నులి వెచ్చని సూర్య కిరణాలు, పిల్ల తెమ్మెరుల సాయంతో కిటికీకి ఉన్న స్క్రీన్ను తొలగించుకొని, నుదుట మీద పడగా, చెదిరిన ముంగురులను సవరించుకొని, నళిని నెమ్మదిగా లేచి, ఓ సారి కిటికీ లోనుంచి తొంగి చూసింది. ప్రక్కింటి ఆవరణలో అప్పుడప్పుడే నడక వచ్చిన పిల్లవాడు, నెమ్మదిగా బుడి బుడి అడుగులు వేసుకుంటూ, గేటు వద్దకు పరిగెత్తుతూ, కనిపించాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు. మదిలో “తరుణ్” మేదిలాడు. తన మనవడు కూడా ఈ పిల్లాడి మల్లె, నడుస్తుంటాడు కాబోలు. సంవత్సరమైంది, మనవడు పుట్టి. మనవణ్ణి అస్సలు చూడనేలేదు. తెలియకనే కన్నీళ్ళు టప టప రాలాయి.
“ ఏరా , ఏమంటుంది పద్మ, మనవణ్ణి చూపిస్తుందా , లేదా, “ అడిగింది నళిని, కొడుకు శశాంక్ నుద్దేశించి. భోంచేస్తున్న శశాంక్, “ కూర ఇంకొంచము వడ్డించమ్మా “ అని మాట దాటేశాడు. “ నిన్నేరా, పుట్టింటికి పోయిన పద్మ, బిడ్డను కనీ, బారసాల అయ్యి, సంవత్సరము కావస్తూంది. కనీసము బారసాలకు కూడా నన్ను పిలవలేదు, నీవు కూడా తీసుకపోలేదు. ఎప్పుడురా, వచ్చేది మానవడితో.” అంది .
“అమ్మ, ఇప్పటికే నీకు, చాలాసార్లు చెప్పాను, పద్మ మనింటికి రాదని. నీవెం మాటన్నావో ఏమో, బాధ పడింది. “ అన్నాడు.
“ఒక్క ఇంట్లో ఉన్నతర్వాత మాట మాట అనుకోకుండా ఉంటామా ఏమి? ఏదో పెద్ద వాళ్ళు అన్నారని పట్టించుకోకుండా సర్దుక పోవాలి కానీ, సర్లేరా, మీరు మీరు ఒద్దిక గా ఉంటే అదే పదివేలు. నీవన్నా, అప్పుడప్పుడు వస్తూండు. ఈ అమ్మ ఉన్నది అని మర్చిపోకు”, పమిట చెంగుతో వస్తున్న వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ.
***
నళినికి సుమారు యాభై అయిదు వయస్సు ఉంటుంది. భర్త బ్యాంకులో పనిచేస్తూ, పాతిక సంవత్సరముల క్రితం చనిపోయారు. ఇద్దరు కొడుకులు సుమంత్, శశాంక్. ఇద్దరినీ ఎలాగోలా కష్టపడి, వచ్చే పెన్షన్ డబ్బులతో, బి.టెక్. కంప్లీట్ చేయించింది. భర్త పోయినతర్వాత పుట్టింటిలో ఉండి , చదివించింది. పెద్దవాడు లండన్ లో మంచి పోస్ట్ లో స్థిరపడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని, అక్కడే స్థిరపడ్డాడు. వాడికి ఒక కుమారుడు. అక్కడే అందరూ సిటిజెన్ షిప్ తీసుకొని, సెటిల్ అయ్యారు. రెండోవాడు హైదరాబాద్ లోనే ఒక మంచి కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మూడేళ్ళ క్రితం, ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. కోడలు పద్మ, మొదటి రెండు సంవత్సరాలు కలిసే ఉంది. మూడో సంవత్సరము నుండి, ముఖ్యంగా, గర్భందాల్చినప్పటినుండి, పుట్టింటిలో, తర్వాత వేరు కాపురము. మనవడు పుట్టిన తవాత అత్తింటిని కాదని, ప్రక్కనే వేరు కాపురం పెట్టించింది. స్వంత ఇంట్లో తాను ఒక్కటే కాలం గడుపుతోంది. ఏమి తోచదు. పెద్దవాడు సరే సరి. రెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి, “హాయి “ చెప్పి వెళ్తాడు. వచ్చినప్పటికి, ఇంట్లో ఉండడు. హోటల్ లో దిగి, అక్కడి నుండే ఫ్లయిట్ ఎక్కుతాడు. చిన్న వాడు, ఇంటికి చుట్టం చూపుగా వస్తాడు. కోడలు ఇంటికి రాదు. మనవణ్ణి చూపించదు.
***
“హల్లో , శశాంక్, వినపడుతోందా”, ఆఫీసు లో బిజీ గా పనిచేస్తున్న శశాంక్ ను,
“చెప్పురా, వినపడుతుంది”. “ వదినా, పిల్లలు కులాసానా? “ అడిగాడు.
“బాగున్నరురా, సర్లే కానీ , కొద్దిగా ప్రక్కకు రా, ఒక ఇంపార్టంట్ విషయం చెప్పాలి. “ అన్నాడు సుమంత్.
ఆఫీసు లాంజీ లో కి వచ్చి, “ చెప్పారా , ఎంది విషయం ? సూటి గా అడిగాడు. “ అమ్మ కులాసానా ? “, అని అడిగి, “ మొన్న సుకుమార్, అదేరా నా ఫ్రెండ్ ఫోన్ చేసాడు. అమ్మ పది రోజుల క్రిందట జరిగిన ఒక వివాహ వేదిక వద్ద కనిపించిందట. ఏమిటి విషయం? మన బంధువులలో ఎవ్వరూ లేరే. పెళ్లికావాల్సిన వాళ్ళు. ఎవరికోసం వివాహ వేదికకు హాజరైంది. “ అడిగాడు.
“ఎమోరా, నాకు తెలియదు ఆ విషయం, కనుక్కుంటాలే “ అని, సెల్ కట్ చేశాడు.
***
సమాజం వారు అరేంజ్ చేసిన వేదిక. ఒకటే హడావిడి. తమ తమ, కుమర్తెలు , కుమారుల కోసం, మంచి మంచి సంబంధాలు సెటిల్ కావడం కోసం, ఆరాటపడే తల్లి తండ్రులు. హాల్ నిండా పెళ్లికావలిసిన పిల్లలు, పెద్దలు.
అంతలో అనౌన్సెమెంట్. మొదట ద్వితీయ వివాహము కోసం వచ్చిన అబ్యర్ధులు. వాళ్ళ వివరాలు. “ నళిని” పేరు చదివారు.
వేదిక ఎక్కిన, నళిని, తనను తాను పరిచయం చేసుకుంది. “ నా పేరు నళిని. వయస్సు యాభై ఐదు. భర్త బ్యాంకు ఉద్యోగి. పాతిక సంవత్సరముల క్రిందట పరమ పదించారు. ఇద్దరు కుమారులు. వెల్ సెటిల్డ్. ఒంటరితనము. పిల్లలు పట్టించుకోరు. మిగిలిన జీవితాన్ని ఒకరికిఒకరుగా , తోడుగా నాభిరుచులకు అనుగుణంగా నడుచుకొనే వ్యక్తి నా జీవితం లోకి అహ్వానిస్తున్నాను. “ ముక్తసరిగా, సూటిగా వివరించింది.
***
ఆ రోజు ఆదివారం. సెలవు రోజుల్లో అమ్మ ను చూడటానికి వచ్చి, “ అమ్మ , ఉప్మా టిఫిన్ బాగుందే, కొంచం పెట్టు” అన్నాడు శశాంక్. కొడుకు అలా అడుగుతుంటే, గోరుముద్దలు తినే వయసులో, శశాంక్ గుర్తుకొచ్చాడు. “ ఇంకొంచం తిను బంగారు నాన్న, అని తినమని బతిమాలుతూంటే, తిననని మారాం చేస్తుంటే, తినిపించిన రోజులు. “పిల్లలు పెద్దవాళ్ళవ్వకపోతే ఎంత బాగుండు, నా దగ్గరే ఉంటారు “అనిపించింది, అంతలో “స్వార్థపరురాలిని, రెక్కలొచ్చినతర్వాత ఎవరుంటారు? ఎందుకుంటారు? “ అనుకుంది నళిని.
“అమ్మ, మొన్న సుకుమార్, అదేనే, సుమంత్ ఫ్రెండ్ కనిపించాడా” అడిగాడు శశాంక్.
“ ఊ,ఊ” , అంది ముక్తసరిగా. “ ఎప్పుడు, ఎక్కడ?”, మళ్ళా అడిగాడు. “ఆ , మొన్న మన సమాజం వాళ్ళు వివాహ వేదిక అరేంజ్ చేస్తే అక్కడకు నేను వెళ్ళాను. అక్కడ కనిపించాడు. సుమంత్ ను , నిన్ను అడిగాడు. మనవళ్లు ఎలా ఉన్నారు అని కూడా అడిగాడు”. ఎవరి పెళ్లి సంబంధం వెతకడానికి వెళ్ళావు అక్కడికి ?”, మరలా అడిగాడు.
“ఆ, ఎవరి కోసమేందుకు? నాకే, మొన్న “వివాహ పరిచయ వేదిక” పాంప్లెట్ చూశాను. అందులో ద్వితీయ వివాహములకొరకు కూడా ఆహ్వానము” అని ఉంది. నాకు కొడుకులు, కోడళ్ళు, మనుమలు ఉన్న, దగ్గిర లేక, ఏ తోడు లేక, స్వంత ఇంట్లో ఉన్న, అనాధ శరణాలయం లో వున్నానన్న భావన. అనాధ శరణాలయం అయినా నయం. ఎంతో మంది ఉంటారు. సరదాగా అభిప్రాయాలూ పంచుకుంటూ, తోచినది షేర్ చేసుకుంటూ, ఉండచ్చు. ఇక్కడ ఏమి తోచదు. ఎవ్వరూ మాట్లాడరు. అందరున్నా, ఎవ్వరూ లేరనే బాధ. నాకూ తోడు కావాలి, నావాళ్ళు ఉన్నారనే భావన నాలో రావాలి. అందుకేరా. ఆ వివాహ వేదిక లో ఒక తోడును చూసుకున్నాను”. అంది.
***
సుమంత్ ఫ్లయిట్ దిగి, నేరుగా ఇంటికి వచ్చాడు. తమ్ముడు శశాంక్ కూడా అక్కడే ఉన్నాడు. ఫ్రెష్ అయి, డైనింగ్ టేబల్ దగ్గిర “ అమ్మ , ఏమి టిఫిన్ ? అడిగాడు. నళినికి ఎంతో సంతోషం అయింది. చిన్నప్పటి తన పమిట కొంగు పట్టుకొని, “అమ్మ,అమ్మ” అంటూ తిరిగిన రోజులు జ్ఞాపకం వచ్చింది. “నీ కిష్టమని ఉల్లిపాయ రవ్వ దోసా చేశానురా”. ఇంకొక రెండు వేసుకో. ప్లేట్ లో వడ్డించింది నళిని.
“అమ్మ, శశాంక్ చెప్పింది నిజమేనా . ఎందుకమ్మ ఈ పని చేశావు. సొసైటీ లో తల దించుకొనేలా చేశావు. ఏమి జవాబు చెప్పాలి ఈ సొసైటీకి ?, ఇంతకీ ఎవరమ్మ అతను?” అడిగాడు.
“అంత దూరం నుండి వచ్చావు. ముందు రెస్ట్ తీసుకోరా. అంతా సవివరముగా చెప్తాను. అంది.
సాయంత్రం ఐదు గంటలకు, నాన్నతో కూడా బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయి, ఉన్న బి.ఎల్. డిగ్రీ తో ప్రైవేట్ గా లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న రవి, ఇంటికి వచ్చాడు. అన్నీ విషయాలు తెలుసుకున్న రవి,
“హల్లో, సుమంత్. ఎలా వున్నావు. అక్కడ అంతా వసతిగా ఉందా”. అడిగాడు.
ఆ, ఏముందిలే అంకుల్, వర్క్ టెంషన్స్, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? పిల్లలు ఏమి చేస్తున్నారు? ఆంటీ ఎలా ఉన్నారు? ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు.
“ఆంటీ చనిపోయి నాలుగేళ్ళు అయ్యింది. ఒక్కగానొక్క కొడుకు ఫారిన్ లో సెటిల్ అయ్యాడు. ఈ మధ్యనే కంపెనీ కూడా మారాడు. వాళ్ళా ఇక్కడకు రారు. నేనా, అక్కడ, వాళ్ళతో, అక్కడ వాతావరణానికి, అడ్జస్ట్ కాలేను. అలాగని ఇక్కడ, వాళ్ళను గురించి ఒంటరిగా ఆలోచిస్తూ ఉండలేను. నీకేమి? మేమున్నాము. నీ ఖర్చులన్నీ భరిస్తాము . నీకేమి లోటు రానివ్వము. గేటెడ్ కమ్యూనిటి లో, టు బెడ్ రూమ్ ఫ్లాట్ కొనిచ్చాము. వంట మనిషి, పనివాళ్ళను పెట్టాము. హ్యిపిగా ఉండండి. రెండు సంవత్సరాలకొకసారి వచ్చి చూస్తాము. అంటారు. ఎందుకయ్యా ఈ కమ్ఫర్ట్స్. ఏమి చేసుకుంటాము?, ఒంటరిగా, అందరూ వున్న , ఎవ్వరూ లేక, బంధాలు, అనుబంధాలు లేకుండా. మనుమళ్లను చూడాలని ఉంటుంది. ఫోన్ చేస్తే, “హాయి” అంటారే కానీ దగ్గిర ఉండి, నా ప్రేమ ను పంచుకొనే అదృష్టము వారికి లేదయే. చివరి దశలో, నా దగ్గర ఉండి, భార్య చనిపోయిన తర్వాత, నా పూర్తి భాద్యతను తీసుకోవలసిన పిల్లలు, దూరంగా , ఏదో చుట్టపు చూపుగా వచ్చి, నాలుగు అనునయ వాక్యాలు వల్లిస్తూ, అంటి అంటనట్టుగా ఉంటున్న వీళ్లనేనా బంధువులనేది. వీళ్ళు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఆ, అందుకే, నేనొక నిర్ణయానికి వచ్చాను. మొన్న, వివాహ పరిచయ వేదిక మీద అమ్మ చెప్పిన విషయాలాన్నింటిని విన్నాను. తెలిసిన, ఒంటరిజీవితము గడుపుతున్న, మీ అమ్మ లాంటి వాళ్ళకు, చేయూత ఇవ్వాలనుకున్నాను. నా నిర్ణయం, వేదిక మీదికి పోయి చెప్పా. అమ్మ తన నిర్ణయం రిజర్వ్ లో పెట్టింది. పిల్లలను కనుక్కొని, తన ఉద్దేశం తెలియచేస్తానన్నది.”
ఇంకొక్క ముఖ్య విషయం. నేను ఒక లాయర్ గా చెపుతున్నా. Maintenance and Welfare of Parents and Senior Citizens Act 2007 మీకు తెలుసా. దానిలో శ్రేయస్సు లోని అంతర్భాగమే అందరితో కలిసి ఉండటము. ఏదో వారిని దూరంగా, ఏకాంతముగా ఉంచడము, చట్ట వ్యతిరేకము. ఎందుకయ్యా అంత ఆదాయము. రెండుపూట్ల చెయ్యి నోట్లో పొయ్యేదానికి సరిపడినంత చాలదా!, ఏమి సాధిస్తారు అక్కడ ఉండి. టెన్షన్లు, దురలవాట్లు, లొంలినేస్స్ , దాని పర్యవసానము ఆత్మహత్యలు, ఒంటరి జీవితాలు, పిల్లలకు నేర్పడానికా. అదే పిల్లలు పెద్దవాళ్ళ పర్యవేక్షణలో ఉంటే, వాళ్ళ అనుభవాలు, వీరి బంగారు భవిష్యత్తుకు నాంది అవుతుందికదా. సొసైటీ అంటే నీకు భయమా, ఆ సొసైటీ నే, మీ అమ్మను మీ పిల్లలెప్పుడు వస్తారు?, మీ మనుమలు ఎప్పుడొస్తారు?, ఎంతకాలము మీరు ఒంటరిగా ఉంటారు? అని, అడిగిందయ్యా .
శశాంక్ నీ విషయానికి వస్తాను. ఊర్లో ఉండి, వేరు కాపురము పెట్టడము ఏమిటి?ఇప్పుడొచ్చిన పెళ్ళాం గొప్ప? కనీ, పెంచిన తల్లి గొప్ప?. ఆ, ఉండాలి పెళ్ళాం పైన ప్రేమ. కానీ నీ జీవితం వీళ్ళిద్దరిమధ్య బాలన్స్ చేయాలి. ఆ సంస్కారము నీలో ఉండాలి. పద్మను నేను తప్పు పట్టలేను. ఒక అమ్మాయి తన భర్త పిల్లలు సంతోషముగా ఉండాలని ఆశించడములో తప్పు లేదు. కానీ భవిష్యత్తు లో తాము కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని గుర్తుంచుకోవాలి. “ అన్నాడు ఆవేశంగా.
“అమ్మ ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చాను. మీ నిర్ణయం చెప్పండి”, అన్నాడు రవి.
సుమంత్, శశాంక్ ఒక్క క్షణం మౌనం వహించారు. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. ఒక్క సారిగా అమ్మ వొడిలో వాలిపోయారు, చిన్న పిల్లలులాగా.
నళిని ప్రేమగా వాళ్ల తలలను నిమిరింది.
కొంతసేపటికి తేరుకొని “అంకుల్, మీరు అనుభవిస్తున్న, అమ్మ అనుభవిస్తున్న బాధలన్నిటికి మేము ఫుల్ స్టాప్ పెట్టాలనుకొంటున్నాము. మీ కార్తీక్, ప్రస్తుతం కంపెనీ మారి మా కంపినిలోనే పనిచేస్తున్నాడు. నా అసిస్టెంట్ గా ఉన్నాడు. మొన్ననే చేరాడు. నాతో మాట్లాడాడు. ఆఫ్ కోర్స్. ఈ విషయాలు చెప్పలేదు. మీ విషయంలో నేను సహాయం చేస్తాను. నేను వాడికి గట్టిగా బుద్ధి చెపుతాను”.
“అంకుల్, మేము కూడా ఏదో ఆదాయము బాగా వస్తుందని అంతంత దూరం వెళ్ళాము. మీరిద్దరు మా కళ్ళు తెరిపించారు. మేము మీరు, ఏమి కోల్పోతున్నామో, మాకు కళ్ళకు కట్టినట్లు తెల్పారు. నేను శశాంక్, పద్మ లతో మాట్లాడి, పద్మ వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి నేనోచ్చేంతవరకు, ఒకటిగా ఈ ఇంట్లోనే ఉండే ఏర్పాటు చేసి వెళ్తాను”. అన్నాడు సుమంత్.
రవి, నళిని వీళ్ళ మాటలను, వీళ్లలో వచ్చినమార్పును, తమ జీవన సంధ్యలో వెలుగు రేఖను, ఆనంద బాష్పాలతో స్వాగతించారు.
తాము ఆడిన నాటకము ఫలించిందని సైగ చేసుకున్నారు
