మనసుకు వర్షం కావాలి

Spread the love

మనసుపై అప్పుడప్పుడూ వర్షం కురవాలి

శరీరాన్ని అలా పైపైన స్నానం చేయించినట్టుగా కాదు
ఏళ్లుగా పేరుకుపోయిన
నిశ్శబ్దపు దుమ్మును కడిగేయడానికి



మనసుకు రెక్కలుంటాయి

అవి పక్షుల ఎగిరే రెక్కలు కావు
మనిషి మరొక మనిషిని
ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నప్పుడు
కనిపించకుండానే విప్పుకునే రెక్కలు



చాలా రోజులుగా ఎవరి కళ్లలోనూ
నువ్వు నీ ప్రతిబింబాన్ని వెతకకపోతే
చెట్టును మరిచిపోయిన గొడ్డలిలా
నదిని మరిచిపోయిన పడవలా
మనిషిని మరిచిపోయిన మనిషిలా

నీ మనసు నెమ్మదిగా ఎండిపోతుంది



మనసుకు పుస్తకాల్ని చూపించు

ఒక నది ఒడ్డున కూర్చోబెట్టు
ఒక పాలపిట్ట పాటను వినిపించు
ఒక రైతు అరచేతిని తాకనివ్వు

ఒక తల్లి కన్నీటిని నిశ్శబ్దంగా తుడవనివ్వు

మనసుకంటే నీడనిచ్చే చెట్టు పవిత్రం
ఆకలిగొన్నవాడికి అందించిన అన్నం పవిత్రం

ప్రపంచాన్ని మార్చలేకపోయినా
ఒక మనిషి ఒంటరితనాన్ని మార్చగలిగితే
అదే మనసుకు పండుగ

ప్రతి ఉదయం
సూర్యుడు ఉదయించేది
భూమి కోసం మాత్రమే కాదు
మనలో ఇంకా ముగిసిపోని
చిన్న వెలుగు కోసం కూడా

ఆ వెలుగును ఆరిపోనివ్వొద్దు

ప్రపంచాన్ని నిలబెట్టేది
పర్వతాలు సముద్రాలు మాత్రమె కావు

ఇంకా ఒక మనిషిని
మనిషిగా చూడగలిగే
ఒక మనసు మాత్రమే
వారాల ఆనంద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *