బెదురు కలలు

Spread the love

నా నిద్రను
నిండా కమ్ముకుంటుంది కల

నరాల్లోంచి వెనుదిరిగి
ఎటు పారిపోతుందో
నా నెత్తుటి సత్తా..
గుండె పీకుతూ
బరువుగా వేలాడుతుంది కల

ధభీమని తెరుచుకుంటుంది
మెలకువ కిటికీ.
అటుగా దూసుకు వచ్చి
భళ్ళున తాకుతుంది భయంగాలి.
దిగ్గున లేచికూచుంటుంది కల!

రెక్కలు రాని పిట్టపిల్ల
గూటి నుండి నేలరాలి
బితుకు బితుకుమంటూ
ఒకటే భీతి కోత..
కిచకిచమంటూ
గుండెలవిసిపోయేటట్టు ఓ కల..

తుపాను హూరులో చిక్కుకొని
సముద్రపు సుడిలో
బొంది మునుగుతున్న
పడవ ఊపిరిలా
పగిలిపోతూ ఓ ఒంటరి కల

శిఖరం అంచు నుంచి
చప్పున పట్టుతప్పి పడిపోతూ
అరచేతిలో ముడుచుకున్న ప్రాణం
అడుగు తగలని లోయలోకి
అమాంతం జారిపోతున్నట్టు
మరో కల

పులి నోటికి చిక్కిన
జింక మెడ బిగించి పట్టి
ప్రాణాలు తోడేసే
పెను నొప్పి లాంటి ఇంకో కల

నిదురించే నా దేహంలో
కల ఉండదు,
నన్ను హడల గొడుతూ
కల చొరబడిందో
నాకిక నిదురుండదు

ఈ కలల్ని
నా కనురెప్పల మీద మోసే తెగువ
నాకెప్పుడొస్తుందో..

కంచరాన భుజంగరావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *