంగుని తీశాడు. అందులోని మొత్తం ఎనభై రూపాయలు అని అంకెల్లో రాయబడి వుంది. మనోహర్ని దగ్గరికి పిలిచి అంకెలని వేలెత్తి చూపించాడు.
“మనో ఎనిమిదికి, సైబర్కి సంబంధం వుంది తెలుసా?”
బిత్తరచూపులు చూస్తున్న అతనితో మాట్లాడుతూ వున్నాడు.
“రెండూ ఒకటే. గీతలు దారి మారి చేరిన గుర్తే నంబర్స్, సైబర్ని, ఎనిమిదిని రాసేటప్పుడు, ఛ! ఛ! గీసేటప్పుడు మొదలెట్టిన చోటికే వచ్చి నిలబడతావు. అప్పుడే నెంబర్లు పూర్తవుతాయి. ఈ రెండు నెంబర్స్లో మాత్రమే మొదలెట్టిన చోట్లోనే ఒక మనిషి వచ్చి నిలబడతాడు. సైబర్లో ఎంతో తేలికగా. ఎనిమిదిలో ఎక్కడెక్కడో తిరుగుతూ. మనిషి బతుకు కూడా ఎనిమిదే కదా మనో. జ్ఞాపకంగానైనా మొదలెట్టిన చోటుకే వచ్చి నిలబడిపోతున్నాడు.”
మాటలు పూర్తయ్యేసరికి మరొక ఖాతాదారుడు రావడంతో కళ్ళు తెరిచిన మనోహరన్ ఈ లోకంలోకి వచ్చాడు. నాన్న చేతుల్లో నుంచి రసీదు కింద పడింది. నాన్న మాటలు చెవిలో కరిగిపోయేసరికి ఎనిమిది, సున్నా కలిగిన రసీదుతో కాగితం పడవ చెయ్యసాగాడు.
జ్ఞాపకాల అంచుల్లో పెదవంచున నవ్వు చిగురిస్తోంది. నాన్న మాటలు మాత్రమే మళ్ళీ చెవుల్లో వినబడినట్లున్నాయి. పక్కనున్న సుబ్రమణియన్ మేజాబల్ల ఉండే గదివైపుకి వేలెత్తి చూపించి వేగంగా పంచుకోసాగాడు.
“ఏయ్ మనో తమ్ముడూ! అన్నట్లు చెప్పడం మరిచిపోయాను. ఉదయం ఒక లెటర్ వచ్చింది. ఇచ్చే పనైతే ఇచ్చేసి రా. టేబుల్ పై అటెండెన్స్ బుక్ పక్కన వుంది.”
చేదు కషాయం తాగినట్లు చెప్పి ముగించాడు. కుతూహలంతో వెళ్ళిన అతడికి ఉత్త మేజాబల్ల నిరాశని మిగిల్చింది. మంచి నీళ్ళ కేన్ పెట్టేసి వెళుతున్న రాసుమాణిక్యాన్ని పిలిచి అడిగాడు.
“ఇక్కడ టేబుల్ మీద ఒక లెటర్ వచ్చిందంట చూశారా?”
“అది చెల్లని లెటర్ తమ్ముడు, సన్నాసి అనే ముసలాడికి.”
ఇది అనేటపుడు కాస్త ఎడంగా ఉన్నప్పటికీ రాసుమాణిక్కం ముఖంలో కనబడిన భయాన్ని మనో అనుభూతి చెందాడు. అయినప్పటికీ మూతి విరుచుకోకుండా వాకబు చేసాడు.
“దాన్ని నేను చేరుకునేలా చేస్తాను. ఎక్కడ వుందని చెప్పండి.”
గట్టిగా సణగడంలో అనాసక్తుడై బదులిచ్చాడు.
“కుడివైపునున్న రూములో చూడండి.”
తల పైకెత్తి ముఖం చూడకుండా సైకిల్ తొక్కుకుంటూ రాసుమాణిక్కం బయలుదేరాడు. పోస్టాఫీస్లోని సైకిల్ వెనుక తన్నుకొస్తున్న పాత నీళ్ళ కేన్తో రాసుమాణిక్కమూ త్వరగా వీధిని దాటాడు. రాసుమాణిక్కం చెప్పిన గది వాకిట్లో లెటర్ ఉండటం గమనించాడు. తలుపు కింద కాస్త పొడవుగా బయటకి వచ్చి నేలను అంటిపెట్టుకున్న దానిని తీసి చూశాడు. అది ఒక పోస్టు కార్డు. ఈ రోజుల్లో కూడా ఇందులో రాస్తున్నారా అని సందేహపడ్డాడు. పనికి వెళుతున్న ఇన్ని రోజుల్లో ఆఫీసులోని ఆ చిన్న గదిని అతడు చూడలేదన్నది అతడికి ఆశ్చర్యం కలిగించింది. పోస్టుకార్డు అడ్రసు కూడా చూసుకోకుండా తలుపు తెరిచాడు. చెత్తాచెదారంలా వున్న పసుపురంగులోని అట్టలు చీకట్లో ప్రకాశిస్తున్నాయి. వాటి వెలుతురు అతని కనురెప్ప పైకెత్తేలా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. చేతిలోనున్న కొత్త అట్టని జేబులో పెట్టుకుని ముందే వున్న కుప్పలోంచి ఒక్కో అట్టగా తీసి చూశాడు. పోస్టాఫీస్ పైపనులు చేసే సహాయకుడిగా ఉండే రాసుమాణిక్కం చెల్లని ఉత్తరం అనే మాట గుర్తుకొచ్చి మాయమయ్యింది. ఒక్కొక్క అట్టని అందుకునేవాళ్ళ చిరునామాని చూసేసరికి అతని ఆశ్చర్యం మరిన్ని రెట్లయింది. తన జేబులోని అట్టని తీసి చూసినప్పుడు కూడా అదే అడ్రస్ అక్షరదోషాలు లేకుండా రాసి ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
సన్నాసి
ఇంటి నెంబర్ : 8, సాళవూర్.

2
రాసుమాణిక్కం దగ్గరున్న అనాసక్తమైన ధోరణిని మూతివిరుపుతో అధిగమించి సైకిల్ తొక్కసాగాడు. సాళవూరిలో సుమారుగా మూడు వందల ఇళ్ళు ఉండివుండొచ్చు. వీధులకు ఎటువంటి పేర్లు లేవు. అయితే, ఇంటి తలుపులపై నెంబర్లు రాయబడి వున్నాయి. ఊరి మొదలుకి వెళితే ఎనిమిదవ నెంబరు ఇంటిని చేరుకోవడం సులభమని అనుకుంటూనే సైకిల్ తొక్కుతున్నాడు.
ఆ గదిలో వున్న పోస్టు కార్డులని చూస్తున్న మనోహరన్ మీద సుబ్రమణియానికి సందేహం వచ్చి పిలిచాడు.
“చెత్తని ఎంతసేపు చూస్తావు మనోహర్?’
“చేరవలసిన మనిషికి చేరని ఉత్తరాలు చెత్త ఎలా అవుతుందా సార్?”
ఆయన సమధానం చెప్పలేక పోయాడు. అయినా సరే ఆ గదిలో అతడు నిలబడడం నచ్చలేదన్నది మాత్రమే ముఖంలో కొట్టొచ్చినట్లు కనబడింది. ఆయన మౌనాన్ని లెక్క చేసి, చెదిరిపడున్న పోస్టు కార్డుని చేతుల్లోకి తీశాడు. ఇవ్వవలసిన అట్టని జేబులో అంచు నలిగి పోకుండా పెట్టుకుని చేతిలోకి తీసుకున్న అట్టని చదివేందుకు ప్రయత్నించాడు. గదిలో పరుచుకున్న చీకటిలో అక్షరాలు మసకగా కనబడ్డాయి. సగం తలుపులోకి తన శరీరాన్ని దూర్చి గది బయటనున్న వెలుతురిలో చదవసాగాడు.
“ప్రియమైన సన్నాసి తాతయ్యకి,
ఆ చీకట్లో తలుపు సందులోనే నా లోదుస్తుల్లో రక్తపు కంపు కొట్టసాగింది. తలుపుకి అవతలున్న అమ్మకి అది ఎలా తెలిసిందని వివరించేందుకు వీలుపడలేదు. అమ్మ చూపులో కనబడిన భయం, చిన్నపాటి సంతోషాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. సగం నిద్రలోని నాకు ఏదో వంట్లో బాగోలేదని అనుకోసాగాను. అనేక క్రతువులు, సంప్రదాయాలు ఆ రోజులను పూర్తిచేశాయి. రోజులు ముందుకి సాగి మామూలు జీవితానికి రావడానికి ఎదురుచూశాను. ఇల్లు సహజస్థితికి రాగానే సాయంత్రంవేళలో ఇంటి కిటికీ తలుపులు గడియ పడసాగాయి. వీధిలోని స్నేహితురాళ్ళు అమ్మ దగ్గర నన్ను ఆటలాడేందుకు పిలిచేవారు. అమ్మ తను పనిలో వుంది అనేది. గడియ వేయని తలుపుని తెరిచేందుకు ధైర్యం చాలక అమ్మ ఉత్తర్వు కోసం ఎదురుచూస్తుండేదాన్ని. తాళం వేసే కన్నం నుండి ఒంటికన్నుతో చూస్తూ స్నేహితురాళ్ళ ఆటకి ప్రేక్షకురాలని మాత్రమే అయ్యేదానిని. ఎప్పుడన్నా మా వీధికి వచ్చేటప్పుడు ఒక్కో ఇంటి తాళం వేసే కన్నాన్ని పరికించి చూడండి. మీలాంటి ఆసక్తి కలిగిన ఒంటికన్నుని చూడగలరు. ఏదైనా ఒక తలుపు తాళం వేసే సందులో కలుసుకుందాం.
ప్రేమతో
రాధ
చదివేలోపు అతడికే తెలియకుండా గదిలో నుండి బయటకు వచ్చాడు. సుబ్రమణియన్ తలుపుని మూసి గడియపెడుతున్నాడు. మనో చేతుల్లోని గడియారాన్ని తీసుకుని తలుపు సందులోంచి లోపలికి తోసాడు. సుబ్రమణియన్ చేసిన పనిని ఉదాసీన పరిచే విధంగా జేబులోనున్న గడియారాన్ని తీసుకుని అతడు బయలుదేరాడు.
ఎవరీ రాధా?
ముసలాడు సన్నాసికి, రాధకి వున్న సంబంధం ఏమిటి? ఆయనకి ఎందుకు ఈ విషయాన్ని రాయాలి?
సన్నాసి దానికి జాబు రాసాడా?
ఇత్యాది ప్రశ్నలు తలెత్తసాగాయి. ఊరి పొలిమేరని చేరుకున్నాడు. తలుపు నెంబర్ని లెక్క పెట్టుకుంటూ మళ్ళీ ఊరిలోకి నడుచుకుని వెళ్ళాడు. తుప్పు పట్టిన కమ్మీలతో చేసిన ఇనుపగేటు పక్కన ఎనిమిది అనే నెంబరు తెల్లరంగులో మురికిపట్టి వుంది. ముందున్న తలుపుపై కూడా ఎనిమిది అనే నెంబర్ ముద్రించబడి వుంది. చేతిలో పోస్టుకార్డును తీసుకుని లోపలికి ప్రవేశించాడు.
3
ఇంటి తలుపుని తెరిచేముందే తలుపువైపు అడుగులు వేస్తున్న చప్పుడు వినగలిగాడు. విషయం ఎలా చెప్పడమని ఆలోచించుకుని అసహజంగా గుమ్మం దగ్గర నిరుత్సుకతతో అరిచాడు.
“అయ్యా మీకు ఒక లెటర్ వచ్చింది.”
దగ్గర్లో వాకిట్లో నుంచి ఇంటి వెనుకకి వెళ్ళాలనుకుంటున్న ఒక మహిళ సందేహంగా చూసి పక్కకి తప్పుకుంది. లోపల నుండి పూడుకుపోయిన గొంతుతో సమధానం వచ్చింది.
“తలుపు గొళ్ళెం వెయ్యలేదు, తోసుకుని రా.”
గొంతులోని బలహీనతని, మాటల ఉచ్చరణని బట్టి ఎనభైయేళ్ళు వుంటాయనుకున్నాడు. తలుపు తెరవగానే చీకటి గది అంతా పరుచుకుంది. చీకటి గుండా పడక కుర్చీలో తను కలుద్దామని వచ్చిన సన్నాసి కూర్చుని వున్నాడు అనుకున్నాడు. చీకటి గుండా ఆ గదిలో ఏమేం వస్తువులు వుండుండవచ్చని అంచనా వెయ్యగలిగాడు. కాళ్ళకి ఎటువంటి సామాన్లు అడ్డు తగలకపోవడంతో సగానికి పైగా చోటు ఖాళీగా వుండటం అనుభూతి చెందాడు.
“అలాగే పక్కన వచ్చి కూర్చో బాబు.”
“చీకటికి, జేగురురంగు గోడకి ఉండే సంబంధం ఇదే బాబు. వాళ్ళ ప్రపంచానికి వస్తే వాళ్ళలా తను ఉండేందుకు ప్రయత్నించాలి.”
“నేను కింద నీళ్ళు పోయాయని అనుకున్నాను. ఒక లైట్ కొనుక్కుని వేసుకోవచ్చుగా?”
చీకట్లో వెదికేందుకు కళ్ళు ప్రయత్నిస్తున్నాయి.
“చీకటికి భయమేస్తుందా?”
“నడిచేటప్పుడు దెబ్బలు తగలకూడదని అన్నాను.”
“పగలు చూడని వాడికి చీకటే ప్రపంచం. ఏది చీకటి ఏది వెలుతురని మీరు మాటల్లో చెబితే నేను తెలుసుకుంటాను. అది నువ్వు అనుభూతికి తేగలవా? నీ గుర్తుగా వున్నది గొంతు మాత్రమే. దానిని బట్టి చూస్తే ఇరవై మూడేళ్ళు కుర్రాడివి అయ్యుంటావని అనుకుంటున్నాను.”
మాటలు ఆసక్తికరంగా వున్నప్పటికీ ఆ ఇల్లూ, చీకటీ పొంతన లేని మాటలు వరుసపెట్టి ఇచ్చిన భయంతో నేరుగా విషయానికి వచ్చాడు.
“అయ్యా! మీకు ఒక లెటర్ వచ్చింది.”
“గుడ్డివాడిని అని తెలిసి కూడా చెబుతున్నావు చూశావా? నువ్వే చదివి వినిపించేం.”
కొన్ని నిమిషాల మౌనం తరువాత ఆయనే మళ్ళీ కొనసాగించాడు.
“అది సరేగానీ, నేనే గుడ్డివాడ్ని, నువ్వు కాదుగా? ఇక్కడ ఒక కిటికీ వుంటుంది. అది తెరిచి చూడు వెలుతురు వస్తోంది.”
వెలుతురు మెల్లగా లోపలికి చొచ్చుకుని వచ్చింది. ఆయన చూపులో కనురెప్పల పైనా ఎటువంటి మార్పూ కనబడలేదు. కదలకుండా అదే కుర్చీలో కూర్చున్నాడు. చటుక్కున మెల్లని కదలికలు అనుభూతికి వచ్చాయి.
“పక్కనోళ్ళ ఉత్తరాన్ని చదువుతున్నామని సంకోచంగా వుందా?”
ఆయన అన్ని విషయాల్ని ఎలా చెప్పగలుగుతున్నాడని సందేహం కలిగింది. మళ్ళీ ఆయనే చెప్పుకుంటూ పోయాడు.
“ఒక్కొక్క ఉత్తరం ఉద్వేగాలను మోసుకువస్తుంది. చదవడమే ఆ అనుభూతిని వ్యక్తం చేస్తుంది. అంతవరకు అది ఉత్త రాత మాత్రమే. ఎవరైనా సరే రాయదగిన రాత. నువ్వు చేసేది పెద్ద విషయం. దానధర్మం చెయ్యడం లాంటిది. చేసేటప్పుడు అనుభూతి చెందలేకపోయినా ఏదైనా ఒక రోజుకి నువ్వే అనుభూతి చెందుతావు. అందులోనూ ఒక గుడ్డివాడి కోసం చేస్తున్నావు చూడు, అది పుణ్యం కూడా!”
మాటల అంతరార్థాన్ని అనుభూతి చెందేందుకు సమయం పట్టినప్పటికీ ఉత్తరం చదవడం మొదలెట్టాడు. కిటికీ గుండా లోపలికి వచ్చిన వెలుతురు కార్డుపై పడి అది బంగారు రంగులో మెరిసింది.
ప్రియమైన సన్నాసికి,
చీకటి ఎప్పటికీ నాకు భయాన్ని కలిగించదగినది, అప్పుడు నాకు మూడేళ్ళ వయస్సు. పడుకుని వున్నాననుకుని అమ్మ కొట్టుకి వెళ్ళిపోయింది. కొట్టుకి, ఇంటికి మధ్య దూరం ముప్పావు గంట సమయం పట్టేంత. అప్పుడే నిద్ర లేవడంతో మనుష్యులు లేని ఇంటిని చూడగలిగాను. తాళం వేసిన ఇంట్లో అమ్మని వెదికి అలమటించాను. గదులన్నీ ఖాళీగా వున్నాయి. నాన్న ఆఫీసుకి వెళ్ళారు. అమ్మని మాత్రమే నా ఆలోచనలు వెదుకుతున్నాయి. ఒక్కొక్క కిటికీలో వేలాడుతున్న ముదురు రంగు గుడ్డలతో వెలుతురు ఇంట్లోకి రాలేదు. అక్కడక్కడా కనబడుతున్న మసకవెలుతురి దగ్గరకి వెళ్ళి నిలబడ్డాను. ఏడుపు కూడా వెలుతురితో పాటు వుంది. కాస్త పక్కకి ఒదిగిన నీడ చీకటి నా కన్నీటికి కారణమయ్యింది. అమ్మ రాక నన్ను శాంతింపజేసినప్పటికీ మునుపున్న నీడని, చీకటిని చూసి నాకు కలిగిన భయం నన్ను వదిలిపోలేదు. దాని ఫలితంగా పెళ్ళపుడు ఇది పెద్ద సమస్య అయ్యింది. భార్యతో సంసారంలోనూ చీకటికి భయపడసాగాను. వెలుతురు ఆమె కంటికి బిడియాన్ని కలిగించినప్పటికీ, కొన్ని రోజులకది నాపై సందేహంగా మారింది. సందేహం అనుబంధాన్ని నిరూపించేందుకు అవసరాన్ని కల్పించింది. ఉద్వేగాల మధ్య నిరూపణలు ఆ దూరాన్ని మరింత పెంచేవి. కనుక అదే దూరంతో బతుకుతున్నాను. దూరానికి సాక్ష్యంగా ఒక తలుపు నా గది చివర, ఆమె గది ముందూ కదలక నిలబడుంది. తలుపులు తెరిచేందుకు ఎదురుచూశాను.
ప్రేమతో
శంకర్
తక్కువ శబ్దంతో చదవడం, మధ్యలో మాటిమాటికీ ముసలివాడి ముఖాన్ని చూడడం అతడు మానలేదు. ముసలివాడైన సన్నాసి ముడతలు పడ్డ చెంపల ముడతల్లో, కన్నీటి బొట్లు ఇంకిపోయిన కళ్ళలో మిగిలిన ఆఖరి కన్నీటి బొట్లు అవి అని ఊహించగలిగాను. చదవగానే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆయనను వాకబు చేశాను.
“అవును ఇవన్నీ నేను మీకెందుకు చెప్పాలి?”
ఆయన నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ప్రశ్నించడం తప్పా, అనే అపరాధభావం మనోహరన్ మనసులో మొదలవ్వసాగింది. ఆయన చెవులు మందంగా ఉంటాయేమోనన్న ఆలోచనతో తనలో తను గొణిగాడు.
“ఉత్తరం మాట్లాడేందుకు మరో మార్గమా? అందులో ఎందుకు ఈ స్వచ్ఛమైన తమిళం? వాడుకలో మాట్లాడేదే రాయొచ్చుగా? ఏంటో ముసలాడు అయ్యింది, లెటర్ అయ్యింది.”
ఉత్తరాన్ని ఆయనకే ఇచ్చేందుకు వెళ్ళాను. చేతులు ఆయన వైపుకి జరుగుతున్నపుడే సరిగ్గా అతడి సణుగుడుని మాటలుగా మార్చాలనుకునే ఉద్దేశంతో హుంకరించాడు.
“మనసు మాట్లాడే భాషకి మనం బయట మాట్లాడే భాషకి ఎప్పుడు తేడా వుంటుంది. మనం పక్కవాళ్ళకి అర్థమవ్వాలని మాట్లాడుతాం. మనసు మనకి ఏదో తెలియజేసేందుకే మాట్లాడుతుంది. ఇది మనసు రాసే లేఖ. ఇలానే వుంటుంది.”
“అయితే, ఇవన్నీ మీకు చెప్పుకొని వాళ్ళవాళ్ళకు ఏం దొరకబోతుంది.”
“తనలో తనే మాట్లాడుకుంటున్నాడని ఊరు తప్పుగా అనుకోవడంతోనే మనిషి ఆ పనిని వదిలేస్తున్నాడు. తనకి తను మాట్లాడవలసిన కొన్ని రహస్యాలను మరో మనిషితో చెప్పాలనుకుంటున్నాడు. మరో మనిషి దొరకనప్పుడు ఒంటరిగా ఉంటున్నాని అంటున్నాడు? ఒంటరిగా ఉంటున్నానని చెప్పడమే నిజానికి పచ్చి అబద్ధం. తన సమస్యని తాను తర్కించి, పరిష్కరించలేనోడు పక్కనోడికి చెప్పి పరిష్కారం ఎదురుచూడడం ఎంతవరకూ న్యాయం?”
కంగారుగా మాట్లాడుతున్నపుడు గొంతు యవ్వనానికి, వృద్ధాప్యానికి మధ్య ఊగిసలాడటం గమనించాడు.
“ఊరితో పాటు కలిసిమెలిసి బతకమని మీ లాంటి పెద్దలు నేర్పించినదానికి మరి అర్థమేముంది?”
“ఊరంతా కలిసి రథం లాగుతున్నామని కూడా అంటున్నారు. రథం అనేది సామాజిక విషయం. అది నెరవేర్చేందుకు ఊరిని సంప్రదించి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. అది నీకు కావల్సిన సమాధానం. అయితే, నీ కంటూ ఒక జీవితముంది. నీకు మాత్రమే చెందిన మనుష్యులు ఉన్నారు. వాళ్ళ విషయాలని ఊరువాడా ఏకమై నిర్ణయాలు తీసుకోలేదు. మనిషికి బాగా తెలిసిన విషయం తన గురించి మాత్రమే. అయితే, అతడు భయపడేదే తన గురించి మాట్లాడడానికే. జీవితపు అతిపెద్ద వైరుధ్యం అది.”
మాట్లాడేకొద్దీ ముసలివాడైన సన్నాసి నుండి వృద్ధాప్యం చర్మం ఒలుచుకుని పోవడం మాటల ద్వారా తెలుసుకోసాగాడు. ఆయన చెప్పిన సమధానాలను అతడు అంగీకరించలేకపోయాడు. అంతా సరే కానీ ఎందుకు ముసలి సన్నాసిని ఎంచుకోవాలి అనే ప్రశ్న తలెత్తింది. అడుగుదామని నోరు విప్పే లోపు ముసలాయన బిగ్గరగా దగ్గసాగాడు. పడక కుర్చీ నుండి లేచే సమయానికి చెక్క పడక కుర్చీ మేకు దిగ్గొట్టిన భాగం నుండి క్రీచ్ క్రీచ్ మనే శబ్దం వెలువడింది. తను వచ్చి చాలాసేపు అయ్యందనే ఎరుక కలిగినవాడిలా సమయం చూసేందుకు ఫోన్ చేతుల్లోకి తీశాడు. బ్యాటరీ అయిపోయి ఫోన్ ఆఫ్ అయిపోయింది. అక్కడ చార్జర్ దొరికేందుకు ఎటువంటి ఆస్కారం లేదనే ఆలోచన కలగడంతో నెమ్మదిగా నడిచి వెళుతున్న సన్నాసిని చీకట్లో ఊహించుకుని తిరిగి అతడినే అడిగాడు.
“గడియారం వుందా?”
“కుడివైపు గదిలో వుంది బాబు? రూములోని కిటికీ తెరిచి చూడు, వెలుతురిలో సమయం తెలుస్తుంది.”
చీకట్లో గోడని తడుముకుంటూనే నడిచివెళ్ళాడు. రెండడుగుల్లో అక్కడకి వెళ్ళడమే ఎక్కువ అనే ఆలోచనలు తలెత్తి కనుమరుగయ్యాయి. గది తలుపుపై చెయ్యి పెడుతున్నపుడు సన్నాసి సణుగుడు స్పష్టంగా వినిపించడం అర్థమయ్యింది.
“తలుపు నాణేనికి రెండు వైపులు లాంటిది. ఒక వైపు రాజకీయం, మరో వైపు మార్మికత. ఏ తలుపు తెరిచేటప్పుడైనా నువ్వు ఏ వైపు వెళ్ళబోతున్నావు అనే స్పష్టత ఉండాలి. లేదంటే అర్థమయ్యేలోపు ఆ తలుపు మూసుకుపోతుంది.”
ఆయన మాటలు పోస్టు బాక్స్ మీద రాసినట్లు వినిపించాయి. సణుగుడు శబ్దం గాలిలో కరిగే సమయానికి ఆయన చెప్పిన గదిలో మూసిన తలుపుల మధ్య నిర్భంధించబడ్డాడు. మళ్ళీ బయటకి వెళ్ళేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ తలుపుని తెరవలేకపోయాడు. తలుపూ, దానిని ఆనుకునున్న గోడా చీకటిలో రేకెత్తించిన ఒక్కగానొక్క అడ్డంకి అని, సన్నాసి గొంతు ఎక్కడైనా వినబడుతుందా అని చీకట్లో ఎదురుచూడసాగాడు.

4
గోడ ఒక్కో అంగుళం తడుముకుంటూ వెళ్ళాడు. కాళ్ళకి కాగితాలు అడ్డం పడుతున్నట్లు అనిపించింది. ఒక్కో కాగితం తీసి చూశాడు. బరువైన కాగితాలు. వాటి మందం పోస్టు కార్డుల పరిమాణానికి తగినట్లు వుంది. సన్నాసి తాతతో మాట్లాడుతుంటే, నాన్నతో మాట్లాడుతున్నట్లు వుంది.
నాన్నలానే మాటల్లో కనబడే మార్మికత ఆకర్షించింది. నాన్న దగ్గర లేని భయం మాత్రమే సన్నాసిని అతడి నుండి వేరుపరుస్తుందని గ్రహించాడు.
గదిలోకి ప్రవేశించిన కొన్ని క్షణాలలో గది అమరిక మారినట్లు సందేహించసాగాడు. లోపలికి వెళ్ళిన ఆనవాళ్ళ దారిలో వెనక్కి నడిచి చూశాడు. అప్పుడు కూడా తలుపుని గుర్తుపట్టలేకపోయాడు, కాళ్ళ కిందున్న కాగితాలపై నడవసాగాడు. రెండడుగుల్లోనే కాగితాలు గుట్టగా వున్నాయనే నిర్ణయానికి రాగలిగాడు. వాటి దొంతర్లు ఏటవాలుగా ఎక్కసాగాయి. ఎక్కేందుకు ప్రయత్నించి కాగితాల మృదుత్వం వలన కాళ్ళు జారాయి. సమతలం నుండి గోడని తడమడం లక్ష్యంగా చేసుకుని ఒక్కో అంగుళంగా కదులుతూ ఏదైనా దారి కనబడుతుందా అని వెదికాడు. ఎంతగా వెదికినా ముసలి సన్నాసి చెప్పిన కిటికీని గుర్తించలేకపోయాడు.
సమయం తెలుసుకునేందుకు ఎక్కువగా ప్రయాస పడ్డాడు. ఎన్ని పూటలు లోపల చిక్కుకున్నామని ఎంతగా ఆలోచించినా సరే గుర్తు రాలేదు. గదిలో నుండి అరిచి కూడా చూశాడు. ఏ ప్రయోజనం లేదు, గొంతు ఎండిపోవడమే మిగిలింది అని గోడకి జారబడి కూర్చున్నాడు. పోస్టుమేన్లని హత్య చేసే సైకో కిల్లరేనా సన్నాసి అనే అబద్ధపు ఆలోచనలకి ఊపిరి పోశాడు. కాసేపట్లోనే అతడి ఆలోచనలు, ఊహలు కరగి పోసాగాయి.
గదిలో తనతో పాటు వున్న ఒక్కగానొక్క వస్తువైన కాగితాలని చేతుల్లోకి తీసుకుని తడమసాగాడు. చెదిరిపడిన కాగితాలన్నీ ఒకే పరిమాణంలో వున్నాయి. చేతిలోనున్న సన్నాసి పోస్టు కార్డుని తీసుకొని దానితో పాటు పోల్చి అనుభూతి చెందేందుకు ప్రయత్నించాడు. గదిలో వున్నవన్నీ పోస్టుకార్డులే అయ్యుండాలనే ఆలోచనలని చీకట్లో రూఢి చేసుకున్నాడు. కళ్ళు చిన్నవి చేసుకుని అట్టలని పరికించిప్పటికీ వాటి రంగుని చూడలేకపోయాడు. కాసేపట్లో తను చేసింది ఒక పిచ్చి పని అని తనని తనే నిందించుకున్నాడు. నేలపై నుండి కొన్ని పోస్టు కార్డులని తన జేబులోకి కుక్కుకున్నాడు.
బాల్యంలో నుంచి జ్ఞాపకాలన్నిటిని చీకటి బయటపెట్టేందుకు యత్నించింది. తన జీవితంలో జరిగిన విషయాలన్నిటిని నోరారా తనతోనే చెప్పుకోసాగాడు. కొన్ని సమయాల్లో ఏడ్వడం కూడా చీకట్లో అలవాటు చేసుకున్నాడు. గదిలోకి దూరినప్పటి నుండి వెంటాడే సందేహం తనకు ఆకలి, దాహం ఎందుకు వెయ్యడం లేదు అన్నదే. అయినా సరే తనని తను తెలుసుకునే ఆత్రుతతో సందేహాన్ని పక్కనపెట్టి మాట్లాడుతున్నాడు. చీకటి పూర్తిగా తనలో మరొక కొత్త మనిషిని తనకు పరిచయం చేసింది.
ముఖాన వెంట్రుకలు మురికిపట్టసాగాయి. పళ్ళు జివ్వుమనడం ఎక్కువైంది. శరీరాన్ని కప్పిన మాంసపు ముద్దల నుండి వెలువడే కంపు ముక్కుకి అసూయ కలిగించసాగింది. వాటిని కూడా పట్టించుకోకుండా తన గురించే మాట్లాడుతున్నాడు. పోస్టుమేన్ పనికి రావడం, అందువలన ఈ ఇంట్లో చిక్కుకోవడం వరకు జరిగిన కథని చెప్పి పెద్దగా నిట్టూరుస్తున్నపుడు కూడా చెప్పని విషయం ఇంకా మిగిలుందని అనుకున్నాడు. అర్థమవ్వడానికి, మాటలకు మధ్యనున్న దూరంలో కొత్తగా ఒక శబ్దాన్ని అతడు వినగలిగాడు. జ్ఞాపకాలు సమతుల్యం అయినవాడిగా ఒకవైపుకు గోడని పట్టుకుని ఎక్కాడు. శబ్దం వచ్చినవైపు చెవి ఆనించాడు.
“సార్ పోస్టు! ఎవరైనా ఉన్నారా?”
ఏదో ఒక సమాధానం చెప్పి తీరాలి. ఇతన్ని అడ్డం పెట్టుకునైనా బయటపడాలి అనే ఆలోచనకు మనసు పదును పెట్టింది.
“ఎవరూ?”
గుమ్మం దగ్గరున్న మనిషికి ఎవరికీ అన్నట్లు వినబడింది.
“సన్నాసి సార్ ఉన్నారా?”
సన్నాసి ముఖాన్ని మర్చిపోయాడు. ఇంట్లో ఏ గదిలో సన్నాసి వుండి వుండవచ్చు అనే సందేహమూ తలెత్తసాగింది. శరవేగంగా ఒక ప్రయత్నం చేసి చూద్దాం అనే పథకంతో గోడని మళ్ళీ తడమసాగాడు. సిమెంట్ పూసి చదును చేసిన పక్క గోడ చల్లగా వుంది. గోడ స్పర్శ ఏదో ఒక చోట్లో తెగి, చెట్టు స్పర్శని అనుభూతి చెందాడు. తడమడంలో చేతులు వేగం పుంజుకున్నాయి. ఆ చెట్టుతో చేసిన అడ్డుగోడ అన్ని మూలల్లోనూ వెతికేసరికి ఒక గొళ్ళెం చేతికి చిక్కింది. గొళ్ళెం తెరవగానే ఒక గది చీకటి నుండి ఇంకొక గది చీకటికి జరగసాగాడు. చలనం లేని కాళ్ళు వదులయ్యాయి. కంటితో చీకట్లో తడమలేకపోతున్నాడు. చెవులు వినికిడి శక్తిని కోల్పోయినట్లు అనిపించింది. చేతిల్లో స్పర్శ కలిగించే ఉద్వేగాన్ని పూర్తిగా గ్రహించలేక ఉద్వేగాలు సడలిపోయాయి. దప్పికతో పిడచకట్టుకుపోయిన గొంతుతో,
“లోపలికి రండి” అని పిలిచాడు.
5
గతకాలపు నీడ ఒకటి వర్తమానంపై పరుచుకుంటున్న భయంతో పోస్టుకార్డుతో తన ముందున్న యువకుడ్ని సంప్రదించాడు. అతడు సన్నాసిని అడిగిన ప్రశ్నలన్నీ, ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా సన్నాసిని అడిగాడు.
“ఇక్కడ మీకు ఎలా పొద్దు పోతుంది?”
సన్నాసి తనతో చీకటి గురించి చెప్పిన విషయాల్ని గుర్తు చేసి కొత్త పోస్టుమేన్కి అప్పజెప్పాడు. అతడికి అర్థం కాలేదన్న విషయాన్ని కళ్ళు చిన్నవిగా కుచించుకుని తెలుసుకున్నాడు మనోహర్. చటుక్కున వచ్చిన విషయంపైకి మాటలు మళ్ళించాడు.
“మీకు ఒక లెటర్ వచ్చిందండీ.”
కంటికి చదివేంత సత్తువ వుంటుందా అని అంతపట్టలేదు. కిటికీ గుర్తులని సన్నాసి చెప్పిన మాటల గుర్తుల నుండి చెప్పి అతడినే చదవమన్నాడు. తనని తనే, అతని ముందు గుడ్డివాడ్ని చేసుకోవడం మనోహరన్లో మనస్తాపం కలిగించింది. పైగా చదవనున్న ఉత్తరంలో ఉండే విషయం ఏమైవుంటుందనే ఊహ అనిర్వచనీయమైన అనుభూతిని రేకెత్తించింది. వచ్చిన యువకుడు చదవసాగాడు.
“ప్రియమైన సన్నాసికి,
స్కూల్లో రోజూ ఆడడం వలన రాత్రి పడుకునేటప్పుడు నాకు తన్నే అలవాటు వుంది. అందువలన నాన్న నా పక్కనే పడుకుంటాడు. కాలక్రమంలో నా తన్నులు, ఆయన సాన్నిహిత్యం ఇద్దరి నిద్రకి కారణమయ్యాయి. అమ్మ నాతో ఎక్కువ సన్నిహితంగా వుండేది కాదు. అమ్మ అందగత్తె. తన అందం చెక్కుచెదరకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చేది. ఆ అందాన్ని పాడు చెయ్యడంలో నాన్నకి కూడా ఎటువంటి ఆసక్తిలేదు. దాని ఆకర్షణ రోజురోజుకి ఆయన ప్రేమని మరింత రెట్టింపు చేసింది. నేను పుట్టిన కొద్ది రోజులకే ప్రేమని శారీరకంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని నాన్న కోల్పోయినవాడయ్యాడు. నా ప్రేమ మాత్రమే ఆయనకి దక్కింది. నాన్న అజ్ఞానం వలన అమ్మ సమ్మొహన పరిచే భారీ అందం తన దారిని తను వెదుక్కోసాగింది. లెక్కలేనన్ని విషయాలు నాన్న చెవులకి చేరుకునేలోపే ధార్మిక కారణాలతో స్కూల్ పరీక్షాపత్రంలా అమ్మ విడాకుల పత్రాన్ని చాపింది. నాన్న సర్దుకుపోలేక పోయాడు. నేను నిద్రపోయేటప్పుడు కనబడకుండా పోయే నాన్న లెట్రిన్ నుండి రెండు క్షణాల్లో తిరిగి వచ్చేస్తాడు అనే నమ్మకంతో కళ్ళు తెరవకుండా నిద్రపోయేవాడిని. ఆ రోజు ఎంతసేపయినా నాన్న తిరిగి రాలేదు. కొట్టుకుంటున్న కాళ్ళు గాలిలో నిరాదరణగా వేలాడుతున్నాయి. కాళ్ళు నొప్పి పుట్టేంతగా నాన్నను వెదకసాగాను. గది తాళం వేసుంది. తట్టినప్పటికీ తెరవలేదు. ఆ తలుపు తాళంచెవి పెట్టే చోటులో బయట నుండి తాళం దూర్చబడి వుండటంతో చీకటి మాత్రమే మిగిలినట్లుంది. నేలపై పడుకుని కిందనున్న గీత వంటి సందులో ఒక కన్ను ఉంచి చుశాను. పైకి చూస్తున్న కళ్ళూ, అందులో నుండి నావైపుగా మిర్రున చూస్తున్న చూపు, నాన్న జాడని గుర్తు చేసింది. రేపైనా మరిచిపోకుండా నా దగ్గర పడుకుంటాడు అనే నమ్మకంతో సందులో కనబడిన నాన్నతో పడుకున్నాను.
ప్రేమతో
మనోహరన్
వెక్కి వెక్కి ఏడుద్దామనుకుంటే ఇంకిపోయిన కళ్ళలో నుండి చిన్న చిన్న కన్నీటి బొట్లు మాత్రమే బయటకొచ్చాయి. తన ముందు నిలబడినవాడి నుండి తప్పించుకోవాలనుకున్నాను.
“మీకు తెలిసినవాళ్ళా సార్?”
నిశ్శబ్దం అలుముకుంది. మళ్ళీ వచ్చినవాడే మాటలు కొనసాగించాడు.
“భార్యతో మాట్లాడి ఉండివుండొచ్చు కదా సార్? పిరికివాడిలా నిర్ణయం తీసుకునే ముందు ఒక నిమిషం ఆలోచించి ఉండాల్సింది.”
“కోరికల నిస్సహాయతనే పిరికితనం అంటున్నావు. ఒకరి అవసరం నెరవేరేటప్పుడు ఇంకెవరో ఒకరి అవసరం నిరాకరించబడుతుంది. ఈ రెంటికీ మధ్యలోనే జీవితపు సమతుల్యత నెలకొంటుంది. అవసరాలతో నిరాకరించబడేవాళ్ళూ, అవసరాల కోసం నిరాకరించేబడేవాళ్ళు పిరికివాళ్ళంటే పిరికివాడిగా బతకడమే మంచిదిగా.”
అంటున్నపుడు మనసులో ఒక గొంతు, “అతడు చెబుతున్నట్లు నాన్నేమీ పిరికివాడు కాదు మనో’ అని వినిపిస్తూనే వుంది. రెండు గొంతులూ ఏకకాలంలో ఎండిపోవడంతో దగ్గసాగాడు. ఎండిపోయిన గొంతుని ఎదురుగానున్నవాడు అనుభూతి చెందసాగాడు. ఆ లోపు లేచి చీకట్లో తనకి ముందుగా వెళ్ళిన సన్నాసి వెళ్ళిన దిక్కులో ఒక్క అడుగు వేసేందుకు ప్రయత్నించాడు.
“సార్ నేను మీకు నీళ్ళు తీసుకురానా?”
“చీకటికి నేను ఎప్పుడో అలవాటు పడిపోయాను. బాధపడమాకు.”
“ఈ లెటర్ ఎక్కడ ఉంచను సార్?”
“ఆ గదిలో పెట్టు”
అని చీకటి గుండా చేతిని కుడివైపు గదివైపుగా సన్నాసిలానే చూపించాడు. చదువుదామని పెట్టుకున్న ఉత్తరాలను ఆ చోట్లోనే పెట్టేసి తనున్న గదికి ఎదురుదిక్కులో నడిచాడు. చీకటి ముగింపులో సన్నని గీతలా వెలుతురు నేలపై చొచ్చుకుని వుంది. ఆ గీతనే కళ్ళని జిగేలుమనేలా చేసాయి. అయినప్పటికీ మనసుకి సంతోషం కలగడంతో వేగంగా నడిచాడు. మూడు అడుగుల్లో ఆ తలుపుని చేరుకున్నాడు. గొళ్ళెం తేలికగానే తెరిచాడు. బరువెక్కిన నీడని గదిలోనే వదిలేసి కొత్త నీడతో వెలుతురిలో మొదటి అడుగు తీసి పెట్టాడు.
6
సాళవూరు వీధులు అప్పుడు కూడా విశాలంగా వున్నాయి. ఇంటి వెనుక పడ్డ సూర్య కిరణాలు అతడిలో ఆకలిని కలిగించాయి. వాకిట్లో ఆపిన సైకిల్ని తిరిగి చుట్టి వచ్చి తీసుకుని తొక్కసాగాడు. కాళ్ళు అలసిపోయాయి. అతడు దారిలోని గుడి సత్రం వరకు మాత్రమే సైకిల్ తొక్కగలిగాడు. ఆ తరువాత తోసుకుంటూ పోస్టాఫీస్ వరకు వెళ్ళాడు. లోపల చూసిన ముఖాలు కూడా అతడిని గుర్తు పట్టలేదు. బయటున్న రాసుమాణిక్కం ఎదురుగా నిలబడ్డాడు. అతడు గుర్తుపట్టలేదు అని తెలిసేసరికి మనోహర్, సన్నాసిలా మాట్లాడాడు.
“సార్ నాకు ఒక లెటర్ వచ్చుండాలి సార్… నేను ఆ రూముని చూడొచ్చా?”
ఉత్తరాలు ఏవీ లేవు అని తరిమేందుకు చూశాడు. అయినాసరే తనకి వచ్చిందని సాధిస్తున్నాడు మనోహరన్. నాన్నకి సంబంధించిన ఉత్తరం ఇక్కడే ఉండివుండాలి. దానిని ఏలాగైనా తియ్యాలి అని పిచ్చి పట్టినట్లు మనసు లయించి వుండడంతో స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నాడు. కాసేపటి తరువాత కోపం ముంచుకువచ్చిన రాసుమాణిక్కం గట్టిగా విచారించాడు.
“మీ పేరేమిటి?”
ఏమాత్రం ఆలోచించకుండా సమాధానమిచ్చాడు.
“సన్నాసి”
రాసుమాణిక్కం ఆశ్చర్యాన్ని, భయాన్ని ఒక్కసారిగా చవిచూశాడు. లోపలికి పిలుచుకునివెళ్ళి పోస్టు కార్డులు నిండిన తలుపుని తెరిచి చూపించాడు. గుట్టలా పేరుకుపోయిన పోస్టుకార్డులని కుచించుకుపోయిన కళ్ళ ద్వారా చూశాడు. అన్నీ నాన్న మాటలు అయ్యుండవచ్చు అని అనుకున్నాడు. రాసుమాణిక్కంవైపు తిరిగి పూడుకుపోయిన గొంతుతో సహాయమడిగాడు.
“ఈ ఉత్తరాల మధ్య ఒంటరిగా వుండాలనుకుంటున్నాను. కాస్సేపు ఈ తలుపు మూసి వుంచుతారా?”
ముందుగా సందేహించిన రాసుమాణిక్కం ఆపై సుబ్రమణియన్ వచ్చేందుకు సమయం అవుతుందనే నమ్మకంతో కొన్ని నిమిషాలు గడువు విధించి సమ్మతించాడు. అందుకు ముట్టవలసిన పారితోషకం గురించి కూడా ముందే మాట్లాడుకున్నాడు. లోపలికి ప్రవేశించిన మనోహరన్ సాగిలపడ్డాడు. నిర్భంధించబడిన గదికీ, వాటికీ వున్న వ్యత్యాసాన్ని అతడు కనుగొనలేకపోయాడు. చెంపలు పోస్టుకార్డులతో నిండిన నేలని అంటుకుని తల తిరిగిపోయి వుంది. కళ్ళు ముయ్యగానే నాన్న చేతివేళ్ళు కలగా పైకి లేచాయి. జ్ఞాపకాల గురకలు నాన్న మాటలుగా ప్రతిధ్వనించాయి. తరువాత ఏం చెయ్యబోతున్నామన్నది ఎరుగక గాలిలో కాళ్ళని బాదుకుంటూ నిద్రపోసాగాడు. చుట్టూవున్న ఉత్తరాలన్నిటి ద్వారా నాన్నతో సంభాషించసాగాడు.
బయట ఎదురుచూస్తున్న రాసుమాణిక్కానికి సందేహం తలెత్తింది. తలుపు తెరిచి ముసలివాడిని పంపిచేస్తే మంచిది అని తెరిచాడు. చీకటి మాత్రం గదిని అలుముకుంది. ఫోన్ వేగంగా బయటకి తీసి దాని వెలుతురిలో గది నేలవైపు పరికించి చూశాడు. అక్కడ కూడా మనిషి ఉండే జాడలేవి కనబడలేదు. అతడిని భయం ఆవహించింది. గదిలోకి దూరి ఉత్తరాలను చెల్లాచెదురు చేసి చూశాడు. పోస్టుకార్డులు మాత్రమే ఉన్నాయి. భయం తలెత్తడంతో బయటకి వెళ్ళేందుకు వెనుతిరిగాడు. కాలిచెప్పుకి ఒక పోస్టుకార్డు అంటుకుని ఇబ్బంది కలిగించింది. తీసి చూశాడు. కార్డులోని మొదటి వాక్యం ‘ప్రియమైన సన్నాసికి’ అని, చివరి వాక్యం ‘ప్రేమతో మనోహరన్’ అని రాసుంది. చూడగానే పట్టించుకోకుండా పోస్టుకార్డుల గుట్టపై దానిని విసిరేసి తలుపుకి గొళ్ళెం వేసాడు. గొళ్ళెం వేసి అదే వేగంతో మధ్యాహ్నా భోజనానికి వెళుతున్నానని గుడివైపు దిక్కుకి వేగంగా, కాస్త కంగారుగా నడవసాగాడు. తాళం వేసిన గదిపై ముద్రించిన ఎనిమిది అనే నంబర్ మాత్రమే మరకలు పడకుండా కాలాన్ని చూపిస్తుంది.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.

కృష్ణమూర్తి

1994లో సేలం జిల్లా సీలనాయక్కన్‌పట్టిలో కృష్ణమూర్తి జన్మించారు. ఆయన ఇంజినీరింగ్ పట్టభద్రులు. ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. చెన్నైలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2012 నుంచి పుస్తక సమీక్షలు, వ్యాసాలు, కథలు, నవలలు విరివిగా రాస్తున్నారు. వివిధ పత్రికల్లోనూ, ఆన్‌లైన్ పత్రికల్లోనూ ఆయన రచనలు ప్రచురితమయ్యాయి. ఇంతవరకు నాలుగు నవలు, మూడు కథా సంపుటిలు, ఒక వ్యాస సంకలనం వెలువడ్డాయి. తన రచనలకుగానూ ఆయనకు రెండు అవార్డులు దక్కాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *