బెర్తా

Spread the love

డాక్టర్ బొనెట్, నా చిరకాల మిత్రుడు-నాకన్నా చాలా పెద్దవాడు, అయితే ఒక్కొక్కసారి మన కన్నా చాలా పెద్ద వాళ్ళతో మంచి స్నేహం కుదురుతుంది కదా! రియోమ్ లో ఉన్న తనతో కొద్ది రోజులు గడపమని నన్ను చాలా రోజుల నుంచి ఆహ్వానిస్తున్నాడు. ఔవెగ్నా ప్రాంతం గురించి నాకు బొత్తిగా తెలియదు; ఎటూ, ఒకసారి వెళ్లి చూడాలనుకుంటూనే ఉన్నాను. అందుకని 1876 వేసవిలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

నేను పొద్దున్నే ట్రైన్ దిగాను. దిగగానే ప్లాట్ ఫామ్ మీద చూసిన మొదటి వ్యక్తి డాక్టరే. బూడిద రంగు సూట్ లో ఉన్నారు. నల్లని అంచున్న మెత్తటి టోపీ పెట్టుకున్నారు. టోపీ చాలా ఎత్తుగా ఉంది. పైభాగం సన్నబడుతూ చిమ్నిని గుర్తుచేస్తోంది. ఇటువంటి టోపీని ఔవెగ్నా వాసులు తప్ప ఇంకెవరూ పెట్టుకోరు. దీన్ని చూస్తే బొగ్గుల కుంపటి గుర్తుకొస్తుంది. ‌ డాక్టర్ వేసుకున్న దుస్తులలో, ముసలి యువకుడి లాగా ఉన్నారు-సన్నని శరీరం,పెద్ద తలకాయ మీదంతా తెల్లని వెంట్రుకలు.

నన్ను ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నారు;చాలా రోజులుగా ఎదురు చూస్తున్న స్నేహితుడు, తమ ప్రాంతానికి వచ్చినప్పుడు పొందే సంతోషాన్ని వ్యక్తపరుస్తూ. చేతులు చాచి గర్వంగా, ‘ఇది ఔవెగ్నా’అన్నారు. నాకు ఎదురుగుండా పెద్ద పర్వత శ్రేణులు తప్ప ఏమీ కనిపించలేదు. వాటి శిఖరాలు నున్నగా గుండుకొట్టి త్రిభుజాకారంలో ఉన్నాయి. అంతరించిపోతున్న అగ్ని శిఖరాలను తలపిస్తున్నాయి.

స్టేషన్ పేరు రాసి ఉన్న బోర్డును చూపిస్తూ,”రియోమ్, ఇది మ్యాజిస్ట్రేట్లకు పుట్టినిల్లు.మెజిస్ట్రేట్లు గర్వపడే స్థలం. కానీ నిజానికి ఇది డాక్టర్ల పుట్టినిల్లు అయి ఉండాల్సింది.”

“ఎందుకని?”

“ఎందుకంటే,ఆ పదం లోని అక్షరాలను తారుమారు చేస్తే లాటిన్ పదం ‘మోరి,’ అవుతుంది, అంటే ‘చనిపోవడానికి’ అని అర్థం.అందుకే నేను ఇక్కడ స్థిరపడ్డాను, నా యువ మిత్రమా!” అన్నాడు నవ్వుతూ .

తను వేసిన జోక్ కి తనే నవ్వుతూ, చేతులు నులుపుకుంటూ తనతో పాటు నన్ను తీసుకెళ్లాడు.

మేమిద్దరం కలిసి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత, నాకు పట్టణాన్ని చూపించడం మొదలు పెట్టారు . ఆ ప్రాంతాల్లో ఉన్న మందుల దుకాణదారుల ఇళ్లను, ఇతర ప్రధానమైన ఇళ్లను చూశాను. అవన్నీ అందమైన చవక బారు శిల్పాలతో అలంకరించబడి, నల్లరంగులో ఉన్నాయి. అక్కడున్న వర్జిన్ మేరీ శిల్పం నాకు బాగా నచ్చింది. అక్కడే ఉన్న మాంసం కొట్టువాడి ఇష్ట దేవతను చూపించి, దాని కథని చెప్పారు. అయితే, ఆ కథను నేను మరోసారి మీకు చెప్తాను. ఆ తర్వాత డాక్టర్ బొనెట్, “నేను ఇప్పుడు ఒక రోగిని చూడడానికి వెళ్లాలి. కాసేపు నిన్ను ఒంటరిగా వదిలి వేయవలసి వస్తున్నది. ఆ తర్వాత ‘షాటెల్ గీయోన్’ కి నిన్ను తీసుకెళ్తాను. అప్పుడు నీకు ఈ నగర సాధారణ జీవితం అర్థం అవుతుంది. మనం భోజనానికి ముందు ‘యూ డే డౌన్ ‘పర్వత శ్రేణులను చూద్దాం. నా కోసం నువ్వు కాసేపు బయట వేచి ఉండు. నేను పైకెళ్ళి రోగిని చూసి వెంటనే వచ్చేస్తాను.”

అలా నాతో అని, నన్ను ఒక పాడుబడ్డ, నిశ్శబ్దంగా,చీకటి చీకటి గా ఉన్న, గుబులు పుట్టించే ఇళ్ల మధ్యలో వదిలేశారు. అక్కడ వాతావరణం అంతా అలాగే ఉంది. అయితే, ఈ ఇల్లు మరింత విచారకర పరిస్థితి లో ఉంది. అందుకు కారణం నేను ఇట్టే కనిపెట్టాను. మొదటి అంతస్తు, ఆ ఇంటి పెద్దపెద్ద కిటికీలు- అన్నీ సగం వరకు చెక్క కొట్టి, మూసివేయబడి ఉన్నాయి. పైనున్న భాగం మాత్రమే తెరవవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక పెద్ద రాతి డబ్బాలో నిర్బంధించబడినట్టు ఉంది. వాళ్లు బయటి ప్రజానీకాన్ని చూసే అవకాశం ఏమాత్రం లేదు.

డాక్టర్ కిందికి దిగారు. నాకు వచ్చిన ఆలోచనను ఆయనతో చెప్పాను. దానికి ఆయన సమాధానంగా, నీ ఆలోచన సరైనదే. పాపం ఇందులో ఉన్న అమ్మాయి బయటి ప్రపంచాన్ని చూడకూడదు. ఆమె పిచ్చిది. ఇంకా చెప్పాలంటే తెలివి తక్కువది. మీ నార్మన్లు అలాంటి వాళ్ళని ‘నిఏంటే’లు అంటారు. ఆమెదొక విషాద గాధ. పాపం రోగిష్టిది కూడా. ఆ కథ నీకు చెప్పనా?

చెప్పమన్నాను నేను.

“20 ఏళ్ల కిందట ఆ ఇంటి యజమానులు నా దగ్గర వైద్యం చేయించుకునేవారు. వాళ్లకి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చూడడానికి అందరమ్మాయిల్లాగే ఉండేది. కానీ త్వరలోనే ఆమె శరీరం పెరుగుతున్నంత వేగంగా మెదడు పెరగడం లేదని గ్రహించాను.

ఆమె చాలా తొందరగా నడక మొదలు పెట్టింది కానీ, మాటలు రాలేదు. మొదట్లో నేను ఆమెకు చెవుడని అనుకున్నాను, కానీ ఆమె చక్కగా వినగలుగుతున్నదని ఆ తర్వాత గ్రహించాను. అయితే, ఆమె మనం చెప్పినదేదీ అర్థం చేసుకోలేకపోతోంది. తీవ్రమైన శబ్దాలు ఆమెని బెదరగొట్టేవి.అవి ఎందుకు వస్తున్నాయో ఆమెకు అర్థమయ్యేది కాదు.”
.

“వయసు పెరుగుతున్న కొద్దీ, ఆమె ఒక అందమైన అమ్మాయిగా తయారయింది. కానీ మూగదే. మెదడు అస్సలు ఎదగడం లేదు. ఆమె మెదడులో ఆలోచనా శక్తిని పాదగొల్పడానికి అనేక రకాలుగా ప్రయత్నించాను, కానీ ఏ మాత్రం సఫలం కాలేదు. ఆమె, తనకు పాలు ఇచ్చినన్ని రోజులు తల్లిని గుర్తుపట్టడం గమనించాను, కానీ పాలు ఇవ్వడం మానేయగానే తన తల్లిని కూడా గుర్తుపట్ట లేదు. పిల్లలు తొలిసారిగా పలికే పదాన్ని, యుద్ధభూమిలో సైనికులు చివరిసారిగా పలికే పదాన్ని ఆమె ఏనాడూ పలక లేకపోయింది. నిజానికి ఆమె కొన్నిసార్లు కొన్ని శబ్దాలు చేసే ప్రయత్నం చేసేది, కానీ అవి అర్థం అయ్యేవి కాదు.”

“వాతావరణం బాగున్నప్పుడు ఆమె నవ్వుతుండేది. చిన్న చిన్న శబ్దాలు చేస్తుండేది- పక్షులు కిలకిలా కూసినట్టు. వాన పడేటప్పుడు ఏడుస్తూ, మూలుగుతూ కూర్చునేది – ఇంట్లో ఎవరైనా చనిపోతే, కుక్కలు అరిచినట్లు.

జంతువుల లాగా గడ్డి మీద పడి దొర్లడానికి ఇష్టపడేది. పిచ్చిగా అటు ఇటు పరిగెత్తేది. గదిలోకి సూర్యకిరణాలు పడగానే ఆనందంతో చప్పట్లు కొట్టుకుంటూ గంతులేసేది. తొందరగా బట్టలు వేస్తే బయటికి వెళ్లిపోవచ్చని, చకచకాబట్టలు తొడగమని గోల చేసేది.”

“ఆమె ఇద్దరు మనుషుల మధ్య తేడాని గుర్తించ గలిగేదు కాదు;తల్లికి, ఆయాకి ,తండ్రికి, నాకు లేదా బండి నడిపే వాడికి వంట చేసేవాడికి తేడా తెలిసేది కాదు. ఆమె తల్లిదండ్రులంటే నాకు చాలా ఇష్టం. ఆమె వలన వారు చాలా బాధపడేవాళ్లు. నాకు వాళ్ళ ఇంటికి రోజూ వెళ్లడం అలవాటు. వాళ్లతో కలిసి భోజనం చేసేవాడిని. అందువలన నన్ను భోజనంలోని వివిధ ఆహార పదార్థాలతో గుర్తించగలిగేది. ఆమెకు అప్పుడు 12 ఏళ్లు.కానీ 18 ఏళ్ల అమ్మాయిలంత పొడుగ్గా ఉండేది. నిజానికి నాకన్నా పొడుగ్గా ఉండేది. అటువంటి సమయంలోనే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆమెకి ఉన్న తిండి యావతో మెదడులో విశ్లేషణ చేసే అంశాన్ని చైతన్య పరచగలనేమో అని అనుకున్నాను. ఆహార పదార్థాల వాసనలోని వైవిధ్యానికి అనుగుణంగా ఆమె ఆలోచనలను మలచవచ్చేమోనని అభిప్రాయపడ్డాను. కొద్ది కొద్దిగా ఆమె మెదడు చైతన్యాన్ని పెంచి, విచక్షణను పెంపొందించగలమేమోనని ఆశించాను. “

“ఒకరోజు ఆమె ముందు రెండు ప్లేట్స్ పెట్టాను. ఒకదానిలో సూప్. రెండో దానిలో తియ్యని వెనిల్లా ఐస్ క్రీమ్.రెండింటిలో తనకు నచ్చినది తీసుకునేటట్టు చేసాను.ఆమె ఆశగా వెనీలా ఐస్ క్రీమ్ ను తీసుకొని తినింది. ఎంత ఇష్టంగా తినిందంటే కేవలం తినడం పైనే పూర్తిగా శ్రద్ధ పెట్టింది. అనేక రకాల వంటకాలను గుర్తించేది. తనకి ఇష్టమైన వాటిని చేతులు చాచి తన దగ్గర తెచ్చుకుని ఆవురావురుమని తినేది. తన దగ్గర నుంచి వాటిని తీసేస్తే ఏడవడం మొదలుపెట్టేది. అప్పుడు, ఆమె డైనింగ్ రూమ్ కి రావడానికి బెల్ వినడం సంకేతంగా నేర్పించాలని అనుకున్నాను. ఇది నేర్పించడానికి నాకు చాలా సమయమే పట్టింది. కానీ ఆఖరికి నేర్పించడంలో విజయం సాధించాను.ఆమెలో శబ్దానికి, రుచికి మధ్య సంబంధాన్ని ఏర్పారచగలిగాను. అంటే రెండు ఇంద్రియ జ్ఞానాల మధ్య సంబంధాన్ని. అంటే, ఆలోచనల మధ్య సమన్వయాన్ని. దాని అర్థం, రెండు శారీరిక స్పందనల మధ్య, ఆలోచనల మధ్య సంబంధాన్ని తెలియజేయగలిగాను. నా ప్రయోగాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ, ఎంతో కష్టపడి గడియారంలో ఆహారం తీసుకునే సమయాలను గుర్తింప చేయగలిగాను.”

“ఆమెను గడియారం ముల్లుల వైపు ఆకర్షించడానికి నేను చాలా పాట్లు పడాల్సి వచ్చింది. అయితే గడియారం చేసే పని, కొట్టే గంటలు ఆమె గమనించేలా చేయడంలో సఫలమయ్యాను. ఇందుకు నేను అనుసరించిన మార్గం చాలా సులువైనది. భోజనానికి రావలసిందిగా పిలవడానికి వాళ్ళింట్లో గంట కొట్టే అలవాటుంది. నేను దాన్ని ఆపమన్నాను;ఆ గంటకొట్టకుండానే ప్రతి వాళ్ళు సమయానికి భోజనాశాలకు వెళ్లాలని చెప్పాను. గడియారం 12 గంటలు కొట్టినప్పుడు, అందరూ భోజనానికి వెళ్లాలని సూచించాను. కానీ ఆమెకు 12 గంటలను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. ఎంతో కష్టపడి అంచలంచెలుగా లెక్కించడం నేర్చుకుంది. గడియారం గంట కొట్టడం విని పరిగెత్తుకొని వెళ్లి ,ఎదురుకుండా చూస్తూ నిలుచునేది. గడియారం ప్రతి సారి ఒకే రకంగా గంటలు కొట్టదని అర్థం చేసుకుంది.12:00 కొట్టిన తర్వాతే భోజనం వస్తుందని తెలుసుకుంది. గంటలు కొట్టిన శబ్దం వినడం, గడియారంలో ముల్లులు మారడం గ్రహించగలిగింది.” ‌

“ఇది గ్రహించిన నేను, వాళ్ళింటికి ప్రతిరోజు 12 గంటలకి, ఆరు గంటలకి వెళ్లేవాడిని. 12 గంటలకి ,ఆరు గంటలకి గడియారం ముల్లులు ఎలా ఉంటాయో చూడమని చెప్పే వాడిని. గడియారం ముల్లు 12 ,6 గంటలకి వచ్చేటప్పటికి ఆమె చాలా శ్రద్ధ పెట్టి, గడియారం ఇత్తడి ముల్లు కదలికలను గమనిస్తుండేది. ఆమె ఎదురుగుండానే గడియారం ముల్లులను తిప్పేవాడని.”

“ఆఖరికి ఆమె విషయం అర్థం చేసుకుంది. అంటే గ్రహించగలిగింది. ఆమెకి కాస్తంత జ్ఞానాన్ని కలిగించాను. అంతవరకు ఆమె జంతువుల కుండే సహజ లక్షణంగా మాత్రమే ఆకలిని గ్రహించగలిగేది.”

“గడియారంలో గంటలు మోగడాన్ని గమనించడం మొదలుపెట్టిన తర్వాత, ఇంట్లో ఉన్న అన్ని గడియారాలపైనే ఆమె దృష్టి కేంద్రీకరించి ఉండేది. ఎప్పుడూ వాటినే చూస్తూ, అవి కొట్టిన గంటలనే వింటూ, మళ్లీ ఎప్పుడు తినడానికి గంట కొడుతుందో అని ఎదురు చూస్తూ, కాలం గడిపేది. అటువంటి సందర్భాల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆమె గదిలో మంచం ఎదురుగుండా ఉన్న లూయీ 16 గడియారం పాడైపోయింది. దాన్ని ఆమె గమనించింది. ఆ గడియారం ముల్లులను తదేకంగా చూస్తూ 20 నిమిషాలు గడిపింది. గడియారం 10:00 కొట్టాల్సి ఉంది. కానీ గంటలు కొట్టకుండానే ముల్లులు దాటిపోయాయి. అది ఆమెకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది ఆమెను చాలా బాధించింది కూడా. తీవ్రమైన భావావేశానికి లోనయ్యింది. 11 గంటల వరకు ఓపిగ్గా ఎదురుచూసింది. కానీ 11 గంటలకు కూడా గడియారం గంటలు కొట్టలేదు. ఆమెను ఎవరో మోసం చేస్తున్నట్టు భావించి, కోపంతో ఊగిపోయింది. ఏదో ఎదురుచూడని, ఆశ్చర్యపరిచే విషయానికి జంతువులు భయపడినట్టు బెదిరిపోయింది. నెగడులో మండుతున్న కర్ర తీసుకొని గడియారాలు పై విసిరికొట్టింది. వెంటనే గడియారం ముక్క ముక్కలయ్యింది.”

” ఈ సంఘటనతో ఆమె, తన చర్యలను ఆలోచించి చేయడం లేదని రుజువయింది. గంటల మధ్య తేడాను గమనించినట్టు ఇద్దరు మనుషుల మధ్య ఉన్న తేడాను ఆమె గ్రహించలేదు. అందువల్లనే ఆమెలో ఆలోచనలు రేకెత్తించడానికి ఆమె భావవేశాలను ఉపయోగించి ప్రాపంచిక విషయాలను తెలియజేయాల్సి వచ్చింది. దురదృష్టం ,కొద్ది రోజుల్లోనే ఈ విషయం మరో సారీ రుజువయింది.”

“ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టింది.ఇప్పుడు ఒక అద్భుతమైన అందమైన ఆడపిల్లగా రూపుదిద్దుకుంది,తన జాతికి అనుగుణంగా. అయితే ఆమె అందమైన, తెలివి తక్కువ వీనస్. ఆమెకి ఇప్పుడు పదహారేళ్లు. చక్కటి శరీర సౌష్టవంతో, అద్భుతమైన రూపురేఖలు దిద్దుకొని, ముచ్చటగా ఉంది. నిజమే, ఆమె ఇప్పుడు ఒక వీనస్ లాగే ఉంది. పొడుగ్గా ,ఎర్రగా, చక్కటి మెరుస్తున్న పెద్దకళ్ళతో, తీర్చిదిద్దబడిన ఫ్లాక్స్ పూల లాంటి పెద్ద పెదవులతో. ఆమె పెదవులు ఆకర్షణీయంగా, ముద్దు పెట్టుకోమని రెచ్చగొట్టేటట్టు తయారయ్యాయి. ఒకరోజు ఆమె తండ్రి నా హాస్పిటల్ కి వచ్చారు. అతని మొఖం విచిత్రమైన ఆలోచన తో ఉన్నట్టు కనిపించింది. నేను అతనిని పలకరిస్తున్నా పట్టించుకోకుండా నా ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చున్నారు.”

“నేను ఇప్పుడు మీతో ఒక గంభీరమైన విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను.బెర్తా కి పెళ్లి చేసే అవకాశాలు ఉన్నాయా?” అని అడిగారు.

“బెర్తా కి పెళ్లి! ” నేను ఆశ్చర్యపోయాను. అసంభవం అన్నాను.

“అవును. నాకు తెలుసు. నాకు తెలుసు. కానీ డాక్టర్ గారు! ఒకసారి ఆలోచించండి. ఆమెకు పిల్లలు పుడితే, ఒక షాక్ కి గురవుతుంది. చాలా సంతోషిస్తుంది. బహుశా మాతృత్వం ఆమెలోని మేదస్సును వెలికి తీస్తుందేమో ఎవరికి తెలుసు.”

” నేను పూర్తి అయోమయంలో పడ్డాను. బహుశా ఆయన సరిగ్గానే ఆలోచిస్తున్నారేమో! కొత్త పరిస్థితులు, ఆమెలో మార్పు తేవచ్చేమో! మాతృత్వమనే మహత్తర సహజ లక్షణం, ఆమెలో కూడా, మహిళలకు ఉండే సహజ లక్షణాలను వెలుగులోకి తెస్తుందేమో !అన్ని జంతువులలో ఈ లక్షణం ఉంటుంది కదా! కోడిపెట్ట కూడా కుక్క బారిన పడకుండా తన పిల్లల్ని రక్షించుకుంటుంది కదా. ఇది ఒక విప్లవాత్మక మార్పును తీసుకు రావచ్చేమో. కొన్నాళ్ళ కింద నా దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉండేది. తెలివి తక్కువది. ఏమీ చేసుకోలేకపోయేది. కానీ దానికి పిల్లలు పుట్టంగానే తెలివితేటలు వచ్చాయి.”

” ఇది ఒక సాధ్యపడే అవకాశమనే ఆలోచన రాగానే, మా మధ్యనున్న స్నేహం దృష్టి లో పెట్టుకొనో, ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆందోళన పరిగణలోకి తీసుకొనో కాక,ఒక శాస్త్రీయ ఉత్సుకతతో పెళ్లి చేయొచ్చని చెప్పాను.”

“మీ ఆలోచన సరైనదే, కానీ మీకు బెర్తా ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించేవాడు దొరుకుతాడా?”

ఆయన తగ్గు స్వరంతో,” అవును. ఒక అబ్బాయిని చూసాం.” అన్నాడు.

నా ఆశ్చర్యానికి అంతే లేదు.”మీ స్థాయికి, సమాజంలో మీకున్న పరపతి కి తగినవాడు దొరికాడా? “

“అవును.”

“అతని పేరు తెలుసుకోవచ్చా?”

” గౌస్టం డు బాయ్స్ డి లసుల్లె.”

ఎంత దురదృష్టం అనబోయి, నన్ను నేను తమాయించుకుని,”మంచిదే కానివ్వండి” అన్నాను.

పాపం ఆయన హృదయపూర్వకంగా కరచాలనం చేసి, ఆరు నెలల లోగా పెళ్లి జరిపిస్తామని చెప్పి వెళ్లిపోయాడు.

“గౌస్టం, మంచి కుటుంబంలో పుట్టిన అతి దుర్మార్గుడు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తంతా తగలబెట్టిన తర్వాత అప్పుల్లో మునిగిపోయి, ఎలాగైనా బయటపడాలనే దురాశతో, ఇదిగో ఈ మార్గాన్ని కనుగొన్నాడు. చూడ్డానికి అందంగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు, తన జాతిలోని ఆ వయసులో ఉన్న పురుషుల లాగే.బెర్తా కి తగిన వరుడు అనిపించేటట్టే ఉన్నాడు. ఆ తెలివి తక్కువ అమ్మాయి ముందు గొప్పలకు పోవడానికి, డాంబికానికి ,ప్రేమ నటించడానికి ఇంటికి వచ్చాడు. ఆమె చేతులను ముద్దు పెట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎంతో ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అయితే ఆమె మాత్రం అతను కనబరుస్తున్న ప్రత్యేకమైన అభిమానాన్ని గుర్తించలేదు. అతనికి ఇతరులకు భేదాన్ని తెలుసుకోలేదు.”

“పెళ్లి జరిగిపోయింది.నాలో ఆసక్తి పెరిగింది. ఆ తర్వాతి రోజు నేను బెర్తా ని చూడడానికి వెళ్లాను. ఆమెలో ఏమైనా భావావేశాలు కలిగాయేమోనని గమనించే ప్రయత్నం చేశాను. కానీ ఆమె ఎప్పటిలాగే ఉంది. కేవలం గడియారం, భోజనం సమన్వయం చేసుకునే పనిలోనే మునిగిపోయి ఉంది. అతడు మాత్రం ఆమెను ఎంతో ప్రేమిస్తున్నట్టు, భార్యను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించాడు,పెంపుడు పిల్లి పై ప్రేమను ఒలకబోస్తున్న వాళ్లలాగే. అంతకంటే మెరుగ్గా అతడేమీ ఆలోచించలేదు.”

“నేను నూతన దంపతులను తరచుగా కలుసుకుంటూ ఉండేవాణ్ణి. త్వరలోనే ఆ యువతి తన భర్తను గుర్తు పడుతున్నదని గ్రహించాను. అతనిని చూడ్డానికి ఉత్సాహపడేది- ఇదివరకు నచ్చిన వంటకాలపై దృష్టి పెట్టినట్టే.
అతని కదలికలన్నీ గమనిస్తూ ఉండేది. మెట్లమీద లేదా పక్క గదిలో అతని అడుగులు చప్పుడు వినగానే చప్పట్లు కొట్టేది.ఆనందంతో, కాంక్షతో ముఖం వెలిగిపోయేది.”

“ఆమె అతనిని పూర్తిగా, హృదయ పూర్వకంగా ప్రేమించడం మొదలు పెట్టింది. మనసులో కృతజ్ఞత నిండిన జంతువు లాగా ప్రేమించింది. అది నిజంగా ఒక సంతోషించదగ్గ విషయమే. కేవలం భావావేశం మాత్రమే కలిగిన అమాయకమైన ప్రేమ. శారీరకమైనదే అయినా భావావేశంతో నిండినదే. సహజంగా మనుషులలో ప్రకృతి నింపిన ఆకర్షణ. మనిషి దానిని సంక్లిష్ట పరిచాడు. ఆ భావానికి అనేక ఛాయలు ఏర్పరిచాడు. కానీ కొన్ని రోజులకే అతడికి తనకు ఎంతో విధేయంగా ఉన్న అందమైన మూగజీవి ప్రేమంటే విరక్తి పుట్టింది. ఇంట్లో కన్నా బయట ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత రాత్రిళ్ళు కూడా ఇంటికి రావడం మానేశాడు. ఫలితంగా ఆమె తీవ్రంగా బాధపడటం మొదలు పెట్టింది. అతని కోసం రాత్రంతా ఎదురు చూస్తూ కూర్చునేది. గడియారం పైనే దృష్టి పెట్టేది. ఆఖరికి తిండి మీద కూడా దృష్టి పెట్టడం మానేసింది. అతడు తనదన్న ప్రతిదాన్ని తనతో పాటు తీసుకొనిపోయాడు. ఎక్కడికో !”

“ఆమె నెమ్మదిగా కృశించడం ప్రారంభించింది. ప్రతి ఆలోచన, ప్రతి కోరిక, ప్రతి ఆశ ఆమె నుంచి పూర్తిగా దూరమయ్యాయి. అతనిని చూడని సమయమంతా ఆమె విపరీతమైన బాధకి గురయ్యేది. మరోవైపు, అతను ఇంటికి రావడం పూర్తిగా మానేశాడు. ‘లోని క్యాసినో’ లో మరో మహిళతో సమయం గడపడం మొదలుపెట్టాడు. తెల్లవారే వరకు వచ్చేవాడు కాదు. కానీ ఆమె, అతడు తిరిగి వచ్చేవరకు నిద్రపోయేది కాదు. కదలకుండా వాలు కుర్చీలో కూర్చునేది. గడియారం పైనే దృష్టి. గడుస్తున్న కాలం ఆమెలో దుఃఖాన్ని నింపింది.”

“అతడు వస్తున్న గుర్రం డెక్కల చప్పుడు వినగానే, నిటారుగా కూచునేది. గదిలోకి రాంగానే, అతని కదలికలను పైనే ఆమె దృష్టి ఉండేది. అతనిని, గడియారాన్ని మార్చి మార్చి చూస్తూ, ‘చూడు నువ్వు ఎంత ఆలస్యంగా వచ్చావో’, అని అనేటట్టు ఉండేవి ఆమె భావనలు.”

” ఈ మోహపూరితమైన, అనుమానపడే తెలివి తక్కువ మహిళ మీద అతడు కోపంతో రెచ్చిపోయేవాడు. పశువు లాగా ఒకరోజు రాత్రి ఆమెను కొట్టబోయాడు కూడా. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నాకోసం కబురు పెట్టారు. నేను ఆమె దగ్గరికి వెళ్ళగానే ఏడుస్తూ, బాధతో నలిగిపోతూ, కోపంతో, ఆవేశంతో నా దగ్గరికి వచ్చింది. నాకేం చేయాలో తోచలేదు. ఇటువంటి వికసించని మెదడున్న వాళ్ళతో ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో, నాకు అర్థం కాలేదు. కేవలం ఒక మార్ఫిన్ఇంజక్షన్ ఇచ్చి ఆమెను కుదుటపరిచాను. ఆ మనిషిని మళ్లీ చూడొద్దని చెప్పాను. నిజానికి ఆ పెళ్లి వల్ల ఆమె మెట్టు మెట్టు దిగజారుతున్నది.”

“కొన్నిరోజులకు ఆమెకు పిచ్చెక్కింది. తెలివితక్కువది కాస్త పిచ్చిదయింది. ఎప్పుడూ అతని గురించే ఆలోచించేది. అతని కోసం ఎదురుచూసేది రోజంతా.రాత్రి కూడా నిద్రపోయేది కాదు. ప్రతిక్షణం, నిరంతరంగా ఎదురుచూడటం, గుర్తుచేసుకోవటం గమనించాను. గడియారం నుంచి తన దృష్టిని మరల్చేదే కాదు. ఇక చేసేది లేక ఆ ఇంట్లో గడియారాలన్నీ తీసేయించేసాను. గంటలను లెక్కపెట్టే అవకాశం లేకుండా చేశాను. కానీ అతడు వచ్చే సమయం ఆమె మనసులో హత్తుకుపోయింది. ఆ జ్ఞాపకాలు ఆమెను వెన్నాడుతున్నాయి. నేను ఆమెలో రగిల్చిన ఆశ ఇటువంటి కష్టాన్ని తెచ్చి పెట్టింది.”

“ఒక రోజు నేను మరో ప్రయోగం చేసే ప్రయత్నం చేశాను. ఆమెకు నా గడియారాన్నిచ్చాను. ఆమె దానిని తీసుకొని కాసేపు దాని వైపే చూసింది. ఆ తర్వాత గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అంత చిన్న వస్తువు ఆమెలో జ్ఞాపకాలని రేపగలిగింది. అది ఆ తర్వాత పెరిగి పెద్దదైంది. ఇప్పుడు ఆమె చాలా సన్నగా బక్క చిక్కి ఉంది. బలహీనంగా ఉంది. ఆ కళ్ళలో మెరుపు మాయమైంది. నిరంతరంగా గదిలో అటు ఇటు తిరుగుతుంటుంది-గదిలోబంధించబడిన ఒక క్రూర జంతువు లాగే. అందువల్లనే ఇంటికి పైభాగాలన్నీ మూసేయించాను. కిటికీల నుంచి బయటికి అతని కోసం ఎదురు చూడకుండా ఉండాలని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాను.”
.
పాపం! ఆ తల్లిదండ్రులు!! ఎటువంటి జీవితాన్ని అనుభవించిన వాళ్ళు.

మేము కొండపైకి చేరాక, డాక్టర్ నా వైపు తిరిగి, “ఇక్కడి నుండి రియోమ్ నగరమంతా చూడగలవు” అన్నాడు.

ఆ విచారకరమైన నగరం ఒక ప్రాచీన నగరం లాగా అనిపించింది. దాని వెనుక పచ్చని చెట్లతో, అడవులతో నిండిన పట్టణాలు, పల్లెలు ఉన్నాయి. మెత్తటి మంచు తో నిండిన నీలాకాశం వాటన్నిటిని కమ్మింది, కనుచూపుమేర వరకు. చాలా దూరంగా, చదునుగా ఎత్తైన పర్వతాలు కత్తితో నరికినట్టుగా చుట్టూ ఉన్నాయి. డాక్టర్ అక్కడున్న ప్రతి గ్రామం గురించి నాకు వివరిస్తున్నారు. వాటి చరిత్ర అంతా చెబుతున్నారు. కానీ అవేమీ నా చెవులకు ఎక్కడం లేదు. నేను కేవలం ఆ పిచ్చి మనిషి గురించే ఆలోచిస్తున్నాను. ఉన్నట్టుండి ఆమె ఆ ప్రాంతమంతా విచారంగా తిరుగుతున్న భూతం లాగా నాకు అనిపించింది.

“ఆమె భర్త ఏమయ్యాడు?”

నా స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. కొన్ని క్షణాలు సంశయించిన తర్వాత, “అతడు ‘రోయాట్ ‘లో ఉన్నాడు. వాళ్ళు అతనికి కేటాయించిన అలవెన్స్ మీద బతుకుతున్నాడు. ఆనందంగా ఉన్నాడు. హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు.”

మేము నెమ్మదిగా వెనుతిరిగాం. ఇద్దరం మౌనంగా ఉన్నాం. ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయాం. ఒక ఇంగ్లీష్ గుర్రపు బగ్గి శరవేగంగా మమ్మల్ని దాటుకుంటూ ముందుకెళ్ళింది. డాక్టర్ నా చేయి పట్టుకుని పక్కకు లాగి, “ఇదిగో ఇతనే,’గౌస్టం డు బాయ్స్ డి లసుల్లె’,” అని చూపించాడు.

కేవలం వెడల్పాటి భుజాలు,చెవులను కప్పిన ఒక బూడిద రంగు టోపీ తప్ప నాకేమీ కనిపించలేదు. బండి వేగానికి ధూళి ఎగిరి చుట్టంతా కమ్మేసింది.

ఉషారాణి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *