పంజరం పూర్తయింది. అలవాటు కొద్దీ బాల్తజార్ దాన్ని చూరు దూలానికి వేలాడదీసాడు. భోజనం ముగించుకుని బయటికొచ్చేటప్పటికి ఇక్కడ గుమిగూడిన ప్రతి ఒక్కరూ దాన్ని ప్రపంచంలోకెల్లా సొగసైన పంజరం అంటూ పొగుడుతున్నారు. ఎక్కడెక్కడ్నించో వచ్చినట్టున్నారు జనం. ఇంటిముందు పెద్ద గుంపే పోగయ్యింది.
బాల్తజార్ పంజరాన్ని కిందకి దించి, జనానికి “సరిసరి-ఇక పదండి” అని చెప్పాల్సి వచ్చింది.
అతని భార్య ఉర్సులా “గడ్డం చేసుకోవాలి. బూచిలా కనిపిస్తున్నావ్” అన్నది అతనితో.
“మధ్యాహ్నం భోజనం తర్వాత గడ్డం చేసుకోడమేంది? మంచిది కాదంటారే” అన్నాడు బాల్తజార్.
రెండువారాల గడ్డం – పొట్టిగా, బిరుసుగా, బలంగా కంచరగాడిద మీద బొచ్చులా, వొత్తుగా కుచ్చుగా కనిపిస్తున్నాయి గడ్డంలో వెంట్రుకలు. అతని ముఖం బెరుగ్గా బెదురుతున్న చిన్నకుర్రాడి ముఖం మల్లే ఉంది. కానీ కుర్రాడేం కాదు. పోయిన ఫిబ్రవరి నెల్లో అతనికి ముప్పై నిండాయి. ఉర్సులాతో కాపరం మొదలెట్టి నాలుగేళ్ళయిపోయింది. ఉర్సులాను పెళ్లైతే చేసుకోలేదు. పిల్లలూ లేరు. జాగ్రత్తగా ఉండడమన్నది అతనికి బ్రతుకే నేర్పింది. కానీ, భయపడాల్సింది, బెరుకు పడాల్సింది ఇంతవరకైతే అనుభవంలోకి రాలేదు. ఇప్పుడు తను తయారు చేసిపెట్టిన పంజరం చాలామంది దృష్టిలో ప్రపంచంలో కెల్లా సొగసైందన్న మాట కూడా అతనికి తెలీదు. చిన్నతనం నుంచీ పక్షిగూళ్ళు చేసి చేసి ఉన్న అతనికి, ఈ గూడు అంత అందమైందనీ, మిగిలిన వాటితో పోల్చితే కష్టమైందనీ, విశిష్టమైందని కూడా అతననుకోలేదు.
“సరే, కొంచెంసేపొచ్చి పండుకో. ఆ మాసిన గడ్డంతో నువ్వెవరికీ కనిపించక్కర్లేదు” – అందామె.
దుప్పటి కప్పుకుని పడుకొని ఉన్న తర్వాత ఉర్సులా కోరిక ప్రకారం, అతను చాలాసార్లు ఇవతలికొచ్చి ఇరుగు పొరుగు వాళ్లందరికీ పంజరం చూపించాల్సి వచ్చింది.
అప్పటి వరకూ ఉర్సులా ఆ పంజరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పెనిమిటి షాపులో అసలు వడ్రంగం పని మానేసి, రెండువారాలుగా ఈ పంజరం మీదే అదేపనిగా పడడం ఆమెకు చిరాకు కలిగించింది కూడా. ఈ రెండు వారాలూ మనిషి సరిగ్గా కునుకు తీస్తేగా? నిద్రలోంచి ఉలిక్కిపడి ఏదో అర్ధం కాకుండా గొణుక్కోవడం- పైన. ఈ రెండు వారాలుగా పెరిగిన గడ్డం గీసుకోవాలన్న తెలివిడి కూడా లేకుండా పోయింది. ఆమెను ఇప్పటిదాకా పూనిన చిరాకూ, కోపం-పంజరం చివరి రూపు కొచ్చేటప్పటికి మాయమైపోయాయి.
బాల్తజార్ కునుకు తీసి లేచేప్పటికి ఆమె బాల్తజార్ ప్యాంటూ, చొక్కా ఇస్త్రీ చేసి, ఆ బట్టలు అతని పక్కకి దగ్గర్లో, కుర్చీమీద జాగ్రత్తగా వుంచింది. పంజరాన్ని తీసుకెళ్ళి భోజనాలు చేసే బల్లమీద పెట్టి, నిశ్శబ్దంగా పరిశీలనగా చూడ్డం మొదలెట్టింది.
“ఎంతడుగుదామనుకుంటున్నావయ్యా” అంది చూసి చూసి.
“ఏమో ముప్ఫై పెసోలడుగుదామనుకుంటున్నా… ఇరవై అయిదు దాకా ఇస్తారేమో చూడాలి” అన్నాడు బాల్తజార్.
“యాభై అడుగు… ఈ రెండు వారాల్నించీ చానా నిద్ర చెడగొట్టుకుని పనిజేసావ్. శాల్తీ కూడా బాగా పెద్దది. నేను ఇప్పటిదాకా చూసిన పంజరాల్లో ఇంత పెద్దదెక్కడా చూళ్ళా”, – అంది ఉర్సులా.
బాల్తజార్ గెడ్డం గీసుకుంటూ “యాభై ఇస్తారంటావా వాళ్ళు?” అన్నాడు.
“జోసి చెపీ మోంటియల్కి యాభయి లెక్కా? అయినా ఈ గూడుకి యాభై చ్చితీరాలి. అసలు నువ్వు అరవై అడగాలి, మాట్లాడ్తే…” అంది ఉర్పులా.
ఇల్లంతా ఊపిరాడనివ్వని నీడ ఆవహించింది. అది ఏప్రిల్ మాసం, మొదటి వారం ఎండ భరించ లేనంతగా వుంది. కీచురాళ్లు, కీటకాలు చేస్తున్న రొదకి, ఎండ- ఉన్నదానికంటే ఇంకా చిరాగ్గా అనిపించింది.
బట్టలు తొడుకున్న తర్వాత బాల్తజార్ వరండా వైపు తలుపు తీశాడు – ఇల్లు కొంచెం చల్లబడుతుందని. అదే అదనుగా యిరుగు పొరుగు పిల్లల గుంపొకటి భోజనాలగదిలోకి గబిక్కిన దూరింది. బాల్తజార్ పంజరం వార్త ఊరంతా పాకిపోయింది.
వృత్తిరీత్యా, డాక్టరయిన ఆక్టోవియో జిరాల్డో బాల్తజార్ పంజరం గురించి తన రోగిష్టి భార్యతో భోజనం చేస్తూ ఆలోచించసాగాడు. అక్టోవియో వృద్ధుడయిపోయాడు గానీ, జీవితం మీద అనురక్తి ఇంకా చావలేదు. కానీ ఈ మధ్యే డాక్టరు వృత్తి మీద మాత్రం మొహం మొత్తింది. ఉడుగ్గా ఉండేరోజుల్లో లోపలి వరండాలో డైనింగ్ టేబుల్ వేసుకుంటారా దంపతులు. అవ్వాళ కూడా బోలెడు పూలకుండీలు, పసుపురంగు పాలపిట్టలున్న రెండు పంజరాలు ఉన్నాయక్కడ. ఆయన గారి భార్యకి పక్షులంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే, పక్షుల్ని తినేస్తాయేమోనని పిల్లుల్ని అసహ్యించుకునేంత. అవిడ గురించి ఆలోచిస్తూ ఆక్టేవియో ఆరోజు మధ్యాహ్నం ఓ రోగిని చూడ్డానికని వెళ్లి, వస్తూ దారిలో బాల్తజార్ ఇంటి ముఖం పట్టాడు పంజరం చూసేందుకు.
అప్పటికే భోజనాల గది చాలామంది మనుషుల్తో కిటకిటలాడుతోంది. పంజరం టేబిల్ మీద ఎక్కించి వుంది. సంక్లిష్టమైన వైరు అల్లిక, లోపల మూడు అంతస్తులు రాకపోకలకి దారులూ, తినేందుకు, పండుకునేందుకు మాత్రం ప్రత్యేక గదులు – పిట్టలు వినోదంకోసం ఉయ్యాలలూగేందుకు, ఆరు బయట ఖాళీ స్థలం. మొత్తంగా ఓ పెద్ద సైజు బస్ ఫ్యాక్టరీకి చిన్న నమూనాలాగా కనిపించింది.
డాక్టరు -పంజరాన్ని చేత్తో ముట్టుకోకుండానే జాగ్రత్తగా పరికించాడు, ఆగూడు జనం అనుకునే దానికంటే గొప్పగా వుందని అర్థమయింది. తన భార్యకోసం తను కలలుగన్న పంజరంకంటే చాలా అందంగా ఉన్నదనీ తెలిసిపోయింది.
“ఇదే…. కల్పనకి రెక్కలు రావడమంటే అద్భుతం” అంటూ ఆ గుంపులో బాల్తజార్ ఎవరంటూ వెదుకుతూ చివరికి బాల్తజార్ని కనిపెట్టి ఒక రకమైన వాత్సల్యంతో చూస్తూ “నువ్వు గొప్ప శిల్పివో, ఇంజినీరునో అయుండాల్సిందయ్యా” అన్నాడు.
బాల్తజార్కి సిగ్గనిపించింది. “మీదయ.” అన్నాడు.
“నేను చెప్తున్నది నిజం” అన్నాడు డాక్టరు. యవ్వనంలో ఉన్న అపూర్వ సౌందర్యవతి అయిన స్త్రీ లాగా ఆయన వళ్లు గుండ్రంగా సుతారంగా బొద్దుగా ఉంది. ఆయన చేతులు సైతం సున్నితంగా, సుతారంగా ఉన్నాయి. ఆయన గొంతు లాటిన్ మాట్లాడే పూజారి మాదిరి ధ్వనించింది.
“అసలు పక్షుల్ని ఈ పంజరంలో ఉంచి తీరాలని లేదు” అని గొణుగుతూ, అక్కడున్న ప్రేక్షకుల ముందు గూడుని వేలం వేస్తున్న మాదిరి గుండ్రంగా దీక్షగా తిప్పాడు.
“చెట్లమధ్య అలా వేలాడదీస్తే చాలు. పంజరం తనలో తానే పాటలు పాడుకుంటుంది” అంటూ దాన్ని టేబుల్ మీద పెట్టి ఒకక్షణం ఏదో ఆలోచించి పంజరాన్ని తదేకంగా చూస్తూ అన్నాడు –
“సరే, అయితే మరి నేను పుచ్చుకుంటాను దీన్ని”.
“అది అమ్ముడయిపోయింది”, అంది ఉర్సులా.
“జోసి చెపీ మాంటియల్ కొడుకుదీ పంజరం. అతనే ప్రత్యేకంగా అడిగి చేయించుకున్నాడు” – అన్నాడు బాల్తజార్.
డాక్టరు గౌరవప్రదమైన పద్దతిలో “అతనే ఇచ్చాడా ఈ నమూనా. ఈ డిజైను? ” అని అడిగాడు.
“ఊహు ఆ అబ్బాయి – ఓ పెద్ద పంజరం కావాలని, రెండు పెద్ద పక్షులుంచుకునేందుకనీ మాత్రం చెప్పాడు” జవాబిచ్చాడు బాల్తజార్.
డాక్టరు మళ్లీ ఒకసారి పంజరం వంకచూసి, “కానీ ఇది పెద్దపక్షులకోసం కాదే? ” అన్నాడు.
“అయ్యో… ఇది వాటికే డాక్టరు గారూ” అంటూ బాల్తజార్ టేబుల్‌కి దగ్గరగా వచ్చాడు.
అక్కడున్న పిల్లలందరూ అతని చుట్టూ మూగారు. “కొలతలన్నీ జాగ్రత్తగా లెక్కబెట్టి తయారు చేశాను” అంటూ, చూపుడు వేలుతో గూడులో ఉన్న రకరకాల గదులు చూపించాడు. గూడు పైభాగాన్ని మెటికల్తో ముట్టుకోగానే, దాన్నిండా మత్తుకొలిపే ప్రతిధ్వనులు నిండిపోయాయి.
“ట్రూపియల్ పక్షుల పట్టేంత పెద్దది అంటే, ఇలాంటిదే” అన్నాడు బాల్తజార్.
నా దగ్గరున్న వాటిలో ఇది బలమైన తీగ. అతుకు లోపలా, బయటా పకడ్బందీగా సోల్డరింగు చేశాను” బాల్తజార్ ఉత్సాహంగా చెప్పాడు.
“రామచిలక పట్టేంత పెద్దది కదా, ఈ గూడు” అడ్డం వచ్చాడో కుర్రాడు. గుంపులోంచి.
“ఆ, అవును, ఈ గూడు సైజు ఎలాగూ పెద్దదే”నన్నాడు బాల్తజార్.
డాక్టర్ ఇంతలో తల ఇటుతిప్పి “సరి, కానీ, నమూనా మాత్రం మాంటియల్ కొడుకిచ్చింది కాదు. అతనైతే నీకు కచ్చితమైన కొలతలు ఇవ్వలేదు… అతను చెప్పిందేమిటంటే ట్రూపియల్ లాంటి పెద్ద పక్షులు పట్టేంత పెద్దగా గూడు తయారు చేయమని అంతేకదూ? ” అన్నాడు.
“సరిగ్గా అంతే” అన్నాడు బాల్తజార్.
“మరిక సమస్యే లేదు. ట్రూపియల్ పక్షుల కోసం తయారవాల్సిన గూడు వేరు. ఈ గూడు వేరు. ఇది- మాంటియల్ కొడుకు తయారు చేయమన్న గూడే అనడానికి ఏ రుజువూ లేదు” డాక్టరు నిబ్బరంగా చెప్పాడు.
బాల్తజార్ కంగు తిన్నట్టయి- “లేదు లేదు. ఈ గూడు అదే అతను తయారు చేయమన్నదే. నేను తయారు చేసింది. తనకోసమే” అన్నాడు.
డాక్టరుకి ఓపిక చచ్చింది. అసహనంగా కదిలాడు.
“ఏమయ్యో….. నువ్వు ఇంకో గూడు తయారు చేయలేవా, ఏంటి? ” ఉర్సులా మొగుడి వంక చూస్తూ అని, డాక్టరు వైపుకి తిరిగి “… మీకు తొందరేం లేదు కదా!” అంది ఆయన్ని సముదాయిస్తున్నట్టుగా.
“అయ్యో! ఈ మధ్యాహ్ననికి నా భార్యకు బహుమతిగా ఇస్తానని మాటిచ్చాను” అన్నాడు డాక్టరు.
“మన్నించండి డాక్టరు గారు…. ఒకసారి అమ్ముడయిన వస్తువు ఇంకోసారి మీకు అమ్మలేను” – కరాకండిగా చెప్పాడు బాల్తజార్.
డాక్టరు నిస్సహాయంగా భుజాలెగరేశాడు. రుమాల్తో మెడమీది చెమట తుడుచుకుంటూ పంజరాన్ని తదేకంగా, మౌనంగా నడిసంద్రంలో వున్న నావను చూస్తున్నంత నిరాశగా గురిలేని దృష్టితో చూడసాగాడు.
“ఎంత ఇచ్చారు వాళ్లు దీనికి?”
జవాబు చెప్పకుండా బాల్తజార్ ఉర్సులా కళ్లువెదికాడు.
“అరవై, అరవై పిసోలు” ఉర్సులానే చెప్పింది.
డాక్టరు పంజరం వంకే చూస్తూండిపోయాడు. నిట్టూరుస్తూ, “చక్కటి గూడు. నిజంగా, ఎంత అందమైన గూడు!”. ద్వారం వంక కాళ్ళీడుస్తూ, గాలికోసం అన్నట్టు చేతుల్తోనే విసురుకోవడం మొదలెట్టాడు. చిరునవ్వు వచ్చి చేరింది అతని ముఖంలో. ఈ సంఘటన తాలూకు స్మృతులు సైతం అతని జ్ఞాపకంనించి తొలిగిపోయాయి.
“మాంటియల్ చాలా డబ్బులున్న మనిషి” అన్నాడు చివరగా.
నిజానికి జోసి మాంటియల్ బయటికి కనిపించేంత సంపన్నుడేం కాదు. అయితే సంపన్నుడు అయ్యేందుకు ఏంచేయడానికైనా సిద్ధమయ్యే మనిషి. బాల్తజార్ ఇంటికి కొన్ని ఇళ్లవతల, విపరీతంగా సామాన్లు నిండిన ఇంట్లో, ఏ వార్తనయినా డబ్బుగా మార్చుకోగలిగే సత్తావున్న ఇంట్లో, ఈ పంజరం ఊసు మాత్రం పట్టకుండా నిర్నిమిత్తంగా ఉండిపోయాడు జోసి మాంటియల్. అతని భార్య, మృత్యుభయంతో, మధ్యాహ్న భోజనమైన తర్వాత తలుపులూ కిటికీలు మూసుకుని, కదులుతున్న నీడల్ని మాత్రం గమనిస్తూ తన గదిలో గత రెండు గంటలుగా పడి ఉంది. ఆ సమయంలో జోసి మాంటియల్ సన్నగా కునుకుతీస్తున్నాడు. బయట కలగాపులగంగా వినిపిస్తున్న స్వరాల్ని విని ఆమె అబ్బురపడింది. మధ్యనున్న పెద్దగది తలుపులు తెరిచేటప్పటికి ఇంటి ఎదురుగా పోగయిన గుంపు కనిపించిందామెకి. మధ్యలో చేత్తో పంజరం పట్టుకుని బాల్తజార్ నిలుచున్నాడు. తెల్లటి దుస్తుల్లో, అప్పుడే చేసుకున్న గడ్డం మెరుపుతో, సంపన్నుల ఇళ్ళలోకి ప్రవేశించే పేదల గమ్మత్తు గాంభీర్యంతో కనిపించాడు బాల్తజార్ ఆమెకి.
“ఎంత అద్భుతంగా ఉందిదీ!” జోసి మాంటియల్ భార్య కళ్లు మెరుస్తూ ఆశ్చర్యపోయాయి. బాల్తజార్ని లోనికి రమ్మని పిలుస్తూ “నా జీవితంలో ఇంతటి అద్భుతమైన గూడు చూడలేదు” అన్నది. అక్కడ పోగుపడ్డ గుంపును కొంచెం అసహనంగా పరికించి “లోపలికి తీసుకురా బాల్తజార్…… లేకపోతే ఈ ఇంటి డ్రాయింగ్ రూమ్ కాసేపటికి సర్కసు స్టాండయేట్టుంది” ముక్తాయించింది.
జోసి మాంటియల్ ఇల్లు బాల్తజార్కి కొత్తేం కాదు. అతని నేర్పు కారణంగా, వెనకముందు వంకర బేరాలు చెయ్యని ముక్కుసూటిదనంగా కారణంగా, ఈ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వడ్రంగం పన్లు, చెక్క పనులనన్నింటికి బాల్తజార్ని పిలిచేవాళ్లు. సంపన్నుల ఇళ్లలో బాల్తదార్ స్వేచ్ఛగా ఉండలేడు. సంపన్నుల ఇళ్లలో ఎడతెగకుండా వాదించే అనాకారి భార్యలు, అబ్బురమనిపించే ఆపరేషన్లు చేయించుకునున్న వాళ్ళ అవయవాలు ఇవన్నీ ఎప్పుడు చూసినా అతనికి జాలి లాంటి అనుభూతి తన్ను కొచ్చేది. వారిళ్లకి ఎప్పుడు వెళ్లినా, కాళ్ళీడ్చుకోకుండా గుమ్మంలోకి ప్రవేశించడం అతనికి సాధ్యమయేది కాదు.
“పెపీ ఇంట్లో ఉన్నాడా” అడిగాడు మాంటియల్ భార్యనీ ఆమె కొడుకునుద్దేశించి. అప్పటికే పంజరాన్ని భోజనాల బల్ల మీదుంచాడు.
“పెపీ స్కూల్లోనే ఉన్నాడుగా” అంటూ- “ఎంతో సేపు పట్టదు… వచ్చేస్తాడు. ఆయన మాత్రం స్నానం చేస్తున్నారు” అంది.
నిజానికి మాంటియల్కి స్నానం చేసేంత నిలకడలేదు. అర్జెంటుగా…… స్నానాల గదిలో ఉన్న సెంట్లుతో చిన్న “పిచ్చుక స్నానం” చేస్తున్నాడు. బయట కోలాహాలం యేవిటో అతనికి అంతు బట్టడం లేదు. తొందరగా బయటికొచ్చి అదేంటో కనిపెట్టాలని అతని తాపత్రయం. మాంటియల్ ఎంత జాగ్రత్తపరుడంటే ఇంట్లో జరిగే ప్రతివిషయం అతని చెవిని పడాలని ఫ్యాన్ కూడా వేసుకోకుండా పండుకునే మనిషి.
“ఏడిలేడ్! ఏం జరుగుతోందక్కడ?” గట్టిగా అరిచాడు మాంటియల్.
“రండి, రండి. వచ్చి ఈ అద్భుతాన్ని చూడండి” – అతని భార్య బదులిచ్చింది. దుబ్బు వెంట్రుకలు కప్పిన ఊబవళ్లు జోసి మాంటియల్ది. కంఠం చుట్టూ తువ్వాలుతో పడకగది కిటికీలోంచి కనిపించాడు.
“ఏమిటదీ?”
“పెపీకి గూడు” బాల్తజార్ చెప్పాడు.
మాంటియల్ భార్య అయోమయంగా అతనివంక చూసింది.
“ఎవరిదీ…”
“పెపీది” బదులిస్తూనే మాంటియల్ వైపుకి తిరిగి “పెపీ!” వత్తిపలుకుతూ అరిచాడు.
“వాడింకా రాలేదు” కొయ్యబారి వినీవినపడనంత నెమ్మదిగా చెప్పింది భార్య.
ద్వారంలో పెపీ ప్రత్యక్షమయ్యాడు!
అతనికి పన్నెండేళ్లుంటాయేమో. తల్లికి లాగే వంకర తిరిగిన కనుబొమలు, విచారగ్రస్తమైన ముఖం.
“ఇక్కడికి రా నువ్వు. దీన్ని నువు తయారు చేయమన్నావా?” గుచ్చి గుచ్చి అడిగాడు జోసి మాంటియల్.
పిల్లాడు తలదించుకున్నాడు. ఒక్కసారిగా వాడి జుట్టు పట్టుకుని పెపీని తనకళ్ల వంక చూడమని ఆజ్ఞాపిస్తూ తండ్రి “చెప్పు జవాబు చెప్పు!” అని గద్దించాడు.
జవాబివ్వకుండా పిల్లాడు పెదవి కొరుక్కున్నాడు.
“మాంటియల్!” లోగొంతులో వేడుకుంది తల్లి.
మాంటియల్ పిల్లాడ్ని వదిలి పెట్టి, బాల్తజార్ వంక గుర్రుగా చూస్తూ “నీకు కనీస యింగితం లేనందుకు విచార పడ్తున్నానోయ్. గూడు తయారు చేయబోయేముందు నన్ను సంప్రదించాలని కూడా నీకు తోచలేదు. ఒక పసివెధవతో వ్యాపార లావాదేవీలు మాట్లాడుకోవడం, పని ప్రారంభం చెయ్యడం నీలాంటివాడికే చెల్లింది” అన్నాడు.
బాల్తజార్తో మాట్లాడుతున్న క్రమంలో మాంటియల్ కొంత కుదుట పడ్డాడు. పంజరం వంక కూడా చూడకుండా దాన్ని యెత్తి బాల్తజార్కి అందించాడు.
“ముందు దీన్నిక్కణ్ణించి తీసుకెళ్లు… నీ ఇష్టమొచ్చిన వాడికి అమ్ముకో… ముందొకటి గుర్తుంచుకో. నాకు నీతో వాదనలు చేసే ఓపికలేదు. కనుక, దయచేసి నన్ను ఒప్పించడానికి దిగకు” అంటూ బాల్తజార్ వీపుతట్టి, ఇలా పొడిగించాడు – “డాక్టరు నాకు కోపతాపాలు కూడవని చెప్పాడు”.
చిన్న కుర్రాడు నిశ్చలంగా రెప్పకూడా వాల్చకుండా ఉండిపోయాడు. బాల్తజార్ ఒక చేత్తో పంజరం పట్టుకుని సంశయంగా వాడి వంక చూశాడు అంతే. గురు గురుమంటూ ఓ గమ్మత్తు శబ్దం వాడి గొంతులోంచి తన్నుకొచ్చింది. అది కుక్కలు చేసే మంద్రపు అరుపులా వినిపించింది. కాసేపట్లో, వాడు తీవ్రంగా గాలిని కోసేంత బలంగా అరుస్తూ నేలమీది పడి కొట్టుకోడం మొదలుపెట్టాడు.
జోసి మాంటియల్ కొడుకు వంక నిర్వికారంగా చూశాడు. తల్లి వాడ్ని సముదాయించేందుకు ప్రయత్నిస్తుంటే “వాడ్ని పట్టించుకోవద్దు. పైకి లేపద్దు. తల బాదుకుని చావనీ. తలపగిలిన తర్వాత, కొంచెం ఉప్పూ, నిమ్మకాయా పెట్టు- పగుళ్లలో.. వెర్రెక్కి గుండెలవిసేదాకా మళ్లీ మళ్ళీ గుక్క పెట్టనీ వెధవని” అన్నాడు.
మాంటియల్ పిల్లాడు కళ్లవెంట చుక్క కూడా కారకుండా బదా బదలుగా గోలపెడుతుంటే, తల్లి వాడి ముంజేతులు పట్టుకుని బతిమలాడింది.
“వాడ్ని పట్టించుకోకు. వదిలెయ్” గద్దించాడు మాంటియల్.
చచ్చిపొయ్యే ముందు పిచ్చికుక్క చేసే చేష్టల్ని గమనించినట్టు బాల్తజార్ కుర్రాడి వైనాన్ని గమనించాడు. దాదాపు నాలుగ్గంటలయింది. ఆ సమయంలో, బాల్తజార్ ఇంట్లో ఉర్సులా ఓ పాత పాటను రాగాలు తీస్తూ ఉల్లిపాయలు తరుగుతుంది.
“పెపీ” పిలిచాడు బాల్తజార్. చిరునవ్వుతో కుర్రాణ్ణి సమీపించి, పంజరాన్ని వాడికందించాడు. కుర్రాడు గభీమని ముందుకు దూకి పంజరాన్ని పొదివిపట్టుకుని కౌగిలించుకున్నాడు. పంజరం దాదాపు వాడంత పెద్దగా వుంది. జాగ్రత్తగా దాన్ని హత్తుకుంటూ నిలువు అడ్డం గీతల్లోంచి బాల్తజార్ వైపు చూడసాగాడు – ఏం చెప్పాలో వాడికి అర్థంకాలేదు.
జోసి మాంటియల్ సున్నితంగా “బాల్తజార్! దాన్ని తీసుకుపొమ్మని చెప్పి చాలా సేపయింది” అన్నాడు.
“ఇచ్చెయ్. బాల్తజార్కి ఇచ్చేయ్” కొడుకుని ఆజ్ఞాపించింది మోంటియల్ భార్య.
“ఉంచుకో” అంటూ బాల్తజార్, జోసి మోంటియలనుద్దేశించి, “నేనెందుకు తయారు చేసినట్టు? కుర్రాడికోసం కాకపోతే” అని ప్రశ్నించాడు.
జోసి మాంటియల్ బాల్తజార్ వెనకాలే హాలు దాకా నడిచాడు. “తెలివితక్కువగా మాట్లాడకు” అంటూ బాల్తజార్ దారికడ్డం వచ్చి “ఈ సామాను నువ్వుతీసుకపో, మూర్ఖంగా చెయ్యకు. ఒక్క సెంటుకూడా నాదగ్గర్నించి నీకు రాదు” – అన్నాడు.
“మరేం ఫర్లేదు. పెపీకి బహుమతిగా మాత్రమే నేనీ గూడు తయారు చేశాను. దీనికేదో ప్రతిఫలం వస్తుందని చెయ్యలేదు” -బాల్తజార్ జవాబిచ్చాడు.
అక్కడ దారికడ్డంగా గుమికూడిన ప్రేక్షకుల్లోంచి, బాలజార్ దారి చేసుకుని పోతున్నాడు. లోపల, హాల్లో జోసి మోంటియల్ కేకలు గట్టిగా వినిపిస్తున్నాయి. మోంటియల్ ముఖం వివర్ణమైంది. కళ్లు రక్త వర్ణంలోకి మారుతున్నాయి.
“మూర్ఖపు వెధవ! తీయ్ నా ముందు నించి ఈ గూడు తియ్. నా ఇంట్లో నాకే ఓ సజ్జు వెధవ పాఠాలు చెప్పడమా? వీడి ఆజ్జల్ని పాలించడానికే ఉన్నానా నేను లంజకొడక!” అంటూ రెచ్చిపోయి అరుస్తున్నాడు.
బిలియర్డ్ హాల్లోకి బాల్తజార్ ప్రవేశించగానే చప్పట్ల వర్షం మోగింది. ఆ క్షణం వరకూ ముందెపుడూ తయారు చేయనంత మంచి పంజరం తయారు చేశాననీ, దాన్ని జోసి మోంటియల్ కొడుకు ఏడుపు ఆపేందుకు, సంతోషంగా ఉండేందుకు మాత్రం తయారు చేశాననీ, అంతకుమించి ఆ పంజరానికి ప్రత్యేక ప్రాముఖ్యం లేదనీ అనుకున్నాడు.
కానీ ఇదంతా చాలామంది జనానికి గొప్ప విలువైన విషయమని ఇప్పుడర్థమై, కొత్త ఉత్తేజం కలిగింది.
“అయితే పంజరానికి యాభయి పెసోలిచ్చుకున్నారన్నమాట.”
“ఉహు అరవై” అన్నాడు వత్తి పలుకుతూ బాల్తజార్.
“నిజంగా నువ్వు అఖండుడివిరా. మోంటియల్ దగ్గర్నించి అంత పెద్ద సొమ్ము ఇంకెవ్వడూ లాగలేక పొయ్యాడు. కచ్చితంగా మనం ఖుషీ చేసుకోవలసిందే”. జనమంతా కలిసి బాల్తజార్కి ఓ బీరు ఇప్పించారు. తనవంతుగా బాల్తజార్ అందరికీ ఓ రౌండు బీరు పోయించాడు. బయట తాగడం బాల్తజార్కి అదే మొదటిసారి. సాయంత్రం సంధ్యవేళకి నిషా పూర్తిగా తలకెక్కింది. వెయ్యి పంజరాల భారీ తయారీ గురించి మాట్లాడ్డం మొదలెట్టాడు. వెయ్యి పంజరాలు… ఒక్కోటి అరవై పెసోలు.. ఆ తర్వాత ఓ పది లక్షల పంజరాలు. ఒక్కోటి అరవై పెసోలు అంటే మొత్తం ఆరొందలు లక్షల పెసోలు.
“డబ్బున్న కొడుకులు చచ్చేలోపు చేసి వాళ్లకు అమ్మాలి. ” అన్నాడు. బాల్తజార్. నిషాతో అతవి కళ్లు విచ్చుకోవడం లేదు.
“ఈ డబ్బులున్న కొడుకులందరూ జబ్బుల్తో తీసుకుని తీసుకుని చావబోతున్నారు వాళ్లెంత వెదవలంటే… ఎవరిమీదా సరిగ్గా కోపం కూడా పడలేరు”.
దాదాపు రెండు గంటలనించి బూక్బాక్స్లో పాటలు పెట్టించడానికి డబ్బులు కడ్తూనే ఉన్నాడు.
అక్కడున్న ప్రతి ఒక్కడు బాల్తజార్ ఆరోగ్యం కోసం, భాగ్యం కోసం, అదృష్టం కోసం, డబ్బున్న కొడుకుల చావుకోసం పోటీలు పడి బాల్తజార్తో పాటు తాగారు. రాత్రి భోజనం సమయానికి మాత్రం బాల్తజార్ని వదిలి ఎవరిళ్లకి వాళ్లు వెళ్ళిపోయారు.
ఎనిమిది గంటల వరకు ఉర్సులా వేయించిన మాంసం కూర మీద సన్నగా కోసిన ఉల్లిపాయలుంచి – బాల్తజార్ కోసం కనిపెట్టుకుని కూచుంది. ఎవరో తన పెనిమిటి బిలియర్డ్ హాల్లో ఆనందంలో తలమునకలవుతూ కనిపించిన వాడికల్లా బీర్లు పోయిస్తున్నాడని చెప్పినా నమ్మలేదు. ఎందుకంటే బాల్తజార్కు ఇంతకు ముందెప్పుడూ తాగే అలవాటు లేదు. చూసి చూసి, దాదాపు అర్ధరాత్రికి ఆమె నిద్రపోయింది.
అదే సమయానికి బాల్తజార్ పగల్లా మెరుస్తున్న రూములో కూర్చునున్నాడు. చిన్న చిన్న టేబిళ్లు.. ఒక్కోదానికి నాలుగేసి కాళ్లు.. పక్కనే వరండాలో డాన్స్ చేసేందుకు అనువైన నున్నటి గచ్చు… గచ్చు మీద పొడవాటి కాళ్లతో కొంగల్లాటి పక్షులు… అతని ముఖమంతా ఎర్రరంగు పులిమినట్టుంది. ఒక్కడుగు వెయ్యడం కష్టం… గనక అక్కడే – ఇద్దరు ఆడవాళ్ళతో ఒకే మంచమ్మీద పడుకోవాలనుకున్నాడు.
ఆ రాత్రి ఎంత ధారాళంగా ఖర్చుపెట్టాడంటే తన గడియారం తాకట్టు పెట్టాల్సి వచ్చింది మరుసటి రోజు వచ్చి విడిపించుకుంటానని చెప్పి.
ఒక్కక్షణం తరువాత రెక్కలు విప్పిన గద్ద మాదిరి వీధిలో నడవడం మొదలెట్టాడు. తన చెప్పుల జత ఎవరో కొట్టేశారని అతనికి అర్ధమయింది. కానీ తన జీవితంలోకెల్లా అత్యంత ఆనందకర స్వప్నాన్ని జారవిడదల్చుకోలేదు.
తెల్లవారు జాము అయిదుగంటల సమయంలో ప్రార్ధనకు చర్చికెళ్లే స్త్రీలు అతని వైపు చూడ్డానికి ధైర్యం చెయ్యలేదు… ఎందుకంటే, వాళ్ళతన్ని చచ్చిన మనిషిగా భావించారు.
‘Balthazar’s marvelous afternoon’ by Gabriel Garcia Marquez (1927 – 2014)
