గాలికి వంటింట్లో కిటికీ తలుపు కొట్టుకుంటూ వుంటే హాల్లో నుంచి వంటింట్లోకి పరిగెత్తుకు వచ్చింది శారదమ్మ. ఇప్పుడా కిటికీ అద్దం బద్దలవుతే నందిని తనని బతక నివ్వదు. కిటికీ మూస్తూ బయట ఆకాశం కేసి చూస్తూ ఉలిక్కి పడింది శారదమ్మ. ఆరున్నరకే ఆకాశం నల్లటి గొంగళి కప్పుకున్నట్లుగా అంతా చిమ్మ చీకటి గా వుంది. వెర్రి గాలి వీస్తున్నా కదిలి పోకుండా ఆకాశం అంతా చిక్కగా, దట్టంగా అలుము కుని వున్న మబ్బులు!
‘‘ సందేహం లేదు! ఇప్పుడు కుంభవృష్టి కురవడం ఖాయం. కరెంట్ పొకపోతే అంతే చాలు. అసలే చీకటంటే తనకు దడ!‘‘ కిటికీ తలుపు మూసి గడియ పెట్టేసింది శారదమ్మ.
అనుకున్నంతా అయింది. హాల్లో కి వస్తూండగనే కరెంట్ పోయింది. కిటికీ లోనుంచి ఆగకుండా మెరుస్తున్న మెరుపులు, హోరు గాలి, చుట్టూ చీకటి! ఒక్కసారిగా వాతావరణం భయంకరంగా మారి పోయింది. పెద్ద శబ్దం తో వర్షం కూడా మొదలయింది. తడుముకుంటూ తన గదిలోకి వెళ్ళి, తన మంచం పక్కన స్టూలు మీద ఉంచుకునే టార్చి లైటు తడిమి చేతిలోకి తీసుకుంది శారదమ్మ. టార్చ్ వెలుగులో ఇల్లంతా వెతికి సగం కాలి వున్న లావుపాటి ఎర్రరంగు క్యాండిల్ పట్టుకుని వెలిగించి హాల్లో టీపాయ్ మీద పెట్టి, సోఫా లో కూర్చుంది. వారం రోజుల క్రితం ఇన్వెర్టర్ పాడయింది. అది మార్చే తీరుబాటు లేదు భాస్కర్ కి.
కొడుకూ కోడలూ తమ మూడవ పెళ్లి రోజు కేరళ లో ఏదో హిల్ స్టేషన్ లో జరుపు కోవాలని మధ్యాహ్నం బయలు దేరి వెళ్లారు.
‘‘ అమ్మా, శనివారం సాయంత్రం కల్లా వచ్చే స్తాం. మందులన్ని నిన్ననే తెచ్చి పెట్టాను. వెనక వీధి లో వుండే మా ఫ్రెండ్ ప్రదీప్ ప్రతి రోజు ఏదో ఒక సమయంలో వచ్చి నిన్ను చూసి వెళతానని చెప్పాడు. ఫ్రిడ్జ్ లో వారానికి సరిపడే కూరలు వున్నాయి. ఏమైనా కావలసి వచ్చినా ప్రదీప్ తెచ్చి పెడతాడు ‘‘ ముందు రోజు రాత్రే భోజనం బల్ల దగ్గర తల్లికి చెప్పాడు భాస్కర్.
‘‘ శనివారం అంటే ఎన్ని రోజులు?”‘‘ వేళ్ళతో రోజులు లెక్క పెట్టు కుంటోంది శారదమ్మ.‘‘ అన్నాళ్లే!‘‘
‘ ‘ ఎన్నాళ్ళు, ఐదు రోజులే కదా! ఎప్పుడు వెళ్ళినా ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తున్నాం! పెళ్ల య్యాక మీరు ఒక్కరే వుంటారని హనీమూన్ కి కూడా వెళ్ళ లేదు. మూడేళ్ల తరువాత ఐదు రోజుల ట్రిప్ కి వెళతాం అంటే, లక్కీ లిక్కీ అంటున్నారు మీరు. ఇదేమైనా బావుందా?‘‘ నందిని గొంతులో నిష్టూరం!
‘‘ అయ్యో, ఇప్పుడు నేను మిమ్మల్ని వెళ్ళద్దని అనడం లేదు తల్లీ! రోజులు లెక్క వేసుకున్నా నంతే! మీరు క్షేమం గా వెళ్ళి లాభం గా రండి.‘‘ కంగారుగా అంది శారదమ్మ.
‘‘ వీధి తలుపు వేసుకునే వుండు. రాత్రి ఎవరు తలుపు తట్టినా తీయకు! నేను రోజూ ఫోన్ చేస్తూ వుంటానులే!‘‘ అన్నాడు భాస్కర్.
‘‘ ఆ రంగమ్మ ఇల్లు ఊడుస్తూ వుంటే వెనకే వుండండి. అది పని చేసుకున్నంత సేపూ దాని మీద ఒక కన్నేసి వుంచండి. దానిది దొంగ బుద్ధి అని ప్రదీప్ వాళ్ళ ఆవిడ అంది నాతో!‘‘
‘‘ అలాగే! అది పనంతా చేసుకుని వెళ్ళాకే, నేను వీధి తలుపు మూసుకుని స్నానానికి వెళతాను,‘‘
‘‘ వంట అయ్యాక మర్చి పోకుండా స్టవ్ కట్టేస్తూ వుండండి. మొన్న కాఫీ కలుపుకుని స్టవ్ అలాగే వదిలేశారు.‘‘
అలాగే అన్నట్లు తల వూపింది శారదమ్మ.
పొద్దున్న విమానాశ్రయానికి బయలు దేరే ముందు కూడా, ‘‘ రాత్రి ఎవరైనా తలుపు కొడితే ఎట్టి పరిస్థితుల్లో తలుపు తీయద్దు!‘‘ అంటూ ఒకటికి రెండు సార్లు తల్లికి చెప్పి వెళ్ళాడు భాస్కర్. అన్న మాట ప్రకారం కొచ్చిన్ లో విమానం దిగగానే , హోటల్ కి వెళుతున్నట్లు గా కాల్ చేసి చెప్పాడు.
కిటికీ లోంచి నిరంతరం మెరుస్తున్న మెరుపులు చూస్తూ భయం భయంగా కూర్చుని వుంది శారదమ్మ. మెరుపు మెరిసిన వెంటనే భయపెడుతూ వురుము! “ అర్జునా, ఫల్గుణ, పార్థా, కిరీటి” రెండు చెవులూ మూసుకుని అర్జున నామాలు స్మరిస్తోంది శారదాంబ.
రాజారాం తో పెళ్ళి అయిన పదేళ్ల దాకా సంతానం లేదు శారదమ్మ కి. లేక లేక పుట్టిన భాస్కర్ ని ప్రాణప్రదంగా పెంచుకుంది శారదమ్మ. రాజారాం చిల్లర కొట్టు నడిపేవాడు. భాస్కర్ కి ఐదేళ్లు వుండగా బస్సు ప్రమాదం లో శారదమ్మ కి దూరం అయ్యాడు రాజారాం. అప్పటినుం చీ తనే దుకాణం నడుపుతూ కొట్టు మూసాక కారప్పూస, , జంతికలు, పప్పు వుండలు అర్ధరాత్రి దాకా కూర్చుని చేసి, వాటిని కూడా అమ్ముతూ కొడుకును కష్టపడి చదివించు కుంటూ వచ్చింది శారదమ్మ.
భాస్కర్ ను గొప్ప వాడిగా చూడాలనే ఒకే ఒక లక్ష్యం తో రెక్కలు ముక్కలు చేసుకుంది. భాస్కర్ చదువు తప్ప వేరే ప్రపంచం లేనట్లుగా పెరిగాడు. తల్లి కష్టార్జితం కి తోడు స్కాలర్ షిప్ లు, దాతల విరాళాలతో తను కలలు కన్న ఐఐటి చదువు సాధ్య పడింది భాస్కర్ కి.భాస్కర్ IIT ఢిల్లీ లో ఆఖరి సంవత్సరం లో వుండగానే అతనికి యాభై లక్షల పైన పాకేజీ తో అనేక కంపెనీ ల నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే తల్లి కోసం జీతం తక్కువైనా హైదరాబాద్ కంపెనీ లోనే చేరాడు భాస్కర్.
భాస్కర్ తండ్రి రాజారాం హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. ఇక్కడే మట్టిలో కలసి పోయాడు.అందుకే హైదరాబాద్ ఒదిలి పెట్టడానికి ఇష్ట పడదు శారదమ్మ . వుద్యోగం లో చేరగానే ముందు తల్లి తో కొట్టు అమ్మించేసి , తల్లి కోరిక మీద అత్తా పూర్ లో మూడు వందల గజాలలో వున్న ఇల్లు కొన్నాడు భాస్కర్ . శారదమ్మ కి ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవడం అంటే సరదాఅని!
ఒక్క సారిగా శారదమ్మ జీవితం వూహించ లేనంత గొప్పగా మారి పోయింది. పెద్ద ఇల్లు , ఎక్కడికి వెళ్లాలన్నా కారు లో తీసుకెళ్లే కొడుకు! రాజారాం కి కొడుకు ఉన్నతిని చూసే అదృష్టం లేక పోయిందనే బాధ తప్పించి , జీవితం హాయిగా గడిచి పోతోంది శారదమ్మ కి.ఉద్యోగం లో చేరిన నాలుగేళ్లకు తనతో పాటే పని చేసే నందినిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు భాస్కర్.
ఎందుకో మరి, నందినికి ముందు నుంచీ అత్తగారంటే చిన్న చూపే! శారదమ్మ ఎంత ప్రేమగా మాట్లాడాలని చూసినా , విసురుగా సమాధానం చెప్పేది. అత్తగారితో ఆంటీ ముట్టనట్లుగా వుండేది . పైగా తరచు చులకన చేసి మాట్లాడేది. అయితే కొడుకు మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఈ విషయాలు ఏవీ భాస్కర్ కి తెలియ నిచ్చేది కాదు శారదమ్మ. భాస్కర్ కి మాత్రం తనని అష్టకష్టాలు పడి ఇంత వాడిని చేసిన తల్లి అంటే అమితమైన ప్రేమ. శారదమ్మ సంగతి చెప్ప నవసరం లేదు. కొడుకు మీద నే ప్రాణాలు పెట్టుకుని బతుకు తోంది.
వీధి తలుపు ఎవరో దడ దడా బాదుతూ వుంటే, ఏవో ఆలోచనల్లో వున్న శారదమ్మ ఉలిక్కి పడి ఈ లోకం లోకి వచ్చింది.
‘‘ ఇంత వర్షం లో ఇప్పుడు ఎవరు వచ్చి వుంటారు?‘‘ గోడ గడియారం వైపు చూస్తూ అనుకుంది శారద. టైమ్ ఏడూ పది.
‘‘ ఎవరది?‘ ‘ సోఫా లోనుంచి లేచి నిలబడి గట్టిగా అరిచింది.
సమాధానం లేదు , కానీ మళ్ళీ దబ దబా తలుపు బాదేస్తున్నా రు ఎవరో!
‘‘ ఎవరంటే సమాధానం చెప్ప రేం?‘‘ ఈ సారి వీధి తలుపు దగ్గరకు వెళ్ళింది శారదమ్మ.
ఆ వైపునుంచి ఎటువంటి సమాధానం లేదు కానీ, తలుపు ఇంకా గట్టిగా చప్పుడు చేయడం మొదలయింది.
మొదటి సారి శారదమ్మ కు భయం వేసింది. సమాధానం చెప్పకుండా అంత గట్టిగా తలుపు ఎవరు బాదు తున్నట్లు? కొంపదీసి తను ఒక్కత్తే ఇంట్లో వున్నట్లు ఏ దొంగ వెధవైనా కనిపెట్టాడా?
తలుపు పక్కన ఎప్పుడూ వేసివుండే కిటికీ తలుపు తెరిచి బయటకు చూసింది శారదమ్మ. బయటంతా చిమ్మ చీకటి. పెద్దగా చప్పుడు చేస్తూ వర్షం. మెరుపు వెలుగులో గుమ్మం దగ్గర ఏదో ఆకారం అస్పష్టంగా కనిపించింది.
‘‘ ఎవరని అరుస్తూ వుంటే సమాధానం చెప్పరేం? మా ఇంటి తలుపు ఎందుకు కొడుతున్నారు? అసలు అడగకుండా గేటు తీసుకుని లోపలికి ఎందుకు వచ్చారు?”
శారదమ్మ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మళ్లీ తలుపు బాదుతూ, “ ఇది రామారావు గారి ఇల్లేనా చెప్పండి!” అన్న మాటలు సన్నగా వినిపించాయి, అది ఆడ గొంతు అవడం తో కొద్దిగా ధైర్యం వచ్చింది శారదమ్మ కి.
“ కాదు, ఇది రామా రావు గారి ఇల్లు కాదు. మీరు వీధి గేటు వేసి వెళ్ళి పోండి!” అంది గట్టిగా.
ఆ ఆకారం చిన్నగా కదిలి కిటికీ దగ్గరకు వచ్చింది. మెరుపు వెలుగులో దాదాపు ఒక యాభై యేళ్ళ ఆడమనిషి. వర్షం లో పూర్తి గా తడిసి పోయి చలికి వణుకు తోంది. భుజాన ఒక బ్యాగు వ్రేలాడు తోంది.
ఆమె కిటికీ దగ్గరకు వచ్చి, “ నాకు చెముడు! మీ మాటలు వినబడడం లేదు. ఇది రామా రావు గారిల్లు కాక పోయినా ఒకసారి తలుపు తెరవండి, చీర పూర్తిగా తడిసి పోయి
చలే స్తోంది. లోపలికి వచ్చి చీర మార్చుకుని, వర్షం కాస్త తగ్గ గానే వెళ్ళి పోతాను.” అంది ఒణుకు తూన్న గొంతు తో.
శారదమ్మ కు ఏం అనాలో తోచలేదు. తలుపు తీద్దామంటే కొడుకు ఒకటికి నాలుగుసార్లు చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి.” రాత్రి ఎవరు తలుపు కొట్టినా తీయకు!”
“ ఇంట్లో ఎవరూ లేరు. మీరు మరో ఇంటికి వెళ్ళండి” అవే మాటలు రెండు సార్లు గట్టిగా చెప్పాక, “ ఈ వర్షం లో ఎలా వెళతాను చెప్పండి. దయచేసి ఒకసారి తలుపు తెరవండి” ఆంది ఆమె .
శారదమ్మ సమాధానం యేమీ చెప్పకుండా ఆమెనే చూస్తూ నిలబడి పోయింది.
ఆమె ఏం అనుకుందో, “ నేను దొంగను కాను. తాడేపల్లి గూడెం లో వంటలు చేసుకుంటూ బతికే దాన్ని.”
“ అక్కడినుంచి ఇక్కడికి ఎందుకు వచ్చి నట్లు?” అంటూ శారదమ్మ మళ్ళీ రెండు సార్లు రెట్టించింది.
“ ఒక పెళ్ళి లో హైదరాబాదు నుంచి వచ్చిన ఆవిడ , హైదరాబాదు లో మా అన్నయ్య ఇంట్లో వంట పనీ, ఇంటి పనీ చెసే వాళ్ళు కావాలని తన వెంట నన్ను తీసుకు వచ్చింది “ అంది ఆవిడ గొంతు పెంచి .
శారదమ్మ ఎమీ మాట్లాడక పోయేసరికి తన మాటల మీద ఆవిడకు నమ్మకం కలగడం లేదని అనుకుందో ఏమో ఆవిడ మళ్ళీ తనే “ నేను నా అంటూ ఎవరూ లేని వంటరిదాన్ని . వెంటనే ఆవిడతో బయలు దేరి వచ్చేసాను. ఆవిడ సికింద్రబాద్ స్టేషన్ లో అత్తాపూర్ కి ఆటొ మాట్లాడి నన్ను ఎక్కించి , ఈశ్వర్ థియేటర్ దగ్గర నిలబడి ఉంటే వాళ్ళ ఆన్నయ్య వచ్చి తీసుకు వెళతాడని , వెనక వైపు వుండే వాళ్ళ ఇల్లు నేను వెత్తుక్కోలేనని, ఒక కాగితం మీద ఫోన్ నవంబర్ రాసి ఇచ్చింది. నేను ఈశ్వర్ థియేటర్ దగ్గిర ఆటో దిగి ఆయనకి ఫోన్ చేస్తే కలవ లేదు.హడావిడి లో ఆవిడ నంబరు తప్పుగా వ్రాసారు. ఇందులో తొమ్మిది అంకెలే వున్నాయి.” బ్యాగు లోనుంచి ఏదో కాగితం తీసి శారదమ్మ కి చూపించ బోయింది ఆవిడ.
“ఈ చీకట్లో ఏం కనిపిస్తుంది లే!” అంటూ ఆ కాగితం తీసుకోలేదు శారదమ్మ.
“ గంట పైగా కాళ్ళు అరిగేలా ఆ రామా రావు గారి గురించి వాకబు చేస్తూ ఇళ్లన్నీ తిరుగుతున్నాను. వాళ్ళ ఇల్లు దొరక లేదు కానీ , ఇలా వర్షం లో తడిసి ముద్దయి, చలి కి వణుకు తున్నాను. మీకు పుణ్యం వుంటుంది కాస్త తలుపు తెరుద్దురూ!”
శారదమ్మ ఎమీ మాట్లాడకుండా కిటికీ తలుపు మూసి, మళ్లీ వచ్చి సోఫా లో కూర్చుంది. తలుపు తీయకపోతే కాస్సేపు చూసి ఆవిడే మరో ఇంటికి వెళ్లి పోతుంది అనుకుంది.కానీ అలా జరగలేదు. ఆవిడ తలుపు బాదుతూనే వుంది. ఆవిడ ప్రమాద కరమైన మనిషి లా కనబడ లేదు. పైగా పూర్తి గా తడిసి పోయి వుంది. ఈ వర్షం లో పాపం ఎక్కడికి వెళుతుంది? చీర మార్చుకుని వర్షం తగ్గ గానే వెళ్ళి పోతా నంటూ బ్రతిమి లాడుతోంది. కష్టం లో వున్న మనిషిని నిర్దయగా వెళ్ళి పొమ్మని కసరడాని కి మనసు ఒప్పుకోలేదు శారదమ్మ కి. ఏమైతే అది అవుతుందని వెళ్ళి తలుపు తీసింది. ఆవిడ వెంటనే లోపలికి వచ్చి చీకట్లో గోడ వార నిలబడి బట్టలు మార్చు కుంది.
“ ఇప్పుడు కాస్త ప్రాణం కుదుట పడింది. ఏం వర్షం? పైగా చల్లటి ఈదురు గాలి. ఒళ్లు కొంకర పోయిందంటే నమ్మండి.” ఆవిడ ఒక మూల వున్న మోడా మీద కూర్చుంది.
“ మీ పేరేమిటి?” ఆమెనే పరీక్షగా చూస్తోంది శారదమ్మ.
“ చెప్పానుగా తాడేపల్లి గూడెం “ అంది ఆవిడ.
ఆవిడకి పేరేంటి అని అడిగితే ఊరేంటి అని వినబడి నట్లు వుంది,.
ఆవిడతో మాట్లాడాలంటే గట్టిగా ఒకటికి రెండుసార్లు అరచి చెప్పాలి అని అర్థం అయిపోయింది శారదమ్మ కి.అందుకే ఇక ఏమీమాట్లాడకుండా మౌనంగా కూర్చుంది .ఆవిడ కృష్ణుడి మీద చిన్నగా ఏవో పాటలు పాడు తోంది. రాత్రి ఎనిమిది దాటింది, ఎక్కడా వర్షం తగ్గే సూచన లేదు. శారదమ్మ కి ఆకలి వేస్తోంది, సాయంత్రం రెండు చపాతీ లే చేసుకుంది, ఒక పళ్ళెంలో పొద్దున్న చేసిన వంకాయ కూర తో పాటు ఒక చపాతీ, దేముడి మందిరం లో వున్న అరటి పండు వేసి ఆవిడకు ఇచ్చింది. మంచి ఆకలి మీద వుందేమో మారు మాట్లాడకుండా ప్లేటు అందుకుంది ఆవిడ. తను మిగిలిన ఒక చపాతీ తిని, రెండు గ్లాసుల్లో మజ్జిగ కలిపి తీసుకు వచ్చింది శారదమ్మ.
ఆవిడ మజ్జిగ తాగి , వాష్ బేసిన్ లో ప్లేటు, గ్లాసు కడిగేసి వాటిని వీధి తలుపు పక్కనే ఉన్న కిటికీ లో పెట్టింది.
వర్షం వేగం హెచ్చింది. ఎక్కడా తగ్గే సూచనలు లేవు. రాత్రి తొమ్మిది కాగానే పడుకోవడం అలవాటు శారదమ్మ కి.
“ నాకు నిద్ర వస్తోంది! మీరేం చేస్తారు?” అని గట్టిగా అడిగింది.
“ అయితే మీరు పడుకోండి. నేను వెళ్ళి పోతాను!” అంది ఆవిడ పక్కనే వున్న బ్యాగు అందుకుంటూ.
“ ఒక పక్క చీకటి, వర్షం! ఎలా వెళతారు?” అప్రయత్నంగా అంది శారదమ్మ.
ఆవిడకు ఆ మాటలు వినబడక లేచి నిలబడింది.
శారదమ్మ ఆవిడకు గోడ వార వున్న దీవాన్ చూపించి, దాని మీద పడుకోమన్నట్లుగా సైగ చేసింది.
తనని ఆ వర్షం లో వెళ్ళి పొమ్మని అన నందుకు రెండు చేతులూ జోడించింది ఆవిడ,
ఇల్లంతా వెతికి మరో కొవ్వొత్తి వెతికి పట్టుకుంది శారదమ్మ. అది వెలిగించుకుని తెచ్చి తన గదిలో కిటికీ లో పెట్టింది. పడుకుందన్న మాటే కానీ చాలా సేపటి వరకూ నిద్ర పట్టలేదు శారదమ్మ కు. నిద్ర పడుతూండ గా కరెంట్ వచ్చింది. లేచి వెళ్ళి, వంటింట్లోనూ, హాల్లోనూ వెలుగు తున్న లైట్లు ఆర్పి వచ్చింది. ముందు గదిలో నుంచి ఆవిడ గురక సన్నగా వినిపిస్తోంది. మళ్లీ తన గదిలో కి వచ్చి కొవ్వొత్తి ఆర్పి, బెడ్ లైట్ వేసుకుంది శారదమ్మ.
నిద్ర పడుతూండగా కొడుకు గదిలో ఏదో అలికిడై మెలుకువ వచ్చింది శారదమ్మ కి. ఆ గదిలో లైట్ వేసినట్లుగా హాల్లొకి వెలుగు కనిపిస్తోంది. చప్పున లేచి గబ గబ కొడుకు గది వైపు నడిచింది శారదమ్మ. లోపలి దృశ్యం చూసి శారదమ్మ నోట మాట రాలేదు. లోపల బీరువా తలుపు తెరిచి, బట్టలన్నీ క్రింద పారేసి, డబ్బు కోసం కాబోలు వెతుకుతోంది ఆ ఆడ మనిషి.
“ దొంగ… దొంగ. “ గట్టిగా అరవాలని చూసింది శారదమ్మ. అయితే తన గొంతు తనకే కీచుగా వినిపించింది.
ఆవిడ గిరుక్కున వెనక్కి తిరిగి , చేతి లో వున్న పదునైన కత్తి చూపిస్తూ, “ నోరు మూసుకుని కూర్చో ముసలి దానా! పీక కోస్తా జాగ్రత్త” అంది కఠినంగా.
శారదమ్మ ఎలాగో ధైర్యం తెచ్చుకుని, “ దొంగ… దొంగ” అంటూ గట్టిగా ఆరవాలని చూసింది, మరుక్షణం ఆవిడ మెరుపు లా వచ్చి , శారదమ్మ తల గోడకు ఆనించి, సర్రున కత్తి తో శారదమ్మ పీక కోసేయాలని చూసింది,
“ నన్ను చంపకు. వదిలేయ్.. చంపకు… నన్ను చంపకు. “ అని కేకలు పెడుతూ మంచం మీద లేచి కూర్చుంది శారదమ్మ. తను తన గదిలోనే మంచం మీద క్షేమంగా వుంది.
అంటే ఇప్పటి దాకా తను చూసింది కల అన్నమాట! ముందు గదిలో నుంచి ఆ ఆడ మనిషి గురక వినిపిస్తూనే వుంది. భారం గా నిట్టూర్చి, కాసిన్ని మంచి నీళ్ళు తాగి,బలవంతంగా కళ్లు మూసుకుంది శారదమ్మ.
మళ్లీ ఆమెకు మెలుకువ వచ్చేసరికి తెల్లగా తెల్లవారి పోయింది. గోడ గడియారం టైమ్ ఏడు చూపిస్తోంది. గబగబా మొహం కడుక్కుని వీధి గదిలోకి వచ్చింది. ఆవిడ ఇంకా నిద్ర లేవ లేదు. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చుకుంది. సోఫా లో కూర్చుని ఆవిడ నే చూస్తూ కాఫీ తాగి, గ్లాసు సింక్ లో పడేసి వచ్చింది. ఆవిడకు కాఫీ ఇచ్చి పంపించేయాలి! అయితే ఆవిడను అరిచి లేపడం కుదరదు.
“ పొద్దు పోయింది. ఇక లేవండి!” అంటూ ఆవిడ ఒంటి మీద చేయి వేసి, షాక్ కొట్టినట్లు గా చేయి వెనక్కి తీసుకుంది శారదమ్మ.ఆవిడ ఒళ్లు మంచు లా చల్లగా వుంది. పరీక్షగా చూస్తే ఆవిడ ఊపిరి తీసుకోవడం లేదన్న సంగతి అర్థం అయిపోయింది. పైగా ఒళ్లు బిగుసుకు పోయి వుంది.
శారదమ్మ కు కాలూ చేయీ ఆడ లేదు. సందేహం లేదు. ఆవిడ చచ్చి పోయింది!. ఎవరో తెలియదు. పేరు కూడా చెప్ప లేదు. తన ఇంట్లోకి వచ్చి చచ్చి పోయింది. ఇప్పుడేం చేయాలి? కొడుకు కు తెలిస్తే ఎంత బెంబేలు పడి పోతాడు? అంతా అయోమయంగా వుంది.
ఇంతలో వంటింట్లో తన సెల్ మోగింది. తడబడుతున్న అడుగులతో వంట గదిలోకి వెళ్ళి సెల్ చేతిలోకి తీసుకుంది. కొడుకే చేస్తున్నాడు!
“ హాల్లో” అని అన్నానని అనుకుం ది కానీ ఆ గొంతు అవతల వైపు కు వినబడనే లేదు.
“ అమ్మా, నేను భాస్కర్ ని. కాస్సేపట్లో బయలు దేరి మున్నార్ వెళుతున్నాం. నువ్వెలా ఉన్నావు?”
శారదమ్మ కి నోరు పెగలడం లేదు.
“ నిన్నే! మాట్లాడ వేం? ఒంట్లో బాగానే ఉంది కదా”
“ నేను బాగానే ఉన్నాను. కానీ నిన్న రాత్రి…. “ అంటూ జరిగిందంతా కొడుకుకి పూస గుచ్చినట్టు చెప్పేసింది శారదమ్మ
“ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? అయినా రాత్రి ఎవరు తలుపు కొట్టినా తీయద్దని చెప్పాను కదా!”
“ చెప్పావనుకో! కానీ పెద్దావిడ రా, వర్షం లో తడిసి పోయి వుంటేనూ!”
“ అంటే ఎవరో ముక్కూ మొహం తెలియని ఓ మనిషి శవం ఇప్పుడు మన ఇంట్లో వుందన్న మాట! ఎంత పని చేశారు? ఇప్పుడు ఆవిడ చావు మన మెడకు చుట్టు కుంటుంది. ముందు పోలీసులు వస్తారు” కోడలి మాటలకు హడలి పోయింది శారదమ్మ.
“ ఇప్పటి కైనా నేను చెప్పినట్లు చేయి. మేము తిరుగు ప్రయాణమై వచ్చేస్తాం.మేము వచ్చే సరికి మధ్యాహ్నం దాటుతుంది. అప్పటి దాకా ఎవరు తలుపు కొట్టినా తీయకు. ఎవరి కై నా తెలిస్తే గొడవ అయిపోతుంది. పది మంది మూగుతారు.నేను వచ్చాక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పి వస్తాను.”
“ మీ పుణ్యాన మా పెళ్ళి రోజు హిల్ స్టేషన్ లో కాదు పోలీస్ స్టేషన్ లో జరుపు కోవాల్సి వస్తోంది. పైగా టికెట్స్ కేన్సిల్ చేస్తే లక్షరూపాయలకు పైగా నష్టం..” నిష్టూరంగా అంది నందిని.
శారదమ్మ మౌనంగా వుండి పోయింది.
“ సరేలే! కంగారు పడకు. మేం వచ్చేదాకా జాగ్రత్త గా వుండు. మళ్లీవిమానం ఎక్కాక కాల్ చేస్తాను,” ఫోన్ పెట్టేసాడు భాస్కర్.
శారదమ్మ గుండెలు దడ దడ లాడి పోతున్నాయి. ఒళ్లంతా చెమటలు. ఇంట్లో శవాన్ని పెట్టుకుని , మధ్యాహ్నం దాకా ఒంటరిగా ఈ ఇంట్లో ఎలా వుండాలి? తలుపు తీయడానికి కూడా లేదు. ముందు గదిలో కి వెళ్ళడానికి భయంగా వుంది. స్నానం చేసి వచ్చి, తన గదిలో నే కుర్చీ లో భగవద్గీత చదువుకుంటూ కూర్చుంది. ధ్యాస పుస్తకం మీద లేదు. రాత్రి కృష్ణుడి మీద అంత చక్కని పాటలు పాడిన ఆవిడ గొంతు ఇప్పుడు మూగ బోయింది, రేపు తన పరిస్థితి కూడా అంతే కదా! ఇంట్లో వున్న ఇద్దరూ పగలు ఎనిమిదింటికి వెళితే రాత్రి మళ్లీ ఎనిమిది దాటాక వస్తారు. ఈ లోపల తనకు ఏమైనా అయితే , ముందు గదిలో పడుకుని వున్న ఆవిడలా అలా ఒళ్లంతా కొయ్య బారి పోయి పడి వుండాలి. నిజంగా జీవితం ఎంత విచిత్ర మైంది? ఎప్పటి దాకా ఉంటామో, ఎప్పుడు ఎలా వెళ్ళి పోతామో ఎవరికీ తెలియదు. లేక పోతే తాడేపల్లి గూడెం లో వంటలు చేసుకునే ఆవిడ తన ఆఖరి మజిలీ హైదరాబాదు లో ఓ అపరిచితుల ఇంట్లో అని అనుకుని వుంటుందా?
కాలింగ్ బెల్ మోగేసరికి ఉలిక్కి పడింది శారదమ్మ. ఎవరు వచ్చి వుంటారు? ఎవరు వచ్చినా అబ్బాయి తలుపు తీయ వద్దని గట్టిగా చెప్పాడు. అయినా తలుపు తీయ డానికి ముందు గది లోకి వెళ్ళే ధైర్యం లేదు. కాలింగ్ బెల్ మళ్లీ మళ్లీ మోగుతోంది. బహుశా పనిమనిషి వచ్చి వుంటుంది. అది తలుపు తీయక పోతే కంగారు పడి, చుట్టు పక్కల వాళ్ళను తీసుకొస్తే అదో తల నొప్పి. ప్రాణాలు ఉగ్గ బెట్టుకుని , చచ్చి పోయిన వంటావిడ పడుకున్న దివాను వైపు చూడకుండా , తలుపు దగ్గరకు వెళ్లి, “ ఎవరూ?”అంది గట్టిగా.
“ నేనండీ, రంగమ్మని. తలుపు తెరవండి” అంది పని మనిషి.
అది ఇంట్లో శవాన్ని చూస్తే ఇంకేమీ లేదు. అన్ని ఛానల్ వాళ్ళకి వార్త తెలిసి పోతుంది!
“ పనేమీ లేదు. నువ్వు వెళ్ళిపో!” అంది శారదమ్మ
“ అదేంటి, అలా అంటున్నారు? ఇల్లు తుడవాలి, అంట్లు తోమాలి, మీ బట్టలు వుతకాలి…. “ అంటూ ఇంకా ఏదో చెప్పుకు పోతోంది రంగమ్మ.
“ నన్ను విసిగించకు. ఈ పూట పని లేదని చెప్పాను కదా, ఇక వెళ్ళిపో!” అంది గట్టిగా. “ మళ్లీ మళ్లీ కాలింగ్ బెల్ కొట్టి నాకు చిరాకు తెప్పించకు.”
ఏదో గొణుగుతూ వెళ్ళి పోయింది రంగమ్మ.
“ హమ్మయ్య! ఓ గండం గడిచింది” మళ్లీ తన గదిలో కి వచ్చి కూర్చుంది శారదమ్మ. భారం గా కదులు తోంది కాలం.రెండు అయ్యాక దేముడి మందిరం లో వున్న అరటి పండు తిని మంచి నీళ్ళు తాగేసింది. కొడుకు వచ్చాక ఏం చేస్తాడు? నందిని చెప్పినట్లు గా పోలీసులు వస్తారా? తనని పోలీస్ స్టేషన్ కి తీసుకు పోతారా? తీసి కెళ్ళి ఏం చేస్తారు? కొడతారా? తనేం తప్పు చేసింద ని కొడతారు? దొరక్క దొరక్క ఆ వంటలక్కకి ఈ ఇల్లే దొరికింది, అదీ తను ఒక్కత్తే వున్నప్పుడు! అనుకోని ఈ సంఘటన ఎక్కడికి దారి తీస్తుందో? దీని పరిణామం ఎలా వుంటుందో? కుర్చీ లో కూర్చున్నది కూర్చున్నట్లు గా వుంది శారదమ్మ. ఒళ్లంతా చమట, ఒకటే నీరసం, నిస్సత్తువ. నాలుగవుతూండగా కాలింగ్ బెల్ మోగింది. ఎవరు వచ్చారో? సాయంత్రం పని కని మళ్లీ రంగమ్మే వచ్చిందా? ఇంతలో టీపాయ్ మీది సెల్ మోగింది. భాస్కర్ చేస్తున్నాడు. చప్పున మొబైల్ చేతిలోకి తీసుకుంది శారదమ్మ.
“ వచ్చింది మేమే! తలుపు తీయి!” అన్నాడు భాస్కర్.
కొడుకు గొంతు వినగానే ఎక్కడ లేని శక్తి వచ్చింది శారదమ్మ కి. పరుగు లాంటి నడకతో వెళ్ళి తలుపు తీసింది.
భాస్కర్, నందిని లోపలికి వస్తూనే తలుపు మూసే శారు.
కొడుకును చూడగానే దుఖం పొంగుకు వచ్చింది శారదమ్మ కి. కొడుకును అల్లుకుపోయి పెద్దగా ఏడ్చేసింది.
“ ఇంట్లో ఎవరిదో శవం పెట్టుకుని ఈ ఏడుపులు ఏంటి? మీరు చేసిన పనికి ఏడవాల్సింది మేం! ఇంక ఊరుకోండి!” కసురుకున్నట్లు గా అంది నందిని.
మళ్ళీ తల్లిని అడిగి రాత్రి జరిగిందంతా వివరం గా తెలుసు కున్నాడు భాస్కర్.
“ నేను పోలీసులకు విషయం చెప్పి వస్తాను. వాళ్ళు నిన్ను ఎన్నో ప్రశ్నలు వేస్తారు. కంగారు పడకుండా జరిగింది జరిగి నట్లు చెప్పు! నీకేం భయం లేదు “అన్నాడు భాస్కర్ మరో సారి శవాన్ని పరిశీలనగా చూస్తూ.
అలాగే అన్నట్లు తల వూపింది శారదమ్మ.
భాస్కర్ వెళ్ళిన అరగంటలో జీపు లో ఇద్దరు పోలీసులు, ఇన్స్పెక్టర్ వచ్చారు. వాళ్ళను చూసి వీధి వీధి అంతా ఇంట్లోకి వచ్చేసింది. పోలీసులు రకరకాల ఏంగిల్స్ లో శవం ఫోటోలు తీసుకుంటున్నారు.i ఇల్లంతా గోల గోల గా తయారైంది .ఎలా తెలిసిందో ఏదో ఛానెల్ వాళ్ళు కూడా వచ్చేశారు. పోలీసులు శారదమ్మ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. శారదమ్మ కు నోరు పెగలడం లేదు, భయం తో గజ గజా వణికిపోతోంది.
“ అమ్మ ఇంకా షాక్ లో నుంచి తేరు కోలేదు. జరిగింది నేను చెబుతాను” వాళ్ళ ప్రశ్నలకు అడ్డు పడ్డాడు భాస్కర్.
“ మీరు కాదు ప్రత్యక్ష సాక్షి అన్ని విషయాలు చెప్పాలి.”
ఛానెల్ వాళ్ళు కూడా శారదమ్మ ని రకరకాల ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు.
“ నా కేమి తెలియదు. ఆవిడ వర్షం లో వస్తే ఇంట్లోకి రాని చ్చాను. తెల్లవారి చూస్తే చచ్చి పోయింది” అని మాత్రం చెప్పింది శారదమ్మ.
పోలీసులు పంచనామా వ్రాసుకున్న తరువాత ఆంబులన్స్ వచ్చి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకు పోయింది.
ఆ ఆడమనిషి బ్యాగ్ తీసుకుని, శారదమ్మ ను కూడా పోలీస్ స్టేషన్ కి పద మన్నారు పోలీసులు. తల్లిని తీసుకుని పోలీసులతో పాటు తాను కూడా వెళ్ళాడు భాస్కర్.
శారదమ్మ ను విడిగా ఒక గదిలోకి తీసుకు వెళ్ళి గంట పాటు రక రకాల ప్రశ్నలతో వేదించేసాడు ఇన్స్పెక్టర్ .
“ అసలు ఆవిడ మీ ఇంటికే ఎందుకు వచ్చింది? ఆవిడ పేరు ఎందుకు అడగ లేదు మీరు?. పొద్దున్నే చచ్చి పోతే మాకు అప్పుడే ఎందుకు చెప్ప లేదు? ఇంట్లోకి పనిమనిషిని ఎందుకు రానీయ లేదు? రాత్రి ఆవిడకు తిన డానికి ఏం పెట్టారు? తన గురించి ఆవిడ ఏం చెప్పింది? మీరు రోజంతా ఇంట్లో ఏం చేశారు? ఆవిడ బ్యాగ్ లో నుంచి ఏమైనా తీశారా?” ఇలా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ శారదమ్మ ను ఉక్కిరి బిక్కిరి చేశారు.
శారదమ్మ ఎలాగో ధైర్యం తెచ్చుకుని అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది.
ఇంతలో ఎవరో పోలీసు ఆ ఆడ మనిషి బ్యాగ్ లో దొరికిన ఆధార్ కార్డు తీసుకు వచ్చి, ఇన్స్పెక్టర్ చేతికి ఇచ్చాడు.
ఆధార్ కార్డు లో తాడేపల్లి గూడెం అడ్రస్ చూసి, శారదమ్మ చెప్పే మాటల లో నిజం ఉండొచ్చని ఒక నిర్ణయానికి వచ్చా డేమో, “ ఇప్పుడు మీరు వెళ్ళ వచ్చు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మళ్లీ పిలుస్తాం. ఈ లోపల మీరు వూరు వదిలి ఎక్కడికీ వెళ్ళవద్దు.” అన్నాడు ఇన్స్పెక్టర్.
బతుకు జీవుడా అనుకుని కొడుకు తో పాటు ఇంటికి వచ్చేసింది శారదమ్మ.
ఆధార్ కార్డు ను బట్టి ఆవిడ పేరు సుందరమ్మ అని తెలిసింది. పోస్టుమార్టం రిపోర్టు లో సహజ మరణం అని, నిద్రలో గుండె ఆగి మరణం సంభవించి నట్లుగా వచ్చింది. పోలీసులు తాడేపల్లి గూడెం వెళ్ళి సుందరమ్మ కు ఎవరూ లేరని నిర్ధారించుకుని వచ్చారు. అయితే కేస్ క్లోజ్ అవ్వడానికి ఆరు నెలలు పట్టింది. అప్పటి దాకా అడపాదడపా శారదమ్మ ను పోలీస్ స్టేషన్ కి పిలుస్తూనే వున్నారు.
“ ఇదో గుణపాఠం అనుకో, ఒంటరిగా వున్నప్పుడు కొత్త వాళ్ళువస్తే, తలుపు తెరవకు. తెలిసిందా?” అన్నాడు భాస్కర్ తల్లితో .
అలాగే అన్నట్లు తల వూపింది శారదమ్మ.
ఇది జరిగిన రెండు రోజుల తరువాత , స్నానానికి వెళ్లిన శారదమ్మ సబ్బు అయిపోయి వుండటం తో కొత్త సబ్బు బిళ్ళ తీసుకోడానికి స్టోర్ రూం లోకి వెళ్ళింది. గోడ కు ఆ వైపున వున్న భోజనాల బల్ల మీద కొడుకు, కోడలూ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఏదో మాట్లాడు కుంటున్నా రు. ఆ మాటల్లో తన ప్రస్తావన రావడం తో వెళ్ళ బోతున్నదే ఆగి వింది.
“ అత్తయ్య గారి విషయం ఏం చేశావు ?” అడుగుతోంది కోడలు.
కొడుకు నుంచి ఏ సమాధానం లేదు.
“ చెబుతూంటే నీకు అర్థం కావడం లేదు. ఇప్పటి కి జరిగింది చాలదా? ఆవిడను ఇంట్లో ఒంటరిగా వదలడం ప్రమాదం అంటే అర్థం చేసుకోవేం? నువ్వు గమనించ లేదేమో, ఆవిడ మునపటిలా లేరు. పరధ్యానం గా వుంటున్నారు. ఓల్డ్ ఏజ్ హోం లో అయితే ఆవిడకి తోటి వాళ్ళతో కాలక్షేపం అవుతుంది. మనం ఏ టూర్ కి వెళ్లాలన్నా ఇబ్బంది వుండదు.”
“ కానీ నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిన అమ్మను వృద్ధాశ్రమం కి వెళ్ళ మని చెప్పలేను.” చిన్నగా అంటున్నాడు భాస్కర్.
“ చెప్పాలి, తప్పదు. పోయిన సంవత్సరం కంపెనీ యుఎస్ వెళ్ళమన్నా, అమ్మ ను వదిలి ఎలా వెళ్ళడం అని మానేసావు! ఇలా అయితే ఎలా? నీ కెరీర్ ఏమవుతుంది? ఎప్పటికీ ఇలాగే ఉండి పోతావా? ఇంత చదువూ చదివి ఏం లాభం,?జీవితం లో పైకి రావాలి కదా! ఈ సారి U.S వెళ్ళనంటే మాత్రం నేను ఊరుకోను. ఆవిడఓల్డ్ ఏజ్ హోం లో వుంటే మనకి నిశ్చింత.. ఆవిడ కూడా అక్కడ సుఖం గా వుంటారు,! పది లక్షలు విరాళం ఇస్తే మంచి హోం లో చేర్పించ వచ్చు. నెలకు పాతిక వేలు కడితే అన్ని సౌకర్యాలు వున్న ఏ సీ గది ఇస్తారు. తన వయసు వాళ్ళతో అక్కడ ఆవిడకు మంచి కాలక్షేపం అవుతుంది కూడా. ఇక నువ్వేమీ ఆలోచించకు!”
“ ఎన్ని చెప్పు, నేను మాత్రం అమ్మను ఇంట్లో నుంచి పంపించేయ లేను. వెళ్ళమని చెప్పలేను,”
“ రెండు రోజులు చూస్తాను . నువ్వు చెప్పక పోతే నేనే చెబుతాను. నాకేమీమొహమాటంలేదు!” ఖరాఖండీ గా చెప్పేసింది కోడలు.
నిశబ్దంగా స్నానానికి వెళ్ళి పోయింది శారదమ్మ.
కొడుకు, కోడలూ వెళ్ళి పోయాక మనసే మీ బాగు లేక దేముడి మందిరం ముందు కూర్చుండి పోయింది శారదమ్మ.
తను ఏనాడూ అనుకోలేదు. కోడలు తనని వృద్ధాశ్రమం లో జాయిన్ చేయమని కొడుకును వేధిస్తుంది అని. కోడలి ఆలోచనా విధానాన్ని కూడా తప్పు పట్టలేం. ఏ భార్య అయినా తన భర్త ఇంకా ఇంకా పైకి రావాలనే కోరు కుంటుంది l తను మాత్రం! వాడిని ఉన్నతంగా చూడాలనే లక్షం తోనే రెక్కలు ముక్కలు చేసుకుంది. ఇప్పుడు కొడుకు ఎదగడానికి తను అడ్డు రాకూడదు. అవును. వాళ్లిద్దరూ ఇంకా ఇంకా పైకి రావాలి. అన్యోన్యం గా వుండాలి. తన వల్ల వాళ్ళ మధ్య మనస్పర్ధలు రాకూడదు. జీవితాంతం కలిసి వుండవలసింది వాళ్ళు! ఇలా మధ్యాహ్నం దాకా పరిపరి విధాల ఆలోచించిన శారదమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది.
ఇది జరిగిన రోజు నుంచి కొడుకు తన మొహం లోకి సూటిగా చూడ లేక పోతున్నాడని అర్థం అయిపోయింది శారదమ్మ కి. పిచ్చి నాగన్న మింగ లేక, కక్క లేక లోలోపల ఎంత మదన పడి పోతున్నాడో! రెండో రోజు రాత్రి భోజనం బల్ల దగ్గర చపాతీ తుంచుతూ, “ ఒరేయ్, భాస్కరం, నన్ను ఎక్కడి కైనా పంపించేయరా, నీకు పుణ్యం వుంటుంది”’ అంది కొడుకు మొహం లోకి సూటిగా చూస్తూ శారదమ్మ.
తల్లి అలా అనేసరికి ఒక్కసారిగా పొల మారింది భాస్కర్ కి , “ ఏం అంటున్నావు నువ్వు?”
“ అవును రా! నన్ను ఎక్కడి కైనా పంపించేయి. “
“ ఎక్కడి కి వెళతావ్ నువ్వు?”
“ ఎక్కడికైనా , పోనీ ఏదైనా వృద్ధాశ్రమం లో జాయిన్ చేసేయి. నేనీ ఇంట్లో వుండ లేక పోతున్నాను!”
“ అదేంటి, కొత్తగా అలా అంటున్నావ్?”
“ అవును రా! వర్షం కురిసిన ఆ రాత్రిని నేను మరచి పోలేక పోతున్నాను. రోజంతా ఆ సుందరమ్మ శవాన్ని పెట్టుకుని ఇంట్లో కూర్చున్నాను కదా, ఆ దృశ్యాలే నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. రాత్రిళ్ళు కూడా నిద్ర పట్టడం లేదు నాకు! ఈ ఇంట్లోనే వుంటే పిచ్చెక్కి పోయేలా వుంది . నా మాట విని నన్ను వృద్ధాశ్రమం లో చేర్పించి పుణ్యం కట్టుకో బాబూ!”
“ అది కాదే…. “ అంటూ ఏదో చెప్ప బోయాడు భాస్కర్.
“ ఆవిడ ఈ ఇంట్లో ఉండలేను మొర్రో అంటూ వుంటే మీరెందుకు అడ్డు పడతారు. ఆవిడ ఎక్కడ సంతోషంగా వుంటే అక్కడే వుండ నివ్వండి” అంటూ కల్పించు కుంది నందిని.
భాస్కర్ అంటే తనకి పంచ ప్రాణాలు. భాస్కర్ కి తనంటే అంతకు మించి! వాడు తనని కంఠం లో ప్రాణం వుండగా వృద్ధాశ్రమం పంప లేడు. కోడలు మాట పట్టుకుని తను వెళ్ళి పోయినా వాడు జీవితమంతా అపరాధ భావం తో విల విల లాడి పోతాడు. తను వృద్ధాశ్రమానికి వెళ్లి పోవాలి, కానీ అందుకు భాస్కర్ బాధ పడ కూడదు.
వర్షం కురిసిన ఆ రాత్రి సుందరమ్మ తమ ఇంట్లోకి వచ్చి చచ్చి పోవడం ఒక విధంగా మంచిదే అయింది. అది సాకుగా చూపించి , కొడుకు మనసు కష్టపెట్టు కోకుండా వృద్ధాశ్రమం కి తనను పంపించేలా చేయ గలుగు తోంది.మనసులోనే సుందరమ్మ కు కృతజ్ఞతలు చెప్పుకుంది శారదమ్మ,
రెండు వారాల తరువాత తల్లి ని కొండా పూర్ లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోం లో జాయిన్ చేశాడు భాస్కర్ “ కొన్నాళ్ళు చూడు. నీకు నచ్చితేనే ఇక్కడ వుండు. మొహమాటం యేమీ లేదు. నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చే ద్దామని అనుకుంటే అప్పుడు నాకు ఫోన్ చేయి .నేను వచ్చి తీసుకు వెళ్లి పోతాను ఈ గూట్లో నీ మందులన్ని పెట్టాను. చీరలు కప్ బోర్డు లో సర్దాను.. నీ ఆరోగ్యం జాగ్రత్త,” ఆ మాటలు అంటున్నప్పుడు భాస్కర్ గొంతు జీర బోయింది.
“ నాకేం నిక్షేపంగా వుంటాను. మీరే జాగ్రత్త గా వుండండి. వేళకు భోజనం చేయండి “ గేటు దాకా వచ్చి కొడుకును, కోడల్ని సాగ నంపింది శారదమ్మ.
నందిని భుజం మీద చెయ్యి వేసి, కారు వైపు నడిచి వెళుతున్న కొడుకు రూపం కన్నీటి పొరల మధ్య మసక మసక గా కనిపిస్తోంది శారదమ్మ కి.
***************************
