ఇదిగో ఈ బాటలో మరికొన్ని కోకిలలు గుంపుగా ఉన్నాయి
కోకిలలు గుంపుగా ఉండటం ఎప్పుడైనా చూశావా
పూలు గుత్తులుగా పూసినట్లు
వాటికి పూలతోనే చెలిమి
తొలి వేసవిలో
కాస్త మెత్తగా చినుకులు
చెట్లను చేరుకుంటున్నప్పుడు
అవి పూలతో అలంకరించుకుంటాయి
పూలనన్నీ కప్పుకొని లోకం తెలీక
చిగుర్లు ఆకులయ్యే సరికి మరణిస్తాయి
నేను నీ శ్వాసలలో చిక్కుకొని గిలగిలాడినట్లు
ప్రాణం విడుస్తాయి
అయినా పూలు లేని ప్రాణంతో
అవి ఏనాడూ సంచరించలేదు
గాడ్పుకాలంలో వాటి రాగం ఎంత మన్నికైనదీ
నీ కోసం ఒక కోకిలను తీసుకొద్దామని
ఈ చెట్లన్నిటినీ గాలించి పూలను వేడుకున్నాను
'జీవితమంతా శూన్యం నింపుకున్నవాడా!
ఒక కోకిలను నీవు పొందటమంటే
మెత్తటి మా దేహాలను రాల్పి
కఠినమైన నీ పాదాలతో తొక్కుకుంటూ వెళ్ళటమే.
ఇదిగో మేం అనేక రకాలుగా ఈ నేలపై రాలిపోతున్నాం.
నువ్వు నీ శ్వాసకై విడిచే గాలి వలన కూడా కొమ్మల నుంచి తెగిపోతున్నాం.
అయినా మేం రాలిపోవడం వింత కాదు.
నీవు కోకిలను తీసుకు పోవాలనుకోవడమే వింత'.
ఒక కోకిల కోసం నేను ఎన్నో పూలను రాల్పాను
కొమ్మలను విరిచి వెతికాను నల్లని శరీరపక్షి కోసం
ఒక రాగపు పక్షీ దొరకలేదు.
ఒట్టి చేతులతో ఎన్నో పూల గుత్తులను
తొక్కుకుంటూ నడిచాను.
కోకిలలు నల్లటి మబ్బులై
రాలిన పూలను చేరుకోవడానికి
బోరున కురుస్తున్నాయి
నేను పూలకీ కోకిలలకు నడుమ
నీకు దూరంగా ముద్దగా తడిచిపోతున్నాను.
కవితలు చాలా బాగున్నాయి