సంచారి  “తత్త్వాలు” 2

Spread the love

—————–

              ఒక డేగ, మరియు ఒక  భరత పక్షి  ఎత్తైన

పర్వతం  మీద ఒక శిలపై కూర్చున్నాయి.

              భరత పక్షి అంది కదా ” శుభోదయం అండీ!”

అని.  డేగ,  ఆ పక్షిని  ఎగా దిగా చూసి,  అయిష్టంగా

“శుభోదయం” అంది.

              భరత పక్షి ” అంతా బాగానే ఉంది కదా మీకు?!” అంది.

               “ఆ…. ఆ!  అంతా బాగానే ఉంది. కాని మేము పక్షి రాజులం కదా!  మా అంతట మేము

మాట్లాడకుండా  మమ్ములను పలకరించ కూడదని

నీకు  తెలీదా?” అని డేగ అంది.

              “మనం ఒకే కుటుంబానికి  ( జాతికి) చెందిన

వారం  కదా! అనుకున్నాను.” అంది  భరత పక్షి.

              డేగ ఆ పక్షిని  తృణీకారంగా చూస్తూ ” ఎవరు

చెప్పారు  మనం ఒకే  కుటుంబం అని ?” అంది.

               అపుడు  భరత పక్షి  అంది కదా !” నువ్వు

ఎగిరినంత  ఎత్తుకి నేనూ ఎగరగలను. నేను నా పాటతో  మిగిలిన  ప్రాణులను  అలరింపగలను. నువ్వు ఆనందమూ  పంచలేవు, సంతోషమూ ఇవ్వలేవు.”

               డేగకు  కోపం వచ్చింది. ” ఆనందమూ – సంతోషమూనా!  నువ్వు  అల్ప జీవివి. నా కాలు అంత లేవు. నా ముక్కుతో  ఒక్కసారి పొడిస్తే  చాలు-

నాశనమై పోతావు.” అని కసిరింది.

             భరత పక్షి పైకెగిరి డేగ  వెనక భాగంలో దిగి,

దాని ఈకలు పీక సాగింది. డేగకు కోపం, చిరాకు వచ్చాయి. ఆ పక్షిని  తప్పించుకుంటానికి , వేగంగా

ఇంకా ఎత్తుకి ఎగిరింది. కాని కుదర లేదు. చివరకు

మరలా ఆ పర్వతం పైన శిల మీద వాలింది. భరత పక్షి  మాత్రం దాని వీపు మీదే ఉంది. డేగ తన తల రాతను తిట్టుకుంటూ మరింత చిరాకు పడింది.

              అదే సమయంలో ఒక తాబేలు అటుగా వచ్చి, జరుగుతున్నదంతా  చూసి  పడీ పడీ నవ్వసాగింది.

               డేగ,  కింద తాబేలు వైపు చూసి ” లోకంలో

అన్ని  ప్రాణుల కన్నా నెమ్మదిగా కదులుతావు. నువ్వు

కూడా నవ్వుతున్నావా !? ఎందుకు?” అంది.

               తాబేలు “ఇప్పుడు నువ్వొక  గుర్రానివి. నీ పైన ఆ పక్షి  సవారీ  చేస్తోంది. అదే నీ కన్నా ఉన్నత మైనది.” అని అంది.

               అప్పుడు  డేగ, తాబేలుతో  కోపంగా ఇలా అంది ” ఇది నాకూ, నా తమ్ముడు భరత పక్షికీ మధ్య

ఉన్న  కుటుంబ వ్యవహారం. పోయి నీ పని చూసుకో!”

———————

             పూర్వం  షావాకిస్  నగరంలో  ఒక  రాజ కుమారుడు ఉండేవాడు. పిన్నలు, పెద్దలూ– అందరికీ అతనంటే  చాలా ఇష్టం. చివరకు ఆ పొలాల్లో ఉన్న జంతువులు కూడా  ఆప్యాయంగా అతని చుట్టూ చేరేవి.

             ‘అతని భార్య ఐన రాకుమార్తెకు మాత్రం అతని పై ప్రేమ లేదు.’ అని ప్రజలందరూ చెప్పుకునే వారు. అంతే కాదు ఆమె రాకుమారుణ్ణి అసహ్యించు కునేది కూడా !

             ఒక రోజు  పక్క నగరపు రాకుమార్తె , ఈ షావాకిస్ రాకుమార్తెను కలవడానికి వచ్చింది. వారిరువురూ కూర్చొని మాటల్లో పడ్డారు. మాటల మధ్యలో  వారి వారి భర్తల గురించి ప్రస్తావన వచ్చింది.

              షావాకిస్ రాకుమార్తె ఎంతో భావావేశంతో అంది కదా !” నీ వివాహమయ్యి ఇన్ని ఏళ్లయినా, నువ్వు నీ రాజ కుమారుడితో ఇంత ఆనందంగా ఉండడం చూస్తే నాకు నిజంగా ఈర్ష్యగా ఉంది ! నా భర్త అంటే నాకు అసహ్యం. అతను నా ఒక్కతికే చెందినవాడు కాదు. నేను నిజంగా చాలా విచారంగా ఉన్నాను.”

              అప్పుడు ఆ వచ్చిన రాజ కుమార్తె ఈమెను తదేకంగా చూసి  ఇట్లా అంది ” మిత్రమా! నీవు నీ భర్తను ప్రేమిస్తున్నావనేది నిజం. ఔను. నీకు అతనిపై వ్యామోహం పోలేదు. స్త్రీ జీవితం ఉద్యానవనంలో  వసంతంలా ఉంటుంది. నువ్వు మా సంసారం గురించి నిజంగా జాలి పడాలి. మేము ఒకరినొకరం నిశ్శబ్దం గానూ, ఓర్పు గాను భరిస్తూ ఉంటాం. మీరందరూ ఇదే ఆనందం అనుకుంటూ ఉంటారు.”

  

————-

                   ఓ  మహిళ,  ఒక  పురుషునితో ఇలా అంది ” నేను నిన్ను ప్రేమిస్తున్నాను .”

                 ఆ మనిషి అన్నాడు కదా! ” నీ ప్రేమకు

అర్హత  నా హృదయం  లోనే ఉంది.”

                 ఆ మహిళ ” నీవు నన్ను ప్రేమించడం లేదా ? ” అని అడిగింది.

                  ఆ పురుషుడు, మహిళను తదేక దృష్టితో చూసి మిన్నకుండి పోయాడు.

                  అప్పుడు ఆ మహిళ బిగ్గరగా ఏడుస్తూ

“నిన్ను నేను అసహ్యించుకుంటున్నాను ” అని అంది.

                 ఆ మనిషి ఇలా జవాబిచ్చాడు. ” నా హృదయానికి , నీ అసహ్యం పొందడానికి  అర్హత ఉంది.”

      సంచారి  తత్త్వాలు    

                       

   ————–

      ఒకానొక రోజు ‘ సౌందర్యము ‘ మరియు   ‘అనాకారి ‘ ఒక  సముద్రపు  ఒడ్డున  కలుసు కున్నారు. ఇద్దరూ  సముద్రం లో  స్నానమాడడానికి

సిధ్ధ మయ్యారు.

      ఇద్దరూ  బట్టలు విప్పి,  నీళ్లలో  ఈదారు. కొంత

సేపటి తరువాత  ‘ అనాకారి ‘ ఒడ్డుకి వచ్చి  ‘సౌందర్యం’ బట్టలు వేసుకొని వెళ్ళిపోయింది.

      ‘సౌందర్యం’  కూడా  ఒడ్డుకి వచ్చి, తన దుస్తులు

లేకపోవడం చూసింది. నగ్నంగా ఉండడానికి సిగ్గు

పడింది. చేసేదేమీ లేక  ‘ అనాకారి వదిలి వెళ్ళిన

బట్టలు వేసుకొని  వెళ్లి పోయింది.

       అప్పటినుండి , ఈ రోజు వరకు జనమంతా

( ఆడా, మగా) — ‘ సౌందర్యము’, ‘ అనాకారి’

లను, ఒకరిని చూసి మరొకరుగా  పొరపాటు పడుతూనే ఉన్నారు !

      ‘ సౌందర్యము’ యొక్క ముఖము  మునుపు చూ సిన కొంత మంది  మాత్రం ‘ అనాకారి ‘ బట్టల్లో ఉన్న

‘ సౌందర్యాన్ని ‘ గుర్తించ గలిగారు. అలాగే , ‘ సౌందర్యం ‘ దుస్తుల్లో ఉన్న ‘ అనాకారి ‘ రూపం కొంత

మందిని  మోసం   చెయ్యలేక పోయింది.

———–

        ఒక. ఆల్చిప్ప  పక్క ఆల్చిప్పతో  ఇట్లా  అంది.

” నాకు  లోపల చాలా  నొప్పిగా  ఉంది. అది బరువుగా , గుండ్రంగా ఉంది. నేను విపరీతమైన

బాధలో  ఉన్నాను.”

         రెండో  ఆల్చిప్ప  అహంకారంతో  కూడిన ఆత్మ

సంతృప్తితో  ఇలా అంది ” ఆకసాన్ని , సాగరాన్ని  ప్రశం సించాలి. నేను లోనా, బయటా కూడా పరిపూర్ణంగా,

చాలా బాగా ఉన్నాను.”

          అదే సమయంలో ఒక పీత  అటువైపు పోతూ,

ఆ ఆల్చిప్పల సంభాషణ విని ,– ‘ నేను పరిపూర్ణంగా ఉన్నాను’ అన్న ఆల్చిప్పతో  ఇలా చెప్పింది   ” అవును. నువ్వు  పరి పూర్ణవతివి. చాలా  బాగున్నావు. కాని, నీ పక్క ఆల్చిప్ప  పడే ‘బాధ ‘ ఏ మిటో తెలుసా? అది ఒక అద్భుత సౌందర్యమున్న

ముత్యం.”

ఖలీల్ జిబ్రాన్
డాక్టర్ సి. బి. చందమోహన్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *