డెమొ- క్రేజీ 

Spread the love

యాంత్రికంగా పెరట్లో మొక్కలకి నీళ్ళు పోస్తూ నడుస్తున్న, నా పాదాలకి మెత్తగా తగిలేసరికి ఒక్కసారి నా వొళ్ళు జలదరించింది. కిందకి తల వంచి చూస్తే, నా పాదాలకి తగులుతూ కింద పడి వున్న ఉడుత.  వంటి నిండా గాయాలతో మూలుగుతోంది. నా పాదం తగిలి ఒకసారి దాని తల పైకెత్తి చూసి, ఓపిక లేనట్లు మెడ వాల్చేసింది. 

దాన్ని చూస్తే ఇంకా ప్రాణంతోనే వున్నట్లు వుంది. దాన్ని అలా వదలి వేయడానికి మనసు ఒప్పలేదు. నా చేతి లోని నీళ్ళ కేన్ ని కింద పెట్టి, దానిని కాస్సేపు పరిశీలించి చూసాను.” బతికే వుంది, వెట్ దగ్గరకి తీసుకు వెళ్ళి, వైద్యం చేయిస్తే బతికే లానే వుంది. “, అనుకుంటూ దాన్ని చేతిల్లోకి తీసుకుని, లోపలకి తీసుకు వెళ్ళాను. దానిని వెడినీళ్ళ ల్లో ముంచిన స్పాంజితో శుభ్రం చేసి, వెట్ దగ్గరకి తీసుకు వెళ్ళాను. 

అతను దానిని పరీక్ష చేసి ఏమీ పర్వా లేదంటూ గాయాలకి మందు రాసి, ఫ్లూయిడ్స్ ఎక్కించాడు.  ఒక నాలుగు రోజులు వాడమంటూ, కొన్ని మందులు రాసి   ఇచ్చాడు. 

 డాక్టర్ రాసిన మందులు, ఆయింట్మెంట్ కొని, దాని ని ఇంటికి తీసుకు వచ్చి, ఒక చోట దానికి పక్క ఏర్పాటు చేసి పడుక్కో పెట్టాను. దానిని అలా చూస్తూంటే చాలా జాలి వేసింది. “చిన్న ప్రాణి పాపం. ఎందుకు ఆ విధం గా గాయా పడిందో? నేను దీనికి ఏదో ఋణపడి వుంటాను.  లేకపోతే దీనికి ఈ విధం గా నేను సేవ చేయాల్సి రావడమేమిటి?” . అని అనుకున్నాను. 

అది నెమ్మదిగా కోలుకుంది … కొన్ని రోజులు అయ్యెసరికి, అది, నాకు బాగా అలవాటు కూడా అయింది. నామాటలు అన్నీ అర్ధమయి నట్లే వుండేది. అది చెప్పేది నాకు అర్ధమయ్యేది. 

అది పూర్తిగా కోలుకున్నాక ఒక రోజు దానిని, ” ఏమయింది, ఎందుకు అంత, గాయ పడ్డావు?” అంటూ అడిగాను. 

దానికి అది, అసలు ఏం జరిగిందంటే …. అంటూ చెప్పడం మొదలు పెట్టింది. 

 ” నా పేరు సందేశం. నేను ఒక చిట్టడవి లో వుండే వాడిని. కానీ నాకు మనుష ప్రపంచం గురించి తెలుసు కోవాలని ఆశ. అందుకే అడవి నుంచి పట్టణానికి వచ్చి మనుషుల మధ్య నివాసం ఏర్పాటు చేసు కున్నాను.  అప్పుడప్పుడు, అడవికి వెళ్ళి బంధు మిత్రులని కలుసుకుంటూ వుండే వాడిని. 

ఆ అడవికి వున్న రాజు కి జబ్బు చేసి చని పోయాడు.  రాజు ని నియమించడానికని అన్ని జంతువులూ అడవిలో సమా వేశం అయ్యాయి. ఆ రాజు గారి కొడుకు ఇంకా చిన్న వాడు కావడంతో, వాడికి రాజ్యాధికారాలు కట్ట బెట్టడానికి అందరూ సందేహం వెళ్ళబుచ్చారు. ‘కానీ రాజ్యానికి రాజు లేకపోతే ఎలా? ‘, అంటూ కొంతమంది, ఆదుర్దా వెళ్ళబుచ్చారు.  

ఆ విధం గా, అడవికి రాజు లేకపోవడం విషయం గురించి అన్ని జంతువులు తలో రకం గా మాట్లాడుకోసాగాయి.

” అడవికి రాజు లేకపోతే ఎలా?”, అంది ఒక కుందేలు. 

” మరి రాజు గారి కొడుకు ఇంకా చిన్నవాడు. వాడికి పరిపాలన గురించి ఏమి తెలుస్తుంది?”, అంది ఒక పక్షి.

” రాజు వున్నా, లేకపోయినా మనకి, ఏం తేడా వుంటుంది కనుక? ఏమి వుంది గనుక, పరి పాలించడానికి?”, అంది ఒక ఉడుత.

” అలా కాదు. ఎంతయినా రాజు వుంటే, అందరి లో కాస్తో కూస్తో భయం వుంటుంది.” అంది ఒక కొంగ. 

” రాజ వంశం లో రాజు కాదగిన అర్హత వున్నవారు ఎవరూ లేరు. రాజు గారి కొడుకు ఏమో చాలా చిన్న వాడు. వాడికి పరిపాలన గురించి ఏమి తెలుస్తుంది “అంది ఒక ఎలుగు బంటి. 

అప్పుడప్పుడు అడవిలో బంధు మిత్రులని చూసి పోవడానికి వెళ్ళే నేను, అన్ని జంతువులూ, మాట్లడుకుంటూన్న ఆ సమావేశం లో, అప్పుడు అక్కడే వున్నాను. 

“మనమేమో ఇంకా రాజరిక వ్యవస్ఠ లో నే వున్నాం. కానీ మనుషులు ఎప్పుడో డెమోక్రేజీ కి మారి పోయారు. డెమోక్రేజీ అంటే, మనని మనమే పరిపాలించుకుంటాము అన్నమాట. ” అంటూ నేను బాగా తెలిసున్నట్లు చెప్పాను. 

అన్ని జంతువులు నా కేసి ఆశక్తి గా చూస్తూ వినడం మొదలు పెట్టాయి.  ‘మను షుల మధ్య వుంటాను కాబట్టీ, నాకు చాలా తెలుసు’, అని అడవిలో జంతువులు అన్నీ అనుకుంటూ వుంటాయి. నేను కూడా, ” నాకు చాలా తెలుసు. ” అని అనుకుంటూ వుంటాను.  నేను అడవికి వెళ్ళినప్పుడల్లా నాకు చాలా తెలుసు అన్న విషయాన్ని, అందరికీ తెలిసేలా, ఏదో ఒకటి చెప్తూనే వుంటాను.   అందుకే, నేను మాట్లాడుతుంటే అందరూ శ్రద్ధగా విన డానికి ఆశక్తి కూడా చూపిస్తారు. 

నేను అందరి కేసి ఒకసారి చూసి, గొంతు సవరించుకొని చెప్పడం మొదలు పెట్టాను.

” డెమోక్రేజీ అంటే, ప్రజలు, వాళ్ళల్లో కొంత మందిని పరిపాలన కోసం ఎన్నుకుంటారు. మనము కూడా ఆపద్ధతి పాటిద్దాం. ఉదాహరణకి, మనలో ముగ్గురినో నలుగురినో మనమే ఎంపిక చేసుకుని పరిపాలన వారికి అప్ప చెప్ప వచ్చు.  ఆ విధం గా మనని మనమే పరిపాలించుకుంటామన్న మాట.”

” అడవిలో అందరమూ సింహానికి అవుతే భయ పడతాము కానీ, ఇంక ఎవరన్నా భయ పడము.  మాట కూడా వినము. “, అంది ఒక కుందేలు.

” అయినా మనకి ఎవరయినా చేసేది, ఏముంటుంది కనక? అటువంటప్పుడు పరిపాలన అవసరం మాత్రం ఏముంటుంది?  ఎవరి ఆహారాన్ని, వాళ్ళే వేటాడి సంపాదించాలి. ఎవరిని వాళ్ళే రక్షించు కోవాలి …”, అంది ఒక ఊడుత. 

” కానీ, మనకి వేటగాళ్ళ నుంచి ప్రమాదం వుంది. వారి గురించిన సమా చారం ఎప్పటికప్పుడు అందించే యంత్రాంగం ఏర్పాటు చేసుకుంటే. అందరూ ఎవరి పనులు వాళ్ళు, ఎటువంటి ఆదుర్దా లేకుండా చేసుకోవచ్చు. “, అంది ఒక కొంగ. 

” ఎవరైనా వాళ్ళ పనులు మానేసి, అందరి కోసం ఎందుకు పని చేస్తారు?”, అంది ఒక ఎలుగు బంటి.

” అందుకే మనం అధికారం అప్పగించిన వాళ్ళకి, మనం అందరమూ సంపాదించిన ఆహారంలో కొంత భాగం ఇస్తే, వాళ్ళకి ఇంక ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా, వాళ్ళకి అప్పగించిన పని చేయ గలుగుతారు.  అధికారుల ఖర్చులకి, పాలన కి అయ్యే ఖర్చులకి, మనుషులు కూడా, అందరూ పన్నుల రూపం లో వారి వారి సంపాదనలో కొంత భాగం ఇస్తారు.   ” అన్నాను. 

అందరూ, నా ప్రతి పాదనకి ఆమోదం తెలుపుతూ తలలు ఊపారు. 

అలా నా సలహా ప్రకారం, అన్నీ జంతువులూ పరిపాలన యంత్రంగాన్ని ఎంపిక చేసుకో వడానికి ముందుకు వచ్చాయి. 

కానీ, ఏనుగులు, పులులు, సిం హాలు లాంటి పెద్ద జంతువులు మాత్రం, ” ఈ చిన్న జంతువులకి, పనీ పాటు లేదు.  కబుర్లు ఎక్కువ. ఇవన్నీ కాలక్షేపం పనులే కానీ, పనికి వచ్చేవి కావు.” అని అనుకుంటూ, ఆ చర్చలో కానీ, ఎంపిక ప్రకియ లో కానీ, పాలు పంచుకోక, అక్కడ నుంచి వెళ్ళిపోయాయి. 

అధికారిక పదవి కోసం, చిన్న జంతువులు…. లేడి, కుందేలు, ఉడుత లాంటివి నిల పడ డానికి సంకోచించాయి. “ఎంత అధికార హోదా అయినా మమ్మల్ని ఎవరూ లెక్క చేయరు ” అంటూ.

చర్చలు ఇలా జరుగుతూ వుండగా, కొన్ని నక్కలు ముందుకు వచ్చాయి, “మేము అందరి మంచి కోసమూ పని చేస్తాము “, అని. 

కానీ నక్కలని నమ్మడం కష్టమని అందరికీ తెలుసు.

” నక్కలు, సిం హలులా కాదు. అవి జిత్తుల మారులు. నమ్మించి మోసం చేయడం లో వాటికి వాళ్ళే సాటి.” అంటూ ఒక కుందేలు గుస గుస లాడింది 

” అవును. నక్కల ని నమ్మడానికి లేదు ” అంది ఇంకొక కుందేలు గుస గుస లాడుతూనే 

” అవును. సింహం అవుతే ఆకలికే వేటాడుతుంది. అది వంచనకి కూడా పాల్పడదు. నక్కలు అలా కాదు. ఆకలి లేకపోయినా వేటాడుతాయి. వంచిస్తాయి.”, అంది, ఒక లేడి నెమ్మదిగా నక్కలకి వినిపించకుండా.

ఈ విధంగా అందరూ వాళ్ళల్లో వాళ్ళే గుస గుస లు ఆడుకోవడం గమనించి, ఒక నక్క అంది, ” మీరు ఏమీ సంకోచించకండి. మీ మంచి కోసం మేము పని చేసే టప్పుడు, మేము స్వార్ధం గా ఎలా వుండ గలుగుతాము?  పైగా, 

మీరు అందరూ మీరు సంపాదించే ఆహారంలో కొంత మాకు ఇచ్చేడప్పుడు మాకు వేట చేయాల్సిన అవసరం మాత్రం ఏముంటుంది? మీరు ఇచ్చినది తింటూ, మీ కోసం పని చేస్తాం. మాలో ఒకరిని ఎంపిక చేసుకోండి. ”  

” ఆ నక్క మాటలు అందరికీ సమంజసం గా నే అనిపించాయి. ఆహారం అందరూ తెచ్చి ఇస్తూంటే దానికి వేటాడ వలిసిన అవసరం మాత్రం ఏముంది? ” అనుకున్నాయి. 

అందరూ తన వైపు కాస్త నమ్మకం గా చూసేసరికి, ఆ నక్క, ఇంకొంచెం ఉత్శాహం తెచ్చుకొని ” నేను ఈ మధ్యే కాశీ వెళ్ళి వచ్చాను.  వ్రత దీక్ష లో కూడా వున్నాను. కొంత కాలం కాషాయం ధరించి, విభూతి పూసుకుని శాఖాహారిగా వుంటానని ప్రతిన పూనాను. అంచేతే నా మూలం గా మీకు ఎటువంటి ప్రమాదమూ వుండదు. నన్ను ఎంపిక చేసుకోండి ” అంది.

అందరూ దాని మాటలకి ముచ్చట పడిపోయారు.  కాశీకి వెళ్ళి రావడం మాటలు కాదు.   వ్రత దీక్షలో కూడా వుంది. ఇంక అంతకన్నా మంచి వాళ్లు ఎక్కడ దొరుకుతారు అంటూ, దానికి అధికార పట్టం కట్టారు. అన్ని జంతువుల నీ హెచ్చరిస్తూ, ప్రమాదం నుంచి ఎప్పటి కప్పుడు వాళ్ళని రక్షించు కునే అవకాశం, వాళ్ళకి కలిగించే విధం గా, ఇంకో, రెండు పక్షి జాతుల పక్షులు, మూడిటికి, అడవిలో   జరిగే ప్రతీ విషయం గురించీ సమాచారం అందించడానికి, ఎంపిక చేసుకున్నారు.

నేను చెప్పినట్లే, ఎంపికలు పూర్తి అయ్యాయి.   అందరమూ సంతోష పడ్డాము, మనమూ “మనుషుల స్తాయికి ఎదిగి పోయాము.”, అనుకుంటూ. 

అందరూ నన్నూ, నా తెలివి తేటలకి, నా జ్ఞానానికి, మెచ్చుకున్నాయి.  ” నీ మూలాన కదా మేమూ మనుషులు లాగ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాము ” అంటూ.

ఇంతలొ ఒక కొంగ అంది.” ఎన్నికతో ప్రభుత్వం, ఏర్పాటు చేసుకున్నాము.  అందరమూ మనం ఎంపిక చేసుకున్న వాళ్ళు కోసం ఆహారం కూడా ఏర్పాటు చేస్తాం. కానీ అంతా చేసాక వాళ్ళు, వాళ్ళకి అప్ప చెప్పిన పనులు సరిగా చేయకపోతే?” 

” అవును, అవును.  వాళ్ళు సరిగా పని చేయకపోతే?”    కొంగ మాటలకి, ఇంకొన్ని జంతువులు, కూడా సందేహం వ్యక్త పరిచాయి. 

ఆ ప్రశ్నకి, అన్ని జంతువులూ నా వైపు ” ఏమిటి?” అన్నట్లు చూసాయి. 

నేను కాస్సేపు తల నిమురుకుంటూ కళ్ళు మూసుకుని ఆలోచించాను. 

” ఆ తర్వాత ఏముంది. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు.  ఎన్నిక చేసుకుని నియమించిన అధికారులు కూడా. ” 

” అదే! ఎన్నిక చేసి న అధికారులు వారి బాధ్యత ని నిర్వర్తించ క పోతే …”

” ఆ విధమయిన ప్రశ్న మనుషులు వేయడం, నేను చూడలేదు. ఎందుకంటే ఎన్నికలు అయ్యాక ఎవరి దారి వాళ్ళదే. అధికారులు పాలనకి సంబంధించ పనులు చెస్తూ ఉంటారు. ఇంక ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు.”, అన్నాను నేను. 

” అధికారులు వారికి అప్ప చెప్పిన బాధ్యత సరిగా నిర్వర్తిస్తారు అని, హామీ ఏమిటి మనకి? “ 

అంతలో, ఒక దుప్పి కలగ చేసుకుని అంది. ” ఇప్పుడే కదా మనమూ ఈ పద్ధతి మొదలు పెట్టాం. ” సమస్యలు వస్తే సందేశం ఎలానూ వుందిగా.  అది, మనకి దారి చూపిస్తుంది.  కదా! ఏం సందేశం? ” అంటూ నా కేసి చూసింది.

నేను అయో మయం గా అందరిని చూస్తూ ” ఆ!  ఆ!”, అంటూ తల ఊపుతూ. ” మీ ఈ సందేహం గురించి కూడా పట్టణం వెళ్ళాక తెలుసుకుంటాను. ” అన్నాను పెద్ద మనిషి తరహాలో. 

*****

తర్వాత, ఒక వారం రోజులు అడవిలో అంతా బాగానే జరిగింది. అడవిలో అన్ని జంతువులు, “మనుషులతో సమంగా వున్నాము.”, అంటూ మురిసిపోయాయి. 

ఒక వారం తర్వాత, అందరూ ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టా రు.  “కుందేళ్ళు, ఉడతలు మాయ మవుతున్నాయి.”, అంటూ.

దానితో అందరూ మళ్ళీ సమావేశమయ్యారు. 

” నక్కకి, నిఘాకోసం ఏర్పాటు చేసు కున్న పక్షులకి అహారం కూడా ఇస్తున్నాము. మరి, ‘కుందేళ్ళు, ఉడతలు, ఏవిధం గా మాయమవుతున్నాయి? ‘, అనే విషయం గురించి, అవి మనకి ఎదో ఒక సమాధానం చెప్పాలి కదా.”, అని అనుకున్నాయి.

నక్క ని అడిగితే ” నాకు మాత్రం ఏం తెలుసు. అయినా నేను శాఖా హారిగా మారాను అని చెప్పానుగా. నా మీద ఎందుకు మీకు అనుమానం?  అయినా నేను మీరు ఇచ్చిన పదవిలో వుంటూ మీకు అపకారం ఎలా తల పెడ్తాను? ” అంది.

ఇంక పక్షులు అవుతే ” సందేహాస్పదం గా ఏమీ కనపడ లేదు ” అంటూ నొక్కి వక్కాణించాయి. 

అందరికీ నక్క మీదే అనుమానం కలిగింది. అందరూ, అనుమానంతో ఒకరిని ఒకరు చూసుకుంటూ వుండగా, 

” మీకు ఆహారం ఇచ్చి, మాకు కాపలా గా పెట్టుకుంటే, మాకు తెలియదు అని ఎలా తప్పించుకుంటారు? మాకు సమాధానం చెప్పాల్సిందే. ” అన్నాయి కుందేళ్ళు, ఉడతలు. 

” అవును. మేము ఎంపిక చేసుకుని, మీకు మా మంచి చెడులు చూసే బాధ్యత అప్పచెప్పాం. ఈ పరిస్థితికి మీరు బాధ్యత వహించాలి. సమాధానం చెప్పాలి.  పైగా మీ పొషణ కూడా మేమే చేస్తున్నాం. మీకు, అప్పగించిన బాధ్యతని సరిగా నిర్వర్తించ నందుకు మిమ్మల్ని శిక్షించాలి. ” అంది ఒక కొంగ.

” మీరు, ఈ విధం గా మాట్లాడడం మాకు నచ్చలేదు.  మమ్మల్ని ఎంపిక చేసుకున్నపుడు చేయాల్సిన పని చెప్పారుగానీ, ఏదయినా జరిగితే, మాదే బాధ్యత అని మాకు చెప్పలేదు. శిక్షల గురించి కూడా ఏమి చెప్ప లేదు.” అంటూ, నక్క గదమాయించింది. 

అన్ని జంతువులకి, ఎంపిక చేసి నియమించుకున్న నక్క, పక్షులకి మధ్య, కాస్సేపు వాదోప వాదాలు జరిగేయి. 

” ఈ ఘర్షణ ఎందుకు?  సందేశానికి ఎవరయినా కబురు చేయండి.  ఈ పరిస్థితికి అతను ఏమి పరిష్కారం చెప్తాడో?  డెమొ క్రేజీ ప్రకారం   ఏమి చేయాలో తెలుసుకుందాం. మనం డెమొక్రేజీ నే ఆచరిద్దాం అనుకున్నాము కదా.    ఆ విధం గా నే పరిష్కరించుకుందాం.   అప్పుడు, ఎవరికీ ఏమి సమస్య వుండదు. ” అని ఒక కొంగ అందరినీ శాంతింప చేసింది 

” మనుషులకి కూడా ఇటువంటి సమస్య వచ్చే వుంటుంది, అందుకే సందేశం ఏదో ఒకటి చెప్పగలుతాడు.” అంది ఒక లేడి.

” అవును. సందేశం వెళ్ళే డప్పుడు ఈ విషయం గురించి అడిగి తెలుసు కుంటాను అని కూడా   అన్నాడు.” అంది ఒక అడవి పావురం. 

ఆ లేడి ప్రతిపాదనకి, పదవిలో వున్న నక్క పక్షుల తో సహా, అన్ని జంతువులూ ఒప్పుకున్నాయి. 

కబురు అందిన   రెండు రోజుల కి, నేను అడవికి వెళ్ళాను. 

జంతువులు అన్నీ నేను వెళ్ళగానే, మళ్ళీ సమా వేశం అయ్యాయి. పరిస్థితి ని, నాకు వివరిం చాయి. 

” ఇప్పుడు ఏర్పడిన పరిస్థితికి, మనం ఎన్నిక చేసి నియమించుకున్న అధికార్లు బాధ్యత వహించాలి. అప్పచెప్పిన పని సరిగా నిర్వర్తించని కారాణం గా వారిని శిక్షించాలికూడా. నువ్వేం చెప్తావు. సందేశం “. అంది ఒక కొంగ. 

 ” మనుష ప్రపంచంలో ఎన్ని కలు అయ్యాక, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, అని మాత్రమే తెలుసు. అయినా నేను దాని గురించి ఒకరిద్దరిని అడిగాను కూడా.  వాళ్ళూ ఏమీ చెప్ప లేక పోయారు. ” అన్నాను. 

” అదేమి పద్ధతి? … అప్పగంచిన పని బాధ్యతతో చేయాలి. చేయకపోయినా, చెయలేకపోయినా, అది వారి తప్పు గానే పరిగణింప బడాలి.  వారికి పదవి ఇచ్చి, ఎన్నో సౌకర్యాలు ఇచ్చి, అధికారాలు కట్టబెట్టి నపుడు, ఆ పదవి కి సంబంధించిన పనులని సరిగా చేయకపోతే, బాధ్యత ని నిర్వర్తించడం లో, విఫలం అయినట్లే కదా. అప్పుడు దానికి తగిన శిక్ష కూడా పడాలి కదా. “ఒక కుందేలు అంది. 

” అటువంటిది ఏమీ జరగదు మనుషుల ప్రపంచంలో “

” ఎవరూ ప్రశ్నించరా?” 

” ఊహు “

” అదేమిటి? …పని అప్పగించినపుడు, పని సరిగా చెస్తున్నారో లేదో చూడరా?”

” అందరూ ఎవరి పనులలో   వాళ్ళు బిజీ గా వుంటారు. వాళ్ళకి ప్రశ్నించే సమయం వుండదు. కొంత మంది చెప్పడం ఏమిటంటే, ప్రశ్నిస్తే, శిక్షిస్తారు. అందుకే ఎవరూ ప్రశ్నించరు. ” అని.

” అదేమిటి, వాళ్ళు ఎన్నిక చేసుకుని పదవిలో కూర్చోపెట్టిన అధికారులు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే, ప్రశ్నించక పోవడం ఏమిటి? ప్రశ్నిస్తే శిక్షించడమేమిటి?  ” ఒక ఉడత ఆవేశం గా అంది. 

” నాకు తెలిసినది, కొంత మందితో మాట్లాడి తెలుసుకున్నది మీకు చెప్తున్నాను. “, అన్నాను నేను కొంచెం కించ పడుతూ. 

” చెప్పొచ్చావులే. నీకేదో   పెద్ద తెలుసు అనుకోవడం మా పొరపాటు. ” అంది ఒక ఎలుగు బంటి.

” అయినా ఒకరికి బాధ్యత అప్ప చెప్పాక, వాళ్ళు సరిగా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారా అనేది చూడకపోవడం, ప్రశ్నించక పోవడం, అది కూడా తప్పే.   అదేం డెమో క్రేజీ ?! ” 

” ప్రశ్నించలేనపుడు రాజరికానికి, ఎన్నికల పాలనకి, అదే డెమోక్రేజీ కి ఏం తేడా వుంది కనుక? ఎన్నుకోవడం తప్ప.” 

” కొత్త కొత్త పేర్లు పెట్టి, ఏదో ఘన కార్యం చేసాం.”, అనుకుంటున్నారు మనుషులు.  అంతే! ” అంది ఒక కుందేలు. 

” మనుషులు ఏదో తెలివయిన వాళ్ళు అనుకున్నాం కానీ. కాదన్న మాట. “ఒక పక్షి అంది.

 ” మనుషులు మనకన్న తెలివైనవాళ్ళని చెప్పడం, వాళ్ళని అనుకరించాలనుకోవడం మన తప్పు.  ” అంది ఒక నెమలి. 

“అయినా ఎన్నుకుని పదవిలో వుంచిన అధికారి ని, ప్రశ్నించే అధికారం మనకి వుంది. ఆ విధం గానే, మన అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆ అధికారికి ఖచ్చితం గా వుంది. మనుషుల లో లేక పోతేనేం? మనం ఏన్నిక చేసుకున్న, నక్క ని పక్షులని శిక్షించాల్సిందే. ” అంది ఒక కుందేలు. 

” అవును, అవును.   మనం సంపాదించుకున్న ఆహారం కూడా వాళ్ళకి, అందరమూ తలోకొంతా ఇచ్చాము.  వాళ్ళని శిక్షించాల్సిందే. ” అంటూ, అన్ని జంతువులూ ఆవేశ పడుతూండడం చూసి, అధికారం లో వున్న, నక్క, పక్షులు నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నాయి.  

” మనకున్న తెలివికూడా, ఈ మనుషులకి లేదని అర్ధం అవుతోంది. ఇంక చాలు ఈ మనుషులని అనుకరించడం. ఇంక ఈ డెమో క్రేజీ రద్దు చెసుకుందాం.”  అంటూ సమావేశమయిన జంతువులన్నీ తీర్మానించాయి. 

” ముంది నిన్ను అనాలి. ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇచ్చినందుకు.  దాని వలన ఏ కాస్త లాభం లేదు సరి కదా నష్టం కూడా జరిగింది. కనిపించకుండా పోయిన కుదే ళ్ళు, ఉడుతలు, నక్కకి, పక్షులకి ఆహారం ఇచ్చాము కదా, మనకి ఏమీ పర్వా లేదు లే, అని అజాగ్రత్తగా వుండి వుంటాయి. వాటిని, ఆ నక్కో, పక్షులో    తినేసే వుంటాయి.  ” అంది నాతో, ఒక అడవి ఎలుక. 

” అవును. ముందు సందేశాన్ని   అనాలి.  మనుషులు ఏదో గొప్పవారని చెప్పి చెప్పి, మనని మభ్య పెట్టినందుకు. ” అంటూ, అందరూ ఆవేశం తో నా మీదకీ దాడి చేసారు. 

నేను, ఎలానో తప్పించుకుని ప్రాణాలతో అడవినుంచి బయట పడ్డాను.  వెళ్తూ వెళ్తూ, ఇక్కడ కూలపడిపోయాను గాయాల వల్ల. “అంటూ చెప్పడం ముగించింది, సందేశం. 

సందేశం చెప్పినది విని, సందేశాన్ని మనసులో, ప్రశంసించు కోకుండా వుండ లేక పోయాను. “మనుషుల మధ్య వుంటూ, కొత్త విషయాలు తెలుసుకుంటూ, వాటిలో, దానికి మంచి అనిపించినవి ఆచరించాలనుకోవడం, ఆ విధంగా ఎదగాలను కోవడం, గొప్ప విషయమే కదా. 

ప్రజలని ప్రజలే ఎన్నికల ద్వారా పాలించుకోవచ్చు అనే భావనని అది పట్టుకోగలిగింది. మంచిది అనికూడా అర్ధం చేసుకుంది. 

ఇంక దాని లోటుపాటులు తెలియడానికి, మనుష ప్రపంచంలో కూడా, ఏ వ్యవస్థ లోనూ డెమోక్రసీ విలువలు కనపడటం లేదు. ఆ విలువలు ఎన్నిక ల వరకే పరిమితమవుతున్నాయి. అంచేత, అంత వరకే అది అర్ధం చేసుకుంది. “

అనుకుంటూ, దాని కేసి ప్రశంస పూర్వకంగా చూస్తూ, 

” నీ తప్పు ఏమీ లేదు. నువ్వు సరిగానే చెప్పావు మీ వాళ్ళకి. ఇక్కడ అదే జరుగుతోంది.  డెమో క్రేజీ. ఎన్నికల వరకే పరిమితమవుతోంది డెమోక్రసీ. అని చెప్తూ, నేను కుతూహలం గా అడిగాను, 

” అవును, నీకు డెమో క్రేజీ అని చెప్పింది ఎవరు? డెమో క్రేజీ కాదు.  అది డెమోక్రసీ.”

” డెమో క్రేజీ.” అంది సందేశం మళ్ళీ. 

” పోనీలే అలానే పిలు. డెమోక్రసీ విలువలు లేనప్పుడు ఎలా పిలుస్తే ఏముంది. ” అంటూ నవ్వి మళ్ళీ అన్నాను, 

 మీ అడవి ప్రాణులు, ఎన్నికలకే పరిమితమయే డెమోక్రేజీ ని ఒప్పుకోక పోవడం సరి అయినదే.  మనుషుల ప్రపంచం లో, ఎన్నిక చేసుకుని అధికారం ఇచ్చిన వాళ్ళని …. ప్రశ్నించడం కానీ, బాధ్యతా రహితం గా వున్నా, బాధ్యత సరిగా నిర్వర్తించకపోయినా శిక్షించడం కానీ, లేదు. అది చెప్పినా, మీ అడవిలో అందరూ, ఎన్నిక చేసుకున్న వాళ్ళని ప్రశ్నించాలనుకోవడం, శిక్షించాలనుకోవడం …. మంచి పరిణామం.  మాకన్నా మీ వాళ్ళే    చాలా తెలివి అయిన వాళ్ళు అని, నాకు అనిపిస్తోంది. 

ఈ కధ అందరికీ తెలిస్తే, జంతువులు, మనుషులని అనుకరించడం కాదు. మనుషులే, జంతువులని అనుకరించాలి, అని అందరూ అనుకుంటారు. “అన్నాను. 

” వ్యవస్థలు అన్నీ డెమొక్రసీ విలువలతోనే స్థాపించబడి నప్పుడు, ఆ విలువలనీ ప్రతిబింబిస్తూ నడప బడాలి.  కానీ ఎక్కడ?  చిన్నప్పటినుండే, అధికారానికి ఒదిగి ఉండడమే నేర్పుతారు.  అదే నేర్చుకుంటాము. అధికారాన్ని ప్రశ్నించడం నేర్పరు.  ప్రోత్శహించరు.  అందుకే అధికారులు కూడా, వాళ్ళు ప్రజలకి జవాబుదారులు అనే విషయం చాలా తేలికగా మర్చి పోతారు.

డెమోక్రసీ లో, ప్రజలే పాలకులు.  అటువంటప్పుడు ప్రశ్నించే హక్కు లేకుండా ఎలా వుంటుంది. ఆ హక్కు వినియోగించుకునే విధంగా అందరికీ చిన్నప్పటినుంచీ ప్రశ్నించడం నేర్పాలి.  ఆ విధంగా మాత్రమే అధికార దుర్వినియోగం జరగకుండా వుంటుంది. అంత వరకూ డెమోక్రసీ, డెమో క్రేజీ నే అవుతుంది, క్రేజీగా.  తెలుసో తెలియకో, మంచిపేరు పెట్టింది సందేశం. లోపభూయిష్టమయిన డెమొక్రసీని, డెమో క్రేజీ అనే అంటారు.”, అనుకున్నాను మనసులో నవ్వుకుంటూ.

మణి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *