కధ పెట్టిన పంచాయితీ

Spread the love

కదులుతున్న ట్రైన్ లోంచి బయటకి చూస్తూ, “చాలా ఏళ్ళయింది ప్రయాణం చేసి,” అనుకున్నాను. ఇప్పుడు కూడా సుజాత, ‘కాదు కూడదు!’ అందని కానీ, లేకపోతే ప్రయాణం చేయాలంటే నాకు అస్సలు ఇష్టం వుండటం లేదు. ప్రయాణం అనుకుంటే చాలు ఏదో ఏంజైటీ. అందుకే ప్రయాణాలు చేయడం దాదాపు మానేసాను.

ట్రైన్ లో, అందరూ ఎవరి బెర్త్ లో వాళ్ళు నెమ్మదిగా సద్దుకున్నారు. నాది లోయర్ బెర్త్. నా బెర్త్, పై బెర్త్ వాళ్ళు రాకపోవడంతో నేను కాస్సేపు కూర్చుందాములే అనుకుంటూ కూర్చునే వున్నాను. టైం ఎనిమిది అయింది. అప్పుడు ఆగిన స్టేషన్ లో, ఒక అతను నా సీటులో నా పక్కనే కూర్చున్నాడు. “నాదీ, మిడిల్ బెర్త్ అండి” అంటూ. అతనూ నాలానే, రాగానే పడుక్కునే ప్రయత్నం ఏమి చేయలేదు. కూర్చుని, గట్టిగా ఊపిరి పీల్చుకుని, అతని భుజం మీద నుంచి వేలాడుతున్న సంచీని ఒకసారి దగ్గరకి తీసుకుని, అటుఇటూ ఒకసారి చూసి నెమ్మదిగా వెనక్కి జేరబడ్డాడు. అతని సంచి, అతని భుజం మీద నుంచి నా పక్కకి, సీటు మీద పడి వుంది. సంచీలోంచి, ఏదో కదులుతున్న శబ్దాలు.

నేను కుతూహలంగా అతనిని అడిగాను, “సంచీలో ఏదో కదులుతూ వుంది?! పెట్ లా వుంది?!”
“ఊ!..” అంటూ చెప్పాలా వద్దా అన్నట్లు నాకేసి ఒక సారి ఆసక్తిగా చూసి, “కధలు!…” అన్నాడు నెమ్మదిగా గుసగుసలాడుతూ..
నేను ఆశ్చర్యపోతూ అతని కేసి చూస్తూ “కధలా?… ఏదో కదులుతున్న శబ్దం అవుతోంది?..” అన్నాను.
అతను నా ఆశ్చర్యం చూసి నవ్వి ఊరుకున్నాడు.

నాకు అర్ధం కాలేదు. “కాగితాలు వాటంతట అవి ఎలా కదులుతాయి? తర్వాత, చిన్నగా ఏదో శబ్దం కూడా లోపలనుంచి వస్తోంది,” అనుకుంటూ, అతనిని కాస్సేపు పరిక్షగా చూసాను. చూస్తే చదువుకున్న వాడి లాగ వున్నాడు. మంచివాడు కాగా కనిపిస్తున్నాడు.
అతను నా మొహంలో ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఇష్టం లేనట్లు, మొహం వేరే వైపు తిప్పుకున్నాడు.

కాస్సేపు మౌనంగా వుండి నా కుతూహలం ఆగక, అతనిని మళ్ళీ ప్రశ్నించాను, “మీరేమి చేస్తూ ఉంటారు?”
అతను కాస్సేపు మౌనంగా వుండి అన్నాడు, “కధలని కంచికి పంపుతూ వుంటాను.”
మళ్ళీ అన్నాడు, “నేను లైబ్రరీయన్ ని. కాలం చెల్లిన కధలని కంచికి పంపుతూ వుంటాను. ఈ సంచీలో వున్నవి ఆ కధలే..”

అతని కేసే కళ్ళు ఆర్పకుండా చూస్తూ వింటూ వున్నాను.
“కానీ కొన్ని కధలు మాకు కాలం చెల్లలేదు, మేము కంచికి వెళ్ళమని మారాం చేస్తూ వుంటాయి,” అన్నాడు నవ్వుతూ సంచీ కేసి చూస్తూ.
ఇంతలో ఒక మూడు, నాలుగు కాగితాలు వున్న కాగితాల కట్ట, సంచీ నుంచి బయటకి తొంగి చూస్తూ నా వైపుకి తిరిగి అంది, “కావాలంటే మీరు నన్ను చదవండి..”

నేను ఆ కధ కేసి, అతనికేసి మార్చి మార్చి చూస్తూ, “అంటే నాకు అర్ధం కాలేదు, కాలం చెల్లడం అంటే..” అన్నాను.
“కొన్ని కధలు ఎప్పుడు చదివినా, బాగుండడమే కాదు, రిలేట్ చేసుకోవడం కూడా సాధ్యమవుతుంది. అప్పుడు ఆ కధలు కాలానికి అతీతంగా వుంటాయి. ఇంక కొన్ని బాగున్నా, వాటికి సంబంధించిన కాలంలోనో, పరిస్థితిల్లోనో తప్ప రిలేట్ చేసుకోలేరు. వాటికి కాలం చెల్లింది అని అనుకుంటాము. అప్పుడు, ఇంక కంచికి పంపుతాను,” అన్నాడు అతను.

“నాకు కాలం చెల్లలేదు, అని గొడవ చేస్తోంది కదా.. ఆ కధే చదువుతాను వినండి,” అంటూ అతను ఆ కాగితాల కట్ట బయటకి తీసి చదవడం మొదలు పెట్టాడు. కధ పేరు “బొద్దింకల రాజ్యం.”

పూర్వం, ఇంద్రప్రస్థ రాజ్యానికి ఒక రాజు వుండే వాడు. ఆ రాజు చాలా నిరంకుశంగా వుండేవాడు. కానీ, నేను చాలా మంచి రాజుని అని అనుకుంటూ వుండే వాడు. దానితో ఆ రాజు చుట్టూ భజన చేసే వాళ్ళు ఎక్కువగా చేరే వారు. అందువలన అతనికి తను చేస్తున్నది తప్పు ఏమో అనే ఆలోచన కూడా వచ్చేది కాదు. ఎవరు ఏమి చెప్పినా, అతను వినేవాడు కూడా కాదు.

రాజు గారిని పొగుడుతూ వున్నవాళ్ళు, రాజ్యంలో అధికారాలు చేజిక్కించుకుని, రాజు నుంచి ఎటువంటి ప్రమాదం లేదని గ్రహించి, వాళ్ళు కూడా నిరంకుశంగా ప్రవర్తించేవారు. దానితో రాజ్యమంతా అస్తవ్యస్తంగా మారింది.

అంతపురంలో కూడా అటువంటి పరిస్తితే నెలకొంది. చేసే పనులలో నైపుణ్యం లేకపోవడమే కాదు, నిజాయితీ కూడా లోపించడంతో, రాజ్యమూ, రాజ్యంతో పాటు అంతపురం, అంతా కళావిహీనంగా మారసాగింది. అందరూ బాధ్యతారహితంగా వుండడం వల్ల చేసే పనుల పట్ల నిర్లక్ష్యం పెరిగింది. దానితో, రాజ్యమంతా అంతపురంతో సహా, ఎక్కడ చూసినా శుభ్రం కూడా లోపించడంతో అంతా చెత్తా చెదారం చోటు చేసుకోసాగింది. దానితో ఎక్కడ చూసినా బొద్దింకలు.

బొద్దింకలు ఎక్కువ అవడంతో, అందరూ ఆ విషయం రాజు గారి దృష్టికి తీసుకు వెళ్ళారు. రాజు గారి అంతపురంలో కూడా అదే పరిస్థితి. చివరకి రాజు గారు పడుక్కునే మంచం మీద కూడా బొద్దింకలు తిరగడం రాజు గారు గమనించకపోలేదు..
బొద్దింకల సమస్య, రాజు గారికి చాలా చిరాకునూ, కోపాన్ని తెప్పించింది.

“బొద్దింకలని ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి,” అని ఆదేశాలు జారీ చేసాడు. అప్పటినుంచి బొద్దింకలు ఇంకా ఎక్కువ అయ్యాయి. గుంపులు గుంపులుగా తిరగడం మొదలు పెట్టాయి. ఒక రోజు రాజు గారు కొలువు తీరి వుండగా, ఒక పెద్ద బొద్దింక ఒకటి రాజు గారి ముందుకు వచ్చి నిల్చుంది, “నేను రాజు గారికి అర్జీ చేయాలి!” అంటూ.

దానిని కొట్టబోతున్న భటులని వారిస్తూ రాజు గారు బొద్దింక కేసి కుతూహలంగా చూస్తూ, “ఊ! ఏమిటి చెప్పు,” అన్నాడు.
“మీరు మహారాజు. మీరు అందరికీ పాలకులే కాదు, సంరక్షకులు కూడా. మరి మా మనుగడని కాలరాసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మా తప్పేమిటి?” అంది ఆ బొద్దింక.
“మీరు ఈ విధంగా విచ్చలవిడిగా తిరుగుతూంటే, మా మనుగడకి కష్టంగా వుంది. మా పరిసరాలలోనూ ఆహారంలోనూ మీరు తిరుగుతూ వుంటే, మేము ఏమి పని చేయగలుగుతాము? ఏ విధంగా తినగలుగుతాము? మా దైనందిన కార్యక్రమాలకి ఇబ్బంది కలగకుండా, ఏ విధంగా మసులుతాము?..”

“మహారాజా! మేము విచ్చలవిడిగా సంచరిస్తున్నామని మమ్మలని తప్పు పడుతున్నారు. కానీ, ఎందుకు తిరుగుతున్నామని ఒక్కసారి అయినా ప్రశ్నించుకోరేం? ఎక్కడ చూసినా, మురికి, చెత్త చెదారం. మీరు శుభ్రం చేసుకోవడం మానేసి మమ్మలని నిందిస్తే ఏమి ఉపయోగం? మేము ఎక్కడ శుభ్రంగా వుండదో అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాం. అది మా నైజం. అంతా శుభ్రంగా వుంటే మేమెందుకు వుంటాము? అయినా సృష్టిలో జీవాలన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం వుంటూనే వుంటుంది. అందుకే అన్నిటినీ కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ వుంది. ఏది అంతరించినా అది పర్యావరణ సమతుల్యతకి అంతరాయం కలిగిస్తుంది. ఆ విషయం మాకన్న, మహారాజు కాబట్టీ మీకే ఎక్కువ తెలిసి వుండాలి.”

ఆ బొద్దింక చెప్పేది రాజుగారికి ఎంతమాత్రమూ నచ్చలేదు. “బొద్దింక ఏమిటి నాకు చెప్పడం ఏమిటి?” అనుకుంటూ దాని కేసి కోపంగా చూసాడు. దీనిని తప్పకుండా శిక్షించాల్సిందే అనుకుంటూ వుండగా, కొలువులో వున్న ఒక మంత్రి లేచి, “మహారాజా! ఈ బొద్దింక చెప్పినది కూడా సరి అయినది గానే అనిపిస్తోంది. ఎవరూ పనులు నిజాయితీగా చేయటంలేదు. రాజ్యంలో ఎక్కడ చూసినా లంచగొండితనం, అవినీతి తాండవిస్తోంది. అందువలన పనులు సరిగా చేయకపోయినా ఎవరూ పట్టించుకోవటం లేదు. అశుభ్రంగా వున్నా, చెత్త చెదారం పేరుకు పోయినా బొద్దింకలు రావడం, నివాసం చేసుకోవడం సహజం. మనం అంతా శుభ్రంగా వుంచుకుంటే అవే పోతాయి,” అన్నాడు.

మహారాజుకి ఇంకా కోపం వచ్చింది.
“ఈ బొద్దింకని చిత్రవధ చేయండి. అలానే బొద్దింకలని ఎక్కడ కనపడినా చంపండి,” అని మరోసారి ఆదేశాలు ఇస్తూ, “నాకు ఎదురు చెప్పి, నా పరిపాలనలో తప్పులు ఎత్తి చూపించే సాహసం చేసిన ఈ మంత్రిని కూడా కారాగారంలో బంధించండి,” అన్నాడు.

బొద్దింకని పట్టుకోడానికి, బొద్దింకని సమీపించిన భటులకి దొరకకుండా, అది ఎగిరిపోయింది. మరి కొంతమంది భటులు మంత్రిని బంధించి చెరసాలలో వేసారు.
భటులంతా రాజు గారి ఆదేశాలని అమలు చేసే పనిలో పడ్డారు. కానీ బొద్దింకలని ఏ విధంగానూ నియంత్రించ లేకపోయారు.

అదే సమయంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని యువరాజు రాజ్యానికి వచ్చాడు. రాజ్యంలోకి రాగానే, రాజ్యంలో పరిస్థితికి ఆశ్చర్యపోతూ, “ఏమిటి సంగతి?” అని అక్కడ ఒకరిని అడిగాడు.
“రాజ్యంలో లంచగొండితనం, అవినీతి ఎక్కువ అవడంతో, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. మొక్కుబడికి పనులు చేయడం అలవాటు అయిపోయింది. దాని ఫలితంగా అంతా చెత్తా చెదారం పేరుకుపోయింది. ఎక్కడ చూసినా దుర్గంధం. దానితో బొద్దింకలు ఎక్కువ అయ్యాయి. మహారాజు ఎక్కడా బొద్దింకలు లేకుండా చేయమని ఆదేశాలు ఇచ్చారు. బొద్దింకలు రాజు గారికి అర్జీ చేసుకున్నాయి, ‘మా తప్పు లేదు. మీరంతా శుభ్రంగా వుంచుకుంటే మేమెందుకు వస్తాము. మీ తప్పు మీరు దిద్దుకోవడం మానేసి, మమ్మలని మట్టుబెట్టాలనుకోవడం సమంజసం కాదు,’ అని. వాటిని సమర్ధిస్తూ మాట్లాడిన మంత్రిని చెరసాలలో వేయించారు. బొద్దింకలని అంతం చేయమని మళ్ళి ఆదేశాలు జారీ చేయడంతో, బొద్దింకలకి కోపం వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేయడం మొదలు పెట్టాయి…” అంటూ జరిగినది పూసగుచ్చినట్లు చెప్పాడు అతను.

“మహారాజు చుట్టూ వారిని పొగిడే వాళ్ళే కానీ, మంచి చెడు చెప్పేవాళ్ళు కరువయ్యారు. రాజు గారిని పొగిడి పొగిడి, వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకొంటున్నారు. ప్రజల గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు..” పక్కనే వున్న ఇంకొక అతను అన్నాడు.

యువరాజుకి పరిస్థితి అర్ధం అయింది. రాజ్యానికి ఎంత మహారాజు అయినా, ప్రజల పట్ల కర్తవ్యం మర్చిపోకూడదు. అంతే కాదు రాజ్యంలో సమస్త జీవులు, వాటితో బాటు పర్యావరణం, అన్నిటినీ రక్షించాల్సిన బాధ్యత రాజుదే కదా. బాధ్యతారహితంగా రాజు వుంటే, ఎప్పటికయినా ప్రమాదమే. తండ్రి ఈ విధంగా ప్రవర్తించడం అతనికి కూడా అవమానంగా అనిపించింది.
వెంటనే వెళ్ళి తండ్రిని కలిసాడు. మహారాజు కొడుకుని చూసి, ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. కుశల ప్రశ్నల తర్వాత రాజ్యంలో నెలకొన్న పరిస్థితి గురించి మాట్లాడుతూ, “బొద్దింకలతో స్నేహపూర్వకమయిన చర్చలు ఎందుకు చేయకూడదు?” అని యువరాజు అడిగాడు.

మళ్ళీ అన్నాడు, “రాజుకి భయపడి, చాలామంది అసలు విషయం చెప్పడానికి సంకోచిస్తారు. భయానికి, వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోలేకపోతారు. ఎవరో ఒకరు ధైర్యం చేస్తారు. ఆ ఒక్కరిని మీరు మాట్లాడనివ్వకుండా, చెరసాల పాలు చేస్తే, మీకు రాజ్యంలో ఏమి జరుగుతున్నదీ ఎలా తెలుస్తుంది? ప్రజలు ఏమనుకుంటున్నదీ, ప్రజల సమస్యల గురించి మీకు ఎలా తెలుస్తుంది?.. ప్రజల శ్రేయస్సే రాజుకి ముఖ్యం అయినప్పుడు ప్రజల అభిప్రాయాలని గౌరవించాలి కదా. ప్రజలని భయపెట్టే రాజు, మంచి రాజు అనిపించుకోడు.”

ఏమి చెప్పాలో తెలియక, తటపటాయిస్తున్న తండ్రితో మళ్ళీ అన్నాడు, “రాజరికం భోగాలని ఇవ్వడమే కాదు, బాధ్యతలని కూడా అప్పగిస్తుంది. రాజు అది మర్చిపోకూడదు కదా, మహారాజా!”
కొడుకు మాటలకి మహారాజు కాస్త సిగ్గుపడి, “నువ్వు చెప్పినట్లే చేద్దాం. బొద్దింకలని చర్చకి పిలుద్దాం..” అన్నాడు, అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ.

చర్చలకి వచ్చిన బొద్దింకలు, “మహారాజు ప్రవర్తన వలన, మాకు వారి మీద నమ్మకం పోయింది,” అన్నాయి.
“నేను యువరాజుని. నేను హామీ ఇస్తున్నాను…” అన్నాడు యువరాజు.
“అవుతే సరే మా మొదటి షరతు, నిన్ను రాజుని చేయమను నీ తండ్రిని, రాజ్యంలో పేరుకుపోయిన చెత్తని శుభ్రం చేస్తే, మేము వుండమన్నా వుండము.”

కొడుకు ముందు ఒక చెడ్డ రాజుగా మిగిలిపోవడం రాజు గారికి ఇష్టం లేక, ఆ షరతులకి ఒప్పుకుంటూ, యువరాజుని కాబోయే మహారాజుగా ప్రకటిస్తూ, ఇంక పై పరిపలనా బాధ్యత యువరాజే చూసుకుంటాడు అని కూడా ప్రకటించాడు మహారాజు.

యువరాజు పరిపాలన బాధ్యత తీసుకున్న కొన్ని రోజులకే, పరిపాలనా యంత్రాంగంలో మార్పులు చేసాడు. నిజాయితీపరులకి బాధ్యతలు అప్పచెప్పాడు. అవినీతికి తావు లేకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసాడు. దానితో రాజ్యంలో మళ్ళీ స్వచ్ఛత ఏర్పడింది. చెత్త చెదారం లేకుండా, అంతా శుభ్రమయింది. రోజులు గడుస్తున్నకొలది బొద్దింకలు కనిపించకుండా పోయాయి.

యువరాజు మాత్రం వాటిని మర్చిపోలేదు. రాజ పతాకం పైన బొద్దింక చిత్రాన్ని చేర్చారు. రాజుకి బాధ్యతని గుర్తు చేసి రాజ్యాన్ని రక్షించాయంటూ, ఆ విధంగా రాజ్యానికి ఉపకారం చేసినందుకు, ఈ రాజ్యానికి బొద్దింకల రాజ్యం అని కూడా పిలుచుకునే విధంగా అవకాశం కల్పిస్తూ తగిన ఉత్తర్వులు జారీ చేసారు. ఆ విధంగా సృష్టిలో ఏదీ తక్కువ కాదు అన్నిటినీ గౌరవించాలి అనే సందేశం కూడా అందరికీ చేరింది.
పరిస్థితి కుదుటబడ్డాక యువరాజుకి, అన్ని రాజ లాంఛనాలతో పట్టాభిషిక్తుడిని చేసారు. రాజ్యమంతా అతని పరిపాలనలో సుభిక్షం నెలకొంది. ప్రజలు కూడా సుఖశాంతులతో సంతోషంగా వున్నారు.

“ఈ కధ ఎప్పటిదో, ఒక రాజు గారికి సంబంధించిన కధ. దీనికి కాలం చెల్లింది, కంచికి చేరుద్దామని తీసుకు వెళ్ళాను. కానీ దారిలో మేము, నిరసన చేస్తూ వున్న కొంతమంది జనాలని, వాళ్ళని పోలీసులు కొడుతూ లాక్కు వెళ్ళడం చూసాం. అప్పటినుంచీ ఈ కధ, ‘నాకు కాలం చెల్లలేదు, నేను కంచికి వెళ్ళను’ అని గొడవ. మీరూ చూస్తున్నారుగా,” అన్నాడు అతను.

నేను కుతూహలంగా అతని కేసే చూస్తున్నాను. అతను చదివిన కధని, మళ్ళీ సంచీలోకి తోసాడు. ఆ కధ ఉండుండి బయటకి తొంగి చూస్తోంది.. అతను మళ్ళీ దానిని లోపలకి తోస్తున్నాడు.. అది సంచీ లోపల అటూ ఇటూ తిరుగుతూ ఒకటే శబ్దం చేస్తోంది. అతను ఒక సారి సంచీలోకి తొంగిచూసి, “ఏమిటి నీ గొడవ?..” అంటూ దానిని అదిలిస్తున్నట్లు అన్నాడు.
“ఏమయింది?..” అన్నాను నేను కాస్త సంకోచిస్తూ.
“ఊ! ఊ!… అలానే!” అతను అంటూ వుండగానే, ఆ కాగితాల కట్ట కాస్తా బయటకి వచ్చి నా ముందు నిల్చుంది.

“ఇతను చెప్పిన కధని నేనే!.. మీరు విన్నారుగా కధని. కాలం చెల్లిందంటున్నాడు కానీ, మీరు చెప్పండి. ఇంతకి ముందే, మేము చూసాము. పోలీసులు నిరసన చేస్తున్న వాళ్ళని కొట్టడం, వాళ్ళని లాక్కుంటూ వేన్ లో ఎక్కించడం… రాజులు ఎవరూ ఇప్పుడు లేరు అంటున్నాడు కానీ, పేరు ఏదయినా, రాజు అనండి, అధికారులు అనండి, పాలకులు అనండి… ప్రశ్నించినా, నిరసన తెలిపినా సహించే పరిస్థితిలో ఎవరూ లేరు..”

ఏమి చెప్పాలో తెలియక మౌనంగా వుండి పోయాను.
“ఊ! చెప్పండి..” అంది నిలదీస్తూ.. మళ్ళీ అంది “పాలకుల పేర్లు ఏమయినా, ప్రజల కోసమే కదా వాళ్ళు పని చేయాల్సింది?”
“అవును,” అన్నాను, తల ఊపుతూ.

“మరి ప్రజలకి వాళ్ళ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా? వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చేప్పాలి కదా? నిరసన తెలుపుతూంటే, పిలిచి చర్చించాలికదా?.. మరి చేస్తున్నారా?.. లేదు కదా.. కధలోని మహారాజు లానే, ‘బొద్దింక వచ్చి, సమస్య మీ పరిపాలనా యంత్రాంగంలో వుంది’ అంటే, దాని మాటలు విని ఆలోచించుకోవాలి, తప్పు దిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ, చంపమని ఆదేశాలు ఇవ్వడం నిరంకుశుత్వం కాదా? అప్పటికీ ఇప్పటికీ ఏమి మారింది?… ఇప్పుడు కూడా పాలకులు నిరంకుశంగానే ప్రవర్తిస్తున్నారు… నా కధలో ఒక రాజు నిరంకుశ పరిపాలన గురించి చెప్పాను. నిరంకుశ పాలనలు వున్నంత వరకూ నాకు కాలం చెల్లదు. అదే చెప్తున్నాను.”

“నువ్వు చెప్పేది కూడా సబబుగానే వుంది,” అన్నాను, కాస్త సంకోచిస్తూ దాని కేసి, అతని కేసి చూస్తూ.
ఆ కధ అతని కేసి చూస్తూ, “నువ్వూ నిరంకుశ రాజు లానే ప్రవర్తిస్తున్నావు. నా అభిప్రాయం సరి ఐనది కాదు అనిపిస్తే, నాతో చర్చించాలి కానీ నన్ను అణచి వేయకూడదు కదా,” అంటూ, “అవునా కాదా?, చెప్పండి,” అంది నాకేసి తిరిగి.

“పెద్ద పెద్ద విషయాల గురించి, ప్రశ్నించే ధైర్యం ఎలానూ లేదు. ఇటువంటి చిన్న విషయాలలో కూడా నోరు విప్పకపోతే ఎలాగు?” అనుకుంటూ, “అవునండి! ఈ కధ చెప్పేది మీరు కాస్త ఆలోచించాలి,” అన్నాను.
అతను చిన్నగా నవ్వాడు. తల వంచి, “అలాగే,” అన్నట్లు తల ఊపుతూ, “కానీ, ఇది ఒక చిన్న పిల్లల కధ లాంటిది.”
“అయినా, దానిలో సందేశం ఇప్పటికీ అన్వయించుకునేటట్లే వుంది కదా. రాజులు అంటే పరిపాలకులే కదా. ఆ విధంగా, నిరంకుశ రాజులు ఇప్పుడూ వున్నారు. పొగిడే వాళ్ళని చేరదీస్తారు. విమర్శించే వాళ్ళని శిక్షిస్తారు. ఈ కధ అదే కదా. యువ రాజు వచ్చి, రాజు గారికి, రాజు గా ఆయన బాధ్యత గుర్తు చేస్తాడు. రాజు, ఎలా ఆలోచించాలో చెప్తాడు. అవి ఎప్పుడూ అన్వయించుకోదగినవే కదా,” అన్నాను.

నా మాటలకి అతను నన్ను కాస్త కుతూహలంగా చూసి, “ఊ! అవును,” అన్నాడు.
“అయితే, ఈ కధ సమస్య తీరినట్లే కదా,” అన్నాను.
“అవును. మీరు చెప్పినది విన్నాక నాకూ అనిపించింది. పాఠకులే కదా, కధకి కాలం చెల్లిందా లేదా అని చెప్పేది… ఆ విధంగా చూస్తే ఈ కధకి, కాలం చెల్లలేదనే చెప్పాలి,” అంటూ, కధ కేసి ఆసక్తిగా చూసాడు.

ఆ కధ, కిలకిలా నవ్వుతూ సంచీ లోకి దూరిపోయింది.
అతను నవ్వుతూ “థేంక్స్ అండి. ఈ కధ పంచాయితీ తీర్చారు మీరు. ఇది నన్ను కుదురుగా వుండనివ్వలేదు. ఇప్పుడు, ఇంక నేను హాయిగా నిద్ర పోవచ్చు,” అన్నాడు.

“ఎందుకో, ఎవరూ వ్యతిరేకతని ఏ రూపంలోనూ సహించలేరు. ‘ఎందుకు వ్యతిరేకిస్తున్నారు’ అని కాస్త కూడా ఆలోచించరు. కాస్సేపు మాట్లాడితే వచ్చే నష్టం ఏమిటి అని అనుకోరు. వ్యతిరేకతని, అధికార బలం చూపించి భయపెట్టి, ఏదో ఒక విధంగా అణచి వేయాలనే చూస్తారు. అన్ని వ్యవస్థలలోనూ అదే పద్ధతి. కుటుంబ వ్యవస్థతో సహా. కుటుంబంలో ఆడవాళ్ళని, పిల్లలని అణచి వేస్తారు. ఇంక బడులలో, కళాశాలల్లో టీచర్లు పిల్లలని, ఆఫీసుల్లో అధికారులు ఉద్యోగులని అణచి వేస్తారు. కొంచెం అధికారం అయినా సరే, ఆ అధికారం మంచి చేయడానికే అని మర్చిపోయి, ఆ అధికారంతో అవతల వాళ్ళని భయపెట్టి, అణచి వేయడానికే ఉపయోగిస్తారు. ఇంక ప్రభుత్వాలు, పాలకుల గురించి వేరే చెప్పవలసిన అవసరం ఏముంది కనుక?! ఏ వ్యవస్థ అయినా ప్రజల మేలు కోసమే అనేది అందరూ పూర్తిగా మరచి పోయారు. భయపెట్టి, ఎదురు చెప్పేవాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేసే సరికి, ఈ పద్ధతి చాలా సాధారణంగా భావించబడుతూ, కొనసాగుతూనే వుంది,” మనసులో అనుకుంటున్నాను, అనుకుని బయటకే అన్నాను. అన్నానే కానీ, ఏమిటి ఇలా మాట్లాడేసాను అనుకుంటూ, సంకోచంగా అతని కేసి చూసాను.

ఏమీ పట్టనట్లు, అతని ధోరణిలో అతను “బాగా చెప్పారు,” అన్నాడు నా కేసి, ప్రశంసాపూర్వకంగా చూస్తూ.
“ఊ!..” అంటూ తల ఊపాను ఆలోచిస్తూ. అలా నా అభిప్రాయం ఎటువంటి అరమరికలూ లేకుండా చెప్పడం వల్ల ఏదో తేలికగా ఫీల్ అయ్యాను. నాకు ఏదో స్వేచ్ఛ కూడా వచ్చినట్లయింది. “భయం నుంచా?.. ఎదుటివాళ్ళు ఆమోదించరనే భయం, దానివల్ల ఎటువంటి పరిణామాలు ఏర్పడుతాయో అని భయం,” అనుకుంటూ నవ్వుకున్నాను.
“నిజంగానే, ఈ కధకి కాలం చెల్లలేదు, నన్నూ ఆలోచించేలా చేసింది. నాకు, నా అభిప్రాయం చెప్పగలిగే స్వేచ్ఛ నిచ్చింది,” అనుకున్నాను.

నా ఆలోచనలలో నేను వుండగా, అతను మళ్ళీ అన్నాడు, “మీ లాగా అనలిటికల్ గా ఆలోచించే వాళ్ళు, మా లైబ్రరీ కి చాలా అవసరం. ఒకసారి మా లైబ్రరీకి రండి. మాకు, కంచికి చేర్చే కధలని వేరు చేయడానికి సహాయం చేద్దురు గాని,” అన్నాడు.
అతను, అతని జేబు లోంచి అతని అడ్రెస్, ఫోన్ నంబర్ కార్డ్ తీసి నాకు ఇచ్చాడు, “మీకు రావాలని అనిపించినపుడు, ఫోన్ చేయండి,” అంటూ.

***

మణి భూషణ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *