గోడ

Spread the love

మమ్మల్ని లోపలికి తోశారు. విశాలమైన గది. తెల్లటి గోడలు. లైట్ల వెలుగుతో కళ్లు మూసుకుపోయాయి. ఎదురుగా ఒక టేబుల్ వెనక నలుగురు కూర్చున్నారు. సివిలియన్ దుస్తుల్లోనే ఉన్నారు మేం నడిచి వస్తున్నప్పుడు పక్కగదిలో ఖైదీలు కనిపించారు. అందులో కొందరు నాకు తెలుసు. మరికొందరు విదేశీయులు. నా ముందు వరుసలో ఇద్దరు ఫ్రెంచి వాళ్లూ ఉన్నారు.

            విచారణ మూడు గంటలు జరిగింది. తల దిమ్మెక్కినట్లుగా ఉంది. గదిని హీట్ చేసారు కాబోలు, సుఖంగానే ఉంది. బయట ఉన్న ఇరవైనాలుగ్గంటలూ చలికి గడ్డ కట్టుకుపోయాం. గార్డ్స్ మాలో ఒక్కొక్కర్నే టేబుల్ ముందుకు నెట్టారు. నలుగురు ఆఫీసర్లు మా పేర్లూ, వృత్తి కనుక్కున్నారు. అంతకన్నా ఎక్కువ ఏమడగాలో వాళ్లకు తెలిసినట్టులేదు. అప్పుడప్పుడూ “ఆయుధాల గురించి నీకేమన్నా తెలుసా? ” లేక “తొమ్మిదో తారీకు ఉదయం ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు?” అంటూ వాకబు చేశారు. మా జవాబులు వినే ఓపికకూడా వాళ్లకున్నట్టు లేదు.

            “ఇంటర్నేషనల్ బ్రిగేడ్‌లో ఉన్నారా?” అంటూ టామ్‌ను  ప్రశ్నించారు. అతడి జేబులో దానికి సంబంధించిన పత్రాలు వాళ్లకు దొరికాయి. టామ్ చెప్పటానికి మాత్రమేముందని! జువాన్‌నేమీ అడగలేదు. ఏదో రాసుకుంటూ కూర్చున్నారు.

“నా తమ్ముడు జోస్ అనార్కిస్టు.. అతడిక్కడలేడు. నాకే పార్టీతోనూ, ఏ రాజకీయాలతోనూ సంబంధం లేదు” అన్నాడు జువాన్.

            వాళ్లు మాట్లాడలేదు.

            “నేనే నేరం చెయ్యలేదు. ఎవరో చేసిన దానికి నాకెందుకు శిక్ష? “

            గార్డు అతణ్ణి పక్కకు లాక్కెళ్లాడు.

            ఇక నా వంతు.

            “నీ పేరు పాబ్లో ఇబీటా? “

            “ఔను”

            కాగితాలు చూస్తూ, “రేమన్ గ్రిస్ ఎక్కడ అంటూ అడిగాడు.

            “తెలియదు”

            “ఆరు నుంచి పందొమ్మిదో తారీకు దాకా అతణ్ణి నువ్వు మీ ఇంట్లో దాచావు”

            “నో”

            నన్ను బయటకునెట్టారు. టామ్, జునాన్ లకు ఇరువైపులా గార్డులు, ముగ్గురం కలిసి ముందుకు నడిచాం.

            “సో? “అన్నాడు టామ్ గార్డ్ వైపు చూస్తూ.

            “సో వాట్?”

            “ఇందాక జరిగింది క్రాస్ ఎగ్జామినేషనా లేక విచారణా? శిక్ష వేశారా? “

            “వేశారు”

            “మమ్మల్నేం చేస్తారు? “

            “సెల్‌కు వెళ్లాక చెబుతాం”

హాస్పిటల్ సెల్లార్‌నే మా సెల్‌గా మార్చారు. బాగా చల్లగా ఉంది. రాత్రంతా గజగజా వణుకుతూ గడిపాం. తెల్లవారినా పరిస్థితి మారలేదు. ఇక్కడికి వచ్చేముందు అయిదు రోజులు ఒక మొనాస్టరీ -అది మధ్య యుగాలనాటి కట్టడం -సెల్ లో గడిపాను. ఖైదీలెక్కువ. జైళ్లలో చోటు లేదు. ఎక్కడ కాస్త చోటు దొరికితే అక్కడ కుక్కేస్తున్నారు. చలికన్నా ఒంటరితనాన్ని భరించటం కష్టం. జువాన్ ఎక్కువ మాట్లాడడు. భయపడ్డాడనుకుంటాను. పైగా కుర్రవాడు. టామ్ బాగానే మాట్లాడతాడు. స్పానిష్ భాష కూడా తెలుసు.

            సెల్లార్‌లో ఒక బెంచీ, నాలుగు చాపలు ఉన్నాయి.

            కాసేపటికి “ఇక మనపని ముగిసింది” అన్నాడు టామ్.

            “ఆఁ అలాగే కనిపిస్తున్నది. కనీసం కుర్రాణ్ణి స్పేర్ చేస్తారనుకుంటా” అన్నాను.

            వాడి మీద నేరమేమీ లేదు. వాడి బ్రదర్ కారణంగా అరెస్టు చేశారంతే”

            జువాన్ మా మాటల్ని వినలేదు కాబోలు. “సారగోసాలో ఏం చేస్తారో తెలుసా? రోడ్డు మీద అ మనుషుల్ని అడ్డంగా పడుకోబెట్టి ట్రక్కులు నడిపిస్తారు. అలా బులెట్లు పొదుపు చేస్తారు”

            “పెట్రోలు పొదుపు సంగతేమిటి” అన్నాను. చికాకుగా.

            టామ్ తన కబుర్లాపలేదు.

            “సైనికులు ఇదంతా సూపర్వైజ్ చేస్తారు. మనుషుల్ని వెంటనే చంపుతారనుకున్నావేమిటి? కొస ప్రాణంతో జనం హాహాకారాలు చేస్తూనే ఉంటారు, కనీసం గంట సేపు”

            “మనకా గతి పట్టకపోవచ్చు. వీళ్లకు బుల్లెట్ల కొరత లేదు”

            గోడకున్న రంధ్రాల గుండా వెలుగు సెల్లార్‌లోకి ప్రసరించింది. కొద్దిగా ఆకాశం కూడా కనిపించింది. ఇక్కడ బొగ్గు నిలువ చేస్తారు కాబోలు- ఆస్పత్రిని హీట్ చెయ్యటానికి. పేషెంట్లు లేరు గాని బొగ్గు మిగిలింది.

            “చలి భరించలేను” అంటూ వ్యాయామం ప్రారంభించాడు టామ్. లావుగా ఉంటాడు. పెరిగిన పొట్టా, పిరుదులూ. మరి కాసేపట్లో బాయ్‌నెట్స్ ఈ కొవ్వులోకి దూసుకుపోతాయి. అతడు సన్నగా ఉంటే నాకిలాంటి ఆలోచనలు రాకపోయేవి కాబోలు.

            నాకూ చలిగానే ఉంది. మా దుస్తులన్నీ సైనికులు తీసుకున్నారు. ఆస్పత్రి వాళ్లిచ్చిన షర్టూ, పాంటూ తప్ప మరేం లేవు మా ఒంటి మీద.

            ఎనిమిదింటికి మేజర్ వచ్చి పేర్లడిగాడు.

            “స్టీన్ బాక్, ఇబీటా, మిర్జాల్” అన్నాడు గార్డు.

            “మీకు మరణ శిక్ష విధించారు. రేపుదయం ఫైరింగ్ స్క్వాడ్ వస్తుంది”. అన్నాడు మేజర్ కళ్లద్దాలు సవరించుకుంటూ.

            “అన్యాయం. నన్నెందుకు చంపుతారు? ” అన్నాడు జువాన్.

            “నీ పేరేమిటన్నావ్? “

            “జువాన్ మిర్బాల్”.

            “ఈ లిస్టులో నీ పేరుంది గదా”

            “నేనే నేరం చెయ్యలేదు”.

            “నువ్వు బాస్క్‌వా? ” స్పెయిన్ నుండి విడిపోవాలనుకుంటున్న ఒక ప్రాంతంలోని వాళ్లను ‘బాస్క్’ లంటారు.

            “మా ముగ్గుర్లో ఎవరూ బాస్క్ కాదు”

            మేజర్ విసుక్కున్నాడు.

            “మీరు ముగ్గురూ బాస్క్‌లని చెప్పారే? నా కెందుకీ గొడవ. మొత్తం మీద మీకు ప్రీస్ట్ అక్కర్లేదు గదా!”

            మరణానికి ముందర ప్రీస్టు వచ్చి ఆశీర్వదించటం ఆచారం.

“కాసేపట్లో ఒక బెల్జియన్ డాక్టర్ వచ్చి మీతో చివరి క్షణాలు గడుపుతాడు.” అని చెప్పి వెళ్ళిపోయాడా మేజర్.

            “పాపం, కుర్రాడికన్యాయం జరిగింది”. అన్నాను మర్యాద కోసం. నిజానికి వాడంటే నాకిష్టం లేదు. ప్రాణ భయంతో మూడు రోజుల్లోనే వాడి రూపం మారిపోయింది. కళ్ళు తేలేశాడు. వదిలిపెట్టినా మళ్లీ మామూలుగా బతకగలడనుకోను. జాలి చూపవచ్చు కాని జాలంటే నా కసహ్యం. భయం కూడా. టామ్ వాణ్ణి ముట్టుకోబోతే విదిలించుకున్నాడు.

            ఎదుటి వ్యక్తిని ఓదార్చటంలో తన భయం కూడా కొంత తగ్గుతుంది. మృత్యువు గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. కాని ఇప్పుడది నన్ను తన వెంట రమ్మంటోంది.

            తలుపు తెరుచుకుంది. ఇద్దరు గార్డులు ప్రవేశించారు.

            “నేను డాక్టర్ని. మీకు తోడుగా ఉండటానికొచ్చాను” అంటూ మూడో మనిషి పరిచయం చేసుకున్నాడు.

            “ఏం చేస్తావు నువ్విక్కడ? “

            “మీరు చివరి క్షణాలు వీలైనంత ప్రశాంతంగా గడపటానికి సాయం చేస్తాను.”

            “ఆస్పత్రిలో చాలా మంది డాక్టర్లున్నారు. ప్రత్యేకంగా మిమ్మల్నెందుకు పిలిపించారు?

            “తెలియదు. సిగరెట్లు కావాలా? సిగార్స్ కూడా ఉన్నాయి”

            అక్కర్లేదన్నాం. “ఎవరి దయా మాకక్కర్లేదు. మేం అరెస్టయిన రోజున బారెక్స్‌లో నిన్ను చూశాం. ఫాసిస్టులతో ఉన్నావుగదా!”

ఇంకా మాట్లాడాలనుకున్నాను. ఎందుకో సడెన్‌గా కోరిక చచ్చిపోయింది.

            డాక్టరు నా వైపు పరిశీలనగా చూశాడు. గార్డులు చాపల మీద కూర్చున్నారు. అందులో కాస్త పొడుగ్గా ఉన్నవాడి పేరు పెడ్రో.

            “లైట్ కావాలా?” అనడిగాడు వాడు.

            “కావాల”న్నాడు డాక్టర్.

            పెడ్రో దీపం తీసుకొచ్చాడు.

            తల తిరిగినట్టైంది. మృత్యు భయం కాదు. పేరు లేని మరేదో భయం ఆవహించింది.

            టామ్ చేతుల్లో మొహం దాచుకున్నాడు. మెడ తెల్లగా కన్పిస్తోంది.

            డాక్టరు జువాన్ పల్స్ చూశాడు. ఒక చేతిలో గడియారం, మరో చేతిలో ముంజేతిని పట్టుకున్నాడు.

            ‘బాస్టర్డ్.. నా దగ్గిరకొస్తే ఒక్కటిచ్చుకుంటాను’ అనుకున్నాను.

            నా వైపు చూసి, ‘ఇక్కడ చలెయ్యటం లేదూ?” అనడిగాడు డాక్టర్.

            చలికి అతడి చర్మం నీలం రంగుకు మారింది.

            “లేదు”

            చెమట పట్టింది. గడ్డకట్టించే ఈ చలిలో చమట! షర్టు ఒంటికతుక్కుపోయింది. మొహమంతా తడి. తనకేం కాదని తెలుసుగనక వాడికి చలేసింది. మా పరిస్థితి వేరు.

            చెమట ధారగా కారింది. జేబు రుమాలు, షర్టు, ప్యాంటు తడిసి ముద్దయ్యాయి. స్నానం చేస్తున్నట్టుగా ఉంది.

            “మీరు డాక్టరా?” అడిగాడు జువాన్ ఆక స్మాత్తుగా.

            “అవును”

            “నొప్పిగా… ఉంటుందా? “

            “అప్పుడా? లేదు. ఏం జరుగుతుందో కూడా తెలియదసలు. కనురెప్పవేసేలోగా అంతా జరిగిపోతుంది.

            “కొన్నిసార్లు… రెండు సార్లు ఫైర్ చేస్తారట గదా? “

            “అరుదుగా. మొదటి బులెట్ గుండెకు తాకకపోతే మరోసారి కాల్చక తప్పదు మరి”

            “అంటే, వాళ్లు మళ్లీ రైఫిల్స్ లోడ్ చేసుకుంటారు… కొంత టైం పడుతుంది.

            కుర్రవాడు. మరణం కన్నా బాధంటే భయం.

            నేను లేచి అటూ యిటూ నడిచాను. బూట్లు కిర్రు కిర్రుమని చప్పుడు చేశాయి. టామ్ నావైపు విసుగ్గా చూశాడు.

            అతడికీ చెమట పట్టింది. టామ్, నేను-ఒకరి ప్రతిబింబం ఒకరిలో కనిపిస్తోంది.

            మేము మృతులం లేదా చావబోతున్నవాళ్లం. బతికున్న వాడు బెల్జియన్ ఒక్కడే.

            “రేపుదయం మనల్ని ఓపెన్ యార్డ్‌లో నిలబెట్టి… ఎంత మంది వస్తారు? “

            “ఐదు లేదా ఎనిమిది”

            “మనం గోడకు నిలబడతాం. అంతేగదా. రక్షణ కోసం గోడలో దాగిపోవాలని ప్రయత్నిస్తాం. చివరకు మిగిలేది గోడ మాత్రమే.”

            “మన శరీరాలు గుర్తుపట్టలేకుండా ఉండాలని వాళ్లు కళ్లకూ, నోటికీ గురిపెట్టి కాలుస్తారు. రేపటి బాధ ఇప్పుడే అనుభవించవచ్చు”

            “తరువాత మనం పూల మొక్కలకు ఎరువుగా మారతాం”

            టామ్ తనలో తాను మాట్లాడుకున్నాడు.

            “జరిగిపోతుందని తెలుసు. జరగక తప్పదనీ తెలుసు. తరువాత ఏమీ మిగలదనీ తెలుసు. కానీ ఏమిటిదంతా? ఎందుకు?

            ‘తుపాకుల మోత’ బుల్లెట్లు. నేను మెటీరియలిస్టుని. నా శవాన్ని నేను చూడగలుగుతున్నాను. నేనుండను. లోకం సజావుగా సాగిపోతుంది. పాబ్లో, మనం అలాంటి విషయాలాలోచించగూడదు”

            “షటప్ ఏమిటా పిచ్చి ఆలోచనలు. ప్రీస్టు కావాలా ఏమిటి? ” అంటూ మందలించాను.

            బుల్లెట్లకెదురు నిల్చిన వాళ్లందరూ ప్రవక్తలవుతారనుకుంటున్నట్టుంది. ఐరిష్ వాళ్లది కాస్త ఉద్వేగ స్వభావం. టామ్ ఐరిష్ జాతీయుడు! అతడి దగ్గర మూత్రం వాసన వచ్చింది. ఇలాంటి సమయాల్లో సానుభూతి చాలా ప్రమాదకరం. ఇది సహజ మరణం కాదు. కాని ఈ లోకంలో ఏది సహజం? ఈ బొగ్గు, దుమ్ము బెంచి, పెడ్రో పిడకల మొహం- ఏదీ సహజంగా లేదు. టామ్ అప్పడే మొహం మీద చావు ముసుగు కప్పుకున్నాడు. నాకూ, టామ్‌కూ పోలిక లేదు. కాని కలిసి చస్తున్నాం గనక కవలల్లాగున్నాం.

            “ప్లాబో, అంతా ముగిసినట్టేనా? ” అన్నాడు టామ్

            చావు సంగతి సరే కాస్త కనీస మర్యాదలు పాటించవా!”

            వాణ్ణి చూస్తే అసహ్యమేసింది. కంట్రోల్ లేకుండా మూత్రం కారిపోతోంది.

            “ఏమైంది?” అన్నాడు టామ్ భయంగా.

            “ఉచ్చ పోసుకుంటున్నావు”

            “లేదే. నాకు తెలియదు”

            దొంగ సానుభూతితో బెల్జియన్ “ఏమైనా ప్రాబ్లమా?” అనడిగాడు.

            “ఎలా జరిగిందో తెలియదు. నేను భయపడటం లేదు” అన్నాడు టామ్ రోషంగా.

            బెల్జియన్ మమ్మల్ని పరిశీలిస్తూ నోట్స్ తీసుకున్నాడు. బతికున్నవాళ్లకూ మాకూ ఎంత తేడా! అతడికి శరీరం చెప్పినట్లు వింటుంది. దానికి చలేస్తుంది. చక్కటి కండరాలు. మాకో….. శరీరాల గురించిన స్పృహ కూడా లేదు.

            బెల్జియన్ జువాన్ మెడతాకి చూశాడు. అది ప్రేమా? సానుభూతా? లేక వృత్తిపర మైన పరిశీలనా? జువాన్ హఠాత్తుగా అతడి చెయ్యి కొరకటానికి ప్రయత్నించాడు. బెల్జియన్ విడిపించుకుని దూరం జరిగాడు. మాకూ, అతడికీ ఉన్న తేడా ఇప్పటికైనా తెలిసి వచ్చిందనుకుంటాను.

            తెల్లవారక తప్పదు. కాని దాన్ని గురించి ఆలోచించటమెందుకు? మరణం ధ్రువం. దాని గురించి ఏం మాట్లాడతాం? అంతా అర్థరహితమే. శుష్కపదాలు. మావైపు గురిచూస్తున్న రైఫిల్ బారెల్స్, చంపేదీ, చచ్చేదీ ఒక్కసారే కాని నిరంతరంగా దాని గురించే ధ్యానం… డజన్లసార్లు, వందల సార్లు. ఒక నిమిషం కునుకుపట్టిందేమో. గార్డులు నన్ను లాక్కెళుతున్నారు. నేను పెనుగులాడుతున్నాను. రక్షించమని ప్రాధేయపడుతున్నాను.

            మెలకువ వచ్చింది. బెల్జియన్ వైపు చూశాను. నిద్రలో బహుశా ఏడ్చి ఉంటాను. ఏమీ పట్టించుకోనట్టుగా అతడు మీసాలు నిమురుకుంటున్నాడు.

            గత రెండు రోజులుగా – నలభై ఎనిమిది గంటల్నించీ నిద్రలేదు. ఇక మెలకువగా ఉండటం సాధ్యం కావటం లేదు. ఆప్రయత్నంగానే కళ్లు మూతలు పడుతున్నాయి.

            మృత్యు ముఖంలో మాత్రం నిద్రా సుఖమెందుకొదులుకోవాలి! తెల్లవారుజామున వాళ్లెట్లాగూ వస్తారు. జంతువులాగ చావటమెందుకు?

            నిద్రలో పీడకలలు వస్తాయని లేచి పచార్లు చేశాను. ఆలోచనలు తిరగబెట్టాయి. తెలిసిన మొహాలు… సంఘటనలు… నా కళ్ల ముందు దారుణంగా చిత్ర హింసలకు, హత్యలకు గురైన వ్యక్తులు… నా బంధువులు… రేమన్ గ్రిస్…

            గతమంతా కళ్ల ముందర కనిపించింది. 1926లో మూడు నెలలు ఉద్యోగం లేక తిరిగాను. ఆకలితో మరణించినంతపనైంది. గ్రనాడాలో బెంచి మీద గడిపిన రోజులు… మూడు రోజులు తిండి లేదు. తెలియని కోపం… ఎందుకు కుక్కలా చావటం, బతకాలి. జీవితంలో కావలసింది ఆనందం, స్త్రీలు, స్వేచ్ఛ. స్పెయిన్‌ను విముక్తి చెయ్యాలని ఆశ యం. అనార్కిస్టు ఉద్యమంలో చేరాను. పబ్లిక్ మీటింగులలో ఉపన్యసించాను. ‘నాకు చావు లేదు’ అన్నంత స్వేచ్ఛగా తిరిగాను.

            ఇలా చావబోతున్నానని తెలిస్తే అవన్నీ చేసేవాణ్ణా? ఇంకా ఎన్ని గంటలుంది? అందమైన జీవితం అని అనుకోవాలనిపిస్తోంది. ఏమీ తెలియదు. తెలుసుకోవలసిందీ లేదు. చెయ్యాలనుకుని చెయ్యలేని పనులనేకం మిగిలిపోయాయి. కాడిజ్ ప్రాంతంలో సముద్రస్నానం చెయ్యాలని కోరిక, కాని మృత్యు ముఖంలో ఏ ఆలోచనకూ విలువ ఉండదు.

            “ఫ్రెండ్స్, పై అధికార్లు అనుమతిస్తే మీకో సహాయం చేస్తాను. మీ వాళ్లకు మీ జ్ఞాపకార్థం ఏదైనా ఇవ్వండి” అన్నాడు బెల్జియన్ సడెన్‌గా నవ్వుతూ.

            “నాకెవరూ లేరు” టామ్ సమాధానం.

            నేను మాట్టాడలేదు.

            “నీకు ప్రియురాలు ఉందిగా?” అన్నాడు టామ్ మళ్లీ నాతో.

            “నో”

       ఎందుకీ దొంగ ప్రేమ. దొంగ దాతృత్వం! నా ప్రియురాలి గురించి నిన్న మాట్లాడటం నాదే పొరబాటు-ఇప్పుడామెను చూడాలనే కోరిక లేదు. ఆమెతో మాట్లాడవలసిన మాటలూ లేవు. ఆమె సన్నిధి, సాంగత్యం ఇప్పుడు బహుదూరం. చెమట, భయం ఆమె గురించి, నేను లేనని తెలిసి ప్రియురాలు ఏడుస్తుంది. కొన్నాళ్లు తిండి ముట్టదు. ఇవన్నీ సాధారణంగా విషయాలు. కాని మరణించేది మ్రాతం నేను. స్వచ్ఛమైన నీటి చెలమల్లాంటి ఆమె కళ్లు… ఆమెను చూస్తే చాలు ఏదో విద్యుత్ ప్రవహిస్తుంది నాలో. ఇప్పుడదంతా ముగిసింది. ఆ చూపు నా దాకా ప్రయాణించదు. ఆమె వద్దే ఆగిపోతుంది.

            టామ్ కూడా ఒంటరిగానే ఉన్నాడు. కాని ఎవరి ఒంటరితనం వారిది. కింద కూర్చుని బెంచీకేసి చూస్తున్నాడు. దాన్ని ముట్టుకుంటే విరిగిపోతుందేమోనన్నట్టు. వస్తువుల ఉనికికి కొత్త అర్ధం కనిపిస్తోంది. వాటి సాంద్రత తగ్గి కరిగి, అదృశ్యమవుతున్నట్టుగా ఈ బెంచి, దీపం, బొగ్గుగుట్ట నా మరణాన్ని గుర్తుచేస్తున్నాయి. మరణం ఏమిటో స్పష్టంగా తెలియదు గాని అంతా కలగాపులగంగా కనిపిస్తోంది. అంతటా-వాతావరణంలో, గదిలో, మనుషుల మొహాల్లో, ప్రవర్తనలో-నాకూ లోకానికీ మధ్య దూరం పెరుగుతోంది. డెత్ బెడ్ మీద ఉన్న వాడితో ఎంత ప్రేమగా మాట్లాడినా ఇద్దరి మధ్యన తరగని దూరం ఉంటుందే – అలాగ. టామ్ బెంచిని తాకితే మృత్యువును తాకినట్టే.

సడెన్‌గా ఎవరైనా వచ్చి “విడుదల చేస్తున్నాం. వెళ్లిపో” అని చెప్పినా నా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు. మృత్యువు అనివార్యమని తెలిసినప్పుడు – నిరీక్షణ కొన్ని గంట కైనా, రోజులైనా, వారాలైనా ఒకటే. జీవితం శాశ్వతం కాదన్న సత్యం అవగతమైంది. భ్రమ తొలగింది. నా కళ్లు చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి. కాని అవి నేను కాదు. శరీరం వణుకుతున్నది. కాని దాన్ని గుర్తించటం మానేశాను. ముట్టుకుని చూస్తే తప్ప ఇది నా శరీరమని తెలియటం లేదు. విమానం నోస్‌డైవ్ చేస్తున్నట్టుగా ఉంది. బరువు తగ్గినట్టుగా నేల కూలిపోతున్నట్టుగా శరీరాన్ని చూస్తే అసహ్యమేస్తోంది. – ఏదో ఒక తుచ్ఛకీటకం నన్ను పెనవేసుకున్నట్టుగా ప్యాంటు తడిగా ఉంది.

            ఎందుకైనా మంచిదని బొగ్గుగుట్ట వద్ద మూత్రం పోసుకుని వచ్చాను.

            “మూడున్నర” అన్నాడు బెల్జియన్.

            బాస్టర్డ్ కావాలని పనిగట్టుకుని చెప్పాడు. టామ్ ఉలిక్కిపడ్డాడు. అవును టైం దగ్గర పడుతోంది. నిరాకారమైన శిలలాగ రాత్రి మమ్మల్ని కమ్ముకుంది.

            కుర్రాడు జువాన్ ఏడుపు ప్రారంభించాడు.

            “నేను చావను. రక్షించండి. నాకు చావాలని లేదు” నిస్సహాయంగా చేతులూపుతూ అటూ ఇటూ పరిగెత్తాడు. ఓదార్చే ప్రయత్నం చెయ్యకుండా టామ్ అతడి వైపు జాలిగా చూశాడు. కుర్రాడి గోల మరింత పెరిగింది. పెద్ద రోగంతో బాధపడుతున్నవాడు కాస్త జ్వరంగా ఉందని నచ్చచెప్పుకున్నట్టుగా ఉంది. ప్రాణాంతకమైన జబ్బు వచ్చినప్పుడు జ్వరముండదు.

            ఏడవటమంటే మన మీద మనం జాలిపడటం- అంటే కుర్రాడు మృత్యువు గురించి ఆలోచించటం లేదు. నాకూ లోపల దుఃఖంగానే ఉంది. క్షణమైనా ఏడ్వాలని… కాని సరిగ్గా దానికి వ్యతిరేకంగా జరిగింది. మనిషి లక్షణం తగ్గినట్టనిపించింది. ఎవరి మీదా జాలి రాలేదు. నా మీద నాకు అస్సలు జాలి లేదు. ఏడుపులూ పెడబొబ్బలెందుకు. ‘శుభ్రంగా డీసెంట్‌గా చావాలి’ అనుకున్నాను.

            టామ్ లేచాడు. గోడ కన్నం లోంచి వెలుగు కనిపించింది. తెల్లవారుతోంది. ‘క్లీన్’ గా చావాలి. కాలం ఎగిరిపోతోంది. చుక్కలు చుక్కలుగా కారిపోతోంది.

            ‘విన్పించిందా?’ అన్నాడు టామ్. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు.

            బైట కోర్ట్‌యార్డ్‌లో జనం కవాతు చేస్తు న్నారు.

            “ఆఁ విన్నాను”

            “ఎందుకు తిరుగుతున్నారు? చీకట్లోనే షూట్ చెయ్యరు గదా!””

            మరి కాసేపటికి బూట్ల చప్పుడు తగ్గింది.

            “తెల్లారింది” అన్నాను.

            పెడ్రో ఆవలిస్తూ లేచి దీపం ఆర్పేశాడు. “చలికి రాత్రంతా వణుకు పుట్టిందనుకో”

            తుపాకీ మోత వినిపించింది.

            “ప్రారంభమైంది” అన్నాడు “బిల్డింగ్ వెనక యార్డులో” టామ్,

            డాక్టర్ని ఒక సిగరెట్టిమ్మన్నాడు టామ్. సిగరెట్టూ, మద్యం ఏవీ వద్దనుకున్నాను.

            క్షణం విరామం లేక ఫైరింగ్ కొనసాగింది. “ఏం జరుగుతోందో తెలుసా?” అడిగాడు టామ్.

            ఏదో చెప్పాలనుకుని, డాక్టర్ను చూసి ఆగిపోయాడు. తలుపు తెరుచుకుంది. లెఫ్ట్‌నెంటూ, నలుగురు సైనికులూ వచ్చారు. టామ్ సిగరెట్ పారేశాడు.

            “స్టీన్ బాక్? “

            టామ్ మాట్లాడలేదు. పెడ్రో అతడివైపు చూపిస్తున్నట్లు సైగ చేశాడు.

            “జువాన్ మిర్బాల్”

            “మ్యాట్ మీద”

            “గెటప్ లే”, లెఫ్టినెంట్ ఆదేశించాడు.

            జువాన్ కదల్లేదు. ఇద్దరు సైనికులు అతణ్ణి పైకి లేపి నిలబెట్టారు. కాని కాళ్లల్లో బలం లేనట్టు మళ్లీ కిందపడ్డాడు.

            సైనికులు కాస్త తటపటాయించారు.

            “ఇది మామూలే. లాక్కురండి” అన్నాడు. లెఫ్టెనెంట్

            “పద” అంటూ టామ్ కూడా కదిలాడు.

            సైనికులు జువానును ఈడ్చుకుని వెళ్ళారు. నేనూ బయల్దేరబోతుంటే లెఫ్టినెంట్ ఆపి,

            “ఇబీటా నువ్వేనా? “

            “అవును”

            “నీక్కాస్త టైముంది. వెయిట్” అన్నాడు.

            డాక్టరు కూడా వాళ్ల వెంట వెళ్ళాడు.

            సెల్లార్‌లో ఒంటరిగా నేను. ఏం జరుగుతోందో తెలియదు గాని ఇదేదో త్వరగా ముగిస్తే బాగుండుననిపించింది. షాట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

            జుట్టు పీక్కోవాలని, బిగ్గరగా అరవాలని కోరికగా ఉంది.

            ఇలా చెయ్యకూడదు. డీసెంట్‌గా, క్లీన్‌గా చావాలి!.

            గంట తర్వాత వచ్చి నన్ను మొదటి అంతస్తుకు తీసికెళ్లారు. చిన్న గది. సిగరెట్ల వాసన. ఇద్దరాఫీసర్లు కూర్చున్నారు.

            “ఇబీటా?”

            “యస్”

            “రేమన్ గ్రిస్ ఎక్కడ? “

            “తెలియదు”

పొట్టిగా, లావుగా ఉన్నవాడు నన్ను దగ్గిరకు పిలిచి

            “ప్రాణం దక్కాలంటే, గ్రిస్ ఎక్కడున్నాడో చెప్పు” అంటూ నా కళ్లలోకి చూశాడు.

            చావుకు సిద్ధపడిన వాణ్ణి భయపెట్టటం ఎవరికి సాధ్యం? వీళ్ళు నాకు ప్రాణభిక్ష పెడతారా? వీళ్ళు మాత్రం చావరా? ఇప్పుడు కాదు. మరి కొన్నాళ్ళకైనా అందరికీ మరణం తప్పదు గదా.

            కాగితాలు స్టడీ చేస్తూ ఏవో పేర్లు చదువుకున్నారు. ఇతర్లను బంధించటం వీళ్ళ వృత్తి. తమ అభిప్రాయాలతో అంగీకరించని వాళ్లందర్నీ అణచివేస్తారు.

            స్పెయిన్ గురించి వీళ్ళూ ఆలోచిస్తున్నారు. చేతుల్లో కొరడాలు. క్రూర మృగాల్లా కూర్చున్నారు. ఇదంతా నన్ను భయపెట్టి లొంగదీసుకోవటానికి,

            “అర్థమైందా?”

            “గ్రిస్ జాడ నాకు తెలియదు. మాడ్రిడ్‌లో ఎక్కడో ఉంటాడు”

            మరో ఆఫీసర్ బద్ధకంగా చెయ్యి విదిలించాడు. ఇదంతా నన్ను ఇంప్రెస్ చెయ్యటానికే. ఎదుటి మనుషుల్ని భయపెట్టి ఆనందించే మనుషులూ ఉంటారు.

            ప్లాను ప్రకారమే అంతా జరుగుతోంది. ఒక రాత్రి నిరీక్షణ. సెల్లార్‌లో మరో గంట. టామ్, జువాన్లను షూట్ చేశారు. నన్ను లాండ్రీలో బంధించారు. ఇది వార్ ఆఫ్ నెర్వ్. ఎప్పుడో అప్పుడు నేను బ్రేక్ అవుతానని వాళ్ల అంచనా.

            మూర్ఖులు. వాళ్ళ ట్రాప్‌లో నేను చిక్కను. గ్రిస్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. తన కజిన్స్ ఇంట్లో దాక్కున్నాడు- నగరం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో. నన్ను టార్చర్ చేస్తే తప్ప ఈ విషయం చెప్పను. ఇదీ నా ప్లాన్. చస్తానుగాని గ్రిస్ గురించి మాత్రం చెప్పను. నాకతడంటే ఇష్టమని కాదు. ప్రియురాలు నాది కాదనుకున్నప్పుడే అతడి గురించీ ఆలోచించటం మానేశాను.

            ఉద్యమానికి అతని అవసరముంది. కాని నేను చావటానికి సిద్ధపడ్డానంటే అది కారణం కాదు. అన్ని ప్రాణాలకూ ఒకే విలువ. ఏ ప్రాణానికీ విలువ లేదు. గోడకు నిలబెట్టి మనుషుల్ని కాల్చేస్తున్నప్పుడు ఎవరైతేనేం? బహుశా స్పెయిన్‌కు నాకన్నా అతడి అవసరం ఎక్కువుంది. ఇదో ప్రహసనం. అతడి బదులు నేను చస్తాను. బాధ లేదు.

            లొంగననుకున్నారు కాబోలు. నన్ను తీసుకుపోవటానికి ఇద్దరాఫీసర్లు వచ్చారు. ఎలుక ఒకటి కాళ్ళ కడ్డం పడింది. నవ్వొచ్చింది.

            ఒక ఫలాంజిస్టు (ప్రభుత్వ సైనికుడు, ఉద్యోగి) వైపు తిరిగి ఎలుకను చూడమన్నాను. అతడు మాట్లాడలేదు. గంభీరంగా మొహం పెట్టాడు. తనను తాను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. వాడి మీసాలు నాకు నచ్చలేదు. ‘షేవ్ చేసుకోరా, ఇడియట్’ అన్నాను నవ్వుతూ. జవాబుగా బలంకొద్దీ తన్నాడు.

            “ఇంతకూ ఆలోచించావా? చెప్పు గ్రిస్ ఎక్కడ? “

            ఈ జాతి వాళ్లంతా వింత కీటకాలు. ఏం చెప్పినా అర్ధం కాదు.

            “గ్రిస్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. అతడు స్మశానంలో, సమాధిలో ఉన్నాడు. సమాధులు తవ్వితే ఎక్కడో కనిపిస్తాడు. గ్రేవ్ డిగ్గర్ నడుగు”

            తాయిలం దొరికినట్టుగా వాళ్ళు సంతోషంతో గెంతులేశారు. పదిహేనుమందిని తీసుకుని స్మశానానికి పదండి. నువ్వు నిజం చెబితే బతికిపోతావు. లేదా అబద్ధం చెప్పినందుకు చాలా బాధ పడాల్సి ఉంటుంది” అని నన్ను హెచ్చరించి కదిలారు.

            ఫలాంజిస్టు గార్డుల మధ్య ప్రశాంతంగా కూర్చున్నాను. వాళ్లను తలచుకుంటే నవ్వొచ్చింది. ఒక్కొక్క సమాధి మీది రాయీ ఎత్తి లోపల వెతుకుతున్నారేమో! పూల్స్, నేను బందీని. కాని నిజానికి హీరోని, స్మశానాల్లో, సమాధుల మధ్య ఫలాంజిస్టులు. వెరీ ఫన్నీ. అరగంట తర్వాత ఒకడు తిరిగి వచ్చాడు. బహుశా నన్ను షూట్ చేస్తారిక.

            ‘వీణ్ని కోర్ట్ యార్డ్‌లోకి  తీసికెళ్ళండి. ఏం చెయ్యాలో తరువాత న్యాయస్థానం నిర్ణయిస్తుంది”.

            “నన్ను… నన్ను చంపరా? “

            “ఇప్పుడైతే కాదు… తరువాతేమవుతుందో మాకనవసరం”

            “ఎందుకు చంపటంలేదు?

            ఎవరూ మాట్లాడరు. యార్డులో సుమారు వందమంది దాకా ఉన్నారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు. మధ్యాహ్నం మెస్‌లో భోజనం కూడా పెట్టారు. ఇద్దరు ముగ్గురు ప్రశ్నించారు. ఎందుకో తెలియదు.

            సాయంత్రానికి పదిమంది కొత్త ఖైదీల మధ్యకు నెట్టారు నన్ను. అందులో గార్షియా ఒకడు. బాగానే గుర్తు పట్టగలిగాను.

            “భలే అదృష్టమంటే నీదే. నువ్వు బతుకుతావనుకోలేదు” అన్నాడు.

            “నాకూ మరణశిక్ష విధించారు. ఎందుకో మరి, తరువాత అమలు జరపలేదు”

            “నన్ను మధ్యాహ్నం రెండింటికి అరెస్టు చేశారు” అన్నాడు. గార్షియా,

            “ఎందుకు?

            “తెలియదు. మాట వినని వాళ్లందర్నీ అరెస్టు చేస్తున్నారు. గ్రీస్ కూడా దొరికాడు”

            “ఎప్పుడు? అంటూ అడిగాను ఆశ్చర్యంగా,

            “ఉదయం. చేజేతులా చేసుకున్నాడులే”

కజిన్‌తో పోట్లాడి ఇల్లు వదిలాడు. “దాక్కోవాలంటే అనేక ఇళ్లున్నాయి. కాని ఎవరి సహాయమూ అర్థించదలచుకోలేదు. ఇబీటా ఇంటికి పోదామనుకున్నాను. కాని అతణ్ణి పట్టుకున్నారు. ఇక స్మశానంలో దాక్కుంటాను” అన్నాడట.

            “సీమెటరీలో?”

            “ఆఁ బిగ్ ఫూల్. ఫలాంజిస్టులు వెదుకుతూ వచ్చారు. గ్రేవ్ డిగ్గర్ టెంట్లో దొరికాడు”

            “సిమెటరీలో?”

            కళ్లముందు లోకం గిర్రున తిరిగింది. ఏడ్చాను. నవ్వాను. మొత్తుకున్నాను. నేల మీదపడి దొర్లాను… *

జీన్ పాల్ సార్త్ర్

ప్రఖ్యాత తత్త్వవేత్త జీన్ పాల్ సార్త్ర్ జూన్ 21న 1905 సవత్సరంలో ప్యారిస్‌లో జన్మించాడు. బాల్యం లోనే తండ్రి మరణించాడు. తల్లీ, మాతామహుల పెంపకంలో చదువు ప్రారంభమైంది. (సార్త్ తన శైశవాన్ని గురించి రాసిన ఆత్మ కథ 'వర్డ్స్'). 1925లో తత్వశాస్త్రంలో పట్టభద్రుడైనాడు. ఆ తర్వాత కొంతకాలం లేన్, లీహార్వే, న్యూలీలలో విద్యాబోధన. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ప్రతిఘటనోద్యమంలో చేరాడు. సార్త్ 1940లో జర్మన్ సేనలకు చిక్కి తొమ్మిది నెలలు యుద్దఖైదీగా గడిపాడు. విడుదల తర్వాత ఒక రహస్య పత్రిక 'కాంబాట'కు రచనలు చేశాడు. ఆ పత్రిక సంపాదకుడు, మరో నోబెల్ గ్రహీత అయిన ఆల్బర్ట్ కామూ. సార్త్ర్ అధ్యాపక వృత్తిలో ఉన్నప్పుడు ఈజిప్టు, జర్మనీ, గ్రీస్ దేశాలు పర్యటించాడు. ఆ దశలోనే ఎడ్మండ్ హసెర్ల్, మార్టిన్ హైడెగర్, సోరెన్ కేర్క్ ర్డ్ల తాత్విక ధోరణులు అతణ్ణి ప్రభావితం చేశాయి. 1964లో నోబెల్ బహుమతిని తిరస్కరించి మేధావి లోకాన్ని షాక్ చేశాడు. 'సెకండ్ సెక్స్' రచయిత్రి సిమోన్ దుబో దాతో గడిపిన సహజీవనం (వివాహం కాలేదు) జగద్విదితం.

'ఎగ్జిస్టెన్షియలిజం' (అస్తిత్వవాదం) తాత్విక ధోరణిని సార్త్ర్ కొత్తగా ప్రతిపాదించినప్పటికీ, దానికి అతడి రచనలు- ముఖ్యంగా బీయింగ్ అండ్ నథింగ్‌నెస్ (1943) వల్ల ప్రాచుర్యం వచ్చింది. సమకాలికులకూ, తర్వాతితరం మేధావులకూ, రచయితలు, కళాకారులకూ ఒక సరికొత్త లౌకిక దృష్టిని పరిచయం చేసింది.

ముక్తవరం పార్థసారథి

సుప్రసిద్ధ కథకుడు, నవలాకారుడు, అనువాదకుడు ప్రగతిశీల మేధావి ముక్తవరం పార్థసారథి గారు జులై 7, 1944 న భువనగిరిలో జన్మించారు. అసంఖ్యాకమైన ప్రపంచ ప్రసిద్ధ కథలను తెలుగులోకి అనువదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాక్ లండన్, బాల్జాక్ వంటి ప్రసిద్ధ రచయితల జీవితాలను, వాళ్ళ రచనలను తెలుగువాళ్లకి పరిచయం చేశారు. కథ, నవల, విమర్శ, వ్యాస రచన, సాహిత్య చరిత్ర, అనువాదం ఇలా ప్రతి ప్రక్రియలోనూ పార్థసారథిగారు తమదైన ముద్రవేశారు. రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసారు. ఈ సంవత్సరం మార్చ్ 4 న ఈలోకం నుంచి సెలవు తీసుకున్నారు.


Spread the love

One thought on “గోడ

  1. చాలా గొప్ప కథ కళ్ళు తిరిగి పోయే కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *