తలుపు

Spread the love

కాల్ మసూలిని, అబ్బా! అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. వినయంగా ఉండే బుధిమంతులైన భర్తలతోనే వచ్చే తంటా అంతా. వాళ్లలో అనేక రకాలను చూశాను. కానీ వాళ్లందరిపై ఒక ఉమ్మడి అభిప్రాయానికి అంటూ రాలేకపోయాను. వాళ్లు గుడ్డిగా అనుసరిస్తూ ఉన్నారా, బలహీనమైన వాళ్ళా, లేక యోగి పొంగువులా అర్థం కాలేదు. అయితే, కొందరు కొందరు ఒక్కొక్క తరగతికి చెంది ఉండవచ్చు.
ఉదాహరణకి మొదటిగా గుడ్డిగా అనుసరిస్తున్న వాళ్ళ సంగతే తీసుకుందాం. వాళ్లను ఎవరైనా సులభంగా మోసం చేయగలరని తెలియడం ఆశ్చర్యంగాను, ఆసక్తికరంగానే ఉంటుంది. వాళ్లను బుద్ధిమంతులని అనలేం. ఎందుకంటే వాళ్ళకేమీ తెలియదు కాబట్టి . వాళ్లకి ముక్కుకు సూటిగా ఉన్నవి తప్ప మిగతావి ఏమీ కనిపించవు. అందుకని వాళ్ళని మన పిల్లలు, మన స్నేహితులు, మన పనివాళ్ళు, మనతో లావాదేవీలు జరిపే వాళ్ళు, అంతెందుకు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా అతి సులభంగా మోసగించగలరు. మనుషులు భోళాగా ఉంటారు. ఇతరులు తమకు చేసే మోసాన్ని గమనించడంలో ఉపయోగించే తెలివితేటలలో పదోవంత కూడా ఇతరులను మోసం చేయడానికి చూపించరు.
వినయాన్ని ప్రదర్శించే భర్తలను మూడు తరగతులుగా విభజించవచ్చు. ఏ రకంగా అయినా కాస్తంత ప్రయోజనాలను ఆశించేవాళ్లు -ఆర్థికంగానో, గొప్పతనం కోసమో లేదా మరి దేనికోసమైనా అంటే. ఉదాహరణకు భార్యలకు ఉన్న ప్రేమ వ్యవహారాలు తెలుసుకోవడానికి అయినా అవ్వచ్చు. వాళ్లు వీలైనంత తమ గుర్తింపు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు;అంతటితో తృప్తి పెడతారు.
ఆ తర్వాత తరగతి కోపిష్టి భర్తలు. వాళ్ల గురించి ఏకంగా ఒక నవలే రాయచ్చు.
ఆ తర్వాత తరగతి లో, బలహీనమైన భర్తలు ఉంటారు. వాళ్లకి అపవాదులు అంటే పరమ భయం.
ఇవి గాక అశక్తుల తరగతి ఒకటి ఉంటుంది.వారు వివాహ వ్యవస్థ వలన ఏర్పడే బాధ్యతల నుంచి పారిపోయేవాళ్ళు- సన్యాసులు, అస్థిరమైన వాళ్లు. వీళ్లంతా తమ స్నేహితులు తమ పనులన్నీ చక్కదిద్దాలని కోరుకుంటారు.
కానీ నేను ఒకసారి, వీరందరికీ భిన్నమైన ఒక ప్రత్యేక తరగతికి చెందిన భర్తను చూశాను. అతడు సాధారణంగా జరిగబోయే మాదం నుంచి నన్ను విచిత్రంగా కాపాడాడు.
ఒకసారి ప్యారిస్ లో నేను ఒక సొగసైన ఆధునిక జంటను కలిశాను. ఆ మహిళ బలహీనంగా, పొడుగ్గా, నాజూకుగా ఉండేది. ఆమెకు ఎన్నో ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని చెప్పుకునేవారు. ఆమె తెలివితేటలు నన్ను ఆకట్టుకున్నాయి. నేను కూడా ఆమెను ఆకట్టుకున్నానని అనుకుంటాను. నేను ఆమెను పెళ్లాడమని కోరే ప్రయత్నం చేశాను కూడా. నిజానికి అందుకామే నన్ను రెచ్చగొట్టింది. తొందర్లోనే మా చూపులు,చేతులు కలిశాయి. చివరి దాడి జరిపే ముందు చేసే చిన్న చిన్న సాహసాలు కూడా చేశాం.
అయినప్పటికీ నేను సంశయించాను. సమాజంలో ఉన్న ప్రధానమైన సామాజిక నిబంధనలను,మెలికలను దృష్టిలో పెట్టుకొని- అవెంత చిన్నవైనప్పటికీ – ఈ మాత్రం దాని కోసం అంత కష్టపడవలసిన అవసరం లేదని వెనక్కు తగ్గాను. అంటే నేను ఆ బంధం వలన వచ్చే లాభ నష్టాలు బెరీజు వేసుకున్నాను. ఆ క్రమంలో ఆమె భర్త నన్ను అనుమానిస్తున్నాడని గమనించాను.
ఒకరోజు సాయంత్రం బాల్ రూమ్ లోకి వెళ్లబోతున్నాను. లోపలికి వెళ్లే ముందు ఒక సావడి ఉంది. నేను సున్నితమైన విషయాలను ఆ సావడిలో ఆ యువతితో గుసగుసలాడుతున్నాను. మేము డాన్స్ చేసే బాల్ రూమ్ కి ఈ సావడి నుండే దారి. లోపల డాన్స్ జరుగుతోంది. ఉన్నట్టుండి మేము మాట్లాడుకుంటున్న సంగతిని లోపలి నుంచి ఎవరో గమనిస్తుడటం చూశాను. అది అతడే. మా చూపులు కలిసాయి. అతను వెంటనే తల తిప్పుకొని నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
“మీ ఆయన మనపై నిఘా పెట్టాడని” నేను గొణిగాను.
ఆమె నోట మాట రాలేదు.
“నా భర్తా!” అనింది
“అవును నీ భర్తే.మనల్ని కొద్దిసేపటి నుంచి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. “
“అర్థం పర్థం లేకుండా మాట్లాడకు! నువ్వు నిజమే చెప్తున్నావా?”
“నిజమే.”
“ఎంత ఆశ్చర్యం! అతను చాలా శాంత స్వభావుడు. అందరితో చాలా స్నేహంగా ఉంటాడు. “
“బహుశా నేను నిన్ను ప్రేమిస్తున్న విషయాన్ని గ్రహించాడేమో! “
“అర్థం లేదు. నువ్వు నా వెంటపడిన మొట్టమొదటి వ్యక్తివి కాదు. కాస్త అందమైన మహిళ వెనక అనేక మంది అభిమానులు తిరుగుతూనే ఉంటారు.”
“కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం.”
“అది నిజమై ఉండొచ్చు. అయితేనేం ప్రతి భర్త ఈ విషయాన్ని ఊహిస్తాడా?”
“అంటే అతనికి అసూయ లేదన్నమాట !”
” కాదు కాదు .”
ఒక నిమిషం పాటు ఆలోచించి, “అతనికి అసూయ ఉన్నట్టు నేను ఏనాడూ గమనించలేదు.”
” అతడు నన్ను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండలేదు.
నేను ఇందాకే చెప్పినట్టు అతను నా స్నేహితులందరినీ ఇష్టపడతాడు.”
ఆ తర్వాత నుంచి మా ప్రేమ మరింత ఆనాశక్తిగా మారింది. ఆ మహిళ అంటే నాకు ఇష్టం తగ్గిపోయింది. కానీ, ఆమె భర్త అసూయ నన్ను ఆమె వెంట పడేటట్టు ఎక్కువగా ప్రోత్సహించింది.
ఆమెకు సంబంధించినంత వరకు అన్ని విషయాలు, చాలా శాంతంగా, స్పష్టంగా పరిశీలించడం మొదలుపెట్టాను. ఆమెలో కొంత ప్రాపంచిక ఆకర్షణ ఉంది. చురుకుగా ఉండడం, సంతోషంగా ఉండడం, కలివిడిగా ఉండడం ,పై పైన మాట్లాడడం. అయితే ఆమెలో లోతైన, నిజమైన ఆకర్షణ లేదు. నేను ఇదివరకే చెప్పినట్టు, ఆమె కొంత ఉత్సాహపరుస్తుంది గాని అది కేవలం పైపైన మాత్రమే. అంతా పైపై మెరుగులు. ఆమె ఒక అలంకారం మాత్రమే. ఇల్లు కాదు.
ఒకరోజు ఆమెను బయటికి భోజనానికి తీసుకెళ్లాను. మేము వెళ్ళబోయే ముందు ఆమె భర్త, “మిత్రమా-ఆమె భర్త నన్ను మిత్రమా అనే పిలిచేవాడు-మేము త్వరలోనే గ్రామానికి వెళ్ళిపోతున్నాం. నాకు నా భార్యకి, మాకు తెలిసిన వాళ్ళందర్నీ సంతోష పెట్టడం చాలా ఇష్టం. మీరు ఒక నెల రోజులు పాటు మాతో గడపండి. మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను” అన్నాడు.
నాకు నోట మాట రాలేదు. కానీ ఒప్పుకున్నాను.
ఒక నెల రోజుల తర్వాత, టొరైన్ లోని వెర్ట్ క్రిసన్ రిసార్ట్ కు వెళ్లాను. వాళ్లు స్టేషన్లో నాకోసం ఎదురుచూస్తున్నారు. అది బంగ్లాకి 5 మైళ్ళ దూరంలో ఉంది. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆమె భర్త, నాకు తెలియని మరొక పురుషుడు. అతనిని క్వాంట్ డి మోటరేడ్ గా పరిచయం చేశారు. అతను నాతో పరిచయం చేసుకోవడానికి సంతోషించినట్టు కనిపించాడు. అందమైన ఆ రోడ్ల వెంట నడుస్తూ ఉంటే నా మనసులో, ‘సరే ! ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం, ‘ అనిపించింది. ఇక్కడ ఒక భర్త ఉన్నాడు. అతనికి అతని భార్యపై అనుమానం లేదు. నాతో స్నేహితుడి లాగా ప్రవర్తిస్తున్నాడు. తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు. ఒక పాత స్నేహితుడి లాగా ముందుకు సాగు మిత్రమా దారంతా స్పష్టంగా ఉందని చెప్తున్నాడు.
ఆ తర్వాత నన్ను మరో పురుషుడికి పరిచయం చేశాడు. అతడు అప్పటికే ఆ ఇంట్లో పాగా వేశాడు. బహుశా ఇంటి నుంచి బయటపడాలనుకుంటున్నాడేమో. నేను రావడం అతనికి చాలా సంతోషంగా ఉంది ,ఆమె భర్త లాగే.
అతడు నాకంటే ముందు ఆమెని అభిమానించిన వాడు కాదు కదా! ఇప్పుడు అతను వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు కదా! లేదా ఈ ఇద్దరు పురుషులు లోపాయికారిగా ఒక ఒప్పందానికి ఏమైనా వచ్చారా? అటువంటి ఒప్పందం ఈనాటి సమాజంలో సాధారణమే కదా! నేను తమతో ఒప్పందానికి సజావుగా రావాలని, దాన్ని కొనసాగించాలని ప్రతిపాదిస్తున్నట్టు ఉంది వ్యవహారం. అందరూ నా వైపు చేతులు చాస్తున్నారు. అందరి హృదయ ద్వారాలు నా కోసం తెరుచుకుని ఉన్నాయి.
మరి ఆమె సంగతేమిటి? అదో చిదంబర రహస్యంలా ఉంది. ఆమెకి ఇదేం తెలియదని అనుకోలేము. కానీ.. కానీ, సరే ,నాకైతే అర్థం కావట్లేదు.
రాత్రి భోజనాల దగ్గర అందరం కూర్చున్నాం.చాలా సంతోషంగా సహృదయ వాతావరణం లో సంభాషణ కొనసాగింది. మేమంతా భోజనం చేసి బయటకు వస్తుండగా ఆమె భర్త, ఆ స్నేహితుడు పేకాట ఆడుకోవడం మొదలుపెట్టారు. నేను వెనక వసారా లోకి వెళ్లి ఆమెతో కలిసి వెన్నెలను ఆస్వాదిస్తున్నాను. ఆమె ప్రకృతితో ప్రభావితమై మరింత అందంగా ఉంది నా ఆనందకర క్షణాలు దగ్గర పడ్డట్టు అనిపించింది. ఆ గ్రామీణ ప్రాంతం ఆమెను మరింత సుకుమారంగా మలిచింది. ఆమె సన్నటి పొడుగాటి నడుం రాతి పలకల వరండాలో, పూలతో నిండిన పెద్ద పూల తొట్టి పక్కన మరింత అందంగా ఉంది. ఆమెని వెంటనే చెట్ల కిందికి లాక్కెళ్లాలనిపించింది నాకు. కాళ్ల దగ్గర కూర్చుని ప్రేమ కబుర్లు చెప్పాలనిపించింది.
అప్పుడే ‘లూయి’ అని ఆమె భర్త పిలవడం వినిపించింది.
ఆమె వెంటనే ‘వస్తున్నానని’ అనింది.
“నువ్వు టీ తాగడం మర్చిపోయావు.”
“నేను దాని సంగతి చూసుకుంటాను.”
మేము మళ్ళీ ఇంటి లోపలికి వచ్చాం. ఆమె మాకు టీ ని ఇచ్చింది. ఆ ఇద్దరు పురుషులు పేకాట ఆడి బాగా అలసిపోయినట్టు కనిపించారు. చాలా రాత్రి వరకు నాకు నిద్ర పట్టలేదు. ఆ తర్వాత గాఢంగా నిద్ర పట్టింది.
మరుసటి రోజు మధ్యాహ్నం బయటికి వెళ్లాలని అనుకున్నాము. బండిలో వెళ్లి కొన్ని ప్రాచీన కట్టడాలను చూడాలనుకున్నాం. నేను, ఆమె, బండిలో వెనక సీట్లో కూర్చున్నాము. వాళ్ళిద్దరూ మా ఎదురుగుండా కూర్చున్నారు. బండిలో మాటలన్నీ యధావిధిగా, ఆమోద యోగ్యంగా సాగాయి. నాకంటూ ఎవరూ లేరు, నేనొక అనాధని అని అప్పుడు నాకు అనిపించలేదు.ఆ క్షణంలో నాకు ఒక కుటుంబం దొరికిన భావన కలిగింది. వాళ్ళందరితో ఉంటే నేను ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది.
ఉన్నట్టుండి ఆమె తన కాళ్ళను తన భర్త కాళ్ల మధ్యలోకి చాచింది. అతను వెంటనే చిరాగ్గా “లూయి, దయచేసి ఈ పాత చెప్పులు వేసుకోకు. ప్యారిస్ లోనే కాదు, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కూడా చెప్పులు శుభ్రంగా ఉండాలి” అన్నాడు.
నేను, నేను నా కళ్ళు దించుకున్నాను. నిజానికి ఆమె పాత చెప్పులే వేసుకుంది. ఆమె మేజోళ్ళు కూడా సరిగ్గా లేవు. ఆమె సిగ్గుపడి, తన కాళ్ళను డ్రెస్ కింద దాచుకుంది. పక్కనే ఉన్న స్నేహితుడు దూరం నుంచి ఈ విషయాన్ని అంతా అనాసక్తి తో, సంబంధం లేనట్టు చూస్తున్నాడు.
ఆమె భర్త నాకు కాల్చడానికి ఒక సిగరెట్ ఇచ్చాడు. నేను తీసుకున్నాను. కొన్ని రోజులు వరకు నేను ఆమెతోఒంటరిగా ఉండే అవకాశం కలగలేదు. మేము కలిసి రెండు నిమిషాలు కూడా గడపలేకపోయాను. ఆమె చుట్టూ ఆమె భర్త తిరుగుతూనే ఉన్నాడు. అయితే నాతో మాత్రం సంతోషంగా మాట్లాడుతున్నాడు.
ఒకరోజు పొద్దున్న పలహారానికి ముందు నా దగ్గరకు వచ్చి ,’నడవడానికి వెళ్దాం’ అన్నాడు. మాటల మధ్యలో పెళ్లిళ్ల వ్యవహారాలు వచ్చాయి. ఒంటరితనం గురించి మాట్లాడుతూ, ఒక అందమైన అమ్మాయి జీవితాన్ని ఎంత ప్రేమమయంగా తీర్చిదిద్దగలదో చెప్పాను. అతడు వెంటనే అడ్డుకొని మిత్రమా, ఈ విషయాలన్నీ మాట్లాడకు. నీకు ఏమీ తెలియదు.’నిన్ను ప్రేమించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు’ అని అనుకుంటే ఒక మహిళ ఎక్కువ కాలం నిన్ను ప్రేమించదు. చేసిన చిన్న చిన్న చిలిపి చేష్టలన్నీ తొందరలోనే వెనుక పట్టు పడతాయి. గౌరవప్రదమైన మన మహిళలు- అంటే మన భార్యలు- భార్యగా తమ బాధ్యతలు అర్థం చేసుకోరు. నీకు అర్థం అవుతోందా?
ఆ తర్వాత అతను ఇంకేం మాట్లాడలేదు ఏం ఆలోచిస్తున్నాడో అని నేను ఊహించలేదు.
ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అతను నన్ను ఓ రోజు పొద్దున్నే తన గదిలోకి తాను సేకరించిన చెక్కిన బొమ్మలను చూపించడానికి పిలిచాడు. నేను పెద్ద తెలుపు ఎదురుగుండా ఉన్న వాలు కుర్చీలో కూర్చున్నాను. అతడు తాను సేకరించిన చెక్కడాలన్నీ చూపిస్తున్నాడు.కుర్చీ వెనక తలుపుంది. ఇది అతని భార్య ఉండే అపార్ట్మెంట్ ని వేరు చూస్తూ ఉంది. ఆ తలుపు వెనకే ఎవరో నడవడం, కదలడం గమనించాను. అతను వాటి గురించి ఏదో చెప్పుకుపోతూనే ఉన్నాడు. కానీ,నేను ఆ మాటలను మనసుపెట్టి వినడం లేదు. మాట వరసకి ‘అబ్బో !చాలా బాగున్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి. అందంగా ఉన్నాయి,అని నోటితో అంటున్నాను’ గాని వాటిపై దృష్టి పెట్టలేదు.
ఆ తర్వాత అతడు ఉన్నట్టుండి,” పక్క గదిలో ఇంకా మంచివి ఉన్నాయి. ఉండు. నేను వెళ్లి తీసుకొస్తాను.” అంటూ తలుపు దగ్గరికి గబగబా నడుచుకుంటూ వెళ్లి తలుపు తెరిచాడు.
అది పెద్ద గది. అంతా అస్తవ్యస్తంగా ఉంది. గది మధ్యలో స్కట్లు, కాలర్లు, నడుముకు పెట్టుకునే బెల్టులు, నేల మీద పడి ఉన్నాయి. మధ్యలో పొడుగాటి ఎండిపోయిన ఆకారం కనిపించింది. ఆమె కింది భాగం ఒక పాతబడిన చిరిగిపోయిన సిల్క్ స్కర్ట్ తో కప్పబడి ఉంది. అది ఆమె వంకర టింకర ఆకారం చుట్టూ వేలాడుతున్నది. ఆమె అద్దం ఎదురుగా నిలుచుని, ఒక విధమైన బ్రష్ తీసుకుని, పలచగా ఉన్న వెంట్రుకలను దువ్వుతోంది. ఆమె చేతులు రెండు లఘు కోణాల లాగా ఉన్నాయి. ఆమె ఒక ఎముకల గూడు లాగా ఉంది. కేవలం ప్రజల కంట బడకుండా ఉండడానికి మెత్తని తొడుగులు కప్పింది.
భర్త సహజంగానే ఆశ్చర్యపోతూ, తలుపు వేసి, వెనక్కి తిరిగి వచ్చి,,’ దేవుడా నేనంత తెలివి తక్కువ వాడిని. ఎంత అనాలోచితంగా చేశాను. నా భార్య నన్ను ఎన్నటికీ క్షమించదు’ అన్నాడు.
నేను అప్పటికే నా మనసులో అతనికి కృతజ్ఞతలు తెలిపాను. మూడు రోజుల తర్వాత నేను వెళ్ళిపోయాను- ఆ ఇద్దరితో కరచాలనం చేసి, ఆమె వేళ్ళకి ముద్దు పెట్టి. ఆమె కూడా నాకు ప్రశాంతంగా గుడ్ బై చెప్పింది.
అంతా చెప్పి, కాల్ మసూలిని మౌనంగా కూర్చున్నాడు. ఎవరో ,’ఇంతకీ ఆ స్నేహితుడి సంగతి ఏంటి?’ అని అడిగారు.
నాకు తెలియదు. అయితే అతడు నేనంత తొందరగా వెళ్ళిపోతున్నందుకు చాలా దుఃఖ పడినట్టు కనిపించాడు.

ఉషారాణి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *