నాగరిక నవ సమాజమంతా
అమృతోత్సవాలలో
మునిగి తేలుతుంటే
ఏడు పదులు దాటిన
స్వాతంత్ర్య భారతావని సాక్షిగా
పట్టపగలే పట్టపగ్గాలు లేని
మదకత్తులకు పూనకాలొచ్చి
నడిరోడ్డుపై ఆడబిడ్డల
కుత్తుకలు తెగ్గోస్తున్నా
నోరు విప్పని నరలోకం
అర్థరాత్రి ఆడది ఒంటరిగా
నడిరోడ్డుపై నడిచే రోజే నిజమైన
స్వతంత్ర్యం అన్న పెద్దల మాటకు
నిలువెత్తు సాక్ష్యాలు నేడు
పట్ట పగలే మానవారణ్యంలో
మారణహోమాలు....
మంట కలిసి పోతున్న
మానవతా విలువలు
మనిషిని మనిషే వేటాడే
మానవ మృగాల మధ్యలో
మనగలిగి ...
రక్త మాంసాలు పంచి
మరో జీవికి ప్రాణం పోసే
మాతృమూర్తికి మనం ఇచ్చే
బహుమతి
కన్నీటి జలపాతాలేగా....

