నీడ

Spread the love

అగ్ని హోత్రం లో పురోహితుడు నెయ్యి వేసేసరికి పవిత్రాగ్ని మరింతగా ప్రజ్వరిల్లింది.అది నా పెళ్లి రోజు. వరుడుగా నేనూ, వధువుగా లత కల్యాణ మండపం లో పక్కపక్కనే కూర్చుని వున్నాము. పురోహితుడు లత కుడి చేతిని,నా  కుడిఅర చేతి మీది పెట్టించి, కలసిన మా చేతుల మీద దర్భ ను ఉంచి గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు.

సరిగ్గా అప్పుడు నేను కళ్ళెత్తి అతడిని చూసాను.

అతడు సరిగ్గా నాకు ఎదురుగా నిలుచుని వున్నాడు. అతడి కళ్ళు కల్యాణ వేదిక మీద తారాడుతున్నాయి. ఒక చిన్న వణుకు నా శరీరంలో! కళ్ళు మూసుకున్నాను కానీ అతడిని మళ్ళీ చూడాలి అన్న కోరికను మాత్రం నిలువరించలేకపోయాను. అతడు అక్కడ అలాగే ఏ మాత్రం మార్పు లేకుండా నిలబడివున్నాడు, అతడి కళ్ళు నా మీదే వున్నాయి. ఇరవై ఏళ్ళ క్రితం అతడు పోషించిన అర్జునుడు పాత్రలో, అందమైన దుస్తులలో మెరిసిపోతున్న రాజకుమారుడిలా, నిలబడి వున్నాడు.

నేనేమైనా భ్రమ పడుతున్నానా?

నా చేతికున్న వాచీలోకి చూసుకున్నాను. తెల్లవారుజామున మూడు అవుతున్నది.

అతిథులు, పెళ్ళికి వచ్చిన చుట్టపక్కాలు అందరూ వెళ్లిపోయారు. అతడి వైపుచూడవద్దు అని ఎంత గట్టిగా అనుకున్నా చూడకుండా ఉండలేకపోయాను. చూసి మళ్ళీ భ్రమ,వాస్తవాల నడుమ చిక్కుబడిపోయాను. అతడీవేళ ఇక్కడ ఎందుకు కనపడాలి? అదీ ఈ ఉత్సవ సందడిలో! ఇరవై ఏళ్ళ నుండి ఒక్కసారి కూడా కనపడని వాడు ఈ తెల్లవారుజామున ఇప్పుడెందుకు కనపడాలి?

అతడి వంక మళ్ళీ చూసాను. అయితే ఈ సారి అతడు అక్కడ లేదు. ఒక దీర్ఘ నిశ్వాస నా గుండెల్లోనుండి బయటకు వెలువడింది. నాలుగు రోజుల నుండీ  పెళ్లికొడుకుగా రకరకాల కార్యక్రమాలలో పాల్గొనడం చేత

సరిగా నిద్రా, ఆహరం లేకపోవడం తో చాలా అలసటగా వుంది నాకు.  కళ్ళు మూతలు పడుతున్నాయి. నా కళ్ళు ఏమైనా నన్ను మోసం చేస్తున్నాయా? లేదు. ఇదంతా ఒత్తిడి వల్ల వచ్చిందే అయివుంటుంది. అలా అనుకున్నాక కాస్త స్థిమిత పడ్డాను.

అప్పగింతల చివరి కార్యక్రమానికి ఒక అర్ధగంట సమయం ఉండటం తో నేనూ, లతా కల్యాణ వేదికపైనుండి లేచాము. మా నాన్న అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. అతడిని నాన్న కూడా చూసే వుంటాడు కదా! మరి గుర్తించిన ఛాయలు ఏవీ మొహం లో లేవేమిటి? మావయ్య తో ఏదో చాలా సంతోషంగా చర్చిస్తున్నాడు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని వరుడు కి కేటాయించిన గదిలోకి వెళ్లాను. ఆ గదినిండా లత కజిన్స్. వాళ్ళ అల్లరి నా విశ్రాంతికి గండి కొట్టింది.

“బావగారు ఎందుకు అంత అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. అగ్ని హోత్రం దగ్గర వేడి వొంటిని ఇబ్బంది పెట్టిందా?’ అన్నారు ఎవరో

“అలసటా? అలసట ఎందుకుంటుంది? అప్పుడే అరవిరిసిన మందారం లాంటి అక్కను చేసుకున్నారు కదా! అక్క పక్కన ఉంటే అలసట ఎందుకుంటుంది?” అన్నారు మరొకరు

ఒక్కసారిగా ఆ మాటలకు గది నవ్వులతో మారుమోగింది. అలసటగా, అసహనంగా ఉండి నాకాక్షణం లో ఒంటరిగా వుండాలని చాలా బలంగా అనిపించింది. కానీ వాళ్ళు నన్నలా టీజ్ చేస్తూనే వున్నారు. ఈలోగా

అప్పగింతలకి పిలుపు రానే వచ్చింది. బయటకు వచ్చేటప్పుడు నాన్నఎదురయ్యారు. ఆయన కళ్ళలో ఎలాంటి ఆందోళన కానీ, తన్యత కానీ లేకుండా ప్రశాంతంగా వున్నాయి.

పెళ్లి అయిపొయింది

నా మూడు గదుల ప్రభుత్వ క్వార్టర్స్ లోకి వచ్చేసాము. వరుడి ఇంట్లో వివాహానంతరం మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించవలసి వున్నది. లతా వాళ్ళ నాన్నగారు చౌత్ మా ఇంట్లోనే చేయాలని చెప్పడం తో మా ఇల్లు అంత అనుకూలంగా లేకపోయినా మా నాన్న ఒప్పుకున్నారు. మా ఇంట్లోనే సప్తమంగళ అయిపోయిన తరువాత నేను, లతా మా సొంత గ్రామాన్ని విడిచి వుద్యోగం చేసే చోటుకు వెళ్లేట్టు  నిర్ణయం అయినది.

అమ్మ వధువు తో పంపించాల్సిన వస్తువులను సర్దిపెట్టడం లో చాలా హడావిడిగా వున్నది.ఇంటి చుట్టుపక్కల వాళ్లకు ఏఏ తీపి పదార్దాలు పంచి పెట్టాలో వాటి గురించి మిగతా వాళ్లకు సూచనలు ఇస్తున్నది. ఆమె మొహం లో ఎలాంటి ఆందోళన లేదు. నాన్న మొహం లాగే అమ్మ మొహం కూడా చాలా ప్రశాంతంగా వుంది. మామూలుగానే అమ్మ ఒళ్లెరుగకుండా పని చేస్తుంది. ఆమె విశ్రాంతిగా పది నిమిషాల పాటుఖాళీగా కూర్చోవడం నాకు తెలిసీ నేనెప్పుడూ చూడలేదు. ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం లోకి కోడలిగా వచ్చింది అమ్మ. దానికి తోడు ఆమె సహజ స్వభావం లో కలసిపోయిన పరోపకార గుణం ఆమెను ఎప్పుడూ బిజీగా ఉంచేది. మా కుటుంబంలో  ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా పరుగెత్తుకుని వచ్చేది అమ్మ దగ్గరకే! ఇప్పుడు కూడా అమ్మ చాలా బిజీగా వుంది అంటే అమ్మకూడా అతడిని చూడలేదన్నమాట. అంటే అతడు నా ఊహలలోనుండి బయటకు ఏమైనా వచ్చాడా? లేకపోతే లతా తరఫున ఎవరైనా ఆ వయసు వాళ్ళు ఉండి వుంటారా?ఒకవేళ వున్నా అంత కచ్చితంగా పోలికలు ఎలా పట్టుబడతాయి?లేక నేనేమైనా పోలికలను వూహించుకుంటున్నానా? నేనెందుకు అతడిని వేరొకరితో పోల్చుకుంటున్నాను? అదీ ఇన్నేళ్ల తరువాత? ఇదంతా చాలా అసంబద్ధంగా లేదూ? ఇన్నాళ్లు నా బాహ్య చేతన గుర్తించడానికి నిరాకరించిన అంశం ఏదైనా అంతఃచేతన లోనుండి బయటకు వచ్చి ఉంటుందా? ఎంత ఆలోచించినా నాకు సంతృప్తి కరమైన జవాబు దొరకలేదు.

ఆ రాత్రి నేనూ, లతా చాలా స్వీట్ నథింగ్స్ మాట్లాడుకున్నాము. సహజంగా పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు యవ్వనం లోకి వచ్చినప్పటినుండి పెళ్లి గురించి చాలా చాలా ఊహలు చేస్తారు. లత కూడా అలాంటి ఊహలు చాలానే చేసిందని నా కర్ధమయింది.

“నువ్వు ఎందుకంత డల్ గా వున్నావు? ఆ పెళ్లి నాటి రాత్రినుండీ నువ్వేదో ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తోంది?అంతా బాగానే ఉన్నదా? ఏమైనా సమస్యా?” అని హఠాత్తుగా అడిగింది లత. ఆమె అలా అడగటం నాకు నచ్చింది. భార్యగా తన ధర్మాన్ని పాటించటం అప్పుడే మొదలు పెట్టింది అన్నమాట. ఆమె అలా అడిగేసరికి నన్ను వేధిస్తున్న ప్రశ్న మళ్ళీ నా దగ్గరికి వచ్చింది.

 “మీ ఇంట్లో కానీ మీ చుట్టాల ఇళ్లలో కానీ పదిహేను, పదహారు సంవత్సరాల యువకులు ఎవరైనా ఉన్నారా?’ అని అడిగాను లతను.  లత నా వైపు చాలా ఆశ్యర్యంగా చూసింది. ఆ రాత్రిపూట అలాంటి ప్రశ్న ఆమె అస్సలు ఊహించి ఉండదు. మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవలసిన రాత్రి పూట భర్త “పదిహేను, పదహారు సంవత్సరాల యువకుల గురించి ఆరా తియ్యడం? అసంబద్ధంగా లేదూ?

“ఊ…! వున్నారు. మా బంధువులలో.

అయినా ఇప్పుడెందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు?”

“అయితే వాళ్ళ పేర్లు, అడ్రస్ లు ఇవ్వగలవా?” ఆమె ప్రశ్న ను పట్టించుకోకుండా ఆతురతగా అడిగాను. లత మాట్లాడలేదు. రెండు క్షణాల ఆలోచన తరువాత “వెళ్ళాక, వాళ్ళ పేర్లు చిరునామాలు కావాలంటే ఇవ్వగలను. కానీ ఆ వివరాలు ఇప్పుడంత అత్యవసరంగా అడుగుతూన్నారు ఎందుకు?” ఆమె కళ్ళలో దిగ్భ్రాంతి తో కూడిన ఆశ్చర్యం. కొత్తగా పెళ్ళైన జంట మొదటి రాత్రి ఒక భర్త ఒక భార్యను ఇంత అసంబద్ధ ప్రశ్న అడుగుతాడా? అన్న ఉత్సుకత లత కళ్ళలో కనిపిస్తున్నది. నేనొక నిమిషం పాటు  మౌనంగా ఉండిపోయాను.

“ఎందుకంటే, మన పెళ్లి రోజు రాత్రి కల్యాణ మండపం దగ్గర, ఇరవై ఏళ్ళ క్రితం చనిపోయిన మా అన్న లాగే, అచ్చం మా అన్న లాగే ఉన్న ఒక యువకుడిని చూసాను.” అన్నాను

ఆ మాట విన్న లత కళ్ళు ఆశ్చర్యం తో పెద్దగా అయినాయి. అదే సమయం లో కనుబొమలు కొద్దిగా ముడివడి “అదెలా సాధ్యం?  అయినా ఒక శుభ కార్యం జరుగుతున్నప్పుడు మనలని ప్రేమించిన వాళ్ళని, మనం ప్రేమించే వాళ్ళను గుర్తు తెచ్చుకుంటాము కదా! అలాగే అయివుంటుంది ” అన్నది

“అన్నయ్య నా కంటే ఆరేళ్ళు పెద్ద. చనిపోయినప్పుడు అతడికి పదిహేను. నాకు తొమ్మిది. ఇదంతా ఇరవయి ఏళ్ళ క్రితం జరిగింది.”

లత నాకు మరి కాస్త దగ్గరగా జరిగి నా చేతిని, తన చేతిలోకి తీసుకుని “అతడు ఉండి  ఉంటే  ముప్పై అయిదు ఉండేవి కదూ!” అడిగింది చాలా మృదువుగా నాలోపల ఒక తుఫానులాగా ఎగసిపడుతున్న ఏడుపును ఆపుకోలేక నేను కన్నీళ్ళుగా మారిపోయాను. లత రెండు చేతులతోనూ నా తలను చాలా మృదువుగా పట్టుకుని తన దగ్గరకు తీసుకుంది. చిన్న  పిల్లాడిలాగా నేను వెక్కిళ్లు పెట్టాను.

 “వద్దు! ప్లీజ్! కంట్రోల్ చేసుకోండి!” అంటూ తన చేతివేళ్ళను నా జుట్టులోకి పోనిచ్చి మెల్లగా స్పర్శించసాగింది.

“మనిషి జీవితకాలం ఎంతో అతడు పుట్టినప్పుడే విధి నిర్ణయిస్తుంది అని తెలుసు కదా!అతడు ఎంతకాలం ఈ భూమ్మీద వుండాలని రాసి వున్నదో అంత కాలం వున్నాడు. అంతా విధి నిర్ణయమే! మానవమాత్రులం మనమేమి చేయగల?” లత అలా సున్నితంగా మాట్లాడుతుంటే హృదయానికి కాస్త సాంత్వన లభిస్తున్నట్టు వున్నది సప్తమంగళ కూడా అయిపొయింది. రేపు మేము వూరికి వెళ్ళిపోవాలి. ఊళ్ళోవాళ్ళకి  విందు ఏర్పాటు చేయడానికి నాన్న ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఆ సాయంత్రం నేను లత ను ఊరి చివర ఉన్న మామిడి తోట కు తీసుకుని వెళ్లాను. ఇరవై ఏళ్ళ క్రితం అన్నయ్య ఎక్కడ పడిపోయాడో ఆ ప్రదేశాన్ని లతకు చూపించాను. ఇరవై ఏళ్ళ క్రితం వున్న మామిడి చెట్టు ఇప్పుడు లేదు. ఆ దుర్ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత మా నాన్న ఆ చెట్టును కొట్టేయించాడు. చెట్టును చూసినప్పుడల్లా రాలిపోయిన అన్నయ్య గుర్తుకువస్తాడని.

కొన్ని రోజుల తరువాత మేమిద్దరమూ కలసి లతా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. లతా చుట్టూ ఆమె స్నేహితులు, కజిన్స్ అందరూ చేరారు. ఏవేవో ఊసుపోని కబురులు చెప్పుకుంటున్నారు. అత్తగారి ఇంట్లో తన అనుభవాలు పంచుకుంటున్నది.

“మొదటి రాత్రి నా అనుభవాలా? ఏం చెప్పమంటారులే! ఏ భర్త అయినా భార్యకి బోలెడన్ని స్వీట్ నథింగ్స్ చెప్తారట. మీ బావ మాత్రం…. “

లత గొంతు తేలికపాటి వ్యంగ్యాన్ని ధ్వనించింది. ఆమె మాట పూర్తి చేయలేదు క్రీగంట నా ఉనికిని పసిగట్టడంతో

2

వినడానికి ఇది వింతగానే ఉంటుంది కానీ నీరజ్, నీరూ కి తన వయసు స్నేహితులు పెద్దగా లేరు. తనకంటే పెద్ద వయసు ఉన్న తన అన్నయ్య స్నేహితులతోనే వాడికి స్నేహం. అన్నయ్య స్నేహితులకు నీరూ ఎప్పుడూ తమనే పట్టుకుని వేలాడటం నచ్చేది కాదు. ముఖ్యంగా అమ్మాయల గురించి మాట్లాడేటప్పుడు. నీరూ ని వెళ్లిపొమ్మని చెప్పలేరు. అలాగని తమతో కలుపుకోనూ లేరు. ఆ ఇబ్బంది తెలియని నీరూ అన్నయ్య స్నేహితులతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడేవాడు. వాళ్ళేదైనా రహస్యాలు మాట్లాడాలి అనుకున్నా, ఏవైనా పెద్ద పెద్ద కబుర్లు చెప్పుకోవాలి అనుకున్నా ఏదో ఒకటి చెప్పి నీరూ ను బయటకు పంపేవారు. నీరూ, వాళ్ళ అన్నాగాయపడకుండా . !

“నీరూ ఇంట్లోకి వెళ్లి కొన్ని పచ్చి మిరపకాయలు, కొంచెం ఉప్పూ తీసుకుని రా.!”

“నీరూ బాబులా ఇంటికి వెళ్లి అటక మీద ఉన్న పతంగి, దారం ఉండా  తీసుకుని రా !”

ఇలా ఏదో ఒక పని చెప్పేవాళ్ళు. అలా స్నేహితులు చెప్పినప్పుడల్లా నీరూ అన్నయ్య చాలా చాలా జాగ్రత్తలు చెప్పేవాడు. తమ్ముడు నీరూ, నీరజ్ అంటే అన్నకి ప్రాణం నీరూకి లెక్కలు అంటే చాలా ఇష్టం. నీరూ వాళ్ళ అన్నకి అవంటే మాత్రం చెప్పలేనంత భయం. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు ఒకటిని మించి మరొకటి నీరూ అన్నయ్యను తికమక పెట్టేవి.ఒంటరిగా వున్నప్పుడు లెక్కల్లో తన బలహీనత గురించి సిగ్గుపడుతూ నే నీరూని సహాయం చేయమని అడిగేవాడు.

“ఒక తొట్టిలో రెండు పైపులు వున్నాయి. ఒకటి నింపేది. మరొకటి నీళ్లను బయటకు పంపేది. రెండిటినీ ఒకేసారి వదిలినప్పుడు ఆ తొట్టి ఎంతసేపటిలో నిండుతుంది?’ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు తలనొప్పి ఎక్కువ అయ్యేది.

“మన లెక్కల సార్ ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎందుకు ఇస్తాడు?” అని విసుక్కునేవాడు. కానీ ఇంగ్లీష్ సాహిత్యం విషయానికి వస్తే నీరూ అన్నయ్యను కొట్టేవాళ్ళు ఎవరూ లేరు. నీరూ కి ఆంగ్లం అంటే అస్సలు పడదు. నీరూ కి చరిత్ర అన్నా అంతే భయం. నీరూ అన్నయ్య కి నటన అంటే పిచ్చి. పాఠశాలలో నాటికలు, నాటకాలు వేయడమే కాకుండా తమ వూళ్ళో పిల్లలు అందరినీ కూడగట్టి విలేజ్ క్లబ్ తరఫున వేసేవాడు.

నీరూ వాళ్ళ నాన్న తన పెద్దకొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనే వాడు. కానీ ఆ పెద్దకొడుకు నాటకాలమీద ఆసక్తి చూపించడం అస్సలు నచ్చేది కాదు.

 “పనికి రాని వెధవ!” అని తిట్టేవాడు.

“చివరకు వీడు రోజు వారీ కూలీగా గుంతలు తవ్వుకుంటూ బతకవలసిందే!” అని కోపంగానూ, అసహనంగానూ దుఃఖాన్ని వెలువరించేవాడు. పెద్దకొడుకు మంచిగా చదువుకుంటే ఎంత డబ్బు అయినా పెట్టడానికి తండ్రి సిద్దమే.

 “అవసరమైతే మనకున్న పొలం లో కొంత పెద్దాడి చదువుకోసం అమ్మేద్దాం!” అని తల్లితో చెపుతుంటే విన్న నీరూ అదే సంగతి చాలా సీరియస్ గా అన్నయ్యకు చెప్పాడు. అంతా విన్న అన్న తేలికగా నవ్వుతూ

“భవిష్యత్తులో నేనేం కావాలి అనుకుని ప్రణాళిక వేసుకున్నానో నాన్నకేమి తెలుసు?నేను పెద్దయ్యాక నాటకాలు రాస్తాను. గొప్ప నాటక రచయితగా పేరు తెచ్చుకుంటాను. నాటకాలేస్తూ ప్రపంచమంతా పర్యటిస్తాను. ఒకరోజు ప్రపంచం నన్నొక అద్భుతమైన రచయిత గా గుర్తిస్తుంది” అన్నాడు అన్నయ్య కలల్లో తేలిపోతూ! కానీ తండ్రి, అన్నయ్యకు నాటకాలపైన వున్న ఆసక్తిని తీవ్రంగా వ్యతిరేకించాడు. అన్నయ్య మీద కోపంగా వున్నప్పుడు మైచా అని పిలిచేవాడు. మైచా అన్న మాట వింటే అన్నయ్య మొహం కోపం తో ఎర్రబడేది. నీరూ కి  ఇదంతా అర్ధం అయ్యేది కాదు.

నీరూకి అన్నయ్యే రోల్ మోడల్. అన్నయ్యే ఈ ప్రపంచం లో అందరికంటే తెలివైన, బలమైన, ధైర్యవంతుడైన వ్యక్తి. అన్నయ్య అద్భుతమైన వ్యక్తిత్వం ముందు నీరు తనను తానూ మరుగుజ్జు లా భావించుకునేవాడు. నీరు తన వయసు పిలల్ల కంటే తక్కువ ఎత్తు ఉండేవాడు. అన్నయ్య లాగా బలంగా,పొడవుగా, అందంగా, వత్తయిన జుట్టుతో, సన్నని మీసకట్టు తో వుండాలని ఆశించేవాడు. తన బలహీనమైన శరీరాన్ని తానె అసహ్యించుకునేవాడు.

అన్నయ్య ఆ వూళ్ళో పిల్లలు అందరికీ ఎదురులేని నాయకుడు. అన్నయ్య ఆగ్రహానికి గురి అవుతామనే భయం తో పిల్లలు ఎవరూ నీరూ జోలికి వచ్చేవారు కారు. అన్నయ్య కి కోపం వస్తే, నీరూ అన్నయ్య స్నేహితులతో పోట్లాడేవాడు. అన్నయ్య, అతడి స్నేహితులు చేసుకునే పార్టీలకు ఒక్క నీరూ కి తప్పిస్తే మరే పిల్లాడి చిన్న తమ్ముడికీ ప్రవేశం ఉండేది కాదు.

వేసవి సెలవులను తీసుకుని వచ్చింది.ద్రౌపదీ స్వయంవరం అనే సంగీత నాటకం గ్రామం లో ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ప్రదర్శించాలి అనుకున్నారు పిల్లలు అంతా! అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ద్రౌపదీ స్వయంవరం కాస్త పెద్ద నాటకం అవడంతో రెండు భాగాలుగా రెండు రోజులు ప్రదర్శించాలి అనుకున్నారు. ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి వున్నాయి నాటకం ప్రదర్శనకు  

అన్నయ్య, అతడి స్నేహితులు నాటకం రిహార్సల్స్ లో చాలా బిజీగా వున్నారు. సోనూ భాయి ద్రౌపది వేషం వేస్తున్నాడు. నీరూ వాళ్ళ అన్నయ్య అర్జునుడు. రోజులో చాలా భాగం వాళ్ళ రిహార్సల్స్ చూడటంతోనే గడచిపోతున్నది నీరూకి. అన్నయ్య అర్జునుడు వేషాన్ని, డైలాగులను పలుకుతున్న తీరు చూస్తేనే నీరూ కి ఆనందం పొంగి పొర్లుతున్నది. అంత అద్భుతంగా చేస్తున్నాడు అన్నయ్య.

ఆరోజు ఉదయం అంతా క్లబ్ హౌస్ లో నాటకం రిహార్సల్స్ చూసి మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళాడు నీరూ. అమ్మ పాఖల, చేపల ఫ్రై తో అన్నంపెడితే తిని మళ్ళీ బయలుదేరుతుండగా

 “ఇంత ఎండలో బయటకు ఎందుకు? వద్దు. రా వచ్చి నా పక్కన పడుకో!’ అన్నది తల్లి కాస్త పక్కకు జరుగుతూ.

అమ్మ పక్కన పడుకున్నాడు కానీ నీరూ కి నిద్ర రావడం లేదు. అమ్మ ఎప్పుడు నిద్ర పోతుందా అని ఎదురు చూస్తూ నిశ్శబ్దంగా పడుకున్నాడు. ముందు వరండాలో నాన్న తడి తువ్వాలు పరచుకుని పడుకుని వున్నాడు. నీరూ మెల్లగా లేచి, శబ్దం కాకుండా తల్లి వైపు చూసాడు. ఆమె నిద్రలోకి జారుకుంది. తన్ను కప్పేసిన తల్లి చీర కొంగును మెల్లగా తొలగించి బయటకు వచ్చాడు. పిల్లి ఒకటి వరండాలోనుండి వంటగదిలోకి దూరబోతుండగా దాన్ని బయటకు తరిమేసి వంటగదిలోకి వెళ్ళాడు.

గిన్నెలో కొంత పాఖాల వుంది. పక్కనే చెక్క ప్లేట్ మూతపెట్టిన కుండ ఒకటి కనిపించింది. చెక్క మూత తీసి చూస్తే అందులో రెండు పెద్ద ఫ్రై చేసిన చేపలు కనిపించాయి. అన్నయ్య మధ్యాహ్నం అన్నం తినలేదు కనుక అన్నయ్య వాటా చేపలు పిల్లులకు అందకుండా, చీమలు పట్టకుండా నీళ్ళల్లో కుండ పెట్టి అందులో చేపలు ఉంచి అమ్మ చెక్క ప్లేట్ మూతపెట్టి ఉంటుంది అనుకున్నాడు నీరూ.

ఎక్కడఉన్నవాటిని అక్కడ అలాగే ఉంచి మెల్లగా బొటన వేళ్ళ మీద నడుస్తూ ఇంటి పెరట్లోకి చేరాడు నీరూ. అక్కడ నుండి సగం పరుగెడుతూ, సగం నడుస్తూ ఉరుకులు, పరుగుల మీద రిహార్సల్ దగ్గరకు చేరుకున్నాడు.

నీరూ వెళ్లేసరికి అన్నయ్య అర్జునుడు వేషం లో వింటి నారి సారించి బాణం వదలడానికి సిద్ధంగా వున్నాడు. నాటకానికి దర్శకత్వం వహిస్తున్న డ్రిల్ మాష్టారు నాటకం పుస్తకం చేతిలో పట్టుకుని వున్నాడు. డ్రిల్ మాస్టారు డైలాగులు ప్రాంప్టు చేస్తుంటే అన్నయ్య చెపుతున్నాడు, కొద్దీ దూరం లో ద్రౌపది వేషం లో సోనూ భాయి ఒక తాడును పూలదండ లాగా పట్టుకుని నిల్చుని వున్నాడు. అన్నయ్య లాగే అతడుకూడా చిన్న ప్యాంటు వేసుకుని వున్నాడు. మిగతా పాత్రధారులు

అందరూ వాళ్ళ చుట్టూ నిలబడి ఉనాన్రు. అన్నయ్య తన దీర్ఘ స్వగత భాషణ (మోనోలాగ్)చేస్తూ తన తల పైకి విల్లును ఎత్తిపట్టుకున్నాడు.

“అలా కాదు. అలా కాదు. మళ్ళీ చేయి” డ్రిల్ మాస్టారు అన్నయ్య దగ్గరకు వచ్చి అన్నయ్య   రెండు చేతులు పట్టుకుని వాటిని సరిఅయిన స్థానం లో ఉంచాడు. అన్నయ్య ను సరిగా చూడటానికి మరింత ముందుకు వచ్చాడు నీరూ. అన్నయ్య పైకి బాణాన్ని వదిలాడు. సోనూ భాయి ద్రౌపది వేషం లో అన్నయ్య దగ్గరకు వచ్చి పూలదండలా పట్టుకున్న తాడు ను మేడలో వేసాడు. పక్కనున్న పిల్లలు అందరూ చప్పట్లు కొట్టారు. నాటకం లో అన్నయ్య వేషం అంతటితో సరి. నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ జనాన్ని తప్పించుకుని

నీరూ వున్న వైపు వచ్చాడు అన్నయ్య.

“అన్నయ్యా ఇక్కడ, ఇక్కడ ” నీరూ పిలిచాడు.

“నాన్న నిన్ను అర్జన్ట్ గా ఇంటికి రమ్మంటున్నాడు. నువ్వు మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు కదా!” మళ్ళీ తానే అన్నాడు నీరూ

కానీ అన్నయ్య అన్యమనస్కంగా “ఒక్కక్షణం ఆగు.” అని తోటి నటుల నటన చూస్తూ ఉండిపోయాడు.

“అన్నయ్యా! నాన్న ఇంట్లో బెత్తం పట్టుకుని రెడీగా వున్నాడు. ఇంటికి వెళదాం పదా” మళ్ళీ పిలిచాడు నీరూ!  

“సరే!పదా!” అని అన్నయ్య ఇంటివైపు దారితీసాడు. నీరూ అనుసరించాడు.

చూడు

నా బాణం ఈ చేపను చీల్చివేస్తుంది

వంద ముక్కలుగా చేస్తుంది

నీ అబద్ధాలు ఎంతకాలం గెలవగలవు

నుదిటిపై నీటి గుర్తు ఎంతకాలం ఉంటుంది

చీకటి సూర్యుడిని జయించగలదు

నేను ఈ బంగారు చేపను నరికివేస్తాను

క్షణకాలంలో అది గాయపడి వేగంగా

 కిందకు వస్తుంది నేలపై పాకుతుంది

చూడు. ఓ చూడు

అన్నయ్య ఈ పాట పాడుతూ నడుస్తున్నాడు. అతడి మనసంతా నాటకమే నిండి వుంది. “నీరూ చూడు! ఎదో ఒక రోజు నేను ఇంతకంటే గొప్ప నాటకాన్ని రాస్తాను. ప్రేక్షకులను కళ్ళు తిప్పుకోనివ్వని నాటాకాలు” తనలో తానే నీరూకి చెపుతున్నట్టు మాట్లాడుకుంటున్నాడు

“అన్నయ్యా! అటుచూడు!” 

నీరూ మాటలకు “ఏమిటది?’ అని తలతిప్పి చూసాడు.

ఎదురుగా మామిడి చెట్టుకు కిందికే వేలాడుతూ మామిడి పళ్ళు. పండి రాలడానికి సిద్ధంగా వున్నాయి. “మనమో రె

మనమో రెండు తీసుకుందామా?”

నీరూ ఆశగా అడిగాడు పళ్ళను అన్నయ్యకు చూపిస్తూ.

“సరే! నువ్వు అటూ ఇటూ చూస్తూ వుండు ఎవరైనా వస్తున్నారేమో! నేనొక క్షణం లో పళ్ళుకోసుకుని  వస్తాను” అని అన్నయ్య అలవోకగా మామిడి చెట్టు ఎక్కాడు.  చెట్లు ఎక్కడం లో అన్నయ్యను మించిన వాళ్ళు ఎవరూ లేరని నీరూకి తెలుసు. కానీ చెట్టు చాలా ఎత్తుగా, దట్టంగా వున్నది. ఎంత ఎత్తుగా వున్నది అంటే నీరూ తన తలని వెనక్కి వెనక్కి వంచగలిగినంత వంచినా చివర కనపడనంత ఎత్తుగా అన్నయ్య ఎంత ఎత్తుకు వెళ్ళాడో నీరూకి అర్ధం కాలేదు.ఎన్ని పళ్ళను కోశాడో కూడా అర్ధం కాలేదు. కానీ బాగా పండిన మామిడి పళ్ళ వాసన మాత్రం నీరూ ముక్కుపుటాలను అదరగొట్టింది.

నీరూకి అన్నయ్య ఆ పొడవాటి తాటి చెట్టు ఎక్కిన రోజు బాగా గుర్తుంది.  చెరువు పక్కనే వున్న పొడవాటి తాటిచెట్టు అది. పండిన తాటిపండ్ల భారంతో కాస్త కిందకు వంగినట్టు కనిపిస్తున్నది. పండిన ఆ పళ్ళు రాలి అంత ఎత్తునుండి కిందపడితే పాడైపోతాయి. అందుకని చెట్టెక్కి తాటిపండ్లు కోసుకోవాలని అనుకున్నారు పిల్లలు అందరూ.

అన్నయ్య గబగబా తాటి చెట్టు ఎక్కాడు. తాటి పండ్లు కోసుకుని నడుముకు చుట్టుకున్న గావంచాలో వేసుకున్నాడు. అన్నయ్య స్నేహితులు, మరికొందరు గ్రామంలోని పిల్లలు, నీరూ అన్నయ్యని చూస్తూ వున్నారు. హఠాత్తుగా ఒక పిల్లాడు బూడిద, గోధుమ రంగు కలగలసిన పాము ఒకటి చెట్టు పైకి పాకడం చూసి కెవ్వుమని అరిచాడు.

అన్నయ్యకి పాము అంటే ఎందుకోకానీ లోలోపల భయం పాతుకుని పోయి ఉండటం తో ఆ కేక కి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. పైకి పాకుతున్న పాము వంక ఒక్కసారి చూసి గబుక్కున చెరువులోకి దూకేశాడు.తాటిపళ్లన్నీ చెరువులో మునిగిపోయాయి. నెమ్మదిగా చెరువులో ఈదుకుంటూ బయటకు వచ్చాడు అన్నయ్య ” ఆ పాము అంత విషం గల పాము కాదులే” అంటూ సాధ్యమైనంత నింపాదిగా ఉండటానికి ప్రయత్నం చేసాడు. అదంతా ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది నీరూకి.

నీరూ ఈసారి కళ్ళు చికిలించుకుని మరీ మామిడి చెట్టువంక చూసాడు. ఇప్పుడు అన్నయ్య కనపడుతున్నాడు స్పష్టంగా! నడుముకు కట్టుకున్న గావంచా మామిడి కాయలతో ఉబ్బి వుంది. చాలానే పళ్ళు కోసి ఉండొచ్చు. అలా అన్నయ్యను చూస్తున్నప్పుడు నీరూలో ఒక తుంటరి ఆలోచన మెదిలింది. అంతే!

“అన్నయ్యా! నీ పక్కన పసుపురంగు లో పాము చూడు” అన్నాడు.  మళ్ళీ తనే “ఓ! అది తాచు పాము అనుకుంటా, నీకు దగ్గరగా వస్తున్నది  జాగ్రత్తగా చూడు” అంటూ  ఆందోళన పడుతూనే ఒక కొంటె

నవ్వు నవ్వాడు.

“ఎక్కడ?” భయం తో అన్నయ్యగొంతు వణికింది. మరుక్షణం లో పెద్ద మందు పాతర ఏదో పేలినట్టు శబ్దం. నీరూ భయం తో కళ్ళు మూసుకున్నాడు. ఒక యుగం లాంటి క్షణం గడచిన తరువాత నీరూ మెల్లగా కళ్ళు తెరిచాడు.

నేల మీద అన్నయ్య పడి వున్నాడు. మొహం పైకి చూస్తూ కుడికాలు మెలి తిరిగి వుంది. నీరూ అతడి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.

“అన్నయ్యా!అన్నయ్యా!” నీరూ భయం బయటికే శరీరాన్ని వణికిస్తుండగా అన్నయ్య శరీరాన్ని పట్టుకుని పిలిచాడు.

అన్నయ్య నుండి ఏ ప్రతిస్పందనా లేదు. కళ్ళు తెరచి అపరిచితుడిని చూస్తున్నట్టు నీరూను చూసాడు. నీరూ ఏమి చేయాలో తెలియక ఒక హిప్నాసిస్ స్థితిలోకి వెళ్ళిపోయాడు. చెట్టుమీద నుండి కిందపడినప్పుడు అన్నయ్య తల బలంగా గుద్దుకున్న రాయి నుండి ఒక సన్నని కాలువ కట్టి నట్టు నలుపు, గోధుమ రంగులో వున్న ద్రవం ప్రవహించసాగింది. ఆ ద్రవం అంతటా వ్యాపించి చిన్న మడుగులాగా మారింది.

చుట్టుపక్కల వున్న జనం ఒకరినొకరు పిలుచుకుంటూ మామిడి చెట్టు దగ్గరకు పరుగుపరుగున రాసాగారు. ఎవరో అన్నయ్యను రెండు చేతులమీదకు ఎత్తుకున్నారు. గోధుమ రంగు నిక్కరు ఎర్రగామారి భయం కలిగించేట్టు వున్నది. చేతుల్లో వున్న అన్నయ్య తల కిందకు

వాల్చేశాడు. తలమీది ఉంగరాల జుట్టు కొంచెం నుదుటిమీదకు వాలి చెమటకు అతుక్కునిపోయింది.

“ఆమ్మో! ఎంత నెత్తురో!” ఎవరో గట్టిగా అరిచారు.

క్షణాల్లో నాటకాన్ని చూడటానికి జనం పోగయినట్టు జనం పోగయినారు. మామిడి తోటకు రెండవ వైపునుండి నీరూ వాళ్ళ నాన్న పరుగెత్తుకుంటూ రావడాన్ని నీరూ చూసాడు. నాన్న కళ్ళలో భయం అతడికి స్పష్టంగా కనిపించింది. ఎవరికీ వారు తమకు తోచింది మాట్లాడుతున్నారు

“సరిగ్గా పైనుండి ఈ రాయి మీద పడ్డాడు పిల్లాడు. వెనుక తల పగిలిపోయింది.”

“ఎలా జరిగింది?”

“చెట్టు పైన మామిడి పళ్ళు కోస్తూ జారి కింద పడ్డాడు”

“అయ్యో! పాపం. ఎంత మంచిపిల్లాడు వీడు”

“అన్నతమ్ములు ఇద్దరూ రామలక్ష్మణుల లాగా వుండేవాళ్ళు. అయ్యో ఈ పిల్లాడు ఇప్పుడు అన్న లేని తమ్ముడు అయ్యాడు కదా!”

జనం మాట్లాడుకుంటున్న మాటలు నీరూ తలలో పెద్దగా శబ్దం చేయసాగాయి. ఆ మాటల ధ్వని పెరిగి, పెరిగి తారాస్థాయికి చేరుకుంది. భరించలేనట్టు నీరూ తలను రెండు చేతులతో బలంగా పట్టుకున్నాడు. హఠాత్తుగా ఒక భయంకరమైన నిశ్శబ్దం

అక్కడ ఆవరించింది. క్షణంలో ఆ ప్రదేశమంతా ఖాళీగా మారిపోయింది

3

మానాన్న కోరుకున్నట్టుగానే నేను ఇంజనీరును అయ్యాను. నాన్న సంతోషించాడు. “మీరందరూ సంతోషంగా వున్నారు కనుక నాక్కూడా సంతోషమే!” అన్నది అమ్మ.

నా పెళ్ళైన మూడేళ్లకు నా చిన్న చెల్లెలి ని కూడా ఒక మంచి ఇంట్లోకి కోడలిగా పంపించాము. మా అమ్మా నాన్నా నాతోనే వుంటున్నారు. ఎప్పుడైనా వూళ్ళో తమ అవసరం కలిగితే మాత్రం అక్కడకు వెళ్లి వస్తూ వుంటారు. నాకు భువనేశ్వర్ బదిలీ కావడం తో వాళ్ళు కూడా భువనేశ్వర్ లోనే శాశ్వతంగా ఉండిపోయారు. ఆ ఊళ్ళో ఒంటరిగా వుండి వాళ్ల్లు మాత్రమే అక్కడ చేసేది ఏమున్నది?కనుక. ఈ లోగా నా చెల్లెలు కునీ భర్త కి కూడా భువనేశ్వర్ బదిలీ అయింది. 

మేమందరం భువనేశ్వర్ లోనే సంతోషంగా ఉంటున్నాము. ప్రతి ఆదివారమూ చెల్లెలు మా ఇంటికి వస్తుంది. ఏ చిన్న సందర్భం ఎదురైనా మేము వాళ్ళ ఇంటికి వెళతాము. మా అమ్మానాన్న కి నా ఇద్దరు పిల్లలు అంటే మహాప్రాణం. వాళ్ళను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా వుండరు.  అంతా ఆనందంగా ఉంటే చూడటం విధికి ఇష్టం ఉండదేమో నాన్న ఒక రోజు గుండెపోటు తో కన్ను మూసారు. నాన్న వెళ్లిపోయేసరికి మా చిన్నబ్బాయికి ఐదేళ్లు.

నాన్న వెళ్ళిపోయాక అమ్మ మనవలకు మరీ,మరీ అతుక్కుపోయింది. వాళ్ళను మనవళ్ల లా కాకుండా సొంత కొడుకులే అన్నట్టు ప్రేమించేది. వాళ్లెప్పుడూ ఆమె కనుచూపు మేర లోనే వుండాలని భావించేది.

ఈ రోజులలో చాలామంది చిన్నపిల్లలు నాయనమ్మ, తాతయ్యల సాంగత్యానికి రకరకాల కారణాలవలన దూరం అవుతున్నారు. మా అదృష్టం మా పిల్లలకు మాత్రం ఆ లోటు లేదు అనుకునేవాళ్లం నేనూ, లతా!

ఆదివారం మధ్యాహ్నం చెల్లెలు కునీ, ఆమె భర్తా మా ఇంటికి వచ్చారు. రుచికరమైన విందు భోజనం తరువాత మేమందరమూ రిలాక్సింగ్ గా మధ్య హాల్లో కూర్చుని వున్నాము. అవీఇవీ కబుర్లు చెప్పుకుంటూ. అప్పుడు అమ్మ హాల్లోకి వచ్చింది. మామూలుగా అయితే మధ్యాహ్నం భోజనం అయినా తరువాత ఆమె తన గదిలో చిన్న కునుకు తీస్తుంది. అలాంటిది ఆ సమయం లో ఆమె హాల్లోకి రావడం మాకు కాస్త ఆసక్తిని కలిగించింది. ఆమె ఎవరినో తన చేత్తో లాక్కుని వస్తున్నది. ఆమె తెల్లని చీర కొంగు నేల మీద పారాడుతున్నది. నేను కొద్దిగా తల వంచి ఆమె ఎవరిని లాక్కుని వస్తున్నదా? అని చూశాను.

మా పెద్దబ్బాయి. తలుపు కర్టెన్ వెనుక దాక్కుని బయటకు రావడానికి సిగ్గుపడుతూ వున్నాడు. అమ్మ కళ్ళలో మాత్రం ఆనందం పొంగి పొరలుతున్నది.”చూశావా?కునీ !మన దేబూకి ఈత పోటీలో బంగారు పతకం వచ్చింది. దేబూ!నాన్నా బయటకు వచ్చి అత్తకీ, మామకీ నీ గోల్డ్ మెడల్ చూపించు.” అన్నది.

అమ్మ వెంటనే మళ్లీ నావైపు, లత వైపు తిరిగి “ఇదుగో! కోడలు పిల్లా మధ్యాహ్నం పూట పిల్లాడిని బయటకు పోనివ్వకు. ఈత అని వాడు బయటకు వెళతాడేమో! అది అంత మంచిది కాదు. అందరి కళ్ళూ మంచివి కావు. ఏ పాడు చూపైనా సోకిందనుకో, ఏదైనా జరగొచ్చు.” అని మళ్ళీ దేబూ వంక తిరిగి “నాన్నా! నువ్వెప్పుడూ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లొద్దు” అని జాగ్రత్తలు చెప్పింది. దేబూ ఇంకా డోర్ కర్టెన్ వెనుకే వున్నాడు.

మేము మాట్లాడటం ఆపేసి అమ్మ వైపు చూసాము. అమ్మ ప్రశాంతంగా, చాలా కూల్ గా వున్నది. ఒక్క క్షణం పాటు అంతా నిశ్శబ్దం ఆవరించింది మా మధ్యన స్విమ్మింగ్ పోటీలో గోల్డ్ మెడల్ పొందిన మా పెద్దబ్బాయి పేరు సురేంద్ర. మేము వాడిని ముద్దుగా పుపున్ అని పిలుస్తాము. చనిపోయిన మా అన్నయ్య పేరు దేబేంద్ర. అమ్మా నాన్నా వాడిని దేబూ అని పిలిచేవారు. మా పపున్  ని అమ్మ ఇప్పుడు దేబూ అంటున్నది

                                                       ******

చౌతీ: పెళ్లి అయిన తరువాత నాలుగో రోజు చేసే వేడుక

సప్తమంగళ: పెళ్లి అయిన తరువాత ఏడవ

రోజు చేసే వేడుక

మైచా:స్త్రీ లక్షణాలు కలిగిన పురుషుడు   

వంశీకృష్ణ

పరమిత శతపథి
వంశీకృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *