పెన్నా నది గట్టు మీదున్న పెన్నోలు గ్రామంలో పెళ్లి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లి కుమారుడు రవిచంద్ర ఇంటి ముందర అందమైన పెళ్ళి పందిరి వేసివుంది. పెళ్లి కోసం జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో వివాహ వేదికను నిర్మించి షామియానాలు వేశారు.
సాయంత్రం ఆరు గంటలు అయింది. కందవోలు నుంచి పెళ్లి కుమార్తె సంధ్య బంధుమిత్ర సకుటుంబ సమేతంగా వచ్చి ఊరి రామాలయంలో పెళ్లి కుమారుని రాకకై ఎదరుచూస్తూ వేచి ఉంది.
పెళ్లి కుమారుడు రవిచంద్ర ముస్తాబై తల్లిదండ్రులతో అక్కాబావలతో బంధుమిత్రాదులతో ఊరి జనంతో కలిసి మంగళవాయిద్యాలు వెంటరాగా పెళ్లి కుమార్తెను తోడుకొని రావడానికి రామాలయానికి బయలుదేరాడు
రామాలయంలో సీతా రామ లక్ష్మణ ఆంజనేయులకు పూజలు చేసి, నూతన వధూవరులు ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకున్నారు. అలంకరించిన వాహనంలో ఆసీనులై, తప్పెట్లు మేళాలు మ్రోగుతుండగా ఊరేగింపుగా కదిలింది వాహనం. కర్ర త్రిప్పుతూ, కర్రసాము చేస్తూ, చిందులు తొక్కుతూ ఊరేగింపు వీధి గుండా సాగిపోయి పెళ్లి వేదిక వద్దకు సమీపించింది. వధూవరులు వేదికపైకి చేరుకున్నారు.
పెళ్లికూతురికి పెళ్లికొడుక్కి పెళ్లికి వచ్చినవారు బహుమతులు, కానుకలు ఇచ్చి ఫోటోలు దిగడం రాత్రి తొమ్మిది గంటల వరకు సాగి భోజనాలతో ఆనాటి పెళ్లి సంబరాలు ముగిశాయి.
మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకే పెళ్లిసందడి మళ్లీ మొదలైంది. వధూవరులకి నలుగు పెట్టి మంగళస్నానం చేయించారు. తొమ్మిది గంటలకు సుముహూర్తం. పురోహితుడు వేదికపై ఏర్పాట్లు చేస్తున్నాడు. వీడియోలు ఫోటోలు షూట్ చేస్తున్నారు. పెళ్లి దుస్తుల్లో వధూవరులు దగదగ మెరిసిపోతున్నారు. చూసిన వారందరూ చక్కని వీడు జోడు అనుకుంటున్నారు. ఇంతలో పురోహితుడు పిలుపు మేరకు వధూవరులు వేదిక ఎక్కి పెళ్లిపీటలపై కుర్చున్నారు. పెళ్లికొడుకు పెళ్ళికూతురు ఒకరికొకరు కాలివేళ్లకు మెట్టెలు తొడుక్కున్నారు. సరిగ్గా తొమ్మిది గంటల సుముహూర్తానికి పెళ్లికూతురు మెడలో పెళ్లికొడుకు తాళి కట్టి మూడు ముళ్లు వేశాడు. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకొని సంధ్య రవిచంద్రలు భార్యాభర్తలైయారు. నూతన దంపతులకు అరుంధతి నక్షత్రం చూపించే సరికి పన్నెండు అయింది. అంతటితో పెళ్లి తంతు ముగిసి అందరూ భోజనాలకు కుర్చున్నారు రెండు బంతులు లేసేటప్పుటికి సర్రున నిండా పోలీసులతో జీపొచ్చి పెళ్లి ఆవరణలో నిలిచింది. పెళ్లి జనంలో కలకలం, ఆందోళన మొదలైంది.
ఎస్ఐ రాంగోపాల్ ప్రశాంతంగా జీప్ దిగి రవిచంద్ర తల్లిదండ్రులైన రామసుబ్బయ్య సీతమ్మల దగ్గరకు నడిచోచ్చి నమస్కారం చేశాడు. సంధ్య తల్లిదండ్రులైన సుబ్బరామయ్య నాగలక్షుమ్మ, బంధువర్గం చుట్టూ మూగారు. పెళ్లికొచ్చిన జనంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.
“రామసుబ్బయ్య గారు! మీరు, మీ కుటుంబం చాల మంచివారండి. మీకు ఈ చుట్టూ ఉన్న పల్లెల్లో కూడా మంచి పేరు ఉంది. మీ అబ్బాయి రవిచంద్ర కూడా మీలాగే చాల నీతిమంతుడు. అయినా మంచివారికే కష్టాలు వస్తుంటాయి. వివాహ ఉత్సాహంలోనే దుర్వార్త చెప్పాల్సిరావడం నా దురదృష్టం” అని చెప్పుకున్నాడు ఎస్ఐ రాంగోపాల్. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉన్నారంతా.
“నాగాయపల్లెలో మీకు బంధువులు ఉన్నారు కదా! వారికి క్రిష్ణంపల్లె వారికి ఎప్పుటినుంచో ముఠా తగాదాలు ఉన్నాయి. అటు వైపు ఇటు వైపు ఎన్నో హత్యలు జరిగినాయి. ఆ విషయం మీకూ తెలుసు. నాగాయపల్లె మనుషులు ఈ మధ్యనే క్రిష్షంపల్లెకు చెందిన నలుగురు మనుషుల్ని హత్య చేశారు. అది ఎంత పెద్ద సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. క్రిష్ణంపల్లెవారు పదిమంది నాగాయపల్లె మనుషులపై కేసు పెట్టారు. నాగాయపల్లె వారికి మీరు బంధువులు కాబట్టి కేసులో మీ అబ్బాయి రవిచంద్రను కూడా చేర్చారు”.అని ఎస్ఐ రాంగోపాల్ చెప్పగానే ఇరు కుటుంబాలవారు, పెళ్లికి వచ్చినవారు హతాశులై పోయారు.
“ఆ కుటుంబం వారు చాల ఉత్తములు. ఎవరి జోలికి పోరు. అలాంటి వారిపై కేసు పెట్టడం న్యాయం కాదు” అని మేము అడిగాం.
“మంచి వారు కాబట్టే కేసుతో సరిపెట్టుకున్నాం. లేకపోయింటే ఎప్పుడో చంపేసేవాళ్ళం” అన్నారు.
“మేము రాజ్యాంగ బద్దులం కాబట్టి అరెస్టు చేయడానికి వచ్చాం” అని చెప్పడంతో వివాహ ప్రాంగణంతా విషాదంతో నిండి పోయింది. కొందరిలో రోదనలు మొదలైనాయి.
“మేము వాళ్ళకు ఎప్పుడూ అపకారము తలపెట్టలేదు. మాపై కేసు పెట్టడం అన్యాయం” అన్నాడు రామసుబ్బయ్య. దానితో అక్కడున్న పెద్ద మనుషులు కూడా “చుట్టాలు అయినంత మాత్రాన వీరిపై కేసు నమోదు చేయడం సరికాదు” అన్నారు.
“అదే విషయం మేమూ చెప్పాం. వాళ్ళు సస్సేమిరా వినలేదు. చివరికి అరెస్టు చేయడానికి రావాల్సి వచ్చింది” ఎస్ఐ రాంగోపాల్ చెప్పాడు మధనపడుతూ.
పెళ్ళికొడుకు రవిచంద్ర జోక్యం చేసుకొంటూ “ఎస్ఐ గారు! మాకు కొంత సమయం ఇవ్వండి. మేము మాట్లాడుకొని మీకు తెలియజేస్తాం! సమయానికి వచ్చారు. భోజనం చేయండి” కోరాడు.
“రవిచంద్రా! మీ మీద మాకు నమ్మకం ఉంది. వారమో! పది రోజులో టైం తీసుకోండి. మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రాండి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అప్పుడు ఫోన్ చేయండి. మేము వస్తాం లేదా మీరే స్టేషనుకు వచ్చి లొంగిపోండి. అయితే పది రోజుల గడువు లోపల అంతా జరిగి పోవాలి” ఎస్ఐ రాంగోపాల్ గట్టిగా చెప్పాడు.
“ధన్యవాదాలు సార్! మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయ్యను సార్.” కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రవిచంద్ర.
సాయంత్రం రెండు కుటుంబాలు ఒక చోట కూర్చొని చర్చించుకున్నారు. ముందుగా రామసుబ్బయ్య మాట్లాడుతూ “మేము ఖూనీ చేసిన వారికి చుట్టిరికం ఉన్న కారణంగా మాపై ఖూనీ కేసు పెట్టడం మా దురదృష్టం. ఈ కేసు నుంచి మా వాడు బయట పడతాడో! జీవితఖైదు అయితాడో! చెప్పలేం. కాబట్టి ఈ పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదో తేల్చండి బావా గారు!” వియంకుడైన సుబ్బరామయ్యను ఉద్దేశించి అన్నాడు.
పెళ్లి కొడుకు అమ్మ సీతమ్మ కూడ “పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మావాడి కారణంగా మీ అమ్మాయి భవిష్యత్తు దెబ్బ తినకూడదు. కాబట్టి మీ మాటే మా మాట” అంది బాధను దిగమ్రింగుతూ. అందరూ విషాదంగా, ఆందోళనగా వింటున్నారు.
“బావాగారూ! ఒక ఆడపిల్ల తండ్రిగా నా కూతురు క్షేమం సుఖం నేను కోరుకుంటాను. మీ అబ్బాయికి జీవిత ఖైదు పడితే నా కూతురు బతుకు అధ్వానం అయిపోతుంది. కాబట్టి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటేనే మంచిది అని నా అభిప్రాయం. అయితే ఈ మాట చివరిది కాదు. అమ్మాయి మాటే చివరిది.” చెప్పాడు సుబ్బరామయ్య.
“నా భర్త చెప్పిన మాటనే తన మాట కూడా ” నాగలక్షుమ్మ కూడా భర్త మాటనే సమర్థించింది.
“పెళ్లి పేరుతో అన్యం పుణ్యం ఎరుగని ఆడబిడ్డను నిర్బంధించ కూడదు.” రవిచంద్ర అక్కాబావ అభిప్రాయం వెలిబుచ్చారు.
పెళ్లికొడుకు రవిచంద్ర “మామా గారు! మీరు అక్షరాలా నిజం చెప్పారు. నాకు జీవితకాలం జైలు శిక్ష పడితే మీ అమ్మాయి జీవితం నిజంగానే ఆగమైపోతుంది. మీ కూతురు జీవితమంతా నిస్సారంగా నిస్తేజంగా గడపడం నేను ఒప్పుకోను. కాబట్టి ఈ పెళ్లిని రద్దు చేసుకుందాం.” నిష్కర్షగా నిర్ద్వంద్వంగా చెప్పాడు.
ఇరువర్గాలలో పరిస్థితి ఉద్వేగభరితంగా మారిపోయింది. ఇక పెళ్లి కూతురు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని జనంలో ఊపిరి సలపని ఉత్కంఠత నెలకొంది. సంధ్య అభిప్రాయం కోసం అందరూ ఆసక్తిగా ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు.
“అమ్మా సంధ్యా! ఈ పరిస్థితుల్లో నీ నిర్ణయం ఏమిటమ్మా! నీవు బాగుపడే నిర్ణయం తీసుకో తల్లి. తల్లిదండ్రులుగా మేము కోరుకొనేది నీ క్షేమమూ నీ సుఖమేనమ్మా!” అని ఆమె తల్లిదండ్రులు చివరి మాటగా చెప్పారు.
“ఇంత వైభవంగా వివాహం జరిగి, ఇంతమంది మధ్య మంగళసూత్రం కట్టించుకుని, ఇందరి ఆశీస్సులతో తలంబ్రాలు పోసుకొని, ఇంత గొప్ప అన్నసంతర్పణ జరిపి ఇప్పుడు ఏదో ఇబ్బంది ఏర్పడిందని పవిత్రమైన వేదమంత్రాలతో జరిగిన పెళ్లిని రద్దు చేసుకుందామా!
కష్టం వచ్చిందనో, నష్టం జరిగిందనో, బాధ కలిగిందనో, జీవితం వేదనా భరితమైందనో పెళ్లిళ్లు రద్దు చేసుకుంటూ పోతే ఇన్ని జంటలు ఇంతకాలం కలిసి ఉండేవా! అంతెందుకు అమ్మానాన్న, అత్తామామ తమ జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొని ఉంటారు. అయినా కలిసే ఉన్నారు కదా! మరి మమ్మలెందుకు విడి పొమ్మంటున్నారు. మేమూ కూడా ఇదేమైనా భారమైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా కలిసే ఉంటాం” సంధ్య తెగేసి చెప్పింది.
“అది కాదు సంధ్యా! మనకు ఇప్పుడే పెిళ్లైంది. ఇంకా ఏమీ జరగలేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండడానికి పూర్వ పరిచయమూ లేదు. మొన్నటి వరకు నీవెవరో నేనెవరో కదా! కాబట్టి విడిపోదాం. నా దురదృష్టానికి నీవెందుకు బలి కావాలి. రద్దు చేసుకుని నీవైనా సుఖపడు. నాతో ముడిపెట్టుకొని నీ బంగారు జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు సంధ్యా” పరిపరివిధాల నచ్చచెప్పి చూశాడు రవిచంద్ర.
“మన మధ్య ప్రేమ లేదా! ఉంది!. నీకు నేనెవరో తెలియక నువ్వు నన్ను ప్రేమించలేదు. నీవెవరో నాకు బాగా తెలుసు. రెండేళ్లుగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఈ విషయం మన మొదటి రాత్రి చెప్పి నిన్ను ఆశ్చర్యపరచాలని అనుకున్నాను. కానీ విధి ఇప్పుడే చెప్పిస్తుంది
రెండేళ్ళ క్రితం నిన్ను ‘చెప్పలి’ తిరునాళ్ళో తొలిసారి చూశాను. తిరునాళ్ళో నువ్వు నీ మిత్ర బృందంతో చెక్కభజన ఆడావు. నేను నా స్నేహితురాళ్ళతో చెప్పలి తిరునాళకొచ్చి నిన్ను చూశాను. అప్పుడే నీ రూపం నా హృదయంలో తిష్ట వేసి కూర్చుంది. మేమందరం నీతో మాట్లాడాం. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ సెల్లుతో ఫోటో కూడా తీసింది. మళ్లీ మనం ‘పుష్పగిరి’ బ్రహ్మోత్సవాల్లో కలిశాం. అక్కడ మీ ట్రూప్ కోలాటం ప్రదర్శించారు. అక్కడ కూడా నీతో మాట్లాడాం. అప్పుడు కూడా నీకు తెలియకుండానే ఫోటో దిగాం. ఆ తరువాత మళ్లీ మాకు బ్రహ్మంగారి ఆరాధనోత్సవాల్లో ‘జడకోపు’ గాన ప్రధానమైన ఆటకు అడుగులేస్తూ నిండు చంద్రునిలా కనిపించావు. నాకు మనసు ఉప్పొంగిపోయింది. మేము నీతో పరిచయం చేసుకున్నాం. మీ పేరు, ఊరు అడిగి తెలుసుకున్నాం. అక్కడ మాత్రం నిన్ను అడిగే మేమందరం ఫోటో దిగాం. ప్రదర్శన అనంతరం ఎందరో ప్రజలు మిమ్మల్ని అభినందించడానికి చుట్టుముట్టుతారు కాబట్టి ప్రత్యేకించి మమ్మల్ని గుర్తు పెట్టుకోలేక పోయారు. నేను ఇంటికొచ్చి మా అన్నకు మీ ఊరు, పేరు చెప్పి, నీ ఫోటో చేతికిచ్చి, మీ బ్యాగ్రౌండ్, మీ క్యారెక్టర్ ఏమిటో విచారించమని అడిగాను. విచారణలో నువ్వు ఎంత అందంగా ఉంటావో, అంత మంచిది నీ క్యారెక్టర్ అని, మీ కుటుంబం కూడా చాల గౌరవప్రదమైందనీ తేలింది. ఇంకా ఆలస్యం చేయకుండా మా నాన్నకు చెప్పి, మధ్యవర్తిని మీ ఇంటికి పంపి సంబంధం నిశ్చయం చేసుకున్నాం. ఫలితంగా ఇంతవరకు వచ్చాం. ఇప్పుడు ఏదో ఆటంకం ఎదురైందని వెనక్కి తగ్గమంటారా! తగ్గితే నా ప్రేమకు విలువ ఏముంటుంది. వివాహ పవిత్రత ఏంగావాలి. అది కానిపని గానీ తరువాత కార్యక్రమం ఏమిటో చేయండి” మరో మాటకు తావు ఇవ్వకుండా చెప్పి రవిచంద్రకు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు అందించింది సంధ్య తన ప్రేమకు రుజువుగా.
“అమ్మాయి ఇంత ధృడంగా స్థిరంగా ఉన్నప్పుడు మేం మాత్రం ఏమీ చెయ్యగలం. దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తర్వాత తంతు జరుపుతాం” ఇక విధిలేక పలికారు సంధ్య తల్లిదండ్రులు సుబ్బరామయ్య, నాగలక్షుమ్మ.
“ఇంతటి దృఢచిత్తం కలిగిన అమ్మాయి మా కోడలు కావడం మా అదృష్టం” సంతోషించారు రామసుబ్బయ్య సీతమ్మలు. రవిచంద్ర కూడా ఇంకేమి మాట్లాడలేక మౌనం వహించాడు.
రవిచంద్రకు, అతని తల్లిదండ్రులకు ధైర్య వచనాలు చెప్పడానికి నాగాయపల్లె ముద్దాయిల తరుపున వచ్చిన లాయర్ రంగనాథ్ జరుగుతున్న చర్చను ఆసాంతం విన్నాడు. పెళ్లికూతురు స్థిరచిత్తాన్ని , వివాహం పట్ల ఆమెకున్న అభిప్రాయాన్ని తెలుసుకుని సంతోషించాడు.
సంధ్యతో లాయర్ రంగనాథ్ మాట్లాడుతూ “అమ్మా సంధ్యా! వివాహబంధంపై నీకున్న అసంచలమైన విశ్వాసానికి నిన్ను అభినందిస్తున్నాను తల్లీ! నేను మీ కేసు వాదించబోయే లాయర్ రంగనాథును. నీ నమ్మకాన్ని గెలిపించడానికి ప్రయత్నిస్తొను. రెండు మూడు నెలల్లో బెయిల్ తెస్తాను. కేసును పది పన్నెండేళ్ళ పాటు తీర్పుకు రాకుండా లాగుతాను. ఈలోపు మీకు పిల్లలు పుట్టి దాదాపు పెద్ద పిల్లలు అవుతారు. ఆ తరువాత కూడ రవిచంద్ర నిరపరాధిగా బయటపడవచ్చు. ఒకవేళ శిక్ష పడినా అనేక సందర్భాల్లో అనేక కారణాలతో ఇంటికి వస్తూ పోతుండోచ్చు. సత్ప్రవర్తన వలన శిక్ష తగ్గనూ వచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండమ్మా సంధ్యా!” అని సంధ్య తలపై చేయి పెట్టి దీవించాడు లాయర్ రంగనాథ్.
ఇక అన్ని అనుమానాలను సంధిగ్ధాలను పక్కన పెట్టి, నూతన దంపతులకు శోభనంలో భాగంగా మూడు రాత్రులు జరిపించారు. నాల్గో దినం ఉదయం పది గంటలకు అమ్మానాన్న, అత్తామామ, బంధువులు సంధ్య వెంట రాగా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాంగోపాల్ సమక్షంలో సరెండర్ అయ్యాడు రవిచంద్ర.
పోలీస్ స్టేషన్లో ఎన్నాళ్ళు ఉండినా కౌంటుకు రావనీ, అదే జైల్లో ఉంటే రోజులు కౌంటుకు వచ్చి బెయిల్ త్వరగా వస్తుందని ఎస్ఐ రాంగోపాల్ రవిచంద్రను లొంగిపోయిన రోజే కోర్టులో హాజరు పరిచాడు.
కోర్టులో కేసుకు సంబంధించిన మిగతా ముద్దాయిలు కనిపించారు. వాళ్ళు రవిచంద్ర వద్దకు వచ్చి “రవిచంద్రా! కేవలం మాకు బంధువైన కారణంగా మేము చేసిన పాపం నిష్కారణంగా నీమీద కూడా పడింది. మమ్ములను క్షమించు రవిచంద్రా!” అని క్షమాపణ చెప్పారు.
“కర్మఫలాన్ని ఎవ్వరైనా తప్పించుకోలేరు. అనుభవించి తీరాల్సిందే. అంతా విధి అనుసారం జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. మీ మీద నాకేమీ కోపం లేదు!” నిర్లిప్తంగా బదులిచ్చాడు. “అయినా ముఠా తగాదాల వల్ల ఎన్నో కష్టనష్టాలు పడాల్సి వస్తుంది. ఈ ముఠా తగాదాలు మాని ప్రశాంతంగా బతుకవచ్చు కదా!” వారిని అడిగాడు రవిచంద్ర. దానికి వాళ్ళు తల వంచుకున్నారు తప్ప జవాబు ఇవ్వలేదు.
నెలరోజులకు కోర్టులో హాజరు పరచండని కోర్టు తీర్పు చెప్పి ముద్దాయిలందరినీ రిమాండ్ కు పంపింది
జైలు ప్రొద్దుటూరు కోర్టు వెనుక భాగంలోనే ఉండడం వల్ల సంధ్య ప్రతిరోజూ ఉదయం గానీ, సాయంత్రం గానీ భర్తను చూడడానికి వచ్చేది. వస్తూ టిఫినో, పండ్లో తెచ్చేది. వచ్చిన ప్రతిసారీ ధైర్యంగా ఉండమని, సమస్యలు ఎప్పుడూ ఉండవని, మంచి రోజులు వస్తాయని, ఓపిక పట్టాలని చెప్పేది.
“పరిస్థితి ఇట్లుంటదని నీకు అంతగా చెప్పాను. నువ్వు వినక పోతివి సంధ్యా” విచారపడుతూ రవిచంద్ర అన్నాడు .
“ఏమి చెప్పావు. విడిచిపొమ్మనా! నువ్వు నా ప్రాణానివి. ప్రాణం విడిచిపెట్టమంటావా! ఏం మాట్లాడుతున్నావు” సంధ్య అనగానే రవిచంద్ర మౌనమైపోయాడు.
“ప్రతి రోజు ఎందుకు వస్తావు. వస్తూ ఏదోకటి ఎందుకు తెస్తావు. ఇక్కడ పెడ్తున్నారు కదా!” కాస్త విసుగ్గా చెప్పాడు రవిచంద్ర
“తొలకర్లు మొదలైతే చేలల్లో పనులు ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రతి రోజూ వచ్చేది ఉండదులే” అంది సంధ్య .
సంధ్య పుట్టింటి నుంచి ట్రాక్టరును తెచ్చుకొని పొలాలు దుక్కి దున్ని సేద్యం చేసేది. సరదాగా నేర్చుకున్న ట్రాక్టర్ డ్రైవింగు ఇప్పుడు పనికొచ్చింది సంధ్యకు.
లాయర్ రంగనాథ్ రెండు నెలలకే బెయిల్ తేవడంతో ఇంటిల్లిపాదీ ఆనందంగా జైలుకు వచ్చి రవిచంద్రను ఇంటికి పిలుచుకొచ్చారు.
అప్పటినుంచి ఎప్పుడో ఒకసారి వాయిదాకు పోయి వచ్చేవాడు రవిచంద్ర. తనపై కేసు ఉన్న విషయమే మరిచిపోయి కుటుంబంతో కలిసి జీవితాన్ని ఆనందంగా గడిపాడు. ఒక యేడాది గడిచాక ఒక మగపిల్లోడు, మరో రెండేళ్లకు మరో ఆడపిల్ల పుట్టారు. సంధ్యారవిచంద్రల ఆనందానికి పట్ట పగ్గాలు లేవు. తల్లిదండ్రుల సంతోషానికి మేర లేదు. అత్తామామల సంబరానికి అవధులు లేవు. కొడుక్కు ‘యోచన్’ అని, కూతురుకి ‘సృజన’ అని పేర్లు పెట్టుకొని ముద్దు మురిపెంగా చూసుకుంటున్నారు.
కేసు తీర్పుకు రాకుండా రకరకాల కారణాలు కోర్టుకు చెప్పుతూ, సాకులు చూపిస్తూ పది సంవత్సరాల పాటు నెట్టుకొచ్చాడు లాయర్ రంగనాథ్. పది సంవత్సరాల కాలం గడిచిన కేసులన్నీ పూర్తి చేయమని ప్రభుత్వం నుంచి జీఓ రావడం వలన కేసు విచారణ కొచ్చింది. లాయర్ రంగనాథ్ ఎంత బలంగా వాదించినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా కోర్టు ముద్దాయిలందరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తల్లిదండ్రులు బోరున విలపించారు. అత్తామామలు విపరీతంగా బాధ పడ్డారు. తీర్పు రోజు బంధువులు మిత్రులే కాకుండా ఊరుఊరంతా కదిలి వచ్చింది. పోలీసులు రవిచంద్ర తోపాటు ఖైదీలందరినీ కడప సెంట్రల్ జైలుకు తరలించే ముందు బంధువులతో మాట్లాడుకోవడానికి ఒక గంట అనుమతి ఇచ్చారు.
“చూశావా సంధ్యా! ఎలా జరిగిందో! విధి వక్రించడం అంటే ఇదే!” దిగులు పడుతూ అన్నాడు రవిచంద్ర.
“శిక్ష పడిందని చింతనలో కూరుకుపోవద్దు, మానసికంగా క్రుంగి పోవద్దు. శారీరకంగా బలంగా ఉండాలి. జైల్లో ఖైదీలతో స్నేహపూర్వకంగా ఉండు. పోలీసులతో అధికారులతో మంచి ఉండు. ఏ నేరము చేయని వాడికి దేవుడు ఏదోక మేలు చేస్తాడు. సంతోషంగా శిక్ష పూర్తి చేయ్యి. పిల్లల మీద, ఇంటిమీద బెంగా పెట్టుకోవద్దు” సంధ్య భర్తకు సమయస్ఫూర్తిగా వినిపించింది.
“నా విషయం సరే సంధ్యా! నువ్వు చిన్న పిల్లలతో, ముసలి అత్తామామలతో ఎట్లా ఏగిస్తావు. భూములు ఎలా పండిస్తావు. అదే నాకు బెంగగా ఉంది.” విచారపడుతూ అన్నాడు రవిచంద్ర.
“పిల్లలు మాట వినే ఎడ పిల్లలైనారు. మన ఊర్లోనే టెన్త్ వరకు స్కూల్ ఉంది కాబట్టి వారి సమస్య లేదు. ఇక అత్తామామ మరీ ముసలివారేమి కాదు. ఏబైఐదు ఒకరికి, అరవై ఒకరికి వయసు కాబట్టి గట్టిగానే ఉన్నారు. పొలాలు చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు బీడు కానివ్వం.
మామూలుగా ఇలాంటి శిక్ష పడినవారు. భూములు బీడ్లు అవుతాయని, పిల్లలు తరంగా కాకుండా పోతారని, ఆడవాళ్ళు చెడి పోతారని అనుకుంటూ ఉంటారు. నీకు చేతిలో చేయ్యేసి చెప్పుతున్నాను. ‘ఈ శరీరానికి మలినం కానీయను. మరక అంటనీయను. మానం పోవడమంటే ప్రాణం పోవడమే’ అనేది నా విశ్వాసం” నిక్కచ్చిగా ప్రమాణం చేసి చెప్పింది సంధ్య.
“సంధ్యా! నిప్పు పైన ఈగలు దోమలు వాలుతాయా! మాడిమసైపోతాయి గానీ. అది కాదు నా భయం. సుదీర్ఘ కాలం పాటు మీకు దూరంగా ఉంటాను కదా నువ్వు కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తావు అనేదే నా భయం బాధ” దిగులు పడుతూ చెప్పాడు.
“అదేమీ ఆలోచించవద్దు. నువ్వు ఉండేది కడపే కాబట్టి మేము ప్రతి ఆదివారం పిల్లలను తీసుకుని అత్తామామలతో వస్తుంటాను. అన్నీ విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం” అంటుండగానే పోలీసులు టైం అయ్యింది రమ్మని పిలిచారు.
“నాన్నా! అమ్మా! మీరు పిల్లల్ని చూసుకుంటూ సంధ్యకు అండగా ఉండండి.అని అమ్మా నాన్నను గుండెలకు హత్తుకున్నాడు. ‘ సరే నాయనా! నువ్వు జాగ్రత్తగా ఉండు నాయినా!’ రోదిస్తూ అన్నారు.
పిల్లలను ఎత్తుకొని ముద్దుపెట్టి ‘మీరు అమ్మ మాట వింటూ బాగా చదువుకోండి’ అని చెప్పాడు. భార్యను దగ్గరకు తీసుకుని నీమీద మోయలేని భారం మోపి పోతున్నాను. నీవే నా ఆత్మవు. నా ఆధారం” అని చెప్పి భార్య చెంపలెమ్మడి కారిపోతున్న కన్నీటిని తుడిచి పోలీసు జీప్ ఎక్కాడు రవిచంద్ర. జీప్ కదిలి కనుమరుగైంది. భారమైన హృదయాలతో ఇల్లు చేరారందరూ.
తన బంధువులైన ఖైదీలతో కలిసి కడప సెంట్రల్ జైలు చేరిన రవిచంద్ర అక్కడి ఖైదీలకు తనను తాను పరిచయం చేసుకొని వారి గురించి తెలుసుకున్నాడు.
మరునాటి ఉదయం పెరేడ్ గ్రౌండ్లో జైలర్ రామచంద్రరావు కొత్త ఖైదీలను పరిచయం అడుగగా రవిచంద్ర తన గురించి చెపుతూ తాను ప్రొద్దుటూరు దగ్గర పెన్నోలు గ్రామమని, B.A Bed చదువుకున్నానని, చేయని నేరానికి శిక్ష పడిందని, ఖైదీల్లో ఎవరికైనా చదుకోవాలనే వారికి టెన్త్, ఇంటర్, డిగ్రీ తరుగుతులకు చదువు చెప్పుతానని, ఆసక్తి ఉన్న ఖైదీలకు కోలాటం, చెక్కభజన, జానపద గీతాలు నేర్పుతాననీ, పోలీసు సిబ్బంది పిల్లలకు ఇంగ్లీషు లెసన్స్ టీచింగ్ చేస్తానని తెలిపాడు రవిచంద్ర.
దానితో అతనిపై పోలీసులకు, ఖైదీలకు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. ఖైదీల్లో ఓ పదిహేను మంది వివిధ తరగతులు చదవడానికి తయారైనారు. ఓ ఇరవై మంది ఖైదీలు కోలాటం చెక్కభజన మొదలైనవి నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. జైలర్ రామచంద్రరావు గారి పిల్లలకు కూడా ఇంగ్లీషు ట్యూషన్ చెప్పడానికి రెడీ అయ్యాడు రవిచంద్ర. అందరికీ అన్నీ వివిధ సమయాల్లో నేర్పుతూ వస్తున్నాడు రవిచంద్ర.
తన పిల్లలకు ఇంగ్లీషు నేర్పేటప్పుడు రవిచంద్ర ఇంగ్లీష్ ఉచ్చారణకు జైలర్ రామచంద్రరావు ముచ్చటపడ్డాడు. రవిచంద్ర మీద అభిమానం పెంచుకున్నాడు. రామచంద్రరావు భార్య సర్వమంగళతో “మేడం! మార్కెట్టుకు గానీ, పచారకొట్టుకు గానీ, మాంసం కటికకు పొయిరావాల్సి ఉంటే చెప్పండి పోయి వస్తాను” చెప్పాడు రవిచంద్ర.
“సరేలే రవిచంద్రా! మీ రైతులకు ఓపిక ఎక్కువ” నవ్వుతూ అన్నది సర్వమంగళ.
ఆదివారం సంధ్య, పిల్లలు, అమ్మానాన్న రవిచంద్రను చూడడానికి జైలుకు వచ్చారు. వారిని చూడగానే రవిచంద్రకు ప్రాణం లేచి వచ్చింది. వారందరినీ రామచంద్రరావు ఇంటికి తీసుకెళ్ళి వారి కుటుంబానికి పరిచయం చేశాడు. వారు అభిమానంగా పలకరించారు. “మీ వాడి విషయంలో మీకేం భయం వద్దండీ. అంతా నేను చూసుకుంటాను”. ధైర్యం చెప్పాడు రామచంద్రరావు. ఒక రోజు ముందు రవిచంద్ర ఫోన్లో చెప్పడం వల్ల సంధ్య జాడినిండా ఊరగాయ తీసుకొచ్చి సర్వమంగళ మేడంకు ఇచ్చింది.
“రవిచంద్రా! మీ వాళ్ళు వచ్చినప్పుడు మన ఔట్ హౌస్ లో ఉండండి. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పక్కనే సినిమా హాల్ ఉంది. పోతారేమో పోండి. సిటీ తిరిగి వస్తారేమో తిరిగిరండి” రామచంద్రరావు చెప్పడంతో కృతజ్ఞతలు తెల్పి ఔట్ హౌస్ లోకి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు కొద్దిసేపు కొడుకుతో ముచ్చటించి సినిమా చూసి వస్తాం అంటూ పిల్లలను వెంటబెట్టుకుని పోయారు. భార్యాభర్తలు భూముల గురించి, సంసారం గురించి చెప్పుకొని సాయంత్రం వరకు ఖుషిగా గడిపారు. సాయంత్రం అందరూ ఊరికి వెళ్ళిపోయారు.
ఇదే టైంలో లాయర్ రంగనాథ్ రవిచంద్ర కేసును హైకోర్టులో అప్పీలు చేశాడు కానీ, దురదృష్టం కొద్దీ హైకోర్టు కూడా క్రింది కోర్టు తీర్పునే ఖాయం చేసిందని తెలిసి రవిచంద్ర నిరాశ పడ్డాడు.
సంక్రాంతి పండుగ రోజు రవిచంద్రను ఇంటికి పంపదలచి రామచంద్రరావు- కానిస్టేబుల్తో రవిచంద్రను పిల్లంపి “నీకు జ్వరం వచ్చినందువల్ల కానిస్టేబుల్ నిన్ను ఆసుపత్రికి తీసుకు పోయాడు అని రాసుకుంటారు, పండుగ పూట నువ్వు ఇంటికి పోయి భార్యాబిడ్డల్తో గడిపి, సాయంత్రం ఆరు గంటల లోపల రాపో రవిచంద్రా!” అని చెప్పి “కానిస్టేబుల్! రవిని బస్సు ఎక్కించి నువ్వు కూడా మీ ఇంట్లో సాయంత్రం దాకా గడిపి రవి బస్సు దిగగానే వెంటబెట్టుకొని రా” ఆర్డర్ వేశాడు రామచంద్రరావు.
సంతోషపడి రవిచంద్ర ఎనిమిది గంటల కల్లా ఉషారుగా ఇల్లు చేరాడు. వంటింట్లో ఉన్న సంధ్యను వెనుకమల్లుగా వాటేసుకున్నాడు రవిచంద్ర. ఉలిక్కిపడిన సంధ్య వేగంగా వెనక్కుతిరిగి భర్తను చూసి ఆశ్చర్యం ఆనందంలో మునిగి పోయింది సంధ్య. “ఎలా వచ్చావు” సంబరంగా అడుగింది. “మా సారుకు నా మీద ఉన్న అభిమానం వల్ల వచ్చాను” అన్నాడు రవిచంద్ర. “ఎవరోని భయంతో చచ్చాను” సంధ్య అంటే “ఔనా అయితే నీ కరాటే కిక్కుకు వాడు చచ్చి ఉండేవాడే” అని రవిచంద్ర అనగానే ఆశ్చర్యపోయిన సంధ్య “నీకెలా తెలుసు నాకు కరాటే వస్తుందని” అనింది. “నా గురించి నువ్వు తెలుసుకున్నాక, నీ గురించి నేను తెలుసుకోలేనా!” అన్నాడు చిలిపిగా నవ్వుతూ రవిచంద్ర. భర్తను ప్రేమతో బిగించార కౌగలించుకుంది సంధ్య.
సాయంత్రం ఐదు గంటల దాకా భార్యాబిడ్డలతోనూ అమ్మానాన్నలతోనూ ఆనందంగా గడిపి జైలు చేరుకున్నాడు రవిచంద్ర.
దాదాపు మూడేళ్లు గడిచాయి. రవిచంద్ర దగ్గర చదువుకుంటున్న ఖైదీలు అందరూ ప్రైవేటుగా రాసి పాసై తరువాతి తరగతులకు పోయ్యారు. కళలు సాధన చేస్తున్నవారు అందులో నిష్ణాతులై స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రదర్శించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.
అదే రోజు సంధ్య ఊరినుంచి తమ చేనులో పండిన రెండు బస్తాలు వేరుశనక్కాయలు తీసుకొచ్చింది. ఒక మూట ఖైదీలకు, పోలీసు సిబ్బందికి పంచింది. మరో మూట జైలర్ రామచంద్రరావు ఇంట్లో ఇచ్చింది. వారందరూ చాల సంతోషించారు. తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని సిటీ చూపించడానికి పోయారు. సంధ్య రవిచంద్ర ఔట్ హౌస్ లో ఖుషిగా కబుర్లు చెప్పుకుంటూ అందంగా గడిపారు. ఆ సందర్భంగా రవిచంద్రతో “ఈయేడు సరీగ్గా వర్షాలు పడనందున పంటలు బాగా పండలేదు. ఇలాగే కొనసాగితే మనం కష్టపడాల్సి ఉంటుంది.” అంది సంధ్య. “చూస్తాం భవిష్యత్తు ఎలా ఉంటుందో” సమాధానంగా చెప్పాడు రవిచంద్ర.
అటు కొన్నాళ్ళకు జైలర్ రామచంద్రరావు రవిచంద్ర వాళ్ళ బంధువు ఎవరో చనిపోయారన్న సాకుతో పదిరోజులు ఇంటికి పంపాడు. మరికొంత కాలానికి పెరోల్ పై ఆరు నెలలు ఇంటికి పంపాడు. రామచంద్రరావు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకొని రవిచంద్రను ఇంటికి పంపుతూ వచ్చాడు. అతనిపై ఆయన పెంచుకొన్న అభిమానం అలాంటిది.
రవిచంద్ర పెరోల్ పై వచ్చిన ఏడాది కూడా వానలు సరీగ్గా పడక పంటలు పెద్దగా పండలేదు. దుర్భిక్ష ఛాయలు పొడచూపుతున్నాయి. రవిచంద్ర తెల్లవారు జామునే లేచి తమ ఊర్లో పాలను సేకరించి, టౌన్లో టి షాపులకు పోసి, అలాగే ఒక ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెప్పేవాడు. రవిచంద్ర తండ్రి రామసుబ్బయ్య చలికి పండే శనగ పంట పండించేవాడు. అలా ఆరు నెలలు ముగియడంతో రవిచంద్ర జైలుకు తిరిగి వెళ్లిపోయాడు.
రవిచంద్ర దగ్గర చదువుకున్న ఖైదీలు పట్టాలు అందుకున్నారు. కళలు అభ్యసించినవారు పరిపూర్ణులైనారు. పోలీసుల పిల్లలు కాలేజిలకు పోతున్నారు. రవిచంద్రకు ఐదేండ్ల శిక్షాకాలం పూర్తైంది.
ఓ ఆదివారం సంధ్య జైలుకు వచ్చి జైలర్ రామచంద్రరావును కలిసి “మూడేండ్లగా సరీగ్గా వర్షాలు పడనందున వ్యవసాయంలో నష్టం వస్తుందని, కరువు అలుముకుందనీ, జీవితం గడవడం కష్టంగా ఉందని, మా భర్త ఉండివుంటే టౌన్లో ఏదోక వ్యాపారం చేసి సంసారాన్ని పోషించేవాడనీ, ఏదోకటి ఆలోచించి మా ఆయన ఈ గడ్డు పరిస్థితిలో మాకు అండగా ఉండేటట్లు చూడండి సార్” అని వేడుకుంది.
“ఏదోకటి ఆలోచిస్తాను, రేపాదివారం మీ అత్తామామలను పిలుచుకొని రా!” అని చెప్పి సంధ్యను పంపించాడు రామచంద్రరావు.
మరుసటి ఆదివారం జైలర్ చెప్పినట్లే అత్తామామల్ని పిలుచుకొని వచ్చింది సంధ్య.
“రామసుబ్బయ్యా! మీ కొడుకు ప్రవర్తన గురించి పైఅధికారులకు మంచిగా రాశాను. అలాగే మీ కరువు సమస్య పైవారికి తెలిపి, రవిచంద్ర మీద నిర్ణయం తీసుకొనే అధికారం కూడా పొందాను. మీ వాడిని అనంతపురం సెంట్రల్ జైలుకు పంపుతాను. అక్కడ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఉదయం ఆరు గంటలకు బయటికి వదిలేసి సాయంత్రం ఆరు గంటలకు జైలుకు రప్పించే విధానం ఉంది. మీ వాన్ని కూడా ఉదయం ఆరు గంటలకు బయటికి వచ్చే ఏర్పాటు చేస్తాను. అక్కడ ఏదోక వ్యాపారం చేసుకుని బతుకండి. నువ్వు పోయి జైలుకు దగ్గరగా ఇల్లు బాడుగకు తీసుకో! ఇంకా ఇతరత్రా పనులుంటే పూర్తి చేసుకొని రేపు ఆదివారానికి ఇక్కడికి రాండి. అందరూ కలిసి పోలీసు జీపులో అనంతపురం పోవుదురు. మీ వాడిమీద అభిమానంతో నేను చేయగలిగిందంతా చేస్తున్నాను.” ఆత్మీయంగా చెప్పి పంపించాడు రామసుబ్బయ్యను.
రామసుబ్బయ్య అనంతపురం వెళ్ళి అన్నీ చక్కబెట్టుకొని వచ్చాడు. భూముల్ని కౌలుకు ఇచ్చి, ఇంటిని బాడుగకు ఇచ్చి, కౌలు,బాడుగ డబ్బుల్ని ఫోన్పె చేస్తుండమని చెప్పి, పాడి ఎనుముల్ని, కాడి ఎద్దుల్ని అమ్మేసి. వ్యవసాయ పనిముట్లను కల్లందొడ్డిలో భద్రపరిచి. ఇంటి సామాన్లను లారిలో ఎత్తుకొని పోయి అనంతపురం బాడిగింట్లో సర్ది ఆదివారానికల్లా కుటుంబ సభ్యులతో కలిసి కడప జైలుకు వచ్చాడు రాసుసుబ్బయ్య. అప్పటికే రవిచంద్ర ఇద్దరు పోలీసులతో కలిసి రామచంద్రరావు ఇంట్లో ఉన్నాడు.
“రవిచంద్రా! నిన్ను పంపిస్తుంటే సొంత కొడుకు పోతున్నట్టు బాధగా ఉంది. అంతలా మా కుటుంబానికి దగ్గరయావు. గతంలో నేను ఏ ఖైదీపైనా ఇంతలా అనుబంధం పెంచుకో లేదు. శిక్షా కాలం పూర్తి అయ్యాక భార్యాభర్తలు తరుచుగా మనింటికి వస్తూ ఉండండి. అనంతపురం జైలర్ నా స్నేహితుడే. నీ గురించి చెప్పాను. అతడు నిన్ను మంచిగా చూసుకుంటాడు పోలీసులు నీ వెంట వచ్చి నిన్ను అంతఃపురం జైల్లో అడ్మిట్ చేసి వస్తారు.” జాగ్రత్తలు చెప్పి రామచంద్రరావు సర్వమంగళతో కలిసి రవిసంధ్యలకు కొత్త బట్టలు పెట్టారు. ఆ దంపతుల కాళ్ళకు నమస్కరించి పోలీసు జీపులో బయలుదేరారు సంధ్యా రవిచంద్రలు కుటుంబంతో కలిసి.
అనంతపురం ఇంట్లో చేరిన కుటుంబం రవిచంద్ర కోసం ఎదురుచూస్తుంటే ఉదయం ఏడు గంటలకు జైలు నుంచి వచ్చాడు. యోచన్ను ఇంటర్ కాలేజిలో, సృజన్ను హైస్కూల్లో చేర్పించి, నాన్నకు ఇంట్లోనే చిల్లర అంగడి పెట్టించి, అమ్మ సీతమ్మను ఇంట్లో పని చూసుకోమని చెప్పి సంధ్యా రవిచంద్రలు మార్కెట్లో పూలు పండ్లు తోపుడు బండిపై అమ్మడం మొదలు పెట్టారు. ఇదే వారికి నిత్యకృత్యమై సాగింది.. అలా జీవితం సాఫీగా జరిగి పోయింది.
మరో మూడేళ్ల గడిచాయి. వానలు మొదలైయాయి. ఏరు పారిందనీ, చెరువు నిండిందనీ ఊరి నుంచి వార్తలు వచ్చాయి. ఈ లోపల సత్ప్రవర్తనపై రవిచంద్ర విడుదలైయాడు. ఆనందం వెల్లివిరిసింది. సంతోషం పాలవెల్లిలా పొంగింది. ఊరి నుంచి అత్తామామలు, అక్కా బావలు బంధుమిత్రులు వచ్చి సంబరాల్లో పాలుపంచుకున్నారు.
రామసుబ్బయ్య ఊరికెళ్ళి ఇల్లు ఖాళీ చేయిచాడు. భూముల్ని కౌలు నుంచి విడిపించాడు. పాడి ఎనుముల్ని, కాడెద్దుల్ని మళ్లీ కొన్నాడు.
రవిచంద్ర అంతఃపురం నుంచి సామాన్లు లారిలో తెచ్చి ఇంట్లో చేర్చాడు. పిల్లల్ని డిగ్రీలో ఒకర్ని, ఇంటర్లో ఒకర్ని చేర్చించాడు. నాన్నకు వ్యవసాయంలో అవసరమైనప్పుడు సాయం అందిస్తునే రవిచంద్ర ప్రొద్దుటూరు ప్రైవేటు కాలేజీలో లెక్చరరుగా చేరాడు. సంధ్య ఊర్లోనే ప్రైవేటు హైస్కూల్లో టీచరుగా చేరింది.
ఆరాత్రి అందరూ ప్రశాంతంగా గాఢంగా నిద్రపోయారు. సంధ్య రవిచంద్ర రూంలో మాత్రం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.
“ఏం బాబూ! నన్ను చేసుకోవడం వల్ల నీవేమి నష్టం పోయావు. మన పెళ్లైయి పద్దెనిమిది సంవత్సరాలు అయింది. ఖైదీగా ఉన్నా కలిసే ఉన్నాం. శారీరక సుఖం పొందాం. ఇద్దరి బిడ్డలకు జన్మనిచ్చాం. ఇతరుల కంటే మనం ఏం కోల్పోయాం. ఆరోజు విడిపోయింటే నీయంతా మంచి భర్త నాకు దొరికివుండేనా! నాలాంటి మంచి భార్య నీకు దక్కివుండేనా! చెప్పు!” భర్తను అడిగింది సంధ్య.
“సంధ్యా! నువ్వు మంచిదానివి. సంయమ స్ఫూర్తిగా ఆలోచిస్తావు, సహనమూర్థివి, ఓర్పు నేర్పు కలదానివి, వివాహ పవిత్రత తెలిందానివి, ప్రేమ విలువ ఎరిగిన దానివి కాబట్టి నాకు అంతా మంచే జరిగింది. ఇంకెవరైనా అయివుండింటే ఈ ఖైదీతో కాపురం చేసి ఉండేవారా! విఫలం కావాల్సిన నా జీవితాన్ని సఫలం చేశావు సంధ్యా! నీకు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను” అంటూ భార్యను గుండెలకు హత్తుకున్నాడు. భర్త గుండెలపై పరువశంతో హాయిగా నిద్రించింది సంధ్య.
మరుసటి రోజు ఉదయం సూర్యుడు కొంగ్రొత్త వెలుగులు విరజిమ్ముతూ ఉదయించాడు.
