గ్రీకు చర్చికీ, శ్మశానానికి దగ్గర వుంది ‘నెమలి పింఛం’
‘నెమలి పింఛం’ అన్నది ఆ పానశాల పేరు. అక్కడికి రైతులూ, అలగాజనమూ రారు. వాళ్ళు వచ్చి తప్ప తాగి తందనాలాడుతూ చేసే రభస అంటే యజమాని షలోం పించెపర్కు బొత్తిగా గిట్టదు. మరీ గొడవ ఎక్కువ చేస్తే వారిని ఎత్తి అవతల పారేసే శక్తి అతడికి గాని, అతడి భార్య షైండెల్కు గానీ లేదు. అంచేత అక్కడికి జమీందారులు, సైనికాధికారులూ మొదలయినవాళ్లు వచ్చి ‘మజా’ చేసి వెళ్తుంటారు. ఆ ఊరిలోని గుర్రపుబండి వాడికి ‘నెమలి ఫించా’నికి ఎలాంటి ఖాతాదారులను తేవాలో బాగా తెలుసు.
షలోం పించెవర్ ఆ ఊరివాడు కాడు. అతడింకెక్కడి నుంచో తన భార్యతో అక్కడికి వచ్చాడు. వాళ్ళతో బాటే వాళ్ళ పనిమనిషి యాండా వచ్చింది. పించెవర్ ఆ పానశాలని కొని నడప సాగాడు.
ముఖం నిండా ఆ మచ్చలు లేకుండా వుంటే యాండా గొప్ప అందకత్తె అయివుండేది. నిగనిగలాడే నల్లటి నల్లటి జుత్తుముడి, తెల్లని చర్మం, పొట్టి ముక్కు, ఎర్రటి చెక్కిళ్ళు, నేరేడు పళ్ళలాటి కళ్ళు, ఎత్తైన వక్షం, సన్నని నడుము, గుండ్రని పిరుదులు ఇదీ యాండా అంటే.. ఇంతింతని చెప్పలేనంత బలం ఆమెది. ఆ పానశాల, హోటలులోని పనంతా ఆమె ఒక్కత్తే చేసుకుపోయేది. వంట, అంట్లు తోమడం, పడకలు సరి చేయడం, గుడ్డలుతకడం, అవసరమయినప్పుడు పురుష అతిథులను ఆనందింప చేయడం ఇవన్నీ ఆమె బాధ్యతలే. హోటల్లోకి అతిథి వచ్చి తన పేరు, అదీ నమోదు చేయగానే ‘అది కూడా కావాలా?’ అని కొంటెగా అడిగేవాడు షలోం. అతిథికి ఆ సంకేతం బాగా తెలుసు కనుక ‘కావాలి’ అనేవాడు. అందుకోసం అదనంగా చార్జి వసూలు చేసేవాడు షలోం.
కొంతమంది యాండాను తమతో బాటు ‘తాగ’ మనే వాళ్ళు. కొందరు అలా నడిచి వెళ్ళొద్దాం రమ్మని పిలిచే వాళ్ళు. కాని ఆమె ఒప్పుకునేది కాదు. ఆవిడ అలా తాగుబోతయి పనులన్నీ ఎగ్గొటి తిరగడం షలోం సహించలేడు. ఆమెనసలు మద్యం ముట్టుకోవద్దని షలోం శాసించాడు. ఆ మాటనామె ఎన్నడూ జవదాటలేదు. తాగుబోతయిన తండ్రి. సవతి తల్లుల నుండి అతడామెను కాపాడాడు. అందుకు ప్రతిఫలంగా ఆమె జీతం అడక్కుండా పనిచేసేది. ఎప్పుడన్నా షలోం ఆమె ఖర్చులకని ఏదన్నా డబ్బులిస్తే, ఆమె వాటిని లెక్క పెట్టకుండా తన స్టాకింగ్స్లో దాచుకునేది. కృతజ్ఞతతో షలోం చేతిని ముద్దు పెట్టుకునేది. ఎప్పుడన్నా తనకు కావలసిన బట్టలో, శాలువో, రుమాలో, దువ్వెనో, బూట్లో కొనుక్కునేది. ఆదివారం చర్చికి వెళితే అక్కడి భిక్షాపాత్రలో నాణెం పడేది. ఆ ప్రీస్ట్కో తన ఇష్టదేవతకో ఏదన్నా కానుక కొనేది. ఆమె చర్చికి రావడం ఆ ఊరి మునలమ్మలకు ఇష్టంలేదు. ఆమె తలుపువారగా నిల్చునేది. ప్రీస్ట్ ఇంట్లో ఆందమైన పనిమనిషి వుండి కూడా యాండాతో వ్యవహారం కొనసాగిస్తున్నాడని పుకారుండేది.
యాండా లేకపోతే షలోం హోటలూ, పానశాల నడపగలిగే వాడు కాదు. ముగ్గురు మనుషుల పని ఆమె ఒక్కతే చేసేది. నౌకరు దొంగిలించకుండా కనిపెట్టుకుని వుండేది. షైండెల్కి ఉబ్బసం. షలోం మూత్ర పిండాలు పాడయ్యాయి. ఇద్దరికీ చచ్చిపోయిన కూతురు గురించి బెంగ. అంచేత భారమంతా యాండా మోసేది. అందరికన్నా రెండు గంటలు ముందర నిద్రలేచి, రాత్రి అన్ని పనులూ ఆయ్యాక పడుకునేది. పని భారంతోనో, ఏదన్నా రోగంతోనో యాండా కుప్ప కూలిపోతుందని దంపతులిద్దరూ భయపడుతుండే వాళ్ళు. ఆయినా మరి ఏ దేవుడో, దయ్యమో యాండా ఆరోగ్యం చెక్కు చెదరకుండా కాపాడుతూ వచ్చింది. తిండి మాత్రం దిట్టంగాతినేది; మిగిలిందేదయినా ఉంటే తానే తినేది. షలోం, షైండెర్ ఇద్దరికీ పంటి నొప్పిగాని, యాండా మాత్రం పటపటమని రాళ్ళను సైతం కొరికి నమలగలిగేది.
“అది మనిషికాదు, రాక్షసి” అంటుండేది షైండెల్.
యాండా వీధిని వెళ్తుంటే ఆడవాళ్ళు ఉమ్మేసేవాళ్ళు; కురాళ్ళు నానా దుర్భా పరుషలు ఆడి, కాళ్ళు కువ్వేవాళ్ళు; అమ్మాయిలయితే కళ్ళు దించుకొని ముసిముసిగా నవ్వుకునేవాళ్ళు. మాటిమాటికీ పోలీసులు ప్రశ్నించడానికంటూ ఆమెను పిలిచే వాళ్ళు, ఇలా సంవత్సరాలు గడిచాయి. గాని యాంకా షలోం దగ్గర పని చేయడం మానలేదు. కాలంతోబాటే అక్కడి కొచ్చే వారూ మారసాగారు. ఆ వూరు రష్యన్ల అధీనంలో ఉన్నంతకాలం రష్యన్లు వచ్చే వారు; ఆస్ట్రియన్ల హయాము లో జర్మన్లు, మగ్యార్లు, జెక్లు రాసాగారు; తర్వాత పోలెండుకు స్వాతంత్ర్యం వచ్చింది; ‘నెమలిపింఛం’ వార్సా, లుబ్లిన్ నగరాల నుంచి విచ్చేసే పోలీస్ అధికారులకు స్వాగతం పలికింది. ఎన్ని మార్పులు వచ్చినా యాండా మారలేదు. మరి చాకిరి అంతా చేయడానికి ఎవరో ఒకరుండాలి కదా… ఎంత గొప్పవారయినా, ఏ జాతివారయినా మగవారందరు రాత్రయితే యాండాను తమ పక్కలోకి పిలిచేవారు; కొండరు ముద్దాడే వారు; కొందరు చావబాదేవారు; కొందరయితే ఆమెనొక ‘ప్రీస్ట్’లా నుంచోబెట్టి
ఆమె ఎదుట మోకరిల్లి భోరున ఏడుస్తూ తమ పాపాలన్నీ చెప్పుకునేవారు. ఒక ఆఫీసర్ ఆమె నెత్తిమీద మద్యం గ్లాసుని నిలబెట్టి, దానిని తన రివాల్వర్ దెబ్బతో పడగొట్టాడు. ఇంకొకడామె భుజాల్ని కరిచి, జలగలా రక్తం పీల్చాడు. ఏది ఏమయినా పొద్దున్నే లేచి, స్నానం చేసి, జుత్తుదువ్వుకొని మామూలుగా పని ప్రారంభించేది యాండా. యాండా చేయని పనిలేదు; యాండా ఒక్కరోజు లేకపోతే ఆ హోటలు మూతపడిపోయేది.
ఆ పాత శిథిలమయిన హోటల్ భవనంలాగే దాని ముసలి యజమానులిద్దరూ చితికిపోసాగారు. షైండెల్ వీపు వంగిపోయింది; ఆమె ముఖం పాలిపోయి పెళుసయింది; మాటలో స్పష్టతపోయింది; నడక కష్టమయింది; కళ్ళుసరిగా కనపడేవి కావు; షలోం వద్దువద్దని వారించినా వినకుండా సూదిదారం పట్టుకొని ఏదన్నా పాతగుడ్డల్ని కుట్టడానికి కూచునేది. సూదిలోకి దారం ఎక్కించమని యాండా నడిగేది; ఏదో ఒకటి సణుగుతుండేది.
షలోం పెంచెవర్ ముఖం బూజు పట్టినట్లుగా అవసాగింది. చర్మం సంచుల్లా వేలాడసాగింది. ముడతల మధ్య ఎంత కడిగినా పోని నల్లదనం చోటు చేసుకుంది. అతడి తల ఇటూ అటూ ఆడుతూనే వుండేది. అయినా ఎవరన్నా అతిథిరాగానే షలోం హోటల్ రిజిస్టర్ ని తీస్తూ “అది కూడా కావాలా?” అని అడిగేవాడు.
తప్పనిసరిగా అతిథి “కావాలి” అనే వాడు.
2
ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. రోష్ హాషానా పర్వదినాలలో మొదటిరోజున షైండెల్ పడుకొని వుండగానే ప్రాణాలు విడిచింది. శ్మశానంలో కర్మకాండ దగ్గర షలోమ్ అన్నీ మరిచిపోవడమే! అక్కడికి వచ్చిన వాళ్ళందరూ షలోం కాళ్ళు వణికి గోతిలో పడ్డంత పనవడం గమనించారు.
భార్య మరణం తర్వాత షలోమ్ ఇంకా దిగజారిపోయాడు. పెట్టెలోంచి డబ్బు తీసేవాడు కాని ఆ డబ్బు ఏం చేసేవాడో గుర్తుండేది కాదు. చెవిలోకి అరిచినా వినపడేది కాదు.
ఆ తర్వాత ఆ వూరినది పొంగి ప్రవహించేలా విపరీతంగా వానలు కురిశాయి. అంత వర్షం ఆవూరి వారెవరూ ఎరగరు. హోటల్ పైకప్పు కురవసాగింది. మేడమీద పడుకున్న అతిథులు వచ్చి తమ పడకలన్నీ తడిసిపోతున్నాయని గోల పెట్టారు. షలోం తన గదిలో అలా పడి ఉన్నాడు. యాండా వారందరికీ క్షమాపణ చెప్పి, క్రింది అంతస్తులో పడకలు వేసింది. నిచ్చెన వేసుకొని పైకప్పు మీదకెక్కి బాగుచేయడానికి ప్రయత్నం చేసింది. కాని ఆ పాతకప్పు ఆమె పాదం తగలగానే టపటపమని రాలడానికి సిద్ధమైంది. పొద్దునలేచి పైసా ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఆతిథులు. శనివారం షలోం చర్చికని బయలుడేరి అడుగు వేయబోయి కిందపడ్డాడు. “యాండా! నా పనయిపోయింది” అని అరిచాడు. బ్రాందీ తెద్దామని పరుగెత్తింది యాండా.
కాని ఆపాటికే షలోం ప్రాణాలెగిరి పోయాయి. ఊరంతా గగ్గోలుపడి పోయింది. షలోంకి పిల్లలులేరు. ఆవాళ ‘సబ్బాత్’ దినమయినా, ఖాతరు చేయకుండా కొండరువచ్చి షలోం వీలునామా కోసం పెట్టెలన్నీ వెదికారు. అధికారులు వచ్చి షలోం ఆస్తి, వస్తువుల జాబితా తయారుచేశారు. అతడి గల్లాపెట్టెకు సీలు వేశారు.
షలోం పడ్డప్పుడు ఏడవడం ప్రారంభించిన యాండా అతడి శవాన్ని ఖననం చేశాకగాని ఏడుపు ఆపలేదు. అక్కడ ఆమె ఇరవై సంవత్సరాలు పనిచేసింది గాని ఆమె దగ్గర ఆరవై నాణాలు కూడా లేవు. అధికారులు ఆమెను బయటకి నడవమన్నారు. యాండా తన వస్తువులన్నిటినీ ఒక సంచిలో వేసుకుంది; సాధారణంగా చర్చికి వేసుకునే బూట్లు తొడుక్కుంది, శాలువా కప్పుకుంది. దూరాన వున్న రైలు స్టేషన్కు నడవనారంభించింది. ఆమెకు వీడ్కోలు చెప్పడానికి ఎవరూ లేరు.
స్టేషన్లో టిక్కట్లిచ్చే కిటికీ దగ్గర కెళ్ళి “సార్ ! స్కిబికాకు ఒక టిక్కట్టివ్వండి” అంది.
“అట్లాంటి స్టేషనేదీ లేదే!”
“అయ్యో రాతా! నేననాథనండీ! నేనింకెక్కడికి వెళ్ళాలికా దేవుడా?” అని రోదిస్తున్న యాండాను చూచి స్టేషన్లో వున్న రైతులు ఎగతాళి చేశారు; స్త్రీలు ఆమె మీద వుమ్మేశారు. ఒక యూదు వ్యాపారి ఆమె దగ్గర కొచ్చి ఆమె వూరి వివరాలు అడిగాడు. మొదట తనకేమీ గుర్తులేదంది యాండా, అతడు గుచ్చిగుచ్చి అడగగా తన వూరు షెజిన్, సోబ్కోల నడుమ కియక్ల్ దగ్గర వుందని చెప్పింది. ఆ వ్యాపారి ఆమె దగ్గర వున్న మూట విప్పమన్నాడు, అందులో వున్న నోట్లు లెక్కించడంలో ఆమెకు సాయపడ్డాడు. అతడు టిక్కట్లమ్మే వాడితో మాట్లాడాక ఆమెకు వివరంగా చెప్పాడు. “అమ్మా! ఆ వూరికి తిన్నగా వెళ్ళే రైలేదీ లేదు. కనుక గుర్రబ్బండి మీద రోజ్ వాడా వెళ్ళి, అక్కడి నుండి శాండో మియార్జ్ మీదుగా ఒపొలాకి వెళ్ళు. అక్కడినుండి స్కిబికాకు నడిచిగాని బండిమీదగాని వెళ్ళవచ్చు” అన్నాడు.
పరిచితమైన ఆ వూరి పేర్లు వింటుంటేనే యాండాకు ఏడుపు వచ్చింది. ఒకప్పుడు స్కిబికాలో తనకు అమ్మ, నాన్న, అక్కయ్య, బంధువులు వుండేవాళ్ళు. అమ్మ చనిపోయింది. నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు గాని రెండో పెళ్ళి అయ్యాక ఎక్కువ కాలం బతకలేదు. రైతు యువకుడు వాజ్ సియెచ్తో యాండా పెళ్ళి నిశ్చయమయింది. కాని పెళ్ళయేలోగా కమ్మరి వాడి కూతురు జీబా వచ్చి అతడిని ఎగరేసుకుపోయింది. షలోం పించెవర్ వద్ద పనిచేసినంత కాలమూ యాండాకు గతం గుర్తుకు రాలేదు. ఆ గతమనేది భూమికి ఆ చివర వున్నట్లు వుండిపోయింది. అయితే ఇప్పుడు తన యజమాని చనిపోయాక మళ్ళీ స్వగ్రామాన్ని వెతుక్కురాక తప్పిందికాదు. ఏమో, తనవాళ్ళెవరయినా బ్రతికే వున్నారేమో… అక్కడ ఇంకా తన్ను మర్చిపోని వాళ్ళెవరయినా వున్నారేమో..
ఎందరో మంచివాళ్లున్నారు. వాళ్ళంతా సాయం చేస్తారు అనుకుంది యండా. పతనదశలో తానున్నా ఆ ఊరు వదలి పెట్టిన దగ్గరనుంచీ ఆమెనెవరూ ఎగతాళి చేయలేదు. అగౌరవపరచలేదు. గుర్రబ్బగ్గీవాడు ఎక్కువ డబ్బు గుంజలేదు. గడ్డాలు, గిరజాలు వున్న యూదులందలికీ పోలండంతా కరతలామలకం కాబోలు! ఊళ్ళో దారుల్ని చకచకా చెప్పేస్తున్నారు. ఒక హోటల్లోనయితే ఒకతను ఆమె కోసం ‘మేప్’ తెప్పించి దారి చూపి వివరించాడు. తనలాంటి నిస్సహాయురాలి మీద వారందరికీ ఎంతజాలి ! ఆమె చాలా దూరం నడిచింది. దారిలో వర్షాలొచ్చినా జంకలేదు. మంచు కురిసింది. వడగళ్ళు పడ్డాయి. కొన్ని చోట్ల వాగులను దాటాల్సి వచ్చింది. రోజూ శుభ్ర మైన దుప్పట్లు, దిండ్లమీద వెచ్చగా పడుకునే యాంకా పడవుల కొట్టాలలోను, కటిక నేల మీద పడుకోవలసి వచ్చింది. తన బట్టలు తడిసిపోయినా కరెన్సీనోట్లు తడవకుండా జాగ్రత్త పడిందామె.
అంతా ఒక్కసారి వెనక్కు మళ్ళింది ఆమె మనసు. అప్పుడప్పుడూ షలోం పించెవర్ డచ్బిచ్చేవాడు. కాని తన దగ్గర ఏమీ మిగలబేదు. రష్యన్స్తో బాటు బాటు రూబుల్స్ కోపెక్స్ వచ్చాయి .ఆస్ట్రియన్ల హయాంలో క్రోనెన్లు, హెల్లర్లూ చలామణీ అయ్యాయి. బోల్షివిక్కులు, చెర్వాంట్సి ఉపయోగించేవారు. పోలిష్ నాణాలు జాటిస్లు. తనలాంటి నిరక్షరకుక్షి ఇన్ని మార్పులనెలా తెలుసుకుంటుంది. డబ్బునెలా జాగ్రత్త చేస్తుంది! అసలిప్పుడు ఈ ప్రయాణపు ఖర్చులకి డబ్బుండడమే పెద్ద విశేషం.
అయితే ఒక్కటి మాత్రం మారలేదు. తను ఎక్కడ వున్నా మగాళ్ళు తన్ను వెంబడించడం మానలేదు. ఎక్కడ పడుకున్నా ఎవడో ఒకడు వచ్చిపక్కలో చేరేవాడు. బండిలో రాత్రివేళ ఇంకెవరో తన్ను లాక్కునేవాడు. ఎందుకిలాచేస్తాలోకి నాలో ఏముందని’ – అని యాండా అనుకునేది. తనెప్పుడూ ఎవరినీ ఎదిరించరేక పోయేది, కాదనలేకపోయేది. తాను చెప్పి నది చేసేదాకా చిన్నప్పుడు తండ్రి చావ బాదేవాడు. సవతి తల్లి జుత్తు పీకేది. తనతో ఆడిన పిల్లలూ తన మొహానికి బురదపూసి, చేతికి చీపురిచ్చి, నానా అల్లరి పెట్టేవారు. షలోం హోటల్లో ఆతిథులు తన్ను పెట్టిన చిత్రహింసలకు నవ్వాలో, ఏడవాలో తెలిసేదికాదు. ఏదీ కాదనలేక పోయేది తాను. యవ్వనంలో స్వగ్రామంలో ఉండగానే ఇద్దరు పిల్లల్ని కన్నది; వాళ్ళిద్దరూ చనిపోయారు. తను చేసే బండెడు చాకిరీవలన గర్భస్రావాలయ్యేవి. తాను ప్రేమించి జీవితం అర్పిద్దామనుకున్న వాజ్ సియోచ్ చివరకు తనకు కాకుండా పోయాడు. తాను అనుభవించకుండా ఇతరుల వద్దకు పంపినందువల్ల కాబోలు షంలోం పించెవర్ మీద యాండాకి మనసయింది. అయితే అతడొక్క సారయినా యాండాననుభవించలేదు. అతడు “యాండా మూడోనంబరు గదికివెళ్ళు” “యాండా ఏడోనంబరు గది తలుపుతట్టు’ అని పురమాయించేవాడే కాని తన ముసలి భార్య షైండెల్కు అన్యాయం చేయలేదు. ఇతరులు ఎన్ని ఏది చేసినా కలగని సంతోషం – షలోం చల్లగా ఒక పలుకు పలికితేచాలు కలిగేది, తన శరీరాన్ని ఎందరో ఎన్నో విధాలుగానో అనుభవించారు. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు మాత్రమే గుర్తున్నారు. ఒకతను రష్యన్. అతను యాండాను తన మొహంమీద ఉమ్మి, తన గెడ్డం లాగమన్నాడు. తనను తిట్టమన్నాడు. ఇంకొకడు ఎర్రటి బుగ్గలున్న స్కూలు విద్యార్థి తనను గాఢంగా ముద్దాడి ‘అమ్మా’ అని పిలిచాడు. ఆ రాత్రంతా తన వక్షస్థలం మీద పడుకుని నిద్ర పోయాడు. ఆ రాత్రి ఇతర గదుల్లో అతిథులు తనకోసం కాచుకునివున్నా తను వెళ్ళలేదు.
ఇప్పుడు తాను పెద్దదయింది. తన వయసెంత? తనకేతెలియదు. నలభయ్యో, యాభయ్యో, ఏమో ? సాటివారంతా మనవల్ని ఎతుకుంటున్నారు. భగవంతుడూ, మానవుడూ అనాథగా వదిలివేసిన తను మాత్రం తన గ్రామానికి ఒంటరిగా వెళ్తోంది.
యాండా ఒక నిశ్చయానికి వచ్చింది. గ్రామం చేరాక ఇంకెప్పుడూ ఏ మగాడి దగ్గరకు రానివ్వకూడదని నిశ్చయించుకుంది. గ్రామాల్లో పొగలా పుకార్లు గుప్పు మంటాయి. నిప్పులా కొట్లాటలు అంటుకుంటాయి. ఎందుకొచ్చిన వెధవ గొడవ. నిజానికి ఈ వ్యభిచారం వల్ల తనెప్పుడూ ఇసుమంతయినా సుఖం కాని, సంతోషం కాని పొందలేదు.
3
యాండా స్వగ్రామమైన స్కిబికా చేరేటప్పటికి తెల్లవారింది. తన గ్రామం ఎంతో మారిపోయి వున్నప్పటికీ ఆమె గుర్తుపట్ట కలిగింది. గ్రామం పొలిమేరల్లో చర్చి మీద చిన్నారి క్రీస్తును పొదివి పట్టుకున్న మేరీ కన్య శిల్పం ఇంకా వుంది. మేరీ భుజం దగ్గర కొద్దిగా విరిగి వుంది. ఆమె మెడచుట్టూ, వాడిపోయిన మాల వుంది. కళ్ళల్లో నీరుబుకుతుండగా యాందా ఆ మంచులో మోకరిల్లింది. ప్రార్థించింది. గ్రామంలోకి నడిచింది.
పాత వాసనలు, పాత దృశ్యాలు గుర్తుపట్టసాగింది. భూమిలోకి చొచ్చుకుపోయినట్లున్న గుడిసెలకు చిన్న కిటికీలు, కిందుగా తలుపులు వున్నాయి. ఎండుటాకుల కప్పులన్నీ చివికి పోయున్నాయి. కాకులు అరుస్తున్నాయి. గొట్టాల నుండి పొగ పైకి లేస్తోంది. తమ గుడిసె వున్న చోట ఒక కమ్మరి దుకాణం వుంది. తన వీపు మీద వున్న సంచిని కిందకు దించింది. కుక్కలు యాంగా దగ్గరగా వచ్చి వాసన చూచి, మొరగసాగాయి. చిన్నవారెవరూ పోల్చలేక పోయారు కాని పెద్దవారు, ముసలి వారు ‘ఆమెను చూచి ఆశ్చర్యపోయారు! “ఓ జీసస్! ఓ మేరీ! నువ్వా?” అని బుగ్గలు నొక్కుకున్నారు. “ఔను! అంతా దేవుడి దయే! నేను యాండానే!”
నిద్రపోతున్న మగాళ్లు లేచివచ్చి చూడసాగారు. ఒక రైతు భార్య ఆమెను తన గుడిసెలోకి తీసుకెళ్ళింది. ఆమెకి నల్ల రొట్టి ముక్కా, పాలూ ఇచ్చింది. మురికిగా పున్న ఆ గుడిసెలో బంగాళ దుంపలు, బీట్ దుంపలు, నల్ల ముల్లంగి, బెర్రీలు నిండిన డబ్బాలున్నాయి. రాట్నం దగ్గర కూచున్న ముసలమ్మ చెవిలోకి ఒకావిడ అరిచింది: “అమ్మమ్మా! ఇది పవేల్ కచ్మా కూతురు, యాండా!” “జీసస్ మేరీ” అంటూ ముసల్ది ‘క్రాస్’ చేసుకుంది. అక్కడ చేరిన ఆడవాళ్లండరూ ఒక్కసారే మాట్లాడసాగారు. పవెల్ కచ్మా ఇల్లు కాలిపోయింది. యాండా సోదరుడు, బోలెక్ యుద్ధంలోకి వెళ్ళాడు. మళ్ళీ రాలేదు. ఆమె సోదరి స్టేసియా బిక్జ్యూలో ఒకతన్ని పెళ్ళాడింది. ప్రసవంలో మరణించింది. యాండాకు కాబోయిన భర్త వాజ్ సియెచ్ గురించి కూడా చెప్పారు. అతగాడు జోబాని పెళ్ళాడాడు. ఆమె పధ్నాలుగు మంది పిల్లల్ని కన్నది. వారిలో తొమ్మిదిమందే బ్రతికి వున్నాడు. కానీ వాళ్ళమ్మ టైఫాయిడు జ్వరం వాతపడింది. మొదటినుంచి తాగుబోతయిన వాజ్ సియెచ్ భార్య పోయాక చేస్తున్న పని మానేసి అస్తమానం తాగి దొర్లుతున్నాడు. అతడి కొడుకులు వీధుల వెంబడి తిరుగుతున్నారు. కూతుళ్ళేమో యూదుల ఇళ్ళల్లో బట్టలుతుకుతున్నారు. అతడి గుడిసె చిందరవందరగా ఉంటుంది. ఆడంగులు ఈ కబుర్లు చెబుతుండగా బయటనుండి ఎవరో ఒక పొడుగాటి మనిషిని లోపలికి నెట్టారు. సన్నగా, పొడుగ్గా వున్నాడు. పంట్లాం నిండా చిరుగులు, కాళ్ళకు జోళ్ళు లేపు, జాకెటు గుండీలు లేవు, జాకెట్ లోపల చొక్కా లేదు, దిష్టిబొమ్మలా తూలుతూ అతడు వచ్చి నిలబడ్డాడతను. చూపు పిచ్చివాడిలా వుంది. ముక్కు కారుతోంది. వంకర నోట్లోంచి ఒక పొడుగాటి పన్ను కనిపిస్తోంది.
“వాజ్ సియెచ్! ఇదెవరో పోల్చావా?” అని అడిగారెవరో.
“మచ్చల మొహం యాండా కదూ?”
నవ్వులు. చప్పట్లు, ఎన్నో ఏండ్ల తర్వాత యాండా మొహంలో సిగ్గు.
“ఎలా వున్నావో చూడు…”
“నువ్వు ఇప్పుడు వేశ్యవట కదా?”
మళ్ళీ నవ్వు.
“యాండా! ఇతగాడుత్త తాగుబోతు. ఇతడి మాటలు పట్టించుకోకు.”
“తాగుతున్నానా? నాకెవ్వరూ వోడ్కా కూడా ఇవ్వడంలేదు.”
యాండా పరిశీలనగా చూసింది, ఇతడేనా వాజ్ సియెచ్? కొన్ని పోలికలున్నాయి. నిజమే… ఆమెకు ఏడుపు వచ్చింది. షైండెల్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి- ‘వాడికన్నా ఆ సమాధుల కింద శవాల్లో కొన్ని అందంగా ఉంటాయి’ అనేది షైండెల్. మళ్ళీ వెనక్కు ఎందుకొచ్చానా అన్పించింది యాండాకు.
“వెళ్ళి ఇతగాడి సంతానాన్ని చూడరాదూ?” అందొకామె. యాండా తన మూటనెత్తుకుంది. రొట్టెకు, పాలకు డబ్బు లివ్వబోతే ఆ ఇల్లాలు మందలించింది-“ఇదేం పట్నవాసమనుకున్నావా? ఇక్కడ రొట్టె ముక్కకు ఎవరూ డబ్బు పుచ్చుకోరు.’
వాజ్ సియెచ్ గుడిసె ఆ పక్కనే వుంది. గుడిసె కప్పు భూమిని తాకుతున్నట్లుంది. అంచుల్లో గడ్డిపోచలు వేలాడుతున్నాయి. గాజు పలకలు పగిలిపోగా కిటికీలకడ్డంగా అట్టముక్కలూ, గుడ్డ పీలికలూ కుక్కి వుంచారు. గుహలోకెళ్ళినట్లుగా లోపలికి వెళ్ళాలి. నేలంతా చితికిపోయి వుంది. గోడలు పొగగొట్టం లోపలి భాగంలాగా నల్లగా వున్నాయి. మసక వెలుతురులో యాండా కొందరు అబ్బాయిలను, అమ్మాయిలను చూసింది. మాసిన బట్టలు కంపుకొడుతున్నాయి. ఏదోపులిసి పాడవుతున్న వాసన వస్తోంది. ముక్కు పట్టుకుంది యాంకా. తొట్టి దగ్గరగా ఇద్దరమ్మాయిలున్నారు. దిగంబరంగా బురదలో పొర్లాడుతున్నారిద్దరూ. పిల్లి తోక లాగుతున్నాడొకడు. “ఒంటికన్ను అబ్బాయి ఒకడు ఏదో బాగుచేస్తున్నాడు. యాండా తికమకపడింది. ఇంత మురికి, అశుభ్రత ఆమె ఎరుగదు. హోటల్ల్లో వారానికోసారి దుప్పట్లు మార్చేవారు. ప్రతీ మూడవ రోజూ శుభ్రంగా ఉతికిన తువ్వాలిచ్చేవారు.
మురికిని ఎవరయినా తీస్తేగాని పోదు కదా…ఆమె చేతులు మడిచి రంగంలోకి దిగింది. తనడగ్గర ఇంకా మిగిలి వున్న నాణాలను ఒక పిల్లకిచ్చి, కొట్టుకెళ్ళి తినడానికి ఏమన్నా తెమ్మంది. ఆ పిల్ల తెచ్చాక ఆ తినుబండారాల మీదకా పిల్లలు ఎంత ఆత్రంతో ఎగబడ్డారో! గుడిసెనంతా చిమ్మి, రుద్ది, కడగసాగింది. యాండా. మొదట ఆడపిల్లలు పట్టించుకోకుండా వూర్కున్నారు. కాసేపయ్యాక మా ఇంటి గొడవల్లో తల దూర్చకు – అన్నారు. అప్పుడు యాండా “మీ అమ్మ నా స్నేహితురాలమ్మా! మీరు నాకేమీ డచ్చివ్వనక్కరలేదు” అంది.
సాయంకాలందాక అలా పని చేస్తూనే వుంది యాండా. వేన్నీళ్ళు కాచి పిల్లలందరికీ నీళ్ళు పోసింది. డబ్బుతో సబ్బు, దువ్వెన, కిరోసిన్ తెప్పించింది. కిరోసిన్ తలకు రాచి దువ్వితే పేలు పోతాయికదా!
అందరూ కలిసి పెద్ద పీటలాంటి దాని మీద పడుకుని నిద్రపోయారు. సరిపడినన్ని దుప్పట్లు లేవు. వాళ్ళ మీద తన గుడ్డల్ని తీసి కప్పింది యాండా. చీకటయ్యాక గుమ్మంలోకి వచ్చాడు వాజ్ సియెచ్. ఆడపిల్లలందరూ కిచకిచ లాడారు. ఆ ఒంటికన్ను అబ్బాయి స్టెఫాన్ యాండాకు కాస్త దగ్గరయ్యాడు. “కంపు ముండాకొడుకు వస్తున్నాడు” అన్నాడు.
“ష్… తండ్రి నావిధంగా అనకూడదు, తప్పు” అంది యాండా.
“తండ్రి కాదు కుక్క!” అని స్టెఫాన్ ఒక సామెత చెప్పాడు.
యాండా వాజ్ సియెచ్ తినడానికని కొంత మాంసం అదీ వుంచింది. కానితప్ప తాగి వచ్చిన అతగాడు ఏమీ తినే పరిస్థితిలో లేడు. మొదలు నరికిన చెట్టులా నేలమీద కొరిగిపోయాడు. కూనిరాగాలు తీస్తూ నిద్రపోయాడు.
గుడిసె వెనకాల పాకలో చాప వుందని, యాండా అక్కడ పడుకోవచ్చనీ అన్నాడు స్టెఫాన్. చూపిస్తాను రమ్మని ఆమె తీసుకువెళ్ళాడు. పాత తలుపు తీసి ఆమె లోపలికి అడుగుపెట్టగానే ఆమెను తటాల్న తోశాడు. ఆమె పడగానే ఆమెమీద పడ్డాడు. ‘పాపం, ఇది పాపం’ అని చెప్పబోయిన యాండా నోటిని మూసివేశాడు. ఆమె పెనగులాడితే పిడికిలితో బలంగా పొడిచాడు. అలా ఆ చీకట్లో, కర్రముక్కలు, చెత్త, చివికిపోతున్న తాళ్ళ మీద ఆమె పడివుండగా ఆ కుర్రవాడు తన దాహం తీర్చుకున్నాడు.
కళ్ళు మూసుకుంది యాండా. ‘నరకం కూడా సరిపోదు నాకు’ అనుకుంది. “అయ్యో! అన్నీ సరిగా జరిగివుంటే నేను నీకు అమ్మనౌదును కదరా! నీకు అమ్మనయి వుందును కదరా” అని సణిగింది యాండా నిస్సహాయంగా.
