హోటల్ ముందు నిలుచున్నాడతను.
బయట కార్పోరేషన్ దీపాలు వెలిగినయ్. జనప్రవాహం ఇళ్ళవైపు మరలింది. నిశాచరులు అక్కడక్కడ వీధిమలుపుల్లో నిలబడి మాట్లాడుతున్నారు. గబ్బిలాల్లా ఎక్కడనించి వస్తారో ఈ జనం? రాత్రిపూట బయటపడతారు. ఆ మాసిన గడ్డాలూ, మురికి లుంగీలూ, చిరిగిన చొక్కాలూ, చిందర వందర జుట్లూ, రాత్రిపూట స్వేచ్చగా విహరిస్తయ్. పగలు కనపడవ్. పగటిపూట అంతా పెద్ద మనుషులే. రాత్రులు ఆ పెద్దమనుషులు ఏమౌతారో? హాయిగా పత్రిక చదువుకొంటో, రేడియో వింటో, వస్తూ వస్తూ కొనుక్కొనివచ్చిన వస్తువులు భార్య పిల్లలకు చూపిస్తుంటారు గామాల్ను. ఎనిమిదింటి దాకా పిచ్చాపాటి ఖబుర్లు, తొమ్మిదింటికి భోజనాలు, పదింటికి లైట్లు ఆర్పేసి పండుకోటం, పెద్దమనుషులు, పిల్లా పాపా ఉన్నవాళ్ళు పాపం.
ఎందుకిక్కడ నిలుచోటం? హోటల్ లోపలికి వెళ్ళాడతను. పరవాలేదు, పదింటిదాకా కూర్చోవచ్చు, మధ్య మధ్య ఒక అర కప్పు కాఫీత్రాగుతో. లైట్లు ఫుల్గా వెలుగుతున్నయ్. జనం ఎక్కువ మంది లేరు. ఒక మూల టేబుల్ వద్ద కూర్చున్నాడు. అప్పుడే రానేవచ్చాడు సర్వర్ యమదూతలాగ. ‘ఒక అరకప్పు కాఫీ స్ట్రాంగ్’. రేడియో కుయ్యి కుయ్యిమంటోంది. లోపల ఆమ్లెట్ల వాసన వేస్తోంది. ఆ మూలనున్న సూట్‌వాలాలు ఏమిటో గుసగుసలాడుతున్నారు. ఒకసారి తనవంక చూశారు. ఆ చూపుల్లో కుతూహలం లేదు. ఓహో నువ్వా? సరేలే! అన్నట్టుంది. ఏమిటో ఆ రహస్యాలు? ప్రేమగాధలా? వ్యాపారపు కిటుకులా? ఇంటిదగ్గర గొడవలా? ఎలా తెలుస్తుంది? తాను రాత్రిచేసిన ఖూనీ దగ్గర నుంచి ఇక్కడ కాఫీ బాగాలేదనే వర్తమానంలోపు ఏదైనా కావచ్చు అది. కొంతమంది ప్రతిదీ గుసగుసలే మాట్లాడుతారు.
ఒంటరితనంగా ఉంది వాళ్ళ గుసగుసలు చూస్తే. ఇప్పుడు గోకుల్ ఉంటే ఎంతబావుండును? ఇద్దరమూ ఇలాగే గుసగుసలాడేవాళ్ళం గామాలు. అప్పుడు ఎవరన్నా చూచినా ఇలాగే అనుకొనేవాళ్ళు. కుర్చీమీద వెనక్కు అనుకొన్నాడు. జేబులోంచి సిగరెట్టు తీశాడు. ఇంకా నయం. ఇక్కడ సిగరెట్లు కాల్చడం మీద నిషేధం లేదు. ముట్టించాడు. ఒక గుక్క గట్టిగా పీల్చాడు. ఇప్పుడు కాస్త బాగుంది. హోటల్ అద్దాల తలుపుల్లోంచి బయట వచ్చేపోయే జనం కనిపిస్తున్నారు. బిచ్చగాళ్ళు, అడుక్కుతినే ముసలి ముండలు, దిక్కులేని పిల్లలు, ఇళ్ళకు తిరిగివెళ్ళుతున్న జనం, చెదురాటుగా కులాసా మాటలు చెప్పుకుంటూ వెళ్ళే జంటలు. వాళ్ళకోసం వేచిఉన్నాయి ఇళ్ళు, పరిశుభ్రమైన గదులు. తెల్లని వెలుతురు, చిరపరిచితమైన ఏకాంతం. ప్రతి వస్తువు దేని చోట్లో అది. బయట చెట్లలో నుంచి చల్లనిగాలి. ప్రశాంతి, తృప్తి, సార్ధక జీవితాల హాయిగొలిపే మత్తు. వాళ్ళు నిద్ర లేచేటప్పటికి సూర్యుడు సలాం కొడతాడు.
“బాబూ! ఒక కానీ, నాయనా! “నిన్నిటి నుంచి మెతుకు నోట్లోకిపోతే ఒట్టు,” ముసలిముండ! దరిద్రం. పడుచుదైనా పొట్ట పోసుకొనేదే ఎలాగో అలా. దానికింకొక మార్గం లేదు. ముసలి వేశ్యలందరూ ఇలాగే తయారౌతారు. పాప ఫలితాలు. కాని అందరూ అనుభవించరు. ఎవరో అదృష్టంలేని వాళ్ళు అనుభవిస్తారు. ఈ ముసలమ్మను చూస్తే మిసెస్ పాండ్యా జ్ఞాపకం వస్తుంది. ఆవిడ కంటే ఎక్కువ పాపం చేసిందా ఈ ముసలమ్మ? ముసలితొక్కు, చుంచుమొఖం అదీ, సిల్కు చీరలు, పారసీ ఫ్యాషన్లు, రవ్వల హారాలు అది. రోజుకు ముగ్గురు పడుచువాళ్ళు కావాలంట. ఎప్పుడూ కుర్రాళ్ళను వెంబడి వేసుకుని తిరుగుతూ ఉంటుంది. సిగ్గుంటేగా, డబ్బుకూడా ఇస్తుందట. ఛీ ! దాన్ని తలుచుకుంటే డోకువస్తుంది. దానికంటే ఈ ముసలమ్మే నయం. కాని ఆవిడ కూతురు బాగుంటుంది. పాపం అమాయిక, ఈ ముసలిది ఎక్కడికన్నా వెళ్ళనిస్తేగా? ఎవరితోనన్నా మాట్లాడనిస్తేగా? రెండు మూడు సార్లు వెళ్ళితే ఈ దరిద్రం ఎదురైంది. వదిలించుకొని బయటపడేటప్పటికి తలప్రాణం తోకకు వచ్చింది. సర్వరు కాఫీ తెచ్చాడు. ఒక్క గుక్క, చిరుచేదు. విషమని అంటారు. కాఫీ విషం. సిగరెట్ విషం. మన నిలువెల్లా విషం. మనిషంత విషపు జంతువు ఏదీ లేదు. కొంతమంది ఆడవాళ్ళ చూపుల్లో, పెదవుల్లో విషం ఉంటుంది. ఆ విషానికి విరుగుడు ఈ విషం. విషస్య విషమౌషధమ్. సిగరెట్టయిపోవచ్చింది. పారవేశాడు. ఇంకొక సిగరెట్టు. తమరు పరాకు చిత్తగిస్తున్నారు. కాఫీ గుక్క వేస్తూ ఎదురుగా అద్దంలో మొఖం చూసుకొన్నాడు. వెధవ మొఖం, ఫరవాలేదు. దిగులుగా విచారంగా ఉన్న జంతువు మొఖం. చిత్రం! ఆ మొఖం తనదికాదు. ఎవడో క్రొత్తవాడు, గడ్డం కొంచెం తెల్లబడుతోంది. ముఖం పీక్కుపోయినట్టుంది. వయస్సు ముదురుతోంది. ముసలితనం. జీవితం తింటోంది తననుతాను.
బయటకు చూచాడు. ఇద్దరు మహిళామణులు వస్తున్నారు. హోటల్లోకే? ఆశతో అతని గుండె దడదడలాడింది. కాలక్షేపం. అనంత కాలావధిలో అరక్షణం, A thing of beauty is ….. కాలమనే ఖాళీపాత్ర నింపటానికేదో ఒకటి. హోటల్లోకి నిర్భయంగా వచ్చి కూర్చున్నారు ఎదురు బల్లవద్ద. ఒకసారి చుట్టూ కలియచూశారు. మాటల్లో మునిగిపొయ్యారు. సర్వరు వాళ్ళదగ్గరకు వెళ్ళటం చూశాడతను. ‘రెండు బ్రెడ్ అండ్ బట్టర్.’
విద్యుత్కాంతి ధారాపాతంగా కురుస్తోంది. నల్లటి జుట్టు సిల్కు దారాల్లా మెరుస్తోంది. తెల్లటి వెలుగుజీరలు జుట్టుమీద నుంచి జాలుగా క్రిందికి దిగి, మెడక్రింద మెత్తని లోయల్లో నీడలు కల్పిస్తో, బుజాల వంపుల మీద తళుక్కుమంటున్నవి. బంగారం పండుతున్నది వంటిమీద. కనకకామిని. అతడా దృశ్యాన్ని కళ్ళుమూసుకొని మనస్సులో ఆనందించసాగాడు. సిందాబాద్ అనే కూలివాడు ఒక అమ్మాయికి కావలసిన సరుకులు మోసుకువెళ్ళాడు. అదొక రాజభవనం, రాజు మాత్రం లేడు. సరుకులు దించాడు. ముగ్గురు కన్యలు, కాదు, ఇద్దరే. ఎంత చూసినా మూడో కన్య కనబడటంలేదు. ఆ భవనంలో మగవాళ్ళెవరూలేరు. దాసీలు మాత్రమే, సిందాబాద్ అనే కూలివాడికి విందు. ఛప్పన్నారు పిండి వంటలు. ద్రాక్ష, కిస్మిస, రకరకాల పండ్లు. ఆ భవన ప్రాంగణంలో ఒక సరస్సు ఉన్నది. వెన్నెల. నీటిలో చంద్రుడు. జలక్రీడలు. నవ్వులు. వెన్నెల్లో తెల్లగా తళతళ మెరుస్తున్న దేహాలు. అదేమిటని అడిగారు, ఏమీతెలియనీ అమాయికలు. కస్తూరి, పునుగు, జువ్వాజి, అగురువొత్తుల వాసన, దివదేహాల పరిమళం. అకస్మాత్తుగా అతని కల కరిగిపోయింది. ఆ యిద్దరిలో ఒకామె కుర్చీ మీద వెనక్కు విరగబడి నవ్వుతున్నది. కిలకిలా, పకపకా. అతనికి కోపం వచ్చింది. సిందాబాద్‌ను ఇద్దరు కన్యలూ రాజభవనంలోంచి తరిమేశారు. కిలకిలా, పకపకా, క్రిందికి కట్చేసిన నీలిరంగు సిల్కు బ్లౌజులోంచి వెనక విరుపు వలన పొంగివచ్చిన ఉన్నతవక్ష సౌందర్యం, కంఠసీమలో రక్తనాళాలు ఉబికి మేల్కొన్నాయి. గాజుమేడలో నగ్ననృత్యం చేస్తున్న అప్సరసలు.
And breasts like Champagne glasses.
All her belongings on show.
ఒక నిట్టూర్పుతో అతను బయటకు చూడసాగాడు.
వీధి దీపం వెలుతురులో పురుగులు ముసురుకొని వలయాకారంగా ఎగురుతూ ఆడుతున్నవి. ముసలమ్మ మురుగు కాలవమీద కూర్చుని తలగోక్కుంటున్నది. ఎవరో ఒకబ్బాయి రెండుచేతులు విడిచిపెట్టి సైకిలు తొక్కుకొంటో వెళ్ళాడు. ఎదురుగా రెండంతస్తుల మేడ వెనుక నుంచి చుక్కలతో పొదిగిన ఆకాశపు పీలిక కనుపిస్తోంది. ఏది నిజం ? సిగరెట్టు పొగలోంచి, కాఫీ చిరుచేదు నిషాలోనుంచి, సుందరీవక్ష వీక్షణ సౌభాగ్యానందకందళిత హృదయారవిందుడనై అడుగుతున్నాను నేను? ఏది నిజం ? సిల్కు చీరలా ? చింకిగుడ్డలా ? మాడినకడుపులా ? బలిసిన రొమ్ములా ? వృద్ధ వేశ్య ప్రలాపాలా ? జవ్వనుల పకపకలా ? చీకటిలో ఒంటరితనం ? వెలుగులో జంటలు ? ఏది నిజం ? చావుబ్రతుకుల సంజమసక, కల్తీలేని వెన్నకాచిన నిజం ఏది ? ఎలాగుర్తుపట్టటం దాన్ని ?
చచ్చిపోయిన మనిషి. The drowned phoenician sailor. టి.బి. ఆసుపత్రిలో చచ్చిపోయిన అమ్మాయి జ్ఞాపకం వస్తోంది. నెత్తురు లేమితో పాలిపోయిన ముఖం. మూత బడిన కళ్ళు. తెల్లగా చలువరాతి విగ్రహంలా, మృతక సౌందర్యం. మృత్యువు ప్రేమించింది ఆమెను. మృత్యుశైతల్యం ఆమె అవయవాల్లో. ఆ పాలిన పెదిమలు జీవితం ప్రసాదించే వెచ్చని ముద్దులు ఎరిగిఉండవు. ఏమి అనుభవించింది ఆమె జీవితంలో ఆనందం ? డాక్టర్లు, మందులు, నర్సులు, ఆసుపత్రి తెల్లని గోడలు తప్ప ఏమి ఎరుగు ఆమె ? ఆమె పడుకొని ఉన్నది ప్రశాంతంగా, తెల్ల తామరలాంటి ముఖంపై తుమ్మెద ముంగురులు. అలసి నిద్రపోయినట్టుంది. ఆమె పెదిమల చుట్టూ దివ్యమైన చిరునవ్వు ఆడుతున్నది. ఏమిటా నవ్వు ? ఎవరిని చూచి ? మళ్ళా ఎప్పుడూ మేలుకోదు ఆమె ! Cardelia! Cardelia! Stay a while; she was ever so gentle and meek. an excellent quality in women.
ఈమె నవ్వుతోంది. ఆమె మళ్ళా ఎన్నడూ నవ్వదు. నవ్వుల రోజుల్లో నవ్వకపోతే ఎలా? ఉప్పొంగుతున్న రక్తనాళాల్లోంచి, నున్నని మెత్తని అవయవాల్లోంచి, వినీల విద్యుత్కాంతులు కురిపించే కళ్ళల్లోంచి, మొఖమల్ చర్మాన్ని ఒరుసుకొని ప్రతిఫలిస్తున్న జీవధావళ్యంలోంచి ఏవో పరిమళాలు గుబులుకొంటున్నయ్. మధుమదిరాగంధం తలకెక్కుతున్నది. అస్పష్టమైన కదలిక, చక్కలిగింతలు, ఉండబట్టలేక ఆమె నవ్వుతున్నది. నవ్వనీ, ఆమె ఇంకా జీవితపు చేదు రుచి చూడలేదు.
ఇప్పుడు ఆమె పెద్దగా మాట్లాడుతున్నది. ప్రక్కనే కూర్చున్న స్నేహితురాలి కొరకు ఆమె అంత పెద్దగా మాట్లాడనక్కర్లేదు. ఆ నవ్వుకూ ఆ మాటలకీ ఏమీ సంబంధం లేదు. అది ఉత్త నవ్వు. నవ్వుకోసమే నవ్వు. Trying to show off, is it ? ఆకర్షించటానికి. సాలీడు వల. ఎలుకతో చెలగాటమాడే పిల్లి. వేటలోనున్న ఆనందం. ఆనందం కొరకు వేటకాదు. Bait him. Torture him. Tickle the life out of him. వేధించు, కాళ్ళమీద పడిందాకా ఊరుకోకు. వాడిని కుక్కలా తయారుచెయ్యి. దగ్గరకు వస్తే లాగి ఒకటి తన్ను, కుయ్యి కుయ్యి మంటూ పోతుంది కుక్క!
ప్రేమ. sadism, అవయవాల మరణయాతన. దాస్యంలోని ఆనందం. ఏమి నిష్కపటం? ఏమి నిష్కల్మషం? ఇతరులు తనను కోరేట్టు చేసుకొని తన అస్తిత్వానికొక అర్థం కల్పించుకోటం. అతని కొరకు ఏం చేయగలవు ? నిప్పుల్లో దూకగలవా ? దూకినా నీ అహంభావాన్ని తృప్తి పరచుకోటం కోసం, అతని కోసం కాదు. అర్ధంలేదు.
అతడు ఆ నవ్వుతున్న అమ్మాయివేపు చూశాడు. అతనిదృష్టి ఆమె ఉన్నతవక్షోజాల మీద లేదు. విద్యుత్కాంతిలో తళతళ మెరుస్తోన్న చెంపల మీద లేదు. ఆహ్వానిస్తోన్న అరుణాధరాల మీద లేదు. పరిరంభానికి పిలుస్తోన్న బంగారపు చేతుల మీద, తొడలమీద లేదు. అతడు చూస్తున్నాడు ఈ రంగురంగుల తెరను చీల్చుకొనిపోయి ఆమె ఆత్మ ఉండే చీకటిగదిలోకి. Void and Waste. Waste and Void. And darkness was upon the face of the waters. దిగులు, విచారం, మానవజాతి భవిష్యత్తు. అతీత దేశచరిత్రలు, క్షయరోగం ప్రేమించిన కన్నె పడుచు. మురుగు కాలవ మీద ముసలమ్మ. నీ ఉన్నతవక్షోజాలు నేను చూశాను. నీవీచోటుకు అందం తెచ్చావన్న సంగతి నాకు తెలుసు, కాని కాని ఎందుకో విచారం, దిగులు, Waste and void.
మానవజాతుల శోకార్ధ సంగీతం ! నిన్ను వెంబడిస్తున్న శిథిలాలు. క్షణాన్ని లోకం నుంచి వేరుచేసి విడిగా తీసుకోవటం ఎలాగ? సౌందర్య సమక్షంలో విచారానికి తావివ్వక పోవటం ఎలాగా? నీ కవతల, నీ ప్రక్కన, నీలోనగాక నన్నే చూడటం ఎలాగ? జ్ఞాపకాల తలుపులు మూసి, మృత వాయువుల మట్టి వాసనలు రాకుండా చేసి నీ పరిమళాన్ని అందుకోవటం నాకు చేతనౌతుందా? అనుమానం, సందేహం, భయం. విశ్వాసం లేదు ఈ కాలపువాళ్ళకి.
అప్పడు మొదలు పెట్టింది రేడియో గొంతుక. వాయులీనం, ఆనందభైరవి, నెమ్మదిగా నవవధువు అడుగుల సందడిలా, ఆకాశంలో ఓమూల చివరనించి మబ్బు తునక లేచినట్టుగా, తూచినట్టుగా, చూచినట్టుగా నెమ్మదిగా లేచింది పైకి, సముద్ర గర్భంలోంచి నాగకన్యకలా. ఒక అమానుష కంఠం. దివ్యస్వరం. Between some talk of you and me. ఎక్కడున్నది ఇది ఇప్పటిదాకా? మాయానగరపు సింహ ద్వారంలో రాకాసికీ రాజకుమారికీ మధ్య నలిగి పోతున్న నేను నేను కానప్పుడు ఎక్కడున్నదిది? అంతా నిశ్శబ్దమైనప్పుడు నీవు నాతో నా కొరకు అనకుండా అన్నది నేను విన్న సంగతి నీవు విన్నావని నేను విన్నానని నీవు అనుకొన్నప్పుడు ఎక్కడున్నదిది ? ఇకనీవు నవ్వితే, రాళ్ళురువ్వితే పువ్వులు కురుస్తాయి జాగ్రత్త!
వాయెలిన్ మ్రోగుతున్నది. లోపలి నుంచి, బయటి నుంచి, ఇటునుంచి, అటునుంచి, అన్నివైపుల నుంచి. From everywhere and from nowhere. ఆత్మనీ దేహాన్నీ కబళించి సౌందర్యపు అదృశ్యాస్పృశ్య జ్వాలాకీలల్లో బ్రహ్మాండాన్ని చుట్టు ముట్టి మహోత్తుంగ స్వర తరంగాలు. ఎక్కడున్నావ్ ప్రేయసీ! నీవు తుపానులో చిక్కుబడిపోయావ్. నీకంటే మహత్తర భీకర సుందరమైనదేదో నిన్నావరించేస్తున్నది. నీ విప్పుడు నాలో ఉన్నావు. నేను తుపానులో ఉన్నాను. తుపాను మన అందరిలో ఉంది. అందరం ఎక్కడాలేము. దేశకాలావధులు దాటి నిరాధారంగా, విచారంగా, దూరంగా పోతున్నాం ఎక్కడికో ! We are lost. We are the first of the first of the latest and last edition of the lost generations. ఎక్కడికి వెళ్తున్నాం మనం ప్రేయసీ ! మహీయసీ!
వాయొలిన్ మూల్గుతున్నది. బాధగా, జాలిగా, ప్రేమగా, ఆనందం భరించలేక, దు:ఖం పట్టలేక, చిన్నగా మెల్లగా ఉయ్యాల ఊపులాగా వాయుతరంగంలాగా. అందుకనే వాయులీనం అన్నారు. మునుగుతున్న పడవలా మునిగిపోయి, ఎగిరే విమానంలా తేలిపోతున్నది. తల్లి ఒడిలో పిల్లవానిలా ఊగుతున్నది. ఏదో ఒక అదృశ్య వస్తువు ధవళ వేగంతో చీకట్లో ఈ మూలనుంచి ఆ మూలకు ఆ మూలనుంచి ఈ మూలకు తిరుగుతున్నది. The rocking rythm of rising passion. To and fro. To and fro. రెండు ధృవాలనూ ఒకే స్పర్శతో తాకుతున్నది. విద్యుత్ప్రవాహంలా.
వాయొలిన్ మ్రోగుతున్నది. మూల్గుతున్నది. వెల్గుతున్నది. ప్రతీక్షలో ఆనందం. నీ హృత్స్పందన నందన ఛందం. స్పర్శ కొరకు ఎదురుచూడటం. మృత్యుస్పర్శ కొరకు, అగ్నిస్పర్శ కొరకు. తీగల్లా సాగిన నరాలు. మెరుస్తోన్న చర్మం. ఈ రాత్రికి ఈ జ్వాలాకీలలు ఎక్కడ ఎరువు తెచ్చావ్? సూర్యకాంతమణులు నీ నేత్రాలు. ఎందుకు అలా చూస్తావ్ ? నీ అవరుద్ధ నిశ్వాసాలు ప్రభంజనాగమాన్ని సూచిస్తున్నయ్. భావి సంఘర్షణ కొరకు ఆకాశం వేచియున్నది. Something of the storm we have in ourselves. వాయొలిన్ సంగీతం సూచిస్తున్నది రాబోయే తుపాను, పొడవబోయే ప్రొద్దు, ముసురుకొనే రాత్రి, ఆనందపు అంచులు, కడసారి కౌగిలింత, నేటి అద్దంలో రేపటి ప్రతిబింబం, గతకాలపు ప్రతిధ్వనులు.
వాయొలిన్ మూల్గుతున్నది. ఆత్యంతికానందంతో మరణయాతనతో మెల్లగా చల్లగా మూల్గుతున్నది. Ecstasy of agony, Agony of ecstasy, Blissfully forgetful of reality. గట్టిగా పట్టుకో, తేలిపోతున్నావు. ఆ ధ్వని మెల్లగా లేస్తున్నది. కైలాస శిఖరాన్ని అందుకొనేందుకు, ఆకాశాన్ని చుంబించేందుకు, మహాతరంగంలా లేస్తున్నది. ఆ తరగ పడిపోయేటప్పుడు ప్రపంచాన్ని మంచు తేనియల సోనవానలో ముంచెత్తుతుంది. జీవితపు తంత్రులపై ఉన్మాద సంగీతం. ఉరిఉచ్చులో బిగిసిన గొంతులోంచి వెలువడే గురగురలు. మరణోన్ముఖ మృగశాబక చీత్కారం. అనంత అశృసాగరాల ఘోష అరణ్యమున హరీంద్ర గర్జన. కరిగిన లోహప్రవాహంలోని నీలిమంటలు. దేవాలయాల గంటలు. Rapes en masse. సురతాంత మహానందపు అణగిమణగిన కలకూజితాలు. జీవితం! జీవితం!
ఆ ధ్వనిలేస్తున్నది అనంతశూన్యంలోకి. అందరాని దానిని అందుకునేందుకు, సుఖ దుఃఖాల కతీతమైన పరిపూర్ణస్థితిని పొందేందుకు. మహోన్నత గిరిశిఖరాల నగ్నత్వాన్నీ, పూచినచెట్ల పసిమినీ, రాలిన ఆకుల చప్పుడునీ, జనపదాల, వనపదాల, మృదుపదాల, పరివిధాల సంచారం, నీ అభిసారం. ఎక్కడికి ప్రేయసీ! నేనూ వస్తున్నా.
ఇంకా పైకి! ఇంకా పైకి! ఆగవద్దు, నా గుండెకూడా ఆగిపోతుంది. నశ్వరశరీరాల శృంఖలాలు త్రెంచుకొని మహోజ్వల మహోచ్చల సంగీతానికి. The zero hour on the threshold of eternity is over. We are in the thick of it. ఊపూపు ఉయ్యాల మామయ్య. బ్రహ్మాండపు గడియారంలో చరిత్ర పెండ్యులం ఊగుతోంది. .
నెత్తురు పాట. ఆఫ్రికాలో అర్ధరాత్రి. కోపగించిన విసూవియస్ జలపాతం. ఝం ఝ పాతం, అణుశక్తి విస్ఫోటం, బ్రద్దలైన సింహకవాటం. తెర ఎత్తిన అవ్యక్తంలో కన్నెపడుచు రక్తం. నయాగరా, హరాకిరీ, హిరోషిమా నునువెచ్చని కౌగిలింత, Horizontally wakeful amidst the universal widths. సిగరెట్టు మొదటి దమ్ము. నిద్రా జాగరణాలు, హాసరుదనాలు. జీవితపు శంఖధ్వని. రాట్నం వడుకుతున్న చలం. కుటుంబరావు సకుటుంబ సమేతుడు. శ్రీశ్రీ శివతాండవం, అసమర్థుని జీవయాత్ర, బైరాగి కొకరాగి కానీ, హిమాలయ ప్రభాతకాంతి. ప్రశాంతసాగరంలో జలసమాధి. Icecream. T.S. Eliot and Romeo Zuliet. ఎవరు నేర్పారు నీకీ విద్య ?
సంగీతం ఆగింది. కాలం ఆగి ఊపిరి పీల్చుకోసాగింది. ప్రపంచం చెమట తడుచుకొంటోంది. ప్రేయసీప్రియులు అలసిసొలసి నిద్రించారు. అంతా ఇదివరకు మాదిరిగానే వుంది. లేదు.
ఈ రాత్రిపూట ఒకగంట విద్యుద్దీపాల కాంతిలో యౌవన సాన్నిధ్యంలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. లేదు కాలం ఆగింది. కాలం సాగింది. కాలం గుండె దడదడా కొట్టుకొన్నది ఒక్కక్షణం. అతడు లేచి తలకాయ వంచుకొని బిల్లు చెల్లించి చకచకా బయటకు నడిచాడు. వెనకకు తిరిగి చూడనన్నా లేదు. అతని జీవితఖండం ఒక నిమిషం మేల్కొని నిద్రించింది.
బయట నక్షత్రకాంతిలో, నిశాసౌరభశ్వాసలు చెంపల్ని తాకుతుండగా అతడొక నిట్టూర్పు విడిచాడు. దుమ్ము నిండిన గదిలో సిగరెట్ పీకలు. To sleep, prepare for life. Each morning new horror brings. అయితేనేం ? మిగిలిన రోజులన్నీ ఎడారులైతేనేం? రేపుదయమే, ఈ క్షణమే నేను చస్తేనేం ? నేనొక గంట జీవించాను. చాలా వాస్తవంగా జీవించాను.
ఆంధ్రజ్యోతి మాసపత్రిక, జనవరి 1950.

ఆలూరి బైరాగి
ఆలూరి బైరాగి తెనాలి తాలూకాలోని ఐతానగరంలో 1925, సెప్టెంబర్ 5వ తేదీన ఆలూరి వెంకట్రాయుడు,సరస్వతి దంపతులకు మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి హిందీ చదవమని ప్రోత్సహించడంతో 1935 ప్రాంతాల్లో యలమంచిలి వెంకటప్పయ్య స్థాపించిన హిందీ పాఠశాలలో చేరారు. పదమూడో ఏట హిందీలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆయన ఉత్తరాది వెళ్లారు. తన కవితా వ్యాసంగపు తొలినాళ్లలోనే పలాయన్ అనే పేరుతో హిందీ కవితా సంకలనం ప్రచురించారు.
1946లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడుగా చేరారు. తెలుగు,హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటు బెంగాలి, ఉర్డు భాషలలో కూడా ప్రవేశం ఉంది. తెలుగులో బైరాగి మొదటి కవితా సంకలనం చీకటి నీడలు ప్రచురించారు. నూతిలో గొంతుకలు, దివ్యభవనం కథా సంపుటిని ప్రచురించారు. బైరాగి రచనలలోకెల్లా నూతిలో గొంతుకలు ఆయన ఉత్కృష్ట రచన. 1978లో క్షయవ్యాధికి గురయ్యారు. చివరిరోజుల్లో ఆయన తన మకాం హైదరాబాదుకు మార్చారు. ఆంగ్లంలో ఒక మంచి నవల రాశారు. ఆయన నవల, నాటకం, కొన్ని అముద్రితాలుగానే మిగిలిపోయాయి. బెంగాలీ భాష కూడా నేర్చుకున్నారు. బెంగాలీలో జీవనానంద దాస్ అనే కవి ఆయనకి చాలా ఇష్టం. అయిన బైరాగి 54 ఏళ్ళ వయస్సులో 1978 సెప్టెంబరు 9న మరణించారు. తెలుగు సాహిత్యంలో ఒక దృవతార నేల రాలిపోయింది. బైరాగికి మరణానంతరం 1984లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు.
