రేకుల ఇంటి పైకప్పుపై వానపడుతోంది. ఇక్కడ పడకపోయినా ప్రపంచం ఏమీ మారదని తెలిసినట్టుగా శబ్దం చేస్తూ..
టప్..
టప్..
టప్.
పైకప్పు దాన్ని భరిస్తోంది. ఎంతకాలంగా సహిస్తుందో తెలీదు. వర్షం ఆగిపోయాక, తన మీద మిగిలిపోయే తడి గురించి దానికి ముందే తెలుసు.
ఆ చప్పుడు, ఆ తడి, అది తెచ్చే చిరాకు.. ఎన్ని రాత్రులు ఓర్చుకున్నానో గుర్తులేదు.
కిటికీ నుంచి చినుకులు జారుతూ బయటి ప్రపంచాన్ని అస్పష్టంగా మార్చేశాయి.
ఈ ఇల్లు.
ఈ బస్తీ.
ఈ రెండు గదులు బతుకు.. పుట్టుకతో వచ్చిన శిక్షలా అనిపిస్తుంటాయి కొన్నిసార్లు… ఈ శిక్ష ఎవ్వరు వేశారో, ఏ తప్పు చేసినందుకో తెలీదు.!
నాన్న నారాయణ. మంచంపై కరిగిపోతున్న ఒకప్పటి మనిషి. ఆయన ఊపిరి తీసుకోవడానికి పడే నరకయాతన నా ఉనికిని వెక్కిరిస్తున్నట్టే ఉండేది.
నాన్నకు కేన్సర్ అని డాక్టర్ చెప్పిన రోజు నుంచి ఇంట్లో నవ్వులు ఆగిపోయాయి. అమ్మ లక్ష్మి కూడా నెమ్మదిగా ఏడ్వడం నేర్చుకుంది. ఆయన్ను విసిగించకూడదన్నట్టుగా!
నేను ఏడ్వడం మానేశాను.
వీధిలోకి వెళ్తే ఏమీ ఎరగని కుర్రాడిలా నా ముఖానికి నేనే వేసుకున్న ముసుగు, ఇంట్లోకి రాగానే నాన్న బాధను పంచుకునే పెద్దరికం… ఈ రెండింటి మధ్య నలిగిపోతూ, నా వయసు ఎక్కడో తన బాల్యాన్ని వదిలేసి బరువెక్కిపోయింది.
అన్నింటికంటే పెద్ద సమస్య డబ్బు.
మొదట్లో బంధువుల వచ్చేవాళ్ళు.
“ ఏంకావాలన్నా చెప్పు”
“ మేమున్నాం”
“అధైర్యపడకు”
“ ఏదైనా అవసరం ఉంటే అడుగు”
కొన్నాళ్ళకు ఆ మాటలు తగ్గిపోయాయి.
ఎదురుగా కనిపిస్తే ఫోన్ లో మాట్లాడుతున్నట్టు నటించేవాళ్ళు. కొందరు దారి మార్చుకునేవాళ్ళు.
ఊర్లో ఉన్న పెంకుటింటిని బేరం పెట్టాను. అవి ప్రైమరీ ట్రీట్మెంట్ కే సరిపోలేదు. ఇక ఇప్పుడు తలదాచుకుంటున్న ఇంటినీ అమ్మకానికి పెట్టాను.
రేకుల ఇల్లు..
రెండే గదులు..
పెద్ద విలువేంలేదు!
కానీ, ఆ గోడల మధ్య నాన్న నవ్వాడు. కిచెన్ లో అమ్మ అన్నం వండింది. అక్కడే మొదటిసారి సైకిల్ తొక్కడం నేర్చుకున్నా. వాన పడిన రాత్రుల్లో ఒకే గదిలో ముగ్గురం నేలపై చాప, దానిపై దుప్పట్లు పర్చి, కబుర్లు చెప్పుకుంటూ నిద్దరపోయాం.
ఆ జ్ఞాపకాలు ప్రస్తుతం నాకున్న చేతగానితనాన్ని మరింత వెక్కిరిస్తున్నట్లు అనిపించాయి. ఊపిరాడక కిటికీ పక్కకొచ్చి నిలబడ్డా. నా కళ్ళెదురుగా నా నిస్సహాయతకు అద్దం పడుతున్నట్లుగా…
సరిగ్గా ఎదురింట్లో జ్యోతి.
ఆమె గురించి బస్తీలో మాటలకు కొదవ లేదు.
“ముచ్చటైన కాపురాన్ని వదిలేసి పెళ్ళికాని వాడితో లేచొచ్చిన పతిత!”
“మొండిది”
నాకు మాత్రం బస్తీవాళ్ళ మాటలు ఎప్పుడూ నిజం అనిపించలేదు.
నాలుగేళ్ళ బాబు.
రెండేళ్ళ పాప.
వాళ్ళిద్దర్నీ పట్టుకుని నిలబడిన ఓ శూన్యం ఆమె.
మొదట మేస్త్రీ పనికి వెళ్ళేది. రోజుకు పదిమంది ఆకతాయిల చూపులు, మరెన్నో కామకూతలు ఆమెను బతకనివ్వలేదు. ఉదయం పిల్లల్ని వదిలేసి, సాయంత్రానికి ఒంటినిండా చెమటతో తిరిగొచ్చేది. ఇంటికొచ్చిన వెంటనే పిల్లలకు అన్నం పెట్టేది. అప్పటిదాకా ఆ పిల్లలు మలమూత్రాలు అంటిన బట్టలతో ఆ ఇంట్లో మట్టిని బూడిదను తింటూ ఆకలికి ఏడుస్తూ, అలసిపోయి స్ఫృహతప్పి పడిపోయేవారు. పాడు లోకం.. ఆ పిల్లలపై జాలి ఉన్నా, ఎంతకని చేరదీస్తారు! ఎవ్వరి బతుకు వాళ్ళదిగా!
నెత్తురు చెమటగా మార్చినా జ్యోతి ఆకలి మంటలు ఆరలేదు. సమాజం కసిగా పేర్చిన అవమానాల ముళ్ళకంచె దాటి గౌరవంగా బతకడం ఆమె వల్లకాలేదు. ఆ ఛీత్కార గాయాల నుంచి తప్పించుకోవడానికి దొరికిన ఏకైక కవచం మత్తు.
మందుకల్లుకు మరిగింది!
తన కన్నీళ్ళను, ఆ మత్తులోనే నెమ్మదిగా కరిగించడం నేర్చుకుంది!
మొదట రాత్రుళ్ళు.
ఆ తర్వాత సాయంత్రాలు.
తర్వాత్తర్వాత ఎప్పుడు తాగుతుందో, ఎప్పుడు మేల్కొంటుందో ఆమెకే తెలియని రోజులు.
ఆ గుమ్మం దగ్గరకి వెళ్తే చాలు.. బతికున్న నరకం వాసన ఎలా ఉంటుందో తెలిసొచ్చేది. పసిపిల్లల ఉచ్చలూ, మోరీ మురుగూ కలగలిసిన కంపునకు, పులిసిపోయిన మందుకల్లు వాసన తోడై, ఆ గాలినంతా కలుషితం చేసేది. మూలల్లో కుప్పగాపడి, చెమటకు మురిగిపోతున్న గుడ్డల దుర్గంధం.. ఏ ఒక్కరినీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చేది కాదు. అది ఇల్లు కాదు, బస్తీలో ఎవరూ శుభ్రం చేయని పబ్లిక్ పాయిఖానా. ఆ అసహ్యాన్ని దాటాల్సి వస్తే బస్తీవాళ్ళు ముక్కు మూసుకునే వాళ్ళు.
ఎందుకో తెలీదు.
కనిపించే దృశ్యాలు వేరైనా… నా ఇంట్లో ప్రాణాలు తోడేస్తున్న పీడకలే, జ్యోతి ఇంటి దుర్గంధంలోనూ పడుకుని ఊపిరి తీసుకుంటున్నట్లు అనిపించేది!
ఒకరోజు …
జ్యోతి పిల్లలకు అన్నం పెడుతూ కనిపించింది. పాప ఏడుస్తోంది. బాబు గిన్నె లాక్కున్నాడు. ఆమె ఒక్కసారిగా గిన్నెను నేల మీద పెట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది. రెండు కన్నీటి బొట్లు రాలాయి.
రెండు క్షణాలు..
మళ్ళీ గిన్నె తీసుకుంది.
ఏమీ జరగనట్టే పిల్లలకు అన్నం పెట్టింది.
నేను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను.
జ్యోతి ఆ దారిలోకి దిగింది. ఆమె దాన్ని ఎంచుకుందా? లేక ఆ దారి ఆమెను ఎంచుకుందా?
తెలీదు!
బస్తీకి ఆ తేడా ఎప్పుడూ అవసరం లేదు. నా అంతరాత్మకు మాత్రం ఉంది.
ఓ సాయంత్రం నడివీధిలో ఎదురైంది జ్యోతి.
“ఏమైంది” అడిగింది.
“మీ నాన్నకేనా?” మళ్ళీ తనే అంది. నేను తల ఊపాను.
“నా తపన నా బిడ్డల కోసం” బొమ్మతో ఆడుకుంటున్న పిల్లలవైపు చూసింది.
“నీ తపన మీ నాన్న కోసం” మళ్ళీ నావైపు చూస్తూ అంది.
“బాధ మాత్రం ఒక్కటే”
ఆ మాట గాలిలో కలిసిపోలేదు… నా గుండెల్లో ఓ బరువైన రాయిలా పడి, ఆ నిశ్శబ్దంలో, అలలు అలలుగా చుట్టూ చేరి, ప్రతిధ్వనిస్తూనే ఉండిపోయింది.
ఆరోజు..
నాన్న ఊపిరి బరువెక్కింది.
ఆస్పత్రికి అర్జెంటుగా తీసుకెళ్ళాలి.
108కి ఫోన్ చేశాను.
వాహనం అందుబాటులో లేదన్నారు. ఎప్పుడొస్తుందో చెప్పలేమన్నారు
ఆటోవాళ్ళు నాన్నను తీసుకెళ్ళలేమని మోమాటం లేకుండా చెప్పారు.
కారుకావాలి.
ఐదొందలు అడిగాడు.
ఇవ్వందే కదల్దనీ కసిరాడు.
నా జేబులో డబ్బుల్ని తీశాను.
పది..
ఇరవై..
వంద.
మళ్ళీ లెక్కెట్టాను.
ఐదొందల్లేవ్.
ఇంటికి వచ్చాను. మంచంపై నాన్న నిస్సహాయంగా పడుకున్నాడు. ఆయన ముఖం పాలిపోయింది. పక్కనే కూర్చున్నాను.
నాన్న రొప్పుతూ కళ్ళు తెరిచి ఆశగా నన్ను చూశాడు. ఆ చూపులోని ప్రాణభిక్షకు బదులివ్వలేక తల దించుకున్నాను. ఐదొందలు లేక తండ్రిని కాపాడుకోలేని చేతగానితనం ఓ చీకటి మేఘంలా నన్ను కమ్మేసింది. పైకప్పుపై పడుతున్న వర్షంకన్నా వేగంగా నా కళ్ళల్లోంచి దుఃఖం కుండపోతగా బద్దలైంది.
అదే సమయంలో..
తలుపు దగ్గర శబ్దం వినిపించింది.
జ్యోతి!
చీకటి ఆమెను ఐదుసార్లు పొడిచి చంపేసినట్టు, గడపకు ఆనుకున్న శిథిలంలా నిలబడింది. ఒక చేయి నడుమును పట్టుకుని కదుల్తుంటే దేహమంతా ఎవరో పీక్కుతిన్న పచ్చిగాయంలా మూలుగుతున్నట్టు ఉంది. చిరిగిన జాకెట్టు, రేగిన జుట్టు, కళ్ళలో శాశ్వతంగా ఆరిపోయిన దైవత్వం..
మరో చేతిలో నలిగిపోయిన ఐదొందల నోటు…
“తీసుకో”
వణికిపోతూ ఆమెను చూశాను. ఆ నోటు నాకు కాగితంలా కనిపించలేదు. ఆమె ఒలుచుకొచ్చిన పచ్చి నెత్తురులా అనిపించింది.
“ఆస్పత్రికి తీసుకెళ్ళు”
నా చేతులు కదల్లేదు.
“ఎందరు?”
“ఐదుగురు”
“వద్దు”
“తీసుకో” ఈసారి తనన్తాను దహించుకున్న ఆడదాని కసి.
తీసుకున్నా. ఆమె చేతివేళ్ళు నా వేళ్ళను తాకాయి.
మంచుగడ్డలా.. అప్పుడే ప్రాణం విడిచిన మృతదేహంలా.. భయానకంగా.. చల్లగా ఉన్నాయి. ఆ చల్లటి స్పర్శలో సమాజం కాటేసిన మనిషి అస్తిత్వం గుడ్డిగా రోదిస్తోంది.
నేను ఏమీ అడగలేదు.
ఆమె ఇంకేం చెప్పలేదు.
“తొందరగా పో”అంటూ వెనక్కి తిరిగి అపవిత్రంలోకి పవిత్రంగా లీనమయ్యింది.
ఆ క్షణంలో..
నాలోని మగతనం,
నాలోని అహంకారం,
నేను గీసుకున్న పవిత్రత,
అన్నీ.. ఆ చీకటి గడప ముందు సిగ్గుతో తలొంచుకున్నాయి. కేవలం ఓ చేతగాని మనిషిగా మిగిలిపోయాను.
నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్ళాను. చికిత్స జరిగింది. టైంకు తీసుకొచ్చారు లేదంటే పరిస్థితి చేజారిపోయేదన్నాడు డాక్టర్. ఆ రాత్రికి అక్కడే ఉండాలట. అమ్మను నాన్నతో పాటే ఉంచి ఇంటికి తిరిగొస్తుంటే వాన మొదలైంది… ఎలాగోలా ఇంటికి చేరాను.
రేకుల చివర ఇంకా చినుకులు పడుతున్నాయి.
టప్..
టప్..
టప్..
నిద్రరావడం లేదు.
జ్యోతి దగ్గరకు వెళ్ళాను. తలుపు తీసేసరికి చిరపరిచిత దుర్గంధం. మురికి మధ్య పొర్లి పొర్లి నిద్దరోయిన ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు.. మత్తులో జోగుతూ సొల్లుకారిన బక్కచిక్కిన దేహంతో జ్యోతి. అవయవాలు దాచలేని నిస్సహాయత ఆమె చీరది. రొమ్ములు దాచలేని పరిస్థితి జాకెట్టుది.
ఆమె కాళ్ళకు దండం పెట్టాను.
నా స్పర్శ తగలగానే ఆమె ఉలిక్కిపడి కాలు వెనక్కి లాక్కుంది. మత్తులో కళ్ళు సగం మూసుకుపోయి ఉన్నాయి.
“ఇప్పుడొద్దు… పిల్లలు లేస్తారు… ఒళ్ళు పగిలిపోతోందయ్యా… రేపు రా.. ఇంకో ఐదొందలు తెస్తే… నీ ఇష్టం…’ మత్తులోనే మూలుగుతూ తల పక్కకు వాల్చేసింది.
ఆ మాట నా ఆత్మ మీద ఉమ్మి వేసినట్లు అనిపించింది. తండ్రి ప్రాణాన్ని కాపాడుకునేందుకు… ఒక తల్లి తన దేహాన్ని రక్కించుకుని తెచ్చిన నెత్తుటి కాగితాన్ని వాడుకున్నానన్న స్పృహ నిలువునా దహించేసింది. ఆమె పడుతున్న నరకానికి తానూ ఓ కారణమయ్యానన్న నిజం.. తన చేతగానితనంపై తనకే అసహ్యం పుట్టి, గుండెను ఎవరో పచ్చి చేతులతో పిండేసినట్లు ప్రాణం విలవిలలాడింది.
వెనుదిరిగాను.
మరుసటి రోజు అందాల్సిన డబ్బు అందింది. అందులో ఓ ఐదొందల రూపాయల నోటు తీసి చేతిలో పట్టుకుని ఎదురింటికి వెళ్ళాను.
“జ్యోతి” లేదు.
నేలపై పాప బొమ్మ ఒంటరిగా నవ్వుతోంది.
మూలనపడి ఉన్న అల్యుమినియం గిన్నెలో శూన్యం నాట్యం చేస్తోంది.
మసిబారిన గోడకు వేలాడే రెండు చీరలు లేవు.
ఆ రేకుల రూములో రిక్తత స్పష్టంగా కనిపిస్తోంది.
పక్కింటి ఆవిడను అడిగాను. “జ్యోతి ఎక్కడ” అని!?
“ రాత్రే వెళ్ళిపోయింది”
“ఎక్కడికీ”
“ తెలీదు”
కొద్దిసేపు ఆ ఖాళీ రూమ్ లోనే నిలబడ్డాను.
చేతిలో ఐదొందల రూపాయల నోటును చూశాను.
తిరిగి జేబులో పెట్టుకున్నాను.
“ఎక్కడని వెతకాలీ జ్యోతిని!”
కొన్నాళ్ళకు నాన్న చనిపోయారు.
బంధువులొచ్చారు,
వెళ్ళారు.
జీవితం తన పని తాను చేసుకుపోయింది.
ఈరోజున… నా కూతురు “స్వేచ్ఛ” కాఫ్కా పుస్తకాల మధ్య దాచిన ఆ ఐదొందల రూపాయల నోటును తీసింది.
దాన్ని ఎన్నిసార్లు మడిచానో తెలియదు. అందుకే ఎన్నో ముడతలు పడ్డాయి. చూడగానే అగ్గిపెట్టె తీసుకుని కాల్చేద్దామనుకున్నాను. కానీ ఎలా?
ఆ నోటు ఎవరిది?
తనది కాదు.
జ్యోతిదీ కాదు.
నాన్నది అసలే కాదు.
అది ఓ రాత్రి ఓ మహిళ శరీరం భరించిన నొప్పి.
పరాయివాడి కన్నీళ్ళను చూసి చలించిన మానవత్వం…
ఎవ్వరు పవిత్రులు? ఎవ్వరు అపవిత్రులు?
జ్యోతి ఎక్కడుందో తెలీదు.
పిల్లలు ఎక్కడున్నారో తెలీదు
ఆమెకు ఏం చెప్పాలో నాకిప్పటికీ అర్థంకాదు.
ధన్యవాదాలా?
క్షమించమనా?
రుణం తీర్చుకుంటాననా?
ఫ్చ్! ఏమాటా సరిపోదే!
టప్..
టప్..
టప్..
ఈసారి రెండస్తుల విల్లా బాల్కనీలో చిన్న చిన్నగా వాన పడుతోంది.
జ్యోతి మాటలు మళ్ళీ పరిసరాల్లో ధ్వనించాయి.
“నా తపన నా బిడ్డల కోసం.. నీ తపన మీ నాన్న కోసం… ఇద్దరి బాధ ఒక్కటే”
కళ్ళు మూసుకున్నా.
ఐదొందల నోటు గుండె దగ్గరే ఉంది.
దాని ప్రతీ మడతలోనూ ఆమె ఆ రోజు పడిన నరకం ఇంకా మూలుగుతూనే ఉంది.
ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు లోకమంతా ఉంది.
తీసుకునేందుకే, జ్యోతి లేదు!
ఎవరో చెప్పారు “రైలు పట్టాల దగ్గర..”
ఆ కరెన్సీ కాగితాన్ని గుండెకు హత్తుకుని నేలపై కూలబడ్డాను. కన్నీళ్ళు దానిపై రాలుతున్నాయి.
నాకు తెలుసు…
జ్యోతిని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకులేదు!
