నిద్ర లేస్తూనే
సొంతూళ్ళో ఇంటి ముందరి భోగిమంటల సెగ
ఎదకు వెచ్చగా తాకింది
గీజరు లో ఎంతకీ వేడెక్కని నీళ్లు
వీధిలో కాచుకున్న వేణ్ణీళ్ళ
తలంటిని గుర్తుకు తెచ్చాయి
కళ్ళాపిలోని పేడ వాసన
ముక్కుపుటాలకి తగిలి
వేసిన మెలికల ముగ్గులు
పూల తీగల్లా మనసుని అల్లుకుపోయాయి
దేశం కాని దేశంలో
పండుగనాటి జ్ఞాపకాలు
గుబులు గొబ్బెమ్మెల్లా తిష్టవేసుక్కూర్చుంటాయి
ఇక్కడి ఇంటి బోసి గుమ్మాలు
పెరట్లోని మామిడి కొమ్మల పసరు వాసన గుర్తుచేస్తాయి
ఈరోజు ప్రెజర్ కుక్కర్లో
వండిన అన్నం వద్దనిపిస్తోంది
ఊళ్ళో కట్టెల పొయ్యి మీద
కొత్త బియ్యంతో చేసిన పరమాన్నం
రుచి నాలుక మీద నాట్యం చేస్తోంది
అరిసెల కోసం
బియ్యం దంచుతున్నారేమో
చక్రాల పిండిలో వాము వేశారో లేదో
ప్రేమగా కలిపిన బెల్లం పాకంలోకి
గవ్వలెవరు వత్తి ఇస్తున్నారో అమ్మకి
వాకిట్లోకొచ్చిన హరిదాసుకి
తమ్ముడి కొత్త చొక్కా
ఎవరికీ చెప్పకుండా ఇచ్చేయడం గుర్తుంది
గంగిరెద్దులతను నన్ను అందగత్తెనన్నప్పుడు
బసవన్న డూ డూ మని తల ఊపడం
ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది
భోగిపళ్ల పేరంటానికి
చిన్నగా తరిగిన
చెరుకుముక్కల్లోని తీపిదనం
నాన్న చేతుల్లోదన్న వాస్తవం
ఇన్నేళ్లకి కానీ అర్థంకాలేదు
ఏరుకుందామంటే అరచేతుల్లోకి
నాణేలు లేనే లేవు
చెరువుగట్టున పట్టు పరికిణీల కబుర్లూ
ఉయ్యాలలూగే కాలి పట్టీల సవ్వడులూ
అరచేతిలో పండిన ఎర్రటి పాలపుంతలు
కోడిపందేలూ, కనుమ సందళ్ళూ
ఉత్తరాయణంలోకొస్తున్న ఓ సూరీడా !
చిన్ననాటి సొంతూరి ఆకాశంలోకి
నన్ను గాలిపటంలా ఎగరేస్తావా