ఎప్పటినుంచో నా లోపల
ఒక కిటికీ మూసి ఉంది
దాని అద్దాలపై కాలం వేసిన వేళ్ల ముద్రలు
దాని వెనుక వెలుగు చూడని కొన్ని పక్షులు
పేర్లు లేని కొన్ని ఋతువులు.
ఒక మాటను
ఏళ్ళపాటు గుండెలో దాచుకుంటే అది మాటగా మిగలదు
అది రాత్రివేళ నిద్ర ఒడ్డున కూర్చుని
ఒంటరిగా ఏడ్చే చంద్ర కాంతిగా మారుతుంది
కన్నీటిని ఎన్నో రోజులు కళ్లలోనే నిలిపేస్తే
అవి నీళ్ళుగా ఉండవు
గతంలో నా ఛాతీలో ఒక నది ఉండేది
దానికి దారి తెలీదు గమ్యం లేదు కాని ప్రవాహం ఉంది
అందుకే అది అలలుగా కాక
నిశ్శబ్దంగా లోపలే ప్రవహించేది
కొన్ని బాధలు గాయాల్లా ఉండవు
అవి పువ్వులు రాలిపోయిన తర్వాత
కొమ్మల్లో మిగిలిపోయే సువాసనలాంటివి
కొన్ని ప్రేమలు చేరుకోలేని దూరాల్లా ఉండవు
ఆకాశం వదిలేయలేని సాయంత్రపు రంగుల్లా ఉంటాయి
ఒక రాత్రి అకస్మాత్తుగా
లోపల బంధించిన పక్షులన్నీ రెక్కలు విప్పాయి
నిశ్శబ్దం తన తొడుగును చింపుకుంది
చీకటి తన గర్భంలో దాచుకున్న
చిన్న వెలుగును ప్రసవించింది
అప్పుడు తెలిసింది
విడిచిపెట్టడం అంటే పోగొట్టుకోవడం కాదని
వాన మేఘాన్ని వదిలి భూమిని చేరినట్టు
పరిమళం పువ్వును విడిచి గాలిగా మారినట్టు
నది తన ఒడ్డును మరచి
సముద్రంలో తనను తన పేరును సైతం కరిగించుకున్నట్టు
ఇప్పుడు నా లోపల ఏ తలుపులూ లేవు
కేవలం కిటికీలే ఉన్నాయి ఏ బోనులూ లేవు
ఆకాశాలే ఉన్నాయి
ఒకప్పుడు చీకటిలో కూర్చున్న
ఒంటరి మనిషి ఇప్పుడు ఉదయాన్నె ఎగిరే పక్షిలా
నా రక్తంలో ఎగురుతున్నాడు
నేను పెద్దగా ఏమీ కోల్పోలేదు
నా లోపల బంధించబడిన నన్ను నేను
విడుదల చేసుకున్నాను
విడుదల బాగుంది ఆనంద్ సార్