గత కొద్ది రోజులుగా ఓడిపోయిన సైన్యం అనేక భాగాలుగా విడిపోయి, పట్టణం గుండా ప్రయాణం చేస్తోంది. అవి క్రమ శిక్షణ కలిగిన దళాలు కావు.కేవలం చెల్లాచెదరైన ముఠాలు మాత్రమే. అందులోని మగవారు పొడవైన మురికి గడ్డాలతో, చిరిగిన యూనిఫామ్ లతో ఉన్నారు.ఆ మూకలకి ఎటువంటి జండా లేదు, ఒక నాయకుడు కూడా లేడు.వారంతా నిస్సత్తుగా ముందుకు సాగుతున్నారు; అలసిపోయి, శక్తి నంతా కోల్పోయి, నిర్ణయం తీసుకునే స్థితి లో లేరు. వారికి కనీసం ఆలోచించే సామర్థ్యం కూడా లేదు. బలవంతంగా శక్తినంతా కూడ తీసుకొని కేవలం అలవాటు వల్ల నడుస్తున్నట్టు ఉన్నారు. ఏ క్షణానైనా, ఆగిన వెంటనే నేల మీద పడేటట్టు ఉన్నారు. సాధారణ పౌరులు, శాంతి కోరుకునే వారు, ఏదో తమకు వచ్చిన ఆదాయం తో గుట్టుగా కాలం గడుపుతున్న వాళ్లు, ఆ తుపాకీల బరువు కింద నడుములు వంగిపోయి, నిస్సత్తుగా నడుస్తున్నారు. కొందరు చురుకైన కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. గానీ, త్వరగా భయపడిపోతున్నారు, పారిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారి మధ్యలో ఎర్రటి ప్యాంట్లు వేసుకున్న సైనికులు అక్కడక్కడా మినుకు మినుకు మంటూ కనిపిస్తున్నారు. ఈ మహా యుద్ధంలో తుడిచి పెట్టుకు పోయిన ఒక విభాగపు దయనీయ అవశేషాలు అవి; నిస్తేజంగా ఉన్నప్పుడు సాధారణ పదాతి దళ సైనికులతో కలిసి నడుస్తున్నారు. అప్పుడప్పుడు భారంగా నడిచే ఒక గుర్రం సైన్యం
నాయకుడు, డ్రాగన్ మెరిసే శిరస్రానంతో కనిపిస్తున్నాడు. మిగిలిన వారితో సరిసమానంగా నడిచేందుకు ఇబ్బంది పడుతున్నాడు. “అపజయానికి ప్రతీకారం తీర్చుకునే వారు”, ” సమాధి చేయబడిన పౌరులు”, ” మరణంలో సోదరులు” వంటి ఆర్భాటపు పేర్లు కలిగిన ఆ అపక్రమ దళాలు వరుసగా వెళ్తుంటే, వారు దొంగలు ముఠాల్లా కనిపిస్తున్నారు. వారి నాయకులు బట్టలు అమ్ముకునే వాళ్ళు ,ధాన్యం అమ్ముకునే వాళ్ళు ,లేదా సోప్ చాందిని అమ్ముకునే వాళ్ళు. పరిస్థితులు ప్రభావంతో యోధులుగా మారారు.కేవలం తమ మీసాల వలన లేదా డబ్బు వలన అధికారులుగా మారిన వీరు ఆయుధాలతో, ఉన్ని బంగారు జరీ దుస్తులతో మెరిసి పోతున్నారు. గంభీరంగా మాట్లాడుతూ, యుద్ధ తంత్రాల గురించి చర్చిస్తూ, మరణ శయ్య పై ఉన్న ఫ్రాన్స్ భవిష్యత్తు నిర్ణయించేది తామే అన్నట్టు గొప్పలకు పోతున్నారు. కానీ, నిజానికి వారు తమ సొంత సైనికులకే భయపడే వాళ్ళు. ఎందుకంటే ఆ సైనికులు అసమాన ధైర్య సాహసాలు కలవారే, అయినప్పటికీ తరచుగా దోపిడీలు చేసేవారు, ఎన్నో దురలవాట్లు ఉన్న వాళ్ళు.
ప్రష్యన్లు రుయెన్ పట్టణంలోకి ప్రవేశించ బోతున్నారని పుకార్లు వ్యాపించాయి. గత రెండు నెలలుగా నేషనల్ గార్డ్ సభ్యులు ఎంతో జాగ్రత్తగా అడవులంతా కాపలా కాస్తున్నారు. అప్పుడప్పుడు తమ కాపలాదారులనే కాల్చేచేస్తున్నారు. పొదలలో చిన్న కుందేలు కదిలినా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వారంతా ఇళ్ళకి తిరిగి వస్తున్నారు.వారి ఆయుధాలు, యూనిఫారాలు, చుట్టుపక్కల 8 మైళ్ల వరకు సైన్యాన్ని భయభ్రాంతులను చేయగల యుద్ధ సామగ్రి- ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అంతా అర్ధాంతరంగా అదృశ్యం అయిపోయింది.
చివరి ఫ్రెంచ్ సైనికుడు కూడా సెయింట్ -సేవర్, బౌర్గ్ – ఆచార్జ్ మీదుగా పాంట్ ఆడెమర్ వైపు నడుస్తూ, సీన్ నది దాటారు. వారి వెనక, తన సైన్యపు దీనస్థితిని చూసి, నిస్సహాయుడై, కేవలం విజయాలే గాని పరాజయాలు ఎన్నడూఎరుగని ఆ దేశ సేనాని , ఈనాడు ఘోర పరాజయం పొందిన తన దేశ పరిస్థితులకు దిగులు పడుతూ, ఇద్దరు సహాయకుల మధ్య నడుచుకుంటూ వెళ్ళాడు.
ఆ తర్వాత నగరంలో ఒక గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. అది వణుకు పుట్టిస్తున్నది. ఒక నిశ్శబ్ద భయం తో నగరం నిండింది. ఏళ్ల తరబడి వ్యాపారాలకే అంకితమై, పొట్టలు పెంచుకున్న చాలామంది పౌరులు, తమ వంటగదిలోని కత్తులను కూడా విజేతలు ఎక్కడ ఆయుధాలని అనుకుంటారో అని వణికిపోతూ, వారి రాక కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.
జీవితం స్తంభించిపోయినట్లు అనిపించింది. దుకాణాలు మూతపడ్డాయి. వీధులు నిర్మానుష్యం అయ్యాయి.అప్పుడప్పుడూ ఊళ్లో ఉన్నవాళ్లు బయటికి వచ్చినా, ఆ నిశ్శబ్దానికి భయపడి, గోడల నీడల చాటున వేగంగా పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్నారు. ఆ నిరీక్షణలోని వేదన ఎంతగా పెరిగిందంటే, శత్రువు త్వరగా వస్తే బాగుండునని ప్రజలు కోరుకోవడం మొదలుపెట్టారు.
ఫ్రెంచ్ సైన్యాలు వెళ్లిపోయిన మరుసటి రోజు మధ్యాహ్నం, ప్రష్యన్ అశ్విక దళం ఎక్కడి నుండో ఊడి పడింది. పట్టణం గుండా వేగంగా వెళ్లింది. మరి కొంతసేపటికి సెయింట్ కేథరిన్ కొండ నుండి మరొక నల్లటి సైనిక సమూహం కిందకు దిగింది. అదే సమయంలో డార్నటల్, బోయ్స్ జీయోహమ్ర రోడ్డుల నుండి మరో రెండు దళాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ మూడు దళాల ముందస్తు విభాగాలు స్క్వేర్ ఆఫ్ హోటల్ ది విలేజ్ దగ్గర ఒకేసారి చేరాయి. జర్మన్ సైనిక దళం ఉప్పెనలా నలువైపుల నుండి దూసుకు వస్తుంటే, వారి దృఢమైన కవాతుకు వీధులన్నీ ప్రతిధ్వనించాయి.
సైనికులు అర్ధం కాని భాషలో బొంగురు గొంతులతో పెట్టిన కేకలు నిర్జీవంగా స్మశాన నిశ్శబ్దం ఆవరించిన ఇళ్ళు ను కూడా తాకాయి. పిల్లలు తలుపుల చాటు నుండి తమను జయించిన వారిని భయంగా చూస్తున్నారు. “యుద్ధనీతి ” ప్రకారం వారి జీవితాలకు భవిష్యత్తులో ఇప్పుడు ఆ విజేతలే యజమానులు. మహా విపత్తుల కాలంలో ప్రజలు భయంతో నిర్వీర్యులు, నిశ్చేష్టులు అవుతారు. ఇప్పుడు అక్కడి ప్రజలలో అటువంటి భయమే నిండుగా ఉంది. తాము చిమ్మ చీకటిలో ఉన్నట్టు భావిస్తున్నారు. సమాజంలోని ఉన్న వ్యవస్థలన్నీ తలకిందులైనప్పుడు, రక్షణ కరువైనప్పుడు, చట్టం ద్వారా పొందిన లేదా ప్రకృతి ప్రసాదించిన హక్కులన్నీ అహేతుకమైన, క్రూరమైన బలవంతుల చేతిలో చిక్కినప్పుడు ఇలాగే ఉంటుంది; పెద్ద భూకంపం వచ్చి దేశాన్ని సమాధి చేస్తున్నప్పుడు,నదులకు వరదలొచ్చి గ్రామాలలోని రైతులను, వాళ్ళ పశువులతో సహా ముంచేస్తున్నప్పుడు, ఆ మృతదేహాలు, పశువుల కబేళాలు, నేలకొరిగిన ఇళ్ల పైకప్పులతో సహా తేలుతున్నప్పుడు; విజయ గర్వంతో ముందుకు పోతున్న సైన్యం ,తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న దేశస్థులని చంపి,ఖైదీలుగా పట్టుకొని, కత్తులు చూపి బెదిరించి, దోపిడీలు చేసి, ఫిరంగుల మోతతో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు-దిగ్భ్రాంతి కరిగించే ఇటువంటి సంఘటనలు,సృష్టిలో శాశ్విత న్యాయం అంటూ ఒకటి ఉంటుందనే విశ్వాసాన్ని పోగొడతాయి. దేవుడు మనల్ని రక్షిస్తాడనే నమ్మకాన్ని, మనిషిలో విజ్ఞత ఉంటుందనే విశ్వాసాన్ని పూర్తిగా తుడిచి పెడతాయి.
కొద్ది కొద్ది మంది గల సైనిక బృందాలు ఇళ్ల తలుపులు తట్టి లోపలికి ప్రవేశించాయి. ఓడిపోయిన వారు తమ విజేతలతో మర్యాదగా ఉండక తప్పదని గ్రహించారు.
కొంతకాలం గడిచాక మొదట్లో ఉన్న భయం తగ్గు ముఖం పట్టింది. ఒక రకమైన ప్రశాంతత నెలకొంది. చాలా ఇళ్లలో ప్రష్యన్ అధికారులు ఆయా కుటుంబంతో కలిసి భోజనం చేయడం మొదలుపెట్టారు. అధికారులు సాధారణంగా మర్యాదస్తులు అవ్వడం వలన, గృహస్థుల పట్ల సానుభూతిని ప్రదర్శించేవాళ్లు. తప్పనిసరి పరిస్థితిలో తాము యుద్ధంలో పాల్గొన్నట్లు చెప్పేవారు. దీనిని స్థానికులు కూడా కృతజ్ఞతతో స్వీకరించారు. పైగా భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా అధికారుల రక్షణ అవసరమవుతుందని వాళ్ళు భావించారు. అంతే కాక తమ సంక్షేమం ఆధారపడిన వ్యక్తులతో శత్రుత్వం పెంచుకోవడం లోకజ్ఞానం కాదని నమ్మారు; లౌక్యం తో వ్యవహరిస్తే, తమ ఇంట్లో ఉండే సైనికుల సంఖ్య తగ్గించుకోవచ్చని, వాళ్లతో పోట్లాటలకు దిగడం తెలివి తక్కువతనం అవుతుందని అనుకున్నారు. రుయెన్ పౌరులు లో ఇప్పుడు యుద్ధంలో ఓడిన తొలి రోజుల్లో ఉన్న,తమ నగరాన్ని కాపాడుకోవాలనే గట్టి కాంక్ష, అందుకు శత్రువులపై పెంచుకున్న కసి నెమ్మదిగా కరిగిపోయాయి. క్రమంగా ఇంటి బయట బహిరంగ ప్రదేశాలలో శత్రువుతో కలివిడిగా ఉండడం పనికిరాదు కానీ, ఇంట్లో అతిధులుగా వాళ్లని గౌరవించడం జాతి మర్యాద కాపాడడం అని సద్ది చెప్పుకోవడం మొదలుపెట్టారు. బయట ఉన్నప్పుడు పౌరులు, సైనికులు ఒకరినొకరు ఎరుగనట్టు ఉన్నా, ఇళ్ళల్లో స్వేచ్ఛగా ప్రతి సాయంత్రం కబుర్లు చెప్పుకునే వాళ్ళు. జర్మన్ సైనికులు, ఇళ్ళల్లో ఉన్న నెగళ్ల దగ్గర మరి కాస్త ఎక్కువ సమయం చలి కాచుకుంటూ గడపడం అలవాటు చేసుకున్నారు.
క్రమంగా నగరం తన సాధారణ స్థితికి చేరుకుంటున్నట్టు అనిపించింది. ఫ్రెంచ్ వారు వీధుల్లోకి రావడం తగ్గించారు, కానీ ప్రష్యన్ సైనికులు మాత్రం వీధులు నిండా ఉండేవాళ్ళు. బ్లూ హుసార్స్- అశ్విక దళ అధికారులు- తమ ఆయుధాలను వీధుల్లో ప్రదర్సిస్తూ గర్వంగా తిరుగుతుండేవారు, గత ఏడాది ఫ్రెంచి అధికారులు తాగి, సాధారణ పౌరులు పై చేసిన దౌర్జన్యం కన్నా, ఈఏటి జర్మన్ అధికారులు మరింత ఎక్కువ దాష్టీకం చేస్తున్నారు.
అయినప్పటికీ వాతావరణంలో ఏదో ఒక తెలియని వింత మార్పు ఉంది. భరించలేని పరాయి వాసనలు చొచ్చుకొస్తున్న భావన, దాడి చేస్తున్న భావన ఏర్పడింది! జర్మన్ ల నివాసాలు జనావాసాల ప్రదేశాలలోకి వ్యాపించి, వారి ఆహారపు రుచులను మార్చి, వారిలో ప్రమాదకరమైన అనాగరిక తెగల మధ్య, సుదూర ప్రాంతాలలో ఉన్న భావన కల్పించింది.
జయించిన వారు ఊళ్ళల్లోకి దూరి ప్రజల నుండి డబ్బులు దండుకున్నారు. లెక్కలేనంత. దేశస్తులు అడిగినంత చెల్లించుకున్నారు. ధనవంతులు కాబట్టి. కానీ ఒక నార్మన్ వ్యాపారిని,ఎంత ధనవంతుడైనప్పటికీ, తన డబ్బునివ్వవలసి రావడం చాలా బాధిస్తుంది. తాను కష్టపడి ఆర్జించిన సొమ్ము ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోవడం భరించలేడు.
పై కి అంతా ప్రశాంతంగా ఉన్నట్టు ఉన్నా లోలోపల అశాంతిని తెలియచేస్తూ,క్రోయిసెట్, డీప్ డెల్,రిసార్ట్ నదీ తీరాలలో దాదాపు ఆరేడు మైళ్ళ నీటి ప్రవాహంలో అప్పుడప్పుడు చేపలు పట్టేవాళ్ళకు, పడవలు నడిపే వాళ్ళకి పూర్తి యూనిఫామ్ లో ఉబ్బి పోయిన జర్మన్ సైనికుల దేహాలు దొరికేవి. అవి కత్తి లేదా కర్రలతో లేదా ఒక్కొక్కసారి రాళ్లతో కొట్టినందు తలలు పగిలి పోయి ఉండేవి;కొన్నిసార్లు బ్రిడ్జిల పై నుండి కిందికి, నదీ ప్రవాహం లోకి తోసేసిన ఘటనలు కూడా ఉండం కద్ధు. ఈ అస్పష్టమైన ప్రతీకార చర్యలను క్రూరమైన వైనా న్యాయమైనవే అని నదీ గర్బం లో బురద మింగేసేది. చంపిని వారి పరాక్రమాలు ఎక్కడా నమోదు కాలేదు. నిశ్శబ్దంగా జరిగిన ఈ దాడులు యుద్ధంలో ఎదుర్కొన్న వీరకృత్యాల కన్నా భయంకరమైనవి. అయితే, ఈ వీరుల ధీరత్వపు వెలుగులను కీర్తించే అవకాశం లేదు. అయినప్పటికీ విదేశీయుల పట్ల ద్వేషం ఆదర్శంగా గల కొద్దిమంది ధైర్యవంతులు, ఆ ద్వేషాన్ని ఆయుధంగా మలుచుకొని ఇటువంటి ధైర్య సాహసాలకి పూనుకున్నారు.
విజేతలు పట్టణాలను ఎంతో క్రమశిక్షణతో పాలించారు. వారు జయించిన పట్టణాల్లో కవాతులు చేసినప్పుడు కూడా ఎటువంటి అకృత్యాలకు పాల్పడలేదు. అదే ఆ దేశస్తులకు ధైర్యాన్నిచ్చింది. స్థానిక వ్యాపారులలో వ్యాపారాలు చేయడానికి ఉత్సాహాన్ని నింపింది. ఇందులో కొంతమందికి, ప్రస్తుతం ఫ్రెంచ్ సైన్యం అధీనంలో ఉన్న హావ్రే లో వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వారు ఆ పోర్టుకి డిప్పే మార్గంలో పడవల ద్వారా చేరుకోవాలని అనుకున్నారు. తాము పరిచయం చేసుకున్న జర్మన్ అధికారుల పలుకుబడిని ఉపయోగించుకొని, సైన్యాధిపతి నుండి పట్టణం విడిచి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు. ఆ ప్రయాణం కోసం నాలుగు గుర్రాలు లాగే ఒక పెద్ద బగ్గీని, అద్దెకి తీసుకొన్నారు. అందులో ప్రయాణించడానికి పదిమంది ప్రయాణికులు, యజమాని వద్ద తమ పేర్లు నమోదు చేసుకున్నారు. జనాన్ని ఆకర్షించకుండా ఉండేందుకు, ఒకానొక మంగళవారం తెల్లవారుజామున బయలుదేరాలని నిర్ణయించుకున్నారు.
గత కొద్ది కాలంగా నేల బాగా గట్టిపడి ఉంది. సోమవారం మధ్యాహ్నాం మూడు గంటల నుండి ఉత్తర దిశ నుండి వచ్చిన ఆ మేఘం,మంచును కురిపించడం ప్రారంభించి,ఆ సాయంత్రం, రాత్రంతా కూడా మంచును కురిపిస్తూనే ఉంది.
ఉదయం 4:30 గంటలకి ప్రయాణికులంతా హోటల్ డి నార్వాండి ప్రాంగణంలో కలుసుకున్నారు. అక్కడ వారు తాము ప్రయాణించడానికి కుదుర్చుకున్న గుర్రపు బగ్గీ లో తమ తమ స్థానాల్లో కూర్చోవాల్సి ఉంది. అందరూ చలికి గజగజ వణికి పోతున్నారు. చీకట్లో వాళ్లు ఒకరి మొహాలు ఒకళ్ళు స్పష్టంగా చూసుకునే అవకాశం లేకపోయింది. ప్రతి ఒక్కరూ చలికి వణికిపోతూ పర్వతాలంత ఎత్తున, లావు పాటి దుప్పట్లను తమ చుట్టూ చుట్టుకున్నారు. అంతా ఊబగాయ పూజారుల గుంపులాగా కనిపించారు. అయితే ఇందులో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గుర్తుపట్టారు. మూడవ వ్యక్తి వాళ్ళను పలకరించాడు. ఇక ఆ ముగ్గురు మాట్లాడుకోవడం ప్రారంభించారు.”నేను నా భార్యను తీసుకు వస్తున్నాను” అన్నాడు మొదటి వ్యక్తి.”నేను కూడా” అన్నాడు రెండో వాడు. అప్పుడు మొదటి వ్యక్తి”మేమిక రుయెన్ కి తిరిగి వెళ్ళం.. ప్రష్యన్లు ‘హావ్రె’ ను చేరితే, మేము ఇంగ్లండ్ కి దాటేస్తాం” అన్నాడు. ఆ ముగ్గురికి ఒకే రకమైన మనస్తత్వం, వ్యక్తిత్వం ఉండడం వలన వాళ్ళు ఒకే రకమైన ప్రణాళికలు వేసుకున్నారు.
అప్పటికి ఇంకా గుర్రాలను పూన్చలేదు. గుర్రపు శాలల్లో పనిచేసే వాడు ఒక చిన్న లాంతరు పట్టుకుని వచ్చి, కాసేపు అటు ఇటు తిరుగుతూ, ఒక ద్వారం లో ప్రత్యక్షమై మరో ద్వారంలో అదృశ్యం అవుతున్నాడు. గుర్రపు కొట్టంలో ఉన్న గడ్డిమీద, పేడ మీద గుర్రాలు డెక్కలతో తొక్కుతున్న చప్పుడు అప్పుడప్పుడూ వినిపిస్తోంది. సన్నని గంటల గణగణ మోత గుర్రాలను పూన్చడం మొదలయిందని తెలియజేస్తున్నది. గుర్రాల కదలికలకు అనుగుణంగా ఆ మోతలు ఉంటున్నాయి. కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోతున్నాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా ఇనపడెక్కలతో నేలని తంతూ పెద్ద శబ్దం తో గుర్రాలు విరుచుకుపడ్డాయి.
ఉన్నట్టుండి గుర్రపుశాల తలుపులు మూసుకుపోయాయి. నిశ్శబ్దం ఆవరించింది. నగరవాసులు నిశ్శబ్దంగా, నిశ్చలంగా బిగుసుకుపోయారు.దట్టమైన మెరుస్తున్న తెల్లని మంచు తెర నిరంతరంగా నేలపై పడుతోంది; ఏ ఆకృతిని కనిపించ నీయడం లేదు. ప్రతి వస్తువును తన తెల్లటి దుప్పటితో కప్పేసింది. ఆ నిశ్శబ్ద చలికాలపు మంచు, నగరం అంతా కురుస్తూ, దేనినీ కనపడనీయకుండా ఏదీ వినపడకుండా చేస్తోంది- మంచు కురుస్తున్న ఆ శబ్దం, ఒక శబ్దం కంటే ఒక అనుభూతిలా ఉంది. ఆ మృదువైన కాంతి పరమాణువుల సున్నితమైన మేళవింపు, విశ్వమంతా నిండి లోకమంతటినీ కప్పేస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇదివరకు లాంతరు పట్టుకుని అటు ఇటు తిరిగిన వ్యక్తి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అతను ఒక తాడును, బయలుదేరడానికి మోరాయిస్తున్న, విచారంగా ఉన్నట్టున్న అనిపిస్తున్న ఒక గుర్రానికి కట్టి తీసుకొస్తున్నాడు. గుర్రపు శాలలో పనిచేసేవాడు దాన్ని ఒక బండి కాడి పక్కన నిలబెట్టి, కళ్ళెంతో తాళ్ళను బిగించాడు. గుర్రాన్ని సరిగ్గా నే పూన్చినట్టు ధ్రువపరుచుకున్నాడు. మళ్ళీ కాసేపు అటు ఇటు తిరిగాడు. ఒక చేతిలో లాంతరు ఉండడం వల్ల కేవలం రెండో చేతితో మాత్రమే ఏ పనైనా చేయగలుగుతున్నాడు. అతను రెండో గుర్రాన్ని తీసుకురావడానికి వెళ్తూ, అప్పటికే మంచుతో కప్పబడి పోయి కదలకుండా నిలబడి ఉన్న ప్రయాణికుల బృందాన్ని చూసి, “మీరు బండి లోపలికి వెళ్ళి కూర్చోకూడదా? కనీసం అక్కడ మంచు మీ మీద పడకుండా ఉంటుంది కదా!” అన్నాడు.
ఈ ఆలోచన అక్కడ ఉన్న వారికి అప్పటివరకు తట్టనేలేదు. వెంటనే వారు అతని సలహాలు పాటించారు. భార్యలను బండికి చివరన,లోపలి వైపు కూర్చోబెట్టారు. ఆ తర్వాత వాళ్లు కూడా బండిలో ఎక్కి కూర్చున్నారు. ఆఖరికి మంచుతో కప్పబడి అస్పష్టంగా కనిపిస్తున్న మిగిలిన ఆకారాలు కూడా మరో మాట లేకుండా మిగిలిన చోట్లలో ఎక్కి సర్దుకుని కూర్చున్నారు.
నేలంతా ఎండు గడ్డితో నిండిపోయింది. అందులో పాదాలు దిగబడుతున్నాయి. బండి చివర్లో కూర్చున్న మహిళలు, పాదాలను వెచ్చగా ఉంచుకోవడానికి తమతో తెచ్చుకున్న రాగి సాధనాలను వెలిగించడానికి తెచ్చిన రసాయనాలను వినియోగించడం మొదలుపెట్టారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు గురించి చెప్పడం మొదలుపెట్టారు. చెప్పిన విషయాలనే, నెమ్మదిగా సుదీర్ఘంగా మళ్లీ మళ్లీ చెప్పుకుంటున్నారు. వాళ్లకు తెలిసిన విషయాలు అవే గనక .
చివరకు రహదారులు అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నందువలన, సాధారణంగా కట్టే నాలుగు గుర్రాలకు బదులుగా ఆరు గుర్రాలను పూన్చ వలసి వచ్చింది. బయట నుంచి ఒక గొంతు,”అందరూ వచ్చారా?”అని అడిగింది. లోపల నుండి, “అవును” అని సమాధానం వినిపించింది. ఇక వారి ప్రయాణం మొదలైంది.
ఆ బండి చాలా నిదానంగా నత్తనడకన కదిలింది. చక్రాలు మంచులో కూరుకుపోతున్నాయి. బండి మొత్తం కిర్రుమంటూ మూలుగుతున్నట్టుగా శబ్దాలు చేస్తోంది. ఆవిర్లు వస్తున్నాయి. బండి నడిపేవాడు పొడవైన కొరడా ఆగకుండా గాలిలో చెళ్ళుచెళ్ళు మని మోతతో అటు ఇటు తిప్పుతున్నాడు. అది సన్నటి పాములా చుట్టుకుంటూ, మళ్లీ విచ్చుకుంటూ గుర్రాల వెనుక భాగాలకు తగులుతోంది. ఆ దెబ్బ పడగానే గుర్రాలు తమ కండరాలను బిగించి, మరింత శక్తితో బండిని ముందుకు లాగుతున్నాయి.
మెల్ల మెల్లగా తెల్లవారింది. కురుస్తున్న మంచు వానను “పత్తిలా రాలి పడుతున్న”దని అందులో ప్రయాణిస్తున్న ఒక రుయెన్ నగరవాసి వర్ణించాడు. ఇప్పుడు ఆ మంచు కురవడం ఆగింది. దట్టమైన నల్లని మేఘాల గుండా మసక వెలుతురు ప్రసరిస్తోంది. ఆ కాంతి వల్ల పరిసర ప్రాంతాలలోని మంచు మరింత తెల్లగా మెరుస్తున్నట్టు ఉంది. అక్కడక్కడా ఎత్తైన చెట్ల వరుసలు, ఇంటి పైకప్పులు, మంచు తెల్లదనం మెరుపులకు అడ్డు పడుతున్నాయి.
ఆ ఉషోదయపు మసక వెలుతురులో ప్రయాణీకులు ఒకరినొకరు ఆసక్తిగా చూసుకున్నారు.
అందరికన్నా వెనక , అత్యంత సౌకర్యవంతమైన సీట్లలో రూ గ్రాండ్ పాంట్ వీధికి చెందిన హోల్సేల్ లిక్కర్ వ్యాపారులు లూవాజో, ఆయన శ్రీమతి ఒకరికొకరు ఎదురు బోదురు గా కూర్చుని నిద్రపోతున్నారు. గతంలో లూవాజో ఒక మద్యం వ్యాపారి దగ్గర క్లర్క్ గా పని చేసాడు. ఆ తర్వాత, తన యజమాని వ్యాపారంలో నష్టపోయి నప్పుడు, ఆయన వాటాలనే కొనుగోలు చేసి సొంతంగా వ్యాపారం నడుపుకుని అపారమైన సంపదను గడించాడు. అతను పల్లెటూర్లోని చిన్న వ్యాపారులకు చాలా తక్కువ ధరకు ఏమాత్రం నాణ్యతలేని మద్యాన్ని అమ్మేవాడు. తన స్నేహితులలో, దగ్గర బంధువులలో, ఒక నేర్పరితనం గల మోసగాడుగా పేరు తెచ్చుకున్నాడు. అతను చమత్కారాలు తెలిసిన అసలైన నార్మన్ వ్యక్తి అని, మోసగాడని ఆ చుట్టుపక్కలంతా ఎంతగా స్థిరపడిందంటే, వారంతా ‘లూవాజో ‘ అనే పేరును దగా కోరుతునానికి ఒక పర్యాయపదంగా వాడడం మొదలుపెట్టారు.
అంతేకాదు, లూవాజో తమాషాలు చేయడంలో పేరు తెచ్చుకున్నాడు. అతడు చేసే చిలిపి చేష్టలు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. అతను చేసే పని ఏదైనా, అతనిని గురించి చెప్పుకునే ముందు, అతను ఒక “అసాధారణ వ్యక్తి” అనే జోడింపు ఉంటుంది. అతను పొట్టిగా, బాన పొట్టతో, ఎర్రటి ముఖం, బూడిద రంగు మీసకట్టు తో ఉంటాడు.
అతని భార్య పొడవుగా, బలంగా, దృఢంగా గంభీరమైన గొంతుతో, నిర్దిష్టమైన పద్ధతులలో ఉంటుంది. లూవాజో తన సరదా చేష్టలతో వ్యాపారాన్ని సందడిగా ఉంచితే, ఆమె ఆ వ్యాపార సంస్థలోని క్రమశిక్షణకు, లెక్కలకు ప్రతిరూపంగా ఉంటుంది.
వారి పక్కనే హుందాతనం ఉట్టి పడుతున్న ఒక ఉన్నత వర్గానికి చెందిన మిస్టర్ కారే లమడోన్ కూర్చున్నారు . ఊళ్లో ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి. నూలు వ్యాపారంలో తిరుగులేని చక్రవర్తి. మూడు స్పిన్నింగ్ మిల్లర్లకు యజమాని. లీజియన్ ఆఫ్ ఆనర్ అధికారి.జనరల్ కౌన్సిల్ సభ్యుడు. సామ్రాజ్యం అధికారంలో ఉన్నంత కాలం ఆయన మర్యాదపూర్వకమైన ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగారు. అది కేవలం తన భక్తికి తగిన విలువ దక్కించుకోవడం కోసమే. ఆయన సొంత మాటల్లో చెప్పాలంటే ,తాను వ్యతిరేకించే పక్షాన్ని ‘మర్యాదపూర్వక ఆయుధాలతో’ ఎదుర్కొనేవాడు.
కారే లమడోన్ భార్య అతని కంటే వయసులో చాలా చిన్నది. రుయెన్ నగరంలో నివసిస్తున్న ఉన్నత కుటుంబాలకు చెందిన అధికారులందరితో ఆమె చాలా సన్నిహితంగా వ్యవహరించేది. అందంగా నాజూగ్గా ఆకర్షణీయంగా ఉన్న ఆమె, తన భర్తకు ఎదురుగా ‘ఫర్’ దుస్తులలో ముడుచుకుపోయి కూర్చుంది. బండి లోపల ఉన్న అద్వాన్న పరిస్థితులను చూస్తూ దిగులు పడుతున్నది.
వారి పక్కనే బ్రేవిల్లే దంపతులకు కూర్చున్నారు. వారు నార్మన్డిలోనే అత్యంత పురాతనమైన గొప్ప వంశస్థులు. వయసు మళ్ళిన ఆ ప్రభువు- కౌంట్- తన సహజ సిద్ధమైన హెన్రీ IV ప్రదర్శించినట్టే-రాజసాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటాడు. అతని వంశం గురించి గొప్పలకు పోతుంటాడు. అతని వంశానికి చెందిన ఒక మహిళ హెన్రీIV కి అత్యంత ప్రియమైన ప్రేయసిగా ఉండేదని, ఆమె బిడ్డకు ఆ రాజే తండ్రి అని చెప్పుకుంటుంటాడు. రాజవంశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నందుకు గర్వపడుతుంటాడు. అందువల్లనే తమ వంశానికి ‘కౌంట్’ హోదా దక్కిందని, ఒక ప్రావిన్స్ కు గవర్నర్ గా నియమితుడయే అవకాశం దక్కిందని అంటారు.
జనరల్ కౌన్సిల్లో కారే లమడోన్ కు కౌంట్ సాహోద్యోగి.అతను ఓర్లియానిస్ట్ పార్టీకి ప్రతినిధిగా ఉండేవాడు. నాన్ టెస్ నగరానికి చెందిన ఒక చిన్నపడవల యజమాని కుమార్తెతో ఆయన వివాహం జరిగింది.కానీ అది ఎప్పుడు రహస్యంగానే మిగిలిపోయింది. అయినప్పటికీ, కాంటెస్ ప్రవర్తనలో గొప్పతనం, ఆమె అతిధి మర్యాదలలో లోటుపాట్లు లేకపోవడం, లూయి ఫిలిప్ కుమారుడితో ఆమె సన్నిహిత సంబంధం కలిగి ఉందని, ప్రేమికురాలని ప్రచారం పొందడం- మిగిలిన ప్రభువులంతా ఆమెను గౌరవంగా చూసేటట్టు, ఆమె కోసం పోటీ పడేటట్టు చేశాయి. ఆమె డ్రాయింగ్ రూమ్ ఆ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రాచీన సాంప్రదాయాలు, సభ్యత అమలవుతున్న ఏకైక ప్రదేశం అది. అక్కడికి ప్రవేశం పొందడం ఏమంత సులభమైన విషయం కాదు.
బ్రేవెల్లే దంపతుల ఆస్తి మొత్తం రియల్ ఎస్టేట్ రూపంలోనే ఉండేది. వారి వార్షిక ఆదాయం దాదాపు 5 లక్షల ఫ్రాంకులు అని చెప్పుకునే వాళ్ళు.
ఆ ఆరుగురు వ్యక్తులు బండికి ఒక చివరన కూర్చున్నారు. వాళ్లు ఆనాటి సంపన్న సమాజానికి ప్రతినిధులు. స్థిరమైన ఆదాయం కలిగిన వాళ్ళు, మతం, నైతిక సూత్రాల పట్ల గౌరవం ఉన్న మంచి వ్యక్తులని సమాజంలో పేరు ఉన్నవాళ్లు.
అదృష్టవశాత్తు మహిళలందరూ ఒకే వైపు కూర్చున్నారు. కౌంటెస్ పక్కన ఇద్దరు నన్స్ కూర్చున్నారు. వాళ్లు తమ పొడవైన జపమాలను వేళ్ళతో తిప్పుతూ దైవ ప్రార్థనలను చేసుకుంటున్నారు. వారిలో ఒకరు వృద్ధురాలు. ఆమె ముఖం మసూచి వల్ల గుంటలు పడింది. చూడడానికి ముఖంపై తుపాకితో కాల్చినట్లుగా గుంటలు గుంటలుగా ఉంటుంది. ఇక రెండో ఆమె అనారోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందంగా ఉన్నా వాడిపోయినట్టుంది.ముఖం క్షయ వ్యాధి సోకినట్టు, చాతి చెక్కినట్టు, అతుక్కు పోయి ఉంది. బహుశా క్షయ వ్యాధితో కుంచించుకు పోయింది. సర్వస్వాన్ని దహించే దైవభక్తి వల్ల ఆమె నీరసించి పోయింది. అటువంటి భక్తే అమర వీరులను, దైవ దర్శకులను సృష్టిస్తుంది అని అనడం అతిశయోక్తి కాదు. ఆ నన్ ల ఎదురుగుండా కూర్చున్న ఒక స్త్రీ పురుషుల పై అందరి దృష్టి పడింది.
అతడు అందరూ ఎరిగిన వ్యక్తి. అతని పేరు కార్నెడెట్. ఒక ప్రజాస్వామ్యవాది, గౌరవనీయులైన వ్యక్తులందరి సింహస్వప్నం. గత 20 ఏళ్లుగా అతనికి పెద్ద ఎర్రటి గడ్డం ఉంది. అన్ని రిపబ్లికన్ కేఫ్ లలో ని మద్యం గ్లాసులతో అతనికి విడదీయలేని అనుబంధం ఉంది. తరతరాలుగా అతని కుటుంబం మిఠాయి వ్యాపారిలో ఉంది. మిత్రులు, సన్నిహితుల ప్రోత్సాహంతో, తండ్రిని వదిలిపెట్టాడు, వంశపారంపర్యంగా భారీగా సంక్రమించిన ఆస్తులను తగలేశాడు. ఇప్పుడిక రిపబ్లిక్ లో తనకి ఏదైనా పదవి దక్కక పోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు.
సెప్టెంబర్ 4వ తేదీన, బహుశా ఎవరో ఆట పట్టించడానికి చేసిన పని వల్ల కావచ్చు, తాను ప్రిఫెక్ట్ గా నియమితుడైనట్టు నమ్మి, ఆ పదవి బాధ్యతలు చేపట్టడానికి వెళ్ళినప్పుడు,అక్కడి సిబ్బంది అతని అధికారాన్ని గుర్తించడానికి నిరాకరించారు. మంచివాడు, ఎవరికీ హాని చేయనివాడు,సహాయపడే గుణం ఉన్నవాడు. పట్టణ రక్షణ కోసం అతను ఎంతో ఉత్సాహంగా పనిచేశాడు. మైదానాల్లో గోతులతో తవ్వించాడు; అడవిలోని చిన్న చిన్న చెట్లను నరికించాడు. అన్నిటిపై ఉచ్చులు ఏర్పాటు చేశాడు. శత్రువు సమీపిస్తున్నాడని తెలియగానే తన ఏర్పాట్లు పూర్తి అయినట్టు సంతృప్తి చెంది, త్వరత్వరగా పట్టణానికి తిరిగి వచ్చాడు. కొత్త కందకాలు అవసరమయ్యే హవ్రీ ప్రాంతంలో తాను ఇప్పుడు ఇంకా మెరుగ్గా సేవ చేయగలనని అతని భావన.
ఆ మహిళ ఒక వేశ్య. తన వయసుకు మించిన భారీ కాయం వల్ల ఆమెకు బుల్ దె స్విఫ్ (కొవ్వు ముద్ద) అనే ముద్దు పేరు వచ్చింది. పొట్టిగా గుండ్రంగా పంది అంత లావుగా ఉంటుంది. ఆమె వేళ్ళు కీళ్ల వద్ద బాగా ఉబ్బి చిన్నచిన్న సోసైజ్ లు వరుసుగా పేర్చినట్టు ఉంటాయి. ఆమె చర్మం నిగనగాలాడుతూ బిగుతుగా ఉంటుంది. ఆమె భారీ వర్క్షోజాలు దుస్తుల నుండి పొంగిపొర్లుతున్నట్టుగా ఉంటాయి; అయినప్పటికీ ఆమె తన స్వచ్ఛతతో ,ఆహ్లాదతతో అందర్నీ ఆకర్షిస్తుంది. అందుకే చాలామంది ఆమె కోసం పరితపిస్తుంటారు. ఆమె ముఖం ఎర్రటి ఆపిల్ పండులా, పినీ మొగ్గ అప్పుడే విచ్చుకుంటున్నట్టు ఉంటుంది. చిక్కటి రెక్కల మాటున ఆమె రెండు పెద్ద నల్ల కళ్ళు ఎంతో అద్భుతంగా ఉంటాయి. నోరు చిన్నగా బాగా పండిన పండు లాగా ముద్దుగా ఉంటుంది. అందులో తెల్లటి అతి చిన్న పలువరస మరింత అందంగా ఉంటుంది.
ఆమెను గుర్తించిన వెంటనే ఆ బృందంలోని గౌరవనీయ కుటుంబాల నుంచి వచ్చిన వారంతా గుసగుసలు మొదలుపెట్టారు. ఊరందరి “వదిన” అని, ‘ఊరికే కళంకం” అంటూ కాస్త గట్టిగానే గుసగుసలాడారు. అవి ఎంత గట్టిగా ఉన్నాయంటే బుల్ దె స్విఫ్ చెవిలో కూడా పడ్డాయి. ఆమె కళ్ళు పైకి ఎత్తి, వారి వంక ఒకసారి చూసింది. ఆ కళ్ళల్లో ఎంత సవాలు,ధైర్యం ఉన్నాయంటే వాళ్ళందరూ ఒక్కసారి నోళ్లు మూసుకున్నారు. కళ్ళు దించుకున్నారు. ఒక్క లూవాజొ మాత్రమే ఆమెను ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాడు.
కానీ త్వరలోనే ఆ ముగ్గురు మహిళల మధ్య సంభాషణ మళ్లీ మొదలైంది. ఆ వేశ్య ఉనికి వారి ముగ్గురి మధ్య అకస్మాత్తుగా ఒక స్నేహ బంధాన్ని, దాదాపు ఒక సాన్నిహిత్యాన్ని, ఏర్పరిచింది. ఆ సిగ్గులేని “లంజ” ను ఎదుర్కోడానికి గౌరవప్రదమైన భార్యలుగా తాము కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే సమాజం అంగీకరించిన పెళ్లి,ప్రేమ ల ముందు వేశ్య వృత్తి దిగదుడుపే.
అదే సమయంలో కార్నెడెట్ ఉనికి కూడా మగవారి మధ్య ఒక తెలియని ఒక స్నేహ బంధాన్ని తట్టి లేపింది. వారి మధ్య ఒక సాన్నిహిత్యం ఏర్పడింది. వారు పేదల పట్ల అసహ్యాన్ని వ్యక్తం చేస్తూ డబ్బుకు సంబంధించిన విషయాలను మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కౌంట్ తనకు ప్రష్యన్ల వల్ల కలిగే నష్టాలను వివరించాడు. తన పశువులను ఎలా దొంగలించారో, పంటలను ఎలా నాశనం చేశారో ఆయన చెప్పుకొచ్చాడు. కోటానుకోట్లకు అధిపతి అయిన ప్రభువులకు ఒక ఏడాది వచ్చిన ఇటువంటి కష్టాలు పెద్ద ఇబ్బంది కలిగించవనే ధీమా ఆయన మాటల్లో కనిపించింది. పత్తి పరిశ్రమలో అపార అనుభవం ఉన్న మిస్టర్ కారే లమడోన్, భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా ఆరు లక్షల ఫ్రాంక్లను ఇంగ్లాండుకు పంపాడు. ఇక లూవాజో విషయానికి వస్తే, అతను తన వద్ద ఉన్న వైన్ నిల్వలన్నిటిని ఫ్రెంచ్ సైన్యానికి అమ్మ గలిగాడు. దానివల్ల ప్రభుత్వం అతనికి పెద్ద మొత్తంలో బాకీ పడింది. ఆ డబ్బులు త్వరలోనే ‘హావ్రీ ‘ వద్ద వసూలు చేసుకో వచ్చని అతను ఆశిస్తున్నాడు. ఆ ముగ్గురు ఒకరినొకరు ఎంతో స్నేహపూర్వకంగా చూసుకున్నారు. వారు సామాజిక హోదాలు వేరైనప్పటికీ, ‘డబ్బు’ అనే సోదర భావం వారిని కలిపింది. తమ జేబుల్లో చేతులు పెట్టినప్పుడల్లా బంగారం నాణేలు గలగల వినిపించ గలిగే శక్తి ఉన్న వారి మధ్య ఒక విశాలమైన రహస్య బంధం ఏర్పడింది.
ఆ గుర్రపు బగ్గి ఎంత నెమ్మదిగా నడుస్తోంది అంటే ఉదయం 10 గంటల సమయానికి కనీసం 12 మైళ్ళు కూడా ప్రయాణించలేదు .బృందంలోని పురుషులు మూడుసార్లు బండి దిగి కాలినడకన కొండలెక్కాల్సి వచ్చింది.ఇక ప్రయాణికులలో ఆందోళన మొదలైంది
ఎందుకంటే వారు ‘టోట్స్’ వద్ద మధ్యాహ్నం భోజనం చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే చీకటి పడేలోగా అక్కడికి చేరుకోవడం కష్టమే అనిపిస్తోంది. దారిలో ఏదైనా పూటకూళ్ల ఇల్లు కనిపిస్తుందేమో అని అందరూ ఆసక్తిగా వెతుక్కుంటున్నారు. సరిగ్గా అప్పుడే బండి ఆకస్మాత్తుగా ఒక మంచు కుప్పల్లో కురుకుపోయింది. దాన్ని బయటకు తీయడానికి రెండు గంటల సమయం పట్టింది.
వారిలో ఆకలి పెరిగే కొద్దీ ఉత్సాహం తరిగి పోయింది. ఏ పూట కూళ్ళమ్మ ఇళ్ళలో అయినా ఒక రొట్టె ముక్క దొరకక పోతుందా అని వెతుక్కున్నారు. కానీ ఎక్కడ ఏ రకమైన ఆహారం దొరకలేదు.ఆకలితో మలమలమాడుతున్న సైనికులు తమ మీద పడి ఆహార పదార్థాలను దోచుకుంటారని రైతులు భయపడ్డారు. ఆహార నిల్వలను ఎవరి కంటా పడకుండా దాచేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతాల్లో తమ కడుపులో పేగులు నకనకలాడుతున్నాయని లూవాజో ప్రకటించాడు. నిజానికి కొద్ది సేపటి నుంచి వారందరినీ ఆకలి దహిస్తున్నది. ఆ బాధ తో వారి మధ్య జరుగుతున్న సంభాషలన్నీ ఒక్కసారి ఆగిపోయాయి.
అందరికీ ఆవలింతలు వస్తున్నాయి. ఒకరి తర్వాత ఇంకొకరు ఆవలించడం మొదలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ స్వభావం, పెంపకం, సామాజిక స్థాయిని బట్టి నిశ్శబ్దంగానో లేదా శబ్దం చేస్తూనో ఆవలిస్తున్నారు. నోటి నుండి వచ్చే శ్వాస చలికి ఆవిర్లగా మారుతుండగా, తెరిచిన నోటికి చేతులు అడ్డంగా పెట్టుకుంటున్నారు.
చాలాసార్లు బూల్ దె స్విఫ్ తన లోదుస్తుల కింద ఏదో వెతుకుతున్నట్టుగా కిందికి వంగింది. ఆమె ఒక్క క్షణం సందేహాస్పదంగా ఆగి, తన పక్కవారి వైపు ఒకసారి చూసి, మళ్ళీ నిశ్శబ్దంగా నిటారుగా కూర్చుంది.
అందరి ముఖాలు పాలిపోయి, పీక్కుపోయి ఉన్నాయి. ఒక పంది మాంసం ముక్క ఇస్తే వెయ్యి ఫ్రాంకులు ఇస్తానని లూవాజో ప్రకటించాడు. అతని భార్య అసంకల్పితంగా దానిని వ్యతిరేకిస్తూ ఏదో అనబోయి, వెంటనే తనను తాను సంభాళించుకుంది. డబ్బులు వృధా చేయడం గురించి వింటేనే ఆమెకు మంటగా ఉంటుంది. అలాంటి విషయాల పై వేసే జోకులు కూడా ఆమెకు ఏమాత్రం నచ్చవు.
“నిజం చెప్పాలంటే నాకు ఆరోగ్యం ఏమీ బాగోలేదు” అన్నాడు కౌంట్.”ఆహార పదార్థాలు తెచ్చుకోవాలన్న ఆలోచన బుర్రకు ఎందుకు తట్టలేదా” అని ప్రతి వాళ్లు తమను తాము నిందించుకున్నారు.
అయితే కార్నెడెట్ వద్ద ఉన్న రమ్ సీసా ను తన పక్క వారికి అందించ బోయాడు. లూవాజో తప్ప మిగిలిన వారందరూ దాని నిర్ద్వందంగా తిరస్కరించారు.లూవాజో మాత్రం ఒక గుటక వేసి కృతజ్ఞతలు చెబుతూ సీసా తిరిగి ఇచ్చాడు. “ఇది చాలా బాగుంది. ఒంట్లో వేడి పుట్టిస్తుంది. ఆకలిని కూడా కనిపించనీయదు” అన్నాడు. ఆ మద్యం మత్తు ఇచ్చిన ఉత్సాహంలో, ‘ఆ పాత పాటలోని నావికుల్లాగా మనం కూడా ఈ ప్రయాణంలో అందరికంటే లావుగా ఉన్న వారిని తీనేద్దామని’ ప్రతిపాదించాడు. ఈ పరోక్ష వ్యాఖ్య ఆ బృందం లోని బూల్ ది స్వీప్ గురించే అని అందరికీ అర్థమైంది. గౌరవినీయులైన బృందసభ్యులు ఆశ్చర్యపోయారు.ఎవరూ బదులు ఇవ్వలేదు. కార్నెడెట్ మాత్రం చిరునవ్వు నవ్వాడు. అక్కడ ఉన్న ఇద్దరు సిస్టర్స్ తమ జపమాల తిప్పుతూ మంత్రాలు జపించడం ఒక్కసారి ఆపేశారు. తమ వదులైన దుస్తుల చేతుల మడతల్లో, చేతులు ముడుచుకొని, నేల చూపులు చూస్తూ నిశ్చలంగా కూర్చున్నారు. దేవుడు తమకు ఇచ్చిన ఈ కష్టాన్ని ఆయనకే అర్పిస్తున్నట్టుగా ఉంది వారి తీరు.
చివరకు మధ్యాహ్న మూడు గంటల సమయంలో, కనుచూపుమేరలో ఒక్క గ్రామం కూడా లేని విశాలమైన మైదానం మధ్యలో వాళ్ళ బండి ఆగినప్పుడు, బూల్ దె స్విఫ్ సీట్ కిందికి వంగి, కింది నుండి తెల్లటి వస్త్రంలో కప్పిన పెద్ద బుట్టను బయటకు తీసింది.
ఆ బుట్టలోంచి ఆమె ముద్దుగా ఉన్న ఒక చిన్న మట్టి పళ్ళెం, ఒక వెండి గ్లాసు బయటికి తీసింది. ఆ తర్వాత జెల్లిలో పూర్తిగా వూరబెట్టిన, జాయింట్ల దగ్గర కోసిన రెండు కోళ్లను బయటికి తీసింది. ఆ బుట్టలో ఇంకా చాలా రుచికరమైన పదార్థాలు ఉన్నట్టు కనిపించింది. పండ్లు,రకరకాల పిండి వంటలు,పళ్ళ రసాలు.మొత్తంగా చెప్పాలంటే దారి మధ్యలో ఏ పూటకూళ్ళ ఇంటి పై ఆధార పడాల్సిన అవసరం లేకుండా, మూడు రోజుల ప్రయాణానికి సరిపడా ఆహారం అందులో ఉంది. ఆ వంటకాలు మధ్యలోంచి నాలుగు సీసాల మూతలు బయటకు పొడుచుకు వచ్చాయి. ఆమె ఒక కోడి రెక్కలు తీసుకుని నార్మెండిలో “రిజైన్స” అని పిలిచే ఒక రొట్టెతో కలిపి నాజూకుగా తినడం ప్రారంభించింది.
అందరి చూపులు ఆమె వైపు తిరిగాయి. వంటకాల సువాసన గాలిలో వ్యాపించి అందరి ముక్కులు అదిరాయి. నోళ్లు ఊరాయి. ఆకలితో దవడలు నొప్పి పెట్టాయి.ఆ నీచజాతి స్త్రీ పట్ల ఆ మహిళల్లో ఉన్న అసహ్యం మరింత తీవ్రతరం అయ్యింది. వాళ్ళకి ఆమెను చంపేయాలి అనిపించింది. లేదా ఆమెను, ఆమె గ్లాసును, బుట్టను, ఆహార పదార్థాలను బండిలో నుంచి కింద మంచులోకి విసిరేయాలనిపించింది.
కానీ లూవాజో చూపు మాత్రం ఆ కోడి మాంసం వంటకం మీదే ఉండిపోయింది. అతను దాని వైపు ఆశగా చూశాడు. “భలే భలే మనందరి కంటే ఈమెకే ఎక్కువ ముందుచూపు ఉంది. కొంతమంది అన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు” అన్నాడు.
” మీకు కొంచెం కావాలా అయ్యా! రోజంతా ఉపవాసం ఉండటం చాలా కష్టం.” అతను తలను అంగీకారం గా ఊపాడు.
“నిజం చెప్తున్నాను. నేను కాదనలేను. నేను ఇంకొక నిమిషం కూడా ఓపిక పట్టలేను. యుద్ధ సమయంలో అన్ని ధర్మమే కదా మేడం!” అంటూ చుట్టుపక్కల ఉన్న వారిని చూస్తూ, ” ఇలాంటి కష్ట సమయాల్లో సహాయం చేసే వ్యక్తులను కలవడం ఎంతో సంతోషకరం.” తన ప్యాంటు పాడవకుండా అతడు మోకాళ్లపై ఒక వార్తాపత్రికి పరుచుకుని, తన వద్ద ఎప్పుడూ ఉండే ఒక చిన్న జేబు కత్తితో జెల్లి పట్టి ఉన్న ఒక కోడి కాలును తీసుకొని, ఆబగా తినడం మొదలుపెట్టాడు. అప్పుడు బూల్ దె స్విఫ్ వినయంగా సన్యాసులను కూడా తన భోజనం చేయడానికి ఆహ్వానించింది. వారిద్దరూ ఎటువంటి సంకోచం లేకుండా ఆహ్వానాన్ని మన్నించారు. తడబడుతూ కృతజ్ఞతలు చెప్పి కళ్ళు పైకెత్తకుండా వేగంగా తినడం ప్రారంభించారు.
కార్నెడెట్ కూడా తన పక్కనున్న ఆమె ఇచ్చిన ఆహ్వానాన్ని కాదనలేదు. సన్యాసులతో కలిసి నలుగురు మోకాళ్ళపై వార్తాపత్రికను పరుచుకొని, ఆహారం తింటుంటే, అదొక డైనింగ్ టేబుల్ లాగా మారిపోయింది. అందరూ ఆవురావురు మని తింటున్నారు. ఆకలి గా ఉండడం వల్ల ఆహారాన్ని గబగబా మింగేస్తున్నారు. ఒక మూల కూర్చున్న తను భార్యని కూడా తనలాగే తినమని లూవాజో మెల్లగా ప్రోత్సహిస్తున్నాడు. ఆమె చాలా సేపు బెట్టు చేసి నిగ్రహించుకుంది. చివరికి ప్రకృతి ధర్మం గెలిచింది. అప్పుడు ఆమె భర్త ఎంతో మర్యాద నటిస్తూ, “అందమైన సహచరురాలి” తో, “నేను మేడమ్ లూవాజో కి కూడా కొద్దిగా ఆహారం వడ్డించండి అని అడగవచ్చా?” అన్నాడు.
“ఓ తప్పకుండా అయ్యా!” అని ఆమె తన మధురమైన చిరునవ్వుతో ఆ వంటకాల పాత్రలను వారికి అందించింది.
మొదట సారా సీసా తెరిచినప్పుడు, అక్కడ ఒకే గ్లాసు ఉండడంతో అందరూ కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరు తాగిన తర్వాత ఆ గ్లాసుని తుడుస్తూ, ఒకరికొకరు అందించుకున్నారు.కార్నుడెట్ మాత్రం, బహుశా తన పక్కనున్న ఆ అందమైన స్త్రీ పట్ల తనకున్న గౌరవాన్ని లేదా ఆకర్షణను చాటుకోవడానికేమో, ఆమె పెదవులు తాకి తడిగా ఉన్న గ్లాసు అంచు వైపు నుంచే వైన్ తాగాడు.
తన చుట్టూ ఉన్నవారు తింటుండగా వచ్చిన ఆహారపు వాసనలు భరించలేక ఉక్కిరిబిక్కిరి అయిన కౌంట్, కౌంటెస్ ది బ్రెవిల్లే , శ్రీమతి,శ్రీ కారే లామడన్, గ్రీకు పురాణంలోని తాంతలస్ అనుభవించిన భరించలేని బాధను అనుభవించారు. అంతలో హఠాత్తుగా పారిశ్రామికవేత్త భార్య మేడం కారే లమడన్ ఒక నిట్టూర్పు విడిచింది. అది విన్న అందరూ ఆమె వైపు తిరిగారు. ఆమె ముఖం బయట ఉన్న మంచులా తెల్లగా పాలిపోయింది. ఆమె కళ్ళు మూతలుపడ్డాయి. తల ముందుకు వాలిపోయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయింది.
ఆమె భర్త కంగారుపడుతూ, సహాయం కోసం మిత్రులను వేడుకున్నాడు. ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. అప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు సన్యాసులలో పెద్ద ఆవిడ, రోగి తల పైకెత్తి, వెండి గ్లాసు పెదవుల దగ్గర పెట్టి కొన్ని చుక్కలు వైన్ తాగించింది. ఆ అందమైన ఆమె ఒకసారి కదిలి, కళ్ళు తెరిచి చిరునవ్వుల చిందిస్తూ, తనకు ఇప్పుడు బాగుందని బలహీనుల స్వరంతో చెప్పింది. అయితే మళ్ళీ ఇలా జరగకుండా ఉండడానికి ఆ సన్యాసిని ఆమెతో గ్లాసు నిండా వైన్ తాగించి ఇలా అంది “ఇదంతా కేవలం ఆకలి వల్లే.నీకు వచ్చిన జబ్బు అదే.”
అప్పుడు బూల్ దె స్విఫ్ ముఖం ఎర్రబడగా తడబడుతూ, ఇంకా ఉపవాసం ఉన్న ఆ నలుగురు ప్రయాణికుల వైపు చూస్తూ, “దేవుడా నేనే గనక ఈ మహిళలకు, మగవారికి ఆహారాన్ని అందించగలిగితే..”
వారు తనని తృణీకరిస్తారనే భయంతో ఆమె మాట మధ్యలోనే ఆపేసింది. కానీ లూవాజో వెంటనే అందుకుని: “అదేం మాట! ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనమందరం అన్నదమ్ములం. అక్కచెల్లెళ్లం. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. రండి మేడం. దయచేసి మొహమాట పడకండి. అసలు ఈ రాత్రికి తలదాచుకోవడానికి మనకు ఏదైనా ఇల్లు దొరుకుతుందో లేదో కూడా తెలియదు. మనం వెళ్తున్న ఈ వేగాన్ని బట్టి చూస్తే రేపు మధ్యాహ్నం వరకు కూడా మనం టోట్స్ చేరుకోలేం. వారు కాసేపు సంకోచించారు.ఏ ఒక్కరూ అడగంగానే ఆహారం స్వీకరించడానికి ధైర్యం చేయలేకపోయారు. కానీ కౌంట్ ఆ సమస్యను పరిష్కరించాడు. అతను ఆ సిగ్గుపడుతున్న అమ్మాయిల వైపు తిరిగి, అత్యంత హుందాతనంతో,
“మేము కృతజ్ఞతలతో స్వీకరిస్తున్నాము మేడం”.
సాధారణంగా ఏదైనా పనిలో మొదటి అడుగు వేయడమే కష్టం. ఆ ‘రూబికాన్’ అడ్డంకిని దాటాక వారందరూ ఎంతో ఇష్టంగా తినడం మొదలుపెట్టారు. బుట్ట ఖాళీ అయిపోయింది. అందులో ఇంకా లివర్ పేస్ట్, ఒక లాక్ పిట్ట పై, పొగబెట్టిన నాలుగు మాంసం ముక్కలు ,క్రాసెన్ బెర్రీ పండ్లు, ప్యాంట్ లెవెల్ జింజర్ బ్రెడ్, రకరకాల కేకులు, ఊరబెట్టిన దోసకాయలు, ఉల్లిపాయలతో నిండిన ఒక కప్పు ఉన్నాయి.బూల్ దె స్విఫ్ కి కూడా మిగిలిన స్త్రీల లాగే అరగని పదార్థాలన్నా, పులుపు పదార్ధాలన్నా చాలా ఇష్టం.
ఆ అమ్మాయి పెట్టిన ఆహారాన్ని తింటూ ఆమెతో మాట్లాడకుండా ఉండడం వారికి సాధ్యం కాలేదు కాబట్టి వారు సంభాషణ మొదలుపెట్టారు. మొదట కొంచెం బిగుసుకు పోయి ఉన్న ఆమె, ఏ మాత్రం గర్వం లేనిదిగా కనిపించడంతో, మెల్లగా స్వేచ్ఛగా మాట్లాడటం మొదలుపెట్టారు. లోకజ్ఞానం ఉన్న మేడం డే బ్రోవిల్లే , మేడం కారే లమదొన్ ఎంతో మర్యాదగా చాలా చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా కౌంటెస్ గొప్ప వంశపు స్త్రీలకు ఉండే ఆత్మీయమైన గౌరవంతో, తమ స్థాయి కన్నా తక్కువ వారితో కలిసినా తమ గౌరవం తగ్గదనే ధీమాతో, ఎంతో ఆకర్షణీయంగా మాట్లాడారు. కానీ మొండి స్వభావం కల మేడం లూవాజో మాత్రం ఒక కఠినమైన పోలీసు అధికారి లాగా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా తినింది .
సహజంగానే మాటలు యుద్ధం వైపు మళ్ళింది. ప్రష్యన్ల గురించి భయంకరమైన కథలు, ఫ్రెంచ్ వారి వీర గాథలు చెప్పుకున్నారు. అందరూ దేశంకోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్న వీరులను గొప్పగా పొగిడారు.ఆ తర్వాత వారి వ్యక్తిగత అనుభవాల ప్రస్తావన వచ్చింది. బూల్ దె స్వీఫ్ తనకు అత్యంత ప్రియమైన నగరాన్ని ఏ పరిస్థితులలో విడిచి పెట్టవలసి వచ్చిందో, తన వర్గానికి స్వభావ సిద్ధంగా ఉండే భావోద్వేగంతో వివరించింది. “నా ఇంట్లో ఆహారం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడో తెలియని చోటుకి వెళ్లిపోవడం కంటే సైనికులకు పెట్టడం నయం అనుకున్నాను. కానీ ఆ ప్రష్యన్లను చూడగానే నా రక్తం మరిగి పోయింది. అవమానంతో రోజంతా ఏడ్చాను. నేనే గనుక పురుషుడినైతే ఎంత బాగుండేదో! కిటికీ లోంచి ఆ మొన దేలిన టోపీలు పెట్టుకున్న లావుపాటి పందులను,గుంటనక్కలను చూస్తుంటే, నా ఇంట్లోని ఫర్నిచర్ అంతా వాళ్ళ మీదకు విసిరేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నా పనిమనిషి నన్ను బలవంతంగా పట్టుకుని ఆపింది. ఆ తర్వాత కొందరు నా ఇంట్లోనే దిగారు. లోపలికి వచ్చిన మొదటి వాడి గొంతు పట్టుకున్నాను; వాళ్ళుకూడా గొంతు పిసికితే చచ్చిపోయే రకమే. వాడి వెనకనున్న మిగిలిన వాళ్ళు నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లకపోయి ఉంటే వాడు అక్కడికక్కడే చచ్చేవాడు. ఇక ఆ తర్వాత నేను దాక్కోవలసి వచ్చింది. అవకాశం దొరికిన వెంటనే అక్కడ నుండి పారిపోయి ఇలా వచ్చాను.”
వారందరూ ఆమెను మనసారా అభినందించారు. తమకంటే ధైర్యవంతురాలయిన ఆమె పట్ల ప్రయాణికులలో గౌరవం పెరిగింది. కార్నెడెట్ ఒక ప్రవక్త లాగా, భక్తురాలు దేవుడిని కొలుస్తుంటే వినే పూజారిలాగా ఆమె మాటలను చిరునవ్వుతో ఆమోదిస్తూ విన్నాడు. ఎందుకంటే, పొడవాటి గడ్డాలు పెంచిన అతని లాంటి ప్రజాస్వామ్య వాదులకు, దేశభక్తి పై తమకు మాత్రమే గుత్తాధిపత్యం ఉంటుందని నమ్మకం; అది పూజారులకు మతంపై ఉన్నట్టుగా. ఆ తర్వాత అతను కూడా రోజువారి వారపత్రికల్లో ఉండే భాషతో ఒక రాజకీయ నాయకుడిలాగా ఉపన్యాసం ఇస్తూ, లూయిస్ నెపోలియన్ ని మూర్ఖుడని తిట్టిపోశాడు.
అతని మాటలకు బూల్ దె స్విఫ్ కి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే, ఆమె బోనపార్టీ సిద్ధాంతాలను బలం గా నమ్మే వ్యక్తి. కోపంతో ఆమె ముఖం చెర్రీ పండులా ఎర్రబడింది.ఆ కోపంతో తడబడుతూనే, “మీరే గనుక ఆయన స్థానంలో ఉండి ఉంటే చూడాలని ఉంది. మీలాంటి వాళ్ళ అసలు రంగు అప్పుడు బయటపడుతుంది. మీరే ఆ మనిషిని మోసం చేశారు. మీలాంటి దుర్మార్గుల పాలనలో ఉంటే ఇక ఫ్రాన్స్ లో నివసించడం అసాధ్యం!” అనింది.
కార్నెడెట్ ఆమె మాటలకు ఏమాత్రం చలించకుండా, తనదైన శైలిలో, ఒక విధమైన చిన్నచూపుతో కూడిన వంకర నవ్వుతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడుతుండగా, వారి మధ్య మాటలు పెరిగి వివాదం గా ముదురుతున్న సమయంలో, కౌంట్ కలుగ చేసుకున్నాడు. ఎంతో కష్టం మీద ఆమెను శాంతింప చేస్తూ, “నిజాయితీగా ఇచ్చిన ఏ అభిప్రాయాన్నయినా మనం గౌరవించాలని” అన్నాడు. అతి కష్టం మీద ఆ మహిళను శాంతింప చేయడంలో సఫలమయ్యాడు.
అయితే గణతంత్రం అంటే సహజంగానే ద్వేషం ఉన్న కౌంటెస్ కి, పారిశ్రామికవేత్త భార్యకు బూల్ దె స్విఫ్ పట్ల తెలియని గౌరవం ఏర్పడింది. పైగా, నిరంకుశ పాలనలోని రాజసం, ఆడంబరాలు, వైభవాలపట్ల మహిళలలో సహజంగా ఉండే ఆకర్షణ కూడా దానికి తోడైంది. ఉన్నత వర్గాల పట్ల వారిలో ఉండే సహజమైన ఆకర్షణ వల్ల వారి అభిప్రాయాలు కలిసాయి.
బుట్ట ఖాళీ అయిపోయింది. ఆ పదిమంది ప్రయాణికులు అందులోని ఆహార పదార్థాలు అన్నింటిని ఆస్వాదించారు. బుట్టలో ఇంకా ఉంటే బాగుండును అనే విచారం కూడా వారిలో కలిగింది. భోజనం ముగిసాక సంభాషణలు కాసేపు సాగి, మెల్లగా మందగించాయి.
రాత్రి అయింది . చీకటి దట్టంగా అలముకుంది. అది గమనించి, మేడం డి బ్రేవిల్లే తన వద్ద ఉన్న ఫుట్ వార్మర్ -పాదాలను వెచ్చపరిచే పరికరం- బూల్ దె స్విఫ్ కి ఇచ్చింది. పాదాలు మంచులా చల్లబడిపోతుండడంతో ఆమె వెంటనే దాన్ని స్వీకరించింది. మేడం కారే-లమడోన్, మేడం లూవాజో లు తమ వద్ద ఉన్న వాటిని నన్ లకు ఇచ్చారు.
బగ్గీ వాడు లాంతరు వెలిగించాడు. గుర్రాల పక్కల నుండి కారుతున్న చెమట ఆవిరై మంచు లా మెరుస్తూ రోడ్డు పక్కన ఉన్న మంచుపై పడుతూ వింతైన వెలుగులు చిందిస్తోంది. బండి కదులుతుంటే ఆ వెలుతురు లో మంచు తెరలు విచ్చుకుంటున్నట్టు అనిపిస్తున్నాయి.
బగ్గీ లోపలంతా ఇప్పుడు చీకటిగా ఉంది. ఏమి కనిపించడం లేదు. కానీ హఠాత్తుగా బూల్ దె స్విఫ్, కార్నెడెట్ లు కూర్చున్న మూలలో ఏదో కదలలిక, చిన్న శబ్దం. లూవాజో చీకట్లోకి తెరిపారా చూస్తే,గడ్డంతో ఉన్న ఆ ప్రజాస్వామ్యవాది చీకట్లో తనకు తగిలిన బలమైన దెబ్బకు అదిరిపడి, పక్కకు జరిగి కూచునట్లు అనిపించింది.
ఎదురుగుండా చిన్న చిన్న కాంతులు మినుకు మినుకు మంటున్నాయి. అది టోటెస్ గ్రామం. ఆ గుర్రపు బగ్గీ రోడ్డెక్కి 11 గంటలు అయింది. గుర్రాల విశ్రాంతి, ఆహారం తీసుకునే సమయం మూడు గంటలు కలిపితే మొత్తం 14 గంటల ప్రయాణం ముగిసింది. బండి ఆ ఊరిలోకి ప్రవేశించి హోటల్ డు కామర్స్ ముందు ఆగింది.
గుర్రపు బగ్గి తలుపు తెరుచుకుంది. అప్పుడే ప్రయాణికులందరినీ ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసే ఒక సుపరిచితమైన శబ్దం వినిపించింది. అది నేల మీద తగిలిన ఒక కత్తి వర చేసిన శబ్దం. ఆ తర్వాత ఎవరో జర్మన్ భాషలో ఏదో గట్టిగా అరిచారు .
బగ్గీ ఆగినా ఎవరూ దిగలేదు. సీట్లలో నుండి దిగిన వెంటనే తమను ఎవరైనా చంపేస్తారేమో నన్ను భయం వారిలో కనిపించింది. అప్పుడే బగ్గీ తోలేవాడు తన చేతిలోని లాంతరుతో అక్కడికి వచ్చాడు. ఆ వెలుతురు హఠాత్తుగా బండి లోపల పడటంతో, బయటి దృశ్యాన్ని చూసిన వాళ్ళ లో ఆశ్చర్యం, భయం తో వణికి పోవడం వలన కళ్ళు పెద్దగా విప్పారాడం స్పష్టంగా కనిపించింది. బండి తోలే వాడి పక్కనే జర్మన్ అధికారి నిలబడి ఉన్నాడు. అతను పొడుగ్గా, సన్నగా, తెల్లగా ఉన్నాడు. మహిళలు వేసుకునే కొసెట్ లాగా అతని యూనిఫామ్ ఒంటికి బిగుతుగా పట్టి ఉంది. అతని తలపై, పక్కకు వాలి ఉన్న మెరిసే టోపీని చూస్తుంటే, ఏదో ఇంగ్లీష్ హోటళ్ల లో గదులకు దారి చూపే వ్యక్తి లాగా అనిపించాడు. అసాధారణంగా పెరిగిన అతని మీసం కొనదేలి, చివరికి అతి సన్నని వెంట్రుకలా ఉంది. ఆ మీసం బరువు వల్ల అతని పెదవుల చివరలు కిందుకు వాలినట్టు అనిపిస్తున్నాయి.
అతను ఆల్సియేషన్ మాండలికంలోని ఫ్రెంచ్ భాషలో కరకుగా:
“దయచేసి కిందకు దిగండి, లేడీస్ అండ్ జెంటిల్మెన్”అన్నాడు.
అన్ని సందర్భాల్లోనూ విధేయత పాటించే అలవాటున్న ఇద్దరు సన్యాసులు మొదటగా బండి దిగారు. ఆ తర్వాత కౌంట్, కౌంటెస్, ఆపై పారిశ్రామికవేత్త, అతని భార్య దిగారు. లూవాజో తన భార్యను ముందుకు నెట్టి, ఆతరువాత దిగాడు.
“శుభోదయం అయ్యా!” అని లూవాజో అధికారికి అభివాదం చేశాడు. అందులో మర్యాద కంటే ఆ సమయంలో అవసరమైన తెలివైన జాగ్రత్త పాలు అధికంగా ఉంది. కానీ అధికార మదం ఎక్కిన ఆ జర్మన్ అధికారి ఏ మాత్రం బదులీయకపోగా అతని వైపు నిరసన గా చూశాడు. బూల్ దె స్విఫ్,కార్నెడెట్ తలుపు దగ్గరే ఉన్నా, శత్రువు ముందు ఎంతో హుందాగా ఉండాలని, చివరిగా దిగారు. లావు పాటి బూల్ దె స్విఫ్ తన కోపాన్ని అణచుకుంటూ, ప్రశాంతంగా కనిపించడానికి ప్రయత్నించింది. తన మందు దిగిన ఉన్నత కులస్తుల కన్నా ధైర్యంగా ఉండాలని అనుకుంది. అతడు మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకున్నాడు. ఇలాంటి కష్ట సమయాల్లో ప్రతి వ్యక్తి తన దేశానికి ప్రతినిధిగా పరిగణించబడతాడని వారికి తెలుసు. అందుకే తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటి వరకు రుయెన్ నగర విముక్తి కోసం తాను పాటిస్తున్న ఆ ప్రతిఘటనా వైఖరినే కొనసాగించాడు.
అక్కడి నుండి వారు ఆ సత్రం లోని ఎంతో విశాలమైన వంటగదిలోకి ప్రవేశించారు. జర్మన్, జనరల్ సంతకం చేసిన వారి పాసుపోర్ట్ లను అడిగాడు. అందులో ప్రతి ప్రయాణికుడి పేరు, గుర్తింపు, చిహ్నాలు, వృత్తి వివరాలు ఉన్నాయి. ఆ వివరాలను ప్రయాణికుల రూపాలతో నిశితంగా సరిపోల్చి చూస్తూ,అందరిని తనిఖీ చేశాడు.
ఆ తర్వాత అతడు కర్కసంగా,” సరే” అని వెను తిరిగాడు.
అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే ఆకలితో ఉన్నవాళ్ళు,రాత్రి భోజనం ఆర్డర్ చేశారు. అది సిద్ధం కావడానికి అరగంట సమయం పడుతుంది. ఇద్దరు పనివారు ఆ పనిలో నిమగ్నమై ఉండడం చూసి, ప్రయాణీకులు తమ తమ గదులను చూసుకోవడానికి వెళ్లారు.అవి పక్కనే ఉన్నాయి. ఆ నడవ చివర ఒక సంఖ్య వేసి ఉన్న అద్దాలు తలుపు ఉంది.
వారందరూ భోజనానికి కూర్చో బోతుండగా, హోటల్ యజమాని స్వయంగా అక్కడకు వచ్చాడు. అతను మాజీ గుర్రపు వ్యాపారి. ఊబ కాయుడు. ఆయాస పడుతూ, రొప్పుతూ, దగ్గుతూ, గొంతు సవరించుకుంటూ,
“మేడం ఎలిసెబత్ రూసెట్?”
బూల్ దె స్విఫ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది.
“అది నా పేరే.”
“మేడం, ఆ ప్రష్యన్ అధికారి ఇప్పుడే మీతో మాట్లాడాలని కోరుతున్నారు.”
“నాతోనా?”
“అవును. మీరు గనక మడమసెల్ ఎలిజబెత్ రూసెట్ అయితే.”
ఆమె కాసేపు తటపాటయించి, ఆలోచించి, ఖచ్చితంగా చెప్పింది.
“అది నా పేరే కావచ్చు. కానీ నేను రాను.”
ఆమె చుట్టూ ఉన్న వారందరూ ఆందోళనలతో కదిలారు. ఈ ఆజ్ఞకు కారణం ఏమై ఉంటుందో అని ప్రతి ఒక్కరూ రకరకాల ఊహాగానాలు చేసుకోసాగారు. కౌంట్ ఆమె దగ్గరికి వచ్చి,
“మీరు పొరపాటు చేస్తున్నారు మేడం. మీ తిరస్కరణ వల్ల కేవలం మీకే కాకుండా మీ సహచరులందరికీ సమస్యలు రావచ్చు. అధికారంలో ఉన్న వారిని ఎదిరించడం ఎప్పటికీ శ్రేయస్కరం కాదు. ఈ అభ్యర్థనను మన్నించడం వల్ల మీకు ఎటువంటి ప్రమాదం జరగదు. బహుశా ఏదైనా నియమ నిబంధనలు మర్చిపోవడం వల్ల పిలిచి ఉంటారు” అన్నారు.
కౌంట్ తో పాటు మిగిలిన వారందరూ గొంతు కలిపారు. ఒత్తిడి చేశారు. క్లాసులు తీసుకున్నారు. చివరకు ఆమెను ఒప్పించారు. ఆమె తీసుకునే మొండి నిర్ణయం వల్ల ఎక్కడ చిక్కులు వస్తాయోనని ప్రతి ఒక్కరూ భయపడ్డారు. చివరికి ఆమె, “కేవలం మీ అందరి కోసమే నేను వెళ్తున్నాను. అది గుర్తుంచుకోండి” అనింది.
కౌంటెస్ ఆమె చేయి పట్టుకుని, “మేము నీకు కృతజ్ఞులం” అని చెప్పింది.
ఆమె గది నుంచి వెళ్ళిపోయింది. ఆమె తిరిగి వచ్చే వరకు భోజనం మొదలు పెట్టకుండా వేచి ఉన్నారు అంతా. కోపిష్టి అమ్మాయిని పిలిచే బదులు తమను పిలిచి ఉంటే బాగుండేదని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఒకవేళ తమను పిలిస్తే చెప్పడానికి మనసులోనే కొన్ని నీతి వాక్యాలు కూడా సిద్ధం చేసుకున్నారు.
కానీ పదినిమిషాల్లో ఆమె తిరిగి వచ్చింది. కోపంతో ఆమె ముఖం ఎర్రబారింది. ఆవేశంతో రొప్పుతోంది.
“ఆ దుర్మార్గుడు, ఎంత నీచుడు!” అని తడబడుతూ అనింది.
అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని అందరూ ఆత్రుత పడ్డారు.కానీ ఆమె చెప్పడానికి నిరాకరించింది. కౌంట్ ఆమెను మరిన్ని వివరాలు అడగగా, ఆమె ఎంతో హుందాగా అతనిని వారించి,
“లేదు. ఆ విషయానికి మీకు ఎటువంటి సంబంధం లేదు. నేను దాని గురించి మాట్లాడలేను.”
ఆ తర్వాత వారంతా క్యాబేజీ సువాసన వస్తున్న ఒక పెద్ద సూప్ గిన్ని చుట్టూ చేరారు. రాత్రి భోజనం ఆహ్లాదకరంగా సాగింది. సైడర్ మద్యం రుచిగా ఉంది. దంపతులు, సన్యాసినులు పొదుపు కోసం దాన్నే తాగారు. మిగిలిన వారు వైన్ ఆర్డర్ చేయగా, కార్నెడెట్ మాత్రం బీర్ కావాలన్నాడు. బీర్ బాటిల్ మూత తీయడం, గ్లాసులలోకి నురగలు వచ్చేలా పోయడంలో అతనికి ఒక ప్రత్యేక స్టైల్ ఉంది. బీర్ బాటిల్ ఎదురుగా పెట్టుకుని, దాని రంగును పరీక్షిస్తూ, అతను పరవశించి పోయేవాడు. అతడు తాగుతున్నప్పుడు ఆ రంగులోనే ఉన్న అతని పొడవాటి గడ్డం కూడా ఆనందంతో వణుకుతున్నట్టు అనిపించేది. ఆ బీరు గ్లాస్ తప్ప మరో లోకమే లేనట్లుగా కేవలం దానికోసమే పుట్టినట్టుగా అనిపించేవాడు. అతనికి జీవితంలో రెండే ఎంతో ప్రియమైనవి-ఒకటి బీర్, రెండోది విప్లవం. వాటి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా భావించేవాడు.
హోటల్ యజమాని దంపతులు, టేబుల్ చివర కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆ యజమాని ఒక పాత ఇంజన్ లాగా రొప్పుతూ, తింటున్నప్పుడు మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నాడు. అతని భార్య మాత్రం ఒక నిమిషం కూడా నోరు మూయడం లేదు. మాటల వర్షం కురిపిస్తూనే ఉంది. ప్రశ్నలు వేసినప్పుడు ఆమెకు ఎలా అనిపించింది? వారు ఏం చేశారు? అంటూ విషయాలు ఆరాతీయడం మొదలు పెట్టింది. మొదటిగా, వారు తమ డబ్బులు ఖర్చు చేస్తున్నందుకు, రెండోది వారు తమ ఇద్దరు కొడుకులను సైన్యంలో చేర్చుకున్నందుకు ఆమె వారిని శపించింది. ఒక ఉన్నత వర్గ స్త్రీతో మాట్లాడే అవకాశం దొరికినందుకు మురిసిపోతూ, ఆమె కౌంట్ ను ఉద్దేశించి మాట్లాడింది. ఆ తర్వాత ఆమె గొంతు తగ్గించి కొన్ని సున్నితమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆమె భర్త మధ్యలో కలుగజేసుకొని “మేడమ్, నువ్వు కాస్త నోరు మూసుకుంటే మంచిది” అని హెచ్చరించాడు. ఆమె అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన మాటల ధాటి కొనసాగించింది. “అవును మేడం,ఈ జర్మనులు పంది మాంసం, బంగాళదుంప తప్ప ఇంకేమి తినరు. వీళ్ళేదో శుభ్రంగా ఉంటారని అనుకోకండి. రోజంతా మైదానంలో గుంపులుగా చేరి అటు ఇటు కవాతు చేయడం తప్ప వీళ్ళు చేసేదేమీ ఉండదు. అదేదో పొలంలో పనో, రోడ్డు వేసుకునే పనో చేసుకోవచ్చు కదా! ఈ సైనికులు దేనికీ పనికిరారు మేడం. పేదవాళ్లు వీళ్లకు తిండిపెట్టి పోషించాలి. వీళ్ళు మనుషుల్ని ఎందుకు చంపుతున్నట్టు? నేను చదువుకోని ముసలిదాన్నే కావచ్చు. కానీ పొద్దున్నుంచి రాత్రి దాకా వీళ్ళు కవాతులు చేస్తూ ఒళ్ళు హునం చేసుకోవడం చూస్తూ ఉంటే నాకు, ‘లోకానికి మేలు చేసే ఆవిష్కరణలు చేసే వాళ్ళు శ్రమ పడడంలో అర్థం ఉంది కానీ ఇలా కీడు చేయడానికి ఇంత శ్రమ పడడం ఎందుకు?’ అనిపిస్తుంది. నిజానికి మనుషుల్ని చంపడం-అది ప్రష్యన్ అయినా, ఫ్రెంచ్ వారైనా దారుణమైన విషయం కాదా! మనల్ని ఎవరైనా గాయపరిస్తే మనం తిరిగి గాయపరచడం తప్పని శిక్షిస్తారు. కానీ మన కొడుకులను పిట్టల్లా కాల్చి చంపేస్తుంటే మాత్రం అది గొప్ప విషయమని, ఎక్కువ మందిని చంపిన వారికి పతకాలు ఇస్తారు. ఇది నాకు ఎప్పటికీ అర్థం కాదు.”
కార్నెడెట్ గొంతు పెంచి, “శాంతియుతమైన పొరుగు దేశం పై దాడి చేసే యుద్ధం ఒక అనాగరిక చర్య. కానీ మాతృభూమి రక్షణ కోసం పోరాడినప్పుడు అది ఒక పవిత్రమైన బాధ్యత.” ముసలావిడ అతనినే చూస్తూ,
” అవును ఆత్మరక్షణ కోసం చేసేది వేరు. కానీ కేవలం తమ వినోదం కోసం యుద్ధాలు చేసే రాజులందరినీ చంపేస్తే ఇంకా మంచిది కదా! కార్నెడెట్ కళ్ళు మెరిసాయి.”శభాష్ పౌరులారా!” అన్నాడు.
మిస్టర్ కారే -లేమడాన్ లోతైన ఆలోచనల్లో పడ్డాడు. అతనికి గొప్ప జనరల్స్ అంటే ఇష్టమే. అయినప్పటికీ ఈ పల్లెటూరి మహిళ చెప్పిన మాటల్లోని ఇంగిత జ్ఞానం అతన్ని ఆలోచింపజేసింది. సైన్యం కోసం వృధా అవుతున్న ఈ అపారమైన శక్తిని పారిశ్రామిక రంగంలో ఉపయోగిస్తే, దేశం ఎంత సంపన్నవంతం అవుతుందో అతను ఊహించుకున్నాడు.
కానీ లూవాజో మాత్రం తన సీటు నుండి లేచి యజమాని దగ్గరికి వెళ్లి, మెల్లగా మాటలు కలపడం మొదలుపెట్టాడు. ఆ యజమాని నవ్వుతూ, దగ్గుతూ అతని జోకులకు మురిసిపోయాడు. చివరికి అతనితో జర్మన్లు వెళ్ళిపోయాక ఆరు పీపాల వైన్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
భోజనం ముగిశాక, అలసిపోయిన ప్రయాణికులందరూ పడుకోవడానికి వెళ్లారు.
కానీ లూవాజో మాత్రం రహస్యంగా చుట్టూ గమనిస్తూ, తన భార్యను పడుకోమని, కారిడార్ లో ఏం సిగ్గుమాలిన సంఘటనలు జరుగుతున్నాయో అని చూడడానికి గది తలుపుకు చెవి ఒగ్గి వినడం, తలుపుకున్న తాళం రంధ్రం ద్వారా నిఘా పెట్టి చూడడం మొదలు పెట్టాడు. సుమారు గంట తర్వాత అతనికి ఒక శబ్దం వినిపించింది. గది తెలుపు కాస్త తెరిచి బయటికి తొంగి చూడగా, బూల్ దె స్వీప్ గౌన్ తో, అద్దాల తలుపుల వైపుకు వెళ్తుండడం కనిపించింది. పక్కనున్న గది తలుపు కొద్దిగా తెరుచుకుని ఉంది. ఆమె తిరిగి వెళుతుండగా కార్నెడెట్ ఆమెను అనుసరించాడు. వారు మెల్లగా మాట్లాడుకున్నారు. అతన్ని ఆమె తన గదిలోకి అనుమతించడానికి నిరాకరిస్తున్నట్టు అనిపించింది. చివరికి వారు గొంతు పెంచడంతో లూవాజోకు కొన్ని మాటలు సన్నగా వినిపించాయి. కార్నెడాట్, గట్టిగా పట్టుబడుతున్నాడు.
“ఎంత పిచ్చి దానివి! ఇందులో నీకేం నష్టం” అని అతను అడిగాడు.
ఆమె ఆవేశంగా,
“లేదు. కొన్ని సమయాల్లో ఇలాంటి పనులు చేయకూడదు. ముఖ్యంగా ఇక్కడ. ఇది చాలా అవమానకరం.”
అతనికి అర్థం కాక కారణం అడిగాడు. అప్పుడు ఆమె మరింత గట్టిగా,
“ఎందుకా? నీకు అర్థం కావడం లేదా?ఈ ఇంట్లో ప్రష్యన్లు ఉన్నారు. బహుశా పక్క గదిలోనే ఉండి ఉంటారు.
అతను మౌనం వహించాడు. శత్రువు పక్కనే ఉండగా పరాయి వ్యక్తి కౌగిలిలో చేరడానికి ఇష్టపడని ఆమెలోని దేశభక్తితో కూడిన సిగ్గు అతనిలో పౌరుషాన్ని మేలుకొలుపి ఉండవచ్చు. అతను ఆమెకు ఒక చిన్న ముద్దు నిచ్చి మెల్లగా తన గదిలోకి వెళ్లిపోయాడు. ఇది చూసి గంతులు వేస్తూ నిద్రిస్తున్న భార్య పక్కన చేరాడు లూవాజో.
ఆ తర్వాత ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది. కానీ కాసేపటికి ఇంటిలో ఒక మూల నుండి, అది నేలమాళిగ కావచ్చు లేదా పై అంతస్తులో ఉన్న గది కావచ్చు, ఒక గురుగర ధ్వనితో కూడిన గురక వినిపిస్తుంది. అది ఆవిరితో నడుస్తున్న బాయిలర్ నుండి వచ్చే శబ్దం లాగా సుదీర్ఘంగా క్రమబద్ధంగా సాగుతోంది. హోటల్ యజమాని ఫాలోవి గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం 8 గంటలకు బయలుదేరాలని వారు నిర్ణయించుకోవడంతో, ఆ సమయానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ మంచులో కప్పబడిన గుర్రపు బండి కి మాత్రం గుర్రాలు పూనలేదు. తోలే వాడు కూడా రాలేదు. బగ్గీ ఆవరణ మధ్యలో ఒంటరిగా నిలబడి ఉంది. తోలేవాడి కోసం గుర్రపు శాలలో, బండి షెడ్లలో, గడ్డివాముల్లో వెతికారు. కానీ ఫలితం లేక పోయింది. దాంతో ఆ బృందాల్లో పురుషులు గ్రామాల్లో వెతకడానికి బయటకు వచ్చారు. వారు చౌరస్తాలకు చేరుకునేసరికి ,అక్కడ ఒకవైపు చర్చి, దానికి అటు ఇటుగా ప్రష్యన్ సైనికులు ఉన్నారు. చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. వారు చూసిన మొదటి సైనికుడు బంగాళదుంపలు వలుస్తున్నాడు. రెండో వాడు కొంచెం దూరంలో ఒక మంగలి దుకాణం కడుగుతున్నాడు. గడ్డం ఉన్న మరొక సైనికుడు ఏడుస్తున్న పసిపాపను తన మోకాళ్ళపై కూర్చోబెట్టుకుని బుజ్జగిస్తాడు. అంతా యుద్ధానికి వెళ్లడంతో, అక్కడ ఉన్న గట్టి పల్లెటూరి మహిళల సైగలతో, ఈ సైనికులకు పనులు పురమాయిస్తున్నారు. కట్టెలు కొట్టడం,సూప్ తయారు చేయడం,కాఫీ గింజల మిశ్రమం వంటి పనులు చేయిస్తున్నారు.
వీళ్ళు ప్రష్యన్ లు కాదని ఎవరో అంటున్నారు. ఎక్కడి నుంచో సుదూర ప్రాంతం నుండి వచ్చారట. వీళ్ళందరికీ అక్కడ భార్యాబిడ్డలు ఉన్నారు.
వీళ్ళకి కూడా యుద్ధం అంటే ఇష్టం లేదని మీరు నమ్మవచ్చు. మనలాగే అక్కడ కూడా వీళ్ల మనుషులు, తమ వారి కోసం కన్నీరు కారుస్తూ ఉండి ఉంటారు. యుద్ధం మనకు ఎంత బాధ కలిగిస్తుందో వాళ్లకు కూడా అంతే దుఃఖాన్ని కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అంత దారుణంగా ఏమీ లేదు. ఈ సైనికులు ఎవరికీ హాని చేయడం లేదు. పైగా తమ సొంత ఇళ్లల్లో చేస్తున్నట్టే ఇక్కడకూడా పనులు చేస్తున్నారు. పేదవాళ్ళు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఈ లోకంలోని పెద్ద మనుషులే యుద్ధాలు చేస్తారు.
శత్రువులకు, గ్రామీణులకు మధ్య ఏర్పడిన స్నేహ పూర్వక వాతావరణం చూసి, అసహ్యించుకుంటూ కార్నెడెట్ తిరిగి హోటల్ గదిలోకి వెళ్లిపోయాడు.
“వీళ్ళు ఊరుని మళ్లీ జనంతో నింపుతున్నారు” అని లూవాజో ఎగతాళి చేశాడు.
“వారు చేసిన నష్టాన్ని ఇలా పూడ్చుకుంటున్నారు” అని కార్నెడెట్ గంభీరంగా అన్నాడు.
కానీ వారికి బండి తోలేవాడు మాత్రం ఎక్కడా కనిపించలేదు. చివరికి అతను గ్రామాల్లోని ఒక మద్యం దుకాణంలో జర్మన్ సైనికుడితో కలిసి అత్యంత ఆత్మీయంగా ముచ్చటిస్తూ కనిపించాడు.
“8 గంటలకు గుర్రాలు సిద్ధం చేయమని నీకు చెప్పలేదా?” అని కౌంట్ కోపంతో అడిగారు.
“చెప్పారు. కానీ ఆ తర్వాత నాకు వేరే ఆర్డర్లు వచ్చాయి.”
“ఏం ఆర్డర్లు?”
“గుర్రాలను అసలు కట్టవద్దని.”
“అలాంటి ఆర్డర్ నీకు ఎవరు ఇచ్చారు?”
“ప్రష్యన్ అధికారి. కానీ, ఎందుకో నాకు తెలియదు. వెళ్లి ఆయన్నే అడగండి. గుర్రాలు కట్టవద్దని నాకు ఆజ్ఞ వచ్చింది. అందుకే నేను కట్టడం లేదు. అంతే.”
“అధికారి నీకు స్వయంగా చెప్పాడా?”
“లేదు బాబు, హోటల్ యజమాని వచ్చి అధికారి పంపిన ఆర్డర్ ని నాకు చూపాడు, నేను పడుకోబోతుండగా.”
దీంతో ఆ ముగ్గురు ప్రయాణికులు ఎంతో ఆందోళనతో హోటల్ కి తిరిగి వచ్చారు.
మాన్షియర్ ఫోలోవి కోసం వాకబు చేశారు. కానీ అతనికి ఉబ్బసం ఉన్నందువలన ఉదయం 10:00 కంటే ముందు ఎప్పుడూ నిద్రలేవడని పనివాడు బదులిచ్చాడు. అగ్నిప్రమాదం జరిగితే తప్ప అంతకుముందు అతన్ని నిద్ర లేపవద్దని వారికి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి.
వారు ఆ ప్రష్యన్ అధికారిని కలవాలనుకున్నారు. కానీ అతను ఆ సత్రంలోనే బస చేస్తున్నప్పటికీ, సాధ్యపడలేదు. పౌర సంబంధ విషయాలపై అతనితో మాట్లాడే అధికారం ఫాలోవి కి మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళకి ఫాలోవి కోసం ఎదురు చూడటం తప్ప వేరే గత్యంతరం లేకపోయింది. మహిళలు తమ గదులుకు తిరిగి వెళ్లి, చిన్న చిన్న పనుల్లో నిమగ్నమయ్యారు.
కార్నెడాట్ వంటగదిలోని ఎత్తయిన పోయ్యి ఎదురుగా మంట ముందు కూర్చున్నాడు. అతని పక్కన ఒక చిన్న టేబుల్, ఒక బీరు జగ్గు ఉన్నాయి. అతను తన పైపులు కాలుస్తున్నాడు. అక్కడున్న వారి నుండి దాదాపు సమానమైన గౌరవాన్ని పొందుతున్నాడు . అతనికి సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేస్తున్నట్టు అక్కడివారు భావిస్తున్నారు. అది చాలా చక్కటి పైపు.కానీ దాని యజమాని దంతాల రంగును సరిపోలేలా నల్లగా రంగు మారిపోయింది. అయితే సువాసనతో, అందంగా వంపు తిరిగి, అతని చేతిలో ఇమిడిపోయి, అతని వ్యక్తిత్వానికి సంపూర్ణత చేకూరుస్తోంది. అతడు కదలకుండా కూర్చున్నాడు. అతని కళ్ళు అప్పుడప్పుడు నాట్యం చేస్తున్న మంటల పైన,అప్పుడప్పుడు అతడి ఎదురుగా ఉన్న బీరు సీసా పైన కేంద్రీకరిస్తున్నాయి. ప్రతి గుటక వేసిన తర్వాత మీసం పై ఉన్న నురగని చప్పరిస్తూ సంతృప్తిగా తన పొడవైన సన్నిటి వేళ్లతో జిడ్డోడుతున్న జుట్టును సవరించుకుంటున్నాడు.
లూవాజో కాళ్లు సాగదీసుకుంటున్న నెపంతో స్థానిక వ్యాపారులకు వైన్ అమ్మోచ్చో లేదో చూసేందుకు బయటకు వెళ్ళాడు. కౌంట్,పారిశ్రామికవేత్త రాజకీయాలు మాట్లాడటం ప్రారంభించారు. వాళ్లు ఫ్రాన్స్ భవిష్యత్తును అంచనా వేశారు. ఒకరు ఓర్లిన్స్ రాజవంశంపై నమ్మకం ఉంచితే మరొకరు అజ్ఞాత రక్షకుడిని నమ్ముకున్నారు-చివరి క్షణంలో ఉద్భవించే ఒక నాయకుడు ,ఒక డి గెస్లిన్, లేదా జాన్ ఆఫ్ ఆర్క్, లేదా మరొక నెపోలియన్ I.ఆ యువరాజు మరీ అంత చిన్నవాడు కాకపోతే ఎంత బాగుంటుంది!వారి మాటలు వింటున్న కార్నెడెట్, విధి వ్రాత తన చేతుల్లో ఉన్నవాడిలా నవ్వాడు. అతని పైపు వంటగది అంతటా సువాసనలు వెదజల్లింది.
గడియారం 10 గంటలు కొట్టగానే ఫాలోవి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే అందరూ అతన్ని చుట్టుమట్టి ప్రశ్నలు గుప్పించారు.
కానీ అతను వరుసగా నాలుగు సార్లు, ఎలాంటి మార్పు లేకుండా, మళ్లీ మళ్లీ అదే సమాధానం చెప్పాడు.
అధికారి నాతో సరిగ్గా ఇలా అన్నాడు: “ఫోలోవి, రేపు ఆ ప్రయాణికుల కోసం బగ్గీని సిద్ధం చేయవద్దని మీరు ఆదేశించండి. నా ఆర్డర్ లేకుండా వారు బయలుదేరకూడదు. విన్నారా? అంతే. చాలు.”
అప్పుడు వారు అధికారిని కలవాలని కోరారు. కౌంట్ తన కార్డును పంపాడు. దానిపై మోన్షియర్ కారా- లమడాన్ కూడా తన పేరు, హోదాలను రాశాడు. ఆ ఇద్దరు పురుషులను భోజనం చేసిన తర్వాత, అంటే ఒంటి గంట తర్వాత, కలవడానికి అనుమతిస్తానని ఆ ప్రష్యన్ అధికారి కబురు పంపాడు.
మహిళలు మళ్ళీ వచ్చారు.తమ ఆందోళనలు పక్కన పెట్టి, అందరూ కాస్త నంజారు.
బూల్ దె స్విఫ్ అనారోగ్యంగా, చాలా ఆందోళనగా కనిపించింది.
వారు తమ కాఫీ ని ముగిస్తుండగా పెద్దమనుషులను పిలవడానికి సేవకుడు వచ్చాడు.
ఆ ఇద్దరితో లూవాజో కలిశాడు.కార్నెడెట్ ని కూడా తమతో రమ్మని కోరారు; ఆ సందర్భానికి మరింత ప్రాముఖ్యతను జోడించి నట్టు అవుతుందని అనుకున్నారు. కానీ కార్నెడెట్, తాను అధర్మములతో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధం పెట్టుకోనని గర్వంగా ప్రకటించి, తన కుర్చీలో కూర్చుని, మరో జగ్గు బీర్ కోసం ఆర్డర్ ఇచ్చాడు.
ఆ ముగ్గురు పురుషులు మేడ మీదకు వెళ్లారు. సత్రంలోని అత్యుత్తమమైన గది అదే. అక్కడ అధికారి కుర్చీలోకూర్చుని, పోయ్యి గట్టు పై కాళ్లు పెట్టి, పొడవైన పింగాణి పైపును కాలుస్తూ, ఒక అద్భుతమైన డ్రెస్సింగ్ గౌన్ లో విశ్రాంతి తీసుకుంటూ, వారిని స్వాగతించాడు. ఆ డ్రెస్సింగ్ గౌను, బహుశా బట్టల విషయంలో ఎలాంటి అభిరుచి లేని ఎవరో పౌరుడు విడిచిపెట్టి వెళ్లిన ఇంటి నుండి దొంగలించింది అయి ఉండవచ్చు. అతను కూర్చున్న చోటు నుండి లేవలేదు. వారిని పలకరించలేదు. కనీసం వారి వైపు మొఖం ఎత్తి చూడ లేదు. విజేతలకి సహజంగా ఉండే అహంకారాన్ని అతను స్పష్టంగా ప్రదర్శించాడు.
కొద్దిసేపటి తర్వాత అతను తన వచ్చీ రాని ఫ్రెంచ్ లో ఇలా అన్నాడు
“మీకేం కావాలి?”
“మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము.” అని కౌంట్ అన్నాడు
“కుదరదు.”
“మీరు నిరాకరించడానికి కారణం నేను అడగవచ్చా?”
“ఎందుకంటే నాకు ఇష్టం లేదు.”
“రేపే వెళ్లడానికి మాకు కమాండింగ్ జనరల్ పర్మిషన్ ఇచ్చారని విషయం నేను సగౌరవంగా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. మీ నుంచి కఠినత్వాన్ని ఎదుర్కొనేంత తప్పు మేము ఏమి చేయలేదని నేను అనుకుంటున్నాను.”
“నాకు ఇష్టం లేదు. అంతే మీరు ఇక వెళ్లవచ్చు.”
“వారు తలవంచి బయటకు వచ్చారు.”
ఆ మధ్యాహ్నం చాలా దయనీయంగా గడిచింది. ఆ జర్మన్ అధికారి వింత ప్రవర్తన వారికి అర్థం కాలేదు. వాళ్ళ బుర్రల్లో రకరకాల వింత ఆలోచనలు వచ్చాయి. వారంతా వంటగదిలో సమావేశమై ఆ విషయం గురించి లోతుగా చర్చిస్తూ, అన్ని రకాల కారణాలను ఊహించుకున్నారు. తమను యుద్ద ఖైదీలుగా అప్పగిస్తారా? లేదా తమను విడిపించడానికి డబ్బు డిమాండ్ చేస్తారా? ఈ చివర ఆలోచనతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారిలో అత్యంత సంపన్నులు మరింత భయపడ్డారు. తమ ప్రాణాలను తిరిగి కొనుక్కోవడానికి, అహంకార సైనికుడి చేతుల్లో బంగారు సంచులు ఖాళీ చేయాల్సి వస్తుందని ఊహించుకున్నారు. తాము సంపన్నులం అనే విషయాన్ని దాచిపెట్టి, పేదవారిలా కనిపించడానికి ఏమైనా అబద్ధాలు చెప్పవచ్చా అని బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. లూవాజో తన వాచ్ చెయిన్ తీసి జేబులో పెట్టుకున్నాడు. రాత్రి దగ్గర పడుతున్న కొద్దీ వారి ఆందోళన మరింత పెరిగింది. దీపాలు వెలిగించారు. భోజనానికి ఇంకా రెండు గంటల సమయం ఉండడంతో, మేడం లూవాజో, ‘టెంట్ ఎట్ ఆన్’ అనే పేకాట ఆడదామని ప్రతిపాదించింది. అది వారి ఆలోచనలను మళ్ళిస్తుందని అనుకున్నారు. మిగిలిన వారు కూడా ఒప్పుకున్నారు. కార్నెడాట్ కూడా వారితో కలిశాడు.
కౌంట్ కార్డులను కలిపి పంచాడు.బూల్ దె స్విఫ్ కి 31 వచ్చాయి. ఆటపై ఆసక్తి త్వరలోనే ఆటగాళ్ల ఆందోళన తగ్గించింది. కానీ లూవాజో, అతని భార్య మోసం చేయడానికి జట్టు కట్టారని కార్నెడెట్ గమనించాడు. వారు భోజనానికి కూర్చోబోతుండగా మాన్షియర్ ఫాలోవి కనిపించాడు. తన గరుకు స్వరంతో ఇలా ప్రకటించాడు:
“మాడేమోజిల్ ఎలిజబెత్ రాసెట్ ఇప్పటికైనా తన మనసు మార్చుకుందేమో అడిగి రమ్మని ఆ ప్రష్యన్ అధికారి నన్ను పంపాడు.”
బూల్ డి స్విఫ్ ప్రాణం లేని దానిలా పాలిపోయి నిలబడింది. అకస్మాత్తుగా కోపంతో ఎర్రబడి ఆవేశంగా ఇలా అనింది.
“ఆ నీచుడిని,ఆ కుక్కని,కుళ్ళిన శవం లాంటి ఆ ప్రష్యన్ ని నేను ఎప్పటికీ అంగీకరించినని దయచేసి చెప్పండి-అర్థమైందా? ఎప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటికీ అంగీకరించను.”
ఆ సత్రం యజమాని గది నుండి వెళ్లిపోయాడు. అప్పుడు బూల్ ది స్వీఫ్ ని అందరూ చుట్టుమట్టారు. ఆ అధికారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఆ రహస్యాన్ని చెప్పమని నలువైపుల నుండి ఆమెను బతిమిలాడారు. ప్రశ్నించారు .ఆమె మొదట నిరాకరించింది.కానీ ఆ తర్వాత ఆమెకు కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. “అతనికి ఏం కావాలి?! నన్ను తన ఉంపుడు గత్తెగా ఉంచుకోవాలనుకుంటున్నాడు” అని ఆమె ఏడుస్తూ, అరిచింది.
ఆ మాటలకు ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అందరిలోనూ అంతటి తీవ్రమైన ఆగ్రహం రగులుతోంది. కార్నెడెట్, తన బీరు జగ్గును టేబుల్ మీద గట్టిగా కొట్టడంతో అది కాస్తా పగిలిపోయింది. ఆ నీచమైన సైనికుడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. అందరూ కోపంతో రగిలిపోయారు. ఆమె నుండి కోరిన త్యాగంలో కొంత భాగాన్ని తమలో ప్రతి ఒక్కరిని అడిగినట్లుగా, శత్రువును ఉమ్మడిగా ఎదిరించడానికి, వారంతా ఏకమయ్యారు. ఆ ప్రజలు ప్రాచీన కాలం నాటి అనాగరికల్లా ప్రవర్తిస్తున్నారని కౌంట్ తీవ్రంగా అసహ్యంతో ప్రకటించాడు. ముఖ్యంగా మహిళలు బూల్ దె స్విఫ్ పట్ల మానవత్వంతో కూడిన, సున్నితమైన సానుభూతిని వ్యక్తం చేశారు. భోజన సమయంలో మాత్రమే కనిపించే సన్యాసినులు తలదించుకుని ఏమీ మాట్లాడలేదు.
అయితే ఆ మొదటి ఆగ్రహవేశాలు తగ్గిన వెంటనే వారు భోజనం చేశారు. కానీ అందరూ ముక్తసరిగా మాట్లాడుకున్నారు. ఎక్కువగా ఆలోచించారు.
మహిళలు త్వరగానే నిద్రపోయారు. పురుషుల తమ పైపులు వెలిగించుకొని ‘ఎకార్టే’ ఆడుదామని ప్రతిపాదించారు. ఆ అధికారి మూర్ఖత్వాన్ని ఎలా వదిలించాలా, ఎలా తెలివిగా తప్పించుకునే పద్ధతులు ఆరా తీయాలన్న ఆశతో ఆటలో చేరాల్సిందిగా మాన్షియర్ ఫాలోవి ని ఆహ్వానించారు. కానీ అతను తన ఆట లో కార్డుల గురించి తప్ప మరేమీ ఆలోచించలేదు. దేనిని వినలేదు. దేనికి సమాధానం చెప్పలేదు. పదేపదే ఒకే మాట అన్నాడు. “ఆట మీద శ్రద్ధ పెట్టండి. పెద్దమనుషులూ, ఆట మీద శ్రద్ధ పెట్టండి.” అతని ధ్యాస అంతా ఆట పైనే ఉండడంతో ఆఖరికి కపం కూడా ఉమ్మడం మర్చిపోయాడు. ఫలితంగా అతని చాతి నుండి సంగీత వాయిద్యం లాంటి గురక శబ్దాలు రావడం మొదలు పెట్టాయి. ఉబ్బసంతో ఉన్న అతని ఊపిరితిత్తులు పీల్చే గాలి, లోతైన ఈల శబ్దం , తరువాత ఒకమాదిరి గుర గుర శబ్దం ఆ తరువాత , కూయడానికి ప్రయత్నిస్తున్న కోడిపుంజు చేసే కీచుమనే శబ్దం చేస్తున్నది.
నిద్రలో తూగుతూ అతని భార్య వచ్చి పడుకోడానికి రమ్మని పిలిచినప్పుడు అతను వెళ్లడానికి నిరాకరించాడు కాబట్టి ఆమె ఒంటరిగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె ఎప్పుడు సూర్యోదయంతో పాటు నిద్రలేచే అలవాటున్న మనిషి. కానీ అతను మాత్రం రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడానికి అలవాటు పడ్డాడు. స్నేహితులతో రాత్రంతా గడపడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతను కేవలం, “నేను తాగే ఆ పానీయం పొయ్యి దగ్గర పెట్టు” అని చెప్పి తన ఆటను కొనసాగించాడు. అతని నుండి ఎలాంటి సమాచారం రాబట్టలేమని గ్రహించిన మిగతా మగవాళ్ళు నిద్ర పోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించి, ఎవరి పడకల వద్దకు వాళ్ళు వెళ్లిపోయారు.
మర్నాడు ఉదయం వారు బయలుదేరడానికి అనుమతి లభించదనే సందిగ్ధతతో, మునుపెన్నడూ లేనంతగా వెళ్లాలనే బలమైన కోరికతో, ఆ దరిద్రపు చిన్న సత్రంలో మరో రోజు గడపాల్సి వస్తుందన్న భయంతో, చాలా పెందల కడనే నిద్రలేచారు. అయ్యో! గుర్రాలు అశ్వశాలలోనే ఉన్నాయి. బండితోలేవాడు ఎక్కడా కనిపించలేదు. ఏం చేయడానికీ పాలు పోక పోవడంతో, వారు బండి చుట్టూ తిరుగుతూ, తమ సమయాన్ని గడిపారు.
మధ్యాహ్న భోజనం చాలా నిరాశాజనకంగా సాగింది. బూల్ దె స్విఫ్ పట్ల అందరిలోనూ ఒక విధమైన నిరాసక్తత కనిపించింది. ఎందుకంటే, ఆలోచనలను రేకెత్తించిన ఆ రాత్రి, ఆమె పట్ల తోటి ప్రయాణికుల అభిప్రాయాలను కొంతవరకు మార్చేసింది. నిద్ర లేవగానే మిగతా వారందరికీ సంతోషాన్నిచ్చి, ఆశ్చర్యచకితులను చేసే విధంగా, ఆమె ఆ ప్రష్యన్ తో రహస్యంగా కలిసి ఉంటే బాగుండేది కదా అని భావించారు.అలా చేయకుండా తమని నిరాశ పరిచినందుకు ఉదయపు చల్లని వెలుగులో వారు ఆ యువతిపై దాదాపు ద్వేషాన్ని పెంచుకున్నారు. తాము ఈ రొంపి నుండి బయటపడడానికి అంతకంటే సులభమైన మార్గం ఏమంటుంది?
అంతేకాకుండా, ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? ఇతరుల కష్టాలను చూసి జాలిపడ్డానని అధికారికి చెప్పి, తన పరువు కాపాడుకొని ఉండవచ్చు. అలాంటి అడుగు వేయడం వల్ల ఆమెకు పోయేదేమీ లేదు. కానీ ఎవరూ ఇంకా అలాంటి ఆలోచనలను బయట పెట్టలేదు.
మధ్యాహ్నం అందరూ తీవ్రమైన విసుగుతో ఉండడం చూసి, కౌంట్ ఆ గ్రామం చుట్టుపక్కల కొద్దిసేపు నడిచి వద్దామని ప్రతిపాదించాడు. అందరూ చలి దుస్తులు బాగా కప్పుకుని చిన్న బృందంగా బయలుదేరారు. మంట దగ్గరే కూర్చోవడానికి ఇష్టపడిన కార్నెడెట్ ను, రోజంతా చర్చిలో లేదా మతాధికారుల నివాసంలో గడపడానికి అలవాటు పడిన ఇద్దరు సన్యాసులను మాత్రమే వారు వదిలిపెట్టి వెళ్లారు.
రోజురోజుకు తీవ్రమవుతున్న ఆచలి నడుస్తున్న వారి ముక్కులను, చెవులను దాదాపుగా గడ్డకట్టించింది. ప్రతి అడుగు ఒక శిక్షలాగా అనిపించేలా వారి పాదాలు నొప్పి పెట్టడం ప్రారంభించాయి. వారు ఊరి బయట ఉన్న బహిరంగ ప్రదేశానికి చేరుకునేసరికి అంతులేని తెల్లటి మంచు దుప్పటి కప్పుకొని, చాలా దుఃఖ భరితంగా నిరాశా జరకంగా కనిపించడంతో, వారందరూ మొద్దు బారిన శరీరాలతో బరువెక్కిన హృదయాలతో కంగారుగా వెను తిరిగారు.
నలుగురు మహిళలూ ముందు నడుస్తుండగా, ముగ్గురు పురుషులు వారి వెనక కొద్దిగా దూరంలో వారిని అనుసరించారు. పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా గ్రహించిన లూవాజో ఆవేశం తో “మనం ఈ నరకంలో ఇంకా ఎంతకాలం నిరీక్షించాల్సి చేస్తుందో” అని అకస్మాత్తుగా అన్నాడు. . ఎల్లప్పుడూ మర్యాదగా ఉండే కౌంట్ బదిలీస్తూ, “ఏ మహిళ నుండి అయినా మనం అంత బాధాకరమైన త్యాగాన్ని ఆశించకూడదని, ఆ మొదటి అడుగు ఆమె వైపు నుండే రావాలని అన్నాడు. ఒకవేళ ఫ్రెంచ్ వారు మాట్లాడుకుంటున్నట్టుగా డైప్సి మార్గం గుండా ఎదురు దాడికి దిగితే, శత్రువులతో వారి పోరాటం తప్పనిసరిగా టోటెస్ లోనే జరుగుతుందని, మన్ష్యూర్ కార్నె లామడన్ వ్యాఖ్యానించారు. ఆ ఆలోచన మిగతా ఇద్దరినీ ఆందోళనకు గురిచేసింది.
“మనం కాలినడకన తప్పించుకుంటే ఎలా ఉంటుంది?” అని లూవాజో ప్రతిపాదించాడు .
కౌంట్ తన భుజాలు ఎగరేస్తూ, “ఈ మంచులో అలాంటి విషయం గురించి ఎలా ఆలోచించగలరు? అది కూడా మన భార్యలతో కలిసి. అంతేకాకుండా జర్మన్లు వెంటనే మనల్ని వెంబడిస్తారు. 10 నిమిషాల్లో పట్టుబడతాం. ఆ సైనికులు దయాదాక్షణ్యాలపై ఆధారపడేలా ఖైదీలుగా తిరిగి తీసుకువస్తారు. ఇది వాస్తవం.” మిగిలిన వారు మౌనంగా ఉండిపోయారు.
మహిళలు దుస్తులు గురించి మాట్లాడుకున్నారు. కానీ వారి మధ్య ఒక విధమైన ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్నట్టు అనిపించింది.
అకస్మాత్తుగా వీధి చివర జర్మన్ అధికారి కనిపించాడు. అతని పొడవైన సన్నని నడుముతో ఉన్న యూనిఫామ్ ఆకారం,మంచును తగులుతున్న అంచులు, స్పష్టంగా కనిపించాయి. తను జాగ్రత్తగా పోలిష్ చేసుకున్న బూట్లు మురికి కాకూడదనే ఆత్రుత ఎప్పుడూ ఉండే సైనికులకు మాత్రమే నడిచే ప్రత్యేకమైన తరహా లో, అతను మోకాళ్ళను కొంచెం దూరంగా ఉంచి నడుస్తున్నాడు. అతను మహిళలను దాటి వెళుతున్నప్పుడు, తలవంచి అభివాదం చేశాడు. ఆపై పురుషుల వైపు అసహ్యంగా చూశాడు. లూవాజో తన టోపీని తీయడానికి ప్రయత్నించినప్పటికీ మిగతావారు తమ టోపీలు తీయకూడదని నిర్ణయించు కొని తగినంత ఆత్మాభిమానాన్ని ప్రదర్శించారు.
బూల్ డి స్విఫ్ సిగ్గుతో ముడుచుకు పోయింది ,బుగ్గలు ఎర్రబడి పోయాయి. సైనికుడు ఏమాత్రం మర్యాద లేకుండా ప్రవర్తించిన ఆ యువతితోనే కలిసి నడుస్తూండగా తాము, అదే సైనికుడి కంట పడడం, ఆ ముగ్గురు వివాహిత మహిళలకు వర్ణించలేనంత అవమానకరంగా అనిపించింది.
ఆ తర్వాత మేడం కారే-లమడొన్, అతని గురించి, అతని ఆకృతి గురించి, అతని ముఖకవళికల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చాలామంది అధికారులు పరిచయం ఉండి, వారిని అంచనా వేయడంలో నైపుణ్యం గల మేడం కారే -లమడొన్, అతను చూడడానికేమాత్రం చెడ్డవాడిగా లేడని అంచనాకు వచ్చింది. అతను ఫ్రెంచ్ జాతీయుడు కాకపోవడం వల్ల ఆమె బాధపడింది కూడా. ఎందుకంటే, ఒకవేళ అతనే గనుక ఫ్రెంచ్ వాడు అయి ఉంటే, మహిళలందరూ ఖచ్చితంగా ప్రేమలో పడేలా ఉన్నాడని అభిప్రాయపడింది.
వారు మళ్లీ గదికి చేరుకున్న తర్వాత కూడా ఏ పని చేయడానికి తోచక అలా ఉండిపోయారు. అత్యంత చిన్న విషయాలకు కూడా వారి మధ్య పరుషమైన మాటలు వినిపించాయి. నిశ్శబ్దంగా సాగిన రాత్రి భోజనం త్వరగా ముగిసింది. సమయాన్ని గడపడానికి నిద్ర పోవాలనే ఆశతో ప్రతి ఒక్కరు త్వరగానే పడకల వద్దకు వెళ్లారు.మర్నాడు పొద్దున్న అలసిన ముఖాలతో, చికాకుగా , కోపంగా కిందకు వచ్చారు. మహిళలు ఎవరూ దాదాపు మాట్లాడలేదు.
చర్చి గంట బాప్టిజం పట్ల విశ్వాసం ఉన్న వారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించింది. బూల్ డి స్విఫ్ కి రైతుల వద్ద పెరుగుతున్న ఒక బిడ్డ ఉన్నాడు. ఆమె సంవత్సరానికి ఒకసారి కూడా వాడిని చూసేది కాదు. వాడి గురించి అసలు ఆలోచించేది కాదు. కానీ బాప్టిజం పొందుతున్న ఆ బిడ్డ ఆలోచన రాగానే, తన బిడ్డ పట్ల ఆకస్మాత్తుగా ఒక మాతృమూర్తి ప్రేమ ఉప్పొంగింది. దాంతో ఆ కార్యక్రమానికి తాను కూడా హాజరు కావాలని ఆమె పట్టు పట్టింది.
ఆమె అటు బయటకు వెళ్ళగానే మిగతా వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, తమ కుర్చీలను దగ్గరగా జరుపుకున్నారు. ఎందుకంటే, ఏదో ఒకటి చేసి బయట పడాలని నిర్ణయించుకున్నారు. లూవాజోకు ఒక ఆలోచన తట్టింది. ఆమెను మాత్రమే ఉంచుకొని మిగతా వారిని పంపమని అడగాలని అతను ప్రతిపాదించాడు.
ఆ పనిని మాన్సియర్ ఫాలోవి కి అప్పగించారు. కానీ అతను వెళ్ళిన వెంటనే తిరిగి వచ్చాడు. మానవుని నైజం తెలిసిన ఆ జర్మన్, అతనికి వెళ్ళిన వెంటనే గుమ్మం చూపించాడు. తన షరతు నెరవేరే వరకు ప్రయాణికులు అందర్నీ అక్కడే ఉంచాలని అతను నిర్ణయించుకున్నాడు.
దాంతో మేడం లూవాజో లోని అసభ్యకర స్వభావం హద్దులు మీరింది. “మనం ముసలి వాళ్ళమై, ఇక్కడే చావ బోవడం లేదు కదా,” అని ఆమె అరిచింది.” మగాళ్ళతో అలా ప్రవర్తించడమే ఆమె వృత్తి అయినప్పుడు, ఒకరిని కాదని అనే హక్కు ఆమెకు ఉందని నేను అనుకోను. రౌడీ
లలో సహా ఆమెకు రుయెన్ లో దొరికిన ఏ ఒక్కరిని వదల లేదని నేను మీకు చెప్పగలను. నిజంగానే మేడమ్, ప్రభుత్వ అధికారుల నుండి బండి తోలే వాడి వరకు. ఇది నిజమని నాకు కచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆ బండి తోలే వాడు మా దగ్గర వైన్ కొంటాడు. మరి ఇప్పుడు మమ్మల్ని ఒక కష్టం నుండి బయట పడేసే సమయం వచ్చేసరికి ఆమె ప్రతివత లాగా నటిస్తోంది. నిజానికి ఆ జర్మన్ బాగా ప్రవర్తించాడని అనిపిస్తోంది. ఎందుకంటే మనం ముగ్గురం ఉన్నాం. కచ్చితంగా ఎవరినైనా అతను ఇష్టపడి ఉండొచ్చు. కానీ లేదు. అందరికీ అందుబాటులో ఉండే ఆ అమ్మాయితోనే సరిపెట్టుకున్నాడు. అతను వివాహిత మహిళలను గౌరవిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. అతను ఇక్కడ యజమాని. అతను నాకు కావాలి అని ఒక మాట చెప్తే చాలు, తన సైనికుల సహాయంతో మనల్ని బలవంతంగా తీసుకెళ్లి ఉండవచ్చు.”
మిగతా ఇద్దరు మహిళలు వణికిపోయారు. నిజంగానే తమపై దాడి చేసి బలవంతం చేస్తున్నట్టుగా భావించుకున్న అందమైన మేడమ్ కారే లమడోన్ ముఖం ఒక్క సారిగా పాలిపోయింది.
తమలో తాము ఈ విషయం గురించి చర్చించుకుంటున్న పురుషులు వారి దగ్గరకు వచ్చారు. తీవ్రమైన కోపంతో లూవాజో, “ఆ దిక్కుమాలిన స్త్రీ కాళ్లు చేతులు కట్టేసి పడేసి అయినా శత్రువులకు అప్పగించడానికి సిద్ధ పడాలని” అనింది. కానీ మూడు తరాల రాయబారుల వంశం నుండి వచ్చిన, దౌత్య లక్షణాలు కల కౌంట్ వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని సూచించాడు.
“మనం ఆమెని ఒప్పించాలి” అని అన్నాడు.
అప్పుడు ఇక తమ పథక రచనను ప్రారంభించారు .
మహిళలు ఒకరి దగ్గరకు ఒకరు చేరారు. వారు తగ్గు స్వరాలతో తమ అభిప్రాయాలను తెలుపుతూ ఆ చర్చను సాధారణీకరించారు. అయితే, వారి సంభాషణ ఏ మాత్రం అసభ్యంగా లేదు. అత్యంత అభ్యంతరకరమైన విషయాలను వివరించడానికి కూడా ఆ మహిళలు సున్నితమైన పదాలను, ఆకర్షణీయమైన వ్యక్తికరణలను ఉపయోగించారు. వారు ఉపయోగించిన భాష ఎంత పకడ్బందీగా ఉందంటే కొత్త వారెవరికైనా వారి మాటల్లోనే మర్మం ఏమాత్రం అర్థం కాదు. కానీ ప్రపంచంలోని ప్రతి మహిళకు ఉండే సిగ్గు తెర కేవలం ఉపరితలానికే పరిమితం అని గ్రహించిన వారు, ఆ అరాచక ప్రేమ ఘట్టాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు. ఇతరుల కోసం విందు భోజనం సిద్ధం చేసే వంటవాడి ఉత్సాహంతో, ఈ అక్రమ సంబంధాన్ని ప్రోత్సహిస్తూ, తమకు ఇష్టమైనట్టుగా మనసులో లోలోతులలో ఎంతో సంతోషించారు.
చివరకు ఆ వ్యవహారమంతా వారికి చాలా వినోదభరితంగా అనిపించడంతో, వారిలో ఉత్సాహం దానంతట అదే తిరిగి వచ్చింది. కౌంట్, కొంచెం ప్రమాదకరమైన జోకులు వేశాడు. కానీ అవి ఎంత లౌక్యంగా ఉన్నాయంటే, వినే వారు నవ్వాపుకోలేకపోయారు. లూవాజో తన వంతుగా మరికొన్ని మోటు జోకులు వేశాడు. కానీ అవి ఎవరికీ నచ్చలేదు. అతని భార్య, అంత కఠినంగా సూటిగా వ్యక్తపరిచిన ఆలోచన అందరి మనసులలోనూ మెదులుతోంది.
అది ఆ అమ్మాయి వృత్తి అయినప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు తిరస్కరించాలి? ఒకవేళ తానే బూల్ దె స్విఫ్ స్థానంలో ఉంటే, అతన్ని తిరస్కరించడానికి ఏమాత్రం వెనుకాడే దానిని కాదని సున్నతంగా కనబడే మేడం కారే లమడోన్ కూడా భావించినట్టు కనిపిస్తుంది.
ఒక కోటను ముట్టడించాలని అనుకుంటే ఎలా సన్నాహాలు చేస్తారో, అంత జాగ్రత్తగా వారు తమ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఎవరెవరు ఏ పాత్ర పోషించాలి,ఎలాంటి బోధలు చేయాలి, ఎలాంటి ఎత్తుగడలు వేయాలి, అని ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు.వారు, ప్రచార వ్యూహాన్ని, తాము ఉపయోగించాల్సిన ఉపాయాలను, ఈ మానవ కోటను లొంగదీసుకుని, శత్రువులను దాని గోడల లోపలికి అనుమతించడానికి చేయాల్సిన ఆకస్మిక దాడుల ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.
కానీ కార్నెడెట్ మాత్రం ఆ కుట్రలో ఎలాంటి పాలు పంచుకోకుండా దూరంగా ఉన్నాడు.
అందరూ ఇంత తీవ్రంగా ఈ పధక రచనలలో నిమగ్నమై;పోయారంటే, బూల్ దె స్విఫ్ లోపలికి రావడం దాదాపుగా ఎవరూ గమనించలేదు. కానీ కౌంట్ నెమ్మదిగా గుసగుసలాడుతూ హెచ్చరిక చేయడంతో మిగతావారు తలెత్తి చూసారు. ఆమె అక్కడే ఉంది. వారంతా అకస్మాత్తుగా మాట్లాడడం ఆపేశారు. ఒక విధమైన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడి, కొద్ది క్షణాల పాటు వారు ఆమెతో మాట్లాడ లేకపోయారు. కానీ ఇతరుల కంటే ఎక్కువ లౌక్యం తెలిసిన కౌంటెస్, “బాప్టిజం ఆసక్తి కరంగా ఉందా?” అని అడిగింది.
ఆ అమ్మాయి ఇంకా అదే భావోద్వేగంలో ఉండి, తాను చూసినవి, విన్నవి, అక్కడున్న వారి ముఖాలు, వారి ప్రవర్తన, చర్చి వాతావరణం,-అన్నింటిని వివరించింది. “అప్పుడప్పుడు ప్రార్థన చేయడం మనిషికి మంచి చేస్తుంది” అని ఆమె ముగించింది.
మధ్యాహ్నం భోజన సమయం వరకు ఆ మహిళలు ఆమెతో చాలా మర్యాదగా, స్నేహపూర్వకంగా ఉండడానికి పరిమితమయ్యారు. తద్వారా ఆమెకు వారిపై నమ్మకం పెరుగుతుందని, వారు ఇచ్చే సలహాలు వింటుందని భావించారు.
వారు టేబుల్ దగ్గర కుర్చీల్లో కూర్చోగానే దాడి ప్రారంభమైంది. మొదట వారు ఆత్మార్పణ గురించి ఒక అస్పష్టమైన సంభాషణను ప్రారంభించారు. ప్రాచీన కాలం నాటి ఉదాహరణలను ఉటంకించారు. సందర్భం కాకపోయినా జుడిత్ , హోలోఫర్నెస్ ల గురించి, లుక్రెస్ , సెక్స్ టస్ ల గురించి చెప్పారు. తమ అందచందాల తో రోమ్ లోని మ్యాట్రన్స్ శత్రుదేశాల జనరల్ హనీ బాల్ ను, అతని అనుచరులను స్వాధీన పరుసుకున్న వైనం, సైన్యాధ్యక్షులను బానిసలుగా మార్చుకున్న క్లియోపాత్రా గురించి చెప్పారు. అజ్ఞాన కోటీశ్వరుల కల్పనల నుండి పుట్టిన ఒక అసాధారణ కథలను చెప్పారు. విజేతల ప్రగతిని ఆపి తమ శరీరాలనే ఒక యుద్ధ భూమిగా, పాలనా సాధనంగా, ఆయుధంగా మార్చుకున్న తీరును,ఆ ద్వేషించబడే వ్యక్తులను లొంగదీసుకుని, ప్రతీకారం, అంకిత భావం కోసం తమ పవిత్రతను త్యాగం చేసిన వారిని కీర్తించారు.
అదంతా చాలా మర్యాదగా, హుందాగా చెప్పారు. మధ్య మధ్యలో ఆమెకు స్ఫూర్తినిచ్చే లాగా బలవంతపు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, దాని ప్రభావాన్ని మరింత పెంచారు.
వినేవారికి భూమిపై స్త్రీ పాత్ర అంటేనే, తన శరీరాన్ని నిరంతరం త్యాగం చేయడమేనని శత్రు సేనలు ఇష్టా ఇష్టాలకు తనను తాను ఎప్పుడూ అర్పించుకోవడమేనని అనిపించేలా వారు మాట్లాడారు.
ఆ ఇద్దరు సన్యాసినిలు ఏమీ విననట్లు తమ ఆలోచనలలో మునిగిపోయినట్లు కనిపించారు. బూల్ డి స్విఫ్ కూడా మౌనంగా ఉండిపోయింది.
ఆ మధ్యాహ్నమంతా ఆమె తన ఆలోచనలోనే గడిపేలా వదిలేశారు. కానీ అంతకు ముందు ఆమెను మేడం అని పిలిచిన తోటి ప్రయాణికులు, ఇప్పుడు ఎందుకో సరిగ్గా తెలియకపోయినా, ఆమె పొందిన గౌరవాన్ని ఒక మెట్టు దింపాలనే ఉద్దేశంతో, ఆమె తన దిగజారిన స్థాయిని గ్రహించేలా చేయాలని ఉద్దేశంతో, ఆమెను కేవలం మడెమోసెల్ అని మాత్రమే పిలిచారు.
సరిగ్గా సూప్ వడ్డిస్తున్న సమయంలో, ఫాలోవి కనిపించి, క్రితం రోజు రాత్రి తాను చెప్పిన మాటలనే పునరావృతం చేశాడు.
బూల్ దె స్విఫ్ క్లుప్తంగా “లేదు, మాన్షియర్” అని బదులిచ్చింది.
కానీ రాత్రి భోజన సమయంలో ఆ కూటమి బలహీన పడింది. లూవాజో మూడు అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఆత్మలకు సంబంధించిన మరిన్ని ఉదాహరణల కోసం ప్రతి ఒక్కరూ తమ బుర్రలను పదును పెడుతున్నారు. కానీ వారికి ఏమీ తట్టలేదు. అప్పుడు మేడం కౌంట్, ఎలాంటి దురుద్దేశం లేకుండానే, మతానికి గౌరవం ఇవ్వాలని అస్పష్టమైన కోరికతో సాధువుల జీవితాల్లోని అత్యంత ఆశ్చర్యకరమైన వాస్తవాల గురించి ఇద్దరు సన్యాసులలో పెద్ద ఆవిడను ప్రశ్నించడం ప్రారంభించింది. వారిలో చాలామంది మన దృష్టిలో నేరస్తులుగా పరిగణించబడే పనులు చేశారని, కానీ దేవుని మహిమ కోసం లేదా మానవాళి మేలు కోసం చేసినప్పుడు, చర్చి అటువంటి చర్యలను సులభంగా క్షమిస్తుందని ఆమె మాటల ద్వారా తెలిసింది. ఇది చాలా బలమైన వాదన. కౌంటెస్ దీనిని పూర్తిగా వాడుకుంది .ఆ తర్వాత వారందరి మధ్య ఉన్న నిశ్శబ్ద అవగాహన వలన లేదా మతపరమైన వస్త్రాలు ధరించే వారికి అలవాటైన అణుకువను నటించడం వలన లేదా కేవలం మూర్ఖత్వం వలన, వారి పథకాలను ముందుకు తీసుకెళ్లడానికి అద్భుతంగా సరిపోయిన ఆ మూర్ఖత్వం వల్ల, ఆ ముసలి సన్యాసిని, కుట్ర దారులకు ఊహంచని గొప్ప సహాయం అందించింది. వారు ఆమె పిరికిది అనుకున్నారు. కానీ ఆమె ధైర్యంగా ఎక్కువగా మాట్లాడే దానిగా, మూర్ఖపు పట్టింపులు కలదిగా నిరూపించుకుంది. ఆమె ఏ విషయానికి లోతుపాతుల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆమె సిద్ధాంతాలను ఆమె విశ్వాసాలను సందేహించ వలసిన అవసరం లేదు. ఆమె మనస్సాక్షికి ఎటువంటి అపరాధ భావన లేదు. అబ్రహం చేసిన త్యాగాన్ని ఆమె చాలా సహజమైనదిగా భావించింది. ఎందుకంటే దేవుడు నుండి అలాంటి ఆదేశం వస్తే తన సొంత తల్లిదండ్రులను ఇద్దర్నీ చంపడానికి కూడా ఆమె వెనకాడేది కాదు. ఆమె అభిప్రాయం ప్రకారం ఉద్దేశం ప్రశంసనీయమైనదైతే, మన ప్రభువును అసంతృప్తి పరచకూడదు. కౌంట్ ఊహించని మిత్రురాలి ఉన్నత పవిత్రమైన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని, ఒక వర్గానికి చెందిన నీతిమంతులు చెప్పే ఒక సిద్ధాంతాన్ని,
“నిర్ణయించుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఏ మార్గాన్నయినా అనుసరించ వచ్చు.” దానిని సుదీర్ఘంగా,స్పష్టంగా వివరించేలా ఆమెను ప్రోత్సహించింది.
“అయితే సిస్టర్ ఉద్దేశం స్వచ్ఛమైనది అయినప్పుడు, దేవుడు అన్నిరకాల పద్ధతులను అంగీకరిస్తాడని, చేసిన పనిని క్షమిస్తాడని మీరు భావిస్తున్నారా”అని అడిగింది.
“నిస్సందేహంగా. మనం సహజంగా తప్పు పట్టదగిన పనే అయినా కూడా, దాని స్ఫూర్తినిచ్చే ఆలోచన నుండి యోగ్యతను పొందుతుంది.”
ఈ విధంగా వారు దేవుని కోరికలను అంచనా వేస్తూ, ఆయన తీర్పులను ఊహిస్తూ, ఆయనకు ఏమాత్రం సంబంధం లేని విషయాలపై ఆయన ఆసక్తి చూపుతున్నట్టుగా వివరిస్తూ మాట్లాడుకున్నారు.
ఇదంతా చాలా జాగ్రత్తగా విచక్షణతో చెప్పారు. కానీ సన్యాసిని దుస్తుల్లో ఉన్న ఆ పవిత్ర మహిళ పలికిన ప్రతి మాట, ఆ వేశ్య చూపిస్తున్న ఆగ్రహాన్ని, ప్రతిఘటనని బలహీనపరిచింది. ఆ తర్వాత సంభాషణ కొద్దిగా దారి మళ్ళింది. సన్యాసిని తన మతపరమైన ఆశ్రమాల గురించి, తన పై అధికారి గురించి, తన గురించి, తన పక్కన ఉన్న సున్నితమైన సిస్టర్ సెయింట్ నైస్ ఫోర్ గురించి మాట్లాడడం ప్రారంభించింది. మసూచి వ్యాధితో ఆసుపత్రుల్లో ఉన్న వందలాదిమంది సైనికులకు సేవ చేయడానికి వారిని పిలిపించారు. ఆమె రోగుల పట్ల చూపే దయను, వారి వ్యాధిని వర్ణించింది. మూర్ఖత్వం వల్ల వారు మధ్యలో ఆగిపోయిన సమయంలో, వారు రక్షించ గలిగే ఎంతోమంది ఫ్రెంచ్ సైనికులు చనిపోతూ ఉండి ఉండవచ్చు. ఎందుకంటే, సైనికులకు సేవ చేయడమే ఆ ముసలి సన్యాసిని ప్రత్యేకత. ఆమె క్రిమ్యాలో, ఇటలీలో, ఆస్ట్రియాలో, పనిచేసింది. ఆమె తన యుద్ధ శిబిరాల కథలను చెబుతున్నప్పుడు, యుద్ధం మధ్యలో గాయపడిన వారిని కాపాడడానికి ఏ జనరల్ కంటే కూడా సమర్థవంతంగా, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, కఠినమైన క్రమశిక్షణ లేని సైనికులను అదుపు చేయడానికి ప్రకృతిచేత సృష్టించబడిన పవిత్ర సిస్టర్లలో ఒకరిగా, తనను తాను చెప్పుకుంది. ఆమె ముడతలు పడిన, మచ్చలున్న ముఖమే యుద్ధ వినాసాలకు ఒక ప్రతిబింబం.
ఆమె మాటల అద్భుతమైన ప్రభావాన్ని తమ మాటలు తగ్గిస్తాయనే భయంతో ఆమె చెప్పడం ముగిసిన తర్వాత ఎవరూ మాట్లాడలేదు.
భోజనం పూర్తయిన వెంటనే ప్రయాణికులు తమ తమ గదులకు వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చారు.
మధ్యాహ్న భోజనం ప్రశాంతంగా గడిచింది. ముందు రోజు సాయంత్రం నాటిన విత్తనం మొలకెత్తి ఫలాలు ఇవ్వడానికి సమయం ఇస్తున్నారు.
మధ్యాహ్నం కౌంటెస్ నడవడానికి వెళదామని ప్రతిపాదించింది. అప్పుడు ముందుగా నిర్ణయించుకున్నట్టుగా కౌంట్, బూల్ దె స్విఫ్ చేయి పట్టుకుని మిగతా వారికి దూరంగా ఆమెతోపాటు నడిచాడు.
అతని వర్గానికి చెందిన పురుషులు ఆమెలాంటి మహిళలతో మాట్లాడేటప్పుడు ఉపయోగించే పితృ సమానమైన భాష -కాస్త తృణీకారం తో కూడిన స్వరంతో-ఆమెను నా ప్రియమైన బిడ్డా, అని పిలుస్తూ, తన ఉన్నత సామాజిక హోదాలో, మచ్చలేని కీర్తి శిఖరం నుండి ఆమెను చిన్న చూపు చూసి మాట్లాడుతూ, ఆమెతో మాటలు ప్రారంభించాడు. అతను నేరుగా విషయానికి వచ్చేసాడు.
అంటే, నీ జీవితంలో నీవు ఎన్నోసార్లు చేసినట్టుగా, “నిన్ను నీవు అర్పించు కోవడానికి అంగీకరించకుండా, ప్రష్యన్ దళాలను తిరస్కరించడం వల్ల వచ్చే అన్ని రకాల హింసలకు, మమ్మల్ని ఇక్కడ వదిలి పెట్టాలని నీవు అనుకుంటున్నావా?”
ఆ యువతి సమాధానం చెప్పలేదు.
అతను దయ, వాదన, సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగించాడు. తనను తాను కౌంట్ గానే భావించుకుంటూనే అవసరమైనప్పుడు శౌర్యాన్ని ప్రదర్శిస్తూ, ఆకర్షణీయమైన, ఇంకా చెప్పాలంటే సున్నితమైన మాటలను వాడాడు. ఆమె వారికి చేయబోయే సేవను ఆకాశానికి ఎత్తాడు. వారి కృతజ్ఞత గురించి మాట్లాడాడు. అప్పుడు అకస్మాత్తుగా మరింత చనువు తీసుకుని సంబోధిస్తూ,
“నీకు తెలుసా, నా ప్రియమైన అమ్మాయి, తన సొంత దేశంలో సాధారణంగా దొరకని నీలాంటి ఒక అందమైన అమ్మాయిని జయించానని అతను గొప్పగా చెప్పుకో గలడు.”
బూల్ దె స్విఫ్ సమాధానం చెప్పలేదు. మిగతా వారితో వెళ్లి కలిసింది.
వారు తిరిగి వచ్చిన వెంటనే ఆమె తన గదికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. అందరి ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. ఆమె ఏం చేస్తుంది? ఆమె ఇంకా వ్యతిరేకిస్తే వాళ్ళందరికీ ఎంత ఇబ్బందికరం!
భోజన సమయం అయింది. ఆమె కోసం వారు చూసిన ఎదురుచూపులు వృధా అయ్యాయి. చివరకు ఆరోగ్యం బాగోలేదని, వారు భోజనానికి కూర్చోవచ్చని ఫోలొవి ప్రకటించడం అందరూ చెవులు నిక్కబడుచుకుని విన్నారు. కౌంట్ సత్రం యజమాని దగ్గరికి వెళ్లి గుసగుసలాడాడు.
“అంతా సవ్యంగానే జరిగిందా?”
“జరిగింది.”
మర్యాద కోసం అతను తన తోటి వారితో ఏమీ చెప్పలేదు, కానీ వారి వైపు కొద్దిగా చూసి తలూపాడు. అందరూ గుండె నిండా గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరి కళ్ళలో సంతోషంతో వెలిగిపోయింది.
“దేవుడి సాక్షిగా” అని అరిచాడు లూవాజో. ఇక్కడ షాంపైన్ దొరికితే గనక అందరికీ నేనే పార్టీ ఇస్తాను.”
ఆ సత్రం యజమాని చేతుల్లో నాలుగు సీసాలతో తిరిగి వచ్చినప్పుడు మేడం లూవాజో కి కలిగిన నిరాశ అంతా ఇంతా కాదు. అయినప్పటికీ అందరూ అకస్మాత్తుగా మాటకారులుగా, ఉల్లాసంగా మారారు. అందరి హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మేడం కారె లామడొన్ చాలా ఆకర్షణీయంగా ఉందని కౌంట్ మొదటిసారిగా గమనించినట్లు అనిపించింది. పొగిడాడు. సంభాషణ ఉత్సాహంగా, చురుకుగా, తెలివిగా సాగింది. చాలా జోకులు అత్యంత చెత్తగా ఉన్నప్పటికీ అందరూ వాటికి నవ్వుకున్నారు. ఎవరు నొచ్చు కోలేదు. ఎందుకంటే ఇతర భావోద్వేగాల మాదిరి గానే ఆగ్రహం కూడా పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. క్రమంగా అక్కడి మానసిక వాతావరణం అంతా అసభ్య కరమైన ఊహలు, మురికి ఆలోచనలతో నిండిపోయింది.
డెసర్ట్ సమయంలో మహిళలు కూడా గుంభనంగా సున్నితమైన పదాలతో కూడిన సూచనలు చేశారు. వారి చూపులు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. వారు బాగా మద్యం సేవించారు. కౌంట్, తన విశ్రాంతి సమయాల్లో కూడా హుందాతనాన్ని నిలుపుకుంటూ, ప్రస్తుత పరిస్థితిని ఉత్తర ధ్రువంలో ఒంటరిగా మంచు ప్రదేశాలలో శీతాకాలం అంతా చేసిన ప్రయాణం ముగింపును, తాము ప్రయాణిస్తున్న ఓడ పగిలి, దిక్కు తోచని స్థితిలో ఉన్న నావికులకు దక్షిణ దిశగా ఒక మార్గం కనుగొన్న సంతోషంతో పోల్చాడు. ఆ పోలికను అందరూ ఎంతో మెచ్చుకున్నారు.
తన సహజ సిద్ధమైన ఉత్సాహంతో ఉన్న లూవాజో షాంపైన్ గ్లాసులు పైకెత్తి పట్టుకుని లేచి నిలబడ్డాడు.
“మన విముక్తికి గుర్తుగా నేను తాగుతున్నాను” అని అరిచాడు.
అందరూ లేచి నిలబడి హర్షద్వానాలతో ఆ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ ఇద్దరు సన్యాసులు కూడా మహిళల ఒత్తిడికి తలఒగ్గి ఇంతకుముందు ఎప్పుడూ రుచి చూడని ఆ నురుగుతో కూడిన వైన్తో తమ పెదవులను తడుపుకోవడానికి అంగీకరించారు. అది పొంగుతున్న లేమడన్ లాగా ఉందని, కానీ మరింత ఆహ్లాదకరమైన రుచితో ఉందని వారు అన్నారు.
“ఇక్కడ పియానో లేకపోవడం విచారకరం” అన్నాడు లూవాజో; “లేకపోతే మనం కాస్త క్వాడ్రిల్ నృత్యం చేసి ఉండేవాళ్లం”
కార్నెడెట్ ఒక మాట కూడా మాట్లాడలేదు. కాస్తంత కదలిక కూడా లేదు. అతను తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయినట్టు కనిపించాడు. అప్పుడప్పుడు తన పొడుగాటి గడ్డాన్ని మరింత పొడవుగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా, కోపంగా లాగుతున్నాడు. చివరికి అర్థరాత్రి సమయంలో వారంతా విడిపోయి పడుకోబోతున్నప్పుడు, అడుగులు తడబడుతున్న లూవాజో అకస్మాత్తుగా, అతని వీపుపై తట్టి మందపాటి స్వరంతో ,
“నువ్వు ఈ రాత్రి ఉల్లాసంగా లేవు. ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నావు మిత్రమా?” అన్నాడు.
కార్నెడెట్ తన తలను వెనక్కి తిప్పి అక్కడ గుమి కూడిన వారిపై ఒక చురుకైన అసహ్యకరమైన చూపు విసిరి,
“నేను మీకు అందరికీ చెబుతున్నాను. మీరు చాలా నీచమైన పని చేశారు!” అని బదులిచ్చాడు.
అతను లేచి గుమ్మాన్ని చేరుకొని, “నీచమైన పని” అని మళ్ళీ అంటూ అదృశ్యమయ్యాడు.
అందరిలోనూ వణుకు పుట్టింది. క్షణకాలం మూర్ఖంగా, గందరగోళంగా కనిపించాడు. కానీ వెంటనే తేరుకొని నవ్వుతూ ఇలా అరిచాడు.
“నిజంగా మీరందరూ దేనికీ పనికిరాని అమాయకులు!”
వివరణ అడిగినప్పుడు అతను కారిడార్ రహస్యాలను వివరించాడు. అది విన్నవారు చాలా ఆనందించారు. మహిళలు ఆ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. కౌంట్,కళ్ళల్లో నీళ్లు వచ్చేంతగా నవ్వారు. తమ చెవులను తామే నమ్మలేకపోయారు.
” ఏమిటి మీకు కచ్చితంగా తెలుసా ?అతను అనుకున్నది..”
“నా కళ్ళతో నేనే చూశానని మీకు చెబుతున్నాను కదా.”
“మరి ఆమె నిరాకరించిందా?”
“ఎందుకంటే, పక్క గదిలో ఆ ప్రష్యన్
